top of page

వరద

#Varada, #వరద, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Varada - New Telugu Story Written By - Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 16/03/2025

వరదతెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


సర్వేశ్వర నిర్ధేశికమైన ఈ చరాచర సృష్టి నలుబది కోట్ల జీవరాసులతో వర్ధిల్లుతూ వుంది. సృష్టిలోని ప్రతిదానికీ, ప్రాణికీ, మనిషికీ జనన మరణాలు సహజం. అందుకే మన పెద్దలు అన్నారు పునరపి జననం... పునరపి మరణం. 


సృష్టి పంచభూత నిర్మితం. భూమి, ఆకాశము, నీరు, వాయువు, అగ్ని మన మానవ సర్వ జీవరాసుల మనుగడను సాగించేవి ఆ పంచభూతములే. భూతము అంటే దయ్యం కాదు మహత్తర శక్తి.


ఈ సృష్టికి ఆరు ఋతువులు. 


1. వసంత ఋతువు - చైత్రమాసం. వైశాఖ మాసం చెట్లు చిగురించి పూలు పూస్తాయి. 

2. గ్రీష్మ ఋతువు - జేష్టమాసం, ఆషాడమాసం, ఎండలు మెండుగా ఉంటాయి.

3. వర్ష ఋతువు - శ్రావణ మాసం, భాద్రపద మాసం. వర్షములు ఎక్కువగా వుంటాయి.

4. శరదృతువు - ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం. వెన్నెల ఎక్కువ కాంతివంతముగా ఉండును.

5. హేమంత ఋతువు - మార్గశిర మాసం, పుష్యమాసం. మంచు కురియును. చల్లగా ఉండును.

6. శిశిర ఋతువు - మాఘ మాసం, ఫాల్ఘుణ మాసం. చెట్లు ఆకులను రాల్చు కాలము.


అది సముద్రపు (బే ఆఫ్ బెంగాల్) తీరాన వున్న చిన్న గ్రామం. పేరు రామాపురం. నూరు ఇండ్లు వుంటాయి. అందరూ కాయకష్టం చేసుకొని, ఉన్న కొద్దిపాటి భూమిలో పంటలు పండించుకొని, జీవితాలను గడుపు పేదవారు. తండ్రుల తరంలో కొందరు అక్షరాస్యులు, కొందరు నిరక్షరాస్యులు. ప్రస్తుత తరంలో పిల్లలందరూ అక్షరాస్యులు. వూర్లో వెలసిన ప్రైమరీ స్కూల్లో ఐదవ తరగతి వరకు, ఆపైన సెకండరీ విద్యను ప్రక్కన నాలుగు కిలోమీటర్లలో వున్న పెద్ద గ్రామంలో అభ్యసిస్తున్నారు ఆ గ్రామ యువత.


అది వర్షా కాలం. అంటే.... శ్రావణ భాద్రపద మాసాల సమయం. తరుచుగా వర్షాలు కురుస్తున్నాయి.


ఆ గ్రామం దివిసీమకు చెందినది. ఆంధ్ర దేశ చరిత్రలో దివిసీమకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఆనందకరమైనది కాదు. కడు విషాదకరమై భయంకర భీబత్స చరిత్ర.


అది 1977వ సంవత్సరం. నవంబర్ నెల. తేదీ 19... ఆ ప్రాంతానికి ఆ రోజు కడు విషాదాన్ని కలిగించిన రోజు. సాగరుడు ప్రళయ తాండవం చేసిన రోజు. రక్త చరిత్రను వ్రాసిన రోజు. దివిసీమపై ప్రకృతి సలిపిన మహా భయంకరమైన రోజు అది. సముద్రపు అలలు రాకాసి అలలుగా నూరు అడుగులకు పైగా వికృత రూపంలో పైకెగసి భూమిపైకి ప్రాకి ఎన్నో ఊళ్ళు ఇసుక దిబ్బల చేత కప్పబడి మాయమైపోయిన రోజు విషాద  భయంకర రోజు అది. 

దాదాపు పదివేలకు పైగా జనం (మనుషులు) పది లక్షలకు పైగా జీవరాసులు (ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు) ఇసుక దిబ్బల క్రింద సజీవ సమాధులైపోయారు.


అప్పటి ఆంధ్ర చీఫ్ మినిస్టర్ (CM) వెంగళరావు గారు, అనేక వాలంటరీ సంస్థలు ఆ ప్రాంతాన్ని పునరావాసం చేసి బ్రతికి వున్న వారిని ఆదుకొన్నారు.


ఆ దుర్ఘటన మన భారతదేశంలో ఏ ప్రాంతంలోనూ ఆనాటికి జరుగలేదు. దివిసీమ ఉప్పెన ఒక చేదు, భయంకర, కథనంగా ఆంధ్ర దేశ చరిత్ర పేర్కొనబడింది.

*

చంచయ్య రెండు ఎకరాల ఆసామి. అతని భార్య మంగమ్మ. వారికి ముగ్గురు పిల్లలు. అందరికంటే పెద్దవాడు అశోక్, ఇంటర్ ముగించి ఇంజనీరింగ్ కాలేజీ గుంటూరులో సివిల్ ఇంజనీరింగ్ హాస్టల్లో వుండి రెండవ సంవత్సరం చదువుతున్నారు.


చంచయ్యకు అశోక్ మీద ఎన్నో ఆశలు. మరొక సంవత్సరం చదివితే ఇంజనీరై తమ కష్టాలను తీరుస్తాడనే గొప్ప కల చంచయ్య, మంగమ్మలది. అశోక్ వయస్సు ఇరవై ఒక్క సంవత్సరం.

తన తల్లితండ్రుల స్థితిగతులు బాగా తెలిసిన అశోక్‍కి చదువంటే ఎంతో శ్రద్ధ. సౌమ్యుడు. తల్లితండ్రుల మీద ఎంతో గౌరవం. తమ్ముడు దీపక్‍కి పదిహేను సంవత్సరాలు. పదవ తరగతి చదువుతున్నాడు. సోదరి సంధ్యకు పన్నెండు సంవత్సరాలు. సెకండ్ ఫామ్ చదువుతూ ఉంది. తమ్ముడు చెల్లి అంటే అశోక్‍కు పంచ ప్రాణాలు. తాను ఇంజనీరింగ్ ముగించి మంచి ఉద్యోగం సంపాదించి, అమ్మా నాన్నలను ప్రేమాభిమానాలతో చూచుకొంటూ తమ్ముడు దీపక్‍ను చెల్లి సంధ్యను బాగా చదివించి వారిని గొప్ప స్థితిలో చూడాలనేది అతని ఆశయం, కల.


ప్రతి సంవత్సరం నవంబర్ నెల వచ్చిందంటే ఆ ప్రాంతీయులంతా సాగరునకు పూలు, ఫలాలు సమర్పించి పూజలు చేస్తారు. తమను, తమ సంతతిని, గొడ్డు, గోదను చల్లగా కాచి రక్షించమని వేడుకొంటారు.


ఆకాశంలో మేఘాలు, ఉరుములు, మెరుపులు కలిగితే వారందరి హృదయాల్లో కలవరం, భీతి. తమ తమ ఇలవేల్పులకు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఉపవాసాలు ఉంటాయి.

చంచయ్య తన రెండు ఎకరాల పంట భూమికి తోడుగా కలిగిన వారి మూడు ఎకరాలను కౌలు చేస్తాడు. పంటలో తొంభై పాళ్ళు వారికి పదవ వంతు తనకు. ఆ భూమిల్లో వచ్చిన ధాన్యపు గడ్డిని పశువుల మేతకు వాడుకొంటాడు. మనిషికి ఎంతో దైవభక్తి. నీతి నిజాయితీగా బ్రతకాలనేది అతని ఆశయం. ఆచరణ. అర్థాంగి మంగమ్మ అతనికి తగిన ఇల్లాలు. ఉన్నంతలోనే లేని వారికి దానం చేయాలనే సద్గుణ సంపన్నురాలు.


పిల్లలు ముగ్గురికి అమ్మా నాన్నల మాట అంటే ఎంతో గౌరవం, విశ్వాసం.

వారి వూరిలో హైస్కూలు లేదు. ప్రక్కన అనగా మూడు కిలోమీటర్ల దూరంలో వుండే మర్రిపాళెం హైస్కూల్లో దీపక్, సంధ్యలు చదువుతున్నారు.


మూడురోజులు వాన. రామాపురానికి, మర్రిపాళెంకు మధ్యన ఒక వాగు. పది సంవత్సరాల క్రింద ఆ వాగుపైన వంతెన (బ్రిడ్జి)ను ప్రభుత్వం నిర్మించింది.


మూడురోజులు ఎడతెరిపి లేని వాన కారణం ఆ వంతెన కూలిపోయింది. 

పిల్లలకు అది పరీక్షల సమయం. బోట్లను వేసి పిల్లలను ఆదరి నుండి ఈదరికి, ఈదరి నుండి ఆదరికి బెస్త రంగన్న దాటించేవాడు. అలాగే అవసరానికి మర్రిపాళెం వెళ్ళేవారినీ రంగన్న దాటించేవాడు. వాగు దరులు దాటి ప్రవహిస్తూ వుంది.


ఆరోజు ఉదయం వాన కొంతవరకు వెలిసింది.


పిల్లలు పరీక్ష వ్రాయడానికి రంగన్న బోటు (బూరగ చెక్కలతో చేసింది) ఎక్కి ఆదరికి చేరి స్కూలుకు వెళ్ళి పరీక్ష వ్రాశారు. పరీక్ష పదిగంటల నుండి పన్నెండున్నర వరకు జరిగింది. స్కూల్ లాంగ్ బెల్ మ్రోగింది.


పిల్లలు క్లాస్ గదుల నుండి వరండాలోకి వచ్చారు.


విపరీతమైన గాలి, వాన ప్రారంభం అయినాయి. కారు చీకట్లు క్రమ్ముకొన్నాయి.

ఇండ్లకు పోవలసిన పిల్లలు చలికి గడగడ వణుకుతూ క్లాసురూములలోనే వుండిపోవలసి వచ్చింది.


కూలిన వంతెన వెడల్పు ఆరువందల మీటర్లు, బోటును దరిపై వున్న కొయ్య కూచానికి కట్టి రంగన్న ప్రక్కనే వున్న తాటాకుల గుడిశలో దూరాడు.


అతని మనస్సున మదన....


’పరీక్ష వ్రాయడానికి వెళ్ళిన పిల్లలను క్షేమంగా ఆ దరినుండి ఈ దరికి ఎలా చేర్చాలి! పాడు వాన గాలి తగ్గడం లేదే, పాపం పిల్లలు ఆకలికి అల్లాడిపోతుంటారు కదా!.... గంగమ్మ తల్లీ కనికరించమ్మా!..’ బిక్కముఖంతో గుడిశనుండి బయటికి చూస్తూ దీనంగా ఆ తల్లిని వేడుకొన్నాడు రంగన్న.


ఇంట్లో తల్లి మంగమ్మ, తండ్రి చంచయ్యలు గాలివాన తుఫానుగా వున్న ఆ తరుణంలో స్కూలుకు వెళ్ళిన పిల్లలు ఇద్దరూ క్షేమంగా ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తారా అని విచారవదనాలతో వాకిట్లో కూర్చొని వారి రాక కోసం ఎదురుచూస్తున్నారు.


వానాగాలి తగ్గు ముఖం పట్టలేదు. మరీ తీవ్రంగా మారింది. పరీక్ష ఒంటి గంటకు ముగియగానే రెండు గంటల లోపల ఇంటికి రావలసిన పిల్లలు రానందుకు, గాలీవాన తీవ్ర స్థాయికి ఆ దంపతులు ఎంతగానో బాధపడుతున్నారు. అందరు దేవుళ్ళకూ మొక్కుకుంటున్నారు. బిడ్డలు క్షేమంగా ఇంటికి చేరాలని.


అక్కడ హైస్కూల్లో.... దీపక్, చెల్లెలు సంధ్య వున్న గదిలో ప్రవేశించాడు. ఒకమూల గదిలో తోటి పిల్లలతో కూర్చొని చలికి గడ గడ వణుకుతున్న చెల్లెలిని చూచాడు. సమీపించాడు.


"చిన్నీ!.... భయపడకు. వానాగాలి కొంతసేపటిలో తగ్గిపోతాయిలే. మనం జాగ్రత్తగా ఇంటికి వెళదాం. భయపడకు" ప్రక్కన కూర్చొని భుజం తట్టి ధైర్యం చెప్పాడు దీపక్.


ఆ వూరి నుండి పన్నెండు మంది బాలికలు, పదహారు మంది బాలురూ ఆ స్కూల్లో చదివేదానికి వెళతారు. వారితో పాటే ఒక టీచర్ విద్యావతి వెళుతుంది. బెస్త రంగన్న ఆ ఇరవై తొమ్మిది మందినీ తన చిన్న బోటు ద్వారా మూడు సార్లు ఆ దరికి చేరుస్తారు.


అతనూ పిల్లల కోసం, ఆ చిన్న తాటాకుల గుడిశలో చలికి వణుకుతూ ముడుచుకొని కూర్చొని వున్నాడు. గ్రామ దేవత మహాలక్ష్మమ్మను మనస్సున ధ్యానిస్తూ, ’తల్లీ!.... ఈ తుఫాన్ను ఆపు అమ్మా. పిల్లలందరినీ క్షేమంగా వారి వారి ఇండ్లకు ఈ వాగును దాటించి చేర్చేలా సాయం చేయి తల్లీ!... ఈ స్థితిలో మమ్మల్నందరినీ ఆదుకొనవలసిన తల్లిని నీవేకదమ్మా!.... మాకు దిక్కు నీవు కావ వేరే ఎవరున్నారు తల్లీ. గాలీవానను ఆపు తల్లీ... ఆపు...’ ఆ రీతిగా దీనంగా ఆ గ్రామదేవతను వేడుకొంటున్నాడు బెస్త రంగన్న.


అతని ప్రార్థనో.... ఎవరెవరు ఏ రీతిగా వారి ఇష్ట దైవాన్ని వేడుకొన్నారో గాలి... వాన కొంతవరకు ఉదృతం నుండి సన్నగిల్లింది.

*

స్కూల్లో సంధ్య వున్న గదిలో వారితోటే ఇరువురు టీచర్లు, ఆడవారు వున్నారు. సంధ్య లేచి నిలబడింది. ఆమె పావడా వెనుక భాగాన రక్తపు మరక. ఆకలి, చలి బాధతో సంధ్య ఆ విషయాన్ని గ్రహించలేదు. ఒక టీచర్ ఆ విషయాన్ని గ్రహించింది. సంధ్య యుక్త వయస్సుకు వచ్చింది.

ఆ టీచర్ వేగంగా హెడ్ మాస్టర్ గారి గదివైపుకు పరుగెత్తి, వారికి విషయాన్ని చెప్పి, వారి రూమ్ కర్టన్ గుడ్డను వూడదీసి, చేత పట్టుకొని వేగంగా సంధ్య వున్న గదికి వచ్చి ఆ గుడ్డను మడత పెట్టి సంధ్య నడుముకు కట్టింది. పిల్లలందరూ ఆశ్చర్యపోయారు. గాలీవాన తగ్గుముఖం పట్టింది. సన్నగా తూర పడుతూ ఉంది. తీవ్రమైన గాలివల్ల చల్లగాలి వీస్తూ ఉంది. తన శరీరంలో కలిగిన మార్పును సంధ్య మేడమ్ విద్యావతి తనకు చుట్టిన గుడ్డను బట్టి గ్రహించింది. ఏడుపొచ్చింది. భోరున ఏడ్చింది సంధ్య. టీచర్, తన అన్న దీపక్ ఆమెకు ధైర్యం చెప్పారు. అయినా సంధ్య ఏడుపు ఆగలేదు. తోటి పిల్లలందరూ వారికి తోచిన రీతిలో నయవచనాలతో సంధ్యను ఓదార్చారు.


"ఆ... ఇక మెల్లగా ఏటి ఒడ్డుకు పదండి. రంగన్న మనకోసం కాచుకొని వుంటాడు" అంది టీచర్ విద్యావతి. 


ఆ వూరి పిల్లలు ఆడ, మగ ఆ టీచరమ్మ నెమ్మతిగా తడి బురదమయంగా వున్న నేలపై చెప్పులు చేత పట్టుకొని నడిచి నది ఒడ్డుకు చేరారు.


వారి రాకకోసం ఎదురు చూస్తూ రంగన్న ఆదరి నుండి ఈ దరికి వచ్చి నిలబడి వున్నాడు. పిల్లల మధ్యన వున్న సంధ్యను చూచి...


"సంధ్యా!.... తొలి బ్యాచ్‍లో నీవు మీ అన్న మరో ఎనిమిది మంది  బోటును ఎక్కండి. దీపక్ ఆ దరికి చేరగానే చెల్లి చేతిని నీ చేతిలోనికి తీసుకొని మెల్లగా నడిపించు. జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళు సరేనా!" సౌమ్యంగా అడిగింది టీచర్ విద్యావతి.


వాన తగ్గుముఖం పట్టగానే చంచయ్య జమ్ముగూడను నెత్తిన వేసుకొని మెల్లగా ఏటి ఒడ్డుకు వచ్చాడు. తనవైపు దరికి వస్తున్న బోటును, అందులో వున్న తన కూతురు సంధ్య, తనయుడు దీపక్ ఇతర పిల్లలను చూచి సంతోషించాడు.


"రంగన్నా!... జాగర్తగా రా!..." బిగ్గరగా అరిచాడు.


రంగన్న బోటును అతి నెమ్మదిగా ముందుకు తెడ్డు వేసి నడుపుతున్నాడు.


ఆ ప్రాంతానికి పైన పడమర పదికిలోమీటర్ల దూరంలో వున్న పెద్ద చెరువు కట్ట వానకు తెగిపోయింది. చెరువులో వున్న నీరు వాగులో ప్రవేశించింది. జోరుగా ఎత్తుగా ముందుకు ప్రవహించసాగింది. మరలా గాలీ, వాన హెచ్చు స్థాయిలో ప్రారంభం అయింది. రంగన్న బోటు ఆ వాగు మధ్యకు చేరింది. దాదాపు రెండు అడుగున ఎత్తున అధికంగా చెరువు నుండి దిగజారిన నీరు బోటును తాకింది. 


బోటులో నీళ్ళు. నీళ్ళల్లో బోటును తెడ్డుతో రంగన్న ముందుకు తరలించలేకపోయాడు. బోటు బోల్తా పడింది. పిల్లలందరూ రంగన్న నీళ్ళలో పడిపోయారు. ప్రవాహ వేగానికి నీటితో పాటు పిల్లలు రంగన్న బోటు ముందుకు వేగంగా కొట్టుకుపోయారు. క్షణాల్లో ఈ విపరీతం జరిగింది. 

పిల్లలకు ఎవరికీ ఈత రాదు. వచ్చిన ఒకరిద్దరు, రంగన్న ఆ ప్రవాహ వేగానికి చేపల వలె ప్రవాహంలో కలిసి ముందుకు కొట్టుకుపోయారు. రెండు మూడు నిముషాల్లో ఆ బోటు, పిల్లలూ ఏమైపోయారో ఆవలి ఒడ్డున వున్న విద్యావతి మిగతా పిల్లలు, ఈ దరిన వున్న చంచయ్య ఏడుస్తూ ఆశ్చర్యంతో వాగు ప్రవాహాన్ని చూడకలిగారే కానీ పిల్లలను రంగన్నను చూడలేకపోయారు. వారందరి వదనాల్లో ఏడుపు, కన్నీరు.


వాగు చెరువు నీటితో పొంగి వరదలా మారి పదకొండు మందిని బలితీసుకుంది. సంధ్య శరీరం నుండి వెలువడిన రక్తం మట్టి నీళ్ళకు ఎరుపు పారాణిని పూసింది. కళ్ళముందు గంగలో కలిసిపోయిన తన కూతురు కొడుకులను తలచుకొని చంచయ్య భోరున ఏడుస్తూ నేలకూలాడు.


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


 
 
 

Comments


bottom of page