top of page
Writer's pictureLakshmi Sarma B

విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 1

కొత్త ధారావాహిక ప్రారంభం


'Vidhi Adina Vintha Natakam - Part 1' - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 04/09/2024

'విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 1తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



టింగ్  టింగ్  కాలింగ్  బెల్ మ్రోగుతుండడంతో  గబగబా వచ్చి  తలుపులు తీసి ఎదురుగా  ఉన్న మనిషిని చూస్తూ బెదురుతూ, “మధు..నువ్వా!  ఏమిటి  మళ్ళీ వచ్చావు.. నీకెన్నిసార్లు చెప్పాలి? ఇలా రావద్దని లక్షమార్లు చెప్పాను. అయినా నువ్వు వినిపించుకోవడంలేదు.  మనం  కాలేజిరోజుల్లో ప్రేమించుకున్నమాట నిజమే కాదనను,  కానీ! ఇప్పుడు నేను పెళ్ళిచేసుకుని ఒకరి భార్యగా ఉన్నదానను, నన్ను నువ్వు ఇలా అల్లరిపెట్టొద్దని చాలాసార్లు వేడుకున్నాను, నువ్వు ఇలా మాటిమాటికి వస్తుంటే ఇరుగుపొరుగు వాళ్ళుచూస్తే ఏమనుకుంటారు? నా భర్తకు తెలిసిందంటే  నన్ను నడిరోడ్డుమీద పడేస్తారు. నీకిది   న్యాయంగాఉందా   చెప్పు? పెళ్ళిచేసుకుని నువ్వన్నా హాయిగా  ఉండాలన్నదే  నాకోరిక మధు, ” అంది  బాధ,  దుఃఖం పెల్లుబికిరాగా. 


“వెళ్ళను  ప్రియా.. నిన్ను విడిచి వెళ్ళలేను, ” అన్నాడు గట్టిగా. 


“ఏం .. ఎందుకు వెళ్ళలేవు?  నువ్వు వెళ్లాలి  వెళ్ళితీరాలి. ఇంకొక క్షణం ఇక్కడే  ఉన్నావంటే ఏం జరుగుతుందో  నాకే  తెలియదు, ” అంతకన్నా గట్టిగా అంది. 


“నీకు  తెలియదా  నేనెందుకు  వెళ్ళనో? నా ప్రాణాలను  ఇక్కడవదిలేసి  వెళ్ళమంటే  ఎలా వెళ్ళగలను? నిన్ను  చూడకుండా  ఇన్నిరోజులు ఎలా ఉన్నానో   తెలుసా?  నువ్వు  పెళ్ళిచేసుకుని  మరొకరికి   భార్యవు అయినావు, కానీ!  ఏం చెయ్యను..  నిన్ను చూడకుండా ఉండలేను  ప్రియా, నా బొందిలో ప్రాణం ఉన్నంతకాలం   నిన్ను  చూస్తూ గడిపేస్తాను, నిన్ను చూడకుండా మాత్రం నేను నేనుండలేను. నన్ను  వెళ్ళిపొమ్మని  చెప్పకు, ”  గొంతులో బాధ అడ్డురాగా చెప్పాడు మధు. 



“మధు .. నీకు  మంచిగా చెబితే  అర్ధంకాదా? నావల్ల  నీకు ఏం ఉపయోగం లేనప్పుడు నా వెంబడి  పడడం ఎందుకు?  నాకు నువ్వంటే  పంచప్రాణాలు  ఉన్నమాట  నిజమే, కానీ నేనిప్పుడున్న పరిస్థితులలో  నేనేం చెయ్యలేను, నేనుండడం లేదా  నిన్ను దూరం చేసుకుని?

నువ్వు,  నాలానే  అలవాటుచేసుకో,   కొన్నాళ్ళు బాధనిపించినా  నువ్వు వేరే అమ్మాయిని పెళ్ళిచేసుకో.  అన్నీ మరిచిపోతావు, ” అంది గుండెలోని  ఆవేదనను అణిచిపెడుతూ. 


“ ఏంటి..?  నేను  వేరొకమ్మాయిని  నా జీవితంలోకి  అహ్వానించడమా? అంటే నిన్ను   ప్రేమించిన మనసు  వేరేవాళ్ళను  ప్రేమించగలదని ఎలా అనుకున్నావు?


ఎంతమాటన్నావు  ప్రియా! నీకు  తెలియదా  నా హృదయంలో ఏముందో? నీనుండి  నేనేం ఆశించడంలేదు, నిన్ను చూస్తూ  కాలం గడపుతాను. అందాన్ని  ఆరాధించడం అది దేవుడిచ్చిన వరం, ఇంకెప్పుడు నిన్ను  చూడడానికి రావద్దు అని చెప్పకు ప్రియా,  నేను తట్టుకోలేను, ” ఆవేశంగా  ప్రియాంక చేతులు పట్టుకున్నాడు. 


“మధు..   వదులు. ఎవరైనా చూస్తే బాగోదు. ఒక్క ఒరలో రెండుకత్తులు ఇమడలేవు, నా భర్తకు  అన్యాయం చెయ్యలేను. నేను నీకు మల్లే కుమిలిపోతున్నాను. ఎందుకో తెలుసా?


 ప్రేమించినవాడికి  దూరమై, కట్టుకున్నవాడికి  దగ్గరకాలేకా జీవచ్ఛవంలా బ్రతుకుతున్నాను. ఎవరికి చెప్పుకోను నాబాధను?


నీకు తెలుసా  మధు.. నా అణువణువున నీ రూపమే, నీ ధ్యాసే, నిన్ను  మరిచిపోలేక అతనికి  చేరువకాలేకపోతున్నాను. ఎప్పుడు  ఆయన ముందు బయటపడతానోని  అనుక్షణం భయపడుతున్నాను. ఇప్పుడుచెప్పు..  నీకొక్కడికే  మనసుంది అనుకున్నావా? నేను  నీలానే తపిస్తున్నాను, కానీ ! నీ దగ్గరకు రాలేని  నిర్భాగ్యురాలను. మళ్ళీ జన్మంటూ  ఉంటే, నీకే  భార్యగా కావాలని  ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను, ” అంటూ  తన వ్యధనంతా  చెప్పుకుంటూ పెల్లుబికి  వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకా మధును

గట్టిగా కౌగిలించేసుకుంది  ప్రియాంక తన్మయత్వంతో.   అలానే  లాలనగా గుండెలకు అదుముకున్నాడు మధు. అలా ఒకరికౌగిలిలో ఒకరు  లోకాన్నే మరిచిపోయారు  ఒక్క క్షణం. 


చటుక్కున  తను చేసిన  తప్పు గుర్తుకువచ్చి  పక్కకు జరిగి సిగ్గుతో తలవంచుకుంది. 


“ప్రియా .. చాలు ప్రియా, నాకు  ఈ తృప్తిచాలు.  నువ్వు నాదానివి, నీమనసులో  నాకు చోటుంది అదిచాలు, ” అని చెబుతూ  వెళ్ళిపోయాడు మధు. అతను వెళ్ళినవైపే చూస్తూ పాత జ్ఞాపకాల్లోకి  వెళ్ళిపోయింది  ప్రియాంక. 

***

ప్రియాంక  వాళ్ళది చాలా  ఉన్నతమైన కుటుంబం. మంచి  ఆస్తిపరులు.   సుదర్శనం పద్మావతిల ఏకైక  సంతానం  ప్రియాంక. ఒక్కతే  కూతురు కావడం వల్ల అల్లారుముద్దుగా  పెంచారు. ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది  ప్రియాంక బాల్యం. చదువులో  ఎప్పుడు మంచి మార్కులతో పాసయ్యేది.   డిగ్రీ  మొదటి సంవత్సరంలో జాయిన్  అయింది. అప్పటివరకు  చిన్నపిల్ల మనస్తత్వంగా  ఉన్న ప్రియాంకకు కాలేజిలో  అందులో  ఆడామగా   కలిసిమెలిసి ఉండే కాలేజికి వెళ్ళ వలసిరావడంతో, కొంచెం బెదురుగా ఇంకొంచెం సిగ్గుగా అనిపించసాగింది మగపిల్లలను చూస్తుంటే. 


లేలేత వయసు అంతకు మించి పరిపక్వత  వస్తున్న మనసు రెండుకలిపి ఊపిరాడనివ్వడంలేదు. నున్నగా నునుపుచేసిన  మేనుతో, శంకంలాంటి  మెడతో,   పాలబుగ్గలు గిల్లితే  పాలుకారుతాయా అన్నంతా  సుకుమారంగా, కొనదేలినా  ముక్కు,  ఎర్రటి దొండపండును మరిపించే పెదవులు, పచ్చటి మేనిచాయతో  సన్నటి నడుము,   పిరుదులు దాటిన నల్లటి నాగసర్పంలాంటి జడ  నడుస్తుంటే  నాట్యంచేస్తున్నట్టుంది. వెనకనుండే  చూసేవాళ్ళకు  అడుగులు సైతం   తడబడతాయి. 


ఇక  ముందునుండి  చూస్తుంటే  అలానే మైమరచిపోతారు. అంతటి అందాలరాశి   ప్రియాంక. ప్రియాంకతో  స్నేహం  చెయ్యడానికి  చాలామంది  అబ్బాయిలు  వెంటపడ్డారు. కానీ,   ఆడపిల్లలతో  నవ్వుతూ  గలగలమాట్లాడే  ప్రియాంక  మగపిల్లలకు ఆమడదూరంలో  ఉండేది.   వాళ్ళదగ్గర  ఎప్పుడు  గంభీరంగా  ఉండేది  అందుకే  ఆమెను 

మాట్లాడించాలంటే  కొంచెం  జంకేవాళ్ళు  అబ్బాయిలంతా. అలా అని పొగరులేదు. డబ్బున్నా అహంకారం లేదు. చాలా సాదాసీదా  మనస్తత్వం  ప్రియాంకది. 


ఒకరోజు  కాలేజికి  లేటుగా  వచ్చింది  ప్రియాంక.   క్లాసు  మొదలైపోతుందనే  హడావుడిలో గబగబా  పరుగెత్తినట్టుగా  వచ్చింది.   ఆ రావడంలో  తనలాగే  లేటుగా వచ్చిన  అతనుకూడా కంగారుగా రావడంతో  చూసుకోకుండా  అతన్ని  గట్టిగా గుద్దుకుంది  ప్రియాంక. ఒక్కక్షణంలో ఇద్దరు  ఒకరిమీద  ఒకరు పడిపోయారు.   అతనే ముందులేచి  ప్రియాంకకు చేతినందించాడు. 

సిగ్గుపడుతూ  లేచింది. ఒకరివైపు  ఒకరు చూసుకున్నారు  నాలుగుకళ్ళు కలుసుకున్నాయి. ఎన్నాళ్ళుగానో పరిచయమున్న  వాటిలా  ఊసులాడుకుని విడివడినాయి. 


“ఆయాం సారీ అండి, నేను  నేను కావాలని మిమ్మల్ని  డాష్ ఇవ్వలేదండి, క్లాసుకు టైం అవుతుందని  తొందరలో చూసుకోలేదు, ” అంది. 


“అయ్యో  మీదేకాదు నాది తప్పు ఉందిలెండి, నేను కూడా  క్లాసు లేటయితుందన్న హడావుడిలో  పరుగెత్తుకుంటూ  వచ్చాను, అసలైతే  నేనే మీకు  సారీ చెప్పాలి  మిమ్మల్ని చూడనందుకు, ” అన్నాడు  నొచ్చుకుంటూ. 


“ఓకే .. ఓకే, మనం ఇలా  మాట్లాడుకుంటే  ఉంటే  క్లాసు నిజంగానే మిస్సయిపోతాము పదండి వెళదాము, ” అంది నవ్వుతూ. 


“హలో నాపేరు మధు, మీపేరు చెప్పలేదు, ” అడిగాడు పక్కనే నడుస్తూ. 


“ఇప్పుడుకాదు లంచ్ టైంలో చెపుతాను, ” అంది  నవ్వుతూ క్లాసు రూంలోకి  వెళుతూ. 


ఏమిటో ఒకటే  కాలేజిలో ఉన్నా తననెప్పుడు  అంతగా గమనించలేదు. ఎంత అందమైన రూపం ఒక్కసారి చూసామంటే  మరిచిపోలేము.   మొదటిసారి  అమ్మాయి  స్పర్శ ఏదో గిలిగింతలు పెడుతుంది. ఎంతమరిచిపోదామన్నా  పదేపదే ఆదే  గుర్తుకువస్తుంది. లెక్చరర్  పాఠంచెబుతున్నా  చెవికి ఎక్కడంలేదు  మధుకు. ఎప్పుడెప్పుడు లంచ్ టైం అవుతుందా అని  ఎదురుచూస్తున్నాడు. 


‘ఇదేమిటో నాకర్ధంకావడంలేదు. అమ్మాయిలను  చూస్తేనే ఆమడ దూరం పరుగెత్తే  నేను  ఇవాళ  తనకోసం అంత ఆరాటపడుతున్నాను’ అని అనుకుంటూ నవ్వుకున్నాడు  తనలోతానే.   


లంచ్ టైంలో  తను  వస్తుందేమోనని  అందరికంటే  ముందే వచ్చి కూర్చున్నాడు  మధు. ఎంతసేపైనా  ప్రియాంక  రాలేదు.  చూసిచూసి  విసుగొచ్చి  బయటకు వచ్చాడు.   ఆమె  తనతోటి  స్నేహితులతో  కలిసి  బయట చెట్లకింద కూర్చోని  నవ్వుతూ మాట్లడుతూ  లంచ్  చేస్తుంది. అసలు ఆమెకు గుర్తున్నట్టేలేదు  ఉదయం జరిగిన సంగతి. 


‘ఛీ ఛీ  అందుకే  ఆడవాళ్ళను నమ్మకూడదు’ అనుకుంటూ  విసురుగా  బయటకువెళ్ళిపోయాడు. 


ప్రియాంక  మనసు మనసులో లేదు.   ఉదయం జరిగిన  సంఘటన  ఆమె మదిని పులకింపచేస్తుంది.   అతని కళ్ళను మరిచిపోలేకపోతుంది  అతను  నావాడైతే  ఒక్కక్షణం ఏదో  తెలియని  ఆనందం  ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.   సినిమాలో  హీరో హీరోయిన్ లాగా  మా కలయిక  గమ్మత్తుగా  జరిగింది. అతను   మా కాలేజిలోనే ఉన్నా ఇంతవరకు ఎప్పుడూ చూడలేదతన్ని.   మంచి రూపం, ఆరడుగుల అందగాడే.  ఇప్పటివరకు  ఎంతమంది అమ్మాయిలు  వెంబడిపడ్డారో. 


పాపం నాకోసం  ఎంతగా ఎదురుచూసాడో  లంచ్ టైంలో కలుస్తానని చెప్పాను.   అతనికి  నిజంగా  నన్ను  కలవాలనుంటే  నాకోసం  వస్తాడు చూద్దాం వస్తాడో లేదోనని  మనసులో అనుకుంది. అందుకే  అటువైపు రాకుండా  అలా  దూరంగా కూర్చోని  అతన్ని గమనించసాగింది.   అతను  కాలుకాలిన పిల్లిలా అటూఇటూ తిరుగుతుంటే నవ్వాపుకోలేక పోతుంది. పక్కన ఉన్న స్నేహితులు గమనించారంటే  మొత్తం టాంటాం చేస్తారు. ఇప్పుడే  బయటకు రానివ్వకుండా చూసుకోవాలి అనుకుంది. అతను కోపంగా వెళ్ళిపోతుంటే ఒకవైపు   బాధనిపించింది. ఒకవైపు ఆనందమేసింది. ఆ రాత్రంతా  కళ్ళుమూసినా అతని రూపమే. అతని స్పర్శ గుర్తుకు వస్తుంటే సంతోషంతో పొంగిపోయింది ప్రియాంక.  


“హలో  సర్, ఏమిటి  కోపమా నామీద, ” అంది  కాలేజిలో  గేటులోపలకు వస్తున్న  మధును చూసి.   వీణమీటినట్టుగా  వినిపించి తలతిప్పిచూసాడు. పక్కనే నిలుచున్న ప్రియాంకను చూడగానే  ఆనందంతో  కెవ్వున కేకపెట్టబోయాడు. అంతలోనే తమాయించుకుని  నిన్నటిరోజు ఆమె  రాలేదన్న కోపంతో  తనను కాదన్నట్టు వెళ్ళిపోతున్నాడు.  


“ఏమిటో  పిలిచినా పట్టించుకోకుండా  వెళుతున్నారంటే మీకు  నాతో  స్నేహం చెయ్యడం ఇష్టంలేదని  అర్ధమవుతుంది, సరేలెండి  మీకంతగా నచ్చనప్పుడు  మీకోసం వేచి చూడడం ఎందుకు? అయినా  మీరు  పిలవగానే  పరుగెత్తుకురావాలంటే అమ్మాయిలం  కాస్తా వెనకాముందు చూసుకోవాలి కదా!  నా చుట్టు ఉన్నవాళ్లను,  నా స్నేహితులను వదిలించుకొని  రావాలంటే  కొంచెం  కష్టమైంది అందుకే  రాలేదు, ఆ మాత్రం దానికే  ఇంత అలుకా.. పోనిలేండి, మీరింత  కోపిష్టివాళ్ళనుకోలేదు  వస్తా, ” వెళ్ళిపోతున్నట్టుగా   వెళుతూ జరిగిన దాన్నీ  చెబుతూ  తన మనస్సులో ఉన్నది   బయటపెట్టింది. 


అమ్మో  నిజంగానే  కోపమొచ్చినట్టుంది  అనుకుంటూ,   “ఏయ్  .. ఆగు, ” అంటూ  అడ్డంతిరిగాడు.  


ముసిముసిగా  నవ్వుతూ “ఏయ్  ఏంటి  నాకో పేరుంది  తెలుసా  చక్కటి పేరు, పిలిచేవాళ్ళకు ఇంపైనా  పేరు  ప్రియాంక, ” అంది  బుంగమూతి  పెడుతూ. 


“ఇలా  చాలా  బాగున్నారు  ప్రియాంకగారు,   హలో  నాపేరు మధు .. నేను  ఇదే  కాలేజీలో చదువుతున్నాను.  మీ పక్కరూం మాది,   విజయవాడ నుండి  వచ్చాను.  హైదరాబాదులో ఉండాలన్న  నా చిన్నప్పటినుండి  కోరికమేరకు  వచ్చాను, ప్రస్తుతానికి  మా  ఫ్రెండ్ గదిలో ఉంటున్నాను, తొందరలోనే  ఎక్కడైనా  పార్ట్ టైం జాబుచూసుకుని  వేరే రూమ్‌కు  వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ” చెప్పాడు  మధు. 


“అదేమిటి  చక్కగా  చదువుకోకుండా  ఉద్యోగం  ఎందుకు?, ” అడిగింది.


 శ్రీమంతంలో  పుట్టిపెరిగిన  ఆమెకేం  తెలుసు  కష్టపడేవాళ్ళగురించి.   మౌనమే  శరణ్యమన్నట్టుగా  ఏమి చెప్పలేక  ఊరుకున్నాడు  మధు.  


“సరేలెండి .. మీకు  చెప్పడం ఇష్టంలేకపోతే  మానేయ్యండి, పదండి  క్లాసుకు టైం అవుతుంది, ” అంటూ  ముందుకు నడిచింది. 


ఏమని  చెప్పను  నా గురించి.   నేనొక  అనాథనని చెప్పనా?  పుట్టగానే

తల్లితండ్రులను   పోగొట్టకున్న  నిర్భాగ్యుడినని  చెప్పనా?  కటిక దరిద్రుడినని చెప్పనా? 


ఇవన్ని చెప్పాకా  తెలిసి  తెలిసి  ఎవరైనా  నాతో  స్నేహం చెయ్యడానికి ముందుకు వస్తారా?  కనీసం  ఒక్కటైనా  నా గురించి చెప్పుకోవడానికి  ఉన్నాయా? ఏమిటో  నాకర్మకాకపోతే  దేవుడిచ్చిన అందం ఒక్కటే

నన్నీ మాత్రమైనా  తలెత్తుకునేలా  చేస్తుంది. నన్ను  చూసినవారెవరైనా  నేనో  గొప్ప శ్రీమంతుడిని అనుకుంటారు.   నాకు  తెలిసి  ప్రియాంక కూడా  అలానే  పొరపాటు పడిందేమో!  ఇప్పుడు నా గురించి  విన్న తరువాత  నావైపు కూడ  చూడదనుకుంటా!  కానీ నిజం నిలకడమీదైన తెలుస్తుందన్నట్టు, ముందే చెప్పడం మంచిది తరువాత  తెలిసి నన్ను అసహ్యించుకునే  బదులు ముందుగానే  విడిపోవడం మంచిది అని  తనలో  తానే  ఆలోచిస్తూ అన్యమనస్కంగానే  క్లాసు  విన్నాడు.  

=================================================================================

                                                       ఇంకా వుంది..


=================================================================================


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 




52 views0 comments

Comments


bottom of page