top of page

వరాంగి

#పురాణం #ఆధ్యాత్మికం #devotional #TeluguMythologicalStories, #VagumudiLakshmiRaghavaRao, #వాగుమూడిలక్ష్మీరాఘవరావు, #వరాంగి, #Varangi


'Varangi' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 22/10/2024

'వరాంగి' తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


దృషద్వాత దేశమును దృషద్వాత మహారాజు పరి పాలిస్తున్నాడు. దృషద్వతి సరస్వతీ నదుల పుణ్య జల ప్రభావంతో దృషద్వాత దేశము నిరంతరం సస్యశ్యా మలంగా ఉండేది. పవిత్ర పర్వతాల నుండి ఉద్భవించిన దృషద్వతి నదిలో స్నానాలు ఆచరించే 60 వేలమంది వాలఖిల్యులకు తదితర దేవతలకు దృషద్వాత దేశమును సందర్శిస్తేనే, వారి మనసు ప్రశాంతంగా ఉండేది.. 


దృషద్వాత దేశములో సుగంధ వాసనలు ఇచ్చే దృషదులు అనేకం ఉండేవి. ఆ దృషదుల సువాసన సుర లోక సుగంధ సుమ వాసన లకన్నా మిన్నగా ఉండేది. ఆ సువాసనలను ఆస్వాదించడానికి దేవతలు దృషద్వాత దేశమునకు తప్పక వచ్చేవారు. కౌశిక దృషద్వతి సంగమాన స్నానాలు ఆచరించి మరీ దృషద్వాత దేశమునకు వచ్చేవారు. 


 దృషద్వాత దేశమునకు వచ్చిన సురులను, యక్షులను, కిన్నెరులను, కింపురుషులను తదితరులు అందరినీ దృషద్వాత మహారాజు తగిన విధంగా సత్కరించి పంపేవాడు. అలాంటి మహోన్నత దృషద్వాత మహారాజు కు వరాంగి అనే కుమార్తె కలదు. 


ఆమె బుడిబుడి అడుగులు వేసే సమయంలోనే దృషద్వతీ నది దగ్గర ఉన్న యజ్ఞ వేదికల చుట్టూ కిలకిల నవ్వులతో పరుగులు తీసేది. 


వరాంగి చిన్నతనమునుండి దృషద్వతి సరస్వతీ నదులను క్రమం తప్పకుండా పూజించేది. రెండు నదులలో దిగి గొంతు లోతు నీళ్ళలో ఉండి " ఓం విష్ణు దేవాయ, ఓం మహేశ్వరాయ, ఓం బ్రహ్మ దేవాయ నమో నమః" అంటూ త్రిమూర్తులను పూజించేది. దృషద్వతీ నది కి వచ్చిన 60 వేలమంది వాలఖిల్యులను పలురీతులలో స్తుతించేది. 


అలాగే భూమి మీద వంటి కాలి మీద నిలబడి త్రిమూర్తులను ధ్యానించేది. యాగాగ్నులలో నిలబడి త్రిమూర్తులను ధ్యానించేది. వాయు దేవుని వలయంలో నిలబడి త్రిమూర్తులను ధ్యానించేది. తన శరీరమును తేలిక చేసుకుని ఆకాశ వలయాన నిలబడి త్రిమూర్తులను ధ్యానించేది. వాలఖిల్యుల వరప్రసాదాన వరాంగి తనువుకు మహా శక్తి వచ్చిందని అందరూ అనుకునేవారు. 


 వరాంగి ధ్యానాన్ని గమనించిన పంచభూతాలు ఆమె శరీరానికి దేనినైనా తట్టుకునే సామర్థ్యం ను, 

ఆమె తన శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి అంటే అలా ఉంచుకునే శక్తిని ప్రసాదించారు. వరాంగి కొంత కాలం వాలఖిల్యులు లాగా బొటనవేలంత ప్రమాణంలో మారి త్రిమూర్తులను ధ్యానిస్తూ తపస్సు చేసింది. 


 ప్రతిష్టాన పురాన్ని రాజధాని గా చేసుకుని పరిపాలన చేసే ప్రాచీన్వంతునికి అశ్మకికి పుట్టిన సంయాతి యువరాజు సమస్త రాజోచిత విద్యలలో మహా నైపుణ్యం సంపాదించాడు. తల్లి అశ్మకి మాటలను అనుసరించి కొండకోనల సంరక్షణలో ప్రత్యేక శ్రద్దను ఉంచాడు. తన భక్తి శ్రద్ధలతో మహర్షుల బ్రహ్మర్షుల మన్ననలను పొందాడు. 


 ఒకనాడు వశిష్ట మహర్షి అశ్మకి ప్రాచీన్వంతులను కలిసి, "రాజ దంపతులార! మీ తనయుడు మరియు నా ప్రియ శిష్యుడు అయిన సంయాతి సమస్త యతి లక్షణాలతో సంయాతిగ విశిష్ట కీర్తిని ఆర్జిస్తున్నాడు. అంతేగాక కొండకోనల సంరక్షణ లో అతి, అంబల వంటి అసుర రాజులను ఓడించి ప్రజారక్షకుడుగ ప్రఖ్యాతిని ఆర్జించాడు. అలాంటి సంయాతి యువరాజు కు దృషద్వాత మహారాజు కుమార్తె శుభాంగి ని ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.

 

శుభాంగి సామాన్య మగువ కాదు. పంచభూతాలను తన అధీనంలో ఉంచుకున్న మహా మహిళ. అలాంటి మగువ సంయాతి ధర్మపత్ని అయితే అవని మీద అబద్దానికి పుట్టగతులు ఉండవు. అవని మీద అన్యాయం అవాక్కుగా మిగిలిపోతుంది. ఇక మహి పై అబద్దం బద్దకంలో పడి మరణిస్తుంది. " అని అన్నాడు. 


 వశిష్ట మహర్షి మాటలను విన్న రాజ దంపతులు మిక్కిలి సంతోషించారు. వశిష్ట మహర్షి నే పెళ్ళి పెద్దను చేసారు. రాజ దంపతుల విన్నపానుసారం వశిష్ట మహర్షి దృషద్వాత మహారాజు ను కలిసాడు. 


దృషద్వాత మహారాజు సంయాతిని అల్లుడు గా చేసుకోవడానికి మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా తన అంగీకారాన్ని తెలిపాడు. అయితే తన కుమార్తె వరాంగి అభిప్రాయం కూడా తెలుసుకోవాలన్నాడు. 


అంత దృషద్వాత మహారాజు తన కుమార్తె వరాంగి ప్రత్యేక మందిరానికి వెళ్ళాడు. సంయాతి గురించి చెప్పాడు. ముఖ్యంగా సంయాతి మాతృమూర్తి అశ్మకి కొండ కోనలను సంరక్షించే విధానం గురించి క్షుణ్ణంగా చెప్పాడు. అంతేగాక అశ్మకి తమకు దూరపు బంధువు కూడా అవుతుంది అని చెప్పాడు. 


 వరాంగి సంయాతి చిత్ర పటం చూసింది. అనంతరం తన అంగీకారాన్ని తెలిపింది. అలాగే సంయాతి కూడా వరాంగి చిత్ర పటం చూసి, వరాంగి గురించి పెద్దలు చెప్పిందంత విన్న పిదప తన అంగీకారం తెలిపాడు. 


 వశిష్ట మహర్షి ముందుగా మంచి శుభ ముహూర్తాన సంయాతికి పట్టాభిషేకం జరిపించాడు. సంయాతి పట్టాభిషేక మహోత్సవానికి దృషద్వాత మహారాజు తదితరులందరూ హాజరయ్యారు. ఆ వేడుకలకు వరాంగికూడ వచ్చింది. 


 వెయ్యి మంది అంగుష్టాకారులతో అవ్యక్తానంద నృత్యం చేయించింది. అగ్ని గుండాలలో, జల వలయాలలో, వాయు వలయాలలో, భూవలయాలలో, గగన వలయాలలో వివిధ వర్ణాల దేహధారులను ఉంచి నృత్యం చేయించింది. వరాంగి చేయించిన నృత్యాలు అందరిని ఆకర్షించాయి. 


 అటు పిమ్మట వరాంగి సంయాతి ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ మహోత్సవం నకు అనేకమంది రాజులు మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, కొండ జాతి వారు సురులు నరులు నానావిధ కింపురుషాది జాతులవారు హాజరయ్యారు. విందు వినోదాలతో అందరూ సందడి సందడిగా గడిపారు. 


వరాంగి తన భర్త సంయాతి మనసును పరిపూర్ణంగా తెలుసుకుంది. భర్తలోని యతిత్వానికి ఉన్న శక్తిని, పరాక్రమానికి ఉన్న శక్తిని సుపథాన అంచనా వేసింది. భర్త నిమిత్తం తమ నివాస మందిరానికి కూతవేటు దూరంలోనే చక్కని ఆశ్రమం నిర్మింపచేసింది ఆ ఆశ్రమంలో గరుడ గజ తురగ ఖడ్గ త్రిభుజ చతురస్రాది వివిధ ఆకారాలలో యజ్ఞ వేదికల ను నిర్మింపచేసింది. 


ఋషులు, మహర్షులు, రాజర్షులు బ్రహ్మర్షులు అక్కడ అనునిత్యం ఏదో ఒక యజ్ఞం చేసుకునే అవకాశాలు కల్పించింది. ఆ యాగశాలల నడుమ సాధు జంతువులు యథేచ్ఛగా తిరిగే ఏర్పాట్లు చేయించింది. 


 వరాంగి ఖాళీ సమయంలో సాధు జంతువు లయిన జింకలు, కుందేళ్ళ వెనుక పరుగులు తీసేది. సంయాతి మహారాజు ధర్మపత్ని ఆటపాటలను చూసి మురిసిపోయేవాడు. 


 సంయాతి మహారాజు తన దగ్గరకు ధర్మం కోసం వచ్చిన వారిని వరాంగి ముందు నిలబెట్టేవాడు. వరాంగి ధర్మం కోసం వచ్చిన వారిని ముందు యథేచ్ఛగా మాట్లాడనిచ్చేది. వారి మాటలను అనుసరించి తీర్పు చెప్పేది. తీర్పు చెప్పడం కొంచం కష్టం అనుకున్నప్పుడు పంచభూతాల సహాయం తీసుకునేది. ఆపై పంచభూతాల సాక్ష్యం తో ధర్మం చెప్పేది. 


దానితో ప్రజలు అధర్మం చేయడానికి భయపడేవారు. అబద్దాలు చెప్పాలంటే గజగజ వణికిపోయేవారు. ఎప్పుడన్నా పరుల మాయలో పడి అసత్యం చెబితే మహారాణి వరాంగి ముందు తమ ప్రాణాలు పోతాయనే అనుకునేవారు. 

 ఒకనాడు యమధర్మరాజు మారువేషంలో వరాంగి తీర్పు చెప్పే ప్రాంతానికి వచ్చాడు. యమధర్మ రాజును చిత్ర గుప్తుడు అనుసరించాడు. 


 వరాంగి న్యాయం కోసం వచ్చిన భార్య భర్తల మాటలను వింది. అనంతరం "మీలో ఎవరిది న్యాయ మార్గం?" అని వారినే అడిగింది. 


భర్త, "నాదే న్యాయం న్యాయం న్యాయం ముమ్మాటికీ న్యాయం నేను వేరు కాపురం పెట్టడం ముమ్మాటికీ న్యాయం " అని తనను తాను సమర్థించుకున్నాడు. 


భార్య "నాదే న్యాయం. ఇంత కాలం నేనింత న్యాయంగా ఉండటానికి నా భర్తే కారణం. అయితే నా భర్త ధన వ్యామోహం లో పడి నా అత్త మామలు మంచివారు కారని అబద్దాలు చెప్పమంటున్నాడు. " అని అంది.

 

 భార్యాభర్తల మాటలను విన్న వరాంగి కొద్ది సేపు ఆలోచించింది. అంత వరాంగి "మీలో ఎవరు నిజం చెబుతున్నారో పంచభూతాలే నిర్ణయిస్తాయి. "అని పంచభూతాలను ఆశ్రయించింది. 


తనని తాను అతిగా సమర్థించుకున్న భర్తని అగ్ని దేవుడు వెంటనే చుట్టు ముట్టాడు. వెంటనే అతగాడు తనదే తప్పని పెద్దగా అరిచాడు. తన తప్పుకు శిక్ష గా వెయ్యి మందికి అన్నదానం చేస్తాను. వెయ్యి మంది విద్యార్థులకు విద్యాదానం చేయిస్తాను. వెయ్యి మంది ముత్తైదువు లకు పసుపు కుంకుమలు దానం చేస్తాను. వందమంది వృద్దులకు సంవత్సరం పాటు అన్నదానాదులు చేస్తాను. ". అని అతగాడు పెద్దగా అరిచి చెప్పిన పిమ్మట అగ్ని దేవుడు శాంతించాడు. 


అలాగే మరో భార్యాభర్తల విషయంలో జల దేవత భార్యని శిక్షించింది. వరాంగికి పంచభూతాలు వశమైన తీరు చూసి యమ ధర్మరాజు మిక్కిలి సంతోషించాడు. 


 క్రిమి అనే అసుర రాజు సంయాతి మీద యుద్దం ప్రకటించాడు. అప్పుడు వరాంగి వాలఖిల్యులులాంటి లక్ష మంది సైనికులను క్రిమి మీదకు పంపింది. వారి చిత్ర విచిత్ర విన్యాస సమరం ముందు క్రిమి అసుర శక్తులన్నీ నశించాయి. క్రిమి యమపురికి చేరుకున్నాడు. సంయాతి మహారాజు ను విజయం వరించింది. 


ఆ సందర్భంగా సంయాతి మహారాజు తన ధర్మపత్ని వరాంగిని పలు రీతుల్లో సన్మానించాడు. కొంత కాలం తర్వాత వరాంగి పండంటి మగ శిశువు కు జన్మనిచ్చింది. ఆ శిశువుకు వశిష్టాది మహర్షులు అహంయాతి అని పేరు పెట్టారు. 


శుభం భూయాత్ 


వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు








43 views0 comments

Comments


bottom of page