top of page
Writer's pictureLakshmi Sarma B

విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 3



'Vidhi Adina Vintha Natakam - Part 3' - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 18/09/2024

'విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 3తెలుగు ధారావాహిక

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు. డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక. అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది. ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్తానంటుంది ప్రియాంక. 


ఇక 'విధి ఆడిన వింత నాటకం' ధారావాహిక మూడవ భాగం చదవండి. 


“ఏమండీ .. మన అమ్మాయికి చదువైపోయింది కదా! మరీ మా అన్నయ్యను రమ్మనమని చెప్పనా, మన ప్రియ పుట్టినప్పుడే తన కొడుకు కు చేసుకోవాలని అనుకున్నాడు, మన స్తోమతకు తగినట్టుగా ఉంటుంది. పిల్లలు కూడా ఈడు జోడు బాగుంటుంది. ఏమంటారు,” రాత్రి భోజనం అయ్యాక మంచం మీద కూర్చొని భర్తకు తమలపాకు చుట్టిస్తూ అడిగింది ప్రియాంక తల్లి శారద. 


“ఏమిటి శారద.. నువ్వు కూడా నిర్ణయాలు తీసుకునేంత వరకు వెళ్ళిపోయావా?

ఏం నాకామాత్రం తెలియదనుకున్నావా లేకపోతే పుట్టినింటి మీది మమకారంతో అడుగుతున్నావా? నీకు తెలుసు కదా, నిన్ను చేసుకున్నప్పుడే మీ వాళ్ళు మా అంతస్తుకు తులతూగలేదని మా అమ్మకు చాలా కోపంగా ఉండేది నీ మీద. మరచిపోయావా? ఏవో అబద్దాలు చెప్పి పెళ్ళిళ్ళ పేరయ్య నిన్ను నాకంటగట్టాడు. ఏదో నీ అదృష్టం బాగుంది కనుక సరిపోయింది, మళ్ళి అదే తప్పు నన్ను చెయ్యమంటావా, ” నవ్వుతూ అడిగాడు ప్రియాంక తండ్రి దామోదరం. 


“అవున్లెండి మీ కెప్పుడు మా పుట్టింటి వాళ్ళంటే చిన్నచూపే, వాళ్ళకు మీకున్నంత ఆస్తిలేకపోవచ్చు గాని మనుషులను అర్థం చేసుకునే మంచి మనసుంది. మీరు డబ్బులో పుట్టి పెరిగారు గానీ ప్రేమలు ఆప్యాయతలు పంచడంలో మా పుట్టింటి వారి తరువాతనే మీరు. అది సరే, మీరు నన్ను పెళ్ళి చేసుకున్న తరువాత ఏం నష్టపోయారని అస్తమానం నా మీద ఏడుస్తారు, నేను ఈ ఇంటికి వచ్చాక మీకు బాగా కలిసివచ్చింది, ఇంట్లో ఎవరికివారే యమునాతీరే అన్నట్టుగా ఉండేవాళ్ళు, నేను వచ్చాకనే కదా! అందరు కలిసిమెలిసి ఉంటున్నారు, ఇదంతా నా వల్లనే కాదంటారా, ” అతని ముఖానికి దగ్గరగా వస్తూ అడిగింది శారద. 


“ఆ.. ఆ గొప్పలకేం తక్కువలేదు పుట్టింటివారి మీద ఈగ వాలనివ్వవు కదా! అబ్బో ఎంత రోషమో, చూడు శారద .. నా బిడ్డను నాకంటే ఉన్నతుడింటికి ఇవ్వాలన్నదే నా కోరిక. నా బిడ్డ కాలు కిందపెట్టకుండా చూసుకునే వాళ్ళు కావాలి, అది కొండమీది కోతిని తెమ్మన్నా తెచ్చే వాడు కావాలి. అమ్మాయి కనుసన్నల్లో నడుచుకుంటూ అపురూపంగా చూసుకునే వాడే నా ఇంటికి అల్లుడిగా వస్తాడు, ” అంటూ మీసం మెలేసి గర్వంగా చూసాడు భార్యవైపు. 


“అవునవును కొండమీద కోతేం ఖర్మ అడవిలో ఉండే మృగరాజును తెమ్మన్నా తేగలడు కాబోలు, అప్పుడు వచ్చే పెళ్ళి కొడుకు ‘మీ అమ్మాయికి కాలు వంకరా’ అని అడుగుతాడు. ఎందుకంటే కాలు కిందపెట్టకుండా చూసుకోవాలి అంటే అంతే కదా మరీ,” ఏకసెక్కంగా అంది. 


“ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ప్రియాంక? నీ ముద్దుల కూతురని మర్చిపోతున్నావు. అలా అపశకునం మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? మహారాణి లాంటి కూతురుని అనవలసిన మాటేనా అది, ” కోపంగా గయ్యిమని లేచాడు భార్యమీదకు. 


చీరకొంగు నోటికి అడ్డంపెట్టుకుని నవ్వుతూ. “మరేంటి మీ కోరికలు ఆకాశాన ఉంటే నేనలా అన్నాను, ఏదో అమ్మాయికి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకునేవాడికి పిల్లనిస్తా అంటారు గానీ, అయినా మన ప్రియకు ఏం తక్కువయిందని బయటకు పంపించడం, మనకున్నది ఒక్కతే కూతురు. ఉన్న ఆస్తి మొత్తం దానికే కదా, అది అత్తవారింటికి మనను వదిలి వెళ్ళిపోతే మన ప్రాణాలు తట్టుకోగలవా? ఇదిగో నేను ముందే చెబుతున్నాను, ఎట్టి పరిస్థితులలో తను మనకు దూరం కాకుడదు. మీకు నచ్చినా నచ్చకపోయినా బీదవాడైన సరే, మంచిగుణంతో పాటు అందగాడైతే చాలు మనతో ఉండిపోతాడు. ఇల్లరికం అనుకోండి, ” ముఖం చిన్నబుచ్చకుంటూ చెప్పింది. 


“నాకు తెలుసులేవోయ్ నీ బాధ.. కూతురికి పెళ్ళి చేస్తే నీకు దూరమౌతుందని కదా నీ బాధ, నువ్వన్నట్టుగా ఇల్లరికం అల్లుడిని తెస్తాను కాకపోతే, బాగా డబ్బున్న వాళ్ళు కావాలి. వాళ్ళకు ఇద్దరు ముగ్గురు కొడుకులున్నవాళ్ళైతే ఒకడిని మనింటికి ఇల్లరికం తెచ్చుకోవచ్చు, అదే ప్రయత్నంలో ఉన్నా. అయ్యవారి చెవిలో వేద్దాం అనుకుంటున్నాను శారద, ” చెప్పాడు దామోదరం. 


“ నాన్న .. మన కంపెనీలో వర్కర్స్ అందరు ఉన్నారా? ఒకసారి నాకు మన కంపెనీ చూడాలని ఉంది, ” నసుగుతూ టిఫిన్ చేస్తున్న తండ్రిని అడిగింది తను కూడా తింటూ. 


“అబ్బో .. ఏమిటో విచిత్రంగా నువ్వు మన కంపెనీ చూడడానికి వెళతావా? మీ నాన్న ఎన్నిసార్లు అడిగినా రాను అనేదానివి, ఈ రోజేంటమ్మా నీ అంతట నువ్వే వస్తానంటున్నావు, అమ్మా ప్రియా నాన్నతో పాటుగా మన కంపెనీల బాధ్యత నువ్వు తీసుకోవాలి, ఎంతకాలమని ఇతరుల మీద ఆధారపడదాము చెప్పు, ” కూతురిని చూస్తూ పొంగిపోయింది శారద. 


“ప్రియా.. నువ్వు వస్తానంటే అంతకంటే శుభవార్త ఏముందమ్మా, ఏం తల్లి నీ చదువు అయిపోతుంది కదా! ఇక నుండి మన కంపెనీలన్నింటికి నీవే యజమానురాలివి కావాలి, నువ్వు రోజు నాతోపాటుగా వచ్చావంటే అందులోని మెళుకువలు లోటుపాట్లు అన్నీ తెలుస్తుంటాయి, ఈ రోజు నువ్వు కాలేజికి వెళ్ళడం లేదా, ” కూతురి తలమీద చెయ్యివేసి ఆప్యాయత నిండిన స్వరంతో అడిగాడు. 


“అబ్బా నాన్నా..అదికాదు అమ్మా నువ్వు కాస్తా ఆగు, మన కంపెనీలో కొత్తవాళ్ళకు అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ లేకపోయినా మీరు క చ్చితంగా మా ఫ్రెండ్  కు ఉద్యోగం ఇచ్చి తీరాలి, తను చాలా తెలివి కలవాడు నాన్న, ఇలా చూసాడంటే చాలు ఇట్టే పట్టేస్తాడు. మా కాలేజిలో అతనే టాపర్. మన కంపెనీలో అయితే బాగుంటుంది కదా నాన్నా, అతను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఏమంటారు, ” ఎలాగైనా తండ్రిని ఒప్పించాలన్న తపనతో అడిగింది. 


“చూడు తల్లి .. నువ్వంతగా అడుగుతున్నావు కాబట్టి ఆ అబ్బాయిని ఒకసారి మనింటికి తీసుకుని రా, అతనితో నేను ఒకసారి మాట్లాడుతాను తను ఏం చెయ్యగలడో దాన్నీ బట్టి చూద్దాం, ” అన్నాడు. 


“సరే నాన్న.. నేను సాయంత్రం కాలేజినుండి వచ్చేటప్పుడు అతన్ని తీసుకవస్తాను. వెళ్ళొస్తాను నాన్నా.. వెళతాను అమ్మా, ” అమితానందంతో వెళ్ళిపోయింది ప్రియంవద. 


“అయ్యో వెళతానేమిటే వెళ్ళివస్తాను అనాలి కానీ, ” అంది వెనకనుండి శారద. 


“అబ్బ నీ కన్నీ అనుమానలే.. సరే నేను కూడా వెళతాను కాదు కాదు వెళ్ళివస్తానోయ్, ” అన్నాడు నవ్వుతూ. 


“ఏమండి మన అమ్మాయి ఆ అబ్బాయిని ఎవరినో తీసుకవస్తుంది కదా! ఒకవేళ అతను మంచివాడయితే మన ప్రియకు ఈడుజోడు బాగుంటే, ”


“ఆ ఉంటే ఏంటటా .. నీకు ముందే చెప్పాను శారద, నా కూతురిని అనామకుడికి ఇవ్వను, ఒకరి చేతికింద పని చేసేవాడికి అస్సలు ఇవ్వనంటే ఇవ్వను, శారద నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా? పైస పైస కోసం వెంపర్లాడే వాడు నీ బిడ్డను ఏం సుఖపెడతాడనుకున్నావు పిచ్చి పిచ్చి ఆలోచనలు రానివ్వకు, ” అంటూ మండిపడ్డాడు శారద మీద. 


దామోదరం ఆఫీసుకు వెళ్ళిపోయాక ఊపిరి తీసుకున్నట్టయింది శారదకు. కళ్ళముందట ఉన్నా కొద్ది కోపం తారాస్థాయిలో ఉండేది. ఇంత డబ్బున్నా మనిషికి ఇంకా తృప్తిలేదు. 


 మనిషికి డబ్బు పిచ్చి తప్పా మంచి చెడు ఆలోచనలే లేవు. తనకన్నా డబ్బున్నవాడు తనింటికి ఎందుకొస్తాడు ఇల్లరికం. మాములు స్థితి కలవాడు మంచి మనస్తత్వం కలిగినవాడు కావాలిగాని. ఏమిటో ఈ మనిషి ఈయనకు తగ్గ కూతురు ప్రియ. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన వాళ్ళకు ఆదే లోకం ఇంకేమి కనిపించదు అనుకుంది. 


“ఏయ్ మధు.. సాయంత్రం నువ్వు నాతో మా ఇంటికి వస్తున్నావు, మా నాన్న నీతో మాట్లాడుతారట ఆయన అడిగిన వాటికి సరిగా సమాధానం చెప్పావనుకో నీకు వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తాడు, కాకపోతే మా నాన్న చాలా తెలివిగా ప్రశ్నలు వేస్తాడు, ఎందుకంటే ఇతరుల తెలివితేటలు ఎలాంటివో తెలుసుకుంటాడు, అంటే తికమక పెట్టే ప్రశ్నలు అనుకో. నువ్వు కాస్తా ఆయనను మెప్పించావంటే చాలు, కోటలో పాగ వెయ్యడమన్నమాట. మిగతావి నేను చూసుకుంటాను, ” కాలేజిలోకి వెళుతూనే చెప్పింది. 


“అమ్మో నాకు భయంగా ఉంది ప్రియా..మీ నాన్నతో మాట్లాడాలంటే, అంతపెద్ద బిజినెస్ మనిషితో మాట్లాడాలంటే కొంచెం కష్టమేమో, మీ ఇంటికి ఎందుకు రమ్మన్నారు నేరుగా ఆఫీసుకు వెళితే సరిపోయేది కదా! అక్కడైతే మీ మేనేజర్ ఏవో నాలుగు ప్రశ్నలడిగి నన్ను ఒప్పుకునే వాడు, ప్రియా నాకెందుకో భయంగా ఉంది ఈసారికి నన్ను వదిలెయ్యి, మరెప్పుడైనా కలుస్తాను మీ నాన్నను, ” అంటూ బతిమాలాడు. 


పకపకా నవ్వుతూ “ఇంతపిరికివాడినా నేను ప్రేమిస్తున్నది.. అయ్యో రామా భలేవాడివి మధు, నిజానికి మా నాన్న చాలా మంచివాడు తెలుసా? ఆయన నువ్వనుకున్నంత దుర్మార్గుడు కాదు, మన కంపెనీలో పని చెయ్యాలంటే చదువొకటే సరిపోదు, తెలివితేటలు మంచితనము సరి అయినా నేర్పు ఉండాలంటారు అంతే, నాకు తెలిసి నీలో అవన్నీ ఉన్నాయి కదా నీకెందుకు భయం,” నవ్వుతూ అడిగింది. 


“ఏమో పెద్దవాళ్ల వ్యవహారమంటే చాలా భయం, ప్రియా.. మీ నాన్నతో మన విషయం చెప్పలేదు కదా నువ్వు” సందేహపడుతూ అడిగాడు. 


“ఏం చెపితే ఏంటట.. కొంపతీసి మా నాన్న అడగగానే నేను ప్రేమించలేదు నాకేం తెలియదు అని చెప్పి పారిపోతావా ఏంటి, ” ముసిముసిగా నవ్వుతూ అంది. 


“నీకంతా వేళాకోళంగానే ఉంటుంది నా భయం నాది, మీ నాన్న ముందు ఏం మాట్లాడుతానో అర్ధం కావడంలేదు, ఒకవేళ మీ నాన్నకు నేను అసమర్థుడనని అనుకున్నారనుకో అప్పుడు మన పరిస్థితి ఏంటీ? మీరు ముందే గొప్ప శ్రీమంతులు, నా గురించి విన్నాక మన పెళ్లికి మీ నాన్న కచ్చితంగా ఒప్పుకోరు,” బాధపడుతూ అన్నాడు మధు. 


“పిచ్చి మధు.. నేనున్నాను కదా అన్ని చూసుకోవడానికి, మా నాన్న నిన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయకుండా నేను అడ్డుకుంటాను, ముందు నువ్వు మా నాన్న మెప్పు సంపాదించావంటే చాలు మిగతా కథంతా నేను నడిపిస్తాను, అందుకని బుద్ధిమంతుడిలా నాతో మా ఇంటికి వస్తున్నావు చిట్టిబాబు, ” అంది అతన్ని ఆటపట్టిస్తూ. 


“బేబి .. ఇతని గురించేనా నువ్వు చెప్పింది, ” మధును నఖశిఖపర్యంతం చూస్తూ అడిగాడు దామోదరం. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టేంత తెలివి దామోదరంది. దామోదరంను చూస్తూనే కంగారుపడుతూ లేచి నిలుచున్నాడు మధు. “ నమస్కారం “ అన్నాడు వణికేచేతులతో దండంపెడుతూ. 


“ఆ ఆ కూర్చో ఏమిటి అంత వణికిపోతున్నావు, ఒంట్లో నలతగా ఉందా ? లేకపోతే మొదటిసారి ఇంటర్వ్యూ అని భయపడుతున్నావా, ఏంటి బేబి ఇతను చాలా తెలివికలవాడు కాలేజి టాపర్ అన్నావు, ” కూతురివైపు చూస్తూ అడిగాడు. 


“అది అది నాన్న తనకు మీతో మాట్లాడలంటే కొంచెం భయంగా ఉన్నట్టుంది, పరవాలేదు. మీరు అడగడం మొదలుపెట్టండి మీకే తెలుస్తుంది, ” అంటూ మధు వైపు చూస్తూ సైగచేసింది జాగ్రత్త అన్నట్టుగా. ఎవరు గమనించడంలేదు అనుకుంది గానీ. దామోదరం కళ్ళమూసుకున్నా తన చుట్టూ ఏం జరుగుతుందో చెప్పగలడు. అంతేకాదు ఎదుటి మనిషి ఏం ఆలోచిస్తున్నాడనే సంగతి కూడా పసిగట్టగల నేర్పు ఆయనకు ఊహ తెలిసినప్పటినుండే ఉందట. 


“సరే నీ పేరు మధు అన్నావు కదా, ”


“అయ్యో నేనింకా ఏమి అనలేదండి, ” అతని మాటలకు అడ్డు వస్తూ అన్నాడు. 


“అదేలేవయ్యా మా బేబి చెప్పింది, ఇప్పుడు నీకు ఉద్యోగం కావాలి అవునా? అవునన్నట్టుగా తలవూపాడు మధు. అప్పుడే ఏం కొంపలంటుకుపోయాయని ఉద్యోగం చేస్తానంటున్నావు, చక్కగా చదువుకోవచ్చు కదా! నిన్ను పోషించలేని స్థితిలో ఉన్నాడా మీ నాన్న, ” హేళనగా అంటుంటే మధు తలకిందకు వంచుకున్నాడు ఏం చెప్పాలో తెలియక. 


“నాన్నా.. మీరు అవసరంలేని విషయాలు అడిగి అతన్ని బాధపెడుతున్నారు, మన ఆఫీసుకు సంబంధించినవి అడగండి, ఎవరిష్టం వాళ్ళు కొందరికి చదువుకోవాలి అనిపిస్తుంది, కొందరికి ఉద్యోగం చేయాలనుకుంటారు అది వాళ్ళిష్టం నాన్న, ”అంది ఆవేశపడతూ. తండ్రి అడిగిన ప్రశ్నల వల్ల మధు ఇబ్బందిపడుతున్నాడని అర్ధమైంది. 


“అదేంటి బేబి .. నేను అతని మంచికోసమే అడిగాను నీవెందుకంత కోపం తెచ్చుకుంటున్నావు? చూడమ్మా నువ్వున్నట్టు ఎవరిష్టం వాళ్ళదే కాదనను, కాకపోతే కొందరికి చెడు అలవాట్లుంటాయి దానికోసమని డబ్బు సంపాదించుకుంటే జల్సాలు చెయ్యొచ్చనుకుంటారు, లేదు తమ కుటుంబాన్ని ఆదుకోవాలనుకున్నవాళ్ళు చదువుకు స్వస్తి చెప్పి ఉద్యోగం ఎన్నుకుంటారు, పోని ఆ రెండుకాదంటే డిగ్రీల చదువుకు ఉద్యోగందొరకటం కష్టం కదా! మరి అందుకే ఇతను ఏ కోవకు చెందినవాడని అడుగుతున్నాను, ” కూతురు వంక చూస్తూ అన్నాడు. 


తండ్రి తనవైపే చూడడంతో కొంచెం కలవరపడింది ప్రియాంక. “ ఓ అదా .. మధు చాలా మంచివాడు నాన్న, తనకు ఎలాంటి దురలవాట్లు లేవు, ” గబగబా చెప్పింది. 


“ఏమ్మా .. అతన్ని నా దగ్గరకు ఎందుకు తీసుకవచ్చావు ? నేను అతని గురించి తెలుసుకోవడానికి అవునా? మరి అతన్ని అడగనీయకుండా అతనికంటే నీవే ముందు సమాధానాలు చెబుతున్నావు, నీకు అంతబాగా తెలిసినట్టుంది అతని గురించి, మీరిద్దరు అంత క్లోజుగా ఉంటారా, ” సందేహాన్ని వ్యక్తంచేస్తూ అడిగాడు దామోదరం. 


“అబ్బే కాదండి.. తను వేరే సెక్షన్ నేను వేరే సెక్షన్, అసలు మేమిద్దరం ఎప్పుడో ఒకసారి కూడా కలవం, ” తడబడతూ చెప్పాడు మధు. 


“అవును నిజం నాన్న.. మా ఇద్దరికి పరిచయం చాలా తక్కువ, ” తండ్రికి తమ మీద అనుమానం రాకూడదని సర్ధిచెప్పింది. 


“సరె సరె ఇంతకు నేనడిగిన ప్రశ్నలకు సమాధానం కావాలి, నమ్మకస్తుడికి

మాత్రమే నా దగ్గర ఉద్యోగం దొరుకుతుంది, అబద్దాలు ఆడివాళ్ళను తిన్న ఇంటివాసాలు లెక్కబెట్టే వాళ్ళను నేను క్షమించను, ఉన్నదున్నట్టు చెప్పు నీకేం భయంలేదు మా బేబి రెకమండేషన్ కదా! నీకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది, ” అన్నాడు. ఇదేదో ప్రేమ వ్యవహారంలా ఉంది. వీడెవడోగానీ నాసంపాదన చూసి నా బిడ్డమీద మోజు పడినట్టున్నాడు. వంచనతో తన మనసు పాడు చేసినట్టున్నాడు అందుకే బేబి అంతకలవర పడుతుంది. ఇతన్ని వదలొద్దు విషయం ఎంతవరకు వచ్చిందో కనిపెట్టాలి. 


“చాలా సంతోషం సార్ .. మీరనుకున్నట్టుగా నేను జులాయిని కాదు, నాకు పెద్దచదువు చదువుకోవాలని కోరిక ఉంది కానీ .. నన్ను చదివించేవాళ్ళు లేకా, నా కాళ్ళమీద నేను నిలబడాలనుకున్నాను దాని కోసం ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను, ఉద్యోగం వచ్చాక ఇంకా చదువుకోవాలని అనుకుంటున్నాను, ఇంతదూరం వచ్చాక నా గురించి దాచటమెందుకు, నిజానికి నేనొక అనాథను నా చిన్నప్పుడే నా తల్లితండ్రులు చనిపోతే మా బాబాయి నన్ను కొన్నాళ్ళు బాగానే చూసాడు, కానీ మా పిన్నికి నేనంటే ఇష్టం ఉండేది కాదు, నన్ను వదిలించుకోవాలని నా ఆస్తి మొత్తం కొట్టేయాలన్న ఆలోచనతో నన్ను 

చంపటానికి ప్రయత్నించింది, నేను తప్పించుకొని పారిపోయి వచ్చాను ఎక్కడెక్కడో తిరుగుతుంటే, ఒక మహానుభావుడు నన్ను హాస్టల్‌లో వేసి నాకు పదవతరగతి వరకు అండగా నిలిచాడు, తరువాత అతను ఈ లోకాన్ని విడిచిపోయాడు మళ్ళి నాకు కష్టాలు ఎదురయ్యాయి, పేపర్లు వేస్తూ షాపుల్లో పని చేస్తూ డిగ్రీ వరకు నెట్టుకొచ్చాను.

 

ఇప్పుడు చెప్పండి సార్, నేనింకా పై చదువులు చదవాలంటే నేను చేసే చిన్నా చితకపనులకు వచ్చే డబ్బు సరిపోతుందా? అందుకే ఉద్యోగం చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాను, ఒకరోజు తను మీ కూతురని తెలిసి తనను అడిగాను నాకు ఉద్యోగం ఇప్పించమని అంతే కదా ప్రియంకగారు, ” చెప్పడం ఆపి ప్రియాంక వైపు చూసాడు. 


‘అయిపోయింది మా నాన్నకు మధు గతమంతా చెప్పేసాడు. పొరపాటున కూడా మా పెళ్లికి ఒప్పుకోడు. ఎక్కడి చాదస్తం మనిషి ఈ మధు ఉన్నది ఉన్నట్టు ఎవరు చెప్పామన్నారు ఇతన్ని. దేవుడా నువ్వే కాపాడు మా ప్రేమను’ తండ్రి చూడకుండా దేవుడికి దండం పెట్టుకుంది ప్రియాంక. 


“ ఓహో నువ్వు ఆనాథవన్న మాట, ” ఓరగా ప్రియాంక వైపు చూస్తూ అన్నాడు. 

“అయితే నీకిప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాల్సిందే, రేపు ఒకసారి ఆఫీసుకు రా. అక్కడే చెబుతాను నీకు ఏం ఉద్యోగం ఇవ్వాలి అనేది, ” అంటూ లేచాడు దామోదరం. 


“చాలా సంతోషమండి, ” అంటూ గబుక్కున వంగి దామోదరం కాళ్ళకు నమస్కారం చేసాడు మధు. ఆకాశన్నందుకున్నంత సంతోషంతో మధును చూడసాగింది ప్రియ. తండ్రి తనను గమనిస్తున్నాడన్న ధ్యాసే లేకుండా. 


=================================================================================

                                                       ఇంకా వుంది..


=================================================================================


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 




101 views0 comments

Comentarios


bottom of page