వసుధ
- Sudarsana Rao Pochampalli
- Sep 28, 2023
- 4 min read

'Vasudha' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
'వసుధ' తెలుగు కథ
రచన: సుదర్శన రావు పోచంపల్లి
వసుధ ఒక అందమైన కన్య. ముప్పది రెండు అప్సరసలలో వసుధ అందము తిలోత్తమను బోలి ఉంటుంది. అందరు అప్సరసలలో తిలోత్తమ అందంగా ఉంటుంది గాబోలు.. సుందోప సుందులు అనబడే రాక్షస సోదరులు ఆమె నాకంటె నాకు అని ‘ఏక ద్రవ్యాభిలాషి ద్వేషి’ అను సామెత లాగ ఇద్దరు తగవులాడుకొని చని పోతారు. అట్టి అందమైన వసుధను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు విష్వక్సేన్. శాస్త్రకారులు చెప్పుడు మాట అతిశయోక్తిగా వినటానికి వింతగా దోచే విధంగా చెబుతుంటారు.
నల దమయంతులలో దమయంతి అతి అందగత్తె అని, బ్రహ్మ దమయంతి అందముగా ఉండాలని ఆమెను అందముగా కూర్చేటందులకు చంద్రుని నుండి కొంత మట్టిని తీసి దమయంతి ఆకారము సృష్టించాడట. అందుకే చంద్రునిలో ఆ మచ్చ ఏర్పడిందని చెబుతారు. అంతటి దమయంతిని బోలిన అందగత్తె వసుధ.
బంగారానికి తావి అబ్బినట్టు వసుధ సుగుణ రాశి తోడుగా ఆమె గాత్రము కలకంఠములకే సిగ్గనిపించేలా అంత మాధుర్యము. ఇంకా చెప్పాలంటె ఆమె సంగీత సరస్వతి. పాట అందుకున్నదంటె శ్రోతలు మంత్రముగ్ధులు కావలసిందే. అసలీమె ఈ పుడమి మీద పుట్టిందా లేక దేవలోకము నుండి దిగివచ్చిందా అని అనుకుంటారు జనం.
విష్వక్సేన్ మధ్యతరగతి కుటుంబీకుడైనా వసుధను పొందిన కారణంగా ధనవంతుల జాబితాలో ఉన్నటుల భావించుతాడు. విష్వక్సేనూ అందగాడే కాకపోతె వసుధతో పోల్చుకుంటె వామ హస్తమే. ఇద్దరి అన్యోన్యతా చూపరులకు ఆశ్చర్యము కలిగించేదిగా ఉంటుంది.
విష్వక్సేన్ కు తల్లి పారిజాత, తండ్రి లక్ష్మీజాని, చెల్లెలు శృతదేవి. ఇదీ వారి కుటుంబము.
విషక్సేన్ తల్లి దంద్రుల మాట కాదనడు, చెల్లెలంటె అమితమైన అనురాగము కాని ఎప్పుడైతె వసుధ కంట బడిందో తన మంచితన మంత పక్కకు బెట్టి వసుధ కులము, గోత్రము, మతము ఏదీ లక్ష్యపెట్టక ఆమెను వివాహము స్నేహితుల సహాయముతో గుడిలో చేసుకుంటాడు.
ఎందుకంటె తల్లి దండ్రులు పరమ చాదస్తులు కుల గోత్రాలే కాక ప్రతి పనికీ పంచాంగము పదిసార్ల తిరుగవేసే మనస్తత్వము కలిగినవారు. చెప్పకుండా పెళ్ళి చేసుకున్నా కోడలు రూపవతి. గుణశీల కావడముచే కొడుకును ఏమీ అనకుండ సంతోషంగా భార్యా భర్తలను చేరదీస్తారు.
ఇక వసుధ తలిదండ్రులు అనపత్యులైనందున అనాథశరణాలయము నుండి వసుధను తెచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుతారు. విద్యతో పాటు సంగీతము కూడా నేర్పించుతారు.
వసుధకు తన అసలు తలిదండ్రు లెవరో తెలియదు. కాకపోతె అమ్మలక్కలూ అప్పుడప్పుడంటుంటె వినడమే తప్ప ఆ విషయాన్ని లోతుగా ఆలోచించలేదు. తనకు కావలసింది ఆప్యాయత అనురాగము దానికి ఎన్నడూ లోటు ఎరుగదు.
వసుధకు చదువు పూర్తయింది సంగీతము కూడా నేర్చుకున్నది ఇక అల్లుణి కొరకు ఎక్కువ తిరుగనవసరము లేదనుకుంటున్న తరుణం లో విష్వక్సేన్ తో ప్రేమ వివాహము కావడము చేత. విష్వక్సేన్ కూడా చదువుకున్నవాడు, సంపాదన పరుడు బుద్ధి మంతుడు అని తెలిసి ఏమీ అనలేకపోతారు వసుధ తలిదండ్రులు.
వసుధతో అంటారు కన్న ప్రేమకంటె పెంచిన ప్రేమే అధిక మంటారు. మా ఈ ముదుసలి తలిదండ్రుల మరిచి పోక అప్పుడప్పుడు వస్తూపోతూ ఉండమ్మ మాకూ ఊరట ఉంటుంది అనగానే ఒక్కసారే దుఃఖితురాలై తలిదండ్రుల కౌగలించుకొని ఏడుస్తుంది వసుధ.
“మీరు బాధ పడకుండి మామగారు. వసుధ ఎప్పటిలాగే మీ ఇంట్లోనే ఉన్నదనుకొండి. తరచు వస్తుంటాము” అని ఊరడిస్తాడు బాధపడుతున్న అత్త మామల. అన్నట్ట్లుగానే తరచు రాకపోకలు సాగిస్తుంటారు విష్వక్సేన్- వసుధ.
దురదృష్టవశాన ఒకనాడు సాయంత్రము వసుధను సాదుకున్న తలిదండ్రులు వాళ్ళ ఇంటి పెరడులో మొక్కలు చూస్తుండగా వర్షం ఆరంభమయితది. వాళ్ళిరువురు ఇంటి వెనుక మామిడి చెట్టుకింద నిలబడుతారు. అంతలోనే అశనిపాతం ఇరువురి ప్రాణాల బలిగొంటుంది.
అటు కన్నవారెవరో తెలియక ఇటు పెంచుకున్న వారుకూడా దూరమవడముతో వసుధ మనోవ్యథ వర్ణనాతీతం. చనిపోయిన వారి మీద పడి బోరున విలపించుదామని కుళ్ళి కుళ్ళి పయనమైనా వాళ్ళ శరీరాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. అంతకంటె అధికంగా దహిహించుక పోతుండి వసుధ మనసు.
చుట్టు పక్కలవారు ఎందరు వచ్చి ఓదార్చినా పట్టలేనంత దుఃఖము ముంచుకొస్తున్నది వసుధకు. భర్త విష్వక్సేన్ ఆమెను ఒడిలో పరుండబెట్టుకొని ఆయనవంతుగా వసుధను ఓదారుస్తూ ఆమె బాధను పంచుకొని గంటల తరబడి ప్రయత్నము చేస్తున్నా కోలుకోక సొమ్మసిల్లి పడిపోతుంది వసుధ. ఇంటిప్రక్కనే ఉన్న వసుధ ప్రాణ స్నేహితురాలు జాహ్నవి వచ్చి తానూ జీరబోయిన గొంతుతో వసుధను ఊరడించే క్రమంలో ముఖముపై నీళ్ళు చిలుకరించి లేపే ప్రయత్నం చేస్తుంది.
కళ్ళు తెరచి చూసిన వసుధ స్నేహితురాలును చూసి సముద్రములో పొంగుక వచ్చిన ఉప్పెనలా మళ్ళీ ఏడుపు లంఘించుకుంటుంది. ఇంతలో విష్వక్సేన్ తలిదండ్రులు ఇతర బంధువులూ వస్తారు. ఆ ఇల్లు ఇక శోకాంబుధే.
ఇక అందులో పెద్ద మనిషి అనబడే నారాయణ కొంత గట్టిగా అంటాడు “మనము ఎంత ఏడ్చినా పోయినోళ్ళు తిరిగి రారు. ఇక ఊరుకొండి. ఆ అమ్మాయిని కాస్త శ్వాస తీసుకోనీయండి” అని జనాన్ని ప్రక్కకు జరుపి “అమ్మ! మొదలు ఈ మంచి నీళ్ళు త్రాగు” అంటు వసుధతో మంచినీళ్ళు త్రాగిస్తాడు. పోలీసు వారు వచ్చి పంచనామా చేసి “?ఇక ఏం చేస్తం.. ఆ బూడిదనే మీ సంప్రదాయము ప్రకారము దహనము చేసుకొండి” అని వెళ్ళిపోతారు.
విష్వక్సేనే దహన సంస్కారానికి పూనుకొని చుట్టుప్రక్కల వారి సహకారంతో జరిపిస్తాడు.
మూడోనాడు అదే బూడిదను సమీపములో ఉన్న నదిలో కలిపివస్తాడు.
ఇక ఈ ఇంటితో రుణము తీరిపోయిందని వసుధను తీసుకొని తమ ఇంటికి చేరుతారు విష్వక్సేన్ అతని తలిదండ్రులు చెల్లెలు శృతదేవితో.
పదవనాటి నుండి అత్త మామల ఉత్తరక్రియలు కూడా శాస్త్రోక్తంగా మూడు రోజులు జరిపించుతాడు విష్వక్సేన్.
కొంత కాలము గడిచిన పిదప భద్రగిరి అనే వ్యక్తి వీళ్ళ ఇంటికి వచ్చి తనను తాను పరిచయము చేసుకొని తాను వసుధకు తండ్రినని వసుధ తల్లి వసుధ పుట్టగానే చని పోయిందని చెబుతూ వసుధను చూడగానే “అమ్మా వసుధా! నేను మీ నాన్నను అమ్మా.. దేవుడు మనవెంటనే పడి అన్యాయము చేయుచున్నాడు” అని బోరున విలపించుతాడు.
వెంటనే అతని మాటలు నమ్మక “అసలు ఎవరు మీరు? అని గట్టిగా భద్రగిరిని నిలదీస్తుంది.
“అమ్మా నన్ను నమ్ము తల్లీ! ఈ ప్రపంచములో నీ వొక్కదానివే నా ఆశాదీపం. నీవు పుట్టగానే మీ అమ్మ అమృతవల్లి అసువులు బాసింది. నేను కార్యాలయానికి సెలవులు పెడుతూ, కొన్న పాలు త్రాపి నిన్ను పోషించాను. నాది తరచు బదిలీ అయ్యే ఉద్యోగము. నిన్ను వెంట తీసుకపోయి సాకలేక నీవు ఆరు నెలల శిశువుగా ఉండగానే గుండె రాయి చేసుకొని గత్యంతరము లేక నిన్ను అనథ్హాశ్రమములో చేర్చడము జరిగింది. నెల నెలా నీ పేరుమీద అనాథాశ్రమములో విరాళము కూడా నాటినుండి నేటి వరకు ఇస్తూనే ఉన్నాను.
అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసి పోయేవాడిని. పది మంది చెప్పినా నేను మళ్ళీ వివాహము చేసుకోలేదు. నిన్ను ఎవరో దత్తత తీసుకున్నారని తెలిసి నా మనసు కుదుట పడింది. ఎట్టకేలకు నీ చిరునామా వెదుక్కుంటూ వస్తె ఈ దుర్ఘటన జరిగిందని తెలిసి ఇంటి ప్రక్కవారు నీ చిరునామా తెలిపితె చూసి పోదామని వచ్చిన తల్లీ” అని మరొకమారు విలపిస్తాడు భద్రగిరి.
భద్రగిరి చెప్పినదంతా విన్న వసుధకు నమ్ముక కుదిరి తండ్రి మీద పడి ఏడుస్తుంది. కూతురును ఊరడించి “ఇదిగో అమ్మా మీ అమ్మ సొమ్ములు” అని తన సంచిలోని బంగారు నగలు తీసి కూతురుకు ఇస్తాడు భద్రగిరి.
“అమ్మే లేనప్పుడు ఈ నగలు నాకెందుకు నాన్నా” అని లోనికి పోయి ముందుగా నీళ్ళు చాయ తెచ్చి ఇస్తుంది తండ్రికి వసుధ.
“ఒక్క బంగారమే కాదమ్మా! మన ఇల్లూ పొలమూ నీ పేరిట చేసి ఇప్పుడు నేను వృద్ధాశ్రమములో ఉంటాను” అంటాడు భద్రగిరి.
“అటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెటుకోకు నాన్నా! అవన్నీ అమ్మేసి మాకు సమీపములో ఇల్లు కొనుక్కొని ఉంటే బాగుంటుంది. ముందుగా ఫలహారము చెయ్యి. మా వారు, మామయ్య కలిసి భోంచేతురుగాని” అంటుంది వసుధ.
“వసుధ చెప్పినట్లు చెయ్యి మామయ్యా” అని విష్వక్సేనూ, “అవును బావగారూ” అని విష్వక్సేన్ తండ్రి. “మీరు మాదగ్గరనే ఉండ”మని విష్వక్సేన్ తల్లి అనడముతో “ఇంత ఆప్యాయత ఇరువది ఏండ్ల తరువాత నేడు పొందుతున్నాను” అని జీరబోయిన గొంతుతో అనుకుంటు చేతి రుమాలుతో కళ్ళు తుడుచుకుంటాడు భద్రగిరి.
వసుధ ఆనందానికి అవధులు లేకుండాపోతుంది.
భద్రగిరి చెప్పలేక చెప్పలేక వసుధతో అంటాడు “అమ్మా! నాకో ఆలోచన ఉన్నది. అదీ ఐదు ఏండ్లనుండి” అంటుండగానే “ఏమిటది నాన్నా” అని అడుగుతుంది వసుధ.
“మా కార్యాయములో వర్ధిని అని ఒకామె పనిచేస్తుండె. ఆమెకు పిల్లలు లేరు. భర్త ప్రభుత్వ ఉద్యోగము చేస్తూండగానే తీవ్ర అనారోగ్యం తో మరణించాడు. ఇప్పుడామె ఏకాకి తోడు. కావాలంటూ ఐదేండ్లనుండి నావెంటబడ్డది. నీ ఆచూకీ కొరకు వెదుకుచూ నేను ఆమెకు తోడు ఉండడానికి హామీ ఏమీ ఇవ్వలేదు. నీ అనుమతుంటె కలసి ఉందామని ఇప్పుడే ఒక తలంబు మదికి తోచింది’ అంటాడు భద్రగిరి.
“ఆ పని చెయ్యండి” అని వసుధ కుటుంబము వారంతా ముక్త కంఠముతో అంటారు.
“మీ అందరికీ ధన్యవాదాలు. నేను త్వరలోనే మిమ్ముల కలుస్తాను, సెలవు” అని వెడలిపోతాడు భద్రగిరి వర్ధినిని కలువడానికి.
సమాప్తం.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comentários