'Varudhini' New Telugu Story
Written By Veluri Prameela Sarma
రచన: వేలూరి ప్రమీలాశర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ట్రైన్ కదలడానికి ఇంక రెండు నిముషాలు మాత్రమే సమయముందనగా, రొప్పుతూ బోగీలోకి ఎక్కింది పాతిక సంవత్సరాల ఆ జవ్వని. నిమ్మపండు రంగు మేని ఛాయపై పసిడి అందం వెలవెలబోతోంది. నిగనిగలాడే నల్లని ఒత్తైన కురులు, గాలికి చెల్లాచెదురై భుజాలమీదుగా ఊయల లూగుతున్నాయి. ముడిపడిన ఆమె భ్రుకుటి, మన్మథుడు వలపు బాణాలు సంధించడానికి వంచిన విల్లును తలపిస్తున్నాయి. లేడి కళ్ళలాంటి చురుకైన ఆమె కళ్ళలో చిన్న బెరుకు.. ఆ వెంటనే తాను వెతుకుతున్నది కనిపించిన ఆనందంతో ఆ కళ్ళలో చిన్న మెరుపు. చూపుడువేలితో బెర్తు నంబర్లు వెతుకుతూ, మధ్య కూపే దగ్గర ఆగిన ఆమె, లగజ్ ని తనకు కేటాయించబడిన బెర్తు కిందకి తోసింది. అలసటకు నుదుటిపై పట్టిన స్వేదం, ముత్యపు చినుకై మెడ ఒంపులోకి జారింది.
"ఎక్స్ క్యూజ్ మీ! మీ కాళ్ళు కొంచెం వెనక్కి తీసుకుంటారా?" ఎదురుగా ఉన్న బెర్తుపై కూర్చున్న వ్యక్తి, వాలుగా తన సీటు కిందకి చాచిన కాళ్ళను తియ్యమన్నట్టు అభ్యర్ధించింది.
"ఓహ్! సారీ!" అంటూ కాళ్ళు వెనక్కి తీసుకుని, తిరిగి ఒడిలో పెట్టుకున్న ల్యాప్ టాప్ పై వర్కు చేసుకోవడంలో మునిగిపోయాడు ఆ వ్యక్తి.
కిటికీ పక్కగా ఒదిగి కూర్చున్న ఆమె, ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోంది. చల్లగా వీస్తున్న గాలికి, మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఒక్క కుదుపుతో ట్రైను ఆగేసరికి ఉలిక్కిపడి లేచి, సర్దుకుని కూచుంది. అప్పుడు చూసింది.. ఎదురుగా కూచున్న అతని వైపు. పూర్తిగా నిమగ్నమై పని చేసుకుంటున్న అతను, చుట్టూ పరిసరాలను గమనించే స్థితిలో లేడు.
పైనుంచి కిందవరకూ అతడినే పరిశీలనగా చూస్తున్న ఆమె, ఒకింత సంభ్రమానికి గురయ్యింది. అంతవరకూ మగవారిలో అంత అందంగా ఉన్నవారిని చూసి ఎరుగని ఆమె, రెప్ప వెయ్యకుండా అతడి వైపే చూస్తోంది. ఒత్తుగా పైకి దువ్విన క్రాఫు, సూదిగా మొనతేలిన ముక్కు, ఎర్రటి పెదవులపైకి సగం వరకూ కప్పినట్టు గుబురుగా పెరిగిన మీసకట్టు, నీట్ షేవ్ లో ఉన్న గెడ్డం, శంఖుపూల వలే ముచ్చటగా ఉన్న చెవులూ.. దర్పానికి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు ఉంది అతని కనుముక్కు తీరు.
మరులు రేకెత్తించే విశాలమైన ఛాతీపై గాలికి కదులుతున్న రింగు రింగుల జుత్తూ మనసులో అలజడి రేపుతుంటే.. నిగ్రహించుకోలేక గబుక్కున ముఖం పక్కకి తిప్పుకుంది. ఊ.. హూ! ఆమె వల్ల కాలేదు. 'ఎన్నడూ లేనిది ఎందుకింత పరితపిస్తున్నాను?' సమాధానం దొరకని ప్రశ్నతో వేసారిపోయింది. మనసు వద్దని వారిస్తున్నా, కళ్ళు అతడివైపే లాగుతున్నాయి. భారమైన ఉచ్ఛ్వాశ, నిశ్వాశాలతో బరువెక్కిన ఆమె పై ఎద మీద నిలువలేక, జారిన పమిటను సర్దుకునే ప్రయత్నం చెయ్యలేదు.
తలెత్తి ఆమె వంక చూసిన అతడు సీట్లో ఇబ్బందిగా కదిలాడు. ఆమె పరిస్థితి, అతనికి అర్థమౌతోంది. కానీ అతని ధ్యాస వేరుగా ఉంది. ఆమె మనోహర రూప లావణ్యానికి అతను చలించలేదు. నిబ్బరంగా తన పనిలో నిమగ్నమైపోయాడు.
ఇంతవరకూ తనవైపు కన్నార్పకుండా చూసినవారే తప్ప, తనని చూసి మొహం తిప్పుకున్నవారు లేరు. ఉక్రోషoతో ఆమె పెదవులు వణికాయి. ఎర్రబడిన ముక్కు పుటాలు అదురుతున్నాయి.
"గరం గరమ్ చాయ్! మసాలా చాయ్!" అమ్ముతూ బోగీలో అటువైపుగా వచ్చిన వ్యక్తి అరుపుతో కొంచెం తేరుకుంది.
"రెండు చాయ్!" చెప్పింది.
"అవసరం లేదు.. వారికివ్వు చాలు" ముక్తసరిగా జవాబు చెప్పిన అతని మాట తీరుకి ఆమె నొచ్చుకుంది.
'ఎన్నడూ చలించని నా మనసు, ఎందుకు ఇతడివైపు లాగుతోంది?' వేడి వేడి టీ సిప్ చేస్తూ ఆలోచిస్తోన్న ఆమె, ఆ సంఘర్షణ నుంచి బయటకు రావడానికి ఫెమినా మ్యాగజైన్ ను చేతిలోకి తీసుకుంది.
మరొకరైతే ఆమెతో మాట కలపకుండా ఉండలేరు. కానీ అతడి దారి తన లోకం తనదే అన్నట్టుగా ఉంది. భువనేశ్వర్ లో రైలెక్కిన ఆమె, విశాఖలో దిగిపోయింది. అతను మాత్రం హైదరాబాదు వరకూ అదే ట్రైన్ లో ప్రయాణించాడు.
*****
నెల రోజుల తర్వాత, ఒకరోజు కాలింగ్ బెల్ మోగడంతో తలుపుతీసిన ఆమె.. ఆశ్చర్యంతో నోట మాట రాక నిల్చుండిపోయింది. ఎదురుగా పలకరింపుగా చిరునవ్వుతో అతడు.. తదేకంగా ఆమెనే చూస్తూ..
"అతను ఇక్కడెలా.. ? అంటే తనను వెతుక్కుంటూ ఇంతదూరం వచ్చాడా?" సందిగ్ధంలో ఉన్న ఆమె ఆలోచనలను గమనించినట్టుగా..
"మీ ఎదురుగా ఉన్న ఫ్లాట్ లోకి నిన్న సాయంత్రమే అద్దెకి దిగాం. అమ్మా, నాన్నా రెండు రోజుల తర్వాత వస్తారు. బయట పొగమంచు చాలా ఎక్కువగా ఉంది. కొత్త ప్రదేశం.. ఇక్కడ పాలు ఎక్కడ దొరుకుతాయో ఇంకా తెలీదు. మీరు ఏమీ అనుకోకపోతే, ఈ గ్లాసుతో కొంచెం పాలు ఇస్తారా?" రిక్వెస్టింగ్ గా అడిగాడు.
"షూర్! రండి కూర్చోండి. ఇప్పుడే తెస్తాను" అంటూ లోనికి దారితీసింది. ఆరోజు ట్రైన్ లో అపర ప్రవరాఖ్యుడిలా పోజు కొట్టిన ఇతను, ఈరోజిలా తన ఎదురుగా వచ్చి నిలబడడం ఆమెకి చాలా ఆనందం కలిగించింది. కానీ తన భావాలేమీ బయటకు కనపడనీకుండా జాగ్రత్త పడింది. పైపెచ్చు.. అతడు తనవైపు కన్నార్పకుండా చూడడం కనిపెట్టినా, అదేమీ గమనించనట్టే ప్రవర్తించింది.
వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక వంకతో పలకరిస్తూ, తనకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్న అతని ఆంతర్యం గ్రహించి, ఆమె కూడా సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. ఇద్దరికీ ఈ రంగుల లోకం మరింత అందంగా కనిపించసాగింది. ఒకరినొకరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నాక, ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని నిర్ధారించుకున్నాక, ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ముఖ్యమైన పని మీద హైదరాబాదు వెళ్తున్నాననీ, రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తాననీ చెప్పిన అతనికి, వీడ్కోలు చెప్పడానికి స్టేషన్ కు వచ్చిoది ఆమె. విశాఖ ఎక్స్ ప్రెస్ ప్లాట్ ఫామ్ మీదకి రాగానే ఆమె ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి. గబగబా ట్రైన్ లోకి ఎక్కేసి, విండో దగ్గర కూర్చుని, చెయ్యి ఊపుతున్న అతనికి 'బై' చెబుతుంటే ఆమె మనసు భారమయ్యింది. 'ఎంత? రెండు రోజులేగా' తనకి తానే సర్దిచెప్పుకుని, ట్రైను కదలగానే తానూ బయల్దేరింది.
*****
"అన్నయ్యా! ఈ ఫోటోలో ఉన్నామెనే నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నా సెలక్షన్ ఎలావుందో నువ్వే చూసి చెప్పు" అంటూ జేబులోనుంచి ఫోటోను తీసి, తన అన్నయ్య చేతికిచ్చాడు.
ఆ ఫోటోను చూసిన అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. 'సందేహం లేదు. ఈమె.. ఆమే.. !' మనసులోనే నవ్వుకున్నాడు.
"ఈ వరూధినినా.. నువ్వు పెళ్లాడబోతున్నది?" నవ్వుతూ అడిగాడు.
"అవును అన్నయ్యా! యాధృచ్చికంగా కలిసిన మేము, జీవితాంతం ఒకటిగా కలిసి బ్రతకాలని ఆశపడుతున్నాం. మూఢమి వచ్చేస్తోంది. ఈ పది రోజుల్లోపులే ముహూర్తాలు పెట్టుకోవడం మంచిదని నాన్నగారు అంటున్నారు. కవల సోదరులమైన మన ఇద్దరి అభిరుచులూ ఒకేలా ఉన్నాయి చూసావా? నేనూ నీలాగే.. వదిన అందానికి ఏమాత్రం తీసిపోని అమ్మాయిని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాను. ఏమంటావ్?" గొప్పగా చెబుతున్న తమ్ముడి భుజం మీద ప్రేమగా చెయ్యివేశాడు, అతనికన్నా పది నిముషాలు ముందు పుట్టి, పెద్దవాడిని అనిపించుకున్న ఆ అన్నయ్య.
ముమ్మూర్తులా ఒకేలా ఉన్న ఈ కవలల్ని పోల్చుకోవడానికి చిన్నప్పుడు తమ తల్లి రెండు వేర్వేరు రంగుల మొలతాళ్ళు కట్టేదని తల్చుకున్నప్పుడల్లా నవ్వుకునే వారిద్దరూ.. చిన్నప్పట్నుంచీ ఒకే ప్రాణం అన్నట్టుగా పెరిగారు.
తమ్ముడు చెప్పినదాన్ని బట్టి, అతని కళ్ళల్లో తాను గమనించిన మెరుపును బట్టీ.. ఆమెకి, అతనిపట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమయ్యింది. 'ఆరోజు ట్రైన్ లో ఆమెను బాధ పెట్టేలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. ఏది ఏమైనా ఆమె వలచిన రూపాన్నే తనకు భాగస్వామిగా పొందగలుగుతున్నందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి' మనసులోనే అనుకున్న అతడు..
పెళ్లి పీటలమీద తమ్ముడినీ, ఆమెనూ మనస్ఫూర్తిగా దీవించే ఘడియకోసం వేచివున్నాడు.
------శుభం-----
వేలూరి ప్రమీలాశర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వేలూరి ప్రమీలాశర్మ
నమస్తే!
నేను రాసిన "రంగుల లోకం" కథను మీ పత్రికలో ప్రచురణకు స్వీకరించినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.
విశాఖపట్నం కు చెందిన వేలూరి ప్రమీలాశర్మ అను నేను, వృత్తిరీత్యా న్యూస్ రీడర్ గా, న్యూస్ కరెస్పాండెంట్ గా ఉన్నాను. నా రచనలు ఇంతవరకు ఆకాశవాణిలో 2 సీరియల్స్, పలు నాటికలతోపాటు, వివిధ పత్రికలలో వందకు పైగా కథలు ప్రచురించబడ్డాయి. తొలి ప్రచురణ "గజల్ సౌరభాలు" 2022 నవంబర్ లో రిలీజ్ అయ్యింది. కృష్ణమాలికలు శతకం అముద్రితం.
వారం రోజుల్లో 25 కథలతో కూడిన కథాసంపుటి ఒకటి ఆవిష్కరణకు రానుంది. నా భర్త వేలూరి గోపాలకృష్ణ శర్మ (విశాఖ కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సయిజ్ dept), మరియు నా కుమార్తెలు నిఖిత, సంహితల సహకారం, ప్రోత్సాహంతో మరిన్ని రచనలు చేయాలన్న ఆకాంక్షతో, తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో ముందుకు సాగుతున్నాను. మా తెలుగు కథలు.కామ్ ద్వారా నా కథలు పరిచయం అవుతున్నందుకు మరోసారి ధన్యవాదాలు.
ఇట్లు,
వేలూరి ప్రమీలాశర్మ.
Prameela Sarma • 1 hour ago
Read more
నేను రాసిన వరూధిని కథకు ఆడియో రూపంలో మరింత వన్నె తెచ్చిన మన తెలుగు కథలు.కామ్ వారికీ, స్పష్టంగా భావయక్తంగా చదివి వినిపించిన సీతారాం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.