top of page
Writer's pictureLakshmi Sarma B

విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 11

#LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #VidhiAdinaVinthaNatakam, #విధిఆడినవింతనాటకం, #TeluguSerials, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


'Vidhi Adina Vintha Natakam - Part 11' - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 31/10/2024

'విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 11తెలుగు ధారావాహిక

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు. డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక. అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది. గతంలో ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్తుంది ప్రియాంక. మధుని ఆఫీసుకు రమ్మంటాడు ఆమె తండ్రి దామోదరం. 


మధు, ప్రియాంకల మీద నిఘా పెడతాడు. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు గ్రహిస్తాడు. మధు తన డబ్బుతో పారిపోయినట్లు చెబుతాడు దామోదరం. 


తాను మధును ప్రేమిస్తున్న విషయం బయటపెడుతుంది ప్రియాంక. 


గుండెపోటు వచ్చినట్లు నటిస్తాడు దామోదరం. హాస్పిటల్ లో చేరి మధుని మరిచి పొమ్మని కూతురికి చెబుతాడు. 


కొద్ది రోజులకు తండ్రి ప్రోద్బలంతో రామకృష్ణను పెళ్లి చేసుకుంటుంది. అతని ఆప్యాయత చూసి అతనికి దగ్గర కావాలనుకుంటుంది. 


 ఇక 'విధి ఆడిన వింత నాటకం' ధారావాహిక పార్ట్ 11 చదవండి. 


“ బేబి .. అల్లుడు ఊరెళ్ళాడు నీకు ఇంట్లో తోచడం లేదంటే నాతోపాటుగా ఆఫీసుకు రా తల్లి. ముందు ముందు బాధ్యతలన్నీ మీరిద్దరు తీసుకోవాలి. నాకా వయసయిపోతుంది, మీకు అప్పచెప్పి నేను, మీ అమ్మ కొన్నాళ్ళు తీర్థయాత్రలు తిరిగిరావాలని అనుకుంటున్నాము. మేము వచ్చేవరకు నువ్వు మా చేతిలో మనవడిని పెట్టావంటే వాడితోనే మా కాలక్షేపం. అంతే కదూ శారద” ప్రియాంకకు చెబుతూ శారదను అడిగాడు నవ్వుకుంటూ. 


“అదే కదండి మనం కోరుకునేది, అవును మీరు చెప్పేది నిజమేనా.. తీర్థయాత్రలు అని ఏమో అన్నారు, నా జన్మకు అంత అదృష్టం ఉందంటారా, ” వ్యంగ్యంగా అడిగింది. 


“ఏం.. నా మీద నమ్మకం లేదా. పోని నీకు నమ్మకం కలిగించాలంటే మన కృష్ణమూర్తిని అడుగు చెబుతాడు. మనం కలిసి వెళ్ళడానికి మనకు టికెట్లు కూడా తీసుకున్నాడు. చాలా ఇంకేమైనా కావాలా నిన్ను నమ్మించడానికి, ” శారద దగ్గరకు వచ్చి చెవిని మెలేసాడు. 


“అబ్బా వదలండి నొప్పిగా ఉంది.. ఏమండి ఇన్నాళ్ళకు తీర్థయాత్రలు చేసుకునే అదృష్టం దొరికింది, కానీ ఒకవేళ ప్రియకు విశేషముంటే మనం లేకపోతే ఎలాగా అని బాధగా ఉంది, ” ప్రియాంకను దగ్గరకు తీసుకుంటూ అంది. 


“ అయ్యో అమ్మా.. ‘ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమానాథం’ అన్నట్టుంది నీ వరస. మాకిప్పడప్పుడే పిల్లలు వద్దనుకున్నాము. కొన్నాళ్ళైనా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా.. మొదలు మీరు తీర్థయాత్రలుకు వెళ్ళి రండి. వచ్చాక అప్పుడు చూద్దాం సరేనా, ” 


‘పిచ్చి అమ్మా.. నువ్వనుకున్నట్టు ఇప్పటివరకు మా మధ్యలో కాపురం 

జరగలేదని నీకు తెలియదు కదూ. ఇన్నాళ్ళు ఏం పోగొట్టుకున్నానో ఇప్పుడు తెలిసింది’


 ఒకవైపు బాధపడుతూ మరోకవైపు సంతోషంతో ఉరకలువేస్తుంది మనసు. 


“అదేమిటే అలా మాట్లాడుతున్నావు.. పెళ్ళై ఆరునెలలు దాటుతుంది, ఇంకా లేటు చేసుకోవడం మంచికాదు. కొంపతీసి ఏమన్న మందులు వాడుతున్నారా? చూడు ప్రియా.. మనం అనుకున్నప్పుడు పిల్లలు కావాలంటే కాకపోవచ్చు, దేవుడిచ్చినప్పుడే పిల్లల్ని కనాలి. అంతేకానీ కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండి అప్పుడు పిల్లలకోసం ఆరాటపడితే నువ్వునుకున్నంత తొందరగా కాకపోవచ్చు, అయినా నువ్వేం మరీ చిన్నపిల్లవు కాదు. నీ వయసుకి నాకు ఎంతోమంది పుట్టి పోయాక నువ్వు పుట్టావు తెలుసా, ” అంది కాస్త కోపం తెచ్చుకుంటూ. 


“ఏమిటి శారద.. నీ పాతకాలం ముచ్చట్లు నువ్వు, వాళ్ళకన్నీ తెలుసు నువ్వేం చెప్పక్కరలేదు. బేబి నీలాంటి అమాయకురాలు కాదు. సరే సరే బేబి, నువ్విక్కడే ఉన్నావనుకో.. మీ అమ్మ పాత పురాణాలన్ని చెబుతుందిగాని త్వరగా బయలుదేరు, ” వస్తున్న నవ్వునాపుకుంటూ అన్నాడు శారదను చూస్తూ. 


“పాపం అమ్మ! అలా అనకండి నాన్న, బాధపడుతుంది. నా మంచికోసమే చెప్పింది, ” అంటూ తల్లిని గట్టిగా కౌగిలించుకుని చకచకా తయారయ్యి తండ్రితో ఆఫీసుకు బయలుదేరింది. పనిలో పడితేనన్నా ఒంటరితనం దూరమౌతుంది అనుకుంది. 


ఆఘమేఘాల మీద పరుగెత్తుకుంటూ బయలుదేరాడు రామకృష్ణ. ఒక్కొక్క క్షణం ఒక్కో యుగంలా అనిపిస్తుంది. కళ్ళుమూసినా కళ్ళుతెరిచినా నవమోహనకరమైన ప్రియాంక రూపమే కళ్ళముందు నడయాడి మనసు గిలిగిలింతలు పెడుతుంది. ప్రియాంక రెండురోజులు ఆఫీసుకు వెళ్ళివచ్చింది కానీ భర్తను తలుచుకోని క్షణంలేదు. శరీరం నుండి వేడి సెగలు వస్తుంటే తట్టుకోలేపోతుంది భర్త ఎదలో తలదాచుకోవడానికి ఆత్రుతగా ఎదిరిచూస్తూ గుమ్మంవైపే కళ్ళప్పగించి చూడసాగింది. అప్పుడు జరిగింది అనుకోని సంఘటన గడపలో కాలుపెట్టింది భర్తనేమోనని తలెత్తి చూస్తే అనుకోని ఆకారం కనపడింది. 


నవనాడులు కృంగిపోయాయి. జీవంలేని చూపులతో బట్టలన్నీ మట్టికొట్టుకుపోయి ఎన్నో రోజులనుండి పస్తులన్నవాడిలా ముఖంలో నీరసం. నిలబడడానికి కూడా ఓపికలేనట్టుగా నిలుచున్న మధును చూడగానే గుండె బద్దలైపోయింది ప్రియాంకకు. 


“మధు .. మధు నువ్వు ఇన్నాళ్ళు ఏమైపోయావు, ఇలా తయారయ్యవు ఏమైంది

ఎక్కడున్నావు? నన్ను విడిచి ఎక్కడకు వెళ్ళిపోయావు, ” ముఖాన్ని చేతుల్లో దాచుకుని ఏడవసాగింది. 


“ప్రియా.. నన్ను మరిచిపోయి పెళ్ళిచేసుకున్నావా? అంటే నీ మనసులోనుండి నన్ను తీసివేసావా, ఎందుకు ఎందుకు మారిపోయావు నాకోసం ఆగలేక పోయావా, నేనేం అపకారం చేసానని నాకు శిక్షవేసావు నీ ప్రేమ నిజంకాదా, ” మాటలు కూడబలుకుకంటూ అడిగాడు. 


 చివ్వున తలెత్తి అతనివైపు చూసింది కళ్ళు అగ్ని గోళాల్లాగా ఎర్రగా ఉన్నాయి. 

“ఏమన్నావు నేను నిన్ను మరిచిపోయి పెళ్ళి చేసుకున్నానా, మరిచిపోయింది నువ్వా నేనా.. డబ్బు కళ్ళకు కనపడగానే ప్రేమించిన నన్ను గాలికొదిలేసి నీ ఆనందం నువ్వు చూసుకున్నది చాలక, దోచుకున్న డబ్బు అయిపోయాక నేను గుర్తుకువచ్చాను, బాగుంది చాలా బాగుంది నటనలో బాగా ఆరితేరావు, అవును నేను ఇప్పుడు పెళ్ళైనదానను నువ్వు ఇక్కడినుండి వెళ్ళిపోవచ్చు, ” అంది రోషంగా ముక్కుపుటాలు అదురుతుండగా. 


“ప్రియా.. ఏం మాట్లాడుతున్నావు.. నేను నిన్ను మరిచిపోయానా? డబ్బేంటి.. నాకు డబ్బు ఎక్కడినుండి వస్తుంది, అసలు నువ్వేమంటున్నావో నీకు తెలుస్తుందా? ప్రాణాలతో బయటపడి నీకోసం నీ ప్రేమకోసం బతికివచ్చాను ప్రియా, నేను చెప్పేది నిజం. నా మాట నమ్ము, ” పిచ్చిపట్టినవాడిలా చూస్తూ అన్నాడు. 


“అవునవును నీకేం తెలియదు. మోసము చెయ్యటమొక్కటే తెలుసు. చూడు, నువ్వు చేసినా నిర్వాకం చాలు. నేను ఇప్పుడిప్పుడే నీ జ్ఞాపకాలలోనుండి బయటపడినాను, 

నా భర్తతో నేను సంతోషంగా ఉంటున్నాను. నువ్వు చెప్పే మాటలు విని నీ గురించి ఆలోచించే తీరిక నాకు లేవు. అతను వచ్చే వేళయింది. నువ్వు తక్షణమే ఇక్కడినుండి వెళ్ళిపో, ” కఠినంగా చెబుతూ వేలు చూపింది వెళ్ళమని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. 


“నేను నిన్ను మోసం చెయ్యలేదు. నా మాట నమ్ము, నువ్వు నన్ను మరిచిపోయి పెళ్ళిచేసుకున్నావు. మోసంచేసింది నువ్వు, ప్రియా.. నువ్వు లేకుండా నేను ఉండలేను. నీ గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పు, నన్ను మరిచిపోయానని, అలా చెప్పావంటే ఇప్పుడే ఇప్పుడే వెళ్ళిపోతాను చెప్పు, ” బతిమాలుతూ అడిగాడు. 


“మధు! నేను నీ కోసం ఇన్నాళ్ళు వేచి చూసాను. కనీసం నువ్వు నా ప్రేమకోసమైన వచ్చి ఉంటే నిన్ను క్షమించేదాన్ని. నీకు డబ్బు తప్ప నేను కనిపించలేదు. నువ్వొక మోసగాడివి. మళ్ళీ నిన్ను నమ్మితే మోసం చెయ్యవని గ్యారంటీ ఏమిటి. వద్దు. నేను మళ్ళి మోసపోను. నన్ను నమ్మిన నా భర్తకు అన్యాయం చెయ్యలేను” అనుకుంటూ. గుండెలమీద చెయ్యివేసుకుని. “చూడు, నిన్ను నీ పేరుతో పిలవడం కూడా నాకిష్టంలేదు. నువ్వంటే

నాకు ప్రేమలేదు. అవును నిన్ను నేను ఎప్పుడో మరిచిపోయాను ఇప్పుడు నేను కేవలం ఒకరికి ఇల్లాలిని మాత్రమే, నువ్వెవరో నాకు తెలియదు. చాలా, ” అంది. గుండెను చీల్చే బాధతో చెప్పలేక చెప్పింది ప్రియాంక. 


“ అయితే మన ప్రేమ మనం మాట్లాడుకున్నవి మనం చేసుకున్న బాసలు అన్ని వట్టివేనా.. ఎందుకు.. నేనేం చేసానని, నువ్వే కదా నా జీవితంలోకి తొంగి చూసావు, నేను ఆరోజే చెప్పాను నీకు నా దగ్గర డబ్బులేదు, నేను ఒక అనాథను అని. అయినా సరేనని నన్ను ప్రేమించానన్నావు. నాతోటిదే లోకం అన్నావు. నాకు డబ్బులేకపోయినా నీ డబ్బు నాది అన్నావు. అన్ని మరిచిపోయావా? అవున్లే.. డబ్బున్న వాళ్ళ మాటలు నీటి మీద రాతలు కాబోలు. ఆ తండ్రికి తగ్గ బిడ్డవు. ఇంతకంటే మంచిమాటలెందుకు వస్తాయి.. నీ తండ్రి చేసిన మోసానికి నన్ను బాధ్యుడిని చేస్తున్నావు. నీ తండ్రి నీ నుండి నన్ను తప్పించడానికి పన్నని పన్నాగం. కానీ నాకు ఆయుష్షు గట్టిగా ఉందేమో ఎలాగోలా బతికి బయటపడ్డాను. నీ తండ్రి చేసిన నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. తరువాత చాలా బాధపడుతావు చూడు, ” 


కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. అనవలసిన నాలుగు మాటలు అని గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు భారంగా అడుగులు వేసుకుంటూ. అచేతనంగా నిలబడిపోయింది ప్రియాంక మధు వెళ్ళినవైపే చూస్తూ. 


“ఏంటమ్మా గట్టిగా కేకలేస్తున్నావు ఎవరి మీద, ” లోపలనుండి వస్తూ అడిగింది శారద. 


“అమ్మా .. అది .. అది పిల్లి వచ్చింది. నాకు భయమేసి దానిమీద గట్టిగా అరిచాను అంతే, ” తడబడతూ చెప్పింది లోపలకెళుతూ. అమ్మ మధును చూడలేదు కదా.. మా మాటలు వినేసిందా.. కంగారుగా తల్లి వైపు చూసింది. కానీ ఇవేమి ఆమె విననట్టుంది. 


 ఏమిటో ఈ కాలం పిల్లలకు పిల్లిని చూసినా భయమే, బల్లిని చూసినా భయమే. పెద్ద పెద్ద చదువులు చదువుతారు. వట్టి పిరికివాళ్ళు.. తనలో తాను నవ్వుకుంటూ అన్నది. 


మధు.. ఇప్పుడిప్పుడే నిన్ను మరిచిపోయి అతనికి భార్యగా ఉండిపోవాలని మనస్పూర్తిగా అనుకున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చి నా గతాన్ని మళ్ళి నిదురలేపావు. నీకోసం నా మనసు నా కళ్ళు చూసి చూసి మోడువారిపోయాయి. అతను నన్ను ఒక మనిషిగా చేసి నాకు నేనుగా అతనికి భార్యగా ఉండిపోవాలనుకున్న తరుణంలో నువ్వు వచ్చావు. ఇన్నాళ్ళు ఏమైయిపోయావు.. నువ్వెందుకు కనిపించావు మళ్ళి.. ప్లీజ్ మధు నువ్వు నాక్కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపో. నేనింకా నా భర్తను మోసం చెయ్యలేను.. మంచం మీద పడుకుని విలపించసాగింది. 


మేఘాలలో తేలిపోతున్నట్టుగా పరవశించే మనసు ఉరకలు పరుగులు పెడుతూ భార్య పొందుకోసం తహతహలాడుతూ వస్తున్నాడు రామకృష్ణ. వచ్చేముందు మరువం కలిపిన మరులుగొలిపే మల్లెమాలలు, మత్తేక్కించే సుగంధపరిమళాన్ని చిందే అత్తరులు. కమ్మటి నోతితో చేసిన తీపి పదార్థాలు తీసుకుని తనలో సగభాగం కాబోతున్న భార్య దగ్గరకు వచ్చాడు. వస్తూనే ప్రియాంక దగ్గరకు వెళ్లాడు అశోకవనంలో సీతమ్మలా ఖిన్నురాలై కూర్చొని ఉంది. తన కోసమే విరహవేదన అనుభవిస్తుందేమోనని అడుగులో అడుగు వేస్తూ వెనకనుండి వెళ్ళి అమాంతంగా కళ్ళు మూసాడు. 


ఉలిక్కిపడిన ప్రియాంక కేవ్వున కేకపెట్టి భర్తను రెండుచేతులతో వెనకకు నెట్టివేసింది. ఆర్తిగా దగ్గరకు తీసుకోవాలన్న ధ్యాసలో ఉన్న రామకృష్ణ బలంగా నిలుచోకపోవడంతో అల్లంతదూరంలో దబేల్ మని కిందపడిపోయాడు. 

పిచ్చిదానిలా చూస్తుందే తప్పా వచ్చి భర్తను లేపాలన్నా ఆలోచనకూడా లేదు ప్రియాంకకు. 


“ప్రియా.. భయపడినావా నువ్వు చూడకుండా వచ్చి తమాషా చేద్దాం అనుకున్నాను, ఇంతగా భయపడిపోతావనుకోలేదు సారీ రా, ” అంటూ తనే లేచి నవ్వుతూ ప్రియాంకను కౌగిలిలోకి తీసుకోబోయాడు. 


“నన్ను ముట్టుకోవద్దు నేను నీకేం కాను, నువ్వు తాళికట్టిగానే నా మనసు నీదైపోతుందా, మీ మగాళ్ళకు ఆడవాళ్ళ మనసును అర్థంచేసుకోవాలన్న ధ్యాస ఉండదా, అంతా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తారు మేము పిచ్చివాళ్లలా మీ చేతిలో మోసపోవడమేనా, ” శివమెత్తినట్టు గయ్యిమని లేచింది అతన్ని దూరంగా నెట్టుతూ. 


“ప్రియా.. ఏమైంది నేనేం చేసాను, ఓహో అదా నిన్ను విడిచి వెళ్ళానని కోపమా? అవును ప్రియా, నాదే తప్పు. నువ్వు కోరి కోరి నా దగ్గరకు వస్తే నిన్ను విడిచి వెళ్ళిపోయాను. నేను వెళ్ళానన్నమాటే కానీ నా మనసంతా నీ చుట్టూనే తిరిగుతుంది, ఎప్పుడెప్పుడు వచ్చి నీ ఒళ్ళోవాలా అని ఒకటే తపన, వచ్చేసానుగా.. ఇంకెప్పుడు నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను, ” తన వల్లనే కోపం వచ్చిందని సముదాయిస్తూ చెప్పాడు. 


“అబ్బా, ఇక్కడ మీకోసం ఎవరు కాచుకుని కూర్చోలేదు. నా మనసులో మీకెప్పుడు చోటులేదని గుర్తుపెట్టుకుంటే మంచిది. మీరు ఇంకోక మాట మాట్లడకుండా నా గదిలో నుంచి బయటకు వెళ్తారా, లేదంటే అరిచి కేకలు వెయ్యమంటారా, ” అదే కోపంతో అడిగింది. 


ఉలిక్కపడ్డాడు రామకృష్ణ. తను నిజంగానే కోపంలో ఉంది. ఏం జరిగి ఉంటుంది.. వెళ్ళేటప్పుడు ఎంత ఆప్యాయతగా మాట్లాడింది. ఎన్నో కలలుకంటూ ఎగురుకుంటూ తనముందు వాలాడు. ప్రియ మనసు మారిందని ఎంతో సంతోషపడ్డాడు. ప్రేమించినవాడిని మరిచిపోయి నేను కోరుకున్న నా భార్యగా ఉండబోతుందని అనుకున్నాను. ఛీ ఛీ పెళ్ళి చేసుకుని ఒకే ఇంట్లో ఒక గదిలో పడుకుంటూ కూడా తనను వేలేసి ముట్టనివ్వదు. ఆఖరికి ఈ రోజు తను చెప్పిందనేగా ఆశతో వచ్చాను రామకృష్ణ రక్తం సలసలామరిగినట్టయింది. ఎంత సహనం వహించాడు ఎప్పటికైనా తను నన్ను సుఖపెడుతుందని భ్రమించడం నాదే పొరపాటు. ఇక నావల్ల కాదు ఏదో ఒకటి తేల్చుకోవాలి. 


“ప్రియా.. నిన్నటివరకు బాగానే ఉన్నావు కదా ! నాలో నిద్రపోతున్న కోర్కేలను నువ్వే నిద్రలేపావు, నీకు నువ్వుగా నా కౌగిలిలోకి వచ్చావు కదా అని నేను ఆశతో తిరిగి వస్తే, మళ్ళి మొదటికి వచ్చావు ఏం జరిగిందో చెబితే కదా నాకు తెలిసేది, పోని నీ మనసుకు నేను నచ్చడంలేదా? ఇంకా కొన్నాళ్ళు వేచి చూడమంటావా కాదు నా ఉనికే నీకు భరించరానిదిగా ఉందా, ఏదో ఒకటి తెల్చుకో దాన్నీ బట్టి నా నిర్ణయం కూడా ఉంటుంది, ” ఆప్యాయతనిండిన స్వరంతో అడిగాడు. 


=================================================================================

                                                       ఇంకా వుంది..


=================================================================================


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 




42 views0 comments

Comments


bottom of page