కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Vanamali' New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
" రంగయ్యా, నీ కిదేమైనా బాగుందా? న్యాయంగా ఉందా?నలభై ఏళ్ళ నుంచి నీకు తోడుగా ఉన్న నన్ను అడ్డంగా నరుకుతుంటే చూస్తూ ఊరుకుంటావా?అసలు నన్ను చంపాలన్న ఆలోచన నీకెలా వచ్చిందయ్యా?".
" లేదమ్మా, తల్లీ నన్ను అపార్థం చేసుకోక. వీల్లేని పరిస్థితుల్లోనే నిన్ను మట్టిపాలు చేయాల్సొచ్చింది."
" మరి ఆ పని చేయిస్తున్నప్పుడు మన మధ్యన ఉన్న అనుబంధం మీకు గుర్తుకు రాలేదా?"
" అమ్మా, నన్ను క్షమించు. నేను ముందు నరకయాతన పడ్డాను. నిజంగా నాకది ఇష్టం లేదు. కానీ చేయక తప్పలేదు."అన్నాడు రంగయ్య నీళ్ళు నిండిన కళ్ళతో.
అతనిగుండె బేజారయ్యింది. చివరకు కూడదీసుకుని " జరగరాని గోరం జరగిపోయింది తల్లీ . ఐతే నన్నిప్పుడేం చేయమంటావ్?" అన్నాడు.
కల కరగింది. కళ్ళు తిరుగుతున్నాయి. రంగయ్య దిగ్గున లేచాడు. ఇంకా తెల్లారలేదు. మసక చీకటి గా ఉంది. ఎక్కడో కుక్కలు మొరుగుతున్నాయి. నాలుక దాహంతో పిడచ కట్టుకుపోయింది. లేచి కూజాలోని నీళ్ళు తాగి కూర్చున్నాడు. ఇంక ఎంతకీ నిద్ర పట్టలేదు.
క్రితం రోజు సాయంత్రం రంగయ్య పొలం నుంచి వచ్చాక భార్య నూకాలమ్మ వేడి నీళ్ళు కాస్తే స్నానం చేశాడు. రెండు ముద్దలు తిన్నాక అలసిపోయిన శరీరం ఆదమరిచి నిదురపోయింది. మనసు మేలుకొని వుందేమో? కలొచ్చింది. కల్లో చెట్టు అతన్ని నిలదీసింది. ఊళ్ళో తీరిగ్గా ఉన్నప్పుడు రైతులందరూ ఒక మఱ్ఱి చెట్టు కింద అరుగుమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. అది చాలా ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది.
ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు సిటీ నుంచి రింగురోడ్డు వేయడం కోసం దానిని తొలగించారు. రంగయ్య, ఇతర రైతులు వాళ్ళకడ్డు చెప్పే పరిస్థితి లేకపోయింది. ఆ పని అయ్యింది కానీ మనసుకు తృప్తిగా లేదు. ఏదో అసౌకర్యంగా ఉందతనికి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా తమకు నీడనిస్తూ , పక్షులకు ఆవాసమై, వాళ్ళకు అలసి పోయినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ఆశ్రయమిస్తూ ఓ పెద్దదిక్కులా ఉన్న తల్లిలాంటి మఱ్ఱిమాను తన కళ్ళ ముందే కూలి పోయినందుకు. అతనికి తన తల్లి నాగమ్మ గుర్తుకు వచ్చింది. కళ్ళు చమర్చాయి.
రంగయ్య వాళ్ళది అన్నారం అనే కుగ్రామం. తండ్రి వెంకటయ్య తనకు ఊహ తెలిసినప్పటికే, పొలంలో పని చేస్తూ ఉండగా ఓ రోజు పిడుగుపడి, చనిపోయాడు. తనకు ఊహ తెలిసి, ఇంగితజ్ఞానం వచ్చింతరువాత , తల్లి , ఊళ్ళో వాళ్ళ ద్వారా తెలిసినదాన్ని బట్టి ఆయన చాలా మంచివాడు. తోటి రైతులతో సఖ్యతగా ఉండేవాడు. కేవలం డబ్బుకోసం వెంపర్లాడకుండా , మానవతా దృష్టి, ఆర్ద్రమైన మనస్సు కలిగి ఉండేవాడు. తం డ్రి అకాలమరణం తరువాత, తల్లే సర్వస్వమై ఒంటరిగానే కష్టాలు భరిస్తూ తమకున్న పొలంలో వ్యవసాయం చేస్తూ అతన్ని పెంచి పెద్దచేసింది.
ఈ క్రమంలో ఆమె ఎన్ని అవమానాల పాలయ్యిందో లెక్కలేదు. పొరుగూర్లో ఉన్న బళ్ళో రంగయ్యను పదవతరగతి వరకు చదివించింది.ఇంకా పై చదువులు అప్పు చేసైనా సరే చెప్పించడానికి కూడా సిద్దపడింది. అతనే నేనింక చదవలేనని, వ్యవసాయం చూసుకోవడం మొదలెట్టాడు. కూలీలతో పని చేయించడమే కాకుండా తను కూడా వాళ్ళలో ఒకడై , దుక్కి దున్నడం, విత్తనాలు చల్లడం, నీరు పెట్టడం, కోతలు, ధాన్యం నూర్చడం లాంటి
అన్ని పనులలో పాలు పంచుకునేవాడు. నేలంటే అతనికి అంతులేని ప్రేమ. చెట్లు,
మొక్కలంటే పంచప్రాణాలు. ఎక్కడైనా చెట్లు కొట్టేస్తున్నప్పుడు తన గుండె కరిగి నీర
య్యేది. వీలైనంతవరకు అలాంటి పనులను ఆపు చేయించడానికి ప్రయత్నించేవాడు. నాగమ్మకి కూడా చెట్లన్నా, పచ్చదనమన్నా ప్రాణం. అనవసరంగా చెట్లు నరుకుతే ఆమె ప్రాణం వివిల్లాడిపోయేది. జీవితాంతం నేలతల్లికి విధేయురాలుగా ఉండి , ఐదేళ్ళ క్రితమే పై లోకాలకు తరలిపోయింది.
మఱ్ఱి మాను నేలకూలడం రంగయ్య లో చాలా అలజడి సృష్టించింది. భార్యతో కూడా సరిగ్గా మాట్లాడ్డం లేదు. తరుచుగా మాను దీనంగా చూస్తూ, కలలో కనిపిస్తోంది. ఓ రోజు పొలంలో పని చేసుకుంటూ ఉంటే కల్లో తన ప్రశ్నకి చెట్టు చెప్పిన సమాధానం చటుక్కున గుర్తుకొచ్చింది. ఆ తల్లి చెప్పినట్లు ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాడు.
రంగయ్య వ్యవసాయ పద్దతుల్లో రసాయన ఎరువులు వాడుతుండటం వల్ల కొంత మేరకు అప్పుల్లో కూరుకుపోయాడు. తాండవిస్తున్న పరిస్థితులు , పెరుగుతున్న వడ్డీ రేట్ల వల్ల , పొలంలో కొంతభాగం అమ్ముకోవలసి వచ్చింది.
ఓ రోజు టీవీలో " చెట్లు" రైతులకెలా ఆర్థిక పరిపుష్టి కలిగిస్తాయో చెప్పారు. రంగయ్య కి తన మనసుతో తనే చాలా మాట్లాడుకున్న తరువాత కొంత వెలుగు కానరావడం మొదలయ్యింది. అతని ఆలోచనలు కూడా ఒకింత స్పష్టమైన రూపు సంతరించుకున్నాయి. ముందుగా తన పొలంలో కొంతభాగంలో ఓ వంద టేకు చెట్లు నాటాడు.ఏడాది లోపే మామిడి, జీడిమామిడి, చింత, వేప, ఎర్రచందనం, ఉసిరి లాంటి ఇతర మొక్కలను తన మిగిలిన పొలమంతా నాటాడు. ఐదు ఏళ్ళ లోపు అతని పొలం దట్టమైన అరణ్యంలా తయారయ్యింది. ప్రస్తుతం తన పదహారెకరాల పొలంలో రెండొందల రకాల చెట్లున్నాయి. తను కొత్తగా అవలంభిస్తున్న పద్దతుల వలన రంగయ్య ఆలోచనా విధానంలో ఎంతో మార్పు వచ్చింది.
ఓ రోజు నూకాలమ్మ " ఏందయ్యో! ఈ మద్దెన చాలా కులాశాగా ఉంటున్నావు. ఇదివరకు ఊరికే కసురుకునేటోడివి" అంది.
" అవునే, నూకాలూ ఈ తోట, మొక్కలు పెంచడం మొదలు పెట్టినప్పటినుంచి నెమ్మదిగా ఉంటోంది. ఆవులు, బర్రెలు కూడా సొంత బిడ్డల్లాగా తోస్తున్నాయి. మన బిడ్డను కూడా , వాడి కిష్టమైతే , జగన్నాధం గారు చదివిన వ్యవసాయ సంబంధ సదువు సదివిద్దాం. వాడు కూడా చల్లగా, పచ్చగా మన కళ్ళ ముందే ఉంటాడు. ఈ రోజుల్లో చాలా మంది అవేవో కంప్యూ టర్ ఉద్దోగాలంట. వాటెనకాల పడుతున్నారు. ఉంటే పట్నాలలో.. లేదంటే అమిరికాకో, లండన్ కో మరేదో దేశానికి వలసపోయి మన పల్లెల్ని మరిచిపోతున్నారు. అందరూ ఇలాగెల్లిపోతే ఇక యవసాయం ఏమవ్వాల? ఈ పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతావుంది" అన్నాడు.
ఆమెకు కూడా అతని మాటల్లో ఎంతో బాధ, ఇంగితం కనిపించింది. ఆమె " అవునయ్యా, మన ఊళ్ళలో పండుగలు, పబ్బాలు ఎంతో సంప్రదాయంగా చేసుకుంటాం. ఇవన్నీ పట్టణాలలో ఎలా కుదురుతుందయ్యా? నాక్కూడా మనూళ్ళోనే మట్టి కావాలనుందయ్యా" అంది.
తన మనసు ఇప్పుడు తేలిగ్గా ఉంటోంది.ఆరోగ్యం మెరుగుపడింది. పిల్లలు నారాయణ, వీణా తోటపనుల్లో సాయపడుతున్నారు. రంగయ్యకిఫుడు మొక్కలు, జీవాలు ప్రాణమిత్రులుగా మారిపోయాయి. అవి నోరు తెరచి మాట్లాడలేక పోయినా, వాటి దేహభాషను అతను అనుభూతి చెందుతున్నాడు. కొన్ని ఏళ్ళనుంచి తన ప్రాణంలో ప్రాణమైన కర్రావు ఓరోజు ఏడుస్తు
న్నట్లు అతని కనిపించింది. అది నేలమీద పడుకుని అటూఇటూ పొర్లుతా ఉంది.
దాని కళ్ళలోకి చూశాడు.
" అయ్యా, నా పొట్టలో చాలా నొప్పిగా ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్ళవా?" అని అది చెప్పినట్లు అతనర్థం చేసుకున్నాడు. రంగయ్య వెంటనే పశువులాసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయించాడు. మరోసారి మల్లెతీగలు నీరసపడి వేళ్ళాడుతూ బక్కచిక్కి " మా సంగతేం చేశావు?" అని అడిగినట్లు అతని కనిపించింది. వెంటనే చెయ్యవలసింది చేశాడు. మొక్కలు కొద్దిగా నీరసంగా కనిపిస్తే అతను అల్లాడిపోతాడు. గొడ్డూ, గోదల బాధలన్నీ అతని బాధలే! సృష్టిలోని పలురకాలైన జీవరాసుల మధ్యనున్న పరస్పర అనుబంధాలు అతనికి మరింతగా బోధపడుతున్నాయి.
అతను ఇప్పుడు ఒక సజీవ అనంత ఉత్సాహంతో తొణికిసలాడుతున్నాడు. వ్యవసాయాధికారి, ఓ రోజు రంగయ్యా, మట్టికి కూడా ప్రాణముంటుందయ్యా, అందుకని నేలను విషపూరితము చేయకూడదు. రసాయనాలు ఎక్కువగా విషపూరితమైనవి. ఎరువులు, పురుగుల మందులతో నేలతల్లిని కలుషితం చేయకూడదు.సేంద్రీయవ్యవసాయ పద్దతులను ఉపయోగించు " అని చెప్పాడు. అతను ఓపిగ్గా కొన్ని రోజులపాటు రంగయ్యకి సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవడం గురించి, సహజంగా తయారు చేసుకునే పురుగుల మందుల గురించి శిక్షణ నిచ్చాడు.
ఓ రోజు రంగయ్య " సార్, మా అబ్బాయి నారాయణ కూడా, యవసాయము, చెట్లంటే ఇష్టంగా ఉంటాడు. వాణ్ణి కూడా మీరు చదివిన సదువు సదివిద్దామనుకుంటున్నాను. దానికి ఏం చెయ్యాలో చెప్పండి" అన్నాడు.
ఆ అధికారి ఈ విషయంలో తగినంత సహకారం , సమాచారం అందించాడు. అలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఓ రోజు రంగయ్య ఇంటిలో ఫోన్ మోగింది.
అతను " హల్లో! వనమాలిని మాట్లాడుతున్నాను" అన్నాడు.
అవతలి వైపునుంచి " నమస్కారం, నా పేరు చక్రపాణి, మాది పక్కనే ఉన్న భవానీపురము. వచ్చే ఆదివారం మా ఊళ్ళో వయోజనుల కోసం కార్యక్రమం చేయబోతున్నాము. దానికి మీరు ముఖ్య అతిథిగా ఉండాలి"అన్నాడు.
అందుకు రంగయ్య " తప్పకుండా వస్తాను, కానీ మీరు ఆ కార్యక్రమంలో మొక్కలు నాటడం కూడా ముఖ్యభాగంగా చెయ్యండి" అన్నాడు.
చక్రపాణి " తప్పకుండా రంగయ్య గారు. మీరు మొక్కలు నాటకుండా చేసే, ఏ సభకు రారని మాకు ముందే తెలుసు" అన్నాడు.
రంగయ్య సాటి రైతులకు చెట్లపెంపకంలో , వ్యవసాయపద్దతుల్లో సూచనలు శిక్షణ అందిస్తున్నాడు. తన కొడుకు నారాయణ వ్యవసాయ శాస్త్రంలో పరిశోధన చేసి పని చేస్తున్నాడు. వీణా వాళ్ళాయన కూడా పూల, ఔషద మొక్కలతో , పక్క ఊరిలో నర్సరీ నడుపుతున్నారు.
ఓ రోజు పొద్దున్నే రంగయ్య తన భార్యతో "రాత్రి నాకు బలే కలొచ్చింది నూకాలూ! మా యమ్మ చెట్టులాగా మారిపోయిందట. ఆమె చాలా సంతోషంగా, 'ఒరే, రంగయ్యా- నీకు వీలైనన్ని చెట్లు చుట్టుపక్కల నాటించి పెంచి పోషించు. మన చుట్టూతా ఎంత ఎక్కువ పచ్చదనముంటే మన బతుకులు అంత పచ్చగా ఉంటాయి నాయనా' అని చెప్పింది." అన్నాడు
అంతా విన్న నూకాలమ్మ బదులుగా చిరునవ్వు విసిరింది. తమ అంగీకార సూచకంగా వాళ్ళ పెరటి లోని చెట్లు, మొక్కలూ కూడా తమ కొమ్మలను కదిలించాయి. ఆవులు, దూడలు కూడా తమ మోరలు పైకెత్తి తమ ఆమోదాన్ని ఎరుకపరిచాయి.
" వృక్షో రక్షిత రక్షితః " అను నానుడి ఉన్నది కదా
" శుభం భూయాత్"
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
Wonderful message