#LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #VidhiAdinaVinthaNatakam
, #విధిఆడినవింతనాటకం, #TeluguSerials, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
'Vidhi Adina Vintha Natakam - Part 7' - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 08/10/2024
'విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 7' తెలుగు ధారావాహిక
రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు. డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక. అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది. గతంలో ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్తుంది ప్రియాంక. మధుని ఆఫీసుకు రమ్మంటాడు ఆమె తండ్రి దామోదరం.
మధు, ప్రియాంకల మీద నిఘా పెడతాడు. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు గ్రహిస్తాడు.
మధుని కలవడానికి వెళ్తుంది ప్రియాంక.
ఇక 'విధి ఆడిన వింత నాటకం' ధారావాహిక పార్ట్ 7 చదవండి.
“అబ్బా మధు ఇంట్లోనే ఉన్నావా.. నువ్వు వెళ్ళిపోయావేమోనని కంగారుపడ్డాను, ”
“అరే అదేంటి ప్రియా .. అంత కంగారుపడుతున్నావు, అయినా ఇంత పొద్దుటే వచ్చావు
ఏమైంది.. మీ నాన్నగారికి మన గురించి తెలిసిపోయిందా? చెప్పు ప్రియా, ఇలారా ముందు
ఇదిగో ఈ మంచినీళ్లు తాగు, ” అంటూ ప్రియాంక భుజాలుపట్టుకుని కూర్చోపెడుతూ అడిగాడు మధు.
“అదేంలేదు మధు.. మా నాన్న నీకు నీకు ఒకపరీక్ష పెడుతున్నాడట, అందులో నువ్వు గెలిచావంటే మా కంపెనీ బాధ్యతలు నీకు అప్పచెబుతాడట, అందుకని నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు ఇది మనిద్దరి జీవితాలమీద ఆధారపడి ఉంది, ఇది చెప్పడానికని ఆఘ మేఘాలామీద నీ దగ్గరకు వచ్చాను, మధు బయలుదేరాడానికి సిద్ధంగా ఉన్నట్టున్నావు పద నేను నీతో వస్తాను, ఇంతకు నువ్వు టిఫిన్ చేసావా లేదా, ” తనకు కడుపులో ఆకలివేస్తుంటే అడిగింది మధును. తలకిందకు వంచుకున్నాడు సమాధానం నా దగ్గరలేదన్నట్టు.
“ఏయ్ నిన్నే అడుగుతున్నా చెప్పవేం ఏది ఇలా చూడు, ” మధు చుబుకం పట్టుకుని తలపైకెత్తింది.
“ప్రియా .. నాకు ఉదయం టిఫిన్ చేసే అలవాటులేదు నువ్వు చేసావా, కంపెనీకి లేటవుతుంది కదా టిఫిన్ చేసుకుంటూ కూర్చుంటే అందుకని త్వరగా తయారయ్యాను, అవును నువ్వు మీ కంపెనీకి వస్తున్నావా,” మాట మారుస్తూ అడిగాడు.
“ఏయ్ అబద్దం చెప్పకు నాకు తెలుసులే నువ్వెందుకు టిఫిన్ చెయ్యలేదు, పద పద
మనం బయట హోటల్‌లో టిఫిన్ చేసి వెళదాము, ” అంది అతని కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూస్తూ అంది.
“ప్రియా.. నీకెందుకు నా మీదింత ప్రేమ, ఏముందని నా దగ్గర నన్ను ప్రేమిస్తున్నావో నాకు తెలియడం లేదు, రాజభోగాలు అనుభవించే నీకు ఒక్కపూట కూడా కడుపునిండా
తిండిపెట్టలేని నేను, అసలు దేవుడికి ఎందుకింత పక్షపాత బుద్దో నాకార్ధంకావడంలేదు, ”
బేలగా ప్రియాంకవైపు చూస్తూ అన్నాడు మధు.
“ఏంటి మధు దేవుడిని అంత మాటనేసావు తప్పు కదూ, ” రెండుచెంపలు వాయించుకుంటూ అన్నది.
“మరే అనకుంటే ఏం చేస్తాను చెప్పు? ప్రపంచంలో మనుషులందరిని ఒకే తీరుగా చూడాలి కదా! ఇప్పుడు నన్నే చూడు, పుట్టినప్పటినుండి ఇప్పటివరకు కష్టాలే తప్పా నాకు ఏమి ఇచ్చాడని, ఈ దేశంలో నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, మరి మేమేం తప్పుచేసామని
మమ్మల్ని ఇంత నిర్భాగ్యులుగా పుట్టించాడు, నువ్వు వద్దనుకున్నా డబ్బు కుప్పలు కుప్పలు వచ్చిపడుతుంది, కనీసం అందులో పదవ వంతు మాకిచ్చినా నీలాగే నేను కూడా
దేవుడిని ఒక్కమాటనను, ” భావోద్వేగంతో చెప్పాడు.
“సరే బాబు నువ్వెక్కడికో వెళ్ళిపోయావు గానీ .. నువ్వు నావాడివి అయినప్పుడు నా డబ్బు నీదే కదా మధు, నువ్వేప్పుడు డబ్బులేదని ఎందుకనుకుంటావు ఆ దేవుడే నా రూపకంగా నన్ను నీకు కలిపాడేమోనని ఎందుకనుకోవు, మధు నిన్ను చూసిన మొదటిచూపులోనే నా మనసులో నీ రూపం నిలిచిపోయింది, నీకోసం నా ప్రాణాలైనా వదులుతాను గానీ నిన్ను మాత్రం వదలను, ఇదిగో ఇక్కడ చూడు నా గుండెలో ఏమని కొట్టుకుంటుందో, అందరి గుండెలో లబ్ డబ్ అని కొట్టుకుంటుంటే నా గుండెలో మధు “ఐ ల వ్యు” అని కొట్టుకుంటుంది, ” అంటూ అతని తలను తన గుండెలమీద ఆనించుకుంది.
మధు తమకంగా గుండెచప్పుడుతో పాటు ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వింటూ. ఎత్తైన వక్షస్థలం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఆర్తిగా రెండుచేతులతో బిగించి కౌగిలిలో బంధించాడు.
అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ నుదుటిమీద ముద్దుపెట్టుకుంది ప్రియాంక.
“ఏయ్ ఏమిటి నువ్వు చేస్తున్నపని ఎవరైనా చూస్తారు మధు వదులు, ” అతని కౌగిలి వదలాలని లేకున్నా తప్పు చేస్తామేమోనని భయపడి అంది.
“ప్రియా .. ప్లీజ్ నన్ను కాసేపు నీ కౌగిలిలో ఉండని, నిన్ను వదిలేస్తే నాకు ఎక్కడ దూరమయిపోతావేమోనని భయంగా ఉంది, ” ఇంకా గట్టిగా పట్టుకుంటూ అన్నాడు.
“మధు .. నాకు ..నాకు ఊపిరి సలపడంలేదు వదులు, ” తన శ్వాస అతని ముఖం మీద వదులుతూ అంది.
“సారీ ప్రియా.. తొందరపడ్డాను నువ్వులా చెయ్యకపోతే నేను హద్దుదాటేవాడిని కాను, ”
తలకిందకు వంచుకుని తప్పుచేసాను అన్న భావనతో అన్నాడు.
కిలకిలనవ్వుతూ “ అబ్బాయిగారు మంచి జోరులో ఉన్నారు, నువ్వేం తప్పు చేసావని అలా తలకిందకు దించుకుంటున్నావు, ఎప్పుడైనా నేను నీ దాన్నే నువ్వు ఏం చేసినా అది తప్పుకాదు మధు, కాకపోతే ఈ ముచ్చటలన్నీ పెళ్ళి అయ్యాకయితే బాగుంటాయి, పెళ్లికి ముందు ఇవన్ని చిన్న చిన్నవన్ని మాములేకదా, ” అంది ఇంకా నవ్వుతూనే.
“ఏమో ప్రియా .. అందివచ్చిన అదృష్టాన్ని పొందుతానో లేదోనని భయం, మనం ఎంత తొందరగా పెళ్ళిచేసుకుంటే అంతమంచిది, మీ నాన్న పెట్టే పరీక్షలో నేను నెగ్గాలని నువ్వే నా తరపున ఆ దేవుడికి నోటీసుపెట్టు నీ మాటైతే వింటాడు కాబోలు, ” నవ్వుతూ అన్నాడు.
“అబ్బో లేడికి లేచిందే పరుగన్నట్టు పెళ్లికి తొందరపడుతున్నావన్న మాట, అయితే ఇంకేం నేను తొందరగా మా నాన్నను ఒప్పిస్తాను, నాన్న మధు విరహవేదన తట్టుకోలేకపోతున్నాడు మాకు తొందరగా పెళ్ళి చెయ్యమని మా నాన్నకు కూడా ఓ నోటీసుపెట్టుకుంటాను సరేనా, ” నవ్వుతూ అతని ముక్కును పట్టి ఊపుతూ అడిగింది.
“ఆహా అక్కడికి నేనొక్కడినే విరహవేదన పడుతున్నట్టు, ఏం నీకు మాత్రం లేదు నా
హృదయం మీద వాలిపోవాలని, ఎప్పుడెప్పుడు మన పెళ్ళి అవుతుందా హానిమూన్ కు ఎక్కడి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నావు కదా! నీ వేడి నిట్టూర్పులు వింటుంటే నా కర్ధమైందిలే, ” అన్నాడు తనను ఒడిసిపట్టుకుంటూ.
“అయ్యయ్యో మన లోకంలోపడి టయం చూసుకోలేదు, పద పద నాన్న నీ కోసం ఎదురుచూస్తుంటారు హోటల్‌లో టిఫిన్ చేసి వెళ్ళిపోదాం, ” గబగబా చెప్పులువేసుకుంటూ బయలుదేరారు ఇద్దరు. రెండుకళ్ళు వాళ్ళను గమనిస్తున్నాయన్న సంగతి వాళ్ళకు తెలియదు. బయటకు రాగానే వాళ్ళవెనకాలే ఒక మనిషి వెంబడిస్తున్నాడని. అతను దామోదరం పంపిన మనిషని ఎవ్వరు ఊహించరు.
“అరే మధు ఏంటి ఈ రోజు ఇంతలేటుగా వచ్చావు? ఒంట్లో బాగుండలేదా, లేకా యవ్వనంలో ఉన్నవాడివి కదా ఏమైనా కలలతో రాత్రంతా నిద్రకు దూరమయ్యావా,
ఏమో నీ ముఖం చూస్తుంటే అలా అనిపించింది, ” నవ్వుతూ చమత్కారంగా అన్నాడు.
“అదేం లేదు సార్.. రాత్రి కొంచెం సేపు జనరల్ నాలెడ్జ్ బుక్ చదువుతూ పడుకునే సరికి
బాగా లేటయింది, ఉదయం మెలుకువ రాలేదు అందుకని, ” నసుగుతూ సిగ్గుపడుతూ చెప్పాడు మధు.
ఓర్నీ అబద్దాలు కూడా ఆడుతున్నావా నాకు తెలియదనుకున్నావా నువ్వు ఎందుకు లేటుగా వచ్చావో. ఇక అయిపోయిందిరా నీ బతుకు తెల్లవారిపోతుంది. నిన్ను ఇలానే వదిలేస్తే
రేపో మాపో మా బేబి వచ్చి. నాన్న నువ్వు తాతయ్యవు కాబోతున్నావని చెప్పినా ఆశ్చర్యపోనక్కర లేదు. ఇక జాప్యం చెయ్యకూడదు నా కూతురుకు పట్టిన వీడిని పీడ విరగడ
చెయ్యాల్సిందే అనుకున్నాడు మనసులో గట్టిగా.
“ఏమైందస్సార్ అలా మౌనంగా ఉన్నారు, చెప్పండి నన్నేం పని చెయ్యమంటారు, ”
దామోదరం వైపు చూస్తూ అడిగాడు మధు.
“అదేనయ్యా ఆలోచిస్తున్నాను మన కంపెనీలో షేర్స్ కొనడానికని ఒకతను వస్తా అన్నాడు, ఈపాటికి రావలసింది కానీ అతని వాళ్ళకేదో ఇబ్బంది అయి రాలేకపోతున్నాను
మీ దగ్గర ఎవరైనా నమ్మకస్తుడుంటే పంపించండి అన్నాడు, అదే విషయమై ఆలోచిస్తున్నాను
నిన్ను పంపిస్తే ఎలా ఉంటుందాని, లక్షల్లో డబ్బులు తీసుకరావాలి నీ నుండి అవుతుందా?
నువ్వు నమ్మకంగా తేగలవా అని ఆలోచిస్తున్నాను, ” అన్నాడు క్రీగంటా మధు వైపు చూస్తూ.
“సార్ .. నాకు డబ్బులేకపోవచ్చు గానీ మాటకు మంచితనానికి ప్రాణమిచ్చేవాణ్ణి,
నా మీద మీరు పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేసే మనిషిని కాను, అంత డబ్బు తేవడం
ఒక్కరితో అయ్యే పని కాదు కదా సార్, అందుకని మీకు నమ్మకమైనా ఇంకొకరిని కూడా నాతో పంపండి, జాగ్రత్తగా మీ డబ్బును మీకు అప్పచెప్పే బాధ్యత నాది, ” అన్నాడు. ఓహో
ఇదేనేమో నాకు పరీక్ష పెడుతున్నాడని చెప్పింది ప్రియా. లేకపోతే కొత్తవాడిని అంత డబ్బు
తెమ్మని నన్ను పంపిస్తున్నాడంటే అదే అయ్యుంటుంది. నమ్మకంగా ఆ డబ్బును తెచ్చి ఈయన పెట్టే పరీక్షలో నెగ్గానంటే, తొందరలోనే నేను ప్రియా ఒక్కటైపోవచ్చు మనసులో అనుకుంటూ ముసిముసిగా నవ్వుకున్నాడు మధు.
“ఇదేదో బాగుందయ్యా .. నువ్వన్నట్టుగా మన సారథిని కూడా నీ వెంబడి పంపిస్తాను,
కాస్తా జాగ్రత్త నువ్వేమో కొత్తవాడివి సారథికి అన్ని విషయాలు తెలుసు, అంటే తిమ్మిని బమ్మి .. బమ్మిని తిమ్మి చేసేరకం, అలాగని నన్నింతవరకు మోసం చెయ్యలేదనుకో కాకపోతే మన జాగ్రత్తలో మనముండడం మంచిది, ” జాగ్రత్తలు చెప్పాడు.
“అలాగేనండి.. మీరు ముందుగా చెప్పారు కదా! నా వలన ఎలాంటి పొరబాట్లు జరగకుండా చూసుకుంటాను సార్, సారథిగారు అలాంటి వాడని తెలిసి కూడా మీరు
ఎలా పెట్టుకున్నారు కంపెనీలో, ” ఏదో మాట్లాడాలి అన్నట్టుగా అడిగాడు మధు.
“అబ్బే ఆయన అలాంటివాడని నేనడంలేదు అంత తెలివి కలవాడంటున్నాను, రేపు
ఏదైనా పొరబాటు జరిగిందనుకో అది నీ నెత్తిమీద వేసి తనకేం తెలియదు అని తప్పించుకోగల సమర్థుడు, అందుకే అతన్ని నేను వదులుకోలేకపోతున్నాను, అది సరే
నువ్వు ఒకసారి నీ స్నేహితులందరిని కలిసావా, అదేనయ్యా నీకు మా కంపెనీలో ఉద్యోగం
వచ్చింది కదా, అస్తమానం వాళ్ళతో తిరగడానికి నీకు సమయమేది, అందుకని నువ్వొకసారి నీకిష్టమైన వాళ్ళను కలుసుకునేది ఉంటే కలుసుకో, మళ్ళీ ఇలాంటి
అవకాశాలు రావు కాలేజి లైఫ్ లోనే అన్ని అనుభవించాలి ఏమంటావు, ” వంకరగా నవ్వుతూ అడిగాడు దామోదరం.
“భలేవారు సార్ మీరు.. నేనేదో అజ్ఞాతవాసంలోకి వెళుతున్నట్టు చెబుతున్నారు,
సెలవు దొరికినప్పుడల్లా కలుస్తూనే ఉంటాము కదా సార్, నాకిష్టమైన వాళ్ళు నేను ఇష్టపడేవాళ్ళు మేము అర్థం చేసుకుంటాం, ” సిగ్గుపడుతూ చెప్పాడు తన మనసులో మాట.
అవును నువ్వు ఇష్టపడేవాళ్ళను దూరం చేసుకోవడానికే ఈ ప్రయాణంరా బచ్చా అనుకున్నాడు మనసులో. బజర్ నొక్కాడు సారథి వచ్చాడు.
“పిలిచారా సార్.. మీరేదో పని మీద అర్జంటుగా ఎక్కడకో వెళ్ళాలన్నారు, ”
“అవునయ్యా సారథి.. ఇదిగో చాకులాంటి కుర్రాడు దొరికాడు మనకు, మా బేబికి బాగా తెలిసినవాడని మన కంపెనీలో ఉద్యోగం ఇచ్చాను, నీకు తోడుగా ఇతన్ని తీసుకపో జాగ్రత్త
సుమా ఇతనితో, ఎందుకంటే కుర్రాడు కదా వదిలేస్తే కోట్లకు అధిపతి అయిపోగలడు, ” నవ్వుతూ మధువైపు చూస్తూ ద్వందార్థం వచ్చేలా అన్నాడు.
“నాకు తెలుసుకదండి మీరు మెచ్చారంటే ఎంతచిన్నవాడైనా పైకి పోవల్సిందే, అదే అదే
పైకి రావల్సిందే అంటున్నాను, ” నాలుక కరుచుకుంటూ అన్నాడు.
పాపం ఇలాంటి గూఢార్థపు మాటలు తెలియని మధు తనను మెచ్చుకుంటున్నారని సంతోషంతో ఉన్నాడు. పైకి పోవడమంటే జీవితంలో పైకి రావడమనుకున్నాడు. ఏ గడియలో
ప్రియను కలిసానో గాని నాకు అదృష్టం వరించింది అడక్కుండానే ఆస్తి అందమైన అమ్మాయి ఇంతకన్నా నాకేం కావాలి లోలోన ఊహించుకోసాగాడు.
మధు కనిపించడంలేదు నాలుగురోజులవుతుంది ఎటు వెళ్ళాడో ఏమో. నవీన్ ను అడిగితే నాకు తెలియదంటున్నాడు ఏమయిపోయాడబ్బా ఈ మనిషి. పోనీ నాన్నకేమన్న తెలుసేమో నాన్నను అడిగితే. అమ్మో మధు గురించి నీవెందుకు టెన్షన్ పడుతున్నావంటాడేమో. అసలీ మధు ఎక్కడికి పోయినట్టు ఒకవేళ ఒంట్లో బాగాలేక
ఎక్కడన్నా హాస్పిటల్ లో ఉన్నాడా? హాస్పిటల్ లో ఉంటే నవీన్ కు తెలియకుండా ఉంటుందా. మనసంతా పరిపరివిధాలా ఆలోచిస్తుంది గానీ మధు ఎక్కడున్నది తెలియడంలేదు.
“బేబి .. ఏంటి మధు కంపెనీకి రావడంలేదు? ఏమైనా చెప్పాడా నీకు, అంటే అదేనమ్మా
మన కంపెనీ నచ్చలేదా లేకా మనమిచ్చే జీతం సరిపోదనుకున్నాడా, అందుకే చెబుతాను తల్లి ఎవరిని పడితే వాళ్ళను మన కంపెనీలో తీసుకోను, నువ్వు నమ్మకంగా చెప్పావు
కాబట్టి నీ మనసు చిన్నపోవద్దని ఉద్యోగం ఇచ్చాను, కనీసం మాటవరసకైనా నీతోనన్నా
చెప్పాలి అవునా కాదా, ” కూతురు ముఖకవళికలను గమనిస్తూ అడిగాడు.
ప్రియంకకు అంతా ఆయోమయంగా ఉంది తండ్రి చెప్పే మాటలు వింటుంటే. అంటే మధు
కంపెనీకి రావడం లేదా? నాన్నకు కూడా తెలియదన్న మాట. తొందరపడ్డావు మధు
నీకు ఇంతకంటే మంచి ఉద్యోగం ఎక్కడదొరుకుతుందనుకున్నావు. నీకు నచ్చకపోతే
నాతో ఒక్కమాటనన్నా చెప్పాలి కదా! నేను నాన్నకు చెప్పేదాన్ని. అయినా నీకిచ్చే
జీతం పేరుకేగానీ రేపు ఈ ఆస్తింతా నీకు చెందదా. మా నాన్నకు మోసం చేసే వాళ్ళంటే
ఎంతకోపమో తెలుసా? జన్మలో వాళ్ళను క్షమించడు. ఎంతపొరబాటు చేసావు మధు.
“అదేం అయ్యుండదు నాన్న.. ఒంట్లో ఏమైనా బాగుండలేదేమో, నేనొకసారి వాళ్ళ స్నేహితుడిని కనుక్కుంటాను ఎన్ని రోజులనుండి రావడంలేదు, ” గుండెనిండా గుబులుతో
కదిలిస్తే కడలిలా ఉప్పొంగడానికి సిద్ధంగా ఉంది ప్రియాంక మనసు.
“పదిరోజులకు పైనే అయిందనుకుంటాను బేబి, నేను అదే అనుకున్నాను ఒంట్లో బాగుండలేదేమో? కనీసం చెబితేనన్నా డబ్బులిచ్చేవాడిని అనుకున్నాను, సరే నీకేమైనా చెప్పాడేమోనని నిన్ను అడుగుతున్నాను బేబి, ” బాదపడుతున్నట్టుగా ముఖం పెట్టాడు. ఇంకెక్కడి మధు వాడెప్పుడో ప్చ్ పైకి వెళ్ళిపోయాడు బేబి. నీకు వీలైనంత తొందరలో పెళ్ళిచేసి నీ మనసునుండి శాశ్వతంగా వాడిని దూరం చేస్తేగానీ నా మనసు కుదుటపడదు. వాడికోసమని నువ్విలా బాధపడుతూ కూర్చుంటే నేను తట్టుకోలేను.
“నాన్నా.. నాకెందుకో భయంగా ఉంది మధుకు ఏమైనా జరిగిందేమోనని, తనకు తనవాళ్ళంటూ ఎవరులేరు నాన్న, నాన్న మన కంపెనీలో ఎవరితోనైనా చెప్పాడేమో
కనుక్కున్నారా, పోనీ పోలీసు కంప్లయింట్ ఇద్దామా ఎక్కడున్నాడో తెలుస్తుంది, ” బాధతో
అడిగింది ప్రియాంక.
“బేబి .. నువ్వెందుకమ్మా అతని గురించి కంగారుపడుతున్నావు? నాకు తెలుసు కదమ్మా
ఇలాంటివాళ్ళు ఓపికగా ఎక్కడ పని చెయ్యరు, డబ్బులు చేతిలో కనపడితే చాలు అడ్డదారులు తొక్కుతారు, ఇలాంటివాళ్ళను పోలీసులకు పట్టించి కటకటాల్లో జీవితాంతం
శిక్ష పడేలా చెయ్యాలి, ” కోపంతో ఊగిపోతూ అన్నాడు.
“నాన్న .. ఏంటి మీరనేది అంటే మధు మీ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళాడా? ఎందుకోసం తీసుకున్నాడు అంత అవసరమేమోచ్చిందట, అసలు డబ్బెందుకు తీసుకున్నాడో చెప్పాడా, ” తండ్రి చెప్పిన మాటలకు మధు చేసిన పనికి చాలా కోపంగా
ఉంది ప్రియాంక. నాకు తెలియని ఖర్చులేముంటాయి తనకు ఒక్కపైసా ఖర్చుపెట్టడానికి ఎంతో బాధపడే మధు ఇలా చేసాడంటే నమ్మలేకపోతుంది ప్రియాంక.
“చూడు తల్లి.. అతను నీవలన వచ్చినవాడు, అతని అవసరాలు ఏముంటాయో నాకేం తెలుసు బేబి, ఏం లేదమ్మా మనకు తెలిసిన వాళ్ళు మన కంపెనీలో షేర్స్ పెట్టడానికి వస్తామన్నారు, ఏదో వాళ్ళకు ఇబ్బంది కలిగిరాలేకపోతున్నాము మీకు నమ్మకం ఉన్నవాళ్లను పంపిస్తే అర్జంటుగా డబ్బులు పంపుతాముఅన్నారు, అందుకని మన సారథిని .. మధును వెళ్ళమన్నాను, మధుకు ఏం బుద్దిపుట్టిందో ఏమో కానీ మన సారథిని నెత్తిమీద కర్రతో కొట్టి ఆ డబ్బుతో పరారయ్యాడట, అతను పుట్టి బుద్దేరిగినప్పటినుండి అంత
డబ్బు ముఖం చూసుండడు, అందులో బికారి వెధవ కదా తట్టుకోలేకపోయాడమ్మా,
సామెత ఊరకే పుట్టలేదు బేబి కుక్కను కనకపు సింహ్మాసనంలో కూర్చోబెట్టిన దాని బుద్ది మారదని, ” చెప్పడం ఆపి ప్రియాంక వైపు చూసాడు. తను చెప్పేది నమ్ముతుందా లేదా అని గమనిస్తూ. తండ్రి చెప్పే మాటలకు నోరు తెరచి అలానే చూస్తుండిపోయింది ప్రియాంక.
“నాన్న .. మధు ఇంత నీచానికి దిగుతాడని నేనుకోలేదు, నన్ను ఎంత నమ్మించాడు
అంటే అదంతా నటననేనా, మధు నన్ను నిజంగా ప్రేమించలేదా ? నా వెనకాల ఉన్న డబ్బు కోసమే ఇదంతా చేసాడా, లేదు నాన్న .. నేను నమ్మలేకపోతున్నాను తను డబ్బుకోసం ఆశపడే మనిషి కాదు, ఇదంతా ఎవరో కావాలని చేసారనిపిస్తుంది నాకు, నాన్న మనం ఒకసారి పోలీసు రిపోర్టు ఇద్దాం దొంగ దొరికితే సరే, లేదంటే మధు నిజస్వరూపం బయటపడి జైల్లో కూర్చుంటాడు, ” అంది. మధు ఈ పని చేసాడంటే తన మనసు ఒప్పుకోవడం లేదు మధు ఎలాంటి వాడో తనకు బాగా తెలుసు. ఇది కావాలనే ఎవరో కుట్ర పన్నారు దేనికోసం ఇలా చేసారో ఎంత ఆలోచించినా అర్థం కావడంలేదు ప్రియాంకకు.
“బేబి .. ఏమిటి నువ్వంటున్నది? మధు నిన్ను ప్రేమించడమేంటి, నువ్వు కూడా అతన్ని ప్రేమించావా ? అంతఃపుర మహారాణిలాంటి నువ్వెక్కడ ? కటిక దరిద్రుడైనా ఆ మధును
ప్రేమించావా నమ్మలేకపోతున్నాను బేబి, నేను విన్నది నిజం కాదని చెప్పు బేబి, ” అంటూ
గుండెమీద చేతితో రాసుకుంటూ కుర్చీలో కూలబడిపోయాడు ఓరకంట కూతురిని గమనిస్తూ.
=================================================================================
ఇంకా వుంది..
=================================================================================
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Comentários