top of page

వేటకు వేళాయెరా - పార్ట్ 2

#ParupalliAjayKumar, #పారుపల్లిఅజయ్కుమార్, #వేటకువేళాయెరా, #VetakuVelayera, #TeluguSuspenseCrimeThriller

Vetaku Velayera - Part 2/3 - New Telugu Story Written By Parupalli Ajay Kumar

Published In manatelugukathalu.com On 19/04/2025

వేటకు వేళాయెరా - పార్ట్ 2/3 - పెద్దకథ

రచన: పారుపల్లి అజయ్ కుమార్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

వాహనాలను ఆపి దారి దోపిడీకి పాల్పడే వారిని పట్టుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న దంపతులు విక్రమ్, ధీర. గతంలో వారిద్దరూ క్లాస్ మేట్స్. ధీర తండ్రికి విక్రమ్ సహాయం చేయడంతో వారిమధ్య పరిచయం పెరుగుతుంది.



ఇక వేటకు వేళాయెరా - పార్ట్ 2 చదవండి.


“ధీరా నువ్వు కూడా NCC లో జాయిన్ అయితే బాగుంటుంది.  ఇది మనకు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేస్తుంది. కేవలం  శిక్షణ మాత్రమే కాకుండా, కష్టపడి పనిచేయడం నేర్పుతుంది. నిస్వార్థత, నిజాయితీ, దేశభక్తి అలవడతాయి. నాయకత్వ లక్షణాలు  కూడా దీనిద్వారా మనం నేర్చుకోవచ్చు.” అన్నాడు విక్రం ఒకరోజు ధీరతో.


ధీర ఇంట్లో అడిగి చెపుతానని అంది. తండ్రి సరే అనడంతో NCC లో జాయిన్ అయింది. విక్రం ప్రోద్భలంతో ధీర మార్షల్ ఆర్ట్స్ లో కూడా శిక్షణ తీసుకున్నది. ఇద్దరూ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు. రైఫిల్ షూటింగ్ లో ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడేవారు. ఇద్దరూ NCC లో బెస్ట్ క్యాడెట్ ల గా పేరుతో పాటుగా సర్టిఫికెట్లు కూడా సంపాదించుకున్నారు.


స్నేహితులుగా మసులుతున్న కొద్ది కాలంలోనే ఒకరి ఇష్టాలు,అభిరుచులు మరొకరు తెలుసుకున్నారు. ఇద్దరి అభిరుచులు కలవడంతో ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టం ప్రేమగా మారటానికి ఎన్నో రోజులు పట్టలేదు.


డిగ్రీ ఫైనల్ ఇయర్ లో NCC నోడల్ అధికారి ధర్మేంద్ర సింగ్ ట్రెక్కింగ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.


“ట్రెక్కింగ్ అనేది సాహస కృత్యాలలో ఒకటి అని చెప్పవచ్చు. పర్వతాలు, అడవుల గుండా అనేక కిలోమీటర్లు  ట్రెక్కింగ్‌ను ఆస్వాదించడానికి ట్రెక్కర్లు తయారు చేస్తారు. ఈ మార్గాల ద్వారా మీరు నదులు, జలపాతాలు, ఎత్తైన పర్వతాలను చూస్తూ ట్రెక్కింగ్ సాగించవచ్చు. ట్రెక్కింగ్ అనేది ప్రకృతి పర్యటనలో అంతర్భాగం. ఇది మన ఆరోగ్యానికి మేలుచేస్తుంది.  


మన గురించి మరింత తెలుసుకోవడానికి మరియు ఎదగడానికి సహాయపడుతుంది. ప్రతీ మనిషి జీవితంలో కనీసం ఒక్కసారైనా ట్రెక్కింగ్ అనుభూతిని పొందాలి. మన NCC బెటాలియన్ తరుఫున  ఈ సంవత్సరం హిమాచల్ ప్రదేశ్‌ లోని మనాలి ట్రెక్కింగ్ కు వెళ్తున్నాం. మీలో ఎంతమంది వస్తారో ముందుగా చెపితే ప్లాన్ చేసుకోవచ్చు.” అని అన్నాడు.


“మనాలి అంటే కులూమనాలి కదా సార్!” అడిగింది ధీర ఒకింత ఉత్సుకతతో.


ధర్మేంద్ర సింగ్ చిరునవ్వు నవ్వాడు.

“చాలా మంది మనాలి అంటే కులూమనాలి అనే అనుకుంటారు. నిజానికి కులు మరియు మనాలి రెండు వేర్వేరు పట్టణాలు. కులు జిల్లా ముఖ్య పట్టణం. అక్కడ విమానాశ్రయం కూడా వుంది. అక్కడి నుండి మనాలి 40 కిలోమీటర్ల దూరంలో వున్న మరో పట్టణం. దట్టమైన పచ్చని దేవదారు అడవులు, బియాస్ నది, పార్వతి నది మరియు వాటి ఉపనదులు ఈ ప్రాంతానికి అందాన్ని ఇనుమడింపజేస్తున్నాయి.


కులు సగటున 1278 మీటర్ల ఎత్తులో

( 4192 అడుగులు ) ఉండగా, మనాలి 2050 మీటర్ల ( 6725 అడుగులు ) ఎత్తులో వుంటుంది.


మనాలిలో ట్రెక్కింగ్  ప్రపంచ ప్రసిద్ధి పొందింది. మనాలిని ట్రెక్కర్స్ స్వర్గం అని  పిలుస్తారు. ఇక్కడ నుండి అనేక పర్యాటక ప్రదేశాలకు  ట్రెక్కింగ్ చేసి ఆనందించవచ్చు. అయితే మనం వెళ్ళబోయేది

‘హంప్టా పాస్ ట్రెక్.’


హిమాచల్ ప్రదేశ్‌లోని హంప్టా పాస్ ట్రెక్ ఒక అద్భుతమైన ప్రయాణం. 14,100 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ట్రెక్ దాదాపు 30 కిలో మీటర్లు. పచ్చని చెట్లతో కూడిన పర్వత శ్రేణులు, చిన్న చిన్న అడవులు, పచ్చికభూములు, జలపాతాలు మరియు అందమైన రంగు రంగుల పూల మొక్కలు  వంటి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో కన్నుల పండుగగా ఉంటుంది.  ఈ దృశ్యాలను వర్ణించటానికి ఏ మాటలు సరిపోవు. కళ్ళతో చూసి తరించాల్సిందే.” ఊరిస్తున్నట్లుగా చెప్పాడు.


ధీర ఉత్సాహంతో విక్రం వైపు చూసింది.

విక్రం తంబ్స్ అప్ స్టైల్ లో బొటన వేలు పైకెత్తి చూపించాడు.


సాహస కృత్యాలు చేయటమంటే ఇద్దరికీ ఇష్టమే కాబట్టి  NCC తరుఫున వెళ్ళే ట్రెక్కింగ్ కు పేర్లు ఇచ్చారు.


NCC నోడల్ అధికారి ధర్మేంద్ర సింగ్ ఆధ్వర్యంలో, మరో ఇద్దరు ఉత్సాహవంతులైన యువ  అధ్యాపకులు తోడు రాగా, 40 మంది  NCC విద్యార్థినీ, విద్యార్థులతో అక్టోబర్ దసరా సెలవల్లో ట్రెక్కింగ్ టూర్ ప్రారంభమయింది. ధీర తో పాటుగా మరో ముగ్గురు అమ్మాయిలు టూర్ లో భాగస్వాములు అయ్యారు.


హైదారాబాద్ నుండి ఢిల్లీకి ట్రెయిన్ లో వెళ్ళారు. ట్రెయిన్ లో విక్రం, ధీరలకు వేరు వేరు చోట్ల బెర్తులు ఎలాట్ అయినా, పగలంతా ఇద్దరూ ఒకే దగ్గర కూర్చుని సందడి చేసేవారు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని సహచర విద్యార్థులు అప్పటికే గ్రహించుకున్నారు. అందుకే ప్రయాణంలో సాధ్యమైనంత వరకూ  వారిద్దరూ ప్రక్కప్రక్కనే కూర్చుని వుండేలా ప్లాన్ చేసేవారు.


ఢిల్లీలో ట్రెయిన్ దిగగానే ముందుగానే రిజర్వ్ చేసుకున్న HRTC వోల్వో బస్సులో న్యూఢిల్లీ నుండి మనాలికి బయలుదేరారు అందరూ. బస్ లో కూడా విక్రం, ధీర ప్రక్కప్రక్కనే కూర్చున్నారు.


ఢిల్లీ నుండి పానిపట్ , కురుక్షేత్ర , అంబాలా,  చంఢీఘడ్ , మండీ,  కులు మీదుగా ప్రయాణం సాగింది. దారంతా పరచుకున్న సుందర రమణీయ ప్రకృతి శోభను చూసి ధీర చిన్నపిల్లలా పరవశించి పులకించి పోయింది. కెమెరాతో సాధమైనన్ని ప్రకృతి దృశ్యాలను బంధించే ప్రయత్నం చేసింది.


పన్నెండు గంటల ప్రయాణం చేసినా ధీర ఉత్సాహం ఆవగింజంత కూడా తగ్గలేదు.


మనాలి చేరుకోగానే అక్కడ ఏర్పాటు చేయబడిన బేస్ ట్రైనింగ్ క్యాంప్ లో అందరూ రిపోర్ట్ చేసారు.

ఓరియెంటేషన్ ప్రోగ్రాంలో ట్రెక్కింగ్ ప్రోగ్రాం గురించి అందరికీ తెలియచేశారు.


“మీ NCC బెటాలియన్ ట్రెక్కింగ్ కోసం మనాలిని ఎంచుకున్నందులకు మీకు ధన్యవాదాలు. మనాలి మీకు స్వాగతం పలుకుతున్నది. మనాలి గురించి కొన్ని విషయాలు చెప్పాలి. మనాలి భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది హిమాలయాల దిగువన ఉన్న ఒక చిన్న పట్టణం. ఈ పట్టణం బియాస్ నది ఒడ్డున ఉంది.  మంచుతో కప్పబడిన పర్వతాలు చుట్టూ  ఆవరించి ఉన్నాయి. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం ఇది. ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి  వస్తుంటారు. ఇక్కడ ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రమైన హడింబాదేవి ఆలయం ఉంది.


ట్రెక్కింగ్ తో పాటు పర్వతారోహణ, పారాగ్లైడింగ్ మరియు స్కీయింగ్ వంటి సాహస కార్యకలాపాలు కూడా మనాలిలో ప్రసిద్ధి చెందాయి.


ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు అద్భుతమైన హిమానీనదాలు, మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు మరియు ఉత్కంఠభరితమైన జలపాతాలను చూడవచ్చు.”


అని చెప్పాడు అక్కడి పర్యవేక్షణ అధికారి.


ట్రెక్కింగ్ లో.తీసుకోవలసిన జాగ్రత్తలను వివరంగా చెప్పారు ఇతర ఆఫీసర్లు.


నోడల్ అధికారి ధర్మేంద్ర సింగ్ కోరిక మీద ప్రథమ చికిత్సలో శిక్షణ పొందిన ఒక గైడ్ ను, ఇద్దరు సహాయకులను  ఎరేంజ్ చేశారు.


ట్రెక్కింగ్ కు అవసరమైన ప్రథమచికిత్స కిట్, బ్యాక్‌ప్యాక్, స్లీపింగ్ బ్యాగ్, ట్రెక్కింగ్ పోల్స్, వాటర్ బాటిల్స్, వ్యక్తిగత మందులు, సన్‌స్క్రీన్, సన్‌గ్లాసెస్, టోపీ మరియు దృఢమైన నడక బూట్లు వంటివి సమకూర్చుకున్నాక భోజన ఏర్పాట్లు జరిగాయి.


ఆ తరువాత మనాలి నుండి కేవలం 3 నుండి 4 కిలోమీటర్ల దూరంలో చుట్టుపక్కల వున్న ప్రదేశాలు తిలకించారు. హడింబా ఆలయం, నెహ్రూ కుండ్, నికోలస్ రోరిచ్ ఆర్ట్ గ్యాలరీ, కింగ్స్ ప్యాలెస్‌, నగ్గర్ కోట, జోగిని జలపాతం మొదలైన వాటిని ప్రైవేట్ వాహనం మాట్లాడుకుని చకచకా చూశారు.


మరునాడు ఉదయం అల్పాహారం అయ్యాక ట్రెక్కింగ్ ప్రారంభమయింది.


వాతావరణం చల్లగా వుంది. అక్టోబర్ నెల అయినా ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు  దగ్గరగా వున్నట్లు అనిపిస్తున్నది.

ధీర ముందు నడుస్తుంటే వెనుకనే విక్రం నడుస్తున్నాడు. మనాలి నుండి జోబ్రా దాకా ట్రెక్కింగ్  రోడ్డు మార్గం మీదుగా సాగింది.


అక్కడినుండి గడ్డి మైదానాలు, ఎత్తైన రాళ్ళ మీదుగా అసలైన ట్రెక్కింగ్ మొదలయింది. జోబ్రా నుండి  మాపుల్, ఓక్ మరియు దేవదార్ వృక్షాలతో కూడిన అందమైన అడవి గుండా  ట్రెక్‌ సాగి నాలుగు గంటల తరువాత 10,400 అడుగుల ఎత్తున వున్న చిక్కా కు చేరుకున్నారు. అక్కడ రాణి నది ఒడ్డున రాత్రి బస శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు.


“ధీరా! కాళ్ళు నెప్పులు పెడుతున్నాయా?” విక్రం లాలనగా అడిగాడు.


“విక్రం నువ్వు వెంటవున్నావన్న ఆనందంతో ఏ  నెప్పులు తెలియటం లేదు. అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్న ఈ ప్రదేశాలు చూస్తున్న కొద్దీ అలా చూస్తుండి పోవాలనిపిస్తుంది. నువ్వు నాకు పరిచయం అయి వుండకపోతే నేను ఇక్కడిదాకా వచ్చి వుండేదాన్ని కాదు. జీవితంలో ఎంతో మిస్సయ్యేదాన్ని. థాంక్యూ! థాంక్యూ వెరీ మచ్ విక్రం.” అంటూ సంతోషంగా విక్రం చేతులు పట్టుకుని ఊపేసింది ధీర.


మరునాడు సూర్యోదయం కాకముందే అల్పాహారం తీసుకుని ట్రెక్కింగ్ ప్రారంభించారు. ఈసారి  ట్రెక్ బండరాళ్లు మరియు కఠినమైన మార్గాల గుండా సాగింది.  సవాలుగా తీసుకుని అందరూ ఉత్సాహంగా నడవసాగారు.


ప్రాతఃకాల వేళ, పైన్ చెట్లపై పక్షుల కిలకిలా రావాలు సప్తస్వర సంగీతాన్ని పలికిస్తున్నట్లుగా వినసొంపుగా వున్నాయి. ఎత్తైన కొండల మీద నుండి దుముకుతున్న అందమైన జలపాతాలు, ఆకుపచ్చని తివాచీలా కనిపిస్తున్న సుందరమైన లోయలు, ఎటుచూసినా ఆకాశాన్ని తాకేలా పెరిగిన వృక్షాలు కనువిందు చేస్తుంటే అందరూ నెమ్మదిగా నడక కొనసాగించారు. కొంత దూరం నడిచిన తరువాత నేలకు రెండు అడుగుల ఎత్తులో పారుతున్న నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరారు. అక్కడ  రంగురంగుల పువ్వులు  వారికి స్వాగతం పలికాయి.


నది దాటిన తర్వాత 12,400 అడుగుల ఎత్తులో వున్న బాలు కా ఘేరా అనే అద్భుతమైన క్యాంప్‌సైట్‌కి చేరుకున్నారు.

సుమారు నాలుగు గంటల సమయం ట్రెక్కింగ్ చేశారు ఆ రోజు. దానితో ఆ రోజు అక్కడే బస ఏర్పాటు చేసుకున్నారు.


ఆ రాత్రి నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద ఏర్పాటు చేసిన క్యాంప్ ఫైర్ అందరినీ ఆకట్టుకుంది. పాటలు వచ్చిన వారు పాటలు పాడి, డాన్స్ వచ్చిన వారు డాన్సులు చేసి మిగతావారిని ఆనందింప చేసారు.


క్యాంప్ ఫైర్ లో వారివెంట గైడ్ గా వచ్చిన ద్విజేంద్ర 

“అసలు సిసలు మనాలి అందాలు చూడాలంటే డిసెంబర్, జనవరి నెలల్లోనే చూడాలి. ఆ నెలల్లో ఎక్కువుగా విదేశీయులు కూడా వస్తుంటారు. జనవరిలో మనాలి సరికొత్త ప్రదేశంగా మారుతుంది. వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. సంవత్సరం మొత్తంలో అత్యంత శీతలమైన నెల ఇది. 


ఈ ప్రదేశం అప్పుడు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఉష్ణోగ్రత  సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా పడిపోతుంది. చిరుజల్లుల్లా, వెండి తునకల్లా కురిసే హిమపాతాన్ని చూసేందుకు జనాలు ఇక్కడికి వస్తుంటారు. జనవరిలో మనాలిలో కొంత వర్షం, కొంత హిమపాతంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. మనాలి  యొక్క సహజ సౌందర్యాన్ని  ఆస్వాదించడానికి ఇది సరైన సమయం. నిరంతరాయంగా కురిసే  హిమపాతం ఈ ప్రదేశాన్ని మునుపెన్నడూ లేనంత అందంగా, అద్భుతంగా  చూపుతుంది. 

సహజ ప్రకృతిని ఇష్టపడి, ఆరాధించే ప్రతి మనిషి తమ జీవితంలో ఒక్కసారైనా హిమపాతాన్ని తనివితీరా చూసి ఆనందించాలని, కురిసే హిమపాతంలో తడిసి, మురిసి, కేరింతలు కొట్టాలని   కోరుకుంటారు.


క్రొత్తగా పెళ్ళి అయిన హానీమూన్ జంటలు జనవరి నెలలో ఇక్కడికి వచ్చి గడుపుతుంటారు. భారతదేశం యొక్క హనీమూన్ క్యాపిటల్ అని పిలువబడుతుంది ఈ హిల్ స్టేషన్. 


చుట్టూ మంచుతో కప్పబడివున్న కొండలు, సతత హరిత అడవుల యొక్క సుందరమైన ప్రకృతి సౌందర్యం, జలపాతాల ఉత్కంఠభరితమైన దృశ్యాలు, అందమైన హిమానీ నదులతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరాడే మనాలి  శృంగారభరితమైన ప్రదేశంగా ప్రసిద్ధి పొందింది. స్వచ్చమైన, గాఢమైన ప్రేమానుభూతులను అనుభవించడానికి, మరచిపోలేని జ్ఞాపకాలను జీవితాంతం దాచుకోవడానికి  మనాలి ప్రపంచంలోని అత్యుత్తమ హనీమూన్ గమ్యస్థానాలలో ఒకటిగా పేరు గాంచింది.” అని చెపుతుంటే విక్రం, ధీర వైపు చూసి చిలిపిగా నవ్వాడు.


ధీర నును సిగ్గుతో తల వంచుకుంది.


తెల్లవారి ఉదయమే లేచి బాలు కా ఘేరా నుండి బయలుదేరారు. హంప్టా పాస్‌ను చేరుకోవడానికి నిలువుగా ట్రెక్కింగ్ చేయాల్సి వుంటుంది. చుట్టూవున్న అద్భుత లోయలను తిలకిస్తూ, చేతికి అందే ఎత్తులో సాగుతున్న మేఘాలను అబ్బురంగా చూస్తూ, నిటారుగా ఉన్న వాలుల వెంట ఆరోహణ క్రమంలో నడక నెమ్మదిగా సాగింది. లోయల అంచుల వెంబడి నడుస్తున్నప్పుడు విక్రం ధీర చేతిని పట్టుకుని జాగ్రత్తగా నడిపించాడు. ట్రెక్కింగ్ నిజంగా అద్భుతమైన  సాహస కృత్యం. కొండల వాలుల వెంబడి, లోయల అంచుల వెంబడి నడవడం  థ్రిల్లింగ్ గా అనిపించింది ధీరకు.


ఈ ఆరోహణకు దాదాపు 5 గంటల సమయం పట్టింది.

ధీర ఈ ప్రయాణంలో కొంత అలసిపోయి నట్లుగా కనిపించింది విక్రం కు. కొద్ది దూరం లోనే  మంచుతో పూర్తిగా కప్పబడిన హిమవత్పర్వత శ్రేణులను అబ్బురంగా చూస్తూ పరవశించి పోయారు అందరూ. అప్పుడప్పుడూ చిరుచిరుజల్లులు వారిని పలకరించి వెళుతున్నాయి.


14,100 అడుగుల ఎత్తులో వున్న హంప్టా పాస్‌ను చేరుకున్నాక అందరూ ఆనందంతో గంతులు వేశారు. డాన్స్ లు చేసారు. బిగ్గరగా కేకలు పెట్టారు. ధర్మేంద్రసింగ్ వెంట తెచ్చిన జాతీయ జెండాను ఎగురవేశారు. అందరూ  జాతీయ గీతాలాపన చేసారు.


ఒక గంట విశ్రాంతి తరువాత తిరిగి బయలుదేరాలి అని గైడ్ చెప్పాడు.


ధీరను ఒక పక్కకు తీసుకుని వెళ్ళాడు విక్రం. పర్వతం అంచుల్లో విరబూసిన ఒక పూలగుత్తిని రెండు చేతులతో పట్టుకొని, ధీర ముందు మోకాళ్ళ మీద కూర్చుని

“ధీరా! దూరాన వెండికొండల్లా మెరిసే హిమాలయాల సాక్షిగా, ఈ పచ్చిక బయళ్ళు, ఈ సెలయేర్లు, కొండల నుండి ఎగిసిపడుతూ దూకే జలపాతాల సాక్షిగా, కదిలే మేఘాల సాక్షిగా, మనసును దోచేస్తున్న ఈ ప్రకృతి అందాల సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. భూమికి పదునాలుగువేల, ఒక వంద అడుగుల ఎత్తులో నేను నా ప్రేమను నీకు తెలియజేసుకుంటున్నాను. నేను నిన్ను ఎప్పుడు ప్రేమించడం మొదలుపెట్టానో నాకే తెలియదు! కానీ ఈ రోజు నేను నా భావాలను వ్యక్తం చేస్తున్నాను.


ప్రియతమా,  నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలనుకుంటున్నాను. కానీ నా మనసులోని భావాలను నేను సరిగా వ్యక్తపరచలేక పోతున్నాను. నువ్వే నా సర్వస్వం. నీవే  నా వెలుగు, నా ఆనందం. అన్నీ నువ్వే. నువ్వు నా పక్కన వుంటే నేను ప్రపంచాన్ని జయించగలనని భావిస్తున్నాను. నీతో కలసి జీవితం  పంచుకోవాలని ఆశ పడుతున్నాను. జీవితాంతం మనం నవ్వుతూ బతకాలని ఆశిస్తున్నాను. నా వృద్ధ్యాప్యంలో, నా జీవిత చరమాంకంలో నువ్వే  తోడుగా, నీడగా  ఉండాలని కోరుకుంటున్నాను. మరి నన్ను పెళ్ళి చేసుకుంటావా?” అంటూ ధీర కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు.


విక్రం చేతిలోని పూలగుత్తిని తన రెండు చేతులతో అందుకుంటూ, చుట్టూ వున్న ప్రకృతి అందాల కన్నా మనోహరంగా చిరునవ్వులు చిందించింది ధీర.


“ఈ సంగతి ఎప్పుడు అడుగుతావో అని నేను ఎంతకాలం నుంచి ఎదురుచూస్తున్నానో తెలుసా? బుద్ధూ! ఇంత లేట్ గానా చెప్పడం.” కవ్వింపుగా అంది.


విక్రం సంతోషంతో తబ్బిబ్బవుతూ “నిజంగానా? నిజంగానా?” అని అరిచేసాడు.


“మరి నీవు అడగవచ్చుకదా నన్ను!” లేచి నిలబడుతూ అన్నాడు.


“విక్రం, నువ్వు నిజంగా బుద్దూవే. ఆడపిల్లలు ఎక్కడైనా  ముందుగా చెపుతారా? మగవారే ముందుగా ప్రపోజ్ చేయాలి. అపుడే అందం, ఆనందం.” అంటూ విక్రం గుండెలో తలదాచుకుంది ధీర.


విక్రం, ధీర ముఖాన్ని రెండు చేతులతో పైకెత్తి ధీర పెదవుల మీద తన పెదవులతో  గాఢంగా ముద్దుపెట్టుకున్నాడు.

ఒక నిమిషం పాటు ఇద్దరూ తొలి ముద్దు పారవశ్యపు మైకంలో మునిగిపోయారు.


ధీర మెల్లిగా విక్రం నుండి విడివడి సిగ్గుపడుతూ “విక్రం, ముందుగానే చెపుతున్నా! చదువు అయ్యి, ఉద్యోగాలు వచ్చాకే పెళ్ళి.” అంటూ అందరూ వున్న చోటికి వెళ్ళింది.


వెనకనే విక్రం కూడా వెళ్ళాడు.

“సర్, డియర్ ఫ్రెండ్స్,  ధీర, నేను మా చదువులు అయ్యాక, ఉద్యోగాలు వచ్చాక పెళ్ళి చేసుకుందామని ఈ హంప్టా పాస్‌ సాక్షిగా అనుకున్నాం.” అని పెద్దగా ఆనౌన్స్ చేశాడు.

అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు. క్యాంపులో వున్న ఇద్దరు అమ్మాయిలు చకచకా టీ తయారుచేసి బిస్కెట్స్ తో కలిపి అందరికీ ఇచ్చారు.


అందరూ కలసి ఆ అకేషన్ ను ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు.


తిరుగు ప్రయాణం వేరే రూటులో సాగింది. అక్కడ నుండి, ట్రెక్ క్రిందికి దిగుతుంది, ఇది కొంచెం వాలుగా  వుంటుంది. ట్రెక్కింగ్ జాగ్రత్తగా చేయాలి. కొంత దిగువకు చేరుకున్న తర్వాత స్పితి అనే లోయగుండా  ప్రయాణం సాగింది. ఆ లోయ దాటాక షియా గోరు వస్తుంది. హంప్టా పాస్ నుండి షియా గోరు వరకు ట్రెక్కింగ్ చేశాక ఆ రాత్రి  అక్కడ బస ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్యాంప్‌సైట్ కూడా నది ఒడ్డునే వుంది.


మరునాడు ఉదయమే అల్పాహారం తీసుకున్నాక  తిరిగి ట్రెక్కింగ్ ప్రారంభమయింది. ఈ ట్రెక్కింగ్ రెండు హిమానీనదుల  పక్కగా సాగింది. రెండవ నది దాటిన తరువాత చత్రు అనే చిన్న గ్రామం వచ్చింది. ఆ ప్రక్కనే వున్న ప్రఖ్యాతి గాంచిన చంద్రతాల్ సరస్సును చూశారు అందరూ.


“ఎత్తైన శిఖరాల మధ్య వొదిగి వున్న ఈ స్పితి లోయలోని చంద్రతాల్ సరస్సును ‘మూన్ లేక్’ అని కూడా పిలుస్తారు.

ఇది సహజసిద్ధమైన నీలంరంగు సరస్సు. హిమాలయ పర్వత శ్రేణుల మధ్య అత్యంత ఆకర్షణీయమైన అందంతో నిండిన సరస్సు ఇది. ఈ అద్భుతమైన సరస్సు యొక్క మనోజ్ఞతను మాటల్లో వర్ణించలేము.సంవత్సరం పొడవునా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.”అంటూ గైడ్  చెప్పాడు.


లోతైన నీలం నీటిలో ప్రతిబింబించే మంచు పర్వతాల శ్రేణులను  అందరూ విస్మయంతో చూశారు. నిరంతరం మారుతున్న ఆకాశం యొక్క రంగులు స్వచ్చమైన ఆ నీటిలో  ప్రతిబింబిస్తుంటే అద్భుతం అనుకున్నారు ధీర, విక్రం లు.


చత్రు నుండి,  ప్రైవేట్ వాహనాల్లో ఎక్కి  మనాలికి  చేరుకున్నారు..   

                

నాలుగు రోజుల పాటు సాగిన 31 కిలోమీటర్ల హంప్టా పాస్ ట్రెక్ అందరికీ ఓ అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చింది.

హంప్టా పాస్ ట్రెక్ కేవలం ప్రయాణం కాదు, ఓ థ్రిల్లింగ్ అడ్వెంచర్ అని అందరూ అనుకున్నారు.


=======================================================================

                                                ఇంకా వుంది

వేటకు వేళాయెరా - పార్ట్ 3/3 త్వరలో

========================================================================


పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పారుపల్లి అజయ్ కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం:

నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...

ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...

సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,

నవలలు చదవటం మరీ ఇష్టం ...

పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో

"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..

షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .

నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..

రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...

ఉచిత లైబ్రరీ ....

మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...

ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న

మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.



Comments


bottom of page