#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #VidhiAdinaNatakam, #విధిఆడిననాటకం, #TeluguKathalu, #తెలుగుకథలు, #TeluguCrimeStory
Vidhi Adina Natakam- New Telugu Story Written By - Vemparala Durgaprasad
Published In manatelugukathalu.com On 22/12/2024
విధి ఆడిన నాటకం - తెలుగు కథ
రచన: వెంపరాల దుర్గాప్రసాద్
ఇన్స్పెక్టర్ ప్రకాష్ కి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయి 2 నెలలు అయింది. అంతకు ముందు అతను రాజమండ్రి లో పనిచేసేవాడు. రాంనగర్ లో ఇల్లు తీసుకున్నాడు. డ్యూటీ కి బయలు దేరుతుండగా స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. డాబాగార్డెన్స్ లో ఒక వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడని కానిస్టేబుల్ శంకర్ చెప్పేడు. పక్కింటి వాళ్ళు స్టేషన్ కి సమాచారం ఇచ్చేరుట. వెంటనే, ఘటనా స్థలానికి బయలు దేరి వెళ్ళాడు.
అది ఒక అపార్ట్మెంట్, ఆ ఫ్లాట్ హాల్ కిటికీ తీసి వుంది. లోపల హాల్ లో ఒక వ్యక్తి ఫ్యాన్ హుక్ కి తాడు తో వేలాడుతూ వున్నాడు. తలుపు లోపల వేసి వుంది. అందుకు, అది ఆత్మహత్య అని నిర్ధారణకు వచ్చేరు చుట్టుపక్కల వాళ్ళు.
వెంటనే తలుపులు బద్దలు కొట్టి లోపలి కి వెళ్ళేరు. అతన్ని జాగ్రత్తగా కిందకి దింపి, నేల మీద పడుకోబెట్టారు. మనిషి లో చలనం లేదు. నాడి చూసేడు. కొట్టుకోవడం లేదు. అతను మరణించాడని నిర్ధారణ కి వచ్చేడు ప్రకాష్. కానీ ప్రొసీజర్ ప్రకారం డాక్టర్ ని పిలిపించేడు. డాక్టర్ కూడా నిర్ధారించాడు. శవాన్ని పరిశీలన గా చూసేడు ప్రకాష్.
అతనికి ఓ 40 ఏళ్ళు ఉంటాయి. జుట్టు చింపిరిగా, బట్టలు మాసిపోయినట్లు, కళ్ళు గుంతలు పడి వున్నాడు. చుట్టుపక్కల వాళ్ళని అడిగేడు. “మొన్నటి వరకు అతని భార్య ఇంట్లో ఉండాలి, ఆమె ఎక్కడికో మొన్న వెళ్లి పోయింది”, అని చెప్పేరు పక్క పోర్షన్ లో వాళ్ళు.
“భార్య, భర్త ఎలా వుండే వాళ్ళు?” అని వాళ్ళని ప్రశ్నించాడు.
“ఇద్దరూ ఎక్కువ దేనికో ఘర్షణ పడుతూ వుంటారు. అతను ఎక్కువ గా పగలు ఇంట్లో పడుకుంటూ ఉంటాడు. సాయంత్రం బయటకి వెళ్తూ ఉంటాడు” అన్నారు.
“ఆమె పేరు నీరజ. ఆమె ఏదో ప్రైవేట్ కంపెనీ లో వుద్యోగం చేస్తుంది”.
ఇంతలో కింద నుండి ఇంటి ఓనర్ వచ్చేడు. ఆయన పేరు రాఘవయ్య. ఆయన్ని ప్రశ్నించాడు ప్రకాష్.
“వాళ్ళు ఈ ఇంట్లో యెంత కాలం గా వుంటున్నారు?”.
“వాళ్ళు ఇక్కడికి వచ్చి 6 నెలలే అయింది. ఇదివరకు ముంబై లో వుండే వారుట.
ఇలా ఆత్మహత్య చేసుకునే అంత తీవ్రమయిన సమస్యలు ఏమున్నాయో నాకు తెలియదు” అన్నాడు రాఘవయ్య.
ఇంట్లో పరిసరాలు పరిశీలించేడు. ఇల్లంతా చిందరవందర గా వుంది.
అతని జేబులో ఫోన్ తీసి జాగ్రత్త చేసేడు. అందులో ఏమయినా ఆధారాలు దొరకచ్చని.
ఇంటి యజమాని దగ్గర, పక్క వాళ్ల దగ్గర స్టేట్మెంట్లు తీసుకున్నాడు ప్రకాష్. శవాన్ని మార్చురీ కి తరలించారు. పక్క ఇంటి వాళ్ళ వద్ద, ఇంటి యజమాని దగ్గర అతని భార్య ఫోన్ నెంబర్ దొరకలేదు.
ఇల్లంతా వెదికేడు. అలమారు లో ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ మాత్రం కనపడింది. అది కూడా బోర్లించి పడి వుంది. తీసి ఆ ఫోటో చూసిన ప్రకాష్ ఒక్క సారి గా హతాశుడయ్యాడు. ఆ ఫోటో లో చనిపోయిన వ్యక్తి పక్కన వున్న స్త్రీ మూర్తి ని చూసి పిచ్చెత్తి నట్లయింది ప్రకాష్ కి.
ఆ ఫోటో ఇంటాయనకి చూపించేడు. ఆమె అతని భార్య అని ఆయన నిర్ధారించాడు. ఆ ఫోటో తీసుకుని జాగ్రత్త పెట్టేడు.
కానిస్టేబుల్ కి మిగిలిన పనులు అప్పచెప్పి, హుటాహుటిన ఇంటికి బయలు దేరేడు. ఇంటికి వెళ్లే దారిలో అన్యమనస్కం గానే గడిపేడు.
“ఇది ఎలా సాధ్యం, ఆ స్త్రీ అచ్చు తన భార్య లా వుంది. ఇందులో ఏదో మిస్టరీ వుంది” అని అనుకున్నాడు. మనుషుల్ని పోలిన వాళ్ళు వుంటారు అని వినడమే కానీ, ఇప్పుడే ఎదురుగా చూడడం. ఏమీ అర్ధం కావడం లేదు అతనికి. తన భార్య ఎవరూ లేని అనాధ గానే తనకు తెలుసు.. ఇలా పరి పరి విధాలుగా ఆలోచనల తో ఇల్లు చేరేడు ప్రకాష్.
డ్యూటీ కి వెళ్లిన భర్త అప్పుడే మళ్ళీ రావడం చూసిన సరోజ ఆశ్చర్యం గా చూస్తోంది. “సరోజా.. ఈ ఫోటో చూడు.. అంటూ ఫోటో చూపించాడు.
సరోజ మొహం లో రంగులు మారిపోయాయి. ఆమెలో అంతలోనే ఆనందం తాలూకు ఛాయలు చుట్టుముట్టాయి. అప్పుడు ఇలా చెప్పింది"
"ఆమె మా అక్క. మీకు ఇదివరకు నేను చెప్పలేదు. ఇప్పుడు చెపుతాను. అది ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నాన్న పట్టుదల వల్ల ఆమె జ్ఞాపకాలు మరిచి పోయి బతుకుతున్నాము. అప్పుడు మేము అందరం ఒంగోలు లో వుండే వాళ్ళం. అది ఇంట్లోంచి వెళ్లి పోయాక, నాన్న విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేసేరు. ఇది మీకు ఎక్కడ కనపడింది. ? వాళ్ళు ఇక్కడే ఉన్నారా?” అంది ఆదుర్దా నిండిన స్వరం తో.
జరిగిన విషయం చెప్పేడు.. సరోజ మొహం పాలిపోయింది.
“అయ్యో ఆ పిచ్చిదానికి అన్నీ కష్టాలేనా?” అని ఏడవడం మొదలు పెట్టింది.
***
ఇక్కడ సరోజ, నీరజ ల గురించి కొంత చెప్పాలి. సరోజ నీరజ ల మధ్య ఒక్క సంవత్సరమే తేడా. ఇద్దరూ ఒకే కాలేజీ లో చదివే వారు. డిగ్రీ అయిన వెంటనే, తాను నార్త్ ఇండియన్ అయిన పంకజ్ సక్సేనా ని ప్రేమిస్తున్నానని, నీరజ తండ్రి రామారావుకి చెప్పడం, తండ్రి ప్రేమ వివాహానికి వొప్పుకోకపోవడం జరిగింది.
కానీ మొండిది, పట్టుదల కలది అయిన నీరజ, పంకజ్ సక్సేనా తో ముంబై వెళ్ళిపోయింది. ఇంట్లోంచి వెళ్లి పోయాక, పట్టుదల, మొండితనం లో ఆమె కంటే ఎక్కువ గా వుండే రామారావ్ ఆమెని పట్టించుకోలేదు. ఇంట్లో కూడా ఆమె జ్ఞాపకాలు వుండడానికి వీల్లేదని చెరిపేసాడు.
అప్పటి నుండి ఆమె వివరాలు రామారావు గారి ఇంట్లో ఎవరికీ తెలియవు. ఆమె మరణించినట్లు గా భావించాలని చెప్పి ఇంట్లో వాళ్ళ నోళ్లు మూయించాడు.
4 సంవత్సరాల క్రితం కోవిడ్ వచ్చి సరోజ తల్లి సుగుణ చనిపోయింది. తల్లి చనిపోయిన ఏడాదికి తండ్రి కూడా గుండె పోటు తో చనిపోయాడు. తల్లి తండ్రులు చనిపోయినప్పుడు కూడా సరోజ నీరజ కోసం ఎదురు చూసింది. ఆమె ఆచూకీ తెలియక, చేసేదేమి లేక ఊరుకుంది. అప్పుడు సరోజ కూడా ఒక ప్రైవేట్ కంపెనీ లో పని చేసేది. ఆ ఏడాది లో కొలీగ్ ప్రకాష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రకాష్ అదే కంపెనీ లో చేస్తుండగా, సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ రావడం, రాజమండ్రి లో పోస్ట్ అవడం తో సరోజ వుద్యోగం మానేసింది. అదీ ఆ అక్క చెల్లెళ్ళ కథ.
***
ఇంతలో ప్రకాష్ ఫోన్ మోగింది.
“సార్ ఎవరో ఒక ఆమె స్టేషన్ కి వచ్చి, తన భర్త గురించి అడుగుతున్నారు" అని కానిస్టేబుల్ శంకర్ చెప్పేడు.
“ఇందాక మనం చూసిన ఆత్మ హత్య కేసు తాలూకా నా.. " అన్నాడు ప్రకాష్ కొద్దిగా ఆశగా.
" అదే అనుమానం గా వుంది. నేను మీరు వచ్చేక మాట్లాడి వివరాలు చెప్పచ్చు అని ఆమెని కూర్చో పెట్టేను సార్. " అన్నాడు శంకర్.
విషయం చెప్పేడు భార్యకి. ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు. ఆవచ్చిన వ్యక్తి అక్క అయితే బావుండును. బావ మరణించినా, కనీసం అక్క ని ఇన్నాళ్ళకి చూడగలుగు తుంది. అని ఆమె ఆత్రుత గా వుంది. ప్రకాష్ తో బాటు స్టేషన్ కి వెళ్ళింది. వాళ్ళ వూహ నిజమే అయింది. వచ్చింది నీరజే. స్టేషన్ లో అక్కా చెల్లి, ఒకరిని ఒకరు చూసుకుని నిస్చేస్టులయిపోయారు.
నెమ్మదిగా తేరుకున్న సరోజ ఆప్యాయంగా నీరజ భుజం మీద చేయి వేసి, దగ్గరకి తీసుకుంది.
అప్పుడు ప్రకాష్ వివరాలు అడిగేడు.
ప్రకాష్ సబ్ ఇన్స్పెక్టర్ మాత్రమే కాదని, తనకి మరిది అని తెలిసి నీరజ కొంత రిలీఫ్ ఫీల్ అయింది.
నీరజ తన కథ ఇలా వివరించింది:
" నేను నాన్న ని ఎదిరించి పెళ్లి చేసుకుని, మోసపోయాను. అతను వ్యసనాల పుట్ట. ముంబై లో ఉంటే పూర్తిగా పాడయిపోతున్నాడని, బలవంతం మీద 6 నెలల క్రితం విశాఖపట్నం తెచ్చేసేను. నాకు ఇక్కడ మా ఫ్రెండ్ కంపెనీ లో ఒక వుద్యోగం దొరికింది.
అతనికి వుద్యోగం లేదు. డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు. రోజూ డ్రగ్స్ వల్ల పగలు మత్తుగా పడుకుని ఉంటాడు. సాయంత్రం మళ్లీ మామూలే. నా ప్రయత్నాలు అన్నీ విఫలమయి పోయాయి. అతని లో హింసా ప్రవ్రుత్తి పెరిగి పోతోంది. ఈ మధ్య నన్ను కొట్టడం కూడా మొదలు పెట్టేడు. పైగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడు. నేను డబ్బులు ఇవ్వడం మానేసాను. దాంతో రోజూ గొడవలు ఎక్కువ అయ్యేయి. ఇంక అతన్ని మార్చలేనని అర్ధం అయింది.
మొన్న జరిగిన గొడవతో, విసిగి, ఇంట్లోంచి వెళ్లి పోయి, స్నేహితురాలి ఇంటిలో తల దాచుకున్నాను.
టీవీ లో స్క్రోలింగ్ లో ఈ ఆత్మహత్య వార్త విన్న నాకు భయం వేసి, ఇంటికి వచ్చేను. ఇంటికి వచ్చేక మీరు అతన్ని పోస్టుమార్టం కి తీసుకెళ్ళేరని తెలిసి మీ స్టేషన్ కి వచ్చేను ”. అంది దీనంగా ఏడుస్తూ.
ప్రకాష్ కి ఆమె స్థితి చూస్తే జాలి వేసింది. ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నాడు. మార్చురీ కి తీసుకెళ్లి శవాన్ని చూపించేడు. ఆమె కన్నీరు మున్నీరు గా విలపించింది. ప్రకాష్, సరోజ ఆమెకి ధైర్యం చెప్పి, తమతో ఇంటికి తీసుకెళ్ళేరు.
అదే రోజు శవానికి పోస్ట్ మార్టం చేయించేడు. రిపోర్ట్ ప్రకారం ఊపిరాడక చనిపోయినట్లు వుంది. ఆ రాత్రి వచ్చిన ఒక ఫోన్ కాల్ తో అతనికి కొత్త విషయాలు తెలిసేయి. అది సెంట్రల్ క్రైమ్ బ్యూరో ఇన్స్పెక్టర్ చెప్పిన విషయం. సలీం అనే డ్రగ్ సరఫరా చేసే వ్యక్తి వివరాలు, అతను ఎవరో ఫ్రెండ్ ఇంట్లో తలదాచుకున్నట్లు, అది రాంనగర్ లోనే అని వాళ్లకి తెలిసిందిట. అతని ఫోటో ఈ రాత్రికి పంపిస్తానని, నిఘా పెట్టమని ఆ కాల్ సారాంశం. అప్పుడు ప్రకాష్ లో కొత్త అనుమానం బీజం వేసుకుంది.
మరునాడు పంకజ్ ఇంటికి వెళ్లి తాళం తీసి ఇల్లంతా మళ్ళీ వెదికేడు. డస్ట్ బిన్లో దొరికిన ఒక సిగరెట్ పీక జాగ్రత్త పెట్టేడు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ పరిశీలన లో కూడా ఏ ఆధారాలు దొరకలేదు.
ఇంటిదగ్గర రోడ్ మీద దొరికిన సీసీ టీవీ ఫుటేజ్ తెప్పించి చూసాడు. పంకజ్ మరణించిన రోజు సాయంత్రం ఒక టోపీ ధరించిన వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్లి నట్లు కనపడింది. ఆ వ్యక్తి బలిష్టంగా వున్నాడు, 6 అడుగుల ఎత్తు ఉంటాడు.
ఆ సిగరెట్ పీక, ఆ వ్యక్తి ఫోటో లని నీరజ కి చూపించేడు.
ఆ ఫొటోలోని వ్యక్తి ని గుర్తు పట్టింది. "అతను ఒకటి రెండు సార్లు మా వారి దగ్గరకి రావడం చూసేను, కానీ అతని పేరు తెలియదు. " అంది.
" ఈ బ్రాండ్ సిగరెట్ మీ వారు తాగేవారా?" ప్రశ్నించాడు ప్రకాష్.
లేదు.. మా వారు" క్లాసిక్ సిగరెట్" తాగేవారు. ఈ బ్రాండ్ వారిది కాదు అంది.
ఇల్లంతా మళ్ళీ పరిశీలించిన ప్రకాష్ కి ఒక కొత్త విషయం బయట పడింది.
హాలు పక్క గది లో కిటికీ గ్రిల్ కొత్తగా బిగించినట్లు వుంది. కిటికీ తలుపు తీసి వుంది. తలుపుకి బోల్ట్ లేదు. తలుపు మూసుకోవడం లేదు. ఆ కిటికీ లోంచి బాల్కనీ లోకి దిగిపోవచ్చు.
కార్పెంటర్ ని తీసుకుని వచ్చి, తన అనుమానం నివృత్తి చేసుకున్నాడు.
అప్పుడు అతనిలో అనుమానం బలపడింది.
పంకజ్ సక్సేనా ని ఎవరో హత్య చేసి, అది ఆత్మహత్య గా చూపించవచ్చు అనిపించింది.
అది హత్య అయితే, ఆ వచ్చిన వ్యక్తి పంకజ్ ని చంపి, ఫ్యాన్ హుక్ కి శవాన్ని వేలాడతీసి
పక్క గది కిటికి తీసుకుని బయటకి వెళ్లి పోయి ఉండవచ్చు. పైగా పంకజ్ ఫ్లాట్ లో ఆ రోజు అతను ఒంటరిగా ఉండడం హంతకుడికి బాగా కలిసి వస్తుంది. ఇలా ఆలోచిస్తున్న ప్రకాష్ ద్రుష్టి అల్మారా లో కనపడుతున్న న్యూస్ పేపర్ మీద పడింది.
అందులో ఒక క్రైం వార్త అతన్ని ఆకర్షించింది.
జిల్లాలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక బడా స్మగ్లర్ ని సెంట్రల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు ఓల్డ్ టౌన్ లో పట్టుకున్నట్లు, వాడి ద్వారా వాడి అనుచరులు, అలాగే వాడి దగ్గర డ్రగ్స్ తెప్పించుకున్న వాళ్ళని పట్టుకునే ప్రయత్నాల లో ఉన్నట్లు వుంది. ఆ వార్త తాను కూడా తమ డీ ఎస్పీ గారి ద్వారా విన్నాడు. వివరాలు అన్ని పోలీస్ స్టేషన్లకి పంపిస్తామని, సెంట్రల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు లోకల్ పోలీస్ సహాయం తీసుకుంటున్నట్లు చెప్పేరు. ఆ విషయాలు అన్నీ గుర్తుకు వచ్చేయి.
అప్పుడు ప్రకాష్ ఆ క్రైమ్ బ్యూరో ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసేడు.
హలో సంపత్ గారు, నమస్కారం" అన్నాడు.
" నమస్కారం, ఇప్పుడే మీకు సలీం ఫోటో పంపిద్దాం అనుకున్నాను. మీరే ఫోన్ చేసేరు. "
అన్నాడు అతను.
ప్రకాష్.. “వెంటనే పంపించండి.. ఇక్కడ ఒక మరణం జరిగింది. అది హత్య ఏమో అనుమానిస్తున్నాను” అన్నాడు.
ఇంతలో సంపత్ ఫోన్ నుంచి వచ్చిన ఫోటో చూసిన ప్రకాష్ కి నిర్ధారణ అయింది.
ఆ సలీం ఎవరో కాదు. పంకజ్ ఫ్రెండ్ అని చెప్పిన వ్యక్తే.
ఇప్పుడు అతనికి ఒక లింక్ దొరికింది.
వెంటనే సంపత్ కి జరిగిన విషయం చెప్పడం జరిగింది. సంపత్ కూడా తన టీమ్ తో ఆ ఇంటిని పరిశీలించేడు.
***
ఒక వారం గడిచింది. నందిగామ దగ్గర సలీం దొరికేడు.
సలీం కి పోలీస్ మర్యాదలు ఇచ్చేక విషయం మొత్తం తెలిసింది.
పంకజ్ సలీం దగ్గర డ్రగ్స్ తీసుకునే వాడు. సలీం పంకజ్ సక్సేనా ఇంట్లో తల దాచుకుందామని వచ్చిన రోజు ఇద్దరి మధ్య, ఘర్షణ జరిగింది. గంజాయి మత్తులో వున్న పంకజ్ ని పీక నులిమి చంపి, అది ఆత్మ హత్య లా కనపడేలా చేసి, కిటికీ గ్రిల్ తొలగించి, మళ్ళీ బయట నుండి, అది బిగించి సలీం జారుకున్నాడు. పంకజ్ ఒంటరిగా ఉండడం, చుట్టుపక్కల వాళ్ళు అతని ఇంటి వైపు ఎప్పుడూ రాకపోవడం సలీం కి కలిసి వచ్చింది.
***
సరోజ కి నీరజ జీవితం లో జరిగిన విషాదం గురించి చాలా చాలా బాధగా వుంది.
భర్తతో " ఏమండీ, అక్క జీవితంలో ఇన్ని దుర్ఘటనలు ఏమిటండీ? విధి ఇంత పగబట్టిందా అక్కమీద?" అంది ఉక్రోషంగా.
“ఏం చేస్తాం కొంత మంది జీవితాలలో విధి ఆడిన నాటకం చూస్తూ భరించక తప్పదు.. పోనీలే కనీసం దొరకదు అనుకున్న మీ అక్క ఇన్నాళ్ళకి మన దగ్గరికి వచ్చిందిగా. ఆవిడని జాగ్రత్తగా చూసుకుందాం " అని ఆమెని ఊరడించాడు ప్రకాష్.
సరోజకి ఇన్నేళ్లకి అక్క దొరికిందని ఆనందం గా వుంది. అలాగే, నీరజ కి కూడా కోల్పోయిన జీవితం రాదని తెలిసినా, చెల్లి దగ్గర అవడం కాస్త ఉపశమనం.
సమాప్తం
వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్
నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో
అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.
రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.
ధోనీ, రోహిత్ శర్మ అంటే క్రికెట్ లో చాలా ఇష్టం.
సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.
ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.
వుండేది విశాఖపట్నం.
ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.
Comments