#LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #VidhiAdinaVinthaNatakam, #విధిఆడినవింతనాటకం, #TeluguSerials, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
Vidhi Adina Vintha Natakam - Part 15 - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 25/11/2024
విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 15 - తెలుగు ధారావాహిక
రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు. డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక. అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది. గతంలో ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్తుంది ప్రియాంక.
మధు, ప్రియాంకల మీద నిఘా పెడతాడు. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు గ్రహిస్తాడు. మధు తన డబ్బుతో పారిపోయినట్లు చెబుతాడు దామోదరం. తాను మధును ప్రేమిస్తున్న విషయం బయటపెడుతుంది ప్రియాంక.
గుండెపోటు వచ్చినట్లు నటిస్తాడు దామోదరం. హాస్పిటల్ లో చేరి, మధుని మరిచి పొమ్మని కూతురికి చెబుతాడు. కొద్ది రోజులకు తండ్రి ప్రోద్బలంతో రామకృష్ణను పెళ్లి చేసుకుంటుంది. అతని ఆప్యాయత చూసి అతనికి దగ్గర కావాలనుకుంటుంది. ఇంతలో మధు తనని కలవడంతో భర్తకు దగ్గర కాలేక పోతుంది.
గుడి దగ్గర మధు, ప్రియాంకలు మాట్లాడుకునే అవకాశం కల్పిస్తాడు రామకృష్ణ. తన తండ్రి చేసిన మోసం తెలుసుకుంటుంది ప్రియాంక. మధుకు కిడ్నీలు రెండూ పాడైనట్లు తెలుసుకుంటుంది.
ఇక 'విధి ఆడిన వింత నాటకం' ధారావాహిక పార్ట్ 15 చదవండి.
గదిలోకి వచ్చి మధు కెదురుగా కుర్చివేసుకుని మధును చూస్తూ కూర్చుంది ప్రియాంక. మగతగా పడుకుని ఉన్నాడు మధు. ఆయాసం దగ్గు రాకుండా ఉండడానికని గ్లూకోజ్ లో నిద్రకు ఇచ్చారు.
‘ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు మధు. నేను నీకు తారస పడకపోయినా బాగుండేది ఎక్కడో ఒకచోట నీదైన బతుకు నువ్వు బతికేవాడివి.
నా ప్రేమకోసం నిన్ను బలి తీసుకున్నాను నన్ను క్షమించు’ అతని చేతిని తీసుకుని కళ్ళకద్దుకుంది. ఆ స్పర్శ కు బలవంతంగా కళ్ళుతెరిచి చూసాడు.
“ ప్రియ.. నువ్వు.. నువ్వు వచ్చావా.. నాకోసం వచ్చావా? ఇంకెప్పుడూ నన్ను విడిచివెళ్ళవు కదూ, నిన్ను చూడకుండా నువ్వు లేకుండా నేను బతుకలేను. ప్రియ.. చూసావా నన్ను రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. నేను వెళ్ళను నిన్ను విడిచి వెళ్ళనని చెప్పు, ప్రియ.. నువ్వు నా శ్వాసవు కదా! నువ్వు లేకుండా నేనెలా ఉండగలను,? వాళ్ళకు తెలియదు మనం ఎంత ప్రేమించుకున్నామో!
ప్రేమంటే ఒక నమ్మకం. వందమంది వచ్చి చెప్పినా ప్రేమించే హృదయం నమ్మదు, మనను ఎవ్వరు విడదీయలేరు. నాకు తెలుసు” మగతలోనే
కలవరిస్తూ కళ్ళు తెరుస్తూ మూస్తున్నాడు. అతని మాటలు వింటుంటే నవనాడులు కుంగిపోతున్నాయి ప్రియాంకకు.
“మధు.. ఇలా చూడు నేను నీ దగ్గరనే ఉన్నాను, నీకోసమే వచ్చాను. నిన్నెవరు నా నుండి తీసకవెళ్ళరు. వెళ్ళనివ్వను. ఒకసారి కళ్ళుతెరిచి చూడు. నీ పక్కనే ఉన్నాను, ” ముఖంలో ముఖంపెట్టి అడిగింది. ఆత్రంగా రెండుచేతులతో ప్రియాంక ముఖం పట్టుకుని వాలిపోతున్న కళ్ళను తెరిచిచూసాడు.
“అవును నువ్వు ప్రియవే .. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, నువ్వు మళ్ళీ నన్ను వదిలిపోవు కదా! నాకు మాటివ్వు వెళ్ళనని, ” చెయ్యి జాపుతూ అడిగాడు.
వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ. “నేనెక్కడికి వెళ్ళను నీతోపాటుగానే ఉంటాను. నీ ఆరోగ్యం బాగాయ్యాక మనింటికి వెళదాం. ముందు లేచి ఈ మాత్ర వేసుకో. నీకు తొందరగా నయం అవ్వాలి కదా, ” అంటూ భుజాలకిందుగా చేతులువేసి మెల్లిగా లేపి కూర్చోబెట్టింది. చుట్టూ చూసాడు ఎవరు కనిపించలేదు.
“ఏం చూస్తున్నావు.. ఇక్కడ ఎవరులేరు మనిద్దరమే ఉన్నాము, ” అంది మాత్ర చేతికిస్తూ.
“ప్రియ.. నువ్వు పెళ్ళి చేసుకున్నావు కదా. మరి అతనెక్కడ, నువ్వు ఇక్కడ ఉండడం ఏం బాగాలేదు. నువ్వు ఇంటికి వెళ్ళు, ” పూర్తిగా తెలివి వచ్చి అన్నాడు.
“ఏంటి మధు.. ఏమైంది నీకు.. ఇప్పుడే కదా నన్ను విడిచి వెళ్ళకు అన్నావు, ఇంతలోనే వెళ్ళిపొమ్మంటున్నావు ఏమైంది, ” కంగారుగా అడిగింది.
“ఏం లేదు. నేను మత్తులో ఏదేదో వాగి ఉంటాను. నువ్వు పట్టించుకోకు. రాత్రిపూట పరాయివాడి దగ్గర ఉండడం మంచిది కాదు. నువ్వు వెళ్ళు ప్రియ, ” పూర్తిగా స్పృహలోకి వస్తూ అన్నాడు మధు.
“ఏమిటి నువ్వంటున్నది.. నువ్వు నాకు పరాయివాడివి ఎలా అవుతావు మధు? నువ్వు నేను ప్రేమించుకోవడం నీకు తెలియదా? నీకోసమని ఇన్నాళ్ళుగా ఎదురుచూస్తున్నానో తెలుసా? మా నాన్న చేసిన తప్పు నాకు తెలియదు. చచ్చిపోతామని బెదిరించి ఆయనతో నా పెళ్ళి జరిపించారు.పెళ్ళి చేసుకున్నానే గానీ నా మనసు నిన్నే కోరుకున్నది. అందుకని
అతను కేవలం మా అమ్మా నాన్నల దృష్టిలో నాకు తాళి కట్టిన భర్త, నా దృష్టిలో అతను నా శ్రేయోభిలాషి మాత్రమే. ఆ ఒప్పందం మా మొదటిరాత్రి రోజు ఆయనకు చెప్పాను. ఆయనకు మన ప్రేమ తెలుసు. నేను మారేంతవరకు వేచి చూస్తానన్నాడు. లేదా నువ్వెక్కడున్నా వెతికి తీసుకవస్తానని మాటిచ్చాడు. మేము నలుగురిలో పెళ్ళైనవాళ్ళం కానీ మా మధ్య దూరం చాలా ఉంది. ఇప్పుడు చెప్పు మధు.. నేను నీకోసం నీ ప్రేమకోసం వేచి ఉన్నానా లేదా, ఎప్పటికైనా నువ్వు తిరిగివస్తావని వేయ్యి కళ్ళతో ఎదిరిచూస్తున్నాను.
నేను పెళ్ళి చేసుకుని అతనికి ద్రోహం చేస్తున్నానని తెలుసు, కానీ నా హృదయంలో నీకు తప్ప మరొకరికి చోటు ఇవ్వలేను. మనసు చంపుకుని అతని దగ్గరవ్వాలి అంతే తప్ప ప్రేమించి మనసుతో కాదు. నేనెప్పటికి నీ దాననే మధు.. నీ ఆరోగ్యం బాగుపడితే అంతే చాలు, ” అంది. అతని తలను తన ఒడిలో పెట్టుకుని.
“ప్రియ.. నీకు ఎలా చెప్పాలో నాకర్ధం కావడంలేదు, ఒకసారి రామకృష్ణ గారిని పిలుస్తావా? నేను తనతో మాట్లాడాలి, నాకు తెలుసు ప్రియ.. నీ మనసులో నేను తప్ప ఎవరు ఉండరని. కానీ మనమనుకున్నవన్ని జరగాలని రాసి పెట్టిలేదు, విధి లిఖితాన్ని ఎవరు దాటలేరు. అందుకే మీ నాన్న రూపంలో మనకు ఎడబాటు కలిగింది. ఈ జన్మకు నువ్వందించిన ప్రేమతో బతుకంతా గడిపేస్తాను. వచ్చే జన్మంటూ ఉంటే మాత్రం నీ కోసమే పుడతాను. లేదంటే నాకు జన్మే వద్దని ఆ దేవుడితో గొడవేసుకుంటాను.
చూడు ప్రియ..
ఒకసారి పెళ్ళైన తరువాత అతనిని కాదని ప్రేమించిన వాడికోసం పెళ్లికి విలువలేకుండా చెయ్యడం పద్ధతికాదు, మనం కలిసే యోగం లేదన్నప్పుడు తాళిని ఎగతాళి చెయ్యకు, మంచో చెడో రామకృష్ణతో నీ పెళ్ళి జరిగిపోయింది. ఇక అతనే నీ భర్త, అతనితోడిదే నీ లోకం”
గుండెను పిండేసే బాధ లోపల నుడి పెడుతున్నా తనను మరిచిపొమ్మని చెప్పకనే చెబుతున్నాడు మధు.
“మధు .. నువ్వలా అనకు నేను మనస్పూర్తిగా ఈ పెళ్ళి చేసుకోలేదు. నీతోపాటే నేను వస్తాను. నువ్వెక్కడికి వెడితే నేను అక్కడికే వస్తాను. మనది పవిత్రమైన ప్రేమ. మన ప్రేమకు అంటిన దోషాలు పోవాలి. ఇన్నాళ్ళు నీ ఎడబాటును సహించాను. ఇక నా వల్లకాదు, ” అంది.
మౌనమే సమాధానం అన్నట్టుగా గమ్మున ఉండగా ఆయాసంతో కూడిన దగ్గు వచ్చి కిందామీదపడుతుంటే మధు అవస్థ చూడలేక పరుగు పరుగున డాక్టర్ దగ్గరకు వెళ్ళి డాక్టర్ ను పిలిచుకుని వచ్చింది ప్రియాంక. డాక్టర్ వస్తూనే మధును చూసి పెదవి విరుస్తూ ప్రియాంకవైపు చూస్తూ.
“చూడమ్మా .. మీరు అర్జంటుగా రామకృష్ణను రమ్మని చెప్పండి, ఇతని పరిస్థితి కొంచెం కష్టంగానే ఉంది ఐ సి యులోకి తీసుకవెళదాము, ” చెబుతూనే సిస్టర్ స్ట్రెచర్ తీసుకురమ్మని చెప్పాడు. అన్నీ క్షణాలమీద జరిగిపోయాయి. మధు వెనకాలే వెళుతూ రామకృష్ణకు ఫోన్ చేసి వచ్చి దేవుడికి దండం పెడుతూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది భయం భయంగా.
“ప్రియాంక.. ఏంటి అంత కంగారుపడుతూ ఫోన్ చేసావు.. మధు ఎక్కడా? మళ్ళి ఏమైన ఇబ్బంది అయిందా, ” ప్రియాంక భుజం మీద చెయ్యి వేస్తూ అడిగాడు రామకృష్ణ.
“ఏమండి .. మధుకు సీరియస్ అంటున్నాడు డాక్టర్, మిమ్మల్ని అర్జంటుగా రమ్మన్నాడు. నాకెందుకో భయంగా ఉంది మీరొకసారి వెళ్ళి కలవండి, ” చెప్పింది. కళ్ళల్లో భయం కనిపిస్తుంది. అది గమనించాడు రామకృష్ణ. అమ్మో అతనికేమైన అయితే ప్రియ తట్టుకోగలదా అనుకున్నాడు.
“సరే నేనిప్పడే డాక్టర్ ను కలిసి వస్తాను. నువ్వు కాస్త ధైర్యంగా ఉండాలి ప్రియ, ”
“ఎలా ఉండగలనండి పాపం మధును చూస్తుంటే నా ప్రాణం విలవిల కొట్టుకుంటుం. నా వల్లనే కదా తనకీ పరిస్థితి వచ్చింది.. నా ప్రాణం తీసుకోనయినా అతని ప్రాణాలు నిలబెడితే బాగుండేది. మధుకేమన్నా అయితే నా అంత పాపాత్మురాలు ఉండదేమో, ” అంటూ రెండు చేతుల్లో ముఖం పెట్టుకుని ఏడవసాగింది.
“ప్రియ.. నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే అక్కడ మధుకు వచ్చిన జబ్బు నయం అవుతుందా చెప్పు? అది అతనికి అలా రావలసిన ఉంది వచ్చింది, ఏది ఏమైనా మనం చూస్తూ ఉండవలసిందే కానీ మనమేం చెయ్యగలం చెప్పు, నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళివస్తాను సరేనా, ” అడిగాడు తలమీద చేతులువేసి నిమురుతూ. మొదటిసారిగా ప్రియాంకను ముట్టుకున్నాడు.
“రా రా .. రామకృష్ణ ఇతని పరిస్థితి పూర్తిగా విషమించింది, ఏ క్షణాన్నైనా ఊపిరి పోవచ్చు కాకపోతే మనిషి ప్రాణం పోయేవరకు కూడా మాట్లాడుతునే ఉండొచ్చు, ఆయాసం వల్ల అతను తట్టుకోలేకపోతున్నాడు నువ్వు వెళ్ళు అతను నిన్నే అడుగుతున్నాడు, ” చెప్పాడు డాక్టర్ ప్రభాకర్.
“అలాగా సరే నేనిప్పుడే వెళ్ళి మాట్లాడుతాను, ” అంటూ వడివడిగా మధు దగ్గరకు వెళ్ళాడు. , ” మధు ఇలా చూడు నేను వచ్చాను ఎలా ఉంది నీకు, డాక్టర్ మన వాడే నీకేం భయంలేదని చెప్పాడు, రెండురోజుల్లో నిన్ను ఇంటికి తీసుకవెళ్ళొచ్చు అన్నాడు” మధు మంచం దగ్గరగా స్టూల్ మీద కూర్చుంటూ.
పేలవంగా ఒకసారి నవ్వి. “ రామకృష్ణ గారు.. ఎందుకు నన్ను మభ్యపెట్టాలని చూస్తూన్నారు, డాక్టర్ మనవాడే అయినా నాకు వచ్చిన వ్యాధి మన చేతుల్లో నయంకానిది అని నాకు తెలియదనుకున్నావా? నాకంతా తెలుసు, నేను ఎంతో కాలం బతుకనని తెలిసే ప్రియాంకకు నేను నిర్ధోషినని ఋజువు చేసుకోవడానికే వచ్చాను,
ఒకవేళ తను నిజంగా నాకోసం అలానే ఉంటే గనుక తనకు నా చేతులమీదుగానే మరొకరితో పెళ్లికి ఒప్పించాలనుకున్నాను, కానీ నాకు పని లేకుండానే మీరు తనను పెళ్ళి చేసుకున్నారని తెలిసి చాలా సంతోషించాను, తను సుఖంగా ఉండడమే నాకు కావాలసింది, తనను నా ప్రాణంకన్న మిన్నగా ప్రేమించాను వాళ్ళ నాన్న చేసిన మోసం బయటపెట్టి తనను నా దానిగా చేసుకోవాలనే తాపత్రయంతో వస్తుంటే, అనుకోకుండా హాస్పిటల్‌కు వెళ్ళవలసి వచ్చింది. అదే నా దురదృష్ట సమయం. అప్పుడే బయటపడింది
నాకున్న వ్యాధి. అది తెలిసాక నాలో నేను ఎంత కుమిలిపోయానో నాకే తెలియదు. అప్పుడు నిర్ణయించుకున్నాను ప్రియాంక జీవితం పూలానావ కావాలని. ఆ దేవుడికి కూడా తెలిసిందేమో తను నన్ను చేసుకుంటే కష్టాలపాలు అవుతుందని, అందుకే మేము ఇలా వీడిపోవలసి వచ్చింది. రామకృష్ణ గారు// ఒకసారి ప్రియను పిలుస్తారా, ” అడిగాడు వేడుకోలుగా. మధు చెప్పేది వింటుంటే రామకృష్ణకు చాలా బాధేసింది.
“ ప్రియ.. ఒకసారి దగ్గరకు రావా? రామకృష్ణ గారు మీరు కూడా, ” అడిగాడు.
భయంతో బిగుసుకుపోయి అడుగులో అడుగువేస్తూ మధుకు దగ్గరగా వచ్చి అతని చేతిని పట్టుకుంది ఆర్తిగా. రామకృష్ణ చేతిలో ప్రియాంకచేతిని పెడుతూ. “ప్రియా.. ఇక నుండి నీకు అన్ని ఇతనే, ఇంతకు ముందు నీ జీవితంలో జరిగినవన్ని చిరిగిపోయినా పేజీలు, మళ్ళి కొత్త పేజీ తెరిచి నా జ్ఞాపకం లేకుండా చేసుకో, నువ్వు నాకోసం కంటనీరు పెట్టనని, మీరిద్దరు భార్యభర్తలుగా సంతోషకరమైన జీవితం గడుపుతామని నాకు మాటివ్వండి, ”
అంటూ చేతిని జాపాడు మధు. కళ్ళు వర్షిస్తుంటే గుండె బద్దలైపోతున్నది ప్రియాంకకు.
“మధు .. ఏమిటి నువ్వంటున్నది ఎందుకు మాట తీసుకుంటున్నావు, ” ఏడుపుగొంతుతో అడుగుతుంటే గొంతు జీరపోయింది ప్రియాంకకు.
“ఇదిగో నీకు చెప్పానా నువ్వు బాధపడితే నేను చూడలేనని, నీ సుఖం సంతోషమే నాక్కావలసింది, నాకు ఆయుర్దాయం తక్కువిచ్చాడు నేను వెళ్లిపోయే సమయం దగ్గరకు వచ్చింది, అందుకే చెబుతున్నాను నాకోసం నువ్వు బాధపడితే ఎక్కడున్నా నా ఆత్మ శాంతించదు, నువ్వు నా ముందు నవ్వుతూ ఉంటేనే నేను హాయిగా వెళ్ళిపోతాను, మాటివ్వు ప్రియా బాధపడనని నాకోసం ఏడవనని, ” అడిగాడు.
“ప్రియ.. మధు చెబుతున్నాడు కదా అతను ప్రశాంతంగా ఉండాలంటే అతను చెప్పినట్టు చెయ్యడమే, అంతకంటే మనమేం చెయ్యలేం నువ్వు మనస్పూర్తిగా అతనికి సేవలు చెయ్యి, అంతేగాని అతన్ని బాధపెట్టే పని మాత్రం చెయ్యకు, ” చెప్పాడు బాధగా.
లేని నవ్వును పెదవులమీదకు తెచ్చుకుంటూ. “ మధు .. నీకోసం నీ సంతోషం కోసం నేను సంతోషంగా ఉంటాను సరేనా, ” అంది మధు చేతిని తన పెదవులకు ఆనించుకుంటూ.
“ప్రియ చాలు నాకిది చాలు మాటిచ్చవంటే నేను హాయిగా వెళ్ళిపోగలను, నీకో విషయం తెలుసా ప్రియా ? నువ్వు త్వరలోనే బుల్లి బాబును ఎత్తుకుని నా పేరు పెట్టుకో, అప్పుడు నేను నీతో ఉన్నానన్న తృప్తి నాకుంటుంది, రామకృష్ణ గారు ఏమంటారు మీకిష్టమేనా నా పేరు పెట్టుకోవడం, ” నవ్వుతూ అడిగాడు రామకృష్ణను.
“దానిదేముంది మధు తప్పకుండా మాకు పుట్టబోయే బాబుకు నీ పేరు పెట్టుకుంటాము, అలాగైనా నీ పేరు రోజు తలుచుకోవచ్చు, ” చెప్పాడు రామకృష్ణ.
ప్రియాంకకు స్థబ్దుగా నిలబడి నోటమాటరానట్టు ఇద్దరిని చూస్తుంది.
వారంరోజులు గడిచాయి పెద్దగా మార్పులేదు మధు ఆరోగ్యపరిస్థితి. రోజురోజుకు క్షీణించిపోతున్నాడు కానీ ఆముఖంలో తేడా లేదు మాటలో లోపంలేదు. గడగడా మాట్లాడేస్తున్నాడు ఆయాసం దగ్గు వచ్చినప్పుడు మాత్రం కిందమీద పడుతున్నాడు.
“ప్రియ.. నేను మళ్ళి వస్తాను మీ నాన్న ఫోన్ చేసాడు, వాళ్ళు ఈ రోజే కదా వచ్చేది బహుశా ఇంటికి వచ్చినట్టున్నారు నేను వెళ్ళి చూస్తాను, ” అంటూనే గబగబా వెళ్ళిపోయాడు. అతనేం చెబుతున్నా ఆమె పట్టించుకునే పరిస్థితి లేదు ఎంతసేపు మధును కళ్ళనిండుగా చూసుకుంటూ అతన్ని నవ్విస్తూ సంతోషంగా ఉండడమే తనపని అన్నట్టుగా ఉంటుంది. తండ్రిపేరు తలవడానికి కూడా ఇష్టపడడంలేదు.
=================================================================================
ఇంకా వుంది..
విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 16 (చివరి భాగం) త్వరలో
=================================================================================
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
コメント