#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #Vanasobha, #వనశోభ, #తేటగీతి, #ద్విరదగతి రగడ

గాయత్రి గారి కవితలు పార్ట్ 1
Vanasobha - Gayathri Gari Kavithalu Part 1 - New Telugu Poems Written By - T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 12/02/2025
వనశోభ - గాయత్రి గారి కవితలు పార్ట్ 1 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
వనశోభ.
(ద్విరదగతి రగడ )
**********************
చిగురాకు పొత్తిళ్ల చిన్నారి మొగ్గమ్మ
మొగమునే గాంచగా ముంచెత్తు సిగ్గమ్మ
కనులు తెరిచిన పూవు కాంతినే చూసింది
వనముకే శోభగా వయ్యారి పూసింది
విరిబాల తావులను విరజిమ్మి నవ్వింది
మురిపాలు చిలికించి ముచ్చటలు చెప్పింది
తునకంత పూబాల తొలిసంజ కనినంత
తనువంత పులకింత తన్మయపు గిలిగింత
తరుశాఖలత్తఱిని దాలిమిని చూపాయి
చిరుగాలి తెమ్మరలు చేరువై నిలిచాయి
కూయంచు కూశాయి కొమ్మపై కోయిలలు
హాయిగా నరుదెంచె నంబరానమొయిళులు
వనమెల్ల ఠీవిగా వసుధలో నిలిచింది
కనువిందు చేయుచూ కళలతో మెరిసింది
తూరుపున కొండపై తొగసూడు కనుపించె
సారమౌ కిరణాలు జగతిపై కురిపించె.//

తల్లితండ్రులు - బిడ్డలు
(తేటగీతి మాలిక )
----------------------------------------
తల్లితండ్రులు బాధలన్ దలచికొనక
మోయు చుందురు నిత్యమీ భూమిపైన
బాధ్యతల్ హెచ్చు మీరిన బాధ పడక
పిల్లలన్ బెంచి కాపాడి ప్రీతితోడ
చదువు సంధ్యలు చెప్పించి సాకుచుంద్రు.
వారి ప్రేమకు వచ్చునా ఫలిత మిచట?
తల్లి తండ్రులన్ గాంచెడి తనయులిపుడు
కాన రాకుండిరీ దుష్ట కాలమందు.
హక్కులన్ కోరుచుందురే యాశతోడ
బాధ్యతలనుగూర్చి యెవరూ పలుకరేమి?
పెద్దలకు దిక్కు చూపక విడుతురకట!
చిన్న వాండ్రకు పట్టదు చీకు చింత.
తల్లి తండ్రులన్ బెద్దలన్ తలిచి తలిచి
ప్రేమ పంచుచు పిల్లలు విలువ నిడిన
సంఘమందున నిల్చును శాంతి యెపుడు.
కన్నబిడ్డల శ్రేయమే కలిమి యనుచు
రక్తమాంసాదులన్నియు రంగరించి
ధనము నిడుచుండి బిడ్డల మనికి నిల్పు
తల్లి తండ్రులు భువిపైన దైవసములు
పుణ్య చరితులౌ వారికి పూజ చేసి
కొల్చు చుండెడి పిల్లలు గొప్పవారు.//

వెన్నెల్లో షికారు (బాలగేయం )
----------------------------------------
వెన్నెలలో షికారు కెళ్దాం వస్తావా!
వన్నెల జాబిలిని చూద్దాం వస్తావా!
మాటామంతీ కలిపేద్దాం వస్తావా!
పాటలెన్నో నేర్పుదాం వస్తావా!
మబ్బు తెరలను తీద్దాం వస్తావా
అబ్బురాలనే చూసేద్దాం వస్తావా!
తారకలను కోసేద్దాం వస్తావా!
తీరిగ్గా లెక్కపెడదాం వస్తావా!
చందమామ ఇంటికెళదాం వస్తావా!
అందమైన బొమ్మల నేరేద్దాం వస్తావా!
మూటాముల్లె సర్దేద్దాం వస్తావా!
టాటా చెప్పి మరలుదాం వస్తావా!//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comentarios