top of page
Writer's pictureLakshmi Sarma B

విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 5

#LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #VidhiAdinaVinthaNatakam

, #విధిఆడినవింతనాటకం, #TeluguSerials


'Vidhi Adina Vintha Natakam - Part 5' - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 28/09/2024

'విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 5తెలుగు ధారావాహిక

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్




జరిగిన కథ:


కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు. డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక. అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది. గతంలో ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్తుంది ప్రియాంక. మధుని ఆఫీసుకు రమ్మంటాడు ఆమె తండ్రి దామోదరం. 

మధు, ప్రియాంకల మీద నిఘా పెడతాడు. 


ఇక 'విధి ఆడిన వింత నాటకం' ధారావాహిక పార్ట్ 5 చదవండి. 

 


వీళ్ళ మధ్య జరిగిన ప్రతి సన్నివేశం దామోదరంకు చేరవేసాడు భాస్కర్. భాస్కర్ దామోదరంకు నమ్మనబంటు మంచిపనులలో చెడుపనులలో భాస్కర్ చెయ్యిలేనిదే ఏ పని కాదు. అందుకే తన కూతురు మీద ఓ కన్నేసి ఉంచమని చెప్పాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చేరకం భాస్కర్. అక్కడ జరిగేదానికి ఇంకో రెండుకలిపి దామోదరం రగిలిపోయేలా చెప్పాడు. అగ్గిమీద గుగ్గిలంలా మనసులో మండుతున్నాడు దామోదరం. 


దిక్కుమొక్కులేని ఆనాథకు నా కూతురు కావలసి వచ్చిందా? వాడిని నామ రూపాలు లేకుండా చేస్తాను. మర్యాదగా నా బిడ్డను వదిలిపోతాడా సరే. ఆ పోకుంటే ఏం చేస్తాడు? ఎంతోకొంత డబ్బు చేతిలో పెట్టానంటే ముష్టివాడిలా సంతోషంతో ఎగిరి గంతేస్తాడు. 


కాదుకూడదంటే కాళ్ళు చేతులు విరగగొట్టి గోదావరిలో తోసేయ్యడమే. ఇక జన్మలో వాడి పీడ ఉండదు. బేబి అడిగిందల్లా చేస్తున్నాను కాబట్టి ఇది అలానే చేస్తాననుకున్నట్టుంది. 


ఒక్కగానొక్క కూతురని తన మనసు నొప్పించలేక ఆడింది పాడింది పాటలాగా గడిచిపోయింది. చూస్తూ చూస్తూ ఏమి లేని వాడిని తెచ్చి ఇంత సంపదకు వారసుడిని ఎలా చేస్తాననుకున్నదో నాకర్ధంకావడంలేదు. అందుకే చేతులు కాలాక ఆకులు పట్టుకునే కంటే ముందుచూపుతోనే బేబీకి పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవాలి గట్టి నిర్ణయం చేసుకున్నాడు దామోదరం. 


“బేబీ .. రేపటినుండి పరీక్షలు కదా బాగా చదువుకున్నావా? ఈ రోజేంటి ఇంతలేటయింది కాలేజినుండి రావడం, స్నేహితులతోపాటుగా చదువుకుంటున్నావా? పోనిలే తల్లి ఈ సంవత్సరంతో నీ చదువు అయిపోతుంది, ఇకనుండి మన కంపెనీల బాధ్యతలు నువ్వు చూడాలి, నాతోపాటుగా నువ్వు రోజు కంపెనీకి వస్తే ఎలా చూసుకోవాలో తెలుస్తుంది,” 

కూతురు ముఖంలోకి చూస్తూ నవ్వుతూ అడిగాడు. 


“ఓహ్ మా మంచి నాన్న.. నేను అదే అనుకున్నాను మీరు అదే చెప్పారు, ఈ రోజు కాలేజి చివరి రోజు కదా నాన్న అందుకని మా స్నేహితులందరం కలిసి హోటల్‌కు వెళ్ళివచ్చాము, బాగా చదువుకున్నాను మంచి మార్కులతో పాసవుతాను,” చెప్పింది సంతోషంతో. 


“అవునవును తండ్రి కూతుర్లకు పనేం ఉంది కనుక, పెళ్ళీడుకు వచ్చిన బిడ్డకు పెళ్ళిచేసి ఆ ముచ్చట తీర్చుకుందామని ఈయనకు లేదు, చదువు అయిపోయింది.. తన ఈడు పిల్లలందరూ పెళ్ళి చేసుకుని పిల్లలను కంటున్నారు, మనకేమో ఏ ముచ్చట తీర్చుకోవాలన్న ధ్యాసే ఉండదు ఎంతసేపు డబ్బు వ్యవహారాలు తప్పా ఇంకో లోకమేలేదు,” రుసరుసలాడుతూ చేతులు తిప్పుతూ అంది శారద. 


“మళ్ళీ మొదలెట్టావు ఇంకా ఏమి అనలేదా అని అనుకుంటున్నాను, చూడు శారద! ఇది మన కాలం కాదు తొందరగా పెళ్ళి చేసి కూర్చోబెట్టడానికి, నా కూతురు పెద్ద బిజినెస్ వేత్త కావాలి, కోట్లకు పడగలెత్తిన మన బేబికోసం మగపిల్లవాళ్ళ తల్లితండ్రులు మన చుట్టూ తిరగాలి, అప్పుడు గర్వంగా మన బేబికి మంచి సంబంధం చూసి పెళ్ళి చేద్దాం అంతే కదా బేబి, ” చిరునవ్వుతో అంటూ కూతురు వైపు చూసాడు. 


ఇప్పుడన్నా తను మనసులో మాట బయటపెడితే నిక్కచ్చిగా చెప్పడమో లేదా తన మనసును మార్చడమో చెయ్యాలి అనుకున్నాడు. తండ్రి మాటలకు కలవరపడుతూ తండ్రి వైపు చూసింది. మధు గురించి చెప్పాలి చెబితే నాన్న ఒప్పుకుంటాడో లేదో. నాన్న మాటలను చూస్తుంటే నాకిప్పుడప్పుడే పెళ్ళిచేసేలా కనిపించడంలేదు. అలాగని నేను పట్టుబట్టి అడిగితే కాదనడేమో? కాకపోతే మధు సంగతి తెలిసిన తరువాత మా పెళ్లికి ఒప్పుకోడేమో ఆలోచించసాగింది. 


“బాగుందండి మీ వరసా .. అప్పటికి అది ముదురుపోతుంది, వచ్చే వాడు కూడా 

పెళ్ళికొడుకులా ఉండడు పెళ్లికొడుకు అన్నలానో లేకపోతే తండ్రిలాగానో ఉంటాడు, చూసేవాళ్ళందరు కూడా మనను వెక్కిరించకమానరు, ” అంది ఎగతాళిగా. 


“అబ్బా అమ్మా .. నాన్న చెబుతున్నారు కదా మధ్యలో నీ గోలేంటి, నాన్నకు తెలుసులే నాకు ఎప్పుడు పెళ్ళి చెయ్యాలో, నేనేం అంతముదురిపోను నువ్వు కంగారుపడకు, ” అంది తల్లిని కసురుతూ. 


“అవున్లే ఆ తండ్రికి తగ్గ కూతురువే కదా నామాట నువ్వెందుకు వింటావు, దేనికైనా పెట్టి పుట్టాలంటారు నీ పెళ్ళి చూడాలని నాకు ఉండగానే సరిపోతుందా, ఆ యోగం ఉన్నప్పుడే పెళ్ళి జరుగుతుంది లే నాకెందుకొచ్చిన బాధ, ” తను తినడం పూర్తిచేసి గిన్నెలు సర్దుకుని వెళ్ళిపోయింది పడుకోవడానికి. ఆమె కోపం చూసి తండ్రి బిడ్డలు నవ్వుకున్నారు. 


“సరే నాన్న .. నేను కూడా పడుకుంటాను నిద్రవస్తుంది, ” అంటూ తండ్రితో చెప్పి వెళ్ళింది. అక్కడే కూర్చుంటే ఏమడుగుతాడోనని అనుకుంది. 


“సరే బేబి పడుకో రేపటినుండే కదా పరీక్షలు నువ్వు కంగారుపడకుండా హాయిగా పడుకో, ” అన్నాడు ప్రియాంక తలమీద చెయ్యివేసి. తను ప్రాణంగా ప్రేమించే తన కూతురు తనతోనే మనసు విప్పి చెప్పకుండా నాతోనే అబద్ధం చెబుతుంది అంటే వీళ్ళీద్దరి మధ్య ప్రేమ బలంగానే నాటుకుందన్నమాట. 


కానియ్యి.. ఈ పరీక్షలు అయ్యేంతవరకు ఆగుతాను. ఎలాగు చివరి సంవత్సరం పరీక్షలు ఇప్పుడు హడావుడి చేసానంటే అంతా గందరగోళం అవుతుంది. ఇన్నాళ్ళు కష్టపడి చదివిన చదువు పాడైపోతుంది మనసులో అనుకుంటూ 

రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు దామోదరం. 


“హయ్ మధు .. ఎలా రాసావు పరీక్ష? నాకైతే చాలా ఈజీగా వచ్చింది పేపరు, 

అబ్బా ఈ పరీక్షలు ఎప్పుడెప్పుడు అయిపోతాయని ఎదురు చూస్తున్నాను మధు, ఇంకా అప్పుడు మనం రోజు మన ఆఫీసులో కలుసుకోవచ్చు ఏమంటావు,” చిలిపిగా నవ్వుతూ అడిగింది ప్రియా. 


“హయ్ డార్లింగ్.. నేను చాలా బాగా రాసాను, ఏంటమ్మా అంత తొందరపడుతున్నావు. ఇంకెంత పదిహేను రోజులేగా మనకు దూరం, అప్పుడు నిన్ను చూస్తూ నీతోనే ఉంటూ కాలం గడుపొచ్చు, అవును ప్రియా .. మీ నాన్నకు మన విషయం చెప్పావా? ఒకవేళ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదనుకో ఏం చేస్తావు, గప్ చుప్ గా మీ నాన్న చూసిన ముద్దపప్పులాంటి అబ్బాయితో మూడుముళ్ళు వేయించుకుంటావు కదూ, ” వేళాకోళం చేస్తూ 

అన్నాడు మధు. 


“ఏయ్ నిన్ను.. మరి నువ్వేం చేస్తావుట, నాకంటే ఎర్రగా బుర్రగా ఉన్న పిల్లను చూసి వల్లో వేసుకుంటావా? ఇదిగో చూడబ్బాయి ఇప్పుడే చెబుతున్నా, మా నాన్న గనుక మన పెళ్ళి ఒప్పుకోలేదనుకో నిన్ను మాత్రం వదిలిపెట్టను, మా నాన్నతో పోరాడైనా నీతో పెళ్లికి ఒప్పిస్తాను మరీ కాదు కూడదంటే మనిద్దరం లేచిపోయి పెళ్ళిచేసుకుందాము,” అంది బెదిరిస్తున్న ధోరణిలో. 


“ఏమో ఈ పెద్దవాళ్లతో పెట్టుకుంటే చాలా కష్టం సుమి, ఎందుకంటే నేనా నయాపైసకు కొరగాని వాణ్ణి, మీ నాన్నేమో సంఘంలో పలుకుబడి ఉన్న పెద్దమనిషి, నాలాంటి నిరుపేదను ఒప్పుకుంటాడా ఒకవేళ ఒప్పుకోకపోతే మనం పెళ్ళి చేసుకున్నా మనను ప్రశాంతంగా బతకినిస్తారంటావా ప్రియా, కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు లేకుండా నేను బతకలేను. నీతోటిదే నా జీవితం కావాలనుకున్నాను. నాకు తెలుసు అందని మాను కోసం అర్రులు చాచుతున్నానని. కానీ ఏం చెయ్యను.. నా మనసు నా దగ్గరనుండి ఎప్పుడో వెళ్ళిపోయింది, మనసు లేకుండా మనిషి బతకడం సాధ్యమయ్యేపనేనా చెప్పు,” ప్రియాంక చేతిని తన చేతిలోకి తీసుకుని పెదవులకు అనించుకున్నాడు. 


“మధు.. మధు.. నువ్వే కాదు, నువ్వు లేకుండా నేను ఒక్కక్షణం కూడా వూహించుకోలేను, నాకు మా నాన్న ఆస్తి ఇవ్వకపోయినా పరవాలేదు నీతో కష్టమైనా అది నాకు స్వర్గంలా ఉంటుంది. మధు.. నువ్వు అలా ఎందుకు ఊహించుకుంటున్నావు? మా నాన్న నా మాట ఎప్పుడు కాదనడు, త్వరలోనే మన విషయం మా నాన్నకు చెబుతాను. తొందరలోనే మనం భార్యాభర్తలం అవుతాము. నాకా గట్టి నమ్మకం ఉంది చూస్తుండు,” అంది అతని భుజం మీద తలవాల్చి. 


“ప్రియా ఏంటి సంగతి .. మనందరం విడిపోయే రోజు వచ్చింది. మాకు ఇప్పుడన్నా పార్టీ ఇస్తావా లేదా? ఎంతసేపు నువ్వు నీ ప్రియుడేనా మమ్మల్ని కాస్త పట్టించుకునేది ఉందా లేదా? అదంతా మాకు తెలియదు ఈ రోజెలాగైనా మా అందరిని హోటల్‌కు తీసుకవెళ్ళాలి. లేదంటే నీతో స్నేహం కట్, ” అంటూ ప్రియ స్నేహితులందరు పట్టుబట్టారు. పరీక్షలు చివరిరోజు మళ్ళీ అందరు ఎప్పుడు కలుస్తారోనని అడిగారు. 


“సరె సరె పదండి వెళదాము. మీరు ఎక్కడి వెళదామంటే అక్కడికే, కానీ ఒక్క షరతు. మీరెవ్వరు ఒక్క రూపాయికూడా ఖర్చు చెయ్యొద్దు, మీకిష్టమొచ్చినవన్ని తినండి. మొహమాటపడవ. మన స్నేహం ఎప్పుడు గుర్తుండిపోయేలా ఉండాలి, అంతేకాదు, నా తృప్తికోసం మీ అందరితో షాపింగ్ చెయ్యాలని ఉంది. మీకిష్టమైనవి కొనుక్కుంటానంటేనే నేను ఈ రోజు మీతో రావడానికి ఒప్పుకుంటాను సరేనా, ” గొంతు పెద్దదిగా చేస్తూ అడిగింది. 


“ఏ ఏ ఈ రోజంతా నువ్వెలా చెబితే అలానే వింటాం, ” అంటూ అరిచారు అమ్మాయిలందరు. 


“ ఏయ్ ప్రియా .. నీ ప్రియుణ్ణి మాత్రం పిలవకేం, అతనొచ్చాడనుకో నువ్వు మాతోని ఉండలేవు నీ చూపులు నీ ధ్యాసంతా ఆయనకోసం, అప్పుడు మేము పిచ్చాళ్ళలా నిన్ను చూస్తూ కూర్చుంటాము తెలుసా,” అంది ప్రియ స్నేహితురాలైనా వందన. 


“అవునవును వందనా నువ్వు చెప్పింది నిజం, దీనికి అతగాడు పరిచయం అయినప్పటినుండి మనను పట్టించుకున్న పాపానపోలేదు, అంతేలే ప్రియుడికన్నా మనం గొప్పనా చెప్పు, ” అంది సీత ప్రియాంకను చూస్తూ. 


“నువ్వు చెప్పింది నిజం సీత.. అందమైనది ఆస్తిపాస్తులకు కొదవలేదు, అందుకే కదా ఇంతమందిమి మనమున్నా ప్రియనే ఎన్నుకున్నాడు, మనమేమో ఆయనకోసం వెంబడిపడి తిరిగితే అతడేమో ఈవిడగారి వలలో పడిపోయాడు, ఎంతైనా మధు అదృష్టవంతుడంటాను కదా, ” ప్రియ చెంపమీద ముద్దుపెడుతూ అంది. ప్రియకు చాలా సన్నిహితురాలైన పద్మ. 


“అబ్బా ఏంటే మీ ముచ్చట్లు కాస్త ఆపుతారా, ఏంటే ఏమన్నారు మధును నేను వలలో వేసుకున్నానా, అంటే మీరందరు మధును ఇష్టపడ్డారా? చూసారా చూసారా నాకు కనీసం కూడా చెప్పలేదు మీరు, ” 


“ఏమ్మా చెబితే నువ్వు మధును మాకొదిలేసే దానివా? అంతలేదులే నువ్వు వదిలినా అతగాడు నీకోసం ఏం చేసైనా నిన్ను దక్కించుకునేవాడు, అబ్బే మధు కంటికి మేము కనపడితే కదా, ”అంది నవ్వుతూ సీత. 


 “ అదిసరే అయిందేదో అయిపోయింది గానీ, ఇప్పుడే చెప్పండే మధును నేను ప్రేమించడం తప్పా? నేను మధుకు సరి అయినా జోడికాదా, మా జంటను చూస్తే అందరు ఈర్ష్య పడేలా ఉన్నామా లేదా చెప్పండి, ” సిగ్గుపడుతూ అడిగింది ప్రియాంక. 


“అబ్బో ఇదంతా సిగ్గే .. ఇప్పుడే అంతా ఖర్చుచేసుకోకు తల్లి, ముందు ముందు చాలా సిగ్గుపడాలి ప్రియా .. నిన్ను చూస్తుంటే మాకే జలసిగా అనిపిస్తుంది తెలుసా, ఇంత అందమైన నీకు మన్మధుడులాంటి మధు ఇద్దరికిద్దరు చక్కటి జోడి, ఆ దేవుడు అన్ని నీకే ఇవ్వాలా చెప్పు? మేము ఆడపిల్లలమేగా మాకు నీకిచ్చినవాటిలో కొన్ని ఇస్తే ఆయన సోమ్మేమి పోయిందో, ” ఆశ్చర్యపడుతున్న పోజు పెట్టి అంది వందన. 


 అందరు ప్రియను మాటలతో ఆటపట్టిస్తూ నవ్వుకుంటూ హోటల్‌లో ఎవరికిష్టంవచ్చినవి వాళ్ళు తిన్నారు, అక్కడనుండి షాపింగ్ చేసుకున్నారు వాళ్ళకేం కావాలో అవి కొనుక్కున్నారు అందరు. మొత్తం బిల్లు ప్రియాంకనే చెల్లించింది తిరిగి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు భారంగా. 


=================================================================================

                                                       ఇంకా వుంది..


=================================================================================


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 




47 views2 comments

2 Comments


@girijaveleti4229

• 2 days ago

Super

Like


@swapnaj8931

• 3 hours ago

Super attayya

Like
bottom of page