#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #VayasuOkaAnkeMathrame, #వయసుఒకఅంకెమాత్రమే, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ
Vayasu Oka Anke Mathrame - New Telugu Story Written By Dr. C. S. G. Krishnamacharyulu
Published in manatelugukathalu.com on 16/11/2024
వయసు ఒక అంకె మాత్రమే - తెలుగు కథ
రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“భర్తను పోగొట్టుకుని నైరాశ్యంలో మునిగిపోయిన తల్లి ఒక వైపు..
భర్తతో సుఖ సంతోషాలను పొందాలని ఆరాటపడే భార్య మరొక వైపు..
ఇద్దరివీ విభిన్న భావోద్వేగాలు- ఒకరిది నెగటివ్, మరొకరిది పాజిటివ్.
వారిద్దరి మధ్య వుత్పన్నమయ్యే భావోద్వేగం, విద్యుత్ తరంగాలై, వెలుగులు జిమ్ము తోందా, లేక విలయం సృష్తిస్తోందా? ఏం జరుగుతోంది నీ యింట? ”
స్నేహితుడు అర్షిత్ ప్రశ్నకు వులిక్కిపడ్డాడు రఘు.
"ప్రస్తుతానికి శాంతి వెల్లి విరిస్తోంది."
ఆ మాట అన్నాడే గాని అతని మనసులో యెన్నెన్నో ఆలోచనలు.
‘నీ భార్య ఆధునిక పద్ధతులు నాకు తెలియవు. నా పద్ధతులు దానికి నచ్చవు నీ కోసం నీ భార్య చెప్పినట్లు వుంటున్నా’ననే అమ్మ..
‘మీరు నాగరికం నేర్చుకున్నారు కానీ, మీ అమ్మను అలాగే రాతియుగంలో వుంచేసారు, మీకోసం, మీ అమ్మగారిని, పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నా’ అనే భార్య..
ఈ మాటల వెనుక వున్నది సర్దుబాటు యత్నమా లేక పోరు బాటు యోచనా?
వీరిద్దరి మధ్య సమన్వయం యేర్పడడానికి నా ప్రమేయం అవసరమా?
ఇలా ఆలోచిస్తున్న రఘుకి ఒక రోజు జ్ణానోదయమైంది.
@@@
ఆదివారం.
మధ్యాహ్నం నిద్ర మెలకువ వచ్చినా, రఘు కళ్ళు మూసుకుని పడుకునే వున్నాడు.
అప్పుడు రఘు తల్లి జానకి కోసం, ఆమె స్నేహితులు వచ్చారు. ఈ నాటి ఆడపిల్లల అరకొర బట్టలు, విచ్చలవిడి తిరగడాల తో మొదలైన వారి సంభాషణ, కోడళ్ళ అరాచకాల దాకా వచ్చి ఆగింది. కాసేపు వాళ్ళ బంధువులలో కోడలి పెత్తనం వల్ల బాధపడుతున్న వారి సంగతులు చర్చించారు. ఆ చర్చకు, ముగింపుగా జానకి అదృష్టవంతురాలని ఒకావిడ యిలా అంది..
“నీకేమమ్మా! మంచి కోడలు. ఎంత పుణ్యం చేసావో గాని చక్కదనం, మర్యాద వున్నపిల్ల. "
ఆమె అభిప్రాయాన్నిఖండిస్తూ జానకి, గొంతు తగ్గించి మెల్లగా యిలా అంది.
"పైకి పటారం, లోన లొటారం. నా కోడలు వేషాలు చూసి, మీరేమిటి, చివరికి మావాడు కూడా మోసపొయాడు”.
“అదేమిటలా అంటావు. ఇద్దరూ పట్టు చీరలు కట్టుకుని గుళ్ళూ గోపురాలకు వస్తున్నారుగా” అని ఒకావిడ అంటే "మొన్న ప్రావిడెన్సు మాలులో చూసాను. ఇద్దరూ నవ్వుకుంటూ షాపింగ్ చేసారు. జానకి చెప్పేవన్నీ అబద్ధాలే" అని ఇంకొకావిడ అంది.
“నేను చెప్పేది అదే! ఒంటె వర్తకుడు కథలోలా అనుకో. అసలే చదువు, ఉద్యోగం వున్న పిల్ల కదా! నా మాట సాగనీయదు. అది చెప్పినట్లే అందరూ వినాలి. ఏ బట్టలు వేసుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలోఅన్నీ తనే నిర్ణయిస్తుంది. గొడవపడితే నా కొడుకుకే కదా కష్టం? అందుకే దాని పెత్తనం సాగనిస్తున్నా. వచ్చే వారమే సిమ్లా టూర్. ఈ వయసులో ఎక్కడ పోగలం చెప్పు. గుళ్ళూ గోపురాలంటే ఏదో ప్రయాస పడైనా వెళ్ళి రావచ్చు. నేను రానంటే, వూరుకోదు."
" హాయిగా పోయి రాక, కాదంటావెందుకు?"
“మొగుడూ పెళ్లాం మధ్యలో అలాంటి చోటుకు వెళ్ళడం యేం బాగుంటుంది? పైగా కొండప్రదేశం, చలికి నాకేదైనా జబ్బు చేస్తే, నా కొడుక్కి బాధ కదా"
ఇంతలో వినబడీ వినబడని వీళ్ళ మాటలకు చికాకుపడుతూ, రఘు భార్య శారద, "అత్తయ్యా, ఆ కబుర్లు ఆపి లోనికి రండి. పకోడీలు చేసాను" అంది గట్టిగా.
"కాసిని మా వాళ్ళకు కూడా చేయకపోయావా?" అంది జానకి.
"మీరు రండి. చెప్పుకున్న కబుర్లు చాలు. కృష్ణా రామా అనుకోరు. ఎంత సేపూ ఎవరో ఒకరిని తిట్టుకోవడం" శారద గొంతులో విసుగు స్పష్టంగా తెలుస్తోంది.
“నిజమే జానకి! మేడిపండు లాంటిదే నీ కోడలు " ఆందొకావిడ.
“వస్తాం! అయినా అంత మాట అనేసిందేమిటి? అంది ఇంకొకావిడ.
నిజమే అనుకుంటూ అందరూ వెళ్ళిపోయారు. ఇదంతా వింటున్నరఘు, ఇంక అత్తా కోడళ్ళ జగడం మొదలవుతుందని యెదురు చూసాడు. కాసేపయ్యాక, అటువంటిదేమీ వినబడక, గది బయటికి వచ్చి అత్తా కోడళ్ళు సరసంగా మాట్లాడుకుంటూ, పకోడీలు తినడం చూసి నివ్వెరపోయాడు.
@@@
డాబా పైన చల్లని వెన్నెల కాంతుల్లో, సేద తేరుతున్న రఘుని వులిక్కి పడేలా చేసాయి శారద మాటలు.
"మీరు, క్రింద వుండి వుంటే బాగుండేది. ఇందాక, ట్రెక్కింగ్ సూట్ లో మీ అమ్మగారు ఎంత చక్కగా వున్నారని"
"సూటా? నవ్వులాటకి అంటున్నావా?”
"నిజమే రఘూ! లాస్ట్ టైం కొడైకెనాల్ వెళ్ళినప్పుడు, కొండ ఎక్కేటప్పుడు చీరలోఇబ్బంది పడ్దారు. మర్చిపోయావా? అందుకే ఈసారి ట్రెక్కింగ్ సూట్ కొనేసాం. దాంతో పాటు, పేంటూ షర్టూలాంటివి."
"నియంతలా అమ్మె కిష్టం లేనివి ఆమె మీద రుద్దకు. చూస్తున్నా! ఈ మధ్య నీ పద్దతి బాగోలేదు" కోపంగా అన్నాడు రఘు.
శారద ఒక నిమిషం అతని ముఖంలోకి చూసి కిసుక్కున నవ్వింది. “కోపంలో ముద్దొస్తున్నారు" అని ముద్దు పెట్టింది.
"ముద్దు తిరిగి యిస్తే మీకో రహస్యం చెప్తా" అంది.
రహస్యం అనగానే వుత్సుకత కలిగి, రఘు, ప్రేమగా శారద ముద్దు చెల్లించాడు. ఆపైన, ఆశగా, ఆమె ఏం చెప్తుందా అని యెదురు చూసాడు. శారద మెల్లగా గుట్టు విప్పింది.
"ఊసుబోక కబుర్లాడే వాళ్ళు వచ్చినప్పుడు, కాస్త విరసం చూపించాలని, నేనూ, అత్తయ్య ఒక ఒప్పందానికి వచ్చాము. మేము ఐకమత్యంగా వుంటే, చూడలేని వారు దిష్టి పెడతారు. నరదృష్టికి రాళ్ళయినా పగులుతాయంటారు”
“మరి నా దగ్గర ఆ ఐకమత్యం చూపలేదే?"
"మాకు కొన్ని తగవులుంటాయి. మీరే మా మధ్య వుండి, మమ్మల్ని సముదాయించాలి. అవునా?" అంది శారద కొంటెగా నవ్వుతూ.
"నిజమే. కానీ అమ్మని నీ వేష భాషలు నేర్చుకోమనడం, అతిగా అనిపించటంలేదా?"
"భలేవారే. ఆవిడ వద్దని చెప్పేది యెందుకు? కేవలం ఆవిడ వయసు వాళ్ళ విమర్శలకు భయపడే. ఆమెకి మాత్రం, ఈ కాలం వాళ్ళలా వుండాలని సరదా వుండదా? అందుకే, నేను ఆవిడని అత్తగా కాక ఒక అక్కగా చూస్తూ నాతో పాటే అన్నీ చేయిస్తున్నాను.
ఆమె నాతో షాపింగ్ మాల్ కి, పబ్బులకి, సినిమాలకి వస్తారు. ఆవిడ స్వేచ్చగా లైఫ్ ఎంజాయ్ చెయ్యాలనే ఈ టూర్లు. ఇవన్నీ మీకు తెలిస్తే మీరేమనుకుంటారో అని ఆవిడకు యెక్కడ లేని సంకోచం. నేరుగా చెప్పలేక, కోడలు చెప్పిన మాట వింటున్నా అని మీకు చెప్తూ వుంటుంది”
శారద మాటలకు రఘు దిగ్భ్రాంతి చెందాడు. ఒక్క క్షణం మౌనంగా శారద ముఖం వైపు చూస్తూ వుండిపోయాడు. తర్వాత గొంతు పెగల్చుకుని యిలా అడిగాడు.
“నేను కన్నకొడుకుని, నా దగ్గర సంకోచమా?"
“ఒక ఆడదాని మనసు, మరొక ఆడదానికి అర్ధమైనట్లు మగవాడికి అర్ధం కాదు. అందుకే మీ దగ్గర కొన్ని విషయాలు దాచాల్సి వచ్చింది. చదువు వల్ల, ఆ తర్వాత వుద్యోగం వల్ల మీరు ఆమెకి దూరమయ్యారు. అందులో మీది ముభావంగా వుండే మనస్తత్వం. ఆమె భర్త పోయాక ఆమె ఒంటరిదైపోయింది. కొడుక్కి పెళ్ళి చేసి కృష్ణా రామా అని అనుకోమని చెప్పే వాళ్ళ తో ఆమె మరింత ముసలిదై పోయింది. మన పెళ్ళి చేసాక, ఆమెకి తన భవిష్యత్తు యేమిటో అర్ధం కాలేదు. ఆ సమయంలో, నేను ఆమెకి దగ్గరయ్యాను"
శారద మాటలు విన్నాక రఘు మనసు ఆనందార్ణవమైంది. ఉప్పొంగిన ప్రేమతో అతడు, భార్యను కౌగలించుకోబోయాడు.
శారద ఒక్క అడుగు వెనక్కి వేసి, " మీ ప్రేమను మీ, భార్యకే కాదు తల్లికి కూడా చూపాలి. ఆవిడ నలభై ప్లస్ పదహారేళ్ళ యువతి. మీరు కూడా అందరిలా, ఆమెకు వయసై పోయిందని, భర్త లేని స్త్రీకి ఈ వేషాలేమిటని అనుకోకుండా, మంచి ఫోటోలు తీసి మీ ఇన్స్టాలో పెట్టండి. ఆమెను మన ఫామిలీ హీరోయిన్ లా చూపండి. నలుగురూ మనలా వుంటే, అమ్మలు మానసిక వేదనతో రోగాలు తెచ్చుకుని, మంచాన పడరు. ”
అతడు నవ్వుతూ," సాయం సంధ్యను సూర్యాస్తమయ వేళగా గాక, చంద్రోదయ సమయంగా చూసే, నీ ఆశావాదాన్ని, మానసిక పరిపక్వతని, అభినందిస్తున్నాను" అన్నాడు.
“థాంక్స్! వయసు ఒక అంకె మాత్రమే నని, మనిషిని నిత్య యవ్వనుడని, మన వాళ్ళు, విదేశ ప్రజల మాదిరి, గుర్తించే వరకు యిలాంటి నాటకాలు తప్పవు." అని చిరు దరహాసంతో బదులిచ్చింది శారద.
@@@
C..S.G . కృష్ణమాచార్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో. నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు ప్రచురించాయి.
ఈ మధ్యనే నాకిష్టమైన తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను. ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది, చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ- వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).
కథలోని ప్రధాన అంశం, వయసు అంటే కేవలం ఒక సంఖ్య మాత్రమే. కానీ మనసులో కొత్త ఆలోచనలు, ఆనందాలు, ఆప్యాయత ఎలా ఉంటాయో చెప్పడమే. డాక్టర్ సి.ఎస్.జి. కృష్ణమాచార్యులు గారు రాసిన ఈ కథ. జానకి అనే తల్లి, ఆమె కోడలు శారద మధ్య జరుగుతున్న భావోద్వేగాల గొడవలు, వయస్సు మీద సమాజం వేసే అంచనాలు, సమన్వయం కోసం కొద్దిగా అనుమానాలు, కానీ చివరికి ప్రేమ, పరస్పర అంగీకారంతో సమస్యలు పరిష్కారమయ్యే విధానం చూడవచ్చు.
ఈ కథ, ఒక వైపు వృద్ధత, దానితో కలిసిన బాధలు, మరొక వైపు యవ్వనాన్ని ఆస్వాదించే ఆత్మవిశ్వాసం మధ్య ఉన్న వ్యతిరేకతను చూపిస్తుంది. శారద, తన అత్త జానకిని సరదా జీవితం గడపాలని, ఆమెని ఒక "వయస్సు రహిత" వ్యక్తిగా చూడాలని ప్రయత్నిస్తుంది, ఎటువంటి సామాజిక అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా.
కథలోని కధాపధం మనం ఎంత ఎదిగినా, మనం తలచే భావనలు, మన జీవితాన్ని చూసే దృష్టికోణం ఎప్పటికీ నూతనంగా ఉండాలని చెప్తుంది .