top of page
Writer's pictureLakshmi Sarma B

విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 6

#LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #VidhiAdinaVinthaNatakam

, #విధిఆడినవింతనాటకం, #TeluguSerials, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


'Vidhi Adina Vintha Natakam - Part 6' - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 03/10/2024

'విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 6తెలుగు ధారావాహిక

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు. డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక. అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది. గతంలో ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్తుంది ప్రియాంక. మధుని ఆఫీసుకు రమ్మంటాడు ఆమె తండ్రి దామోదరం. 


మధు, ప్రియాంకల మీద నిఘా పెడతాడు. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు గ్రహిస్తాడు. 


ఇక 'విధి ఆడిన వింత నాటకం' ధారావాహిక పార్ట్ 6 చదవండి. 



“ఏమిటే ఇంతరాత్రివరకు తిరుగుళ్ళు.. నీ పరీక్ష అయిపోగానే ఇంటికి రావద్దూ? ఎంత కంగారుపడుతున్నానో తెలుసా? మీ నాన్నకేమో నిమ్మకు నీరెత్తినట్టు ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగినా పట్టించుకోరు, ”కూతురిని చూడగానే బాధ సంతోషంతో గట్టిగా మందలించింది శారద. 


“అరే అమ్మా .. ఇప్పుడు టయం ఎంతయిందని హడావుడి చేస్తున్నావు, నేనేం చిన్నపిల్లననుకున్నావా.. నాకు తెలియదా ఎంత టయం అయిందో, మా స్నేహితులందరం కలిసి హోటల్‌కు వెళ్ళి తిని వచ్చాము, మళ్ళి అందరం ఎప్పుడు కలుస్తామో తెలియదు కదా! అసలు నేను నీకు ఫోన్ చేసి చెబితే అయిపోయేది, అమ్మా.. కంగారుపడ్డావా.. తప్పయిపోయింది, ” అంటూ తల్లిని గాఢంగా కౌగిలించుకుంది. తల్లి కళ్ళల్లో జలజలారాలడానికి సిద్ధంగా ఉన్న కన్నీటిని చూసి చలించిపోయింది ప్రియాంక. 


“అదికాదు తల్లి .. పెళ్ళీడు కొచ్చిన ఆడపిల్లవు రాత్రనక పగలనక తిరుగుతుంటే, రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కదా! అసలే మన మీద కన్ను అందరికి. పైగా ఎర్రగా బుర్రగా ఉన్నావాయే, నిన్ను ఒక ఇంటిదాన్ని చేస్తే నా మనసుకు ప్రశాంతత దొరుకుతుంది, మీ నాన్నకేమో ఇవన్ని పట్టించు కోడాయే మనకేం తక్కువన్న ధీమాగా ఉంటాడు, ” బాధపడుతూ అంది శారద. 


“అమ్మా.. నువ్వేం బాధపడకు నాన్న నా పెళ్ళి చెయ్యడానికి చూస్తున్నాడు, కాకపోతే మనకు తగ్గ సంబంధం రావాలి కదా! అలాగే మన కంపెనీలో నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పాలని చూస్తూన్నారు, అమ్మా.. నేనొక విషయం అడుగుతాను అది .. అది, ” అంటూ ఆగిపోయింది. 


“ప్రియా.. ఏంటమ్మా ఆగిపోయావేం చెప్పు, ” అంది కూతురు ముఖంలోకి చూస్తూ. 


“అదే అమ్మా .. ఒకవేళ నాకు ఎవరైనా నచ్చితే అతనితో నా పెళ్ళి చేస్తారా నాన్న, అహ ఊరికే అడుగుతున్నాను ఒకవేళ అతనికి మన స్థోమతకు తగ్గట్టుగా ఆస్తిపాస్తులు లేకపోతే నాన్న ఒప్పుకుంటారా, ” తల్లి ఒడిలో తలపెట్టి పడుకుని అడిగింది తల్లిని. 


 శారద ముఖంలో కలవరం మొదలైంది. “ఏమిటే నువ్వుంటున్నది? నువ్వు ఎవరినైనా ప్రేమించావా, మీ నాన్న ఒప్పుకుంటాడని అనుకున్నావా? ఆయనకు డబ్బున్నవాళ్ళు తప్పా వేరే వాళ్ళను పలకరించడం కూడా తెలియదు, మా అన్న కొడుకు గురించి అడిగితేనే నన్ను తిట్టిపోసాడు, అలాంటిది నువ్వు డబ్బులేని వాడిని ఇష్టపడ్డావంటే కన్నబిడ్డవు కాబట్టి నిన్ను ఏమి అనలేక పోవచ్చు కానీ, అతన్ని మాత్రం ఊరికే వదలడు మీ నాన్న, నిన్ను ప్రేమించిన పాపానికి అతని జీవితం నాశనం కాకుండా చూడు, ” అంది. 


“అమ్మా అదేంలేదు, నేను ఊరికే అడిగాను, ” కంగారుపడుతూ చెప్పింది. 


“చూడు.. నువ్వు తప్పు చేస్తున్నావని నేననడంలేదు, నిన్ను ప్రేమించేవాడు దొరకడం నీ అదృష్టం. కాకపోతే నీ వెనక ఉన్న నీ ఆస్తికోసమైతే నువ్వు కష్టాల్లో పడతావేమో, కానీ నీకు ఆ అవకాశం లేదు. మీ నాన్న ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోడు. నీ మనసులో అలాంటి అభిప్రాయం ఉంటే ముందే తుడిచేసుకో అందరికి మంచిది ” కూతురికి హితోపదేశం చేస్తూ

చెప్పింది శారద. 


 గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది ప్రియాంకకు. అమ్మ చెప్పిన మాట నిజమే. నాన్నకు డబ్బు తప్పా ఇంకేమి ఆలోచన ఉండదు. నాన్నకు నన్ను ప్రేమగా చూసుకోవడం బాగా తెలుసు. నాకేది కావాలన్నా క్షణాల్లో తెప్పించి ఇస్తాడు నేను ఎక్కడ బాధపడతానోనని. అలాంటి నాన్న నా మనసులో ఉన్న నా ప్రేమను ఎందుకు అంగీకరించడు.. నిజమే.. నాన్నకు డబ్బున్న వాళ్ళంటేనే ఇష్టం. అందుకే డబ్బున్నవాళ్ళ కుటుంబాన్నించి వచ్చిన వాడికే నాతో పెళ్ళి చెయ్యాలని ఆలోచిస్తున్నాడు. నా కోసమేగా.. నేను జీవితంలో కష్టపడకూడదని నాన్న ఆలోచన. కాకపోతే మధుకు డబ్బులేకపోయినా తను ఒంటరి వాడు. తను మాతో మా ఇంట్లోనే ఉంటాడు కాబట్టి నాన్న ఒప్పుకుంటారేమో చూద్దాం అనుకుంది మనసులో. 


***

“నమస్కారం సార్.. నేను మధును గుర్తుపట్టారా? నాకు పరీక్షలు అయిపోయాక రమ్మన్నారు, ” చెప్పాడు మధు, కంపెనీకి వచ్చి దామోదరం ఎదురుగా నిలబడి. 


“అరే నువ్వటోయ్.. భలేవాడివే నిన్ను ఎలా మరిచిపోతాను, మా బేబి నిన్ను పరిచయం చేసిందంటే నీ గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటుందో నాకు తెలుసు కదా, ఆ అవును.. ఇంతకు నువ్వేం పని చెయ్యాలనుకుంటున్నావు, నీది డిగ్రీ అయిపోయింది. ఇంకా పై చదువులు చదవాలన్న కోరిక లేదా, ” 


లోపల మాత్రం ‘నిన్ను మరిచిపోతే నా బేబిని నాకు దూరం చేస్తావని నాకు తెలియదా కుర్రకుంకా. అందుకే నిన్ను నా గుప్పిట్లో పెట్టుకున్నాను ఇక చూడు ఈ దామోదరం అంటే ఏంటో’ పళ్ళు నూరుతూ ముఖాన నవ్వు పులుముకొని అడిగాడు. 


“చాలా సంతోషం సార్.. మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను, మీ నీడన ఉంటే చాలు నాకు, ” ఆనందంతో చేతులు జోడిస్తూ చెప్పాడు మధు. 


“మధు .. నువ్వు ఒక వారం రోజులు నాతోపాటుగా తిరుగుతూ అన్ని చూస్తుండు, 

ఎవరు ఎలా పని చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది నీకు తెలియాలి, ఈలోగా నేను కూడా నీకు ఏ ఉద్యోగం ఇస్తే మంచిదని ఆలోచిస్తాను పద నీకు మన కంపెనీ అంతా చూపిస్తాను, ” అన్నాడు. 


నీ గురించి నేను అంతా కనుక్కోవాలి అంటే నువ్వు నా వెంబడి తిరగాల్సిందేలే అనుకున్నాడు మనసులో. 

***

“నాన్నా .. మీకు నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయారేంటి? నన్ను కూడా ఈ రోజునుండి మీతోపాటు కంపెనీకి రమ్మన్నారు కదా! మధు వచ్చాడా నాన్న, ” అడిగింది సాయంత్రం ఇంటికి వచ్చిన తండ్రితో. 


“బేబి నిన్ను తీసుకవెళదామనుకున్నాను పరీక్షలైపోయి నువ్వు హాయిగా నిద్రపోతున్నావు ఇబ్బంది పెట్టడం ఎందుకని లేపలేదు, ఎలాగు రెండురోజులయ్యాక వస్తావు కదా అనుకున్నాను, మధు వచ్చాడమ్మా అతనికి ఏమి ఉద్యోగం ఇస్తే మంచిదాని ఆలోచిస్తున్నా, నువ్వు చెప్పు బేబి అతనికి ఏది బాగుంటుందంటావు, ” ప్రియాంక వైపు చూస్తూ అడిగాడు. 


“అవునా వచ్చాడా.. అయితే మనకు నమ్మకంగా పని చేస్తాడు కనుక మేనేజర్ గా

ఉద్యోగం ఇస్తే సరి కదూ నాన్న, ” సంతోషం పట్టలేక గట్టిగా తండ్రిని హత్తుకుని చెప్పింది. 


‘నాకు తెలుసు బేబి నువ్వు ఇదే చెబుతావనుకున్నాను. నీ మనసులో మాట బయటకు రావాలనే నిన్ను అడిగాను. ముక్కు ముఖం తెలియదు చదువు సంధ్యలు అంతంత మాత్రం. అలాంటి వాడిని ఏకంగా మేనేజర్ అంటే నేనేం అంత వెర్రివాడిననుకున్నావా బేబి. నీకు నచ్చాడని వాడిని అందలం ఎక్కిస్తావా.. అస్సలు ఒప్పుకోను’ మనసులో అనుకుంటూ కూతురువైపు కోపంగా చూసాడు. ఇదేమి గమనించని ప్రియాంక మధు ఆలోచనలలో మునిగిపోయింది. 


అంతా గమనిస్తున్న శారదకు మెల్లెమెల్లెగా అర్ధంకాసాగింది తండ్రి కూతుర్ల చాటుమాటు వ్యవహారం. భర్త ఎంత ప్రేమ చూపిస్తాడో అంత కఠినంగా ఉంటాడని తెలుసు. పాపం ఆ అబ్బాయి అమాయకుడిలా ఉన్నాడు అనవసరంగా ప్రియ జోలికి వచ్చాడు. ఈ పిచ్చితల్లి కూడా తండ్రిని నమ్ముతుంది. ఇప్పుడేం చెయ్యాలి నేను. తనలో తాను బాధపడసాగింది. 


“బేబి .. మధు గురించి నీ ఆలోచనలు ఏంటి? అంటే నమ్మకస్తుడిగా మనం అతనికి పని అప్పచెప్పవచ్చా, ఏదైనా పని మీద పంపినప్పుడు డబ్బులు లావాదేవీలు ఉంటాయి కదా!


ఏమో ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేకపోతున్నాము, అందులో లేనితనం నుండి వచ్చినవాడు, అంతపెద్ద మొత్తంలో డబ్బు చూడగానే దుర్గుణం బయటపడడం సహజం. నీకు మధు ఎన్నాళ్ళుగా తెలుసు కాలేజిలో మంచిపేరుందా అతనికి, నువ్వు చెప్పావుకదాని అతనికి ఉద్యోగం ఇచ్చాను, ” నవ్వుతూ అడిగాడు. ప్రియాంక ఏం చెబుతుందో తెలుసుకుందామని. 


 ప్రియాంక ముఖమంతా నవ్వు పులుముకుని తండ్రి మెడ చుట్టూ చేతులువేసి. 

“నాన్న.. మధు విషయంలో నీకా అనుమానమే వద్దు, అతను లేనితనం నుండే రావచ్చు కానీ, మనిషి చాలా మంచివాడు అంతేకాదు నాన్న, మీరు కంపెనీ బాధ్యతలు మొత్తం అప్పచెప్పినా నమ్మకంగా చేస్తాడు, పుణ్యానికి వచ్చింది కదా అని పరుల సొమ్ము నయాపైస ముట్టుకోడు, మాటకు కట్టుబడి తన మంచితనం నిలుపుకోగల వ్యక్తిత్వం కలవాడు, మీరు మధు గురించి ఏమి బాధపడకండి మన కంపెనీ పేరు నిలబెట్టగలిగిన మనిషి, ” అంది అత్యంత ఉత్సాహంతో. 


“బేబి .. నీకు అంతబాగా తెలుసా అతను, అదే నాలాగా నువ్వు కూడా అవతలి మనిషిని బాగానే చదువుతున్నావు, కానీ నేనొకసారి అతనికి ఒక పరీక్ష పెట్టలనుకుంటున్నాను, అందులో నెగ్గాడంటే మన కంపెనీ బాధ్యతలు అప్పచెప్పొచ్చు ఏమంటావు బేబి, ” కూతురు వైపు చూస్తూ అడిగాడు. 


“అలాగే పెట్టండి నాన్న.. మధు తప్పకుండా గెలుస్తాడు, ” అంది ముసిముసిగా నవ్వుతూ. 


‘బేబి .. నిన్ను మోసం చేస్తున్నాను కానీ తప్పడంలేదు. నువ్వు పుట్టినప్పటినుండి నీ అరికాలికి మట్టంటకుండా పెంచుకున్నాను. నువ్వొక మహారాణిలా కష్టమంటే ఏంటో తెలియకుండా నిన్ను చూసుకోవా లనుకున్నాను. నువ్వేమో బికారిని ప్రేమించావు అతనితో నీ జీవితం అనుకుని మురిసిపోతున్నావు. నీకు కడుపునిండా తిండిపెట్టగలడేమో కానీ నీ అవసరాలు తీర్చలేడు. ప్రతి పైసకు లెక్క కట్టగలడు అలాంటివాడికి నా బిడ్డను ఇస్తానని ఎలా అనుకున్నావు బేబి. నువ్వు నన్ను కాదని పెళ్ళి చేసుకుంటే ఈ ఆస్తి మొత్తం నీకు చెందుతుందని ఆశపడుతున్నాడేమో అతడు. చిల్లిగవ్వ కూడా నీకు చెందనివ్వను. నీకు తెలుసు బేబి నాకు డబ్బులేని వాళ్ళంటే గిట్టరని. తెలిసి కూడా నువ్వు బురదలో అడుగుపెడుతున్నావు. బేబి.. నిన్ను మోసం చేస్తున్నాను నేను ఏం చెయ్యను. నువ్వు అతనితో పీకల్లోతో ప్రేమలో మునిగిపోతున్నావు నాకు అది నచ్చడంలేదు. నిన్ను మహారాణిలా చూసుకోవాలనుకున్నానే కానీ పూటకు గతిలేని వాడికిచ్చి నిన్ను బికారిలా చూడలేను. 


నువ్వు ఏది కావాలన్నా ప్రతి పైసా అతను లెక్కచూసుకోవాలి. నాకిష్టంలేని పెళ్ళి నువ్వు చేసుకుంటే నా ఆస్తిలో చిల్లిగవ్వకూడా నీకు రాదు. అలా జరగడం నాకిష్టంలేదు అందుకే నీ జీవితంలోనుండి అతన్ని నీకు శాశ్వతంగా దూరంచేద్దామనుకుంటున్నాను. ఇదంతా ఎవరికోసం చేస్తున్నానుకున్నావు నీకోసం. నీకాలికి మట్టంటకుండా నిన్ను పెంచుకున్నాను నువ్వు నాప్రాణం తల్లి’


 రాత్రంతా ఇవే ఆలోచనలతో గడిపాడు. 


ఉదయం నిద్రలేస్తూనే మనసు దూదిపింజంలా ఎగురుతోంది ప్రియాంకకు. నాన్నకు మధు నచ్చాడు అందుకే నన్ను అన్ని విషయాలు అడుగుతున్నాడు. నేను బయటపడకుండా నాన్ననే మా పెళ్లికి ఒప్పుకునేలా ఉన్నారు. ఇప్పుడు నాన్న పెట్టే పరీక్షలో గనుక మధు నెగ్గాడంటే కంపెనీ బాధ్యతలు చాలా వరకు అప్పచెబుతాడు. మెల్లెమెల్లెగా నాన్న మనసు దోచుకున్నాడంటే చాలు అప్పుడు నాన్నను ఒప్పించడం చాలా తేలిక. 


ఈ విషయం మధుకు చెప్పాలి ఎలా అనుకుంటూ ఆనందపారవశ్యంలో మునిగిపోయింది. 


“ అమ్మా .. నేను మా ఫ్రెండ్ వాళ్ళింటికి వెళ్ళివస్తాను, కాస్త లేటవుతుందేమో నువ్వు కంగారుపడకు నాన్నతో చెప్పకేం, ” చెబుతూ తల్లి సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది ప్రియాంక. 


“ఎక్కడికి వెళుతున్నావో చెప్పకుండానే వెళితే ఎలాగే, టిఫిన్ కూడా చెయ్యకుండా ఆ తొందరేంటి?త్వరగా ఇంటికి వచ్చేయ్యి మీ నాన్నకు తెలిసిందంటే నన్ను తిట్టిపోస్తారు, ” ఆమె వెనకనుండి అరుస్తూనే ఉంది. ఆపాటికే కనిపించనంతదూరం వెళ్ళిపోయింది. 


=================================================================================

                                                       ఇంకా వుంది..


=================================================================================


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 




29 views0 comments

Comentarios


bottom of page