top of page

వారసుడు


'Varasudu' - New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla

'వారసుడు' తెలుగు కథ

రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

కోడి కూతకంటే ముందే లేవడం అలవాటు పల్లెటూరు జనాలకు. అందులో కూలినాలి చేసుకునే బడుగు జీవులకు తెల్లవారితేనే గానీ డొక్కాడదు మరి.


"నూకాలు ..ఏందే నువ్వు నిద్దరోవు నన్ను నిద్దరోనివ్వవు, ఏంటోనే ఈ మద్దెల నువ్వు మరీ చాందసం చేస్తున్నావనిపిస్తుంది, లోకంమీద ఎవ్వరికి పిల్లలే పుట్టరన్నట్టు, నీవొక్కదానికే పేగు తెంచుకుని పుట్టినట్టు చేస్తున్నావు, అసలేమయిందే నీకు.. కోడి కూయనన్నా కూయలేదు ఇంత పొద్దుగాలనే లేపి కూకోపెట్టావు,"


చాలని నిద్రమత్తులో కళ్ళు నులుముకుంటూ అడిగాడు నూకాలు మొగుడు చెంగయ్య.


"ఉష్ గట్టిగా అరవకయ్యా పిల్లాడు జడుసుకుంటాడు, కూసింత మెల్లిగా మాటాడితే నీ సొమ్మేం పోయింది," చిన్నగా గదమాయించింది నూకాలు మొగుణ్ణి.


"నీయవ్వ నిద్దరలేపింది చాలక నన్నే గదమాయిస్తన్నవేందే, ఏమైందో బిరాన చెప్పవే. ఇంకో కునుకన్న పోతాను," విసుక్కుంటూ ముసుగు తన్నిపడుకున్నాడు చెంగయ్య.


"ఏం మొగుడివయ్యా .. ఇయ్యాల పొద్దుపొడవక ముందే లేచి మీ చెల్లె తానికి పోతా అన్నావా లేదా? చెల్లెను సూడబుద్దయితుంది నువ్వు రాయే నూకాలు అంటివి, నా కొడుకు యాడాది నిండేదాక యాడికి రాను అంటిని, నువ్వురాకుంటే మానాయే నేనే పోతను అన్నోడివి ఇంకా ముసుగుతన్ని పటుకుంటున్నవేంది, నువ్వెల్లి పోయాక నేను తానం చెయ్యాలంటే నా కొడుకును యారు చూస్తారు, నువ్వు బేగిలేచి ఆడిమీద చెయ్యేసి పట్టుకో,

నేను బిరాన తానం చేసొస్తా," కోపంతో చెంగయ్య కప్పుకున్న దుప్పటి లాగేసింది నూకాలు.


ఏం చెయ్యలేక లేచి కూర్చున్నాడు చెంగయ్య కొడుకుమీద చెయ్యివేసుకుని.


“ఓరేయ్ అబ్బి .. మీ అమ్మ సూడరా నీమీద పిచ్చి ప్రేమ పెట్టుకుంది, లోకంమీద ఎవ్వరికి పిల్లలే పుట్టనంతగా ఇదయిపోతుంది. ఆ తెలిసిందిలే ఇంత ముద్దొచ్చే నీకు దిష్టి కొడుతుందని దాని బాధ, నిన్ను చూస్తే ఏ పెద్దొల్ల ఇంట్లో పుట్టేటోడిలా ఉంటివి. అందుకే బిడ్డా మీ అమ్మకు భయమేస్తాంది," అంటూ చిదిమి రక్తం వచ్చేలా తెల్లటి తెలుపులో మెరిసిపోతూ నిండుగా దబ్బపండులా ఉన్న కొడుకును చూసి మురిసిపోయాడు చెంగయ్య.


ఇలా వెళ్ళి అలా వచ్చింది నూకాలు స్నానంచేసి."మావా.. నువ్వు మీ చెల్లె ఊరికాడినుండి సందెపొద్దు కాకముందే బయలుదేరు, చీకటైతే నేను బుడ్డోడు ఇద్దరమే

ఉండాలి. చీకటైతే నాకు బుగులుగా ఉంటదయ్యా, జర బిరానా రా మావా.. రాత్రికి నీకిష్టమైన

చేపల పులుసు చేస్తా," అంది ఊరిస్తున్నట్టు.


"అట్టాగే లేవే.. ఇంకా నేను పోనన్న లేదు, అప్పుడు బెంగపడుతున్నవు ఇట్టా అయితే ఎట్లనే నూకాలు, నీకు ఈ బిడ్డపుట్టిన కాడి నుంచి ఇట్టా తయారయినావు,

ఇలా మంచిదే కాదే మనకు.. గుడెసెలల్ల ఉండెటోల్లం ధైర్యంగా ఉండాల, సరే నువ్వు అన్నట్టుగానే పొద్దు గూట్లో పెట్టకమునుపే నీ గుడిసెకాడ ఉంటా," భార్యకు ధైర్యం చెబుతూ రాత్రికి తినబోయే చేపలపులుసు నెమరువేసుకుంటూ వెళ్ళిపోయాడు చెంగయ్య.


"ఏమే నూకాలు .. పొద్దుగాలనుండి చూస్తున్న తలపుతీస్తలేవేంది, నా కొడుకు పొలంకాడికి

పొయినాడా? నీ బుడ్డోడు లేచిండానే," అడిగింది పక్క గుడిసేలో ఉన్న ఎనభై ఏళ్ళ పోచమ్మ.


ఇదొకతి ఎప్పుడు చూసినా ఇవతలోల్ల ఇంటిమీదనే కళ్ళు. ఇంట్లో కోడలిని రాచిరంపాన పెడుతుంది. మందిమీద ఎక్కళ్ళేని పేమ ఒలకబోస్తది. మనసులోనే తిట్టుకుంటూ పైకి

మాత్రం. "రా అత్త .. మీ కొడుకు చెల్లెను సూడబుద్దవుతుందని ఊరికిపోయినాడు, బుడ్డోడు పడుకుండిపోయినాడని తలుపు తీసుండలేదు, ఏంగావాలత్తా ఏమన్న పని మీద ఒచ్చినావా," తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అడిగింది.


"ఆ ఏముంది గనుక నాకు పని పాట లేనిదాన్నాయే, కూసింతసేపు దొరబాబులా ఉన్న నీ బుడ్డోడిని సూసిపోతాని ఒచ్చినా, ఎంత ముద్దొస్తున్నడే సూడటానికి ఏ దొరబాబొ అనుకుంటున్నరు మన గుడిసెలోల్లు, ఒసేయ్ నూకాలు.. అందరు ఈ బుడ్డోడు నీకు ఎట్లా పుట్టిండాని అనుకుంటున్నరు, నిన్ను సూస్తే నల్లగా పొట్టిగా ఉంటివాయే, పోని నీ మొగడన్న మంచిగున్నడంటే ఆడిప్పుడే ముసలోడిలాగా అయిపోయిండు, మరి ఇంత మంచిగున్నడో నీ కడుపుల ఎట్టా పుట్టిండని అందరు ఇడ్డూరంగా అంటున్నరు," అంటించవలసినవి అన్ని అంటించి మెల్లెగా జారుకుంది పోచమ్మ.


ఓలమ్మో ఓలమ్మో నేనుకున్నంత అయింది. నా బుడ్డోడిమీద అడ్డమైన కళ్ళు పడినాయే. నేను మొత్తుకుంటూనే ఉన్న దేవుడా. నర దిష్టి పడింది నా బిడ్డమీద ఇప్పడేం సెయ్యాల దేవుడా అంటూ కంటికి ధారగా ఏడవసాగింది. కొడుకును పొత్తిళ్ళలో దాచుకుంది ప్రేమతో.


"నూకాలు .. ఏంటయిందే నేనొచ్చినకాడి నుండి నిన్నే సూత్తున్న ఏటయందొ నువ్వు సెప్పంది నాకెట్టా తెలుద్దే, ఒల్లు బాగా లేదానాయే? బుడ్డోడు సతాయిస్తుండా సెప్పవే," నూకాలు దగ్గర కూర్చొని చుబుకం పట్టుకుని బ్రతిమాలాడు చెంగయ్య.


"మావా.. ఏం సెప్పమంటావు? నేననుకున్నది అయింది మావా, ఈ గుడిసేలోల్ల సూపు మన బిడ్డమీద పడింది, ఈడు మనకు పుట్టెటోడు కాదంట ఇంతమంచిగున్నడు ఏ దొరబాబు ఇంట్ల పుట్టాలి," అంటూ ఉదయం పోచమ్మ వచ్చి అన్నమాటలన్ని చెప్పి బోరు బోరుమని ఏడుపు లంకించుకుంది.


నూకాలును చూస్తుంటే చెంగయ్య మనసు ద్రవించిపోతుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డమీద ఇంత మమకారం పెట్టుకుంది. రేపు ఈ బిడ్డకు ఏమన్న జరిగితే నూకాలు ప్రాణాలతో ఉండగలదా? ఏం చెయ్యాలో ఎటు తేల్చుకోలేకపోతున్నాడు చెంగయ్య.


"ఓసే నూకాలు .. గిట్లకాదుగాని నన్నేం చెయ్యమంటావో చెప్పు, నీ కోసమని ఏమన్న చేస్త నువ్వు మంచిగుంటే నా బిడ్డకు నాకు ముఖం తెల్లగుంటది, లేకపోతే మాకు దిక్కెవరుంటారు," బాధపడుతూ అడిగాడు.


"గదికాదు మావా.. మనం ఈడనే ఉంటే నలుగురి కళ్ళు మనోడిమీదనే ఉంటయి, ఆణ్ణి ఎన్ని రోజులని ఇంట్లోనే కూచొపెడతాను, కొంచమన్న గాలి తగిలితే మన బిడ్డకు మంచిగ పెరుగుతడు, ఈ ముదనష్టపోళ్ళకేమో మన బిడ్డను చూసి ఓర్పమానం పెట్టుకున్నరు, గిట్లకాదుగాని మావా.. మనం ఇంకేడికన్న పోయి ఇదే కూలి చేసుకుని బతుకుదం, తిన్న తిండన్న ఒంటికి పడతది బిడ్డకు," కొడుకును ముద్దాడుతూ చెప్పింది.


"సరే గట్లనే పోదాం గానీ.. నూకాలు.. మనం గిట్ల అందరికి భయపడి పారి పోతంటే మనం ఎట్ల బతుకతమే, ఏడికిపోయినా ఇట్టాంటి జనమే ఉంటరు కదా! అయినా నాకు తెలియక అడుగుతున్న నూకాలు, మన బిడ్డను చూసి ఆళ్ళందరు మురిసిపోతన్నరు గదే,


కొన్ని రోజులైతే ఇది మాములైపోతది గప్పుడు ఆళ్ళు రమ్మన్నారారు, జరంత ఓపిక పట్టుకోవే," మామూలుగానే చేబుతూ ఉన్న పరిస్థితి చెప్పాడు.


"ఏమో మావా నాకదేం తెలిదు నేను చచ్చినా ఈడుండను, నువ్వు కావలిసొస్తే ఈడనే ఉండు, నేను నా బిడ్డను తీసుకుని మా యమ్మతానికి పోతా," అంది బెదిరిస్తూ.


"సరెతియ్యే నీ మాటింటాను.. ఏడికి పోదామో గది కూడా నువ్వే చెప్పరాదే," అడిగాడు.


అనుకున్నట్టుగానే చుట్టు పక్కల ఉన్నవాళ్ళెవరికి చెప్పకుండానే తెల్లారేసరికి. నూకాలు ఇంతకు ముందు డాక్టరు దగ్గర పని చేసిన చోటుకు వెళ్ళిపోయారు. నూకాలు అక్క కూడా అక్కడనే ఉంటుంది. నూకాలు బావ తనకు తెలిసిన వాళ్ళ దగ్గర వాచ్ మెన్ పని ఇప్పించాడు. హాయిగానే గడుస్తుంది కానీ, నూకాలుకు తన బిడ్డమీద ఉన్న బెంగమాత్రం పోవడంలేదు. ఎక్కడికి వెళ్ళినా నర దిష్టి తగులుతుందనే అనుమానం. ఎవ్వరు పసిబిడ్డను చూసినా ఎవరి బిడ్డ అని అడగడమే. నూకాలు మనసంతా గందరగోళంగా ఉంది.


“పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా" అన్నట్టుంది నూకాలు పరిస్తితి. మనిషంతా సన్నగా అయిపోయింది కొడుకుమీద బెంగతో. బిడ్డ మాత్రం ముద్దొస్తూ బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. చెంగయ్యకు ఏం చెయ్యాలో నూకాలును ఎలా మాములు మనిషిని చెయ్యాలో ఎంత ఆలోచించినా అర్ధంకావడం లేదు.


"నూకాలు.. ఓసారి నీకు పురుడు పోసిన డాక్టరమ్మ తానకు పోదాం రారాదే, బలంకు మంచి మందులిస్తది నువ్వు గిట్లా బేజారైతే చిన్నోడిని ఎవరు చూసుకుంటరు, నా మాటిని బిడ్డను ఓమారు డాక్టరమ్మకు చూపుదాము లే లేచి కూసింత బలం తెచ్చుకో," అంటూ బలవంతం చేసి హాస్పిటల్ కు తీసుకపోయాడు.


హాస్పిటల్‌లో నూకాలును చూస్తూ, చెంగయ్య చేతిలో ఉన్న బాబును ఎత్తుకుని ముద్దాడింది డాక్టర్ నందిని.


"ఏరా చిట్టికన్నా .. ఇన్నాళ్ళకు గుర్తుకువచ్చానా నేను,"ఒళ్ళంతా ముద్దులతో ముంచేసింది పిల్లాడిని. సంతోషంతో చూడసాగారు చెంగయ్య నూకాలు డాక్టరమ్మను.


"చెంగయ్యా.. నీ భార్యేమిటి అలా అయిపోయింది? ఒంట్లో బాగుండడం లేదా? పిల్లాడు పుట్టినప్పుడు బాగానే ఉంది కదా! ఏమ్మా నూకాలు ఏంటి సంగతి పిల్లవాడికి పాలు ఇస్తున్నావా," అడిగింది డాక్టర్ నూకాలును.


"ఏం చెప్పాలే డాక్టరమ్మా.. మా ఆడది బిడ్డ గురించి రంధి పెట్టుకుంది, తన బిడ్డకు దిష్టయితుండాదని గుడిసెలోనుంచి ఇవలికి రాదు, బిడ్డను ఎవరు చూడనియకుండా గుడెసెలోనే ఉంచుతాంది, గట్లయితే బిడ్డకు చల్లగాలి సోకదు ఎండపొడ అసలే తగలదు," అంటూ నూకాలు ఎలా బాధపడుతుంది అంతా చెప్పుకొచ్చాడు చెంగయ్య.


"ఓహో అదా సంగతి .. నూకాలు నువ్వు చాలా ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు, నువ్వు మంచిగా తిని ఆరోగ్యంగా ఉంటేనే కదా! బాబు బాగుంటాడు, లోకంలో ఏది మంచి జరిగినా చెడు జరిగినా పట్టించుకునే మనుషుల గురించి ఆలోచించి మనసు పాడుచేసుకుంటే మనమే నష్టపోతాం నూకాలు, ఏదైనా చూసి చూడనట్టుగా ఉంటే ఈ ప్రపంచంలో బ్రతుకగలము, ఇలారా నిన్ను పరీక్ష చేస్తాను," అంది డాక్టర్ నందిని.


‘పిచ్చి నూకాలు.. గంజాయి వనంలో తులసి మొక్కలా ఉన్న నీ కొడుకును చూస్తే ఎవ్వరికైనా అనుమానం రాకుండా ఉంటుందా చెప్పు, నా కొడుకు చేసిన మోసానికి నువ్వు తల్లివయ్యావు, నలుగురిలో తలెత్తుకోలేను కనుక నీకు పుట్టిన నా మనవడిని నా చేతులారా దూరం చేసుకోకతప్పలేదు. వాడిని చూస్తుంటే నా మనసంతా తరుక్కుపోతుంది.


వాడెక్కడున్నా బాగుంటేచాలు. ఇటు నూకాలు పుట్టిన నా మనవడిని దూరంచేసుకున్నానన్న బాధ నన్ను దహించివేస్తుంది. అటు ఒక నిరుపేదకు చేసిన మోసానికి నా కొడుకుకు శిక్ష వేసాడు ఆ దేవుడు. యాక్సిడెంట్ లో వాడి ప్రాణాలు పోయాయి. చిన్నప్పుడే తండ్రిపోవడంతో గారాబంగా పెంచుకున్నాను. ఇప్పుడు నేను ఒంటరినైనాను. ఇక నుండి నిన్ను మళ్ళీ పనిలో పెట్టుకుని వాడి బాగోగులు చూసుకుంటాను నూకాలు. అలాగని వాడిని నీకు దూరం చెయ్యను’


మనసులో బాధపడుతూ అనుకుంది డాక్టర్ నందిని.


"అమ్మా ఏటాలోచిస్తున్నారు.. నూకాలుకు ఏమైనాది నాకు పరేషాను అయితుందమ్మ, దానికి బలానికి మంచి టానికులు రాసియ్యమ్మ” కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ అడిగాడు చెంగయ్య.


"అరే అదేమిటి చెంగయ్య.. ఇప్పుడు నూకాలుకు ఏమైందని ఏడుస్తున్నావు? నూకాలుకు పెద్ద జబ్బేమి లేదు, తనకు తన బిడ్డ చక్కగా ఉన్నాడు ఎవరు చూసినా ఏదో ఒకటి అనడంతో మానసికంగా బాధపడుతుంది, ఎవరైన ఈ బిడ్డ తన బిడ్డ కాదంటారేమోనని తననుండి బిడ్డను తీసుకవెళతారేమోనని భయం, అందుకే ఎవ్వరు బిడ్డను చూడడానికి వచ్చినా అదే భయం.


ఎందుకంటే ఆ బిడ్డలో మీ ఇద్దరి పోలికలు లేవు, బిడ్డను ఎక్కడనుండైనా ఎత్తకవచ్చారేమోనని అనుమానపడతారు కదా! అందుకే నూకాలు భయం ఎక్కవయింది, ఇదిగో ఇందాక గట్టిగా అడిగితే ఇవన్ని చెప్పింది," నూకాలుతో తను మాట్లాడిన విషయం చెంగయ్యతో చెప్పింది డాక్టర్ నందిని.


"డాక్టరమ్మా .. నాకు మదిలో తికమకగానే ఉండాది, గింతమంచిగున్నోడు ఏ దొరబాబు ఇంట్లోనో పుట్టాలి, తినడానికి గుక్కెడు మెతుకులకు కష్టపడుతున్న మా పేదోల్లకు పుడితే ఏం సుఖం ఉంటాది, రేపు రేపు ఆ బిడ్డను బడికి పంపియ్యాలి ఆడ గూడా మీ అమ్మ మీ అబ్బ ఎవరు అని అడుగుతారు, మేము మా బిడ్డ సారు అంటే ఆళ్ళు నమ్ముతర డాక్టరమ్మ, ఈ బిడ్డ అసలు మా నూకాలు పుట్టిండా? ఎవరి బిడ్డనో తెచ్చి మా నూకాలు పక్కన పడుకోబెట్టిండ్రా," చెప్పడం ఆపాడు చెంగయ్య.


భయంతో చెంగయ్య వైపు చూసింది డాక్టర్ నందిని.


“చెంగయ్య .. నీకా అనుమానం ఎందుకు వచ్చింది, అందంగా బిడ్డ పుట్టడం కూడా తప్పేనా? ఏమో ఆ దేవుడికి మీకు అందమైన బిడ్డను ఇవ్వాలనుకున్నాడేమో ఎవరికి తెలుసు, అయినా ముద్దొచ్చే పిల్లాడిని చూసి మురిసిపోకుండా ఈ చాదస్తాలేంటి చెంగయ్య," అంది చీవాట్లు పెడుతూ.


"అట్టాకాదు డాక్టరమ్మ.. నామదిలో నూకాలుమీద నమ్మకంగా ఉండాది కానీ?..’ అంటూ చెప్పడం ఆపాడు.


"ఆ ఏంటి చెంగయ్య చెప్పడం ఆపావు," అడిగింది నందిని. నిజం తెలిస్తే ఎక్కడ నూకాలును వదిలేస్తాడోనని భయం.


"అదేనమ్మ నూకాలుకు పుట్టిన బిడ్డ ఎట్టాంటిదైన నేను ఒప్పుకుంటాను, దానికి ఆ బిడ్డంటే పంచపాణాలు పెట్టుకుంది, కానీ అమ్మ నా నూకాలు మంచిగుండాలే అదంటే నాకు పాణం, దానికేమన్న అయితే నేను పాణాలతో ఉండను," అంటూ రెండు చేతుల్లో ముఖం దాచుకున్నాడు.


"చెంగయ్య .. ఇంతప్రేమ ఉందికదా నూకాలు మీద, మరి ఎందుకు అనుమానపడుతున్నావు? ఒకవేళ తెలిసో తెలియకనో నూకాలు తప్పు చేసిందనుకుందాము, నువ్వు వదిలేస్తావా గుండెల్లో దాచుకుంటావా," అడిగింది.


"ఎంతమాటన్నరు డాక్టరమ్మ.. నూకాలంటేనే నా గుండెకాయసుమంటిది, దాన్ని అనుమానిస్తానా లేదు అది ఎంతపెద్ద తప్పు చేసినా .. దాన్నీ పల్లెత్తు మాటనను, ఎందకంటే దాన్ని మనువాడినాకనే నాకు తినడానికి ఇంత ముద్ద నోటికాడికి అస్తుంది, అదే రాకపోతే నేను గాలికి తిరగటోన్ని నాకు దిక్కెవ్వరు లేరు డాక్టరమ్మ," ప్రేమంతా భార్యమీద ఒలకబోస్తూ చెప్పాడు.


ఇంతప్రేమ ఉన్నవాడు నిజం తెలిసినా బాధపడడు. నా కొడుకు చేసిన వెధవపనికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే వాడి ఆత్మకు శాంతి దొరుకుతుంది. కనీసం నా మనవడిని నా కళ్ళముందు పెరగాలంటే చెంగయ్య దంపతులు ఇక్కడే ఉండిపోవాలి.


వాళ్ళు ఇక్కడే ఉండాలంటే ఒకటి నూకాలుకు నిజం తెలియనివ్వకుండా చెంగయ్యకు తన కొడుకు చేసిన తప్పుడు పని చెప్పాలి. రెండవది నాకున్న ఆస్తి నా తదనంతరం నా మనవడికి చెందేలా వీలునామా రాసివ్వడం. ఒకవేళ చెంగయ్య గానీ నూకాలుగాని గొడవపడినా తప్పుచేసిన నా కొడుకేలేడు కనుక ఏమి అవదు అని అనుకుంటున్న. మనసులో గట్టి నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది డాక్టర్ నందిని మనసు.


రెండురోజులు హాస్పిటల్‌లో ఉంది నూకాలు."చెంగయ్య నీతో మాట్లాడాలి ఇలా వస్తావా," అడిగింది డాక్టర్ నందిని.


"ఏటైందమ్మ నూకాలుకు మంచిగైతది కదా," ఆదుర్దాగా అడిగాడు చెంగయ్య.


"నూకాలు ఇప్పుడు బాగుంది చెంగయ్య, కాకపోతే నేనొక విషయం చెబుతాను విను, నువ్వు నేను చెప్పినట్టుగా వింటాను అంటేనే చెబుతాను, నేను బ్రతికి ఉన్నంతవరకు నాకు నీ కొడుకును దూరం చెయ్యనని మాటివ్వు, అంతేకాదు నూకాలును కూడా నీ జీవింతాంత విడిచిపెట్టి వెళ్ళనని మాటివ్వు," చెయ్యి చాపి అడిగింది.


"ఏటోనమ్మ మీరేం అంటున్నరో నా మట్టి బుర్ర ఒక్కముక్క కూడా సమజయతలేదు,"


"ముందు నువ్వు నాకు మాటివ్వు అర్థమయ్యేలా చెబుతాను," అంది.


"అట్టాగే డాక్టరమ్మ.. మీలాంటి పున్నాత్ములు చెప్పినంక అట్టంటి పని ఎందుకని చేస్తా, మీరెట్లంటే గట్లనే," అంటూ డాక్టరమ్మ చేతిలో చెయ్యి వేసాడు. తృప్తిగా చూసింది

చెంగయ్యను.


"చెంగయ్య.. నాకు నా అనేవాళ్ళులేరు, ఉన్న ఒక్కకొడుకు యాక్సిడెంట్ లో పోయాడు, ఇంత ఆస్తి ఉంది ఏం చెయ్యాలో అర్ధంకాలేదు, సరిగ్గా అదే సమయంలో నూకాలును బాబును తీసుకొని నువ్వు వచ్చావు, మిమ్మల్ని చూడగానే నా సమస్యకు పరిష్కారం దొరికింది, నీ దగ్గర పెరుగుతున్న ఆ పసికందుకు తండ్రి నా కొడుకు, వాడు ఈ ఇంటి వారసుడు చెంగయ్య,


నూకాలు మా ఇంట్లో పని చేస్తున్నప్పుడు నేను ఇంట్లోలేని సమయంలో టీలో మత్తుమందు కలిపి నూకాలు చేత తాగించి తన కోర్కే తీర్చుకున్నాడు నా కొడుకు, ఈ విషయం నూకాలుకు తెలియదు, నేను ఇంటికి వచ్చేసరికి మత్తులో ఉంది.


జరిగిన విషయం తెలుసుకుని నా కొడుకును చెడామడా తిట్టాను, పాపం ఏమి తెలియని నూకాలు గర్భవతి అయింది నా కొడుకు చేసిన తప్పువల్ల, పిల్లలే పుట్టరనుకున్న నూకాలు గర్భవతి కావడం మీ ఇద్దరికి పట్టరాని సంతోషంగా ఉన్నారు, నూకాలు ఇక్కడే ఉంటే మళ్ళి నా కొడుకు దాని వెంటపడతాడు, దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తనే తండ్రి అని తెలిస్తే నా పరువు ప్రతిష్టలకు ఎక్కడ భంగం వాటిల్లుతుందోనని మిమ్మల్ని నా ఇంటినుండి పంపించాను.


నూకాలు పురుడు కోసమని నా దగ్గరకే వచ్చావు, పుట్టిన పసికందును చూస్తే యాక్సిడెంట్ లో చనిపోయినా నా కొడుకును చూస్తున్నట్టే అనిపించింది, కానీ! నా మనవడిగా నా మనసు ఒప్పుకోలేదు, మీరు వెళ్ళిపోయారు.


ఎక్కడున్నారో అన్న ఆలోచననే రాలేదు, ఇదిగో ఇప్పుడు మళ్ళి మీరు రావడం ఆ దేవుడే నా కోసం పంపించాడనుకుంటున్నాను, చెంగయ్య ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి లేదు, కాలమే సరియైనా తీర్పు చెప్పిందనిపిస్తుంది ఏమంటావు"అడిగింది డాక్టర్ నందిని.


"డాక్టరమ్మ.. మీరు ఎంతమదనపడుతున్నరో నాకు తెలుస్తుంది, అయిపొయినదానికి వగచెదేముంది, తప్పుడు పని చేసిన మీ కొడుకులేడు, పిల్లలు లేరని బెంగటిల్లిన నూకాలుకు ముద్దులు మూటకట్టే బిడ్డ వొచ్చిండు, అది గంత సంతోషంగ ఉంటే గిప్పుడు గిది చెప్పి దాని మనసుకు కష్టం కలిగిస్తే అది పాణాలతో ఉండదు, నాకు నూకాలు కావాలి, దానికి బిడ్డ కావాలి, మీకు మీ మనవడు కావాలి గివన్ని కావాలంటే గా తప్పుడుపని మాటెత్తొద్దు గంతెకదమ్మ, మీరెట్టంటే అట్టాగే డాక్టరమ్మ," రెండుచేతులు జోడించి చెప్పాడు.


"చెంగయ్య.. నా వారసుడు నా ఇంట్లో తిరుగుతుంటే నాకెంత ఆనందంగా ఉంటుందో, ఇక నుండి మనందరం కలిసే ఉందాం సరేనా," అడిగింది డాక్టర్ నందిని.


సంతోషంతో తల ఊపాడు చెంగయ్య.


****** ******* ******* ******* ******

లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.














































4 Comments


@swapnaj8931 • 1 day ago

Chaala bagundi attayya

Like

@lakshmiitrigulla5835 • 16 hours ago

Thank you Venkat

Like

@venkateshetukapally1976 • 16 hours ago

Chala bagundi

Like

@sreevanth.m4841 • 9 hours ago

Changaiah niryayam chala bagunnadi. Story chala bagunnadi. Thankyou Lakshmi garu

Like
bottom of page