top of page
Writer's pictureLakshmi Sarma B

విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 12

#LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #VidhiAdinaVinthaNatakam, #విధిఆడినవింతనాటకం, #TeluguSerials, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


'Vidhi Adina Vintha Natakam - Part 12' - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 05/11/2024

'విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 12తెలుగు ధారావాహిక

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్




జరిగిన కథ:


కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు. డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక. అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది. గతంలో ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్తుంది ప్రియాంక. 


మధు, ప్రియాంకల మీద నిఘా పెడతాడు. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు గ్రహిస్తాడు. మధు తన డబ్బుతో పారిపోయినట్లు చెబుతాడు దామోదరం. 


తాను మధును ప్రేమిస్తున్న విషయం బయటపెడుతుంది ప్రియాంక. 

గుండెపోటు వచ్చినట్లు నటిస్తాడు దామోదరం. హాస్పిటల్ లో చేరి మధుని మరిచి పొమ్మని కూతురికి చెబుతాడు. కొద్ది రోజులకు తండ్రి ప్రోద్బలంతో రామకృష్ణను పెళ్లి చేసుకుంటుంది. అతని ఆప్యాయత చూసి అతనికి దగ్గర కావాలనుకుంటుంది. ఇంతలో మధు తనని కలవడంతో భర్తకు దగ్గర కాలేక పోతుంది. 


 ఇక 'విధి ఆడిన వింత నాటకం' ధారావాహిక పార్ట్ 12 చదవండి. 


ఆ చల్లని మాటలకు సేదతీరినట్టనిపించి కళ్ళనిండి జలజలా కన్నీళ్లు రాలుతుంటే,


“ఏమండి నన్ను క్షమించండి మీకు మనస్పూర్తిగా నన్ను నేను సమర్పించుకోవాలనుకున్నాను కానీ, మధు వచ్చాడు మళ్ళి నా మనసును తట్టిలేపాడు. అందుకే భరించుకోలేకపోతున్నాను, మధు అంటే నాకు పంచప్రాణాలు. నేను ఇలా బ్రతికి ఉన్నానంటే తన కోసమే, ఎప్పటికైనా తను తిరిగివస్తాడన్న నమ్మకం నాలో ఉంది. 


మీ మంచితనం, మీరు చూపే ఆప్యాయతకు మెల్లెగా నా మనసు కరుగసాగింది. మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టంలేక మీ కోసం నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేసాను. మధు వచ్చి నా ప్రేమను కలుషితం కాకుండా కాపాడాడు నన్ను క్షమించండి, ” అంది రెండుచేతులు జోడిస్తూ. 


ఆశ్చర్యంతో నోటమాటరాలేదు రామకృష్ణ కు ఒక్క క్షణం. “ఏమిటి నువ్వంటున్నది.. మధు వచ్చాడా? ఏడి.. ఎక్కడున్నాడు,? ఇన్నాళ్ళు ఏమై పోయాడట? మీ నాన్న చూసాడా అతన్ని..

 

అంటే అతను నీకోసమే మళ్ళి వచ్చాడా.. అతను చేసిన మోసం చెప్పాడా నీకు? అంత వంచించిన అతగాడు నీ కళ్ళకు గొప్పవాడిగానే కనిపిస్తున్నాడా ప్రియా?”, అడిగాడు. హృదయమంతా ఆవేదనతో నిండిపోయింది. 


“ఇప్పుడు నన్నేం అడగకండి. నేనేం చెప్పలేను. ఆవేశంతో నేను అతన్ని తిట్టి పంపించాను. మధు ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నా కూడా నాకు అతను చేసిన ద్రోహంతో మండిపడిపోయాను. అందుకే అతన్ని మెడపట్టి గెంటేసాను, ” ముఖంలో చేతులు దాచుకుంది. 


“ప్రియా .. అతనిది స్వచ్చమైన ప్రేమే అయితే తప్పకుండా నీ వాడు అవుతాడు. అది అవునో కాదో తేల్చుకోవాలి ముందు. లేదంటే మళ్ళి నీ డబ్బులకోసం ఇంకో ఎత్తు వేస్తున్నాడేమోనని నా అనుమానం. ఒకవేళ అదే నిజమైతే అప్పుడన్న మన భార్య భర్తల బంధానికి కట్టుబడి ఉంటావా, ” ఆశగా అడిగాడు. 


“కాదు. మధు అలాంటివాడు కాదని నా మనసు పదేపదే చెబుతుంది. ఎక్కడో ఏదో పొరబాటు జరిగింది. ఎవరో మా ప్రేమను చూసి ఓర్వలేక ఇలా చేసారనిపిస్తుంది. మధును చూస్తుంటే అలా అనిపించడంలేదు. నా కోసం ఎంతగా కుమిలిపోయాడో అతన్ని చూస్తేనే అర్థం అవుతుంది. అసలు నిజమేంటో మధు నోటిద్వారనే వింటాను. అప్పటి వరకు నేనేం చెప్పలేను. కానీ మీరు ఈ విషయం మా నాన్నకు చెప్పనని మాటివ్వండి, ” చెయ్యి ముందుకు జాపి అడిగింది. 


“ప్రియా .. ఏంటి నువ్వనేది.. మీ నాన్నకు తెలియనివ్వకపోవడమేంటి? అసలు మధు నిన్నేకాదు, మీ నాన్నను ఎంత మోసం చేసాడో తెలిసే ఈ మాట మాట్లాడుతున్నావా, మీ నాన్నకు తెలిస్తే మీ ప్రేమకు అడ్డువస్తాడని భయపడుతున్నావు కదూ, ” అడిగాడు. 


“లేదు లేదు .. ఇందులో మా నాన్న పాత్రనే ఎక్కువగా ఉందనిపిస్తుంది. మా అమ్మ ఎప్పుడు చెప్పేది ‘మీ నాన్న నువ్వు కన్న కూతురివి కాబట్టి నిన్ను ఏమి చెయ్యకపోవచ్చు, కానీ మీ నాన్నకు నచ్చని మనిషిని నువ్వు ప్రేమించావని తెలిస్తే అతనికి భూమి మీద నూకలు చెల్లినట్టే’ అంది. ఆ రోజు అమ్మ ఆమాటంటే నాకర్ధం కాలేదు. పైగా అమ్మను కోపగించుకున్నాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఏదో జరిగిందని అనిపిస్తుంది. నాకు మీ సహకారం కావాలి, చెయ్యగలరా, ” అడిగింది బేలగా. 


“తప్పకుండా. ఒకవేళ నువ్వన్నట్టుగా మీ నాన్నే మిమ్మల్ని వీడదీసి ఉంటే కనుక మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. నన్ను నమ్ము, ” అంటూ చేతిలో చెయ్యి వేసాడు. 


“ఇంత మంచి మనసున్న మిమ్మల్ని బాధపెడుతున్నందుకు ఆ దేవుడు కూడా నన్ను క్షమించడేమో. మిమ్మల్ని నేను మోసం చెయ్యడంలేదు. నా మనసులో మీకు స్థానంలేనప్పుడు నేను మీతో జీవించడమనేది మోడువారిన నా మనసుతోటే. అందుకే ఇన్ని రోజులు మీకు చేరువకాలేకపోయాను. నన్ను క్షమించండి, ” అంది. 


“మనలో మనకు క్షమాపణలు ఎందుకు.. నీ గురించి తెలిసి కూడా నిన్ను నేను పెళ్ళి చేసుకున్నాను. అది నా తప్పు కాదా? జీవితంలో ఒకరికే మన మనసు అంకితం అయిపోతుంది. అది అవతలి వాళ్ళు స్వీకరించినా స్వీకరించక పోయినా ఆ మనసుకోసం తపిస్తూనే ఉంటుంది. అది కొందరిలో ఎవరికో ఒకరికి. నీలాంటి నాలాంటి వాళ్ళకు, అందరి ప్రేమలు వడ్డించిన విస్తరిలా విందు భోజనంకు సరిపడవు. అలానే కదా ఒక లైలా మజ్ను, ఒక దేవదాసు పార్వతి ప్రేమలు చరిత్రలకు ఎక్కాయి, కొందరు అదృష్టవంతులు ప్రేమను జయిస్తారు, ఇంకొందరు ప్రేమికులను విడదీయడానికే పుడతారు. నువ్వేం బాధపడకు. నేను నా శాయశక్తులా నీకు సహకారం అందిస్తాను, ” చెప్పాడు శూన్యంలోకి చూస్తూ. 


‘అవును, నిన్ను నీ ప్రేమికుడిని కలిపి నేను ఒంటరిగా మిగిలిపోతాను. నా ప్రేమకు సమాధి నేనే కట్టుకుంటాను ప్రియా’ తనలో తానే బాధపడుతూ అనుకున్నాడు. 


గతమంతా కళ్ళముందు తిరిగింది ప్రియాంకకు. 


దామోదరం అల్లుడు ఊరినుండి వచ్చాక కంపెనీ బాధ్యతలు అప్పచెప్పి శారదను తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరాడు. 


“చూడు అల్లుడు .. మా బేబిని నువ్వు జాగ్రత్తగా చూసుకో, మేము వచ్చేవరకు

తనకు ఎలాంటి లోటు రానివ్వకు. ఇంకోమాట, ప్రియాంకను ఎప్పుడు ఒంటరిగా విడిచి ఎక్కడకు వెళ్ళకు. ముఖ్యంగా నేను చెప్పేదేమిటంటే ప్రియాంకను కంపెనీకి నీతోపాటుగా వచ్చినా సారథితో గానీ ఇంకా వేరే ఎవరితోను పెద్దగా సంభాషణ పెట్టకుండా చూసుకో. ఎందుకంటే అమ్మాయిని చూస్తే వాళ్ళు కుళ్ళుకుంటారు వెర్రిమొర్రి వేషాలు వేస్తారు జాగ్రత్త బాబు, ” చెప్పాడు గుసగుసగా. 


“అయ్యో మీరంతగా చెప్పాలా .. మీరొచ్చే వరకు మీ బేబిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, మీరు హాయిగా తీర్థయాత్రలు ముగించుకుని రండి, ” నవ్వుతూ చెప్పాడు రామకృష్ణ. 


కానీ మనసులో మాత్రం అదేంటి అలా చెబుతున్నాడు వాళ్ళమ్మాయి మీద అంత నమ్మకంలేదా తనకు. ఎవరితో మాట్లాడనియ్యకు అంటున్నాడంటే ఏదో ఉంది. ముఖ్యంగా సారథి అన్నాడంటే అతను నమ్మినబంటు దామోదరానికి. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. 


“బాబు, మేమొచ్చేవరకు మీరిద్దరు జాగ్రత్తగా ఉండండి, అంతే కాదు మాకో శుభవార్త చెప్పాలి సుమా, ” అంది శారద ముసిముసిగా నవ్వుతూ కూతుర వంక చూసింది. 


“సరేలే అమ్మా, మీరు బయలుదేరండి. మేమేం చిన్న పిల్లలం కాదు మీరు అప్పగింతలు చెప్పడానికి. హాయిగా తీర్థయాత్రలన్ని తిరిగిరండి. ఇంటిమీద మనసు పెట్టుకోకండి, ” తల్లిని గుండెలకు హత్తుకుని చెప్పింది ప్రియాంక. 


“ఏమండి గుడికి వెళదాము వస్తారా, ” అడిగింది భర్తను ప్రియాంక. 


“ఏమిటి ఈ రోజు విశేషం నీ మధును నిన్ను కలపమని దేవుడికి మొక్కుకోవడానికి వెళుతున్నావా? పని నీది అయినప్పుడు నేనేందుకు రావడమాని ఆలోచిస్తున్నాను”,  తమాషాగా అన్నాడు. 


“అయితే నన్నొక్కదాన్నే వెళ్ళమంటారా.. మా నాన్న మీకేం చెప్పాడు, ఒక్కదాన్ని ఎక్కడికి పంపొద్దని చెప్పలేదు, వాళ్ళొచ్చేవరకు నన్ను కాపాడవలసిన బాధ్యత నీదే కదా. అందుకని మీరు కూడా రావలసిందే, ” తమాషగా కళ్ళెగరేస్తూ అంది. 


‘అవును మీరు చెప్పింది నిజమే. మధు గురించి నిజం తెలియాలి. ఊరికే వచ్చి నన్ను పదే పదే కలవాలని చూస్తున్నాడు. తను నిజంగానే మోసం చేసినవాడైతే జన్మలో తను క్షమించదు. ఎందుకు ఎన్నిసార్లు అడిగినా అసలు నిజం చెప్పడంలేదు. తను మాత్రం తప్పుచెయ్యలేదని బుకాయిస్తున్నాడు. 

దేవుడిని కోరుకోవడానికి వెళుతున్నాను. నిజనిజాలు ఏంటో తెలియా’లని అనుకుంది మనసులో. 


“సరే తప్పుతుందా? మంచికో చెడుకో నీ మెడలో తాళికట్టాను. నేను కూడా వచ్చి ఆ దేవుడిని అడుగుతాను ఈ దోబుచులాటలెందుకని. ఆయనలో ఇంత స్వార్థం ఉండకూడదని చెబుదామనుకుంటున్నాను పద, ” నవ్వుతూ ప్రియాంకవైపు చూస్తూ అన్నాడు. 


ప్రియాంక మనసు చివుక్కుమన్నది భర్త అన్న మాటలకు. ‘నిజమే.. తనను చేసుకుని అతనేం అనుభవించాడు. గడిచిపోయిన గతాన్ని మరుగునపడేసి కలిసిపోయి కాపురం చేద్దామనుకునే సమయానికి నేనున్నానంటు వచ్చాడు మధు. ఏమన్నాడు మధు.. నేను తనని మరిచిపోయి పెళ్ళిచేసుకున్నానని కదూ. తన హృదయంలోకి తొంగిచూస్తే తెలిసేది’ ఆలోచిస్తూ కూర్చుంది కారులో. 


“నువ్వు వెళ్ళు నేను టెంకాయ పూలు తీసుకుని వస్తాను, ” చెప్పాడు రామకృష్ణ. 


“అలాగే ఈలోపు నేను ప్రదక్షిణలు చేస్తాను, ” అంది కారు దిగుతూ. 


“ప్రియా.. ఎవరో చూడు నీ గురించి అడుగుతుంటే నేను తీసుకవచ్చాను. ఇతను నీకు బాగా తెలుసనుకుంటాను, ” ప్రియాంక ముఖ కవళికలను గమనిస్తూ అడిగాడు రామకృష్ణ. 


దేవుడికి దండంపెడుతున్నదల్లా ఆగి భర్తవైపు తిరిగింది. “ ఇతను ఇతనే మధు! నేను చెప్పాను కదా.. పిచ్చి వాడిలా తయారయ్యాడు అని. చూసారా నా కోసం నన్ను ప్రేమించిన పాపానికి ఇతనికి ఏ గతి పట్టిందో, ” బాధనంతా మాటల రూపంలో అంది. 


“నాకు తెలుసు ఇతనెవరో. నీ కోసమే ఇక్కడకు తీసుకవచ్చాను, జరిగిన విషయమంతా నేను కనుక్కున్నాను. పాపం ఇందులో మధు తప్పు అణువంత కూడా లేదు ప్రియా. ఇదంతా నువ్వన్నట్టుగా కావాలనే చేసారు. అది కూడా ఎవరో తెలుసా? మీ తాహతుకు ఇతను సరిపడడని, నిన్ను బాధపెట్టడం ఇష్టంలేక నీకు అతన్ని దూరం చెయ్యడానికి వేసిన పన్నాగం, ” మధును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ చెప్పడం ఆపాడు. 


 ప్రియాంకకు కళ్ళు తిరిగినట్టయి తూలి పడబోయింది. అమాంతంగా పట్టుకున్నాడు మధు. అనుకోని ఈ చర్యకు రామకృష్ణ విస్తూబోయాడు. తను చూస్తూనే ఉన్నాడు కానీ మధు అంత ఆత్రంగా తను పట్టుకోలేకపోయాడు. ప్రియ అంటే ఎంత ఆరాటం మధుకు. 


“మీరు చెబుతున్నది నిజమా ? ఎవరు మమ్మల్ని వీడదీయాలని చూసారు.. అంటే మా నాన్న ఇదంతా చేసారా, నేను నమ్మలేకపోతున్నాను. నేనంటే పంచప్రాణాలు పెట్టే నాన్న, నేనడిగిందే తడవు అన్నట్టుగా తెచ్చిచ్చే నాన్న ఇలా చేసారాంటే నా మనసు ఒప్పుకోవడంలేదు. ఏమండి.. నిజం చెప్పండి. ఇదంతా ఎవరో చేసి నాన్న మీదకు తోసారేమోనని నా అనుమానం. మధు.. నువ్వు నిజం చెప్పు. ఇది ఎవరిపని? నిన్ను నన్ను విడదీయాల్సిన అవసరం ఎవరికుంది, ” మతిలేనిదానిలా చూస్తూ అడిగింది. 


“నేను చెప్పేది నిజం ప్రియా.. మధు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చాడంటే నాకెందుకో అతనిమీద జాలి అనిపించింది. అతను నిజంగా నిన్ను మోసం చేసిన మనిషే అయితే కనుక నిన్ను వెతుక్కుంటూ నీకోసం రాడు. అలా వచ్చాడంటే అతని ప్రేమ ఎంత బలమైనదో చెప్పకనే తెలుస్తుంది. నువ్వు అనుకున్నట్టుగానే ఇదంతా ఎవరో కావాలని చేసారనే నిజాన్ని మధు నుండి రాబట్టాలని పదిహేను రోజులుగా అతనికోసం తిరుగుతున్నాను. నేను లేని సమయంలో మనింటికి వస్తున్నాడని చెప్పావు, ఎలాగైనా సరే అతన్ని కలిసి నిజాన్ని తెలుసుకోవాలని నిన్నంతా కాపు కాసాను.


 ఎలాగైతేనేం దొరికాడు. ఎంతగానో అడిగితేగాని చెప్పలేకపోయాడు. ఎందుకంటే మీ నాన్నకు నువ్వు ప్రాణం. నీకు మీ నాన్నంటే ప్రాణం. అందులో నువ్వు పెళ్ళి చేసుకున్నావని తెలిసాక కనీసం నీకు నిజంచెప్పాలని, తన ప్రేమలో మోసంలేదని నీకు తెలియచెయ్యాలని రోజు నీ దగ్గరకు వస్తుంటే, నువ్వేమో నేనెక్కడ చూస్తానోనని భయంతో మధును పలకరించడానికి కూడా భయపడుతున్నావని చెప్పాడు. అవును కదూ మధు, ” మధు భుజం మీద చెయ్యివేసి అనునయంగా అడిగాడు రామకృష్ణ. 


 అవునన్నట్టుగా తలాడించాడు మధు. 


“ఏమండి, అసలు విషయం దాచిపెడుతున్నారు. ఇంతకు మమ్మల్ని వీడదీసిన వాళ్ళెవరో చెప్పలేదు చెప్పండి, ” తొందరచేసింది. 


మధు.. తనకు ప్రాణానికి ప్రాణమైన తన ఊపిరిని తన నుండి ఎవరు దూరంచేసారు.ఎందుకు నన్నింత బాధపెట్టారు మనసు ఆక్రోషిస్తుంది ఆలస్యం తట్టుకోలేపోతూ అడిగింది. 


“అలాగే విందువుగానీ ప్రియా .. నేను చెప్పడమెందుకు? ఇదిగో నీ ముందున్నాడు కదా, అతనే చెప్పని. మధు.. నిజమైన ప్రేమ త్యాగాన్నే కోరుతుందని తెలుసు, కానీ మీకు తెలియకుండానే మిమ్మల్ని వీడిదీసిన వాళ్ళు మంచివాళ్ళుగా చలామణి అవుతున్నారు, అంటే ప్రేమించిన మీ మనసులు ఎంతగా విలపిస్తున్నాయో, ఏ పాపం తెలియని మీరు 

ప్రేమించిన హృదయాలను తప్పు పట్టడం బాగాలేదు. అందుకని నీకు జరిగిన అన్యాయాన్నినీ నోటితో చెప్పి నీ ప్రేమను నీరూపించుకో, ” అంటూ ధైర్యం చెప్పాడు. 


తలపైకెత్తి ఆకాశం వైపు చూస్తూ. “చెబుతాను. ఇప్పుడు కూడా నేను నిజం చెప్పకపోతే నా ప్రేమకు అర్థంలేదు. ప్రేమించేవాళ్ళు ఎప్పుడు పిరికివాళ్ళు కాకూడదు. ప్రేమలో ఉన్న నిజాయితీని నిరూపించుకోవాలి. మోసంతో ప్రేమించే ప్రేమ నిజంకాదు, ” ప్రియాంకవైపు చూస్తూ అన్నాడు. 


నీ ప్రేమలో నిజంలేదు అనే అర్థం వచ్చేలా ఉన్నాయి అతని చూపులు. 

కలవరపడింది ప్రియాంక ఒక్కసారిగా కళ్ళల్లోనుండి నీరు ఉబికివచ్చింది. 


“పేదవాడికి అందులో ఆనాథనైన నాకు ప్రేమించే అధికారం లేదని తెలుసు. నా గురించి నాకు బాగా తెలుసు. నేనెప్పుడు నా సరిహద్దుల్లోనే ఉంటాను. ఆ సంగతి నీకు బాగా తెలుసు. డబ్బున్న వాళ్ళంటే నేనెప్పుడు ఆమడదూరంలోనే ఉండేవాడిని. కానీ నువ్వే నన్ను ప్రేమ అంటూ నీ మైకంలో పడేసావు. నేను చాలా సార్లు చెప్పాను నీకు నాలాంటి వాడిని కోరుకుంటున్నావు నీకేం కాదు, ఏమన్నా జరిగితే నాకే నా ప్రేమకు రూపురేఖలు లేకుండా పోతాయని కూడా నీతో చెప్పాను. మీ నాన్నకు డబ్బులేని వాడంటే గడ్డిపరకతో సమానం.                          బంగారుటుంగుటుయ్యాలలో ఊగుతున్న నీకు నేను తగనివాడనని, నీ మనసు నొప్పించకుండానే నా ప్రేమకథను అంతమొందించడానికి పథకం వేసాడన్న సంగతి నేనెంత మాత్రం ఊహించలేదు. తన చేతికి మట్టి అంటకుండా సారథితో నన్ను పంపించాడు.


ఆ రోజంతా కారులో ప్రయాణం చేసాక నల్లమల అడవుల్లోకి చేరే సమయానికి టిఫిన్ తిందాము అన్నాడు సారథి. అవును కడుపులో ఆకలిగా ఉంది ఇంకా ముందుకు వెళితే ఏం దొరకవు కాబోలు అనుకుని సరే అన్నాను. టిఫిన్ చేసాక నేను బాత్రూంకు వెళ్ళాను. ఈ లోపల టీ తెప్పించాడు. అందులో మత్తు మందుకలిపాడన్న సంగతి నాకు తెలియక తాగాను. ఉషారుగా కారు నడిపిస్తూ నన్ను మాటలతో నవ్వించడం మొదలుపెట్టాడు. తను డ్రైవింగ్ చేస్తున్నాడు. నిద్ర రాకుండా మాట్లాడుతున్నాడనుకున్నాను. మెల్లె మెల్లెగా నా కళ్ళు మూతలుపడుతున్నాయి. ఎంత బలవంతం చేసినా నిద్ర ఆపుకోలేకపోతున్నాను.


నేను నిద్రబోయాననుకుని అతను .. “ఏరా! నువ్వుండడానికే టికానలేదు. నీకు గొప్పింటి పిల్ల కావాలట్రా, చూడు తమ్ముడు.. ఆశకు హద్దుండాలిరా. పెద్దోళ్ళతో వ్యవహారమంటే ఆషామాషీ కాదు. నిన్ను చంపడానికి ఇంతదూరం పంపించాడు ఎందుకో తెలుసా? వాళ్ళమ్మాయికి అనుమానం రాకుండా పోలీసులకు దొరకకుండా. చూసావా.. డబ్బున్నోళ్ళ తెలివి!


 అయినా నువ్వెక్కడి పిచ్చోడివిరా.. ఆ పిల్ల నిన్ను ప్రేమించిందని ఎలా అనుకున్నావు.. ఊ అనాలికానీ ఆ అమ్మాయి, అందమైన అబ్బాయిలు పడిగాపులు కాస్తున్నారు ఆమెకోసం. ఒరేయ్ తమ్ముడు.. ఇందులో నా తప్పేంలేదు. ఇదంతా మా బాస్.. అదే దామోదరం చెప్పినట్టు చెయ్యకపోతే రేపు నా పరిస్థితి కూడా ఇదే గతిపడుతుంది” అంటూ మాట్లాడుతూనే ఉన్నాడు.


నేను వినడంలేదని అనుకున్నాడు. తరువాత ఏమయ్యిందో నాకు తెలియదు. నాకు స్పృహ వచ్చేసరికి నేను ఒక కోయవాళ్ళింట్లో ఉన్నాను. నీళ్ళల్లో కొట్టుకునిపోతున్న నన్ను వాళ్ళు కాపాడరట. తలకు బలమైన గాయం అవడంతో స్పృహ కోల్పోయాను. నాకేం తెలియదు, ఆరునెలలు కోమాలో ఉండిపోయానట.


వాళ్ళు నాకోసం చాలా కష్టపడ్డారు. నన్ను ఒక మనిషిగా నిలబెట్టడానికి వాళ్ళు చేసిన సేవలకు నేనేమిచ్చిన ఋణం తీర్చుకోలేను. మళ్ళీ జన్మనిచ్చారు. ఇవ్వకపోయినా బాగుండేది నీ ప్రేమలో నిజాయితీ లేదని తెలిసాక నేనెందుకు బతికానానని బాధపడుతున్నాను, ” చెప్పడం ఆపి ప్రియాంకవైపు చూసాడు కోపంగా. 


=================================================================================

                                                       ఇంకా వుంది..


=================================================================================


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 




55 views0 comments

Comentários


bottom of page