Vendi Kancham' written by Lakshminageswara rao Velpuri
రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
హైద్రాబాద్ లో మంచి సాఫ్టేవేర్ ఉద్యోగం చేస్తున్నాడు సాగర్. హాస్టల్ తిండి పడక తన సహోద్యోగి తో కలిసి రూము తీసుకొని నచ్చినవి వండుకొంటు ఉంటున్నాడు.
వైజాగ్ లో ఒక్కతే ఉన్న తల్లికి ప్రతి నెల వచ్చి అన్నీ కొని రెండు రోజులు గడిపి వెళ్లి పోతుండే వాడు సాగర్.
ఆ క్రమంలో ఒకరోజు తల్లి దగ్గరనుంచి ఫోన్ వచ్చింది.
'ఒరేయ్, సాగర్! మన బంధువుల పెళ్లి కోసం అనుకోకుండా వాళ్లతో హైద్రాబాద్ వచ్చాను. నన్ను నీ రూమ్ కి తీసుకెళ్లు' అన్న అమ్మ మాటలు విన్న సాగర్ గతుక్కుమన్నాడు. అలాగే తల్లిని తీసుకొని రూమ్ కి వచ్చాడు.
ఆ రోజు సెలవు కావడంతో, తల్లి మంచి వంట చేస్తూ, 'ఏరా! రూము లో రెండు బెడ్లు ఉన్నాయి, నీ ఫ్రెండు కూడా ఉంటున్నాడా?’ అని ఆడిగేసరికి 'అవునమ్మా! హైదరాబాద్ లో ఖర్చులు కలిసి రావాలంటే ఎవరితోనైనా ఉండాలి',అని కొంచెం నసుగుతూ చెప్పేసరికి ఎదో సందేహం వచ్చినా ‘సరేలే, నేను స్నానం చేసి వచ్చాక భోజనం చేద్దాం,' అంటూ వడివడిగా బాత్రూమ్ లోకి వెళ్ళిపోయింది తల్లి.
స్నానం చేసి వచ్చి 'ఏరా, బాత్రూములో ఆడవాళ్ల నైటీలు, డ్రెస్సులు ఉన్నాయి. ఎవర్రా ఉంటున్నది?’ అని ఆశ్చర్యంతో అడుగుతున్న తల్లి ని చూస్తూ “ఏం, లేదమ్మా , మా ఆఫిస్ కి కొత్తగా వచ్చిన అమ్మాయికి హాస్టల్ దొరకక, నా రూమ్ షేర్ చేసుకొంటాన్నది. అయినా ఇవన్నీ హైదరాబాద్ లో మాములే. ఎవరి పని వారిది, ఖర్చులు సగంసగం చేసుకొంటూ ఉద్యోగం చేస్తారు. మరేం కాదు! కాలం మారింది. అర్థం చేసుకో..’ అంటూ చెప్పేసరికి ,'అవునా,నాకు తెలిదులే!’అంటూ భోజనం చేసి అలా నడుంవాల్చింది సాగర్ తల్లి.
సాయంత్రం ఎవరో తలుపు కొట్టిన శబ్దం విని సాగర్ తెరిచేసరికి వులిక్కిపడి లేచిన తల్లి కూడా ఎవరో సన్నగా, తెల్లగా అందంగా ఉన్న అమ్మాయి లోపలికి వస్తూ, 'సాగర్,ప్లీజ్ బాగా అలిసి పోయాను ఆఫీస్ వర్కు తో డిన్నర్ వండలేను. నువ్వు స్విగ్గి కో జోమోటోకో ఆర్డర్ చేసి రప్పించు', అంటూ లోపలికి వచ్చి ఆశ్చర్యంతో సాగర్ తల్లి ని చూసి ఒక్కఅడుగు ఖంగు తిని, 'నమస్తే అంటి!’ అంటూ 'సాగర్! మీ అమ్మగారు వస్తున్నారని చెప్పనే లేదు, నేను స్నానం చేసి వస్తాను, ఉండండి’,అంటూ బాత్రూములోకి వెళ్ళిపోయింది.
సాగర్ కు చెమటలు పట్టసాగాయి. అమ్మ ఏమనుకొంటుందో, ఏమి అడుగుతుందో తెలీక మాటలు మార్చి పెళ్లి ఎలా జరిగింది, బంధువులు ఏమన్నారు అంటూ తల్లిని ప్రశ్నలు వేస్తూ కాలం గడపసాగాడు .
అలాగే పొద్దున్నే ‘గుడ్ మార్నింగ్ ఆంటీ’ అని తన లాప్టాప్ లో పని చేసుకొంటూ ఆఫీస్ కి వెళ్లిపోయేది ఆ అమ్మాయి. అలాగే సాగర్ కూడా వెళ్లిపోయేవాడు,అలా రెండు రోజుల తర్వాత సాగర్ తల్లి వైజాగ్ వెళ్ళిపోయింది.
ఆ రోజు సాగర్ ని ఆ అమ్మాయి 'మీ అమ్మగారు వెళ్ళిపోయి వారం రోజులు అయ్యింది, ఎలా ఉన్నారు?' అని అడిగింది. ‘బాగానే ఉన్నారు. నిన్ను అడగమన్నారు', అని చెప్పగానే, ఆ అమ్మాయి మరేం లేదు. గత వారం రోజులనుంచి నా "వెండికంచం" కనపడటలేదు. అవిడేమైన తీసి దాచారా, లేక ఎక్కడైనా చూసారా? అని అడగండి. ప్లీస్.. వెతకలేక చస్తున్నాను.’ అని అనగానే సాగర్ కి సర్రున కోపం వచ్చినా, 'అలాగే అడుగుతాను' అంటూ వెళ్ళిపోయాడు.
ఆ రోజే డైరెక్ట్ గా తల్లిని ఆడగలేక, అదే విషయాన్ని ఫోన్ లో టైప్ చేసి పంపించాడు సాగర్.
ఆ మర్నాడు సాగర్ తల్లి కూడా మేసేజ్ లో "ఏరా,కన్నా! నేనెప్పుడైన తప్పుగా ప్రవర్తించానా? నీ రూములో ఒక పెళ్లికాని ఆడపిల్ల ఎలా ఉంది అని ఆడిగానా? లేదే! కనీసం ఆడమగా తారతమ్యాలు లేక, వావివరసలు లేక వయస్సులో ఉన్న వాళ్ళు ఎలా కలిసి ఉంటారని నిన్ను ఆడిగానా? సామాజిక బాధ్యత కూడా మరిచి జీవిస్తున్నారని చెప్పానా? లేదే! సరే, ఆ అమ్మాయికి చెప్పు. ఆ 'వెండికంచం' ఆమె తలగడ క్రింద దాచి, పోయిందని నీతో చెప్పి నన్ను అడగమంది. కనుక ఇక దాస్తే దాగేది కాదురా, మీ సంబంధం. త్వరగా ఏదో ఒకటి చెప్పు". అంటూ రాసిన తల్లి ప్రత్యుత్తరం చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సాగర్ కి.
**************
留言