top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

వెంటాడే నీడ ఎపిసోడ్ 14

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Ventade Nida Episode 14'

Written By Mallavarapu Seetharam Kumar

రచన: మల్లవరపు సీతారాం కుమార్



గత ఎపిసోడ్ లో…

దీక్ష ఆపదలో ఉందనీ, కాపాడమనీ చెబుతాడు సుమంత్.

ఏ సీ పీ ప్రతాప్, హాస్పిటల్ లో ఉన్న వికాస్ ని కలుస్తాడు.

వికాస్ రైడ్ చేసి పట్టుకున్న డెబ్బై కోట్లు, గోవర్ధన రావు అనే మాజీ మినిష్టర్ ది అని చెబుతాడు ప్రతాప్.

ఇక చదవండి…



గోవర్ధన్ అనే పేరు ఎక్కడ విన్నానా అని ఆలోచిస్తాడు వికాస్.

ఆ రోజు మామయ్య శ్యామలరావుకి కాల్ చేసి, మామిడి తోట దగ్గర విశాల్ కోసం విచారించమంటాడు తను. మామయ్య తిరిగి కాల్ చేసి, అక్కడెవరూ లేరనీ, గోవర్ధన్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడనీ, విశాల్ వాళ్ళందరూ వెళ్లిపోయారని చెప్పాడని అన్నాడు.

ఆ మామిడి తోట దగ్గరే తన తమ్ముడి స్నేహితుడు సుమంత్ కనబడకుండా పోయాడు.

సుమంత్ తనమీద ఒక వికృతాకారం దాడి చేసిందని విశాల్ తో చెప్పాడు.

తోట దగ్గర విశాల్ ఫోన్ మిస్ అయింది.

ఇక హాస్పిటల్ లో తనకు డాష్ ఇచ్చిన వ్యక్తి, తన పేరు డాక్టర్ గోవర్ధన్ అని చెప్పాడు.

అతనే శ్రేయ మీద మర్డర్ అటెంప్ట్ చేసాడు.

ఇంటి దగ్గర తన కొడుకు విభవ్ ని కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నించిన వ్యక్తి తన పేరు గోవర్ధన్ అని, నాన్నతో చెప్పాడు.

ఇప్పుడు ఏ సీ పీ ప్రతాప్ గారి మాటల్లో గోవర్ధన రావు అనే పేరు వచ్చింది.

ఈ పేరుకు తమ కుటుంబానికి ఉన్న శత్రుత్వం ఏమిటి?

లేక ఇదంతా కాకతాళీయమా?

తన సందేహాలను ప్రతాప్ తో చెప్పాడు వికాస్.

హాస్పిటల్లో దాడి చేసిన వ్యక్తి, మీ అబ్బాయిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి ఒక్కరే అయి ఉండవచ్చు. మీ ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ రికార్డింగ్స్ వస్తే అతన్ని గుర్తించవచ్చు.

ఇక కంచికచర్ల దగ్గర మామిడి తోటలో, ఒక వ్యక్తి మీ వాళ్లకు తన పేరు గోవర్ధన్ అని చెప్పడం కేవలం కాకతాళీయం అయి ఉండవచ్చు.


కానీ అక్కడ ఒక వ్యక్తి కనిపించకుండా పోవడం, అతనికి కలలో ఒక ఆకారం కనిపించి భయపెట్టడం గురించి విచారణ జరపాలి.

ఒక కేసు విషయం గా మా సిఐ విజయవాడ వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఒకవేళ అతను ఆ కంచికచర్ల పరిసర ప్రాంతాల్లో ఉంటే, ఆ తోట దగ్గరకు వెళ్లి ఆ తోటమాలిని గానీ, స్థానికులను గానీ విచారించమని చెబుతాను" అన్నాడు ప్రతాప్.

ఆయన తన సి ఐ కి కాల్ చేయబోతే అతడి నుంచే కాల్ వచ్చింది.

"చెప్పు కిషోర్! నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావ్?" అడిగాడు ఏసీపీ ప్రతాప్.

"సార్! నేను కంచికచెర్ల కు పది కిలోమీటర్ల దూరం లో ఉన్నాను. ఇక్కడ విజయవాడకు చెందిన ఒక డాక్టర్ల జంట ఇబ్బందుల్లో ఉంటే, వాళ్ల దగ్గర ఉన్నాను. వీళ్ళ అల్లుడు హైదరాబాదులో ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అట. అతని పేరు వికాస్ అని చెబుతున్నారు" అని చెప్పాడు సి ఐ కిషోర్.

" ఆయన భార్య మీదే హత్యా ప్రయత్నం జరిగింది. ఆయన కొడుకు విభవ్ ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం అంతా క్షేమంగానే ఉన్నారు. నేను హాస్పిటల్లో వికాస్ పక్కనే ఉన్నాను. మరో పది నిమిషాల్లో ఇతని భార్య కు డెలివరీ అవుతుంది. నువ్వు ఒక కానిస్టేబుల్ ని ఆ డాక్టర్ ఫ్యామిలీకి తోడుగా పంపు. నువ్వు, మిగతా వాళ్ళతో అక్కడే ఉండి, ఆ ప్రాంతంలో ఎవరైనా గోవర్ధన్ అనే పేరుతో ఉన్నారేమో కనుక్కో. అలాగే తోటంతా ఒకసారి గాలించండి. ఏవైనా అనుమానించ దగ్గ విషయాలు తెలిస్తే నాకు తెలియ జేయండి" అన్నాడు ఏ సీ పీ ప్రతాప్.

తర్వాత ఆయన వికాస్ వంక తిరిగి "మీ మామగారు, అత్తగారు క్షేమంగానే ఉన్నారు. మా సిఐ కిషోర్ ప్రస్తుతం ఆ మామిడి తోట దగ్గరే ఉన్నాడు. మీ వాళ్లకు హైదరాబాద్ వరకు తోడుగా ఒక కానిస్టేబుల్ ని పంపిస్తాడు.

ఆయన అక్కడే ఉండి, ఆ గోవర్ధన్ విషయం ఎంక్వయిరీ చేస్తాడు. అలాగే కనపడకుండా పోయిన వ్యక్తి గురించి కూడా ఆరా తీస్తాడు. మీ భార్య డెలివరీ టైం దగ్గరకు వచ్చినట్లుంది. మనం లోపలికి వెళ్దాం" అన్నాడు.

ఇద్దరూ రిసెప్షన్ దగ్గరకు వెళ్లారు. ఇంతలో లోపలినుండి ఒక నర్స్ పరిగెత్తుకుంటూ వికాస్ దగ్గరికి వచ్చింది.

ఉత్కంఠతో ఆమె వైపు చూసాడు వికాస్.

***

ఇక్కడ మామిడి తోట దగ్గర..

ప్రతాప్ తో మాట్లాడి ఫోన్ పెట్టేసిన ఆ ఆఫీసర్, శ్యామల రావు తో "నేను హైదరాబాదులో సి ఐ గా పనిచేస్తున్నాను. నా పేరు కిషోర్. ఇప్పుడే మా ఏ సి పి ప్రతాప్ గారికి ఫోన్ చేశాను. ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో మీ అల్లుడి పక్కనే ఉన్నారట. అంతా క్షేమంగానే ఉన్నట్లు చెప్పారాయన. మీరు ఆందోళన పడకుండా బయలుదేరండి. నన్ను ఈ తోట గురించి, ఇక్కడ తప్పిపోయిన సుమంత్ అనే అబ్బాయి గురించి, ఇక్కడ ఎవరో గోవర్ధన్ అనే వ్యక్తితో మీరు మాట్లాడారట కదా.. అతని గురించి విచారించి రమ్మన్నారు. నేను ఆ పని పూర్తి చేసుకుని వస్తాను" అన్నాడు.

సీఐ కిషోర్ మాటల్లో గోవర్ధన్ అనే పేరు రావడంతో ఉలిక్కి పడ్డారు అందరూ.

"ఆ గోవర్ధన్ గురించి మీకు తెలుసా?" ఆందోళన నిండిన మొహంతో అడిగాడు శ్యామల రావు.


"మీరు టెన్షన్ పడకండి. మీకు తోడుగా ఒక కానిస్టేబుల్ ని పంపిస్తాను. మీరు నిశ్చింతగా హైదరాబాద్ చేరుకోండి. ఇలాంటి గోవర్ధన్ లని చాలా మందిని చూశాం మేము" అన్నాడు కిశోర్.

ఇంతలో అంతవరకు ఆగి ఉన్న హోరు గాలి, భారీ వర్షం మళ్లీ మొదలయ్యాయి. కరెంట్ పోయి, అంతా గాఢాంధకారం అలుముకుంది.

గుడిసె తలుపును పూర్తిగా మూశాడు షణ్ముగం. అయినా బయటి గాలి హోరు, ఎవరో వికృతంగా కేకలు పెడుతున్నట్లు వినిపిస్తోంది. అందరిలో మళ్లీ భయం మొదలైంది.

చంద్రిక కాస్త ధైర్యం చేసి సీఐ కిషోర్ తో "అయ్యగారూ! నిజంగా నాకు తెలియక అడుగుతున్నాను. పోలీసులకు, దయ్యాలు కూడా భయపడతాయా?" అని అడిగింది.

కిషోర్ జవాబు ఇచ్చేంతలో అతని ఫోన్ మోగింది.

"నమస్తే ప్రతాప్ గారూ! ఇక్కడ మళ్లీ హోరు గాలి, వర్షం మొదలయ్యాయి. తగ్గాక ఆ డాక్టర్ ఫ్యామిలీని, ఒక కానిస్టేబుల్ ని తోడు ఇచ్చి పంపిస్తాను" అని చెప్పాడు కిషోర్.


"ఇంత భారీ వర్షంలో నువ్వు అక్కడ ఉండి ఎంక్వయిరీ చేసేదేమీ ఉండదు. కాబట్టి అందరూ వర్షం తగ్గాక బయలుదేరండి. మీరు వచ్చే దారిలో ఎవరైనా అనుమానాస్పదంగా కనపడితే వాళ్లను ప్రశ్నించండి. వాళ్ళ ఐడి చెక్ చేయండి. మరొక ముఖ్యమైన విషయం. ఆ హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తి దగ్గర వికాస్ ఫోన్ ఉంది. అతను దాన్ని అప్పుడప్పుడు ఆన్ చేస్తున్నాడు. ఆ నంబర్ నీకు పంపిస్తున్నాను. అనుమానితుడు దగ్గరకు వచ్చినప్పుడు ఆ నెంబర్ కు ఒకసారి ట్రై చేయి. మన అదృష్టం బాగుంటే ఆ సెల్ రింగ్ అవుతుంది. అప్పుడు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించవచ్చు. జాగ్రత్తగా ఉండండి" అని చెప్పి కాల్ కట్ చేశాడు ప్రతాప్.

ఇంతలో ఆ గుడిసె ముందు ఒక బైక్ ఆగిన శబ్దం వినిపించింది. మరికొంతసేపటికి ఎవరో తలుపు తడుతూ "లోపల ఎవరున్నారు? ప్లీజ్.. తలుపు తీయండి. వానలో తడిసి ముద్దయి పోతున్నాను" అంటూ అరిచాడు.

' ఏం చేయమంటారు' అన్నట్లు సీఐ కిషోర్ వైపు చూశాడు షణ్ముగం.

"ఇంత మందిమి ఉన్నాం కదా! పర్వాలేదు. తలుపు తెరువు" అన్నాడు కిశోర్.

తలుపు తీయడానికి లేచాడు షణ్ముగం. గడియ తీసాడు.

ఇంతలో కిషోర్ మొబైల్ కి ఏసీపీ ప్రతాప్ పంపిన మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేశాడు కిషోర్.

అప్రయత్నంగా ఆ మెసేజ్ లో ఉన్న వికాస్ నంబర్ కి కాల్ చేశాడు.

ఆశ్చర్యకరంగా బయటనుండి మొబైల్ రింగ్ అయిన శబ్దం వినపడింది.

షణ్ముగం అప్పటికే గుడిసె తలుపు తెరిచాడు. బయట ఒక పొడవాటి వ్యక్తి ఫోన్ చెవిలో పెట్టుకొని, అటువైపు తిరిగి, 'హలో.. హలో..' అంటున్నాడు.


కిషోర్ ఒక్క ఉదుటున ముందుకు వెళ్లి, డోర్ మూసి గడియ పెట్టాడు.

ఫోన్ కట్ చేసి, అదే నంబర్ కి మళ్ళీ కాల్ చేసాడు.


తిరిగి బయట ఉన్న వ్యక్తి ఫోన్ మోగింది.


"రేయ్! ఎవడ్రా నువ్వు? ఈ గోవర్ధన్ తోనే తమాషాలు పడుతున్నావా..ఎంత ధైర్యం నీకు.." ఫోన్ లిఫ్ట్ చేసి గట్టిగా అరిచాడు ఆ వ్యక్తి.


ముందు బయటనుంచి, తరువాత ఫోన్ లో నుండి వినిపించాయా మాటలు.

పోలీసులు మినహా మిగిలిన వాళ్ళందరూ గడగడా వణికిపోయారు.

***

విజయ వాడ లోని ఒక హాస్పిటల్ లో..


తన మామయ్య శంకర శాస్త్రి దగ్గర ఉన్న, తన నంబర్ కి కాల్ చేసాడు సుమంత్.

స్విచ్ ఆఫ్ అని వస్తోంది.


కాసేపాగి ప్రయత్నిద్దామనుకున్నాడు సుమంత్.

ఫోన్ ఇవ్వడానికి గోవిందం వంక చూసాడు.


అతనక్కడ లేదు.

హఠాత్తుగా అక్కడి వాతావరణం మారిపోయింది.


పెద్ద గాలితో పాటు కుండ పోతగా వర్షం కురుస్తోంది.

ఉరుములు, మెరుపులతో వణుకు పుడుతోంది.


"గోవిందూ!" అంటూ గొంతు పెగుల్చుకొని అరిచాడు సుమంత్.

లోపలికి వచ్చాడు గోవిందం.


కానీ అతడి నడక మాములుగా లేదు.

ఏదో ట్రాన్స్ లో ఉన్నవాడిలా నడుస్తున్నాడు.


"ఇదిగో నీ ఫోన్.." అంటూ ఫోన్ అతనికి అందివ్వబోయాడు సుమంత్.

అతను అదేమీ పట్టించుకోలేదు.


"గోవిందూ!" అంటూ మళ్ళీ గట్టిగా పిలిచాడు సుమంత్.

"నా పేరు గోవిందు కాదు. వెంటాడే నీడ.." అన్నాడతను.


చిన్నగా నవ్వాడు సుమంత్. "మొదటి సారి నువ్వలా చెప్పినప్పుడు ఎంత భయపడ్డానో తెలుసా.." అన్నాడు.


సమాధానమివ్వలేదు అతను.

ఉన్నట్లుండి, "డాక్టర్ గోవర్ధన్ నీకు విషం ఇంజెక్ట్ చెయ్యబోతున్నాడు. వెంటనే పారిపో.." అన్నాడు.


"అదేమిటి? అయన వల్లే కదా నేను తొందరగా కోలుకున్నాను?" అన్నాడు సుమంత్.


"నువ్వు నన్ను నమ్ముతావా లేక గోవర్ధన్ ని నమ్ముతావా" కోపంగా అడిగాడు గోవిందం.

అప్పుడతని కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి.


"నిన్నే నమ్ముతాను. కానీ నేను ఇక్కడి నుండి వెళ్లగలనా.." సందేహిస్తూ అన్నాడు సుమంత్.


"నువ్వు తొందరగా వెళ్ళడానికి నేను సహాయం చేస్తాగా" అంటూ అతను సుమంత్ చెయ్యి పట్టుకుని హాస్పిటల్ బయటకు తీసుకొని వెడుతున్నాడు.


గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వీళ్ళను ఆపి, "డిశ్చార్జ్ నోట్ ఏది? నువ్వెందుకు బయటకు తీసుకొని వెడుతున్నావ్" అని అడిగాడు.


"వానకు తడుస్తుందని లోపల పెట్టాను. ఆనక చూపిస్తానులే. ఈయన్ని ఆటో ఎక్కించి వస్తాను" అన్నాడు గోవిందం.


"వానలో ఆటో దొరకడం కష్టం. అంతసేపు పేషంట్ ని వానలో తడపడమెందుకు? నువ్వెళ్ళి ఆటో పిలుచుకొని రా" అన్నాడు సెక్యూరిటీ.


అతని వంక ఉరిమి చూసాడు గోవిందం.


"ఈరోజేమిటి అదోలా ఉన్నావ్? నీ కళ్ళెందుకు ఆలా ఎర్రగా ఉన్నాయి?" గోవిందు వంక పరిశీలనగా చూస్తూ అడిగాడు సెక్యూరిటీ.


"ఈ రోజు నాకు దయ్యం పట్టిందిలే. ఈయన్ని పంపిస్తే గానీ వదలదు" అంటూ సుమంత్ చెయ్యి పట్టుకొని బయటకు తీసుకోని పోయాడు గోవిందం.


"ఈ వానలో ఎందుకు? కాస్సేపు హాస్పిటల్ లోనే ఉంటాను" అన్నాడు సుమంత్.


"డాక్టర్ గోవర్ధన్ పాయిజన్ ఇంజెక్ట్ చేస్తాడని చెప్పానుగా?" గోవిందు గట్టిగా అరిచినట్లుగా అన్నాడు.


ఆ గొంతు ఎప్పటి గోవింద్ గొంతులా లేకపోవడంతో అతని వైపు చూసాడు సుమంత్.

అంతే!


అక్కడ ఉన్నది గోవింద్ కాదు.


అతని గుండె వేగంగా కొట్టుకుంది.


తోటలో తన మీద కూర్చున్న ఆకారం..


యాక్సిడెంట్ జరిగినప్పుడు తన వెనక ఉన్న ఆకారం ఇదే..


ఇంకా వుంది…

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు కథ పేరు పైన క్లిక్ చేయండి.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


54 views0 comments

Comments


bottom of page