top of page
Writer's pictureLakshmi Sarma B

విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 8

#LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #VidhiAdinaVinthaNatakam

, #విధిఆడినవింతనాటకం, #TeluguSerials, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


'Vidhi Adina Vintha Natakam - Part 8' - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 14/10/2024

'విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 8తెలుగు ధారావాహిక

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్




 

 జరిగిన కథ:


కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు. డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక. అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది. గతంలో ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్తుంది ప్రియాంక. మధుని ఆఫీసుకు రమ్మంటాడు ఆమె తండ్రి దామోదరం. 


మధు, ప్రియాంకల మీద నిఘా పెడతాడు. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు గ్రహిస్తాడు. 


మధు తన డబ్బుతో పారిపోయినట్లు చెబుతాడు దామోదరం. 

తాను మధును ప్రేమిస్తున్న విషయం బయటపెడుతుంది ప్రియాంక. 

గుండెపోటు వచ్చినట్లు నటిస్తాడు దామోదరం. 


ఇక 'విధి ఆడిన వింత నాటకం' ధారావాహిక పార్ట్ 8 చదవండి. 


“అయ్యో అయ్యో.. ఏమైందండీ అలా పడిపోయారు, గుండెనొప్పి వస్తుందా? ప్రియా.. డాక్టరుకు ఫోన్ చెయ్యవే, అలా గుడ్లప్పగించి చూస్తున్నావెందుకు, ” కంగారుపడుతూ భర్త చాతిమీద చేతితో రుద్దుతూ చెప్పింది శారద. 


 పరుగున ల్యాండ్ ఫోన్ దగ్గరకు వెళ్ళి డాక్టర్ కు ఫోన్ చేసి చెప్పింది. మంచినీళ్లు తెచ్చి తండ్రికి తాగిస్తూ కళ్ళవెంబడి కన్నీళ్లు కార్చసాగింది. 


“ ఏమిటే ఏమైంది మీ తండ్రి కూతుర్లిద్దరు ఏమైనా గొడవపడినారా? ఆయన ఎందుకు అంత గట్టిగా అరిచారు చెప్పవే ఏమైందసలు, ” ఏడుపు గొంతుతో భర్త వైపు కూతురివైపు చూస్తూ అడిగింది. ఆమెకు అంతా ఆయోమయంగా ఉంది. కూతురంటే పంచప్రాణాలు ఆయనకు. ఒక్కనాడు పల్లెత్తు మాట అనని మనిషి ప్రియ మీద గట్టిగా అరిచాడంటే ఏదో జరిగింది వీళ్ళిద్దరి మధ్యన అనుకుంది శారద అంత బాధలోను. 


“ఏం లేదమ్మా నువ్వూరకే కంగారుపడకు డాక్టర్ వస్తున్నాడు, కాస్త నాన్నకు గాలి రానివ్వు, ” అంది తల్లిని విసుక్కుంటూ. ప్రియాంకకు మనసులో భయంగానే ఉంది నాన్నకు ఏమైందోనని. ‘తొందరలో నోరుజారను నాన్న తట్టుకోలేక పోయారు’ బాధపడుతూ అనుకోసాగింది. 


“ఏమిటోయ్ దామోదరం .. ఏమైంది ఇలా చూడు, ” డాక్టరు పిలుస్తూ స్టెతస్కోప్ చాతి మీద పెట్టి చూస్తున్నాడు. డాక్టరును చూసి మెల్లిగా ఎవరు చూడకుండా కన్ను గీటాడు దామోదరం. ఓహో ఇదంతా నాటకమా అనుకుంటూ పరీక్ష చేస్తున్నాడు దామోదరాన్నీ. 


“అంకుల్‌ నాన్నకు ఏమైంది ఎలా ఉన్నాడు .. హార్ట్ ఎటాక్ కాదుకదా, నాకు భయంగా ఉంది ఏదైనా పెద్ద హాస్పిటల్ కు తీసుకపోదామా, ” భయపడుతూనే అడిగింది డాక్టర్ ను. 


“బేబి .. కంగారుపడవలసిందేమి లేదు కాకపోతే వీడి మనసుకేదో గట్టిగా తగిలింది, ఏదైనా కంపెనీ వ్యవహారమా లేక ఇంటిలో ఏదైనా ప్రాబ్లమా, ” ప్రియాంక వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు. దామోదరానికి డాక్టర్ కృష్ణమూర్తికి చాలా దగ్గరి స్నేహం. ఏ విషయమైనా ఇద్దరు ప్రతి రోజు మాట్లాడుకోవలసిందే. 


“అదేం లేదంకుల్ .. నాన్న నాతో మాట్లాడుతూనే ఇలా పడిపోయారు, ” అంది తన విషయం చెప్పడం ఇష్టంలేక. 


“కాదండి .. నేను వంటచేస్తున్నాను వీళ్ళిద్దరు ఏదో విషయమై మాట్లాడుకుంటున్నారు, అంతలోనే ఏమైందో ఏమో గట్టిగట్టిగా అరుస్తూ కుర్చీలో కూలబడిపోయారు, ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయారు నాకు భయంగా ఉంది అన్నయ్యా, ” చెబుతూ ఏడవసాగింది. 


“అమ్మా .. నిన్ను ఊరుకోమన్నానా, ” తల్లివైపు కోపంగా చూస్తూ అన్నది. 


“ పరవాలేదు బేబి ఆమె బాధ ఆమె చెప్పుకోని నేనేం పరాయివాడినా, ఒరేయ్ దామోదరం, ఇదిగో ఈ మాత్ర వేసుకో, ” అంటూ లేపి కూర్చోబెట్టి బ్యాగులో నుండి ఏదో మాత్రతీసిచ్చాడు. 


 మెల్లెగా కళ్ళుతెరిచి మాత్ర వేసుకుని కృష్ణమూర్తి వైపు చూస్తూ. “ కృష్ణా .. ఏంటిరా నాకేమైంది? నువ్వెందుకొచ్చావు, ” అప్పుడే నిద్రనుండి లేచినట్టుగా కళ్ళు నులుముకుంటూ అడిగాడు దామోదరం. 


“అబ్బే ఏం లేదురా ఇటు వైపు పనుండి వచ్చాను, ఎలాగు ఇంతదూరం వచ్చాను కదా నిన్ను చూసిపోదామని మీ ఇంటికి వచ్చాను అంతే, ” అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ. 


“ఏమిటో నాకు తల తిరిగినట్టయి ఇలా పడుకుండిపోయాను, ఆ శారద అలా నిలుచుండి చూస్తున్నావు మాకు కాఫీ ఇచ్చేది ఉన్నాదా లేదా, ” అడుగుతూ చాతిమీద రుద్దుకోసాగాడు దామోదరం. 


“ఇప్పుడు కాఫీలు ఎందుకుగానీ నువ్వొకసారి హాస్పిటల్ కు వచ్చి అన్ని టెస్టులు చేయించుకోవలసి వస్తుంది, బేబి మీ నాన్న ఒట్టి చాదస్తపు మనిషి వాడికి డబ్బు సంపాదించడం తప్పా ఒంటిమీద ధ్యాసే ఉండదు, మీ నాన్నను రేపు హాస్పిటల్ కు తీసుకునిరా అన్ని టెస్టులు చేద్దాం ఎందుకైనా మంచిది, ” దామోదరం తోడ మీద కొడుతూ ప్రియాంకకు సైగ చేసాడు మీ నాన్నకు ఈ విషయం చెప్పొద్దని. 


“అలాగే అంకుల్‌ నాన్నను నేను తీసుకవస్తాను, ” అంటూ లోపలకు వెళ్లింది తల్లితో చెప్పడానికని. ఈ లోపల కృష్ణమూర్తితో “ ఎలా ఉందిరా నా నాటకం, ” అంటూ తనకు ప్రియాంకకు జరిగిన విషయం చెప్పాడు చిన్నగా. 


“ఓర్నీ అసాధ్యం కూలా పాపం ఎంత భయపెట్టావురా వాళ్ళని, పాపం చెల్లెమ్మ అయితే బోరుమని ఏడుస్తూ కూర్చుంది నేనొచ్చేవరకు, ” ఇంతలో శారద కాఫీ కప్పులతో వచ్చింది. 


“శారద .. ఇప్పుడు మీ ఆయనను చూసావా ఎంత ఉత్సాహంగా ఉన్నాడో, 

నువ్వు అనవసరంగా హడావుడి పడ్డావు వాడికేం కాదు నేను చెప్పానా, ” మాట మారుస్తూ అన్నాడు కృష్ణమూర్తి. 


“ఏమో అన్నయ్యా.. నాకు ఈయనను చూస్తుంటే భయంగా ఉంది, తన శరీరం గురించి పట్టించుకోడు ఎంతసేపు వ్యాపారం మీదనే ప్రేమ తప్పితే, ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. ఏం మనిషో ఏంటో ఎంత చెప్పినా చెవికెక్కుంచుకోడు, పైగా నీకు చదువు సంధ్యలు లేవు, నీకేం తెలియదని నన్ను దబాయిస్తాడు, ఇదిగో ఆయనకు తగ్గ కూతురు ఈవిడగారు ఇద్దరు ఏవో గూడు పుఠాణిలు చేస్తుంటారు, నావరకు ఏవి తెలియనివ్వరు నన్ను గంజిలో ఈగలాగా తీసిపారేస్తారన్నయ్యా, ” బాధపడుతూనే ఇద్దరిని నిష్టూరమాడింది. 


“అమ్మా.. ఇప్పుడవన్నీ మాట్లాడుకునే సమయమా చెప్పు? అంకుల్‌ ఆమె అలాగే అంటుంది మీరేమి పట్టించుకోకండి, రేపు నాన్నను తీసుకుని హాస్పిటల్ కు వస్తాను, ” తల్లిని కోప్పడుతూ డాక్టర్ కు చెప్పింది. 


“ఏంటి బేబి .. హాస్పిటల్ అంటున్నావు నాకేమయింది నేను బాగానే ఉన్నాను కదా! రేపు నాకు అర్జంటు మీటింగులున్నాయి నేనెక్కడకు రాలేను, ” నీరసం నిండిన గొంతుతో చెప్పాడు దామోదరం. 


“అదిగో నేను చెప్పానా అన్నయ్యా .. ఈయన ఇలానే మాట్లాడుతారని, ” చివాలున లేచి కోపంగా భర్తవైపు చూస్తూ చెప్పింది శారద. 


“శారద.. ఇప్పుడు నాకేమైందని నువ్వంత కోపానికి వస్తున్నావు, కాస్త తూలినట్టయింది అంతే కదా.. దానికే ఇంత హంగామా చేస్తే ఎలా, బేబిని అడుగు నాకేం కాలేదు నీకు తెలుసు కదా బేబి, ” కూతురిని గమనిస్తూ అడిగాడు దామోదరం. 


“ఆ అది అది ..అవును అమ్మా నాన్నకేం కాలేదు, నువ్వు చెబితేనే నేను డాక్టరంకుల్ కు ఫోన్ చేసాను అంతే, ” తడబడతూ చెప్పింది. 


“అది సరేలేవోయ్ .. మా చెల్లమ్మా అంత కంగారుపడుతుంది, ఆమె కోసమన్నా నువ్వొకసారి హాస్పిటల్ కు వచ్చి చెకప్ చేయించుకుంటే మంచిది, ఏం నువ్వేం పదహారేళ్ళ పడుచుకుర్రాడిని అనుకుంటాన్నావా ఏంటి? అరవై దాటాయి తెలుసా నీకు, ” కళ్ళెగరేస్తూ అడిగాడు కృష్ణమూర్తి. 


“ఆ తెలుసులేవోయ్.. నువ్వు మాత్రం నాకంటే రెండేళ్ళు పెద్ద అది గుర్తుందా తమరికి, ” వస్తున్న నవ్వునాపుకుంటూ అడిగాడు దామోదరం. 


“సర్లెండి మీ సంబడం రేపు మీరు హాస్పిటల్ కు వెళుతున్నారు అంతే, ” అంది కచ్చితంగా. 


****** ******* ******** ******* *****

ఆ రాత్రంతా కంటిమీద కునుకులేదు ప్రియాంకకు. కళ్ళుమూసినా కళ్ళుతెరిచినా మధు రూపమే కళ్ళముందు కనపడి మాయమౌతుంది. మధు ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న చెప్పింది నిజం కాదని నాకు తెలుసు. నీ మీద ఎవరు కావాలని ఈ నిందమోపారు నువ్వు ధైర్యంగా నాన్న ముందుకు వచ్చి నిజం చెబితే బాగుండేది. అవమానం భరించుకోలేక ఎక్కడ దాక్కున్నావు నిన్నెక్కడని వెతకను. ఒకవేళ నువ్వు నిజంగానే డబ్బు తీసుకుని పారిపోయావా. నీకు అంతగా కావాలంటే నేను ఇచ్చేదాన్ని కదా మధు. అయినా ఇంకెంత కాలం కొన్ని రోజులలో మన పెళ్ళి జరిగిపోతే ఇంత ఆస్తి నీ చేతిలోకి వచ్చేది. ఇంతలోనే నువ్వెందుకు తొందరపడ్డావో నాకు తెలియడంలేదు. నిన్ను చూడకుండా నువ్వు కనపడకపోతే నాకు పిచ్చెక్కినట్టుగా ఉంది. నాకోసమైనా రా మధు నిన్ను ఏమి అనకుండా నేను చూసుకుంటాను. మనసులో పరి పరి విధాల ఆలోచిస్తూ కంటికిమంటికి ధారాగా

ఏడుస్తూనే ఉంది. కళ్ళు ఉబ్బిపోయి ఎర్రగా అయ్యాయి. 


“రారా దామోదరం.. బేబి మొత్తానికి మీ నాన్న పెంకి ఘటాన్ని హాస్పిటల్ కు తీసుకవచ్చావు, నువ్వు ఇలా కూర్చో బేబి మీ నాన్నకు టెస్టులు చేస్తాను, ” చెబుతూ దామోదరాన్ని లోపలకు తీసుకవెళ్ళాడు. 


“ఓరేయ్ పూల్ ఇప్పుడు చెప్పరా ఎందుకంత నటన చేసావో, అబ్బా బేబి ఫోన్ లో చెప్పినదానికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నీకు నిజంగానే స్ర్టోక్ వచ్చిందేమోనని హాడలి చచ్చాననుకో, ” కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. 


“ఏం చెయ్యను చెప్పు మా బేబి చేసిన పనికి నాకు ఊపిరాడనట్టయిందంటే నమ్ము, నీకు తెలుసు కదరా నేను డబ్బుకు విలువిస్తానని, పేదవారంటే నాకు ముందునుండే అసహ్యం అలాంటిది ఏకంగా ఒక బికారివాణ్ణి తెచ్చి ప్రేమిస్తున్నానని అంటుందా? నేను అహర్నిశలు కష్టపడేది ఎవరికోసం తన కోసం కాదు, తను జీవితంలో కష్టమంటే ఏంటో ఎరగకుండా ఉండాలనే కదా నా తాపత్రయమంతా, దిక్కుమొక్కులేని వాడిని తీసుకవచ్చి నా స్థాయిలో నిలబెడతానంటే నేనూరుకుంటానా, అందుకే చిన్న జలక్ ఇచ్చాను ఇక భయపడి వాడి పేరు నా ముందు ఎత్తదు, ” పకపకానవ్వుతూ చెప్పాడు. 


“ఛ ఛ ఇదేం గుణం ప్రియకు.. తను ఊ అనాలే కానీ కో అంటే కోటి మంది కోటీశ్వరులు అందగాళ్ళు తన ముందు వాలిపోరు, అయినా పెళ్ళి చేసుకుంటానంటే నువ్వు చెయ్యవు..? పేగులు లెక్కపెట్టే రకానివి కనుక తొందరలోనే తెలుసుకున్నావు, నాలాంటి వాడైతే వాళ్ళు పెళ్ళిచేసుకుని నా ముందు నిలబడేవరకు నేను తెలుసుకోలేకపోయే వాడిని” అన్నాడు కృష్ణమూర్తి. 


“నిజమే నేను తొందరపడకపోతే నువ్వన్నట్టుగా ఏ గుళ్ళోనో పెళ్ళి చేసుకుని నా ముందునిలుచునే వాళ్ళు, ఇదంతా డబ్బుమీది వ్యామోహంతో మన బేబిని ప్రేమించానని నాటకం ఆడుతున్నాడు, ఉత్త పుణ్యానికి కోట్లకు వారసుడు అయిపోవచ్చని పథకం వేసాడు, పాపం పిచ్చి తల్లి నమ్మేసింది వాణ్ణి ఇప్పుడు నేనాడిన నాటకాని భయపడిపోయిందిలే, ఇక ఆలస్యం చెయ్యకుండా పెళ్ళి ప్రయత్నాలు చేసి తొందరలోనే పెళ్ళి చేసేస్తాను, ” అంటూ మధు విషయంలో తనేం చేసింది చెప్పాడు. 


“తొందరపడకు దామోదరం.. ఎందుకంటే ఇదంతా నువ్వు కావాలనే చేసావనే అనుమానం వస్తుంది, అందుకని కొన్నాళ్ళు ఆగి తనను ఏదో ఒక వ్యాపకంలో పడేటట్టు చెయ్యి, మెల్లె మెల్లెగా తన మనసు మార్చే ప్రయత్నం చెయ్యి, ” సలహా ఇచ్చాడు కృష్ణమూర్తి. 


“అది సరే నేనెలాగు వచ్చాను ఏవో కొన్ని టెస్టులు రాసివ్వు, వట్టి చేతులతో బయటకు వెళితే బేబికి అనుమానం రావచ్చు, ” అడిగాడు. 


“ నిజమే నువ్వన్నది.. ఎలాగు చాలా రోజులువుతుంది నువ్వు జనరల్ చెకప్ చేయించుకుని, ఇది ఒకందుకు మంచిదేలే రా ఇలా పడుకో, ” అంటూ దామోదరాన్ని పరీక్ష 

చేసి కొన్ని టెస్టులు రాసిచ్చాడు. 


“అంకుల్‌ .. నాన్నకు టెస్టులన్నీ చేసారా భయపడేదేమి లేదుకదా, నాన్న ఇప్పుడెలా ఉంది పరవాలేదా, ” ఆత్రుతగా తండ్రి చేతిని పట్టుకుని అడిగింది ప్రియాంక. 


“బేబి .. మనం భయపడాల్సిందేమి లేదమ్మా.. ఏదో కాస్త కళ్ళు తిరిగినట్టయింది, అంతే తప్పా ఏమి లేదు వాడు ఉక్కు మనిషమ్మా వాడికేం కాదు, ” దామోదరం వంక చూస్తూ అన్నాడు. అవునన్నట్టుగా తల ఊపాడు దామోదరం. 


“అమ్మయ్యా.. ఇప్పుడు హాయిగా ఉందంకుల్, నిన్నంతా నిద్రపోలేదు నాన్నకేమయిందోనని ఒకటే భయం, ” అంది. తన ముఖం చూస్తే ఎక్కడ గమనిస్తాడోనని అబద్దం చెప్పింది. 


రోజులు గడుస్తున్నాయి మధు జాడ ఎంత ప్రయత్నం చేసినా దొరకడంలేదు. తెలిసిన వాళ్ళందరిని అడిగింది ఎక్కడెక్కడో వెతికింది ఎవ్వరి దగ్గరనుండి కూడా మధు జాడను కనిపెట్టలేకపోయింది. రోజురోజుకు తనలో తానే కుమిలిపోతూ కృషిస్తుంది. దేనిమీద చిత్తం పెట్టలేకపోయింది తల్లి బలవంతం చేస్తే రెండుముద్దలు తిన్నాననిపిస్తుంది. ఎప్పుడు పరధ్యానంగా తనలో తానే మదనపడుతుంది. శారదకు ఏమి అర్థంకాక కూతురెందుకు ఇలా అయిపోతుందోనని తనకు తెలిసిన బాబాలను పిలిపించి తాయెత్తులు కట్టించింది. పురోహితులను పిలిపించి జపాలు హోమాలు చేయించింది. ఆమె పిచ్చి కాకపోతే రోగమొకటైతే మందొకటి అన్నట్టుగా ఉంది ఆమె పని. 


“ఏమండి .. అమ్మాయిని చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది, ఏ గాలి సోకిందోగాని పిల్ల రోజురోజుకు క్షీణించిపోతుంది, పట్నం తీసుకపోదామండి పెద్ద డాక్టర్‌కు చూపెడదాము, మీకెంత సేపు మీ కంపెనీ భాగోతాలేనా పిల్ల గురించి పట్టించుకునేది ఉందాలేదా, ” మొదలు మర్యాదగా మాట్లాడింది కానీ అతను విననట్టు ఉండేసరికి కోపం తారాస్తాయికి పెంచింది. 


“ఏమిటి శారద.. అమ్మాయికేమైంది బాగానే ఉంది కదా! ఓ అదా బేబి కాలేజి మానేసింది. ఇంట్లో బోరుగా ఉందేమో, ఒకపని చేస్తాను రేపటినుండి నాతోపాటుగా మన కంపెనీకి తీసుకవెళతాను, పని ధ్యాసలోపడితే అన్ని మరిచిపోతుంది ఏమంటావు, ” తినడం పూర్తిచేసి చెయ్యి కడుగుకుంటూ అన్నాడు. 


“ఏడిసినట్టుంది మీరు చెప్పేది.. అరే పిల్ల చిక్కిపోతుంది అంటుంటే మీరేమో కంపెనీకి తీసుకవెళతానంటారు, అసలు మీకు మీ కంపెనీ తప్పా భార్య పిల్లలగురించి పట్టించుకోరా, ” గయ్యిమని లేచింది భర్తమీదకు. 


“పిచ్చిదానా .. నేను పట్టించుకోకపోవడమేంటి ? నేను బేబితో మాట్లాడాను, తనకు ఇంట్లో ఉంటే ఏమి తోచడం లేదట అందుకని నాతో వస్తాను అంది, ” శారద నీకేం తెలియదు నువ్వు వట్టి వెర్రిమాలోకం. బేబి మనసు ఇక్కడలేదు కనపడకుండాపోయిన వాడికోసం ఆరాటపడుతుంది. వాడెలాగు రాడు ఎన్నిరోజులు వాడి గురించి ఆలోచిస్తుంది. అందుకే మెల్లెగా తన మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నాను అనుకున్నాడు మనసులో. 


“అంతేనంటారా ఏమో నాకేదో భయంగా అనిపిస్తుంది అమ్మాయిని చూస్తుంటే, ” నసుగుతూ అంది శారద. 


“నీదంతా చాదస్తం అనుమానం అన్నీ భూతద్దంలోనుండి చూస్తావు, చూడు శారద బేబిని విసిగించకు తనకు ఎప్పుడు ఏది కావాలనిపిస్తే అది చేస్తుంది తనేం చిన్న పిల్లకాదు, నువ్వనవసరంగా బేబిని ఇబ్బంది పెట్టకు అర్థమైందా, ” కొంచెం కఠినంగా చెబుతూ పడుకోవడానికి వెళ్ళిపోయాడు. 


శారద దామోదరం చేతిలోకి వచ్చాక అమాయకురాలిలా మారిపోయిందే తప్పా తను అమాయకురాలేం కాదు. దామోదరంకు ఎదురు చెప్పలేక అన్ని గమనిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆమె ఆదే ఆలోచనలో ఉంది. ప్రియాంక విషయంలో ఏదో జరిగింది అందుకే తండ్రి కూతుర్లు గట్టిగా అరుచుకున్నారు. నాకు తెలియనివ్వకుండా ఏదో గూడుపుఠానిచేస్తున్నారు. ఆడదాని మనసు మరో ఆడదానికే అర్థం అవుతుంది అంటారు. ఆ మాత్రం అర్థంచేసుకోలేని వెర్రిదాన్ని కాదు. మధు ..అవును మధు ఈ ఇంటికి వచ్చినప్పటినుండి ఏదో జరుగుతుంది. ఒకవేళ ప్రియ మధును ప్రేమించిందా? అమ్మో ఇంకా ఏమైనా ఉందా ? ఈయనగారు ఒప్పుకునే రకమా ! ఒకవేళ అదే గనుక అయ్యింటే

అబ్బాయికి భూమి మీదనూకలు చెల్లినట్లే. తన చేతులకు మట్టంటకుండా మనిషిని తప్పిస్తాడు తన భర్త. నాకెందుకో అనుమానంగా ఉంది సరే కానీ చూద్దాం అనుకుంది మనసులో. 


“బేబి త్వరగా తయారవు కంపెనీకి వెళదాము, ” టిఫిన్ చేస్తున్న కూతురు దగ్గరకు వచ్చి చెప్పాడు దామోదరం. 


“అబ్బా కొంచెం ఆగండి.. అదే కోడి గెలికినట్టు రెండు ముద్దలు తిన్నదో లేదో తొందరపెడుతున్నారు, వెళుదురుగానీ ఏం కొంపలంటుకుపోవు, ” అంది విసుక్కుంటూ. 


“తింటున్నాను కదమ్మా అనవసరంగా నాన్నను ఎందుకంటావు, ” జీవంలేని నవ్వు నవ్వుతూ అంది. 


“అలా పెట్టమ్మా మీ అమ్మకు గడ్డి, ” శారదవైపు చూస్తూ అన్నాడు. 


“అబ్బబ్బా మీ ఇద్దరు కలిసారంటే నామీదనే ఆడిపోసుకుంటారు, మీ ఇష్టమున్నట్టుచేసుకోండి నాదేంపోతుంది, ” అంటూ అక్కడనుండి వెళ్ళిపోయింది. ఇద్దరు నవ్వుకున్నారు. 


“నాన్న .. మధు గురించి ఏమైనా తెలిసిందా? పోలీసు రిపోర్టు ఇచ్చారా, ” కంపెనీ నుండి ఇంటికి వస్తున్నప్పుడు అడిగింది తండ్రిని. 


ఇదేంటి ఇప్పటివరకు బాగానే ఉంది ఉన్నట్టుండి మళ్ళి మధు గురించి అడుగుతుందేమిటి. 

“అదేం లేదు బేబి .. డబ్బులే కదా పోతే పోనీలే అనుకున్నాను, అసలే గతిలేనివాడు ఇప్పుడు పోలీసులకు పట్టించామంటే అతని భవిష్యత్తు నాశనమైపోతుంది, ఆ డబ్బు మనమే దానం చేసామనుకుంటే సరిపోతుంది నువ్వనవసరంగా ఆ మూర్ఖుడి గురించి ఆలోచించడం మానేయ్యి, నేనెప్పుడో మరిచిపోయాను దాని గురించి వాళ్ళకు కూడా తెలియచేసాను, వచ్చిన నష్టాన్ని ఇద్దరం పంచుకుందామనుకున్నాము, ” బయటకు చూస్తూ

అన్నాడు ప్రియాంక ముఖంలోకి చూడలేక. 


“నాన్న .. నాకెందుకో ఇప్పటికి నమ్మకం కలగడంలేదు మధు ఇలాంటి పని చేసాడంటే, అతనికి నేనెప్పుడన్నా డబ్బు ఇస్తానంటే కూడా తీసుకోకపోయేవాడు, నా కష్టార్జితం వచ్చాకే ఖర్చుపెడతాను అనే వాడు, అలాంటి మనిషి ఇది చేసాడంటే నా మనసు ఒప్పుకోవడంలేదు నాన్న, ” తండ్రి చేతిని తన చెంపలకు ఆనించుకుంటూ అంది. 


“చూడు బేబి నువ్వు ఇంకా చిన్నదానివి లోకం పోకడలు తెలియనిదానివి, నేను ఎన్నో ఆటుపోట్లను చూసినవాడిని ఎంతో మంది నన్ను మోసం చెయ్యడానికి చాలా ప్రయత్నాలు చేసేవాళ్ళు, అందరికి ఎదురీది ఈ స్థాయికి వచ్చినవాణ్ణి ఎవరెటువంటి వాళ్ళో నేనిట్టే పసిగడుతాను, నాకెందుకో మధును మొదటిసారి చూసినప్పుడే అనిపించింది, మనుషుల్ని నమ్మించడంలో చాలా నేర్పరి అనుకున్నాను, ఏదో నీకు బాగా తెలుసన్నావు అందుకని నమ్మాను, పోనిలే బేబి వాడి గురించి తలుచుకుని నువ్వు బాధపడకు, వాడిని మరిచిపోతే

నీకు మంచిది నాకు మంచిది, ” తల నిమురుతూ చెప్పాడు. 


“అలాగే నాన్న.. నిన్ను బాధపెట్టే పని చెయ్యను, ”అంది శూన్యంలోకి చూస్తూ


=================================================================================

                                                       ఇంకా వుంది..


      విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 9 త్వరలో

=================================================================================


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 




23 views0 comments

Σχόλια


bottom of page