'Vasantha Geetham' New Telugu Story
Written By Buddhavarapu Kameswara Rao
'వసంత గీతం' తెలుగు కథ
రచన: బుద్ధవరపు కామేశ్వరరావు
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఆరోజు, నాగపూర్ లోని ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో త్యాగరాజ స్వామి వారి 168వ జన్మదిన సందర్భంగా జరుగుతున్న ఆరాధన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాకినాడకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ రామశాస్త్రిగారు.
వేదిక మీద యువ గాయనీ గాయకులు పాడుతున్నారు కానీ, రామశాస్త్రి గారి కళ్ళు మాత్రం వేదిక క్రింద ఆశీనులైన ఆహూతుల మీదే ఉన్నాయి, ఎక్కడైనా తన చిట్టి తల్లి లక్ష్మి కనబడుతుందేమోననన్న ఆశతో.
కూతురు ఇల్లు విడిచి పాతిక సంవత్సరాలైనా, ఏ నాడూ ఆమె గురించి ఆలోచించని ఆ ముసలి ప్రాణం ఓ నాలుగైదు సంవత్సరాల నుంచి ఆమెను ఒకసారైనా చూడాలని కొట్టుకుంటోంది. అందుకే ఏ కచేరీకి వెళ్లినా తనని చూడ్డానికి కూతురు వస్తుందేమో, ఓసారి చూడవచ్చు అన్న ఆరాటం ఆయనది.
ఉబికివస్తున్న కంటనీరు ఎవరికీ కనబడకుండా తుడుచుకుంటూ, రెండున్నర దశాబ్దాల నాటి ఆ సంఘటన తలుచుకుంటూ గతంలోకి జారిపోయారు రామశాస్త్రి గారు.
***** ***** ***** *****
'త్యాగరాజ స్వామి వారి 140వ ఆరాధన ఉత్సవాల సందర్భంగా సంగీత ప్రియులకు స్వాగతం. ఇట్లు త్యాగరాజ గాన సభ, భాస్కర్ నగర్, కాకినాడ' అని రాసి ఉన్న ఆ స్వాగత ద్వారం వంక ఆరాధనగా చూస్తూ ఆ మైదానంలోకి అడుగు పెట్టారు, ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ రామశాస్త్రి గారు, తన భార్య, కుమార్తె వెంట రాగా.
సభాసాంప్రదాయ ప్రకారం పూజా కార్యక్రమాలు పూర్తి కాగానే, గానసభ అధ్యక్షులు శ్రీ సూర్యారావు గారు మాట్లాడుతూ,
"కర్ణాటక సంగీత ప్రియులు అందరికీ నమస్కారం. ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వాగ్గేయకారులు శ్రీ త్యాగరాజ స్వామి వారి జన్మదిన ఆరాధన ఉత్సవాలు జరుపుకుంటుంన్నాం! ఈ సందర్భంగా ప్రతీ సంవత్సరం యువ గాయనీగాయకుల లోని ప్రతిభను వెలికి తీయడానికి కీర్తనల పోటీలు నిర్వహిస్తున్న సంగతి మీకు తెలిసినదే.
మన సంస్థ స్థాపించి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగానూ మరియు త్యాగరాజ స్వామి వారి నూట నలభైయ్యవ జన్మదిన కారణం గానూ, ఈరోజు ఓ రెండు ప్రత్యేక కార్యక్రమాలు మీకు అందిస్తున్నాము. అందులో మొదటిది, తమ గానకళ ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంది శిష్యులను తయారు చేసిన మన నగరానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ నేమాని రామశాస్త్రి గారిని సన్మానించడం! వారిని వేదిక మీదకు తీసుకుని రావలసిందిగా నిర్వాహకులను కోరుతున్నాను. ఇక రెండవ కార్యక్రమం గురించి చివర్లో చెబుతాను" అని ముగించారు.
ఆ తరువాత శాస్త్రి గారికి సన్మానం, ఆ తదుపరి కీర్తనల పోటీలు అయిన పిదప చివర్లోవేదిక మీదకు వచ్చిన సూర్యారావు గారు,
"సంగీత రసజ్ఞులకు పునఃస్వాగతం. ఇప్పుడు రెండో ప్రత్యేక కార్యక్రమం గురించి ఓ రెండు ముక్కలు. తన తండ్రిగారి వద్ద శిష్యరికం చేసిన మన రామశాస్త్రి గారి ఏకైక కుమార్తె కుమారి లక్ష్మి మొట్టమొదటి సారిగా ఈ వేదిక ద్వారా ఓ రెండు కీర్తనలు పాడుతుంది. అందరూ ఆ రసఝరిని ఆస్వాదించి ఆ చిన్నారిని ఆశీర్వదించగలరని ఆశిస్తున్నా" అంటూ ముగించారు.
తర్వాత వేదిక ఎక్కిన లక్ష్మి, మొదటి పాటగా "ఎందరో మహానుభావులు" పాట, తర్వాత "జయమంగళం నిత్య శుభమంగళం" పాడి ఆ రోజు కార్యక్రమాలకు ముగింపు పలికింది.
కూతురు పాట విన్న తరువాత,
"పరవాలేదు, ఇంకా కొంచెం సాధన చేయస్తే మంచి గాయని అవుతుంది" మనసులో అనుకున్నారు రామశాస్త్రి గారు.
***** ***** ***** *****
ఆ రోజు కాకినాడలో మొదటి కచేరీ ద్వారా రెండు పాటలు పాడిన తన కూతురు లక్ష్మితో కలిసి ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చిన రామశాస్త్రి గారు,
"సీతా! మన చిట్టితల్లి ఎంత బాగా పాడిందో విన్నావు కదా? ఏదో రెండు చోట్ల అపస్వరాలు, మధ్య మధ్యలో గమకాలు పలకడంలో తడబడడం తప్పించి, మిగతాదంతా స్పష్టంగా ఆలపించింది. కొంచెం సాధన చేయస్తే తప్పకుండా నా పేరు నిలబెడుతుంది" భుజం మీద శాలువా తీస్తూ, కూతురు వంక గర్వంగా చూస్తూ, భార్యతో చెప్పారు రామశాస్త్రి.
"నాన్న గారూ, మీ మాట కాదనలేక ఆ రెండు పాటలు నేర్చుకున్నాను తప్పించి, నాకు అసలు ఈ సంగీతం మీద ఆసక్తి లేదని మీకు చాలా సార్లు చెప్పాను. ఆ స్వరాలు, గమకాలు నా వల్ల కాదు. నన్ను వదిలేయండి" తల్లిదండ్రులు బిత్తరపోయి చూస్తుండగా నిర్మొహమాటంగా చెప్పింది లక్ష్మి.
అరగంట పాటు తీవ్ర వాదోపవాదాలు జరిగిన తరువాత,
"అదేంటమ్మా అలా అంటావ్! ఇందాకా నిన్ను, నీ స్వర జ్ఞానాన్ని చూసి, ఆ తాసిల్దారు గారి కుటుంబం నిన్ను తమ కోడలిగా చేసుకుంటామనీ, ఏ విషయమూ త్వరలో కబురు పంపమనీ చెప్పారు.. " చెబుతున్న తండ్రి వంక చూస్తూ,
"నాన్న గారూ! నాకు తెలియకుండా ఎవరికీ మాట ఇవ్వకండి" విసురుగా చెప్పి తన గదిలోకి వెళ్లబోయింది లక్ష్మి.
"అంటే, కొంపతీసి ఎవరితోనైనా ప్రేమలో పడ్డావా?" బుగ్గలు నొక్కుకుంటూ అడిగారు సీతమ్మ.
"ఎలా చెప్పాలా అనుకుంటున్నా. నాకు శ్రమ తప్పించావు. ఔనమ్మా! నేను మధు అనే ఓ పెయింటర్ ని ప్రేమించా. అతను మంచి చిత్రకారుడు. డిగ్రీలో నాకంటే ఓ సంవత్సరం సీనియర్. మీ అనుమతి తీసుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం" బాంబు పేల్చింది లక్ష్మి.
"ఏమిటీ! ఒక పెయింటర్ ని పెండ్లి చేసుకుంటావా? మనది సంగీత కళాకారుల కుటుంబమే, అలాంటి పనులు చేయకు. నలుగురికీ తెలిస్తే నా పరువు పోతుంది" కూతుర్ని మందలించారు శాస్త్రి.
"ఏం ఒక్క సంగీత విద్వాంసులు మాత్రమే కళాకారులా? మిగతావారు కారా?" సూటిగా తండ్రిని ప్రశ్నించింది లక్ష్మి.
ఆ మాటలు విన్న రామశాస్త్రి ఆవేశం ఆపుకోలేక లక్ష్మి చెంప ఛెళ్ళుమనిపించి,
"అంటే తండ్రినే ప్రశ్నించే స్థాయికి ఎదిగావన్నమాట. నీ మొహం నాకు చూపించకు" అంటూ కుర్చీలో కూలబడ్డారు.
"అలాగే.. చూపించను" చెంప తడుముకుంటూ విసురుగా గదిలోకి వెళ్లి పెద్ద శబ్ధం చేస్తూ తలుపు వేసుకుంది లక్ష్మి.
"చూసావా దాని పొగరు? ఇదంతా నీ నిర్వాకం కాదూ?" తన గదిలోకి వెళ్తూ గట్టిగా అరిచారు శాస్త్రి గారు, భార్య వైపు కోపంగా చూస్తూ.
"ఔను. అందరికీ నేనే లోకువ. ఎంతసేపూ ఆ సరిగమపదనిల మీద ధ్యాసే తప్పించి, దాని నడవడిక గురించి ఒక్కసారైనా పట్టించుకున్న పాపాన పోయారా?" సణుక్కుంటూ వంటిల్లు సర్ది, గదుల తలుపులు మూసి, వరండాలోనే నడుం వాల్చారు సీతమ్మ గారు.
మర్నాడు అందరికీ మామూలుగానే తెల్లారింది. ఒక్క రామశాస్త్రి గారి ఇంట్లో తప్ప. రోజూలాగే తెల్లవారుజామునే లేచిన సీతమ్మకు దగ్గరకు వేసి ఉన్న వీధి తలుపులు చూసి, అనుమానం వచ్చి, భర్త గదిలోకి చూసింది. గాఢ నిద్రలో ఉన్న భర్తను చూడగానే మనసు కుదుటపడింది.
తరువాత కూతురు గదిలోకి వెళ్లి చూసి,
"ఏమండీ! కొంపలంటుకు పోయాయండి. అమ్మాయి గదిలో లేదు. ఇదిగో ఈ లెటర్ రాసి ఎక్కడికో పోయింది" హృదయవిదారకంగా ఏడుస్తూ భర్త చేతిలో ఆ లెటర్ పెట్టింది.
"నాన్నగారూ!
నేను నీ రక్తం పంచుకుని పుట్టినదానను. మీ పౌరుషమే నాకూ వచ్చింది. ఇంక నా మొహం మీకు చూపించను. నా మధుతో వెళ్లి పోతున్నాను. నా గురించి వెతక్కండి. ఎవరైనా అడిగితే, నాకు హైదరాబాద్ లో మంచి ఉద్యోగం వచ్చింది అని చెప్పండి, మీ పరువు పోకుండా ఉంటుంది.
మీకు ఏమీ కాని
వసంతలక్ష్మి"
ఉత్తరం చదివిన రామశాస్త్రి,
"మంచి పని చేసింది. ఎవరైనా అడిగితే అలాగే చెప్పు. ఈ విషయంలో ఇంకేమీ మాట్లాడి నన్ను విసిగించకు. ఈ రోజుతో దానికి మనకీ ఋణం తీరిపోయింది" నిక్కచ్చిగా చెప్పారు.
"అయ్యయ్యో అవేం మాటలండీ" అంటూ వస్తున్న దుఃఖాన్ని చీర కొంగుతో ఆదిమి పెట్టుకుంటూ ఏడుస్తూ గదిలోకి వెళ్లారు సీతమ్మ.
***** ***** ***** *****
చప్పట్లు వినబడడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చారు రామశాస్త్రి. వేదిక పైకి పాడడానికి వచ్చిన సునీల అనే ఆ అమ్మాయిని చూడగానే ఆ కట్టూ బొట్టు, అలాగే వాలుజడ ముందుకు వేసుకున్న తీరు చూస్తే అచ్చం తన కూతురులాగే ఉందనుకున్నారు రామశాస్త్రి.
"ఏతావునురా నిలుకడ నీకు" అని పాట పాడిన ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకొని "మీ అమ్మ పేరేమిటమ్మా? ఇక్కడ ఉందా?" హిందీలో అడిగారు ఆత్రంగా.
"మా అమ్మ పేరు లక్ష్మీబాయ్. ఒంట్లో బాగాలేక రాలేదు" అని చెప్పింది సునీల.
"అయ్యో! అలాగా? మీ అమ్మను ఓ సారి చూడడానికి రావచ్చా?" అడిగారు కుతూహలంగా.
"తప్పకుండా రండి దాదాజీ" అంటూ తమ కారులో ఇంటికి తీసుకుని వెళ్లింది సునీల.
ఆ ఇంటికి చేరుకునేవరకూ ఆ లక్ష్మీబాయ్ తన కూతురు లక్ష్మి అయితే బాగుణ్ణు అని దేవుని ప్రార్థిస్తూనే ఉన్నారు రామశాస్త్రి.
అయితే భగవంతుడు ఆయన కోరికను మన్నించలేదు. తలుపు తీసిన లక్ష్మీబాయ్ ని చూసి నీరుగారిపోయిన ఆయన తన మనసులోని బాధ అంతా ఆమెకు చెప్పి కొంచెం మనశ్శాంతి పొందారు. తన కూతురుతో కాకినాడ సభలో తీయించుకున్న ఆఖరి ఫొటో ఆమెకు ఇచ్చి, "ఎక్కడైనా కనబడితే రెండు ముసలి ప్రాణాలు ఆమెను చూడాలని కొట్టుకుంటున్నాయని చెప్పు తల్లీ" అని భారమైన గుండెతో వెనుదిరిగారు రామశాస్త్రి.
***** ***** ***** *****
ఆ తర్వాత సంవత్సరం, త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి చెన్నై లోని అడయార్ కు వచ్చారు రామశాస్త్రి.
ఒక్కొక్కరే వచ్చి త్యాగరాజ కీర్తనలు పాడుతున్నారు. ఇవేమీ పట్టకుండా ఆహూతుల వంక అదేపనిగా చూస్తున్నారు రామశాస్త్రి.
ఈ లోగా ఒక అమ్మాయి
"చెడు బుద్ధి మానరా" అంటూ కీర్తన పాడడం మొదలెట్టగానే తనను ఉద్దేశించే ఆ కీర్తన ఉన్నట్టు ఉలిక్కిపడ్డారు రామశాస్త్రి.
"నిజమే తన బుద్ధి చెడ్డది కాబట్టే కూతురు అభిప్రాయాలను తెలుసుకోకుండా పరువు, మర్యాద అంటూ దూరం చేసుకున్నా. ఇప్పుడు అవన్నీ వదిలేసి కూతురు కోసం రోడ్లు పట్టుకుని తిరుగుతున్నా" అనుకుంటూ తనలో తానే కుమిలిపోసాగారు రామశాస్త్రి.
గొంతెత్తి, ఆరోహణలో ఆలాపన చేస్తున్న ఆ అమ్మాయిని అనుకోకుండా చూసిన ఆయన,
"సందేహం లేదు. ఈ అమ్మాయి తన మనవరాలే! కొంచెం రంగు తక్కువ కానీ, అచ్చం వాళ్ళ అమ్మ పోలికే. ముఖ్యంగా ఆరోహణలో పాడుతున్నప్పుడు కుడి వైపు కొట్టవచ్చినట్లు కనబడే ఆ పన్ను మీద పన్ను.. " ఆలోచనలో మునిగిపోయి, పాట అయిపోయిన విషయమే మరచిపోయారు రామశాస్త్రి.
వేదిక దిగి వెళ్లి పోతున్న ఆ అమ్మాయిని ఆపి "బాగా పాడావు తల్లీ! ఔనూ అమ్మ వచ్చిందా?" ఆమె తల నిమురుతూ అడిగారు రామశాస్త్రి. "వచ్చింది సార్, అదిగో ముందు వరుసలో ఆకుపచ్చ పట్టుచీర కట్టుకుంది, ఆవిడే" చూపించింది ఆ అమ్మాయి. ఎంతో ఆతృతగా ఆమె తల్లిని చూసిన రామశాస్త్రి గారు, తర్వాత గాఢంగా నిట్టూర్చారు లోలోపల బాధపడుతూ.
***** ***** ***** *****
"ఏమండీ, డెబ్భై ఏళ్ల వయసులో కచేరి వంక పెట్టుకుని అమ్మాయి కోసం ఆలా ఊర్లు తిరగడం అవసరమా? దానికి మన మీద ప్రేమ ఉంటే ఈ పాటికే అదే వచ్చేది. అంతగా చూడాలి అనుకుంటే ఓ పేపరు ప్రకటన ఇవ్వండి" భర్త అవస్థ చూడలేక బాధపడుతూనే చెప్పారు సీతమ్మ గారు.
"ఇప్పుడు అది ఎంత ఎత్తుకు ఎదిగిందో ఎవరికి తెలుసు. అలా ప్రకటన ఇస్తే దాని పరువు పోదూ? నువ్వు అన్నట్టుగానే నా ఆరోగ్యం కూడా సహకరించడంలేదు సీతా! ఇంకో ఆరునెలల్లో మన కాకినాడలో జరిగే త్యాగరాజ స్వామి వారి నూట డబ్భైయ్యవ ఆరాధన ఉత్సవాలు తర్వాత ఇంక ఈ దేహానికి విశ్రాంతి ఇచ్చేద్దాం అనుకుంటున్నా" నిర్లిప్తంగా చెప్పారు రామశాస్త్రి.
***** ***** ***** *****
ఆ సంవత్సరం, కాకినాడ లో త్యాగరాజ స్వామి వారి 170వ ఆరాధన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసారి పోటీలో పాల్గొనడానికి మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల గాయనీగాయకులను కూడా ఆహ్వానించారు.
వేదిక మీద కూర్చొని అందరి కీర్తనలు శ్రద్ధగా వింటున్నారు రామశాస్త్రి.
"ఇప్పుడు మరాఠీ గాయకుడు వీ. కే. షిండే రెండు కీర్తనలు పాడతారు" నిర్వాహకుడు చెప్పగానే, ఆ యువకుడు వేదిక ఎక్కి, రామశాస్త్రి గారి పాదాలకు నమస్కరించి,
"కనుగొంటిని శ్రీరాముని నేడు" అని మొదటి కీర్తన ఆలాపించి, తరువాత "జగదానంద కారకా" అనే పాట పాడి, చప్పట్లు మోగుతుండగా వెళ్లి తనకు కేటాయించిన ప్రదేశంలో కూర్చున్నాడు.
కార్యక్రమం ముగిసిన తరువాత రామశాస్త్రి గారి చేతుల మీదుగా షిండేకు ద్వితీయ బహుమతిగా ఓ జ్ఞాపిక బహుకరించారు నిర్వాహకులు.
"గురువుగారూ! మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ శిష్యుడిగా చేరాలనుకుంటున్నాను" బహుమతి తీసుకుని, రామశాస్త్రి గారిని అడిగాడు ఆ యువకుడు హిందీ భాషలో.
ఆశ్చర్య పోయిన రామశాస్త్రి అతడిని ఆశీర్వదించారు.
రామశాస్త్రి గారితో కలిసి వారి ఇంటికి వెళ్తూ,
"గురువుగారూ! నేను మీకు కొత్త ఏమీ కాదు. రెండేళ్ల క్రితం మీరు నాగపూర్ లో మా ఇంటికి వచ్చారు. ఆ రోజు కార్యక్రమంలో నేనూ పాడాల్సి ఉంది. కానీ కాలేజ్ టూర్ మీద పూణే వెళ్లాను. ఆ కార్యక్రమంలో మా చెల్లాయ్ సునీల పాడింది.. " నాగపూర్ విషయాలు చెబుతున్నాడు షిండే.
"ఆ జ్ఞాపకం వచ్చింది. మీ మమ్మీ పేరు లక్ష్మీబాయ్ కదూ?" అడిగారు రామశాస్త్రి, ఇంటిలోకి ప్రవేశిస్తూ.
***** ***** ***** *****
"గురువుగారూ! ఈ ఫొటోలో ఉన్న ఈ అమ్మాయి ఎవరూ?" వీధిగదిలో ఉన్న నిలువెత్తు ఫొటో చూసి అడిగాడు షిండే.
"అదంతా ఓ పెద్ద కథ బాబూ! భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. గురూజీ అని కాకుండా తాతయ్యని మీరు ఎలా పిలుస్తారో అలా పిలు బాబూ. ఇదిగో సీతా! ఈ కుర్రాడు.. " అంటూ అతని గురించి భార్యకు చెప్పారు రామశాస్త్రి.
భోజనం చేస్తూ తన కూతురు గురించి వివరంగా అతనికి చెప్పారు రామశాస్త్రి.
"చూసారా! ఈ అబ్బాయికి సరిగమలు ఇష్టం కాబట్టి అంత దూరం నుంచి నేర్చుకోవడానికి వచ్చాడు. మీరు మన అమ్మాయికి అవి ఇష్టం లేకపోయినా బలవంతంగా రుద్దుదామని ప్రయత్నించారే తప్ప, దాని ఇష్టాఇష్టాలు గురించి ఒకసారైనా పట్టించుకున్న పాపాన పోయారా?" వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పారు సీతమ్మ.
"ఇంక ఆ సంగతులు వదిలేయ్. అది ఎక్కడున్నా హాయిగా ఉంటే చాలు. సరేకానీ, ఆ కుర్రాడికి మన అమ్మాయి గదిలో పడక ఏర్పాటు చెయ్యి" భార్యకు పురమాయించారు రామశాస్త్రి.
***** ***** ***** *****
గదిలో మంచం మీద వాలిన షిండేకు రెండు నెలల క్రితం తన మమ్మీ చెప్పిన విషయం గుర్తుకువచ్చింది.
"మమ్మీ! కాకినాడలో రామశాస్త్రి గారి ఆధ్వర్యంలో జరుగబోతున్న త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పాల్గొనడానికి నేను, చెల్లాయ్ వెళ్దామనుకుంటున్నా!" చెప్పాడు షిండే.
ఆ మాట వినగానే మొదట నెవ్వెరపోయిన లక్ష్మీబాయ్, తరువాత కాసేపటికి తేరుకుని, "సరే, వెళ్లు బేటా! చెల్లాయ్ వద్దు. నువ్వు ఒక్కడివే వెళ్లు. అక్కడ కొన్నాళ్లు ఉండు.. " అంటూ ఏదో చెబుతున్న ఆమెతో
"ఏమిటి మమ్మీ! నువ్వు చెబుతున్నది? నేను అక్కడ ఉండడం ఏమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు షిండే.
"చెబుతాను! ఇన్నాళ్లూ ఈ నిజం నీకు తెలియకూడదని చాలా రహస్యంగా ఉంచాము. ఆ రామశాస్త్రి గారు ఎవరో కాదు. స్వయానా మీ తాతయ్య. ఔను, మీ అమ్మ వసంతలక్ష్మి తండ్రి. తాను ప్రేమించిన మధుతో కలిసి, మేము గతంలో ఉన్న కామ్టీ అనే గ్రామానికి వచ్చింది. నాతో చనువుగా ఉండి, అక్కా అని పిలిచేది. మీ అమ్మ నాగపూర్ లోని ఓ సూపర్ బజార్ లో పని చేసేది. మీ నాన్న హోర్డింగులు రాస్తూ, వచ్చిన ఆదాయంతో ఆనందంగా గడిపేవారు. ఓ సంవత్సరం తర్వాత నువ్వు పుట్టావు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా? ఎలా అలవాటు అయ్యిందో కానీ, మీ నాన్నకు మద్యం అలవాటు అయ్యింది" ఏమీ అర్థంకాని వాడిలా వింటున్న షిండే వంక ఓ సారి చూసి, తిరిగి చెప్పసాగింది లక్ష్మీబాయ్.
"ఓసారి నలభై అడుగుల ఎత్తున హోర్డింగు పని చేస్తూ మద్యం మత్తులో పైనుంచి కింద పడి మరణించాడు. బంధువులు ఎవరూ లేరని మీ అమ్మ చెప్పడంతో నేనూ, మీ డాడీ మిగతా కార్యక్రమాలు పూర్తి చేసాము. ఆ రోజు మీ అమ్మను ఓదార్చడం ఎవరి తరం కాలేదు" వస్తున్న కన్నీళ్లు తుడుచుకోవడానికి కాసేపు ఆగింది లక్ష్మీబాయ్.
"మరి ఆ వసంతలక్ష్మి, అదే మా అమ్మ ఇప్పుడు ఎక్కడుంది మమ్మీ?" కుతూహలంగా అడిగాడు షిండే.
"చెబుతాను బాబూ! ఏదో పగ పట్టినట్లు, మీ నాన్న పోయిన ఆరు నెలలకే ఆ సూపర్ బజార్లో షార్ట్ సర్క్యూట్ జరిగి, మీ అమ్మతో బాటు ఓ పదిమంది మృత్యువాత పడ్డారు. హాస్పిటల్ లో కొన ఊపిరితో ఉందన్న విషయం తెలుసుకుని నేను, మీ డాడీ వెళ్లాం. అప్పుడు చెప్పింది మీ అమ్మ, మీ తాతతో గొడవపడి వచ్చిన సంగతి. అంతే కాదు తను చేసిన పనికి పశ్చాత్తాప పడుతూ, తను మరణించిన విషయం తన తండ్రికి తెలియనీయవద్దనీ, తెలిస్తే ఆయన బతకలేరనీ, నీకు ఎలాగైనా కర్ణాటక సంగీతం నేర్పించి, మీ తాత వద్దకు చేర్చమని మాకు అప్పచెప్పి, ఈ లోకం నుంచి శెలవు తీసుకుంది.
పిల్లలు లేని మేము, నిన్ను కన్న బిడ్డలా పెంచి, మీ అమ్మ పేరు కలిసేలా వసంత కుమార్ షిండే అనే పేరు పెట్టుకున్నాం. నువ్వు వచ్చిన తర్వాత మాకు బాగా కలిసి రావడం, తర్వాత చెల్లి కూడా పుట్టడంతో ఇక నీకు ఆ సంగతి తెలియనివ్వలేదు.
కానీ రెండు సంవత్సరాలు క్రితం రామశాస్త్రి గారు మన ఇంటికి రావడం, ఇప్పుడు నువ్వు కాకినాడ వెళ్తాను అనడం.. ఇవన్నీ దైవ నిర్ణయాలే అని భావించి నీకు ఈ గతం చెప్పవలసి వచ్చింది. వెళ్లు బేటా వెళ్లు. ఆ వృద్ధ దంపతులకు కూతురు లేని లోటు తీర్చి, ఆ రామశాస్త్రి గారి సంగీత వారసత్వం నిలబెట్టు. మరణించిన మీ అమ్మ కోరిక తీర్చు. ఈ రెండు నెలలూ బాగా సంగీత సాధన చెయ్యి. ఇదిగో మీ అమ్మ ఇంట్లో లభించిన ఫొటోలు, మీ తాత రామశాస్త్రి ఇచ్చిన ఫొటో" అంటూ కొడుకు భుజం తట్టి, ఆ ఫొటోలు కొడుకు చేతిలో పెట్టింది లక్ష్మీబాయ్.
***** ***** ***** *****
వాస్తవం లోకి వచ్చిన వసంత కుమార్ షిండే,
"అమ్మా ! తాతయ్య, అమ్మమ్మలకు నువ్వు లేవన్న విషయం చెప్పకుండా వారిని కంటికి రెప్పలా చూసుకుంటాను. నీ కోరిక ప్రకారం తాతగారి సంగీత వారసత్వ కొనసాగిస్తాను. నన్ను ఆశీర్వదించు" అంటూ వసంతలక్ష్మి ఫొటోను కళ్లకు అద్దుకున్నాడు.
రామశాస్త్రి గారి గదిలో ఉన్న రేడియోలోంచి
"ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు"
అనే పాట శ్రావ్యంగా వినిపిస్తోండగా, అందులోని భావం పూర్తిగా అర్థం కాకపోయినా, ఆ పాటను వింటూ నిద్రలోకి జారుకున్నాడు వసంతకుమార్ షిండే.
***** **శుభం** *****
బుద్ధవరపు కామేశ్వరరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు :: బుద్ధవరపు కామేశ్వరరావు
జననం : తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం దగ్గర లో ఉన్న జగన్నాధగిరి అనే గ్రామంలో డాక్టర్ సూర్యనారాయణ రావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించిన 11 మంది సంతానంలో 7 వ వానిగా 1958లో.
వృత్తి : ఒక మల్టీ నేషనల్ కంపెనీలో అకౌంట్స్ మేనేజర్ గా 2016 లో పదవీ విరమణ చేసి ప్రస్తుతం హైదరాబాద్ లోని స్వగృహంలో విశ్రాంత జీవనం.
కుటుంబ నేపథ్యం: భార్య శేషుకుమారి, ఓ అమ్మాయి (సూర్యకళ, అల్లుడు వాసూరావు, వాళ్లకి ఇద్దరు పిల్లలు. పేర్లు సంకీర్త్, ష్రఘ్వి) ఓ అబ్బాయి(పేరు శశికాంత్, కోడలు శిరీష, వీరికి ఓ అబ్బాయి. పేరు శక్య)
వ్రాయడం మొదలుపెట్టింది : 2017 నుంచి
ఇంతవరకూ రాసిన కథలు : 212
ప్రచురణకు నోచుకున్నవి:
సుమారు... 98
మిగిలినవాటిలో కొన్ని వివిధ మాధ్యమాలలో పరిశీలనలోనూ,
మరికొన్ని మెరుగులు దిద్ది పంపే ప్రక్రియలో నావద్దనూ పెండింగ్ లో ఉన్నవి.
పోటీలలో బహుమతులు పొందినవి (15)
ప్రోత్సాహం ఇస్తున్న వారు:
పత్రికాధిపతులు, సంపాదకులు, సమీక్షకులు, అలాగే పాఠకులు అందరూ !
Comments