వసుదేవా
- Vagumudi Lakshmi Raghava Rao
- 1 minute ago
- 5 min read
#పురాణం #ఆధ్యాత్మికం #devotional #TeluguMythologicalStories, #VagumudiLakshmiRaghavaRao, #వాగుమూడిలక్ష్మీరాఘవరావు, #Vasudeva, #వసుదేవా

Vasudeva - New Telugu Story Written By - Vagumudi Lakshmi Raghava Rao
Published In manatelugukathalu.com On 22/04/2025
వసుదేవా - తెలుగు కథ
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
దశార్హ మహారాజు కుమార్తె వసుదేవి. ఈమెను వసుదేవా అని కూడా పిలిచేవారు. వసుదేవా జన్మించ గానే దశార్హ రాజ్యం ఇబ్బడిముబ్బడిగా పాడిపంటలతో, సిరి సంపదలతో కళకళలాడసాగింది. దశార్హ రాజ్యంలోని ప్రజలు పట్టిందల్లా బంగారం అవ్వసాగింది. ఇదంతా వసుదేవా పుట్టిన వేళా విశేషం అని ప్రజలు మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా నమ్మారు. ప్రతి సంవత్సరం వసుదేవా జన్మ దినోత్సవ వేడుకలను ప్రజలే అంగరంగ వైభవంగా జరిపేవారు.
వసుదేవా జన్మ దినోత్సవ వేడుకల సమయంలో ప్రజలు వసుదేవాకి బహుమతులుగా ఇచ్చిన బంగారు నగలు నిరుపేదలకు దానం చేయగా ఇంకా 5200 వారాల నగలకు రెట్టింపు నగలు వసుదేవా ప్రత్యేక మందిరాలలో కళకళలాడుతూ ఉన్నాయి. అయితే వసుదేవా కి నగల మీద అసలు వ్యామోహం ఉండేది కాదు. అందరి హృదయాలలో నివసించాలి అనేది వసుదేవా సదాలోచన. అందుకు తగ్గట్లుగా వసుదేవా ప్రజాసేవ చేసేది.
రాజ్య పరిపాలన లో తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచేది. అలా ఆమె అందరి హృదయాలకు చేరువయ్యింది. తను రాజ కుమార్తె అయినప్పటికీ నేను రాజ కుమార్తెను అనే గర్వం వసుదేవా కు కించిత్ కూడా ఉండేది కాదు. వసుదేవా ప్రజలందరితో కలిసి మెలసి వారి కష్ట సుఖాలను సరిసమానంగా పంచుకునేది. వసుదేవా కు హాని తలపెట్టాలనుకునే కర్కోటకులు సహితం ఆమె ముఖం చూసిన వెంటనే ఆమె భక్తులైపోయేవారు.
దీర్ఘ శిఖి, ఢంకా మురళి వంటివారు వసుదేవాకు ముందుగా హాని తలపెట్టాలనుకున్నారు. వారు వసుదేవా ముఖం చూసి చూడగానే వారి మనసులోని మాలిన్యమంతా కరిగిపోయింది. ఆపై వసుదేవా భక్తులై రాజ్యాలన్నీ తిరుగుతూ వసుదేవా ముఖ వర్చస్సు ను స్తుతిస్తూ కాలం గడపసాగారు. దైవాంశ సంభూతులైన మహర్షులు, మాన్యులు వసుదేవా ను చూచి శ్రీ మహాలక్ష్మీ 45 అంశలలో ఒక అంశ వసుదేవా అని అనుకునేవారు.
హస్తి మహారాజు పేరు మీద హస్తినాపురం ఏర్పడింది. హస్తి మహారాజు యశోధరల కుమారుడు వికుంఠునుడు. ఇతగాడు పెరిగి పెద్దయ్యాక తండ్రి ఖ్యాతి కి తీసిపోని విధంగా హస్తినాపురం ను రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించసాగాడు.
తన తండ్రి హస్తి మహారాజు పేరు మీద ఏర్పడిన హస్తినాపురం ను భూలోక వైకుంఠం గా తీర్చి దిద్దాలనే సదుద్దేశంతో వికుంఠునుడు హస్తినాపురం లోని రోడ్లన్ని వెడల్పు చేయించాడు. గోసంపదను విస్తృతంగా పెంచిపోషించాడు. గోమాతలు ఇచ్చే పాలు ప్రజలు తాగినంత తాగి మిగతావి ఎవరూ వద్దనటంతో రోడ్ల మీద పారపోసేవారు. ఆ పాలతో హస్తినాపురం పాల సంద్రంలో వైకుంఠం లా ప్రకాసించేది.
వికుంఠునుడు హస్తినాపురం కు సప్త ప్రాకారాలు ఏర్పాటు చేసాడు. ఆ ప్రాకారాలు సహితం పాలరాతి తో కళకళలాడసాగాయి. హస్తినాపురం లోని చిన్న చిన్న నదులన్నీ పాలతో నిండిపోయాయి. వాటిని చూసి ప్రజలు ఇది నిజమా! కలా! అని అనుకునేవారు.
తన కుమారుడు వికుంఠునుడు కి పెళ్ళి చేయాలని యశోధర అనుకుంది. అదే విషయాన్ని తన భర్త హస్తి మహారాజు కు చెప్పింది.
హస్తి మహారాజు వికుంఠునుని చిన్నతనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు.
చిన్నతనం లో వికుంఠునుని ప్రవర్తనను చూసిన హస్తి మహారాజు వికుంఠునుడు, కుంఠుని"లా ప్రవర్తిస్తాడన్న మహర్షుల మాట నిజమైంది అని అనుకున్నాడు.
"కుంఠం" అంటే చెడుకు లొంగి పోవడం అని అర్థం. వికుంఠునుడు చిన్నతనంలో మూర్ఖుల సహవాసం అంటే మహా ఇష్టపడేవాడు. కొందరు మూర్ఖులు వికుంఠునుని "వికంఠనుడు వికంఠనుడు" అని ఆట పట్టిస్తుంటే వారి మీద తిరగబడకుండ, వారి మాటలను విని మహదానంద పడేవాడు. పెద్దల మీద, గురువుల మీద తిరగబడటమంటే అతనికి మహా ఇష్టంగా ఉండేది.
సత్యమేవ జయతే అన్నవారిని చావచితక బాదేవాడు. మాతృదేవోభవ అన్నవారికి మరణ శిక్ష విధించాలనేవాడు. పితృదేవోభవ అన్న వారి మీద పడి గొంతుపిసికేవాడు. ఆచార్య దేవోభవ అన్నవారిని అరణ్యాలకు తరిమేసేవాడు. అలాంటి వికుంఠునునికి తన పదహారవ యేట ముక్కోటి ఏకాదశి నాడు ఒక మహా యాగం చేయాలి అనే సత్సంకల్పం కలిగింది. తను చేయబోయే యాగానికి సప్త మహర్షులందరిని పిలిచి ముక్కోటి దేవతలందరి పేర్లను చెప్పమన్నాడు. వికుంఠునుని మాటలను విని వారంతా నోరు వెళ్ళబెట్టాడు. మహర్షులు ముక్కోటి దేవతలందరి పేర్లు చెప్పేటంత జ్ఞానం మాకు లేదన్నారు.
అప్పుడు వికంఠునుడు, "దేవతలు మూడు కోట్ల మంది కాదు. 33 మందే అని నా అంతరాత్మ చెబుతుంది. వారు ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులుఆ, అష్ట వసువులు, ఇద్దరు అశ్వనీ దేవతలు. అంతే. వీరికి విష్ణువు అధిపతి. విష్ణువు వికుంఠ మాతకు పుట్టి వైకుంఠం నిర్మించాడు. వైకుంఠ నారాయణుడు అయ్యాడు ఈ లెక్క ప్రకారం యాగం చెయ్యండి. నేను వికుంఠునుడిని. " అని అన్నాడు.
వికుంఠునుని మాటలను విన్న సప్త మహర్షులు అదే రీతిన యాగం చేసారు. అప్పటినుండి వికుంఠనునిలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పును చూసి ప్రజలు, మహర్షులు, మహానుభావులు, తలిదండ్రులు అంతా మహదానంద పడ్డారు. ఇదంతా ముక్కోటి ఏకాదశి మహిమ అని అనుకున్నారు. నాటి నుంచి వికుంఠునుడు ప్రజలకోసం ఆలోచిస్తూ, ప్రజోపయోగ పనులను చేస్తూ కాలం గడప సాగాడు. హస్తినాపురం ను క్షీరసాగరం చేసాడు.
ముక్కోటి ఏకాదశి నాడు ప్రజలు హస్తినాపురం లో ఉన్న ఉత్తర ద్వారం నుండి వచ్చి వికుంఠన మహారాజు ను దర్శించుకునేవారు. హస్తి మహారాజు, యశోధర తమ కుమారుడు వికుంఠునికి దశార్హ మహారాజు కుమార్తె వసుదేవా ను ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు. వారు గతంలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు దశార్హ మహారాజు, వసుదేవా వచ్చినప్పుడు వసుదేవా ను చూసారు.
అప్పుడు వసుదేవా బంగారు వీణ ను మీటుతూ చక్కని పాట పాడింది. ఆ పాటలో వైకుంఠ నారాయణుని వివిధ నామాలు వర్ణనాత్మకంగా ఉన్నాయి. అప్పుడు వారు వసుదేవా లో శ్రీమహాలక్ష్మి తేజస్సును చూసారు. అంతేగాక దీర్ఘ శిఖి వంటి వారు వసుదేవా గురించి స్తుతించగా విన్నారు.
హస్తి మహారాజు సప్త మహర్షులను పెళ్ళి పెద్దలుగా చేసి దశార్హ మహారాజు దగ్గరకు పంపాడు. హస్తినాపురం నుండి సప్త మహర్షులు పెళ్ళి పెద్దలుగా వస్తున్నారన్న విషయం దశార్హ మహారాజు కు వేగుల ద్వారా తెలిసింది. అంత దశార్హ మహారాజు సప్త మహర్షులను శాస్త్రోక్తంగా, మంత్రోక్తంగా ఘనంగా సన్మానించండి అని పుర పురోహితులను ప్రార్థించాడు.
రాజు మాటలను అనుసరించి, పుర పురోహితులు "కశ్యపోత్రి భరద్వాజాః విశ్వామిత్రోథ గౌతమః జమదగ్నిర్వశిష్టశ్చ సప్తైతే ఋషయః స్మృతాః ఓం సప్త ఋషిభ్యో నమః. ఓం కశ్యపో నమః ఓం అత్రో నమః ఓం భరద్వాజో నమః ఓం విశ్వామిత్రో నమః ఓం గౌతమో నమః ఓం జమదగ్నో నమః ఓం వశిష్టో నమః" అంటూ ధర్మ పత్నీ సమేతులైన సప్త మహర్షులను పలు విధాలుగా స్తుతిస్తూ రాజు గారి అంతఃపురానికి ఆహ్వానించారు.
దశార్హ మహారాజు సప్త మహర్షులకు సాష్టాంగ పడి నమస్కారం చేసి వారి ఆశీర్వాదాలను తీసుకున్నాడు. అనంతరం రాజు గారి భార్య, రాజు గారి కుమార్తె వసుదేవా తదితరులందరూ సప్త మహర్షుల ఆశీర్వాదాలను తీసుకున్నారు.
"బ్రహ్మ మనసునుండి జనించిన సప్త మహర్షులను వసుదేవా నయనానందంతో తనివితీరా చూస్తూ, వారి జ్ఞాన తేజాన్ని గమనించింది. వసుదేవా లోని శ్రీ మహాలక్ష్మీ అంశను గమనించిన సప్త మహర్షులు ఆ అంశకు పరిపూర్ణ హృదయంతో భార్యా సమేతంగా నమస్కరించారు.
అనంతరం దశార్హ మహారాజు "ధర్మపత్నీ సమేతులై వచ్చిన సప్త మహర్షుల రాకకు కారణం తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాను. సంస్కృతీ సంప్రదాయ సంరక్షణ నిమిత్తం బ్రహ్మ చే నియమించబడిన మహానుభావులారా! బ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకున్న బ్రహ్మర్షులారా! మహా శివుని నుండి అనేక విద్యలను పొందిన మహానుభావులారా!
సుర జ్ఞాన సంరక్షకులారా! మా రాకకు కారణం ఇది అని ఆజ్ఞాపించండి. మీ ఆజ్ఞ ను శిరసావహిస్తాను. " అని సప్త మహర్షులతో అన్నాడు.
దశార్హ మహారాజు మాటలను విన్న సప్త మహర్షులు దశార్హ మహారాజు ను ఆశీర్వదిస్తు తాము వచ్చిన కారణాన్ని చెప్పారు. అనంతరం ఒక్కొక్క మహర్షి వికుంఠునునిలో ఉన్న ఒక మంచి గుణాన్ని, చిన్నప్పటి అతని ఒక చెడు గుణాన్ని వివరించి చెప్పారు. వికుంఠునుడు చెడు నుంచి మంచి కి వచ్చిన విధానాన్ని అందలి దైవ తత్వాన్ని కూలంకషంగా వివరించారు.
సప్త మహర్షుల మాటలను విన్న దశార్హ మహారాజు మరో ఆలోచన చేయకుండా తన కుమార్తె వసుదేవాను వికుంఠునుకి ఇచ్చి వివాహం చేయడానికి తన సమ్మతిని తెలిపాడు. ఆపై భార్య కుమార్తె ల ముఖం చూసాడు. వారు కూడా కనులతోనే తమ సమ్మతిని తెలిపారు. అందరి వదనాలు ఆనంద సంద్రంలో తేలియాడాయి. అది గమనించిన సప్త మహర్షులు తాము వచ్చిన పని శీఘ్రంగా శుభమయమైంది అని అనుకున్నారు. దశార్హ మహారాజు వద్ద సెలవు తీసుకున్నారు.
సప్త మహర్షులు హస్తినాపురానికి వచ్చి, హస్తి మహారాజు కు యశోధర కు దశార్హ మహారాజు హృదయాన్ని కాబోయే పెళ్లి కూతురు వసుదేవా హృదయాన్ని తదితరుల హృదయాలను
తెలియ చేసారు.
హస్తి మహారాజు, యశోధర, దశార్హ మహారాజు ల అభ్యర్థన మేరకు సప్త మహర్షులు వసుదేవా వికుంఠునుల వివాహానికి మంచి శుభ ముహూర్తాన్ని చూసారు.
వసుదేవా వికుంఠునుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వసుదేవా వికుంఠునులు శ్రీమహాలక్ష్మి శ్రీమహావిష్ణువు ల అంశయే అని రాజర్షులు, బ్రహ్మర్షులు, యోగులు వంటివారు అనుకున్నారు. వికుంఠునుడు తన ధర్మపత్ని వసుదేవా సలహాలను కూడా స్వీకరించి హస్తినాపురం ను మరింత అందంగా తీర్చిదిద్దాడు. వికుంఠుని పరిపాలన లో భూలోక వైకుంఠం లా హస్తినాపురం ప్రకాశిస్తుంది అని నాటి వారందరూ అనుకున్నారు ఆ పుణ్య దంపతుల సుపుత్రుని పేరు అజమీఢుడు.
శుభం భూయాత్
వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

-వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
Comments