top of page

వాసంత మొచ్చింది

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #నీమీదప్రేమ, #Vasanthamochhindi, #వాసంతమొచ్చింది, #ఇష్టపది

గాయత్రి గారి కవితలు పార్ట్ 9

Vasanthamochhindi - Gayathri Gari Kavithalu Part 9 - New Telugu Poems Written By - T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 02/04/2025

వాసంత మొచ్చింది - గాయత్రి గారి కవితలు పార్ట్ 9 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


వాసంత మొచ్చింది.

(ఇష్టపది )


*****************************

వాసంత మొచ్చింది వరములను తెచ్చింది 

ఊసులను తెలిపింది యుర్విపై తిరిగింది.


క్రొత్త వత్సరములో కోటి యాశలతో 

నెత్తావి మాధురులు నెమ్మదిగ జల్లింది.


కోయిలమ్మలు వచ్చి గొంతు సవరించాయి 

హాయిగా పాడుతూ అవనినే లేపాయి.


చివురులను వేయుచూ చెట్లు పులకించాయి 

దివిలోని వాయువులు దిశలనే చుట్టాయి.


నవయుగాదికి జనులు నమతులను జేశారు

దైవమును పూజించి తలవాల్చి మ్రొక్కారు.


ప్రాతబాధలు మరచి పండుగలు చేయుచూ

జాతిమేలును కోరి జనులెల్ల మెలిగారు.


శ్రీరామ నవమనుచు చిందులను వేయుచూ

ఊరు వాడా కలిసి యుత్సవము చేశారు.


వైభవముగా స్వామి వాడవాడల తిరిగి

అభయంబు నిచ్చి తా నార్తులను బ్రోచాడు.


కాపుదలగా నుండి కల్యాణ రామయ్య

తాపములు పోద్రోలి దయను కురిపించాడు.//

************************************

నీ మీద ప్రేమ.

(ఇష్టపది)















నింగిలో నెలరాజు నిగిడి చూస్తున్నాడు.

సంగతులు చెప్పమని సరదాగ అడిగాడు.


చుట్టు ప్రక్కల గాంచి చుట్టమని భావించి

నిట్టూర్పువిడిచాను నీ వరస తెలిపాను!


ప్రేమ ప్రేమంటూ వెనుకబడి తిరిగావు!

జామురాతిరిదాక సరసాలు చిలికావు!


నీదు మాటలనెల్ల నెఱనమ్మియుంటిరా!

కాదుకాదంచు నే కలలనే కంటిరా!


బాధలో ముంచావు భ్రాంతి కలిగించావు!

మాధవా!నిను నేను మరచి పోలేనురా!


పొన్నచెట్టున పూయు పూలనే అడిగాను!

వెన్నుడేడనుచునే వెఱ్ఱిగా వెదికాను!


కథయంచు శశికి నా కలత వివరించాను!

హృదయాన బరువుతో ఎదురుచూస్తున్నాను!


రావోయి మాధవా!లాలింప రావోయి!

నా వాడివేకావ!నాదరికి రావోయి!//


*******************************

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Commentaires


bottom of page