'Vanaprastham' - New Telugu Story Written By Padmavathi Divakarla
Published In manatelugukathalu.com On 03/05/2024
'వానప్రస్థం' తెలుగు కథ
రచన: పద్మావతి దివాకర్ల
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
నిస్త్రాణంగా సోఫాలో కూలబడ్డాడు చక్రవర్తి. 'తన జీవితంలో ప్రవేశించి, నలభై ఏళ్ళగా తన ప్రాణంలో ప్రాణంగా మెలిగిన శారద తనను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయి ఇవాళ్టికి సరిగ్గా పదకొండు రోజులు!' మనసులో అనుకొని భారంగా నిట్టూర్పు విడిచాడు. రెండేళ్ళ క్రితం వరకూ ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలుగా ఉన్న చక్రవర్తి, ఉద్యోగ విరమణ తర్వాత తన భార్య శారద అరోగ్యం గురించి పట్టించుకొనేసరికి అప్పటికే ఆలస్యం అయిపోయింది. క్యాన్సర్ వ్యాధి చివరి దశలో ఉన్నట్లు, మరో ఆర్నెల్ల కన్నా బతకడం కష్టమని డాక్టర్లు చెప్పిన రోజు నుండి ఆమె స్వర్గస్తురాలైంతవరకూ ఒక్క క్షణం విశ్రమించలేదు చక్రవర్తి. తనకు తెలిసిన డాక్టర్లందరికీ చూపించాడు. పెద్దపెద్ద హాస్పిటల్ గుమ్మాలు తొక్కాడు. కానీ అందరిదీ ఒకటే మాట! ఎంత ప్రయత్నించినా చక్రవర్తి ఆమెని దక్కించుకోలేకపోయాడు. డాక్టర్లు చెప్పినట్లుగానే ఆర్నెల్లు పూర్తకుండానే ఆమె తనువు చాలించింది. చక్రవర్తికి తీరని ఆవేదనని మిగిల్చింది.
చక్రవర్తికి ఒక కొడుకు, కూతురు. ఇద్దరి పెళ్ళిళ్ళూ అయిపోయాయి. కొడుకు శేషు బిటెక్ పూర్తిచేసి ఆ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్నాడు. కోడలు కూడా అదే కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరిదీ ప్రేమ వివాహం. కూతురు శశి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఉద్యోగరీత్యా కూతురు, అల్లుడు కూడా బెంగుళూరులో ఉంటున్నారు. అలా భార్య బ్రతికుండగానే, ఇద్దరి పెళ్ళిళ్ళూ చేసేసాడు చక్రవర్తి. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత, ప్రశాంత జీవితాన్ని గడపాలనుకున్న చక్రవర్తికి భార్య అకాల మరణం చాలా పెద్ద దెబ్బ తీసింది. అంతా తన నిర్లక్ష్యం వల్లే జరిగిందని మనసులో బాధ మెలిపెడుతోంది. శారద మరణం తర్వాత స్తబ్దుగా మారిపోయాడు. మనసులో శారద జ్ఞాపకాలు అలజడి సృష్టిస్తున్నాయి. అలసటగా కళ్ళు మూసుకున్నాడు చక్రవర్తి.
అలా కళ్ళు మూసుకున్న చక్రవర్తి ఎంతసేపు పడుక్కున్నాడో గానీ, హఠాత్తుగా ఇంట్లోపలనుండి వస్తున్న కేకళ్ళకు కళ్ళు తెరిచాడు. ఏం జరుగుతోందో ఒక్కక్షణం అర్ధం కాలేదు.
"ఏమిటి, ఇల్లు నీ పేరుమీద కూడా రాయాలా? నీ పెళ్ళికోసం నాన్న బోలెడంత ఖర్చు చెయ్యడమేకాక నీ పేరు మీద కొంత డబ్బులు ఫిక్సిడ్ డిపాజిట్ కూడా చేసారు కదే! అమ్మ బంగారం నగలు మొత్తం నువ్వే తీసేసుకున్నావు! ఇంకా ఇప్పుడు ఇల్లు నీ పేరు మీద రాయాలా? మరి నా సంగతో? ఈ ఇల్లు కొన్నప్పుడు నేను కూడా డబ్బులు పెట్టుబడి పెట్టాను తెలుసా! ఈ ఇంటిమీద నాకే అధికారం ఉంది కానీ, నీకేమాత్రం హక్కు లేదు." పెద్ద గొంతుతో దాదాపు అరుస్తున్నట్లు అంటున్నాడు శేషు.
"ఎందుకు హక్కు లేదు? ఈ ఇంటిమీద నీకెంత హక్కుందో, నాకూ అంతే హక్కు ఉంది! కోర్టుకెళ్తే ఎవరిహక్కులేమిటో వాళ్ళే స్పష్టంగా చెప్తారు. నా పెళ్ళికి నాన్న ఖర్చుపెట్టారని అంటున్నావు గానీ, మరి నీ చదువుకి నాన్న ఖర్చు పెట్టలేదా! నాదైతే బిఏ గానీ, నువ్వు చదివిన ఇంజినీరింగ్ కోర్సు కోసం నాన్న లక్షలు ఖర్చుపెట్టారు కదా! నువ్వు కూడా ఓ ఫ్లాట్ కొనుక్కున్నావు, అందుకోసం నాన్న ఓ ఇరవై లక్షలు నీకు ఇవ్వలేదూ? అప్పుడు నేనేమైనా అన్నానా? ఇంటి విషయం వచ్చేసరికి నేను పరాయిదాన్నైపోయానా?" అన్నకి ఎదురు తిరిగింది శశి.
"అయినా, పెళ్ళైనతర్వాత ఎంతలేదన్నా నువ్వు పరాయిదానివే! ఇల్లు మొత్తం నా పేరుమీదనే నాన్న రాయాలి, అంతే!" కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు శేషు.
అలా ఇద్దరిమధ్యా మాటామాటా పెరిగింది. కొద్దిసేపట్లోనే ఆ మాటల యుద్ధంలో శేషు వాదనని సమర్థిస్తూ ఆతని భార్య రవళి, శశిని సమర్థిస్తూ ఆమె భర్త శివకుమార్ పాల్గొన్నారు. మరి కొద్దిసేపట్లోనే అక్కడ రంగరంగాన్ని తలపింపచేసే వాతావరణం నెలకొంది. మాటల వాడి, వేడి పెరిగి ఒకరిమీద ఒకరు చెయ్యి చేసుకోవడం వరకూ వచ్చింది. ఈలోపున చక్రవర్తి వియ్యంకులిద్దరూ వచ్చి చేరోవైపు చేరి మంటని మరింత రాజేస్తున్నారు. వియ్యపురాళ్ళు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ గొడవకి చుట్టుపక్కల వాళ్ళు ఆ ఇంటిలోకి తొంగి చూస్తున్నారు కుతూహలంగా.
తనకి తోడూనీడా అయిన భార్యని పోగొట్టుకొని, బాధాతప్త హృదయంతో ఉన్న చక్రవర్తిని ఆ సంఘటన బాగా కలిచివేసింది. అన్నాచెల్లెళ్ళ మధ్య ఇంత వైరం ఉందని ఇప్పటివరకూ అనుకోలేదు. తను బతికుండగానే వాటాలు వేసేసుకుంటున్న కన్నబిడ్డల్ని చూసిన చక్రవర్తి మనసు తల్లడిల్లిపోయింది. తను చెప్పించిన చదువు వాళ్ళకే మాత్రం సంస్కారం నేర్పలేదని అర్ధమైంది. ఇంకా తను వాళ్ళ మధ్యకి వెళ్ళకపోతే వ్యవహారం మరింత ముదిరే ప్రమాదం ఉందని గ్రహించి, లేచి ఇద్దర్నీ విడదీసాడు. వియ్యంకులు, వియ్యపురాళ్ళవైపు తిరిగి చేతులు జోడించి ఆగమని అర్ధించాడు.
ఒకరివైపొకరు బుసలు కొడుతున్నట్లు చూస్తున్న కొడుకూ కూతురు వైపు తిరిగి, "నా మాట వినండి! నేను మీ ఇద్దరికీ ఇప్పటివరకూ ఏ లోటూ చెయ్యలేదు. ఇకముందు కూడా చెయ్యను. మీ అమ్మ చనిపోయి ఇప్పటికి ఇంకా పదకొండు రోజులు మాత్రమే అయింది. మీరిద్దరూ ఇలా కోట్లాడుకుంటున్నారని తెలిస్తే ఆమె ఆత్మ ఎంత క్షోబిస్తుందో కదా! ఇప్పుడూ మీకిద్దరికీ ఎటువంటి అన్యాయం చెయ్యను. ఈ సాయంకాలమే వకీల్ని పిలిపించి ఎవరి వాటా వాళ్ళకి పంచేస్తాను." అని శాంత పరచడానికి ప్రయత్నం చేసాడు చక్రవర్తి.
శేషు, శశి ఒకరి మొహాలొకరు కోపంగా చూసుకొని చెరోగదిలోకి వెళ్ళిపోయారు. మిగతావాళ్ళు కూడా అక్కణ్ణుంచి జారుకున్నారు.
చక్రవర్తి ఒంటరిగా హాల్లో సోఫాలో ఆలోచిస్తూ కూర్చున్నాడు. అసలే భార్య పోయిన దిగులుతో ఉన్న అతనికి అన్నా చెల్లెళ్ళ పోరు మరింత కృంగదీసింది. కొడుకూ, కూతురూ మధ్య వైరం కలగడానికి తెర వెనుక ఉన్న మనుషులే కారణం అని గ్రహించాడు. సాయంకాలం లాయర్ రంగనాథ్ వచ్చాక ఇద్దరూ ఓ రూములోకి వెళ్ళారు. ఎవరిపేర్న చక్రవర్తి ఏం రాయబోతున్నాడో తెలుసుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేసినా ఫలించలేదు ఎవరికీ.
మరుసటి రోజు చక్రవర్తి ఇంట్లో ఎక్కడా కనపడక పోవడంతో ఇంటిల్లపాదీ గాబరాపడ్డారు. అతని కోసం అన్నిచోట్లా వెతికారు. ఫోన్ చేసినా స్విచాఫ్ వచ్చింది. వెంటనే శేషు, శశి తండ్రి కనిపించకపోవడానికి 'నువ్వే కారణం' అంటే 'నువ్వే కారణం' అంటూ ఒకర్నొకరు నిందించుకున్నారు. చక్రవర్తి గదిలో టీపాయ్ మీద వారికి కనపడిందో కవరు. అందులో వీలూనామాతో బాటు ఓ ఉత్తరం ఉంది.
ఉత్తరంలో రెండే రెండు వాక్యాలు ఉన్నాయి. 'నా కోసం మీరెక్కడా వెతక్కండి, ఎక్కడికి చేరాలో అక్కడికే చేరాను. మీకు కావలసిన విధంగా వీలూనామా రాసి మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను.' అని చక్రవర్తి స్వదస్తూరితో రాసి ఉంది అందులో. ఆ ఉత్తరం చదివి అన్నా చెల్లెళ్ళిద్దరూ మాన్పడిపోయి ఒకరిమొహలొకరు చూసుకున్నారు.
********
పిల్లలతో ఇలాంటి సమస్య ఏదో వస్తుందని ముందే ఊహించిన చక్రవర్తి తన ఏర్పాట్లు తనే చేసుకున్నాడు. పూర్వకాలం వయసు మీద పడిన తర్వాత రాజ్యాన్నేలే మహారాజులు ఎందుకు వానప్రస్థం స్వీకరించేవారో ఇప్పుడు అర్ధమైంది వృద్ధాశ్రమంలో చేరిన చక్రవర్తికి. ఇంకా నయం! తనే ముందు పోయి, శారదకే ఈ పరిస్థితి ఏర్పడి ఉంటే, ఆమె బతుకు ఎంత దుర్భరమైపోయేదో కదా అనిపించిందో క్షణం. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది చక్రవర్తికి. అయితే శారద గుర్తుకు వచ్చినప్పుడల్లా అతని మనసు కలుక్కుమంటోంది.
సమాప్తం
పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.
Comments