top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

వెంటాడే నీడ ఎపిసోడ్ 12

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Ventade Nida Episode 12' Written By Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్


గత ఎపిసోడ్ లో


తన అన్న వికాస్ నంబర్ కు కాల్ చేస్తాడు విశాల్.

అటువైపు లిఫ్ట్ చేసిన వ్యక్తి తన పేరు డాక్టర్ గోవర్ధన్ అనీ, టివి లో స్క్రోలింగ్ చూడమనీ చెబుతాడు.


టివిలో విశాల్ వదిన శ్రేయ మీద హాస్పటల్ లో హత్యాప్రయత్నం జరిగినట్లు చూపిస్తూ ఉంటారు.


హాస్పిటల్ కు కాల్ చేసి, వికాస్ తో మాట్లాడుతాడు విశాల్.

తరువాత వికాస్, ఇంట్లో ఉన్న తన తండ్రికి ఫోన్ చేస్తాడు.

బాబును తీసుకొని వెళ్ళడానికి ఎవరో గోవర్థన్ అనే వ్యక్తి వచ్చినట్లు కొడుక్కి చెబుతాడు అతని తండ్రి విజయానంద.


ఇక చదవండి...



తండ్రితో మాట్లాడాక, లెక్చరర్ నరసింహారావు గారికి ఫోన్ ఇచ్చింది దీక్ష.


శంకర శాస్త్రి ఆయనతో మాట్లాడుతూ "ఆ అమ్మాయికి ప్రమాదం ఏమీ ఉండదు. కాస్సేపటికి స్పృహ వస్తుంది. ఇక మా అమ్మాయిని అక్కడే నలుగురిలో ఉంచుకో. ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళనివ్వొద్దు. మేము కారులో ఊరికి బయలుదేరుతున్నాం. దీక్షను అక్కడే పికప్ చేసుకుంటాను" అన్నాడు.


"ఇంత అర్జెంట్ గా ప్రయాణమా..సర్లే.. ఎక్కడికని అడగకూడదు కదూ! ఇంతకీ మీ బావమరిది గారి అబ్బాయి.. అదే.. ఆ సుమంత్ ఆచూకీ ఏమైనా దొరికిందా?"


"ఇంకా తెలీలేదు నరసింహా! ఆ అబ్బాయి కోసం మృత్యుంజయ హోమం చేయించాలని అనుకున్నప్పటి నుంచీ ఏవో కష్టాలు వస్తున్నాయి. రేపు ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్లి, అక్కడే హోమం జరిపించాలని నిశ్చయించాను. నన్ను అక్కడికి వెళ్లనివ్వకుండా ఎవరో ప్రయత్నిస్తున్నారు. అది మనిషో లేక దుష్ట శక్తో తెలీడం లేదు" అన్నాడు శంకర శాస్త్రి.


"నువ్వు పూనుకున్నాక ఏ దుష్ట శక్తయినా పారిపోవాల్సిందే. చిన్నప్పట్నుంచి చూస్తున్నాను. నీ శక్తి నాకు తెలీదా! నీకు తోడుగా నన్ను కూడా రమ్మంటావా?" అడిగాడు నరసింహారావు.


"నా ప్రాణ మిత్రుడివి. అవసరమైతే నీ సహాయం అడుగుతాను. నేను కాస్సేపట్లో అక్కడికి వస్తాను. అమ్మాయిని కూడా నాతో తీసుకొని వెడతాను" చెప్పాడు శంకర శాస్త్రి.


"వాతావరణం చూస్తుంటే పెద్ద వర్షం పడేలాగా ఉంది. మీ బావమరిది ఉండేది కృష్ణాపురమే కదా. ఆ దారి మొత్తం హై వే కాదు. పది కిలోమీటర్ లు మట్టి రోడ్ లో వెళ్ళాలి" ఆలోచిస్తూ చెప్పాడు నరసింహారావు.


అందుకు సమాధానంగా శంకర శాస్త్రి మాట్లాడుతూ "నిజానికి రేపు ఉదయాన్నే బయలుదేరాలనుకున్నాను. కానీ ఈ మబ్బులు చూసి, వర్షం పడి రోడ్డు నానక ముందే వెళ్లాలని ఇప్పుడే బయలుదేరాం. తిరుగు ప్రయాణం లేటైనా పరవాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు హోమం జరిపి తీరాలి. అదే నా తాపత్రయం" అన్నాడు.


"తిరిగి రావడం లేటయ్యే పనైతే దీక్షను తీసుకొని వెళ్లడం ఎందుకు? అనవసరంగా కాలేజీ పోతుంది కదా! నువ్వు వచ్చేవరకు మా ఇంట్లో ఉంచుకుంటాను. మాకేమీ ఇబ్బంది లేదు" అన్నాడు నరసింహారావు.


"మా బావ మరిదికి సుమంత్ తరువాత మరో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా! వాళ్ళు దీక్షను చూడాలంటున్నారు. కలిసి చాలా రోజులయింది అంటున్నారట. లేకుంటే మీ ఇంట్లోనే ఉంచేవాడిని. ఇదిగో.. దగ్గరికి వచ్చేసాను. మీరు కనిపిస్తున్నారు" అన్నాడు శంకర శాస్త్రి.


అతను కారు దిగేసరికి, దీక్ష కట్ చేసిన ఉల్లిపాయ ను నీలిమ ముక్కు దగ్గర ఉంచి వాసన చూపిస్తోంది.


శంకర శాస్త్రిని చూసిన నరసింహారావు, దీక్ష కారు దగ్గరికి వచ్చారు.


"నరసింహా! దీక్షను తీసుకొని వెళ్తున్నాను. ఆ అమ్మాయికి ఆపదేమీ కలుగదులే." స్నేహితుడితో అన్నాడు శంకర శాస్త్రి.


"దీక్షది కూడా నీలాగే ఇతరులకు సహాయం చేసే గుణం. నువ్వు చెప్పావటగా.. ఉల్లిపాయ వాసన చూపించమని.. అలాగే చేసింది. ఆ అమ్మాయి నీలిమ అప్పుడే కాస్త కదులుతోంది" అన్నాడు నరసింహారావు.


పార్వతమ్మ కారులోంచి ఆయన్ని పలకరించింది.


ఫ్రెండ్స్ దగ్గరా, నరసింహరావుగారి దగ్గరా సెలవు తీసుకొని దీక్ష కారు ఎక్కింది.


కారు వెంటనే వేగంగా కృష్ణాపురం వైపు కదిలింది.


మరో రెండు నిముషాల్లోనే ఉరుములు, మెరుపులతో పెద్ద వాన మొదలైంది.


"మా అన్నయ్యగారి పిల్లలు హాస్టల్ లో ఉన్నారు. నరసింహారావు అన్నయ్యగారు చెప్పినట్లు దీక్షను వాళ్లింట్లోనే ఉంచితే సరిపోయేది కదండీ.." అంది పార్వతమ్మ.


"చూడు పార్వతీ! సుమంత్ కి సహాయం చెయ్యాలనుకున్నందుకు మనకు ఇబ్బందులు కలుగుతున్నాయి. మనకు సహాయం చేయబోయి నరసింహారావు చిక్కుల్లో పడటం నాకు ఇష్టం లేదు. పైగా ఈ సమయంలో దీక్ష మన దగ్గరే ఉండటం మంచిది" అన్నాడు శంకర శాస్త్రి.


మనవల్ల ఇంకొకరు బాధ పడకూడదనే భర్త మనస్తత్వానికి, ఆనందపడింది పార్వతమ్మ.


"కారు సుందరయ్య అంకుల్ దే కదా నాన్నా.. ఇంతకు ముందు కూడా ఒకసారి ఈ కార్లో వెళ్ళాం" అని అడిగింది దీక్ష.


"అవునమ్మా! ఎప్పుడవసరమైనా కారు పంపిస్తానని చెబుతూ ఉంటారాయన. ఒకసారి మనందరం ఈ కార్లో పరిటాల వెళ్ళాం." చెప్పాడు శంకర శాస్త్రి.


"ఆ రోజు అయన పంపిన డ్రైవర్ చాలా ఓపిగ్గా మనల్ని అడిగిన చోటికల్లా తిప్పాడు" గుర్తు చేసుకొంది దీక్ష.


"అవును దీక్షా! అతను ఊరెళ్ళాడట. అడక్క అడక్క నేను కారు అడిగినప్పుడే ఇలా అయిందేమిటని సుందరయ్య గారు చాలా బాధ పడ్డారు. ఆయనే స్వయంగా డ్రాప్ చేస్తానన్నారు. కానీ నేను ఒప్పుకోక పోవడంతో, వేరే మనిషిని ఏర్పాటు చేసి కారు పంపిస్తానని చెప్పారు. హడావిడిగా కారు ఎక్కేశానే గానీ కనీసం ఈయన పేరైనా అడగలేదు. ఇప్పుడు చెప్పు బాబూ! నీ పేరేమిటి?" అడిగాడు శంకర శాస్త్రి.


"సుందరయ్యగారు చెప్పలేదా?" తన పేరు చెప్పకుండా ఎదురు ప్రశ్నించాడు ఆ వ్యక్తి.


సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్న వేయడంతో కాస్త కోపం వచ్చింది శంకర శాస్త్రికి.

అయినా తమాయించుకున్నాడు.

అంతలో హై వే నుండి కృష్ణాపురం వెళ్లే మట్టి రోడ్ వచ్చింది.


ఆ రోడ్లోకి వేగంగా కార్ తిప్పాడు డ్రైవర్.

ఆ విసురుకి వెనక సీట్ లో ఉన్న ముగ్గురూ అదిరి పడ్డారు.


అప్పటికే ఆ రోడ్డు మొత్తం గుంతలు పడి బురదగా తయారయ్యింది.

అయినా వేగం తగ్గించలేదు డ్రైవర్.


"ఇదిగో.. నీ పేరేమిటన్నావూ.. సర్లే.. నీకు చెప్పడానికి ఇబ్బందయితే సుందరయ్య గారినే ఫోన్ చేసి అడుగుతానులే..." అంటూ ఫోన్ చేయబోయాడు శంకర శాస్త్రి.


"అంత తొందరెందుకయ్యా! డ్రైవింగ్ లో ఉండి జవాబు చెప్పలేదు. నా పేరు గోవర్ధన్ బాబు. చాలా.. ఇంకా వివరాలేమైనా కావాలా?" హేళన కూడిన స్వరంతో చెప్పాడు డ్రైవర్.


ఉలిక్కిపడ్డాడు శంకర శాస్త్రి.

అప్రయత్నంగా అతని చేతిలో ఉన్న సెల్ జారి, కింద పడింది.


వంగి తీసుకోబోతుండగా కారు ఒక గుంటలో పడి పెద్ద కుదుపు రావడంతో అయన తల ముందు సీటుకు బలంగా కొట్టుకుంది.


అయన తలనుండి రక్తం బొటబొటా కారింది.

"మిస్టర్. ముందు కారు ఆపు. నాన్నగారికి రక్తం కారుతోంది" అంది దీక్ష కోపంగా.


"ఉరుములు, మెరుపులు చూస్తున్నారుగా.. ఊరికి దూరంగా ఉన్న ఇలాంటి ప్లేసుల్లోనే పిడుగులు పడేది. తొందరగా ఇల్లు చేరుకుంటే అందరికీ మంచిది. అందుకే ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నాను. అయినా మీరు ఆపమన్నారుగా.. అదుగో.. ఆ ఊడల మర్రి చెట్టు కింద ఆపుతాను" అన్నాడతను.


కారు మరో రెండు గుంటల్లో పడి రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టు కింద ఆగింది.

పార్వతమ్మ తన చేతి సంచిలో ఉన్న టవల్ తో భర్తకు కట్టు కట్టబోయింది.


"కార్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి.." అంటూ వెదికి, టింక్చర్, దూది, బ్యాండేజ్ క్లాత్ ఆమె చేతికి ఇచ్చాడు.


అయన తలనుండి రక్తం ఆగకుండా కారుతోంది.

భర్త తలకు తగిలిన గాయానికి టింక్చర్ పూయడానికి మూత ఓపెన్ చెయ్యబోతుండగా " ఎందుకైనా మంచిది, ఒకసారి వాసన చూసి పుయ్యండమ్మా" అన్నాడు డ్రైవర్.


తను భర్తకు విభూది ఇచ్చేముందు వాసన చూడడం గుర్తుకు వచ్చిందామెకు.


"ఎప్పటి బాటిలో అది.. ఎక్సపైర్ అయి ఉంటుందేమో అని వాసన చూడమన్నాను. మీకు మరేం గుర్తుకు వచ్చిందో..." వెనక్కి తిరిగి అన్నాడు డ్రైవర్.


అతను మాస్క్ పెట్టుకుని ఉండటం తో ముఖం సరిగ్గా కనపడ్డం లేదు.

గోవర్ధన స్వామిగా వచ్చింది అతనా కదా అని ఆలోచిస్తున్నారు శంకర శాస్త్రి, పార్వతమ్మలు.


అప్పుడతను పొడవాటి గడ్డంతో ఉన్నాడు. ఇప్పుడు ఇతను నీటుగా షేవ్ చేసుకొని ఉండటంతో పాటు పేస్ మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. దాంతో వాళ్ళు ఏ నిర్ణయానికీ రాలేక పోయారు.


దీక్ష ఆ బాటిల్ ని వాసన చూసింది. టింక్చర్ వాసన గుప్పుమని కొట్టడంతో దూదిని అందులో తడిపి, తండ్రి తలపై అద్దింది. పార్వతమ్మ అతని తలకు కట్టు కట్టింది.

డ్రైవర్ తో "ఇక బయలుదేరు బాబూ.." అన్నాడు శంకర శాస్త్రి.


అతను ఇగ్నిషన్ తిప్పాడు. శబ్దం వచ్చి ఆగిపోయింది కానీ కారు కదల్లేదు.


మరో రెండు మూడు సార్లు ప్రయతించినా అలాగే అయింది.


"ఇంజన్ లోకి నీళ్లు పోయినట్లున్నాయి. కాసేపాగి ట్రై చేస్తాను" అంటూ కారు దిగాడు అతను.


" నేనుకూడా కిందికి దిగుతాను" అన్నాడు శంకర శాస్త్రి.

"ఇంత వానలోనా..ఎందుకండీ?.." అంది పార్వతమ్మ.


"ఎందుకో.. కార్లో బాగా చికాగ్గా ఉంది. చెట్టు కింద నిలుచుంటాలే. పైగా లఘుశంక తీర్చుకోవాలి కూడా. మీరు లోపలే ఉండండి.." అంటూ కిందకు దిగాడు శంకర శాస్త్రి.


"శాస్త్రి గారూ! ఇది వూడల మర్రి చెట్టు. దయ్యాలకు స్థావరం అంటారు. మీకూ దయ్యలకూ పడదంటారు. కాస్త జాగ్రత్త" అన్నాడు డ్రైవర్.


"నా సంగతి సరే.. నీ పక్కనే బురద గుంట ఉంది. పడతావేమో.. జాగ్రత్త" అన్నాడు శంకర శాస్త్రి.


ఇంతలో ఆ డ్రైవర్ ఫోన్ మోగింది.

ఫోన్ తీసి "ఎవరూ?" అని అడిగాడు డ్రైవర్.


గాలి తన వైపే బలంగా వీస్తూ ఉండటంతో అటువైపు మాటలు వినిపించాయి శంకర శాస్త్రికి.

అంతే..


ఒక్క ఉదుటున డ్రైవర్ ను చేరుకొని అతని చేతిలోని మొబైల్ లాక్కున్నాడు. డ్రైవర్ ను బలంగా వెనక్కి నెట్టాడు.


అనుకోని ఈ చర్యతో డ్రైవర్ బురద గుంటలో పడిపోయాడు. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని చెవి దగ్గర ఉంచుకొని, మరో చేతిని ఫోన్ పై నీళ్లు పడకుండా అడ్డు పెట్టి, అక్కడినుంచి దూరంగా వానలో పరుగెత్తాడు శంకర శాస్త్రి.


కార్ లో ఉన్న పార్వతమ్మ, దీక్షలకు జరుగుతున్నదేమిటో అర్థం కాలేదు.

దీక్ష, తల్లిని కార్లోనే ఉండమని తాను కిందికి దిగింది.


గుంటలో పడ్డ డ్రైవర్ బయటకు వచ్చి, "రేయ్ శంకర శాస్త్రీ! ఆగరా.." అంటూ ముందుకు వెళ్ళబోయాడు.


తన తండ్రిని అతను 'రేయ్' అంటూ సంబోధించడంతో దీక్షలో ఆవేశం కట్టలు తెగింది.


ముందుకు వెళ్ళబోతున్న అతని షర్ట్ కాలర్ పట్టుకొని వెనక్కి లాగింది.

ఆ విసురుకు మళ్ళీ బురదలో పడ్డాడు అతను. వెంటనే పైకి లేచి పళ్ళు పటపటా కొరుకుతూ "ఈ గోవర్ధన్ పైనే దాడి చేస్తావా" అంటూ ఆమె పైకి దూకాడు.


అంతలో మర్రి చెట్టు తాలూకు పెద్ద కొమ్మ ఒకటి పెళపెళమంటూ విరిగి వాళ్ళ పైకి పడుతోంది.

***

అక్కడ విజయవాడలో ఒక హాస్పిటల్ లో గాయాలతో ఉన్న సుమంత్ కి ఒక పీడకల వస్తోంది.


అగాథంలో పడిపోతున్న తనను తన మామ శంకర శాస్త్రి రక్షిస్తాడు.


అయన మీద కోపంతో తనను వెంటాడే వికృతాకారం ఒక మర్రి చెట్టు కొమ్మను విరిచి దీక్ష పైకి విసురుతుంది.


దీక్ష భయంతో కేక పెడుతూ ఉండగా సుమంత్ కి స్పృహ వచ్చింది. కానీ కళ్ళు తెరవలేక పోతున్నాడు.


అంతలో ఎవరో ఒక వ్యక్తి అతని తల నిమిరాడు.

"ఎవరు నువ్వు..." అడిగాడు సుమంత్.


"వెంటాడే నీడను" చెప్పాడా వ్యక్తి.

క్షణం భయపడ్డాడు సుమంత్.


అంతలో అతనికి గుర్తుకు వచ్చింది, అతను తనకోసం ఏర్పాటు చేసిన అటెండర్ గోవిందం అని.


"నువ్వా గోవిందం! బాగున్నావా.." అన్నాడు సుమంత్.


"బాగున్నాను బాబూ! నేను చెప్పాను కదా డాక్టర్ గోవర్ధన్ గారి చేతిలో పడ్డారు.. ఇక భయం లేదని.


బాగానే కోలుకున్నారు. కొన్ని రోజులు కాస్త నీరసంగా ఉంటుంది. అంతే" అన్నాడు గోవిందం.


"గోవిందం! నన్ను ఇక్కడికెవరు తీసుకొని వచ్చారు?" అడిగాడు సుమంత్.


"ఆ దారిలో కార్లో వెళ్లే వాళ్లెవరో చూసి గవర్నమెంట్ వారి హెల్ప్ లైన్ కి కాల్ చేశారట.

వాళ్ళు అంబులెన్స్ లో ఇక్కడికి తీసుకొని వచ్చారు. మా హాస్పిటల్ కి గవర్నమెంట్ తో టై అప్ ఉందిలే." చెప్పాడు గోవిందం.


"నేను పడ్డ చోట నా మొబైల్ ఏమైనా దొరికిందా? నీకేమైనా తెలుసా.." అడిగాడు సుమంత్.


"నాకు తెలీదు. ఉండి ఉంటే ఈ పాటికి మీ వాళ్లకు చెప్పి ఉండేవాళ్ళు కదా. నా ఫోన్ ఇస్తాను. నీకేదైనా నెంబర్ గుర్తుకు వస్తే కాల్ చెయ్యి. లేదా నెంబర్ చెప్పు. నేనే చేస్తాను" అన్నాడు గోవిందం.


"నెంబర్లు బాగానే గుర్తున్నాయి" అంటూ వెంటనే విశాల్ నంబర్ కి కాల్ చేసాడు సుమంత్.


స్విచ్ ఆఫ్ అని వస్తోంది.


క్షణం అలోచించి, తన నెంబర్ కి కాల్ చేసాడు.


ఇంకా వుంది…


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు కథ పేరు పైన క్లిక్ చేయండి.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).



63 views0 comments

Kommentare


bottom of page