top of page
Writer's pictureVaranasi Bhanumurthy Rao

వెన్నెల్లో ఆడపిల్ల




'Vennello Adapilla' - New Telugu Story Written By Varanasi Bhanumurthy Rao

Published In manatelugukathalu.com On 18/12/2023

'వెన్నెల్లో ఆడపిల్ల' తెలుగు కథ

రచన: వారణాసి భానుమూర్తి రావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



పది రోజుల నుండీ ఆ అమ్మాయిని ఆ బస్టాండులో చూస్తున్నాడు శ్రీరాం. తన మోటర్ బైక్ ను కొంచెం ప్రక్కగా ఆపి, ఆమె కోసం ప్రతి రోజూ ఆ బస్టాండ్ లో వైట్ చేస్తాడు శ్రీ రాం. ‌ ఆమె బస్సు ఎక్కి కూర్చున్నాక ఆమె వైపే తదేకంగా చూస్తూ నిలబడతాడు. ఆ తరువాత తన పల్సర్ లో ఆఫీసుకు వెడతాడు. 


తొలి చూపు లోనే ఆమె అందం తనను ఆకట్టుకొంది. బహుశా ఆమెకు పాతికేళ్ళ లోపు వుండవచ్చు. ఆమె అందం ఏ సినిమా హీరోయిన్ కీ తగ్గనిది. ఆ అమ్మాయి ఎంతో సింపుల్ గా, ఎలాంటి మేక్ అప్ లేకుండా స్వచ్చ మైన మందార పూవులా ఉంది. ‌అప్పుడే విచ్చుకొన్న గులాబీ పూవులా అతి సున్నితంగా వుంది. కళ్ళు అచ్చం నెమలి కన్నుల్లా ఉన్నాయి. ‌ఆమె ముఖార విందం అర విరిసిన కలువ పూవులా ఉంది‌. ఆమె దట్టమైన నల్లని కను బొమలు మన్మధ విల్లులా ఉన్నాయి. కోటేరు లాంటి ముక్కు, సంపెంగ లాంటి నాసికా సౌందర్యం అత్యంత ఆకర్హణీయంగా ఉంది. అలాంటి ఆడ పిల్లను ఇంత వరకూ చూడనే లేదు తను. శ్రీరాం ప్రతి రోజూ ఉదయం ఎనిమిది ముప్పావు కు బస్టాండు లో ఆమె కోసం ప్రతి రోజూ వేచి ఉంటాడు. అదే టైం లో ఆమె గూడా బస్సు స్టాప్ కి వస్తుంది. ఆమె తొమ్మిది గంటలకు వచ్చే బస్సులో ఆఫీసుకు వెళ్ళి పోతుంది. పది, పదిహేను నిమిషాలు ఆమెను చూసుకొనే భాగ్యం కలుగుతుంది శ్రీ రాం కు. పది రోజుల నుండీ శ్రీ రాం కి ఇదే తంతు జరుగుతోంది. 


****************************************

"రాఘవా? " 

రూం లోకి వచ్చీ రాగానే పిలిచాడు శ్రీ రాం తన రూం మేట్ ని.

 

"ఏరా? ఏమిటీ విషయం ? కంగారుగా ఉన్నావు? " రాఘవ అడిగాడు‌.

 

"పది రోజుల నుండీ ఒక అందమైన అమ్మాయిని బస్ స్టాప్ లో చూస్తున్నానురా! ఆ అమ్మాయి ఎంత అందంగా వుందో నీకు తెలుసా? ఎందుకో ఆ అమ్మాయిని చూస్తూంటే మా మధ్య ఏదో జన్మ జన్మల సంబంధం వుందనిపిస్తోంది. " అన్నాడు శ్రీ రాం


"ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. ప్రేమ వేరు.. ఆకర్షణ వేరు. అమ్మాయిల కోసం వెంపర్లాడ కుండా ఆఫీసుకు వెళ్ళు. పెద్ద వాళ్ళు చూసిన అమ్మాయిని పెళ్ళి చేసుకో ! వాళ్ళయితే అన్ని విషయాలు ఆలోచించి, మంచి సంబంధాలు వెతికి పెడతారు. ఇదే నా సజెషన్. ఆ తరువాత నీ ఇష్టం. " అన్నాడు రాఘవ. 


"లేదురా‌‌! ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఎలాగైనా ఆ అమ్మాయితో మాట్లాడతాను" అన్నాడు శ్రీరాం. 


"సూపర్ రా! అలాంటి గట్స్ వుంటే ప్రొసీడ్ అయిపో! కానీ ఒక్క మాట గుర్తుంచుకో! ప్రేమించడానికి ధైర్యం కావాలి. ప్రేమించ బడడానికి అదృష్టం గావాలి. నువ్వు ప్రేమించ బడాలి అంటే నువ్వు నిజాయితీగా కనబడాలి. నీ బాడీ లాంగ్వేజ్, నీ బిహేవియర్ డీసెంట్ గా వుండాలి. డ్రస్ సెన్స్ వుండాలి. ‌ఏదో బైక్ వుంది గదా అని నువ్వు బాధ్యతా రహితంగా ప్రవర్తించావనుకో ! ఇక అంతే! ఆ అమ్మాయి నీ మొహం గూడ చూడదు. ప్రేమ అంటే త్యాగం. ఒకరికొకరు త్యాగాలు చేసు కోవాలి" అని అన్నాడు రాఘవ. 


రాఘవ శ్రీ రాం కంటే రెండేళ్ళు పెద్ద. అందుకే కొన్ని విషయాల్లో ఒక అన్నయ్య లాగా అడ్వైస్ చేస్తుంటాడు. 


"అన్నింటికీ నేను సిద్ధం రా! ఆ అమ్మాయి కోసం నేను ఏ త్యాగం చెయ్యడానికైనా సిద్ధం" అన్నాడు శ్రీ రాం. 


******************************************

ఆ మరుసటి రోజు ఉదయం.. 

బస్టాపుకు ముందుగానే చేరుకొన్నాడు శ్రీ రాం. పల్సర్ బైక్ ని ఒక ప్రక్కగా స్టాండ్ వేసి బస్ బే కి వచ్చి నిలబడుకొన్నాడు. 


ఆ అమ్మాయి వచ్చింది. అప్సరసలా లేత గులాబీ రంగు చీరలో అదిరి పోయింది. 


శ్రీ రాం ఆమె వైపే తదేకంగా చూస్తున్నాడు. జోబీలో ఒక గులాబీ పూవును తెచ్చి దాచు కొన్నాడు. ప్రతి రోజూ తన లవ్ ని ప్రపోజ్ చెయ్యడానికి ఒక గులాబీ పూవును తెచ్చు కొంటాడు శ్రీ రాం. ఆమె ఆ రోజు తొమ్మిది గంటలకు వచ్చే బస్సు ఎక్క లేదు. ఇదే మంచి చాన్స్ అనుకొని ఆమె దగ్గరగా వెళ్ళి ఒక చిరు నవ్వు నవ్వాడు. పది రోజుల నుండీ ఆ అమ్మాయి గూడా శ్రీ రాం ని గమనిస్తూనే ఉంది. దగ్గరగా వెళ్ళి ఆమెతో మాట్లాడి తన పల్సర్ బైక్ మీద ఎక్కించుకొని తన ఆఫీసు దగ్గర డ్రాప్ చెయ్యాలను కొన్నాడు శ్రీ రాం. 


అంతలోనే ఒక అందమైన కుర్రాడు ఆరడుగుల పొడవు, నీట్ గా టక్ చేసుకొన్న డ్రస్సు, పాలీష్డ్ బాటా షూ వేసుకొని తన హీరో హోండా బైక్ తో వచ్చి ఆమె ముందు ఆపాడు. 


ఆ అమ్మాయి అతడి వెనకాల బైక్ లో కూర్చొని వెళ్ళి పోయింది. 


శ్రీ రాం హుతాశు డై పొయ్యాడు. ఎవరో తన గుండెను లాక్కొన్నట్లు ఫీల్ అయిపొయ్యాడు. కళ్ళల్లో కన్నీరు వుబికింది. దిగాలుగా బైక్ స్టార్ట్ చేసి ఆఫీసుకు వెళ్ళి పొయ్యాడు. 


ఆఫీసుకు వెళ్ళాడన్న మాటే గానీ మనసు మనసులో లేదు. వేదన, నిరుత్సాహం. స్వేదం తో నిండిన తన ముఖాన్ని జేబు రుమాలుతో తుడుచు కొన్నాడు. జీవితంలో ఏదో విలువైన అవకాశాన్ని చేజారి పోయినట్లు అశాంతి, బాధ. ఒంట్లో నలతగా ఉందని ఆఫీసులో అర్థ రోజు లీవు పెట్టి ఇంటికి వెళ్ళి పొయ్యాడు. 


***************************************

శ్రీ రాం రూం కి చేరుకొన్నాడు‌. రాఘవ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ‌ 


 "ఏరా ? ఆఫీసుకు పోలేదా? " అన్నాడు రాఘవ. 

 

 "లేదురా! ఈ రోజు నా లైఫ్ లోనే ఒక బాడ్ ఎక్స్ పీరియన్స్ జరిగింది. " అని కుర్చీలో వాలిపోతూ తల వెంట్రుకల్లో తల దూర్చుకొని గట్టిగా అరచాడు. 


"బీ.. కూల్.. ఏమయిందో చెప్పరా వివరంగా? " శ్రీ రాం అన్నాడు. 


"అదే.. అదే.. ఆ అమ్మాయి గురించి నేను చెప్పాను గదా? కానీ ఆ అమ్మాయి ఈ రోజు ఇంకొక బాయ్ ఫ్రెండ్ తో బైక్ మీద కూర్చొని వెళ్ళి పోయింది. ‌ ఇట్ హర్ట్స్ మీ ఏ లాట్ ! " అన్నాడు శ్రీ రాం. అతని గొంతు వణుకు తోంది. మనిషి నీరసంగా ఉన్నాడు. 


"డోంట్ వర్రీ రా! ఇంకా అమ్మాయి నీకు పరిచయం కాలేదు. నీ ప్రేమను వ్యక్త పరచనే లేదు. మళ్ళీ ప్రయత్నించు. ఆ అమ్మాయి అతని బైక్ వెనకాల కూర్చొన్నంత మాత్రాన, అతడ్ని ప్రేమించిందని ఎలా అనుకొంటావు? రేపు ప్రయత్నించు. " అన్నాడు రాఘవ 


"రేపు ఆ అమ్మాయితో మాట్లాడడానికి ప్రయత్నిస్తానురా! " 


"నిజంగా నాకు ఎక్కడో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తోంది. నా సిక్స్త్ సెన్స్ చెబుతోంది. రేపు ఆ అమ్మాయి తప్పని సరిగా నీతో మాట్లాడుతుంది. నిన్ను ప్రతి రోజూ చూస్తోంది గదా! రేపు ట్రై చెయ్యి. విష్ యూ ఆల్ ది బెస్ట్ " అన్నాడు రాఘవ. 

*************************************


ఉదయం ట్రిమ్ గా తయారయి నీట్ గా డ్రస్ వేసుకొని బస్ స్టాప్ కి వెళ్ళాడు శ్రీ రాం. ‌ ఆ అమ్మాయి‌ కోసం వేయి కళ్ళతో వేచి యున్నాడు. ఆ అమ్మాయి అనుకొన్న టైం కంటే ముందుగానే వచ్చింది. 


శ్రీ రాం ఆనందానికి అవధులు లేవు. 


ధైర్యం చేసి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు శ్రీరాం. ఆ రోజు శుక్ర వారం. తలకు పోసుకొని జారి పోతున్న నీలి ముంగురులు గాలికి కదులు తున్నాయి. ఒక గులాబీ పూవు ఆమె తలలో మెరిసి పోతున్నది. అందమైన ఆమె వదనం ఉదయ భానుడిలా ప్రకాశిస్తోంది. పసిడి రంగుతో ఉన్న ఆమె శరీరం మెరుపు తీగలా ఉంది. 


"గుడ్ మార్నింగ్ అండీ! నా పేరు శ్రీ రాం. మిమ్మల్ని పది పదిహేను రోజుల్ని చూస్తూ ఉన్నాను. ‌ ఎందుకో మీరంటే నాకిష్టం. ప్రతి రోజూ మిమ్మల్ని చూడాలనిపిస్తోంది. ‌ అందుకే ప్రతి రోజూ ఈ బస్ స్టాప్ కి వస్తున్నాను. " అన్నాడు శ్రీరాం‌. 


ఆమె నవ్వింది, శ్రీ రాం ముఖం వైపు చూస్తూ. శ్రీరాం ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆమె కళ్ళు ఎంతో అందంగా వున్నాయి. ఆమె కళ్ళల్లో తన ప్రతి బింబం కన బడుతోంది. 


ఆమె నవ్వి నప్పుడు తెల్లని వజ్రాల్లాంటి పలువరస ను చూసి మైమరచి పొయ్యాడు శ్రీరాం. 


 తన ఎదురుగా ఏదో దేవ కన్య నిలబడినట్లుగా ఫీల్ అయ్యాడు శ్రీరాం. 


దేవుడు కొందరిని అలా సృష్టిస్తాడు. అంద మైన దేహాన్ని ఇవ్వడమే కాదు, తరగని చిరునవ్వును, మొహంలో ఒక దివ్య మైన కాంతిని, కళ్ళల్లో ఒక విద్యుత్ లాంటి వెలుగును అద్దుతాడు. ఈ ప్రపంచంలో స్త్రీ సౌందర్యాన్ని వర్ణించడానికి కవులు మహా కావ్యాలు వ్రాశారు. ఇంకా అక్షరాలకు గూడా సరి పోని అజంతా సుందరిలా ఉన్న ఆమెను చూసి తన్మయత్వం చెందాడు శ్రీ రాం. 


"నేను ఇక్కడే ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో టీం లీడర్ గా పని చేస్తున్నాను. మీరు.. " అన్నాడు శ్రీరాం. 

ఆమె బదులు చెప్ప లేదు. నవ్వి వూరుకొంది. 


జోబీలో గులాబీ పూవున్నా లవ్ ప్రపోజ్ చెయ్యడానికి అది సరయిన టైం గాదనిపిస్తోంది శ్రీరాం కి. 


"మీ పేరు తెలుసు కోవచ్చా? " అడిగాడు శ్రీరాం సంశయంగా. అప్రయత్నంగా ఆమెతో కర చాలనం చెయ్యడానికి తన కుడి చేతిని అందించాడు. 


ఆమె గూడా అప్రయత్నంగా తన మృదువైన చిగురు ఆకు లాంటి చేతిని అందించింది నవ్వుతూ. 


శ్రీరాం సుతారంగా ఆమె చేతిని అందుకొని కరచాలనం చేశాడు. ఆమె చేతి స్పర్శతో విద్యుత్ తరంగాలు తన శరీరమంతా ప్రాకినట్లు ఫీల్ అయిపొయ్యాడు శ్రీరాం. ఒళ్ళంతా గగుర్పాటు చెందింది. 


అంతలో ఆమె బస్సు వచ్చి ఆగింది. ఆమె ఆ బస్సు ఎక్కి వెళ్ళి పోయింది. 

 

**************************************


శ్రీ రాం ఆనందానికి అవధుల్లేవు. తన ప్రేమకు తొలి బీజం పడింది నేడు. మొదటి పరిచయం అదిరి పోయింది. ‌తనను ఆమె గుర్తించింది. చేయి కలిపింది. ఆమె మనసులో తను ఒక స్థానం సంపాయించాడు. ఎలాగైనా ఆమెను ఒప్పించి తన లైఫ్ పార్ట్నర్ గా చేసు కోవాలని నిశ్చయించు కొన్నాడు శ్రీరాం. 


శ్రీ రాం రాఘవతో జరిగిన కథంతా చెప్పేశాడు. రాఘవ "గో అహెడ్" అని అన్నాడు. 


******************************************

మరుసటి రోజు శ్రీ రాం బస్ స్టాప్ లో ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు. అనుకొన్నట్లుగానే ఆ అమ్మాయి వచ్చింది నాట్య మయూరిలా. ఆమె మెడలో తన ఆఫీసు ఐడి కార్డు వ్రేలాడుతోంది. శ్రీ రాం ఆమెకు దగ్గరగా వెళ్లి "హాయ్" అని పలకరించాడు. 


"ఈ రోజు మీరు ఏమీ అనుకోక పోతే మిమ్మల్ని నా బైక్ మీద ఆఫీసుకు దింపుతాను. టైం‌ గూడా తొమ్మిది దాటింది. మీ బస్సు ఇంకా రాలేదు" అన్నాడు శ్రీ రాం ధైర్యం చేసి. 


ఆమె ఏమీ మాట్లాడ లేదు. సరే అని కళ్ళతో జవాబు ఇచ్చింది. 


శ్రీ రాం ఒక్క ఉదుటున వెళ్ళి పల్సర్ స్తార్ట్ చేశాడు. ఆ అమ్మాయి వచ్చి వెనక కూర్చొంది. 


పది హేను నిముషాల్లో ఆమె దిగ వలసిన ఆఫీసు చూపించింది. 


అదొక్క పెద్ద కార్పోరేట్ హాస్పిటల్. ఖరీదయిన పోష్ లొకాలిటీ లో ఉంది. 


ఆమె మెడలోని ఐ డి కార్డును పరికించి చూశాడు. 


"శ్రీ దేవి" అని బోల్డ్ అక్షరాలు కనిపించాయి. మిగతా వివరాలు చదివే లోపల ఆమె నవ్వుతూ హాస్పిటల్ సెక్యూరిటీ మైన్ గేట్ దాటి లోపలికి వెళ్ళి పోయింది. 


"శ్రీ దేవి" ఎంత అంద మైన పేరు. పేరుకు తగ్గట్లు మహా లక్ష్మిలా వుంది అని అనుకొన్నాడు శ్రీ రాం. 


కానీ శ్రీరాం కి ఒక్కటే కొరతగా ఉంది. ఆమె ఒక్క మాట గూడా తనతో మాట్లాడడం లేదు. కనీసం థాంక్స్ గూడా చెప్పలేదు. 

*****************************************

మరుసటి రోజు గూడా శ్రీ రాం ఆమెను ఆఫీసు వరకు డ్రాప్ చెయ్యాలని ఆ బస్ స్టాప్ కి వచ్చాడు. కానీ ఆమె ఆ రోజు రాలేదు. మళ్ళీ రెండు మూడు రోజులు వెళ్ళి చూశాడు. ఆమె బస్ స్టాప్ లో ఎక్కడా కనబడ లేదు. అమె అక్కడకు రావడం మానేసింది. శ్రీ రాం బాగా డీలా పడి పొయ్యాడు. తనే మయినా తప్పు చేశాడా? తొందర పడ్డాడా? అని తనలో తాను మథన పడ సాగాడు. 


పది రోజుల తరువాత శ్రీ రాం నేరుగా తను పని చేస్తున్న కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్ళాడు. అక్కడ రిసెప్షన్ లో పని చేస్తున్న ఒక అమ్మాయిని శ్రీ దేవి గురించి వాకబు చేశాడు. 


"శ్రీ దేవి వారం రోజుల నుండీ ఆఫీసుకు రావడం లేదండీ.. ఆఫీసుకి సెలవు పెట్టిందేమో !” అన్నది ఆ రిసెప్షనిస్ట్. 


"నేను ఆమె ఫ్రెండ్ ని అండీ.. ఇక్కడే ఒక ఎమ్ ఎన్ సీ లో పని చేస్తున్నాను. శ్రీ దేవి గారి ఇంటి అడ్రస్సు, మొబైల్ నంబర్ ఇస్తారా? " అని అడిగాడు శ్రీ రాం. 


"ఇలా క్రొత్త వ్యక్తులకు అడ్రస్స్ ఇవ్వరండీ.. ఐ ఆమ్ సారీ !" అన్నది ఆమె కటువుగా. 


“సారీ మేడం. నేను వారి మామయ్య కొడుకుని. అర్జంటుగా ఒక విషయం మాట్లాడాలి. నాకు అడ్రస్ తెలియదు. " అన్నాడు శ్రీ రాం. 


శ్రీ రాం సిన్సియర్ గా అడుగుతున్నాడని అనుకొని సరే నని ఆ అమ్మాయి తన లాప్ టాప్ లో ఎంప్లాయీస్ డీటైల్స్ వెతికి శ్రీ దేవి అడ్రస్ మరియు మొబైల్ నెంబర్ ఇచ్చింది. 


" చాలా థాంక్స్ మేడం " అని శ్రీరాం అక్కడ నుండి సర్రున జారుకొన్నాడు. 

****************************************


స్పీడ్ గా తన పల్సర్ ని పోనిచ్చాడు శ్రీరాం. గూగుల్ మాప్ లో వచ్చే రూట్ ని ఫాలో అవుతూ శ్రీదేవి ఇల్లు చేరుకొన్నాడు. 


ఇంటి తలుపు కొడుతూనే, ఒక పెద్దాయన బయటకొచ్చాడు. 


"ఎవరు బాబూ మీరు?" ఆన్నాడు ఆ పెద్దాయన. 


"శ్రీ దేవి గారు ఇల్లు ఇదేనాండీ" అన్నాడు శ్రీ రాం. 


"అవునండీ. మా అమ్మాయే. నేను శ్రీదేవి నాన్నని. నా పేరు సుబ్బ రామయ్య" 


"శ్రీ దేవి ఎక్కడ? " ఆదుర్దాగా అడిగాడు శ్రీరాం. 


"తెలియదు బాబూ.. పది రోజుల నుండీ ఆఫీసుకు గూడా పోవడం లేదు" అన్నాడు సుబ్బ రామయ్య. 


"ఇంతకూ శ్రీ దేవి ఆఫీసుకు ఎందుకు వెళ్ళడం లేదు? " అని అడిగాడు శ్రీరాం‌. 


సుబ్బ రామయ్య మొహంలో విషాద ఛాయలు అలుము‌కొన్నాయి. 


"మిమ్మల్ని బాధ పెట్టానా? నన్ను క్షమించండి సార్! " అని శ్రీ రాం వంగి అతని పాదాలకు నమస్కరించ బొయ్యాడు. 


సుబ్బరామయ్య వారిస్తూ శ్రీరాం ని ఒక కుర్చీలో కూర్చో మన్నాడు. 


"బాబూ.. నాకు ఒక్కగా నొక్క కూతురు శ్రీ దేవి. ఆమెను అల్లారు ముద్దుగా పెంచు కొన్నాము. చూడ చక్కని పిల్ల. అమ్మాయి పీ జీ కోర్సు చేసింది. బాగా చదివింది. కానీ భగవంతుడు ఒకటి మాత్రం మా అమ్మాయికి ఇవ్వ లేదు. " అని రెండు చేతులూ ముఖానికి కప్పుకొని వలవల మని ఏడ్చాడు సుబ్బరామయ్య. 


"సార్.. మీరు నిబ్బరంగా ఉండాలి. అసలు ఏమయిందో చెప్పండి. నేను మీకేమైనా సహాయం చెయ్యగలనా? " అని సుబ్బరామయ్యను పొదివి పట్టుకొన్నాడు. 


"శ్రీ దేవి అమ్మ గారెక్కడ? " 


"నా భార్య చని పోయి పది సంవత్సరాలయింది బాబూ! అప్పటి నుండి మా అమ్మాయి ఆలనా పాలనా నేనే చూసుకొంటున్నాను. నా కూతురు అమాయకు రాలు. చిన్న తనం లోనే దానికి ఎన్ని కష్టాలు పెట్టాడో ఆ భగవంతుడు. " అన్నాడు సుబ్బరామయ్య. 


"అసలు ఏమి జరిగింది? " 


"మా అమ్మాయికి మాటలు రావు బాబూ! పుట్టుక తోనే మూగ పిల్ల. అందుకే అమ్నాయి ఎవ్వరితోనూ ఎక్కువ కలవదు. ఏకాంతంగా ఉండడానికి ఇష్ట పడుతుంది. అమ్మాయికి ఈ మధ్య ఆ కార్పొరేట్ హాస్పిటల్ లో డంబ్ అండ్ డెఫ్ కౌన్సిలర్ గా ఉద్యోగం వచ్చింది. మంచి జీతం ఇస్తారు. ‌ కానీ నా బెంగ ఆమె వివాహం గురించే!” అన్నాడు సుబ్బ రామయ్య. 


శ్రీ రాం స్థాణువై నిలుచుండి పొయ్యాడు. తన మైండ్ బ్లాంక్ అయిపోయింది. 


"ఏమిటీ? ఇంత అందమైన శ్రీదేవి మూగదా? మాటలు రావా? హే ! భగవాన్ ! ఏమిటీ పరీక్ష? " 


"మా అమ్మాయి ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో పీజీ డిప్లొమా చేసింది. అప్పటి నుండి డంబ్ అండ్ డెఫ్ టీచర్ గా ఒక స్కూల్లో పని చేసింది. ఈ మధ్యనే ఈ అసుపత్రిలో కౌన్సిలర్ గా జాబ్ వచ్చింది. " అన్నాడు సుబ్బ రామయ్య. 


"రండి. శ్రీదేవి ఎక్కడుందో వెతుకు దాం !" అన్నాడు శ్రీరాం. 


వెంటనే తన పల్సర్ బైక్ స్టార్ట్ చేసి సుబ్బరామయ్య వెనక కూర్చోగా శ్రీదేవిని వెతకడానికి బయలు దేరారు ఇద్దరూ. 


"మా అమ్మాయికి‌ మూడ్ బాగా లేదంటే మెట్రో రైలెక్కి మియాపూర్ - నాగోల్ వరకు అలా వెడుతూ ఉంటుంది. పది మందిలో తిరుగుతూ వుంటే తన బాధ మటు మాయం అవుతుందని ఆమె నాకు సైగల ద్వారా చెప్పేది" అన్నాడు సుబ్బరామయ్య. 


శ్రీ కాంత్, సుబ్బ రామయ్య అమీర్ పేట్ జంక్షన్ లో నాగోల్ వైపు వెళ్ళే మెట్రో ఎక్కారు. 


మధ్య మధ్యలో స్టేషన్ల ను చూస్తూ వెళ్ళారు. 


మెట్రో రైలు నాగోల్ స్టేషన్‌ చేరింది. ‌ ఇద్దరూ హడావుడిగా స్టేషన్ అంతా తిరిగారు. రిటైరింగ్ రూం లో ఒక ఛేర్ లో కూర్చొని ఏదో మాగ్ జైన్ చదువుతోంది శ్రీ దేవి. 


శ్రీ రాం‌, సుబ్బ రామయ్య ఒక్క వుదుటున శ్రీ దేవిని చేరుకొన్నారు. ‌


సుబ్బరామయ్య శ్రీ దేవిని‌ పొదివి పట్టుకొని ఏడ్వ సాగాడు. ‌ తన కేమీ కాలేదంటూ సైగ చేసింది శ్రీ దేవి. ‌శ్రీ రాం ను చూస్తూనే ఒకింత సంభ్రమాశ్చర్యాలతో మునిగి తేలింది శ్రీ దేవి. 


"అమ్మా - శ్రీదేవీ ! నీ కోసం ఎవరొచ్చారో చూడు?" అన్నాడు సుబ్బ రామయ్య. 


శ్రీ రాం ని చూసి సిగ్గుల మొగ్గయింది శ్రీ దేవి. ఆమె బుగ్గలు ఎర్రగా మారాయి. 


"ఐ లవ్ యూ " తన బ్లేజర్ లో దాచి వుంచిన గులాబీ పూవును ఇస్తూ అన్నాడు శ్రీ రాం. 


 ఐ లవ్ యూ టూ" అంటూ తన పెన్ తీసుకొని అర చేతి మీద వ్రాసి చూపించింది శ్రీ దేవి. 


ఆమె కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు ధారా పాతంగా వర్షిస్తున్నాయి. 


"నీకు మాటలు రావని దిగులు పడకు శ్రీ దేవీ! నీకు జీవితాంతం తోడు ఉంటాను. ‌ ఈ రోజు నుండీ నా పలుకులే నీ మాటలు. ‌నీ మూగ తనం నా ప్రేమకు అడ్డు రాదు.‌" అంటూ శ్రీ దేవిని హత్తు‌కొన్నాడు శ్రీరాం. 


సుబ్బరామయ్య రెండు చేతులూ జోడించి నమస్కరించాడు శ్రీరాం కు. 


శ్రీ రాం, శ్రీ దేవి ఇద్దరూ తండ్రి పాదాలకు నమస్కరించ బొయ్యారు. 


సుబ్బ రామయ్య ఇద్దరినీ తన హృదయానికి హత్తుకొని మనః స్ఫూర్తిగా దీవించాడు. 

***

వారణాసి భానుమూర్తి రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

వారణాసి భానుమూర్తి రావు గారు ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె లో జన్మించాడు. అతను వృత్తిరీత్యా కార్పొరేట్ కంపెనీలల్లో ముఖ్య ఆర్థిక కార్య నిర్వహణాధికారిగా పనిచేసాడు. ప్రవృత్తి రీత్యా కథలు , వచన కవితలు రాస్తున్నాడు. ఇప్పటికి అతను 60 కథానికలు, 600 దాకా వచన కవితలు రాశాడు. అతని కథలు ఆంధ్ర జ్యోతి , విజేత , ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో 1981 లో 'జీవన గతులు ' అనే కథ అచ్చయ్యింది. తరువాత' ఈ దేశం ఏమై పోతోంది? ' అనే అదివారం ఆంధ్రప్రభ దిన పత్రిక లో అచ్చయ్యింది. ఆంధ్ర జ్యోతిలో పది కథలు దాకా అచ్చయ్యాయి. నల్లటి నిజం , జన్మ భూమి , అంతర్యుద్ధం , వాన దేముడా! లాంటి కథలు అచ్చు అయ్యాయి. 2000లో "*సాగర మథనం* ", 2005 లో " *సముద్ర ఘోష*" అనే కవిత సంపుటిలను ప్రచురించాడు. అందులో "సముద్ర ఘోష" పుస్తకాన్ని అక్కినేని నాగేశ్వర రావు గారికి అంకితం చేశారు. ఈ పుస్తకాన్ని జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి. నారాయణ రెడ్డి విడుదల చేసారు. అతను రాసిన కథ "పెద్ద కొడుకు" ( రాయల సీమ రైతు బిడ్డ మీద కథాంశం) భావగీతి ప్రతిలిపి 2014 కథల పోటీలో ప్రతిలిపి ద్వారా ప్రత్యేక బహుమతి పొందింది.ఈ కథను 60000 మంది పాఠకులు చదివారు. 4500 మంది స్పందించారు.

వారణాసి భానుమూర్తి రావు రాయలసీమ వ్యవహారిక బాషలో వ్రాయడానికి ఇష్టపడతారు.ఇప్పుడు " రాచపల్లి కథలు " , " నాన్నకు జాబు " అని తమ చిన్ననాటి అనుభవాలన్నింటినీ అక్షర రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు.‌ .అలాగే తన మొట్టమొదటి నవలా ప్రక్రియను " సంస్కార సమేత రెడ్డి నాయుడు " తెలుగు వారి కోసం వ్రాశారు .ఆ తరువాత '' వరూధిని - ప్రవరాఖ్య '' శృంగార ప్రబంధ కావ్యాన్ని తమ దైన శైలిలో నవలీ కరణ చేశారు . కరోనా పై వీరు రాసిన కవిత ఆంధ్ర ప్రభలో ప్రచురించారు. సాహిత్య రంగంలో విశేషమైన ప్రతిభ ను కనబరచిన వీరికి సాహితీ భూషణ , ప్రతిలిపి కవితా ప్రపూర్ణ ,సహస్ర కవి రత్న అనే బిరుదులు లభించాయి.

వారణాసి భానుమూర్తి రావు గారు ఇటీవల అనగా ఏప్రిల్‌ నెల 2022 లో రెండు పుస్తకాలు పాఠక లోకానికి అందించారు. 1. *మట్టి వేదం* కవితా సంపుటి 2. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* తెలుగు నవల . గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ వారిచే సాహిత్య రంగంలో విశేష మైన సేవలు చేసినందుకు గానూ , వీరి *మట్టి వేదం* కవితా సంపుటికి , *గిడుగు రామమూర్తి సాహిత్య పురస్కారం -2022* ని అందు కొన్నారు.

తెలుగు కవులు లో వారణాసి వారి కథలు రాయల సీమ గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో కలిగి వుంటాయి.చిత్తూరు జిల్లాకు చెందిన వారణాసి భానుమూర్తి గారి కథలు , కవితలు వివిధ ఆన్ లైన్‌ పత్రికలలో వచ్చాయి. త్వరలో మరి కొన్ని నవలలు , కథల సంపుటాలు , కవితా సంకలనాలు వెలువడుతున్నాయి.ఇంతవరకు మూడు కవితా సంపుటిలు , ఒక నవలను పాఠక లోకానికి అందించారు.

*వీరి ముద్రిత రచనలు*------------------

1. *సాగర మథనం* : 2000 సంవత్సరంలో అవిష్కరించారు. డాక్టర్ గోపీ గారు , తెలుగు అకాడమీ ప్రధాన సంచాలకులు , ఈ కవితా సంపుటి మీద ముందు మాట వ్రాశారు.

2. *సముద్ర ఘోష*: 90 కవితలున్న ఈ కవితా సంపుటి 2005 సంవత్సరంలో జ్డానపీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు ( సినారె) అవిష్కరించారు. ఈ పుస్తకాన్ని , పద్మ విభూషణ్ డాక్టర్ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకిత మిచ్చారు .

3. *మట్టి వేదం* : 70 కవితలున్న ఈ కవితా సంకలనాన్ని 2022 ఏప్రిల్‌ నెల 17 వ తేదీ వెలువరించారు.‌ ఈ పుస్తకానికి కే రే జగదీష్ గారు , ప్రముఖ కవి , జర్నలిస్టు ముందు మాట వ్రాశారు

4. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* : ఇది రచయిత గారి తొలి నవలా ప్రక్రియ. ఈ నవల 17 ఏప్రిల్ 2022 నాడు అవిష్కరణ జరిగింది. ఈ నవల రాయల సీమ కక్షలు , ఫాక్షన్ ల మధ్య ఎలా రెండు కుటుంబాలు , రెండు గ్రామాలు నలిగి పొయ్యాయో తెలిపిన కథ. శ్రీమతి రాధికా ప్రసాద్ గారు ఈ నవలకు ముందు మాట వ్రాశారు. ఈ నవలకు ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 అందు కొన్నారు.

5. *పెద్ద కొడుకు* : 19 కథల సంపుటి. వారణాసి భానుమూర్తి రావు గారు వ్రాసిన కథల సంపుటి *పెద్ద కొడుకు* తుమ్మల పల్లి కళా క్షేత్రం , విజయ వాడ లో మల్లె తీగ వారు నిర్వహించిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు , ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చేర్ పర్సన్ , కళారత్న శ్రీ బిక్కి కృష్ణ , తదితరుల చేతుల మీదుగా 20.11.2022 తేదీన అవిష్కరించారు. ఇందులో 19 కథలు ఉన్నాయి. ప్రతి కథ ఆణి ముత్యమే. కళా రత్న శ్రీ బిక్కి కృష్ణ గారు ముందు మాట వ్రాసిన ఈ పెద్ద కొడుకు కథల సంపుటి మానవీయ విలువల్ని అనేక కోణాల్లో రచయిత స్పృశించారు. వారణాసి గారు ఈ " పెద్ద కొడుకు " కథల సంపుటిని పాఠక లోకానికి అందించారు. ఇందులోని కథలన్నీ ఆణి ముత్యాలే! సమాజానికి సందేశ మిచ్చే కథలే!

*అముద్రిత రచనలు*

1 . *వరూధిని ప్రవరాఖ్య* : అల్లసాని పెద్దన గారి మను చరిత్రము నవలీ కరణ చేశారు‌. ఇది ఇంకా అముద్రితము.త్వరలో ప్రచురణకు వస్తుంది.

2 .*రాచ పల్లి కథలు* : తన చిన్న నాటి అనుభూతుల్ని , గ్రామీణ ప్రాంతాల్లో తను గడిపిన అనుభవాల్ని క్రోడీకరించి వ్రాసిన కథానికలు . త్వరలో ప్రచురణకు వస్తుంది.

3 . *నాలుగవ కవితా సంపుటి* త్వరలో వస్తుంది.

4 . *నాయనకు జాబు* అనే ధారావాహిక ఇప్పుడు వ్రాస్తున్నారు. లేఖా సాహిత్యం ద్వారా కథను వాస్తవిక సంఘటనలతో చెప్పడం ఈ జాబుల ప్రత్యేకత.

*విద్యాభ్యాసం*-----------

వారణాసి భానుమూర్తి గారి విద్యాభ్యాసం అంతా చిత్తూరు జిల్లాలో జరిగినది.

ఐదవ తరగతి వరకూ ప్రాధమిక పాఠశాల మహల్ లో , తరువాత ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకూ మహల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగింది. ఆ తరువాత తొమ్మిది , పది తరగతులు మేడికుర్తి కలికిరి చిత్తూరు జిల్లా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల లో చదివారు.‌ ఇంటర్మీడియట్ మరియు బి కాం బీ.టీ కాలేజీలో చదివారు.‌ తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఎస్ వీ యూనివర్సిటీ లో చదివారు.‌ వుద్యోగ నిమిత్తం హైదరాబాదు వెళ్ళిన తరువాత అక్కడ కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అక్కౌంటన్సీ ( FCMA) చేశారు.‌ ప్రొఫెషనల్ అక్కౌంట్స్ లో నిష్ణాతులయ్యారు.

*వృత్తి*------

వారణాసి భానుమూర్తి గారు అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ జనరల్ మేనేజర్ గా వివిధ కార్పోరేట్ కంపెనీలల్లో పని చేశారు. హైదరాబాదు మహా నగర మంచి నీటి సరఫరా మరియు మురుగు నీటి సంస్థలో చీఫ్ జనరల్ మేనేజర్ (అక్కౌంట్స్) గా పని చేశారు.ఒక పేరు పొందిన నిర్మాణ సంస్థలో సీనియర్ జనరల్ మేనేజర్ (అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ ) గా పని చేసి వివిధ బాధ్యతలను 36 సంవత్సరాల పాటు నిర్వర్తించారు. కాస్ట్ అక్కౌంట్స్ హైదరాబాదు చాప్టర్ కి వైస్ చేర్మన్ హోదాలో బాధ్యతలను నిర్వర్తించారు.

వృత్తి ఏమైనప్పటికీ , ప్రవృత్తిగా కవిగా , రచయితగా రాణించారు. పదవ తరగతి నుండీ కవితలు , కథానికలు వ్రాశారు.ఇతని కథలు , కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‌

ఇతనికి ఇంత వరకు లభించిన బిరుదులు;1. ప్రతిలిపి కవితా ప్రపూర్ణ2. సహస్ర కవి రత్న3. సాహితీ భూషణ4. గిడుగు రామమూర్తి వారి సాహిత్య పురస్కారం 2022 లో.5. ప్రతిలిపి సాహిత్య అవార్డు - 20216. కళావేదిక వారి సాహితీ పురస్కారం 31.12.2022 న అందుకొన్నారు.


90 views0 comments

Comentários


bottom of page