top of page

వేయి వజ్రాలు

Writer's picture: Divakarla Venkata Durga PrasadDivakarla Venkata Durga Prasad

'Veyi Vajralu' - New Telugu Story Written By D V D Prasad

'వేయి వజ్రాలు' తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"ఒరేయ్ సత్తిబాబూ లేవరా! మా వీరభద్రం మావయ్య కోణార్క్లో వస్తున్నాడని చెప్పాను కదా. రిసీవ్ చేసుకోవాలి." అంటూ ఇంకా నిద్రలో జోగుతున్న స్నేహితుడ్ని తట్టిలేపాడు చిట్టిబాబు.


"మీ మావయ్య ఏమైనా చిన్నపిల్లడా ఏమిటి? క్యాబ్ చేసుకొనో, ఆటోలోనో రాలేడూ, మనం వెళ్ళి తీసుకురావాలా?" అన్నాడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ సత్తిబాబు.


"మా మావయ్య వీరభద్రం అదో టైపులే! ఆయనకి వేపకాయంత వెర్రితో పాటు తాటికాయంత తిక్క కూడా ఉంది. ఎప్పుడూ ఏవో తిక్కతిక్కగా మాట్లాడతాడు, అడ్డదిడ్డంగా రాస్తాడు కూడా. అసలే ఈ ఊరికి కొత్త. నిన్న ఫోన్ చేసి మరీ తన దగ్గర ఏవో విలువైనది ఉంది, ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పాడు.


ఈ మధ్య ఏదో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నట్లు ఉంది. మనం అతన్ని కాకాపడితే మనకి కూడా ఎంతో కొంత విదల్చకపోడు, కొన్నాళ్ళు మనకి హాయిగా గడిచిపోతుంది. మనం సినిమాలకి, షికార్లకి డబ్బులుకోసం తడుము కోనక్కరలేదు." చెప్పాడు చిట్టిబాబు.


"అలాగా!...అయితే తప్పక వెళ్ళాల్సిందే!" అంటూ చటుక్కున లేచి కూర్చున్నాడు సత్తిబాబు. ఇద్దరూ ఆదరాబాదరాగా తయారై ఆటోలో స్టేషన్ చేరుకొనేసరికి అప్పటికే ట్రైన్ వచ్చేసిందని తెలిసింది. కంగారుగా ట్రైన్ ఉన్న నాలుగో నంబర్ ప్లాట్ఫారానికి వెళ్ళారు. పెద్దగా వెతకనక్కర లేకుండానే ట్రైన్ వద్దే, తను దిగిన కోచ్వద్దే కనిపించాడు వీరభద్రం ఎవరిదో మెదడు తింటూ. వీళ్ళు వెళ్ళగానే ఆ సదురు బాధితుడు బ్రతుకు జీవుడా అంటూ అక్కుణుంచి చల్లగా జారుకున్నాడు.


చిట్టిబాబుని చూడగానే వీరభద్రం, "ఏమిట్రా మొదటిసారి ఇక్కడికి వస్తున్నానని తెలిసి కూడా ఇంత అలస్యంగా వస్తావా? నువ్వు రాకపోతే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నా!" అన్నాడు ఎడం చేతిలోని బ్రీఫ్కేస్ని కుడి చేతిలోకి మార్చుకుంటూ.


"ఏ చెయ్యను మావయ్యా...మా ఆటో ట్రాఫిక్లో చిక్కుకుపోవడం వల్ల కాస్తా లేటయ్యింది. సరే పద ఇంటికెళ్దాం! నీ చేతిలోని బ్రీఫ్కేస్ నా కివ్వు." అని అందుకోబోయాడు వీరభద్రం చేతుల్లోంచి.


"వద్దు...వద్దు! దీన్ని నేనే పట్టుకుంటాను." అన్నాడు వీరభద్రం కంగారుగా ఓ రెండడుగులు వెనక్కేసి.


"ఎందుకు మావయ్యా అలా కంగారు పడతావు, ఏమున్నాయని అందులో? ఏవో నీవి ఓ రెండు జతల బట్టలు, ఓ టవలు, బనీన్లు, డ్రాయెర్లు అంతేగా!" అన్నాడు సత్తిబాబు మళ్ళీ ఆ పెట్టె అందుకోవడానికి ప్రయత్నిస్తూ.


"వాటితో పాటు అందులో నా ప్రాణం ఉందయ్యా!"


"ఊరుకో మావా, ఎవరైనా వింటే నవ్వుతారు. జానపద సినిమాల్లో మాంత్రికుడివా ఏమిటి నీ ప్రాణం ఏ చిలకలోనో, పెట్టెలోనో ఉండటానికి." నవ్వాడు చిట్టిబాబు.


"అదికాదురా చిట్టీ, నా ప్రాణానికి ప్రాణమైన, నేనెంతో కష్టపడి సాధించిన ‘వేయి వజ్రాలు’ కూడా అందులోనే ఉన్నాయి. నా వేయి వజ్రాల విలువెంతో నాకొక్కడికే తెలుసు. అందుకే అంత జాగ్రత్తగా పట్టుకున్నాను." అన్నాడు మెల్లిగా.


ఆ మాటలు వింటూనే ఆశ్చర్యంగా మావయ్యవైపు చూసాడు చిట్టిబాబు. అయితే, వజ్రాల వ్యాపారం చేస్తున్నాడన్నమాట అని అనుకున్నాడు.


"వేయి వజ్రాలే!..." కళ్ళు తేలేసాడు సత్తిబాబు. అప్పుడు వీరభద్రం దృష్టిలో పడ్డాడు సత్తిబాబు.


సత్తిబాబువైపు అనుమానంగా చూస్తూ, "వీడెవడు? సంతల్లో కూరలెత్తుకెళ్ళే మొహం వాడూను..." అన్నాడు.


ఆ మాటలకి సత్తిబాబు మొహం ముడుచుకుపోయింది.


"అలా అనకు మావయ్యా. వాడు బాధపడతాడు. సత్తిబాబని నా స్నేహితుడు, నా తోనే ఆ రూములో ఉంటాడు. ఇంతకీ నీ దగ్గర వేయి వజ్రాలు ఎలా వచ్చాయి?"

"అదేం తిక్క ప్రశ్న? ఎలా వస్తాయి, కష్టపడితే వస్తాయి. నా తెలివంతా ఉపయోగించాను. ఎన్నో రోజుల శ్రమ ఫలం మరి! అయినా నీకేం తెలుస్తుంది వాటి విలువ? సరే ఇంటికెళ్ళేదేమైనా ఉందా, లేక ఇక్కడే అన్ని మాటలూనా." అన్నాడు వీరభద్రం బ్రీఫ్కేస్ను తన రెండు చేతులతో జాగ్రత్తగా పట్టుకొని స్టేషన్ బయటకు దారితీస్తూ.


"సారీ మావయ్యా, ఏదో కుతూహలం కొద్దీ అడిగాను." వీరభద్రం వెంట నడిచాడు చిట్టిబాబు. ఆ వెనకే సత్తిబాబు కూడాను. ఎవరి జేబు సవిరిద్దామా అని అక్కడే తచ్చాడుతున్న జేబుదొంగ జోసెఫ్ చెవుల్లో వాళ్ళ మాటలు పడనే పడ్డాయి. ‘జేబులు కట్ చెయ్యడం లాంటి చిల్లర దొంగతనాలు బదులు ఇలాంటి వేయి వజ్రాలున్న ఒక్క బ్రీఫ్ కేస్ దొరికితే చాలు, నా సామిరంగా! ఈ జీవితానికి మరే దిగులు ఉండదు, జీవితంలో స్థిరపడిపోవచ్చు’ అని మనసులో అనుకున్నాడు.


ఆ వెయ్యి వజ్రాలు దొరికితేనా, చిల్లర దొంగతనాలు మానేసి కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని జీవితాంతం దర్జాగా బతికేయవచ్చు. అవకాశం దొరికితే రాజకీయాల్లో జొరబడి తన ప్రతాపం చూపవచ్చు, ఇంతవరకూ తను పట్టుబడినప్పుడు తనను నీచంగా చూసే పోలీసుల భరతం పట్టవచ్చు అని అనుకున్నాడు జోసెఫ్.


వెంటనే 'కొడితే సిక్స్ కొట్టాలిరా!' అని మెల్లిగా పాడుకుంటూ వాళ్ళను వెంబడించాడు. స్టేషన్ బయటకు వచ్చిన్న ఆ ముగ్గుర్నీ చూస్తూనే ఆటోలవాళ్ళు చుట్టుముట్టారు. వీరభద్రం బిక్కమొహం వేసుకొని, "అభిమన్యుణ్ణి చుట్టుముట్టినట్లు ఇలా నాలుగువైపులా మూగేరేంటిరా చిట్టీ?" అన్నాడు భయపడుతూ.


అతని చేతులు బ్రీఫ్కేస్పై మరింత బిగుసుకున్నాయి.


"ఏమీ ఫర్వాలేదు మావయ్యా! బేరం కుదిరినాక ఒక్కడే మిగులుతాడులే!" మావయ్యకి ధైర్యం చెప్పి తను వెళ్ళవలసిన 'అభయ్ నగర్' కాలనీ పేరు చెప్పాడు తమని చుట్టుముట్టిన ఆటో వాళ్ళతో.


అంతే! ఆ కాలనీపేరు చెప్పగానే, మంత్రించినట్లు అందరూ ఒక్క క్షణం మాయమై ఇంకో అభిమన్యుణ్ణి చుట్టుముట్టారు. ఆ కాలనీ సిటీకి దూరంగా ఉండటంతో ఒక్కరూ రావడానికి ఇష్టపడలేదు. మొత్తానికి కష్టపడి ఓ ఆటోవాడ్ని పట్టుకొని ఐదువందలకి ఒప్పించాడు చిట్టిబాబు.


"అయిదువందలే!" గుడ్లు తేలేసాడు వీరభద్రం.


వేయి వజ్రాలున్న బ్రీఫ్కేస్ చేతిలో పట్టుకొని అయిదువందల రూపాయలకే అలా గుడ్లు తేలేయడం వింతనిపించింది చిట్టిబాబుకి. ఇక ముగ్గురూ ఆటో ఎక్కబోతూండగా, అప్పుడే ఎక్కణ్ణుంచి వచ్చాడో జోసెఫ్ ఓ బైక్పై వేగంగా వచ్చి వీరభద్రం చేతిలోంచి బ్రీఫ్కేస్ ఒక్క ఉదుటున లాక్కొని క్షణంలో మాయమయ్యాడు. కళ్ళు మూసి తెరిచేలోగా జరిగిన ఈ సంఘటనకి నివ్వెరపోయారు వాళ్ళు ముగ్గురూ.

వీరభద్రం ముందు తేరుకొని, "దొంగ! దొంగ!!" అని అరిచాడు. కాని అప్పటికే ఆ బైక్ కనుమరుగైపోయింది. అతని కేకలు విని జనం గుమిగూడారు. విషయం తెలుసుకున్న వాళ్ళు తలో మాటా మాట్లాడసాగారు. ఈ దేశంలో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో దొంగతనాలు ఎక్కువయ్యాయని, ఎవరికీ రక్షణ లేకుండా పోతోందని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అందులో ఒకడు తన అభిప్రాయం చెప్పుకొచ్చాడు. ఒకడేమో పోలీసు రిపోర్ట్ ఇవ్వమన్నాడు. అదే సబబనిపించింది.


ఇంతలో ఎక్కణ్ణుంచి వచ్చాడో ఓ కుర్రాడు వచ్చి తనా బైక్ నంబర్ చూసి నోట్ చేసుకున్నానని చెప్పి ఆ నంబర్ రాసిచ్చాడు. వాడికి ఆ దొంగతో ఏదైనా సంబంధం ఉందేమోనని అక్కడి వాళ్ళు అనుమానించగా, డిటెక్టివ్ నవలలు చిన్నప్పటి నుండి చదివి, క్రైం సీరియల్స్ చూసి తనకు అలా బైకులు, బళ్ళు నంబర్లు గుర్తు పెట్టుకోవడం అలవాటని చెప్పడంతో వాడ్ని వదిలేసారు. ఇంటికి వెళ్ళడానికి మాట్లాడుకున్న ఆటో ఎక్కి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు వీరభద్రం, చిట్టిబాబు, సత్తిబాబూను.


నేరుగా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళాడు వీరభద్రం. అతన్ని చూస్తూనే ఇన్స్పెక్టర్ కనకారావు మొహం చిట్లించుకొని, "అదిగో...అక్కడ రైటర్ కూర్చొని ఉన్నాడు. మీ కంప్లైంట్ అక్కడ రాసి ఇచ్చి వెళ్ళండి." అన్నాడు తనకిలాంటి చిన్నచిన్న విషయాలతో అసలు సంబంధం లేనట్లు.


వెంటనే ఆ ముగ్గురూ తలవంచుకుని ఏదో రాసుకుంటున్న రైటర్ దగ్గరకు వెళ్ళారు. "సార్! నా బ్రీఫ్ కేస్ స్టేషన్ నుంచి వస్తూంటే ఎవడో దొంగ కొట్టేసాడు! ఆ దొంగ బైక్ నంబర్ కూడా ఓ కుర్రాడు చూసి రాసి ఇచ్చాడు సార్! వాడ్ని ఎలాగైనా పట్టుకోండి. ఆ బ్రీఫ్కేస్లో నా ప్రాణానికి ప్రాణమైన వేయి వజ్రాలు ఉన్నాయి." అని ఆదుర్దాగా చెప్పాడు వీరభద్రం.


'వేయి వజ్రాలు' అన్న మాట వినగానే తుళ్ళిపడ్డాడు ఆ రైటర్. వీరభద్రంవైపు ఎగాదిగా చూసాడు. అతని వేష భాషలు చూసి, ఎప్పుడైనా వెయ్యరూపాయలైనా చూసిన ఫేసేనా ఇది అన్న భావం కదలాడింది అతని కళ్ళల్లో. అయితే, 'వేయి వజ్రాలు ' అన్న మాట చెవిలో పడిన ఇన్స్పెక్టర్ మాత్రం ఒక్కసారి ఎలర్టైయ్యాడు. వెంటనే లేచి నిలబడి వీరభద్రం వైపు గబగబా వచ్చాడు.


"ఏమిటీ, వెయ్య వజ్రాలా! అసలు వెయ్యి వజ్రాలు నీ దగ్గర ఎలా ఉన్నాయి? ఎక్కడ కొట్టేసావు? నిజం చెప్పు? ఎవరి దగ్గర కొట్టేసావు?" అన్నాడు లాఠీ ఝులిపిస్తూ.


"రామ రామ!...నా బ్రీఫ్కేసూ, అందులో ఉన్న నా కష్టానికి ఫలమైన వేయి వజ్రాలు ఎవడో దొంగ ఎత్తుకుపోతే, వాడ్ని పట్టుకోవడం మానేసి నన్ను దొంగ అని అంటారేం, విడ్డూరం కాకపోతే? అయినా ఆ ఏకవచనమేమిటీ? మర్యాదగా మాట్లాడలేరూ?" ఇన్స్పెక్టర్వైపు తిరిగి కాస్త గట్టిగానే అడిగాడు వీరభద్రం.

"నీకు మర్యాదేమిట్రా?... సరే! నీ వెయ్యి వజ్రాలు పోయాయి. కానీ, అన్ని వజ్రాలు నీ వద్దకు ఎలా వచ్చాయి? నువ్వు వజ్రాల వ్యాపారం చేస్తున్నావా?" అని అడిగాడు ఇన్స్పెక్టర్ కనకారావు. కాదని తల అడ్డంగా ఊపాడు వీరభద్రం.


"మరి?... అయితే వజ్రాలు స్మగ్లింగ్ చేస్తున్నావా? లేక గంజాయి, డ్రగ్స్ లాంటివి అమ్ముతున్నావా? అక్రమంగా ఏమైనా రవాణా చేస్తున్నావా? ఏం లేకపోతే అన్ని వజ్రాలు నీ దగ్గరకు ఎలా వచ్చాయి? నిజం చెప్పు, లేకపోతే నీ చేతా, నీ ఈ పిల్ల కాకులతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు!" అన్నాడు కనకారావు వీరభద్రంవైపు, చిట్టిబాబు, సత్తిబాబులవైపు కరుకుగా చూస్తూ. లాఠీ కూడా గాల్లోకి లేచింది.


ఆ మాటలు వింటూనే చిట్టిబాబు, సత్తిబాబుల పైప్రాణాలు పైనే పోయాయి. దీనంగా వీరభద్రంవైపు చూడసాగారు, 'మా పరిస్థితి ఇప్పుడేమిటన్నట్లు?' వీరభద్రం మాత్రం నిర్వికారంగా, ఒక్కపిసరు కూడా చలించకుండా అలాగే నిలబడ్డాడు.


"వీళ్ళిద్దరే కాక నీ గ్యాంగ్లో ఇంకెంతమంది ఉన్నారు?" అన్నాడు చిట్టిబాబు, సత్తిబాబుని చూపిస్తూ.


"నా వేయి వజ్రాలు పోయాయని నేను ఏడుస్తూంటే మధ్యన మీ గొడవ ఏంటీ?" అన్నాడు ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు.


ఈ లోపున విషయం తెలిసి ఆ ఏరియా ఎస్పీ పుల్లారావు కూడా అక్కడికి చేరుకున్నాడు. వేయి వజ్రాల వ్యవహారం కదా మరి! అవి దొరికితే ప్రమోషన్, సన్మానాలు…పేరుకు పేరు...ఓహ్...అనుకుంటూ ఉక్కిరిబిక్కిరైపోతూ వీరభద్రాన్నీ, పిల్ల కాకులైన చిట్టిబాబు, సత్తిబాబుల్ని రకరకాల ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. వీరభద్రం అయితే ఒకే మాట మీద నిలబడుతున్నాడు. వేయి వజ్రాలు తను అహోరాత్రులు కష్టపడి సాధించిందేగాని, తనకి ఎటువంటి స్మగ్లింగ్లతోనూ సంబంధం లేదని చెప్పినమాటనే అరిగిపోయిన రికార్డులా చెప్తూనే ఉన్నాడు.


ఇక అతనితో ఇలా లాభం లేదని, థర్డ్ డిగ్రీవే ప్రయోగించాలని ఓ నిర్ణయానికి వచ్చారు ఇన్స్పెక్టర్ కనకారావు, ఎస్పీ పుల్లారావూను. వాళ్ళ ఏర్పాట్లలో వాళ్ళుండగా, అక్కడ జరుగుతున్న తతంగం ఎలా తెలిసిందో మరి టివి సిక్స్, డి టివి, డిబిఎన్, టివి తొంభై వాళ్ళందరూ కూడా అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు మైకులతో, కెమేరాలతో గొడవగొడవగా.


చాలా రోజులైంది తన చేతులకి, లాఠీకి పని చెప్పి, ఈ రోజు మంచి అవకాశం చిక్కింది చేయి దురద తీర్చుకోవడానికి అని బోలెడంత సరదా పడిపోయిన కనకారావు వాళ్ళందర్నీ చూస్తునే నీరసించిపోయాడు. 'వీళ్ళందరికీ అప్పుడే తెలిసిందెలాబ్బా?' అని బుర్ర గోక్కున్నాడు.


"మీకూ దావూద్కి ఏమిటి లింక్? మీరు అతని ఏజెంటా?" ప్రశ్నించాడు ఓ విలేఖరి వీరభద్రం ముందు మైక్ పెట్టి. అతనివైపు అయోమయంగా చూసాడు వీరభద్రం. "మీకు తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని విన్నాము. నిజమేనా?" ఇంకో టివి విలేఖరి ప్రశ్నబాణం. ఆ ప్రశ్నకి వీరభద్రం బిక్కమొహం వేసాడు.


"డ్రగ్స్ కుంభకోణంలో మీ పాత్ర కాస్త వివరంగా చెప్తారా?" ఇంకోడు ఉక్కిరిబిక్కిరి చేసాడు. వెర్రిముఖం వేసుకొని అతనివైపు తిరిగాడు వీరభద్రం.


అతన్ని బలవంతంగా తనవైపుకు తిప్పుకొని ఇంకో విలేఖరి, "మీకు వెయ్యి వజ్రాలు ఎలా వచ్చాయి? మీకూ విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి వజ్రేశ్వర్రావుతో సంబంధం ఏమైనా ఉందా?" తూటా పేల్చాడు. వాళ్ళ ప్రశ్నలు వింటూంటే నిజంగానే వీరభద్రంకి పిచ్చి ఎక్కెనట్లైంది.


ఒక్కసారి గట్టిగా, "ఆపండి!...ఆపండి!...నాకు ఎవరితో సంబంధం లేదు. నిజంగా ఆ వేయి వజ్రాలు నావే! రేయింబవళ్ళూ చేసిన నా శ్రమ ఫలితమా వేయి వజ్రాలు. ఆ వేయి వజ్రాలు పోయాయని నేనేడుస్తూంటే ఇదేం గోల?" అన్నాడు వీరభద్రం గొంతు చించుకొని.


ఈ లోపున ఆ సంఘటనంతా అన్ని టివిలు పోటాపోటీగా లైవ్ టెలెకాస్ట్లు ఆరంభించాయి. ఇంకో చానెలైతే మరో అడుగు ముందుకేసి దీనిపై ఓ చర్చా కార్యక్రమం కూడా పెట్టింది. ఆ చర్చా కార్యక్రమంలో పేరుపొందిన దొంగలూ, దొరలూ కూడా పాల్గొని తమ (అ)మూల్యమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు.

ఇంతలో స్టేషన్లో ఒక్కసారి కలకలం రేగింది. వీరభద్రం నుండి బ్రీఫ్కేస్ లాక్కుపోయిన జోసెఫ్ని బైక్ నంబర్ ఆధారంగా పట్టుకున్న కానిస్టేబుల్ వాడ్ని లాక్కొచ్చాడు. వాడి చేతులో ఉన్న బ్రీఫ్కేస్ చూడగానే వీరభద్రం తనని చుట్టుముట్టిన టివివాళ్ళని తప్పించుకొని ఆత్రంగా వాడికేసి పరుగెట్టాడు.


"స్టాప్...స్టాప్..." ఇన్స్పెక్టర్ కనకారావు వేసిన కేకలు విని హడలిపోయి ఒక్క అడుగు వెనక్కు వేసాడు వీరభద్రం.


"అది నాదే...అందులోనే నా కష్టార్జితం ఉంది." అన్నాడు వీరభద్రం ఆదుర్దాగా.


"మన పాత కేడీ జోసెఫే!" గుర్తుపట్టాడు కనకారావు. వాడి చేతులోని బ్రీఫ్కేస్ లాక్కున్నాడు. 'నాకు నా వాటా ఇవ్వకుండా అట్నుంచి అటే పారిపోదామనే!’ అన్నట్టు జోసెఫ్వైపు ఓ చూపు విసిరి, బ్రీఫ్కేస్ తెరిచి టేబుల్ మీద బోర్లించాడు అందరూ చూస్తూండగా.


అందులో ఓ జత బట్టలు, రెండు అండర్వేర్లూ, రెండు బనియనులు, ఓ లుంగీ, ఓ తువ్వాలు కాక, ఓ అరడజను పుస్తకాలు బయటపడ్డాయి. ఆ పుస్తకాలు చూస్తూనే సంతోషం పట్టలేకపోయాడు వీరభద్రం. "అవే నా 'వేయి వజ్రాలు ' కవితా సంపుటి. చాలా శ్రమపడి రాసాను. ఎల్లుండి ఉగాదికి కవి సమ్మేళనంలో పాల్గొనడానికి తెచ్చుకున్న నా కవితా నిధి అవి." అన్నాడు ఆ పుస్తకాలు చేతిలోకి తీసుకొని కళ్ళకద్దుకుంటూ.

అది విన్న కనకారావుకి మూర్చ వచ్చినంత పనైంది. "నీ దగ్గర ఉన్న 'వేయి వజ్రాలంటే' ఇవా? నిజం వజ్రాలు కావా?” అన్నాడు ఎస్పీ పుల్లారావు తేరుకొని.


"అవును ఇవే! నేను అహోరాత్రులు కష్టపడి సాధించిన 'వేయి వజ్రాలు ' కవితా సంపుటి ఇవే. శ్రీ విశ్వనాథగారు ‘వేయి పడగలు' రాసి ఖ్యాతి గడించినట్లే, నేను వేయి వజ్రాలు రాసి పేరు సంపాదించాలనుకోవడం తప్పా? నేను ఆయనలా జ్ఞానపీఠ అవార్డు అందుకోవాలనుకోవడం తప్పా! చెప్పండి! నాకు పేరు రావడం ఇష్టంలేక ఎవరో కుట్రపన్ని నా వేయి వజ్రాలు అపహరించాలని చూసారు.


అయినా వాళ్ళ ఆటలు సాగలేదు. దేవుడి దయవల్ల నా వేయి వజ్రాలు నా వద్దకే తిరిగి వచ్చాయి. ఎస్పీగారూ, నా మీద నిందారోపణలు చేసే బదులు, నా వేయి వజ్రాల అపహరణ కుట్ర వెనక దాగి ఉన్న అసలు నేరస్తులను మీరు కనుక్కోవాలి." అన్నాడు వీరభద్రం.


అప్పటివరకూ అంతా ఆసక్తిగా గమనిస్తున్న టివి విలేఖరులు, సిబ్బందీ, లైవ్లో చూస్తున్న యావన్మందీ నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. పాపం చిట్టిబాబు, సత్తిబాబులకైతే పెద్ద షాకే తగిలింది. చేష్టలుడిగి అలా చూస్తూ ఉండిపోయారు.


"పదండిరా! పదండి, నా వేయి వజ్రాలు దొరికాయి." తన బ్రీఫ్కేస్ పట్టుకొని బయటకు నడిచిన వీరభద్రంని అనుసరించారు చిట్టిబాబు, సత్తిబాబు అక్కడున్న అందరూ తెల్లబోయి చూస్తూ ఉండగా.

***

దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.



101 views0 comments

Comments


bottom of page