కొత్త ధారావాహిక ప్రారంభం
'Vidhi Adina Vintha Natakam - Part 2' - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 11/09/2024
'విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 2' తెలుగు ధారావాహిక
రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు.
డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక.
అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది.
ఇక 'విధి ఆడిన వింత నాటకం' ధారావాహిక రెండవ భాగం చదవండి.
రెండురోజులుగా ఎవరు ఎవరితో మాట్లాడుకోలేదు .
“ హలో మిస్ ప్రియాంకగారు… ఒక్కమాట
ఉండండి వస్తున్నాను ,” అన్నాడు కారు దగ్గరకు వెళ్ళబోతున్న ప్రియాంకతో.
ఏమిటి అన్నట్టుగా చూసి వెనుకకు వచ్చి నిలుచుంది మధుకు ఎదురుగా.
“ఏమిటండి అంత కోపంగా ఉన్నారు, రెండురోజులుగా కనపడకుండా వెళ్ళిపోయారు,”
అతనిమాట పూర్తవకుండానే కోపంగా చూసింది.
“హలో హలో కొంచెం శాంతానికి రండి మేడమ్, అమాయకుడిమీద జాలిచూపండి,” అంటూ రెండుచేతులు జోడించాడు.
పక్కున నవ్వింది అతని వైపుచూస్తూ. “ అబ్బో మీరు ఆమాయకచక్రవర్తులా? అవును నిజంగా మీరు అమాయకులే సుమా! ఎందుకంటే ఒక ఆడపిల్ల తనంత తానుగా చేరువకు వస్తే, పట్టించుకోని మీరు నిజంగా అమాయకులే,” అంది ఉక్రోషంగా.
ఆమెవైపే అలానే చూస్తుండిపోయాడు నోటమాటరానివాడిలా. ఇంతటి సౌందర్యరాశి నా కోసం వచ్చిందా? అయ్యో నా గురించి తెలిస్తే ఏమనుకుంటుందో! ఖచ్చితంగా నా స్నేహం వద్దనుకుంటుంది అనుకుంటూ, “చూడండి ప్రియాంకగారు… నా గురించి మీరనుకున్నట్టుగా లేదు, నేనొక అనాథను. పుట్టినప్పుడే అమ్మా నాన్నను పోగొట్టుకున్నాను. నాకంటూ ఎవరులేరు, అందుకని నేనెవరి మీద ఆశలు పెట్టుకోను., ఎందుకంటే నేనుండడానికే నాకు స్థానంలేదు., ఇంకొకరిని నా జీవితంలోకి ఎలా ఆహ్వానించగలను చెప్పండి, ‘తాదూర సందులేదు మెడకో డోలు’ అన్నట్టు, చెప్పండి అన్నీ తెలిసి ఇప్పుడు మీరు నాతో స్నేహంచెయ్యగలరా,” అడిగాడు మనసులో బాధపడుతూ.
అతనిమాటలకు విస్మితురాలైచూస్తూ మీనాలవంటి కళ్ళను టపటపలాడిస్తూ, “చూడండి… ప్రేమనేది సహజంగా దానంతట అదే పుడుతుందని విన్నాను, ఎవరో చెబితేనో లేక… తన వెనుక ఉన్న డబ్బును చూసో, అందరిలో మంచివాడిగా పేరు తెచ్చుకుంటేనో ఏ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టదు, చూపులు కలిసిన వేళా విషేశాన్నీ బట్టి ఆ మనసులు దగ్గరవుతాయి, ఎందుకండి మిమ్మల్ని మీరు చిన్నతనం చేసుకుంటారు,” అంది.
“మీరు చెప్పింది నిజమే కాదనను, ప్రేమకు హద్దులు లేవు కానీ, అన్నీ ప్రేమలు సుఖవంతం కావుకదా? ఎందువల్ల అంటారు చెప్పండి”.
“ చెబుతాను… ముందు మీరు నన్ను అండి గిండి అనడం మానేయండి, చక్కగా ప్రియా… అని ప్రేమగా పిలవండి,” అంది గలగలా నవ్వుతూ.
గలగలా సెలయేరులా నవ్వుతున్న ప్రియాంకను చూస్తూ, “నేనెంత అదృష్టవంతుడిని కాకపోతే, మీలాంటి మంచి మనుసున్న మనిషి నాకింతవరకు ఎదురుపడలేదంటే మీరు నమ్ముతారా ప్రియగారు,” అంటూ ఆమె చేతులను పట్టుకున్నాడు తన్మయత్వంతో ఆమెవైపే చూస్తూ.
చేతులు విదిలించుకుంది కోపంతో .
“సారీ అండి , ఆనందంతో నామనసు పరుగులుపెడుతుంటే ఆవేశంలో ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు,” అన్నాడు బాధపడుతూ.
రెండుచేతులు జోడిస్తూ. “మహానుభావా … నేను కోపానికి వచ్చింది అందుకు కాదు బాబు,” అంది నవ్వుతూ.
మరింకెందుకు అన్నట్టుగా చూసాడు ప్రియాంకను . తనవైపే చూస్తున్న మధును చూడగానే ఎందుకో మనసు గాలిలో తేలిపోతున్నట్టుగా అనిపించింది. ఇద్దరికళ్ళు ఒక్కక్షణం కలుసుకున్నాయి. అతని కళ్ళు ఆమెను బందిస్తున్నాయి. బలవంతంగా తన దృష్టిని మరల్చుకుంది సిగ్గుతో.
“ చెప్పండి ప్రియాంకగారు,”
“అదిగో అదే వద్దంటున్నాను, అండి, గారు అలాంటివి వద్దు అని చెప్పాను, చక్కగా ప్రియా …అని పిలవలేరా? ,” అంది బెదిరిస్తున్నట్టు.
“ఓహో అదా… నేనింకేమో అనుకుని భయపడిపోయాను,” అన్నాడు నవ్వుతూ.
అలా సాగిన వాళ్ళ పరిచయం రోజు రోజుకు బలీయంకాసాగింది. కేవలం స్నేహితులుగా మొదలైన వారి పరిచయం ప్రణయానికి దగ్గర కాసాగింది. కాలేజి అయిపోగానే ఇద్దరు కలిసి పార్కులకు సినిమాలకు వెళ్ళేవారు. గంటలకొద్ది కూర్చొని ముచ్చటలాడినా ఇంకా తనివి తీరేదికాదు వాళ్ళకు. ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేని పరిస్థితికి వచ్చారు.
మధు ఒకరోజు కాలేజికి రాలేదు. కాలేజి గేటులోపల అడుగుపెడుతూనే రోజు ఇద్దరు కలుసుకునేవాళ్ళు. చాలా సేపు మధుకోసం ఎదిరిచూసింది కానీ అతను వచ్చే సూచనలు కనపడలేదు. ఒకవైపు క్లాసుకు టైం అవుతుంది. మరోవైపు మధును చూడకుండా వెళ్ళాలంటే మనసొప్పడంలేదు. ఏం చెయ్యాలో అర్ధంకాక అక్కడనే తచ్చాడుతున్న ప్రియాంకను చూసి మధు స్నేహితుడు నవీన్ దగ్గరగా వచ్చాడు.
“హలో మిస్… మీరు మధుకోసం చూస్తున్నారు కదా! వాడికి నిన్నటినుండి చాలా జ్వరంగా ఉంది, మూసిన కన్ను తెరవకుండా పడుకుండిపోతే నేను చూసాను ఏమైందాని ఒళ్ళు కాలిపోతుందనుకోండి, నాకేం చెయ్యాలో అర్ధంకాక! నా దగ్గరున్న పారసిటమాల్ టాబ్లేట్ వేసి కాఫీ ఇచ్చి వచ్చాను. కొంచెం పరవాలేదన్నాడు,” అని చెప్పాడు నవీన్.
కళ్ళనిండా నీళ్ళు నింపుకుని. “ఏమండి.. మధు ఇప్పుడెక్కడున్నాడు, ఫ్లీజ్ నన్ను ఒకసారి అక్కడకు తీసుకవెళ్ళరా, నేను వెంటనే మధును చూడాలి,” అడిగింది బ్రతిమాలుతున్నట్టుగా.
“ఓకే … మీరేం టెన్షన్ పడకండి ఈపాటికి వాడికి తగ్గిపోయి ఉంటుంది, క్లాసుకు టైం అవుతుంది కదా! సాయంత్రం నేను వెళ్ళేటప్పుడు మిమ్మల్ని తీసుకవెళతాను,” అన్నాడు.
రెండుచేతులు జోడిస్తూ… “కనీసం అడ్రస్ చెప్పండి చాలు,” అంది. మధును ఎన్నిసార్లు అడిగిందో రూం అడ్రస్ చెప్పమని చెప్పనేలేదు మధు. పొరబాటున తనరూంకి ప్రియాంక వస్తే బాగుండదు. ఎందుకంటే అందరు మగపిల్లలు గదంతా చిందరవందరగా ఉంటుంది.
పైగా సిగరేట్ ముక్కలు పేకముక్కలు ఇవన్ని చూసిందంటే నన్ను అసహ్యించుకుంటుంది. నాకే అలవాటు లేదని చెప్పినా నమ్మదు. అందుకనే తనుండే అడ్రస్ చెప్పలేదు.
నవీన్ మధు ఇంటి అడ్రస్ చెప్పాడు . తనకారులో కాకుండా బయటకు వచ్చి ఆటోఎక్కి అడ్రస్ చెప్పింది. తిన్నగా తలుపుతీసుకుని లోపలకు వచ్చింది. నిష్త్రాణంగా మంచం మీద పడుకున్న మధును చూసేసరికి కళ్ళనుండి కన్నీళ్లు వచ్చాయి ప్రియాంకకు. గదంతా చిందరవందరగా ఉంది. ఎక్కడి బెడ్ షీట్లు అక్కడనే . సిగరేటు ముక్కలతో గదంతా వాసన.
“ మధు… మధు … ఎలా ఉంది ఇలా చూడు నేను వచ్చాను,” అంటూ మధును లేపి కూర్చోబెట్టింది. నీరసంగా కళ్ళుతెరిచి చూసాడు.
“ఏమిటి మధు ఇది నేను లేననుకున్నావా? నీకు ఇంత జ్వరంగా ఉంటే నాకు చెప్పాలని కూడా అనిపించలేదా నాకేంటి చెప్పేది అనుకున్నావా? లే మధు ముఖం కడుగుకుని కాస్తా కాఫీ తాగుదువుగానీ,” అంది మధు చేతిని పట్టుకుని లేపుతూ. మధుకు ఏం చెప్పాలో తోచడంలేదు మాట్లాడే ఓపికలేదు. మెల్లిగా లేచి ప్రియ చేతులుపట్టుకుని నడిచాడు. దగ్గరుండి బ్రష్ చేయించి తీసుకవచ్చి మంచం మీద కూర్చోబెట్టింది.
“మధు … ఎప్పటినుండి వస్తుంది జ్వరం, మరి హాస్పిటల్‌కు వెళ్ళావా మందులు వేసుకున్నావా?” అని అడుగుతూ “ఉండు కాఫీ కలుపుకొస్తాను,” అంటూ లోపలకు వెళ్లింది.
ప్రియను ఆపే ప్రయత్నం చెయ్యలేకపోయాడు మధు. ‘ఈ రోజు ఖచ్చితంగా నా గురించి తెలుస్తుంది. తప్పకుండా నన్ను అసహ్యించుకుని వెళ్ళిపోతుంది’ అని మనసులో బాధపడసాగాడు. ఇన్నాళ్ళుగా తెలియనివ్వలేదని నన్ను తిట్టుకుంటుందేమో అనుకున్నాడు. ఎంతవేగంగా లోపలకు వెళ్లిందో అంతకన్నా వేగంగా తిరిగి వచ్చింది ప్రియ.
“మధు, ఏమిటి ఇంట్లో ఏమి సామాన్లు లేవు? నీకు కాఫీ పెట్టిద్దామనుకుంటే, అంటే రోజు నువ్వు వంట చేసుకోవా? అసలు ఏం తింటావు? ఏంటి మధు నాకు ఇవన్ని ఎందుకు చెప్పలేదు? నీ దృష్టిలో నేను పరాయిదానిలాగే ఊహించుకున్నావు కదా! సరేలే ఇప్పుడవన్నీ ఎందుకు పద ముందు హాస్పిటల్‌కు వెళదాము,” నిష్టురాలాడుతూ బాధతో అంది.
“అది కాదు ప్రియా… నీకు చెప్పాలనుకున్నాను కానీ,” అంటూ మౌనంగా తలదించుకున్నాడు చెప్పలేక.
“అవన్నీ తరువాత మాట్లాడుకుందాం ముందు హాస్పిటల్‌కు నడవండి,” తొందరచేసింది.
“ ప్రియా … జ్వరం అదే తగ్గిపోతుంది హాస్పిటల్‌కు వద్దులే, టాబ్లెట్ వేసుకున్నాను. సాయంత్రం వరకు తగ్గుతుంది,” అన్నాడు మొహమాటపడుతూ. హాస్పిటల్‌కు వెళ్ళాలంటే తన దగ్గర అంత డబ్బుండాలి కదా! డబ్బులేదని చెప్పలేడు అందుకు తప్పించుకోవాలని చూసాడు మధు.
“ చూడు బాబు… జ్వరం వచ్చిందని లంకణాలు చేస్తే అది తగ్గదు, నీరసం వచ్చి గ్లూకోజ్ ఎక్కించాల్సి వస్తుంది, “గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకన్నట్టు” ముందు డాక్టర్ దగ్గరకు వెళ్ళాక ఆయనేం చెబితే అది,” అంది గోడకు తగిలించి ఉన్న షర్టు ప్యాంట్ ఇస్తూ. తప్పదన్నట్టు లేచి తయారయి జేబులు తడుముకుంటుంటే.
“పరవాలేదు మీరేం బాధపడకండి నా దగ్గర డబ్బులున్నాయి ,” అంది.
“కానీ ప్రియా…,” సంశయంతో ఆగిపోయాడు.
“ఏంటి నా డబ్బులు వాడుకుంటే ఋణంలో పడిపోతానని భయపడుతున్నారా?” అంది.
మధుకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. తమ పరిచయం ముందుకు వెళుతుందిగానీ ఇంతవరకు తనేంటో ప్రియకు చెప్పలేదు. ఇప్పుడు అనుకోకుండా బయటపడ్డాడు. పోనీ నా గురించి నిజం చెపితే తాను నన్ను అసహ్యించుకుని వెళ్లిపోతుందేమో. తను లేకుండా నేనుండలేను ఇప్పుడు తను నా పంచప్రాణాలు. ఎలా చెప్పను ? తరువాత తెలిసినా తను
నన్ను వదిలేస్తుంది.
‘దేవుడా ఎలాంటి పరిస్థితి తెచ్చావయ్యా? ఎన్నడూ నిన్ను ఏమి కోరలేదు. పుట్టిననాటి నుండి నాకు కష్టాలనే ఇచ్చావు . కనీసం ఇప్పుడైనా నన్ను కనికరించి నా ప్రియమైనా ప్రియను నాకు దూరంచెయ్యకు . నిజం చెపితే ప్రియ నన్ను అర్థం చేసుకునేలా చేస్తావని ఆశిస్తున్నా’ అంటూ మనసులోనే దీనంగా వేడుకున్నాడు మధు.
“అబ్బా... ఏంటీ మధు అలానే చూస్తుండిపోయావు, ఆ కళ్ళల్లో కన్నీరేంటి ? ఏమైంది నేనేమైనా అనకూడని మాటన్నానా ? ఏమైంది చెప్పండి,‘‘ అంటూ ఆప్యాయంగా మధు భుజంమీద చెయ్యివేస్తూ అడిగింది.
“అబ్బే అదేంలేదు ప్రియా …నేనిన్నాళ్ళు నీకు నా గురించి నిజం చెప్పలేదు , నువ్వెక్కడ దూరం అవుతావోనని భయంతో దాచాను, ఇప్పుడైనా నేనెవరో నా గతమేంటో నీకు తెలియాలి, నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా, నీలాంటి గొప్పింటి అమ్మాయిని డబ్బుకోసం ఆశపడి నిన్ను మోసం చేసానని అనుకోవద్దు, నేను బీదవాడినే అయినా నిన్ను మనస్పూర్తిగా ప్రేమించాను , నాది తప్పేకావచ్చు ’అందని మానుకోసం అర్రులచాచినట్టు’. కానీ ! నిన్ను చూసాక జన్మజన్మల నుండి నాదానివి అన్న భావన కలిగింది, అందుకే నన్ను నేను అదుపులో పెట్టుకోలేకపోయాను, కానీ ! ఒక్కమాట ప్రియా… నువ్వు నాకు దూరంకానని మాటిస్తేనే ,‘‘ అంటూ ఆగిపోయాడు.
‘‘మధు ... నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా, నేను డబ్బులో పుట్టిపెరిగినంత మాత్రాన నాకు మంచేదో చెడేదో తెలియదంటావా? డబ్బు హోదా అన్ని చూసుకునే ప్రేమించాలంటావా? చూడు మధు … ప్రేమనేది ఎప్పుడు పుడుతుందో ఎవరికి తెలియదు, ఎవరిని చూస్తే మనసుకు హత్తుకుని పోతారో వాళ్ళనే ఇష్టపడతారు, దానికి సమయంసందర్భం అవసరంలేదు, ప్రేమకు కులం మతం డబ్బు పరపతి ఇవేం తెలియవు.
తెలిసిందల్లా తనకు నచ్చిన మనిషి తన స్వంతం కావడమే, మధు నీ గతం నాకవసరంలేదు నేను నిన్ను నిన్నుగా ఇష్టపడ్డాను, నాకు కావాలసింది నువ్వేగాని నీ వెనుకున్న గతంకాదు, నూరు ఆరు అయినా నా మనసునెవ్వరూ మార్చలేరు, నీనుంచి నా మనను ఎవ్వరూ విడదీయలేరు. ఇంకెప్పుడు నా మనసును బాధపెట్టే ప్రయత్నం చెయ్యకు,” అంటూ అమాంతంగా మధును కౌగిలించుకుంది.
“ప్రియా… చాలు ఈ జన్మకు ఇది చాలు,” అంటూ ఆర్తిగా ప్రియను కౌగిలిలో బంధించుకున్నాడు.
చూస్తుండగానే డిగ్రీ అయిపోయింది. ఇద్దరి మనసులు విడదీయరానంతగా పెనవేసుకొని పోయాయి. ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరుండలేని పరిస్థితి వచ్చింది. ప్రియ తన విషయం ఇంట్లో తల్లి తండ్రులకు చెప్పలేదు. వాళ్ళు పెళ్ళి ప్రసక్తి తెచ్చినప్పుడు చెబుదాంలే అనుకుంది. ప్రేమకు హద్దులులేవు. కానీ మధు, ప్రియా ఎప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించలేదు. సినిమాలకు షికార్లుకు తిరిగినా చదువును ఎప్పుడు అశ్రద్ధ చెయ్యలేదు మధు.
“ప్రియా … మన చదువులు అయిపోయాయి, నేనెక్కడైనా ఉద్యోగ ప్రయత్నం చెయ్యాలి. మీ నాన్న కు చాలా పలుకుబడి ఉందికదా! నాకెక్కడైనా చిన్నపాటి ఉద్యోగం ఇప్పించమంటావా ప్రియా,” ఆశగా అడిగాడు.
“మధు నీకేమన్న పిచ్చా… లేకపోతే ఏంటి , ఎవరిచేతికిందనో ఉద్యోగం చెయ్యవలసిన ఖర్మ నీకేంటి, మన పెళ్ళైపోతే మాకున్న ఆస్తి నీది కాదా! మా నాన్న కంపెనీలన్నింటికి నీవే యజమానివి తెలుసా? ఎప్పుడైతే మనం ప్రేమలో పడ్డామో అప్పుడే జగతి కంపెనీకి నువ్వే బాస్, ఇంకోసారి చెబుతున్నా చదువు మానేసి ఉద్యోగం సద్యోగం అంటూ నాకు చిరాకు తెప్పించకు మధు, మనం పై చదువులు చదువుతూ మన ప్రేమను ఇంకా బలపరచుకుందాము ,” అంది తన్మయత్వంగా మధు పెదవులమీద ముద్దుపెడుతూ.
”అదికాదు ప్రియా… మీ నాన్న వాళ్ళకు నేను ఏమి లేని బికారినని తెలిస్తే ఊరుకుంటారా చెప్పు? ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నానంటే , కనీసం నాతో మాట్టాడడానికన్నా ఇష్టం చూపెడతారు, ఏమి లేని అనామకుడికి కోటీశ్వరురాలైన నీతో పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు, ఈ ఒక్కసారికి నా మాట విను. నేనెక్కడో పని చెయ్యట్లేదు కదా! మీ నాన్న దగ్గరనే కదా.
రేపు రేపు అన్ని తెలుసుకోవలసిన వాడిని , ఉన్నపళంగా మీ నాన్న నాకు అధికారం ఇచ్చాడనుకో నేనెలా నెగ్గుకు రాగలను చెప్పు, మన మంచికోసమే చెబుతున్నాను ప్రియా,” నచ్చచెప్పే ధోరణిలో చెప్పాడు. ఒక్క క్షణం ఆలోచించి సరేనని ఒప్పుకుంది.
“ఏయ్ ప్రియా … నాకు ఉద్యోగం వచ్చేసిదోచ్,” అంటూ ప్రియను రెండుచేతులలో ఎత్తి పట్టుకుని గిరగిరా తిప్పాడు సంతోషం పట్టలేక.
“ఏయ్ మధు … వదులు ఎందుకంత ఆనందం,” కిలకిలా నవ్వుతూ అడిగింది.
“ఆనందంకాక ఇంకేమిటి ప్రియా… నువ్వు మీ నాన్న దగ్గర నాకు ఖచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తావు కదా! అంటే అప్పుడు నేను పనికిమాలినవాడిని కాదు , నేను నా కాళ్ళమీద నిలబడగలుగుతాను పది మందిలో తలెత్తుకుని తిరగగలుగుతాను, నన్ను చూసి నవ్విన వాళ్ళు ఔరా వీడు ఎంతవాడయ్యాడు అని ముక్కున వేలు వేసుకోవాలి,” కసిగా పట్టుదలగా అన్నాడు మధు. గతం తాలుకా బాధలు మనసులో సుడి తిరిగాయి.
“ఏమిటో నీ పిచ్చి ఆనందం! ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగా” అన్నాడట నీలాంటి వాడే, మధు ఎందుకంత పట్టుదల ఉద్యోగమే చెయ్యాలని,” అడిగింది అతన్ని ఆటపట్టిస్తూ.
“ప్రియా… సమయం వచ్చినప్పుడు చెబుతాను, అదిసరే మీ నాన్న దగ్గరకు ఎప్పుడు తీసుకవెళతావు, నువ్వు మీ నాన్నకు నా గురించి చెబుతావా, నీతో పాటు చదువుకున్నానని చెప్పు ఇప్పుడే మన విషయాలేమి చెప్పకు,” ప్రియా చుబుకం పట్టుకుని అడిగాడు.
=================================================================================
ఇంకా వుంది..
=================================================================================
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Comentarios