top of page
Writer's pictureLalitha Sripathi

వంట తెచ్చిన తంటా


'Vanta Thechhina Thanta' - New Telugu Story Written By Sripathi Lalitha

Published In manatelugukathalu.com On 15/10/2023

'వంట తెచ్చిన తంటా' తెలుగు కథ

రచన: శ్రీపతి లలిత

కథా పఠనం: చీరాల ఓషధి

"అబ్బా! ఇవాళ ఎంత హాయిగా ఉందో, రేపటినుంచి ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు రాధా! ముప్ఫయి ఆరు ఏళ్ళ నుంచి ఉరుకుల పరుగుల జీవితం, ఉద్యోగం చేసి, చేసి చాలా విసుగు వచ్చిందోయ్,

ఇంక నా అభిరుచులు, కోరికలు అన్నీ తీర్చుకుంటా" ఎంతో సంతోషంగా చెప్తున్న కృష్ణ ని చూస్తే ముచ్చట వేసింది రాధకి.


అందరూ రిటైర్ అయితే దిగులు పడతారు, నిరాశా, నిస్పృహ లు కమ్ముకుంటాయి అంటూ భయపెట్టారు, కానీ కృష్ణ ఇంత ఆనందంగా ఉన్నాడు. 'అమ్మయ్య' అనుకుంది.


"అవును కృష్ణా! అదృష్టం కొద్దీ మనకి బాధ్యతలు ఏవీ లేవు. పిల్లలు చక్కగా స్థిరపడ్డారు, మనకి సరిపడా డబ్బు ఉంది, చక్కగా మనము కొత్త ప్రదేశాలు చూద్దాము, బంధువులను, స్నేహితులని కలుద్దాము, సమయం చక్కగా గడుపుదాము" అంది రాధ.


కృష్ణ పదవీ విరమణ సభ బ్రహ్మాండంగా జరిగింది. అందరూ అతని పనితనాన్ని, నిజాయితీని పొగిడి శాలువాలు కప్పి, బహుమతులు ఇచ్చి, విందు ఏర్పాటు చేసి మరీ వీడ్కోలు చెప్పారు.

చిన్న వయసులోనే ప్రభుత్వ శాఖలో చేరి, అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి స్థానం నుంచి పదవీ విరమణ చేసాడు.


మరునాడు ఉదయాన్నే ఇద్దరూ లేచాక కాఫీ కలిపి తెచ్చింది రాధ.

"ఇలా స్థిమితంగా కాఫీ రుచి ఆస్వాదిస్తూ తాగితే ఎంత బావుందో. నువ్వు కూడా పెళ్ళైన రోజు నుంచి రోజూ నాకు, తర్వాత పిల్లలకు ఏ మాత్రం విసుగు విరామం లేకుండా చేసావు. ముప్ఫయి ఏళ్ళ నుంచి మా అమ్మా, నాన్నలని, బంధువులని ఎంతో చక్కగా ఆదరించావు. నువ్వు అలా ఉండబట్టే నేను నా ఉద్యోగం బాగా చేశాను. థాంక్స్ రాధా!" అని కృష్ణ అంటే పొంగిపోయింది రాధ.


"నేనేమన్నా ఊరిని ఉద్ధరించానా? నా ఇంటిని నేను చూసుకున్నాను అంతేగా" సంతోషంతో అంది రాధ.


"అందుకే నీకు కూడా ఇవాళ్టినించి రెటైర్మెంట్, ఈ రోజు నుంచి నువ్వు వంట చెయ్యక్కర్లేదు" అన్న కృష్ణ మాటలకి "అయితే వంట మనిషిని పెట్టుకుందామా?" మోకాళ్ళ నొప్పులతో

రెండేళ్ళబట్టి అడుగుతున్నా, మన ఇద్దరికీ ఎందుకోయి వంట మనిషి అన్న భర్త ఇలా అనేసరికి ఆశ్చర్యపోయింది.


"వంటమనిషా! అహ్హహ్హ ! నల, భీముల చిన్న తమ్ముడు ఈ కృష్ణ ఉండగా వంటమనిషి ఏమిటి? ఈ రోజు నుంచి నేనే నీ వంటవాడిని" గుండె మీద చెయ్యి వేసి తనని చూపిస్తున్న కృష్ణ ని చూసి "వంటా! మీకా! ఏనాడూ వంటింట్లోకి రాలేదు. పోపుల పెట్టె ఎక్కడుందో తెలీదు" అనుమానంగా అంది.


"అవమానం, ఇన్ని రోజులు నీకు వదిలేసాను. ఇప్పుడు చూడు నా పాక శాస్త్రం. పెళ్లి కాక ముందు పల్లెటూర్లో నేనే చేసుకున్నా వంట. పద మనం తాజాగా కూరలు తెచ్చుకుని వంట చేసుకుందాము. దారిలో టిఫిన్ తిని వెళ్దాం."


కృష్ణ మాటలకి హుషారుగా లేచింది రాధ. మాములుగా బయట తిందాము అంటే ఒప్పుకోడు, అలాంటివాడు ఒక్క రోజులో ఎంత మారిపోయాడు. ఇలా అని తెలిస్తే నాలుగేళ్ళ క్రితమే రిటైర్ అవమనేది అనుకుంటూ తయారైంది.


దారిలో మంచి హోటల్ లో టిఫిన్ తిని పెద్ద మార్కెట్ కి వెళ్లారు.

పొద్దున్నే కూరలన్నీ తాజాగా నవనవలాడుతున్నాయి.


"అబ్బో కూరలన్నీ బావున్నాయి, ఒక వారానికి తీసుకుందాము" అంటూ కృష్ణ ఒకో కూర ఏరడం మొదలుపెట్టాడు.


వంకాయలు కిలో, బెండకాయలు కిలో, టమాటో రెండు కిలోలు అంటుంటే " కృష్ణా! మన ఇద్దరికీ అవి ఎక్కువ అవుతాయి. మళ్ళీ వారం వస్తాముకదా!" అంటున్న రాధ తో


"నేను చేస్తే నువ్వు ఎక్కువ తినేస్తావు, తీసుకుందాము" అంటుంటే అతని ఉత్సాహం ఎందుకు చల్లార్చాలి అని ఊరుకుంది రాధ.


మాములుగా అయిదు వందలు అయ్యే కూరలు వెయ్యి అయ్యాయి.


ఇంటికెళ్ళాక అన్నీ తీసి "ఇవాళ వంకాయ గుత్తి కూర, ముక్కల పులుసు, దోసకాయ కాల్చి పచ్చడి" మెనూ చెప్పేసాడు.


"నేను కూరలు తరిగి ఇవ్వనా! " అంది రాధ.

"సరే!" అన్నాడు కృష్ణ.


గుమ్మడి కాయ, చిలకడ దుంప, మునక్కాడలు పులుసు లోకి ముక్కలు తిరుగుతుంటే

"అలా కాదు, ఇంత ముక్క, ఇలా తరుగు" అంటూ చెప్తూనే ఉన్నాడు కృష్ణ.


"వంకాయ కూర పొడి తెలుసా, నేను చెయ్యనా?" అన్న రాధ మాటలకి "అన్నీ నువ్వే చేస్తే ఎలా? అది నా వంట ఎలా అవుతుంది?"


అంటూ బాండీ(మూకుడు ) పెట్టి ఒక పావుకిలో నూనె వేసాడు. "అమ్మో అంత నూనా?" అన్న రాధతో "నువ్వు ఇలా ప్రతిదానికీ అడ్డు తగిలితే ఎలా? నన్ను చేయనియ్యి. నువ్వు హాల్ లో కూర్చో " అంటూ బయటికి తోసాడు.


రాధ హాల్ లో కూర్చున్నా ఆ వాసనలకి, పొగలకి ఏమవుతుందో అర్థం కాక ఒకటే ఖంగారు పడింది.


కొంచెంసేపటికి బయటికి వచ్చి "కూర పొడికి వేయించాను.గ్రైండ్ చేసి వంకాయలో వెయ్యి. రాచ్చిప్ప ఇస్తే పులుసు పెడతాను." అన్నాడు కృష్ణ.


" రాచ్చిప్పా!" నోరు తెరిచింది. " అదేమిటి? మరి నువ్వు పులుసు ఎందులో పెడతావు?" అడిగాడు ఆశ్చర్యంగా.


"గిన్నెలో, రాచ్చిప్ప మన ఇంట్లో లేనే లేదు." అన్న రాధ మాటలకి " అదీ! అలా చెప్పు. అందుకే పులుసు రుచి ఉండేది కాదు. రేపు ఒక రాచ్చిప్ప తెద్దాము ఇవాళ్టికి గిన్నెలో పెడతానులే.

మరి దోసకాయ కాల్చాలి కదా కుంపటి వెలిగించు" అన్నాడు సీరియస్ గా.


రాధ కి ఒక్కసారి కాళ్ళు, చేతులు చల్లబడ్డాయి. "కుంపటా!" "అంటే కుంపటి కూడా లేదా? ఒక రాచ్చిప్ప లేదు, కుంపటి లేదు, కొంప తీసి రోలు కూడా లేదా? అసలు నువ్వు ఏమి వంట చెస్తున్నావు?ఎలా చేస్తున్నావు?" విసుగ్గా అన్నాడు.


"ఇప్పుడు అవన్నీ ఎవరు వాడుతున్నారు కృష్ణా! అసలు అవి దొరకడమే కష్టం. దొరికినా వాటిని ఎలా వాడాలో కూడా తెలీదు" ఉక్రోషంగా అంది.


"నీకు తెలీదు కానీ, నాకు అన్నీ తెలుసు,సరే! ఇంకా ఏమి లేవో అన్నీ తెద్దాము, ముందు వెళ్లి ఆ కూర సంగతి చూడు." అన్నాడు విసుగ్గా.


వంటిట్లోకి వెళ్లిన రాధకి ఏడుపు వచ్చింది. ఆ కూరపొడితో కనీసం పదిసార్లు చెయ్యచ్చు.

కిలో వంకాయలు మాడి మసిబొగ్గులయ్యాయి.

"వంకాయ మాడిందండీ" డగ్గుత్తికతో అంది.


"అవును! నువ్బు బాగా బరువుగా ఉండే ఇనపబాండిలో చేస్తే మాడదు, పరవాలేదు, కూరపొడి వేస్తే బానేవుంటుంది. పక్కన పులుసు ముక్కలు చూడు." అన్నాడు టీవీ లో న్యూస్ చూస్తూ.


చిన్న గిన్నెలో ఉన్న పులుసు ముక్కల్లో పావు కిలో చింతపండు పిసక కుండా అలానే వేసాడు.

పావు కిలో బెల్లం దిమ్మ వేసాడు.


అమ్మో! ఈ వంట ఎలా తప్పించుకోవాలి? అనుకుంటూ అతన్ని అడగకుండానే అన్నం పెట్టి నాలుగు బంగాళా దుంపలు వేయించింది.


"ఎంత బావున్నాయో నా వంటలు" అంటూ మొత్తం అన్నం బంగాళ దుంప వేపుడు, పెరుగు తో తిన్నాడు.


మర్నాడు ఒక్కడూ వెళ్లి ఒక చిన్న రోలు, కుంపటి, బొగ్గులు, ఇత్తడి బాండీ, ఇనప బాండీ, దుక్కలాంటి అల్యూమినియం గిన్నె తెచ్చాడు.


అవన్నీ చూసి నీరసం వచ్చింది రాధకి.


"టిఫిన్ నేను చెయ్యనా?" ఆశగా అడిగింది మర్నాడు పొద్దున్న.


"ఉహూ, నేను పెసరట్టు వేస్తాను.రాత్రి పెసలు నానపెట్టాను" అన్నాడు.


వంటిట్లో కి వెళ్లి చూస్తే అరకిలో పెసలు నానపెట్టాడు. తిక్క వచ్చింది రాధకి.


"మన ఇంటికి ఎవరైనా వస్తున్నారా? ఇన్ని పెసలు నాన పోశారు?" అంది.


"రెండు రోజులు తింటాముకదా. గ్రైండ్ చేసి మొన్న తెచ్చిన ఇనప పెనం పెట్టు నేను వేస్తాను.


అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కోసి పెట్టు." అంటూ బాత్రూం లో దూరాడు.


"అన్నీ నేనే చేస్తే నువ్వేంచేస్తావ్ ?" సణుక్కుంటూ నిన్నటి వంట గది శుభ్రం ఎంతసేపు పట్టిందో గుర్తుకు వచ్చి మనసులో ఏడ్చుకుంటూ రెడీ పెట్టింది.


"ఇనప పెనం అందునా కొత్తది, ముందు కొద్దిగా నూనె వెయ్యి" అని రాధ చెప్తుంటే, నువ్వా నాకు చెప్పేది లుక్ ఇచ్చి పిండి వేసి, గరిటెతో పెనం మీద తిప్పాడు. పిండి అంతా అతుక్కుని దోశె రాక, స్టవ్ హై లోనే ఉంచేసరికి అంతా మాడి, అట్లకాడతో లాగుతుంటే బాలన్స్ తప్పి పెనం కింద పడి, కాలుమీద పడడం తృటిలో తప్పించుకున్నాడు.


కానీ ఈ బేలన్సింగ్ లో పెనానికి తగిలి పిండి గిన్నె, ఉల్లిపాయముక్కలు అన్నీ కింద పడ్డాయి.


"అసలు ఏది మొదలుపెట్టినా, మీకొచ్చా? చెయ్యగలరా? అంటూ అనుమానాలు తప్ప అవతలి మనిషి మీద నమ్మకం లేదు, ఇలా అనుమానపడుతూ చేస్తే ఇలాగే తగలడతాయి. నేనెంత ఉత్సాహ పడుతూ మొదలుపెడతానో అంత వెనక్కి లాగుతావు." విసుక్కుంటూ బయటికి వెళ్లిన కృష్ణ ని విస్తుపోతూ చూసింది రాధ.


ఏ వంట చేసినా వంకలు పెట్టడం అటుంచి అన్నీ బావున్నాయి అని లొట్టలేసుకుంటూ తిన్న మొగుడు ఇలా మారిపోయాడేంటి అనుకుంటూ వంటిల్లు శుభ్రం చెయ్యడానికి వెళ్ళింది.


ఆరోజు రాధ చేసిన వంట కిక్కురుమనకుండా తిన్నవాడు మళ్ళీ మర్నాడు మామూలు. అయ్యాడు.


"ఇవాళ వంకాయ కాల్చి పచ్చడి చేస్తాను. కుంపటి వెలిగించు" అన్నాడు రాధ వంక చూస్తూ.


" నాకు రాదు కృష్ణా, నీకు బాగా అలవాటు కద, నువ్వే వెలిగించు. నేను స్థిమితంగా పూజ చేసుకుంటాను. నీ వంట అయితే నేను అన్నం వండుతాను." వెళుతున్న రాధ ని కోపంగా చూసాడు కృష్ణ.


"నీకు నా వంట ఇష్టం లేకపోతె చెయ్యను" వెనకనుంచి అరిచాడు.

"లేదు కృష్ణా! చెయ్యి! నాకు వంట ఎలానో రాదు, నీ వంట తిని తరిస్తాను, నాకు

చాలా రెస్ట్ కూడా దొరుకుతోంది" ఎగతాళిగా అని వెళ్ళింది.


కుంపటి వెలిగించడానికి నానా పాట్లు పడ్డాడు కానీ అది వెలగలేదు.

ఓటమి ఒప్పుకోడానికి మనసు ఒప్పుకోలేదు. కుంపటి మంచిది ఇవ్వలేదని షాప్ వాడిని అన్ని భాషల్లోనూ తిట్టి చివరికి గ్యాస్ మీద కాల్చి చేస్తాను అన్నాడు.


రాధ పక్కనే ఉండి అన్నీ ఎంతవెయ్యాలో చెప్తే విని పచ్చడి చేసాడు.

"అరటికాయ కూర నువ్వు బానే చేస్తావులే చెయ్యి" ఏదో రాధని ఉద్ధరించినట్టుగా అని వెళ్ళాడు.


ఒళ్ళుమండినా గట్టిగా అంటే తినడానికి కూర కూడా ఉండదు అని కూర రాధ చేసింది.


"పచ్చడి ఎంత బావుందో, నువ్వు ఒక్కసారి ఇలా చేసావా?" అని కృష్ణ అనగానే

అప్పటిదాకా ఆపుకున్న కోపం అగ్ని పర్వతంలా బద్దలైంది రాధకి.


"లేదు కృష్ణా! నాకు వంట రాదు. ముప్ఫైయ్ ఏళ్ళ బట్టి నీకు గడ్డి పెడుతున్నాను, నువ్వు మంచివాడివి కనక నోరెత్తకుండా తిన్నావు. కానీ నువ్వు చేసే ఈ అమృతం తినడం నా వల్ల కావడం లేదు.


పైగా నేను నెలకి తెచ్చిన సామాన్లు వారంలో అయిపోయాయి. ఇన్ని ఏళ్ళు నేను చేసిన వంట లొట్టలు వేసుకుంటూ తిన్నావు. ఆదివారాలు నాకు రెస్ట్ లేకుండా నా వంట బావుంటుంది అని నీ స్నేహితులని పిలిచేవాడివి.


చుట్టాలు వచ్చినప్పుడు రకరకాల వంటలు చెయ్యమనేవాడివి. అప్పుడు నచ్చిన వంటలు ఇప్పుడు నచ్చకపోగా రోజూ నా వంట గురించి ఏదో ఒక కామెంట్ చేస్తున్నావు.


నీకా వంట రాదు, ఆ మాట ఒప్పుకోలేక పదిరోజుల నుంచి హింస పెడుతున్నావు.


నిజం చెప్పు, మనం కడుపు నిండా తిని ఎన్ని రోజులయింది?


నా వల్ల కావడంలేదు. నేను చేస్తానంటే ఏదో చెప్తావు. పోనీ నువ్వు చేసేప్పుడు సలహా చెప్పినా వినవు. నేను ఉప్పు చెంచా వెయ్యి అంటే, రెండు చెంచాలు వేస్తావు. నీ సమస్య నాకు అర్థం కావడంలేదు.


అందుకే నేను కొన్ని రోజులు మా అక్క దగ్గరికి, కొన్ని రోజులు మీ అక్క దగ్గరికి వెళదామనుకుంటున్నా, నీవంట బాగా కుదిరాక వస్తాను." ఏడుపు గొంతుతో అంటున్న రాధని చూసి


"సారీ రాధా! నేను రిటైర్ అయ్యాక, డిప్రెషన్ రాకుండా ఉండాలని ప్రయత్నించాను, ఒక్కసారిగా జీవితం అంతా ఖాళీగా అనిపించి తట్టుకోలేకపోయా, ఎదురుగ ఉన్న నిన్ను బాధపెట్టాను. నన్ను క్షమించు." రాధ చేతులు పట్టుకొని అన్నాడు.


"నాకు తెలుసు కృష్ణా! ఇదంతా నీ రిటైర్మెంట్ బ్లూస్ అని, నీకు నిజంగా

వంట నేర్చుకోవాలని ఉంటే ఇద్దరం కలిసి చేద్దాము. ఒకరకంగా నువ్వు

వంట నేర్చుకోవడం మంచిది.


అలానే నువ్వు నాకు డ్రైవింగ్ నేర్పు. ఇప్పుడు మనం ఇద్దరం ఎవరి మీదా ఎక్కువ ఆధారపడకుండా ఉండాలి. అలానే వీలైనంత ఎక్కువ సమయం ఇద్దరమూ కలిసి గడుపుదాము." కృష్ణ భుజం మీద చెయ్యి వేసి ఓదార్పుగా చెప్పింది.


"మరి టికెట్లు" అడిగాడు, నువ్వు నీ వంట హడావిడిలో మర్చిపోయావు, ఈ నెలలో వాళ్ళిద్దరివీ పెళ్లి రోజుల పండగ చేసుకుంటున్నారు. ఎలా అయినా రిటైర్ అవుతావు కదా. మనం వెళదామనుకున్నాము, అందుకే ఇద్దరికీ బుక్ చేశాను.


అక్కడ అందరితోనూ సరదాగా గడిపి వచ్చాక, నీ వంట క్లాసులు నా డ్రైవింగ్ క్లాసులు మొదలుపెడదాము"

అంటున్న రాధతో " నా వంట తంటాలు తెచ్చింది అని భయ పడ్డా, కానీ నన్ను అర్థం చేసుకునే నా రాధ ఉండగా నాకేల భయం. మరి వంట మొదలు పెడదాము కుంపటి వెలిగించు" పెద్దగా నవ్వుతూ అన్నాడు.

***

శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.




112 views4 comments

4 Comments


@anuradhakodali9510 • 54 minutes ago

Nice story. Manchi Telugu uchharana vini ennalayindo..keep going Oshadhi

Like

@vallim6606 • 1 hour ago

Very nice oshadhi.

Like

@nagalakshmigundavajhala8558 • 15 hours ago

Excellent story and beautiful rendering

Like

@sridevichivukula4323 • 1 day ago

Good start. Keep going. All the best.

Like
bottom of page