top of page
Writer's pictureLakshmi Sarma B

విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 9

#LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #VidhiAdinaVinthaNatakam

, #విధిఆడినవింతనాటకం, #TeluguSerials, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


'Vidhi Adina Vintha Natakam - Part 9' - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 19/10/2024

'విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 9తెలుగు ధారావాహిక

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు. డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక. అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది. గతంలో ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్తుంది ప్రియాంక. మధుని ఆఫీసుకు రమ్మంటాడు ఆమె తండ్రి దామోదరం. 


మధు, ప్రియాంకల మీద నిఘా పెడతాడు. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు గ్రహిస్తాడు. మధు తన డబ్బుతో పారిపోయినట్లు చెబుతాడు దామోదరం. 

తాను మధును ప్రేమిస్తున్న విషయం బయటపెడుతుంది ప్రియాంక. 

గుండెపోటు వచ్చినట్లు నటిస్తాడు దామోదరం. హాస్పిటల్ లో చేరి మధుని మరిచి పొమ్మని కూతురికి చెబుతాడు. 


ఇక 'విధి ఆడిన వింత నాటకం' ధారావాహిక పార్ట్ 9 చదవండి. 


“అలాగే నాన్న… నిన్ను బాధపెట్టే పని చెయ్యను, ”అంది శూన్యంలోకి చూస్తూ. 


కాలచక్రం గిర్రున తిరిగిపోయింది మధు కనిపించకుండాపోయి అప్పుడే రెండుసంవత్సారాలు గడిచాయి. ఎక్కడున్నాడో అసలు ఉన్నాడో లేడో కూడా తెలియలేదు. ప్రియాంక మెల్లెమెల్లెగా మధును మరిచిపోసాగింది. కాదు మరిపించేలా చేసాడు దామోదరం. పైకి మరిచిపోయినట్టు నటించినా ప్రియాంక గుండెగుడిలో ప్రతిష్టుంచుకున్న మధు రూపాన్ని ఎవరు తుడిపెయ్యలేరు. తండ్రికోసం మరో పెళ్లికి సిద్దమయిందే కానీ మనసును మాత్రం మధుకే వదిలేసింది. పైకి కనిపించే రూపానికే పెళ్ళి చేద్దామనుకున్నాడు దామోదరం. 


“ప్రియా… ఇదిగో ఈ చీరకట్టుకో తల్లి పుత్తడిబొమ్మాలా ఉంటావు, పెళ్ళిచూపులకు వాళ్ళొచ్చే టయం అవుతుంది త్వరగా తయారవు, ” ఆనందంతో చెప్పింది శారద. ఆమెకు కూతురు పెళ్లికి ఒప్పుకున్నందుకు పట్టరాని ఆనందంగా ఉంది. 


‘అవును.. ప్రాణంలోని పుత్తడిబొమ్మను నేను’ అనుకుంటూ తల్లి వైపు చూసి నవ్వింది. ఆ నవ్వులో జీవంలేదు. ముఖంలో సంతోషమనేదే కనపడడంలేదు. ‘అంతా యాంత్రికంగా జరిగిపోవలసిందే. తన ప్రమేయం ఏం లేదు’ అనుకుంది. 


“అమ్మాయి… నీకు మావాడు నచ్చాడా? ఏమో నువ్వు వాడివైపు సరిగా చూడలేదని అనుకుంటున్నాను, ఏది ఒక్కసారి తలెత్తి మా అన్నయ్య చూడు, ” అంటూ ప్రియాంక తలను నెమ్మదిగా అబ్బాయివైపు తిప్పింది ఆ అబ్బాయి చెల్లెలు ప్రియాంకను ఆటపట్టిస్తూ. 


 వాలుగా కళ్ళు పైకెత్తి చూసిందిగానీ తన కళ్ళకు మధు రూపమే కనిపించింది. ఒళ్ళు జలదరించినట్టయి తడబడి తల కిందకు వంచుకుంది. 


“హే చూసింది చూసింది.. మా అన్నయ్య ఎలా ఉన్నాడు చెప్పవమ్మా వదినమ్మా, కళ్ళు ముక్కు అన్ని బాగానే ఉన్నాయా.. ఆ అన్నట్టు మావాడు పెద్ద సింగర్ తెలుసా? మంచి గాయకుడిగా పేరొచ్చింది, నీ కోసం ఒక ప్రణయపాట పాడమని చెప్పనా, ” అంది గలగలనవ్వుతూ. 


“ఏయ్ రాధ నువ్వు కాస్త నోరుమూస్తావా… తను ఏం చెబుతుందో వినాలి కదా, ”

చిన్నగా మందలించాడు అబ్బాయి రామకృష్ణ. 


“అమ్మా చూడమ్మా అన్నయ్య నన్ను ఎలా బెదిరిస్తున్నాడో చూడవే, ” తల్లికి పిర్యాదు చేసింది రాధ. 


“అబ్బా నువ్వూరుకోవే ఎప్పుడు మీ ఇద్దరికి ఇవే గొడవలు, ” గుసగుసగా అన్నది అనసూయమ్మ. 


“చూడండి దామోదరంగారు… మీ అమ్మాయి మాకు నచ్చింది, మీకు అభ్యంతరంలేకపోతే మిగతా విషయాలు మాట్లాడుకుందాము ఏమంటారు, ” అడిగాడు రామకృష్ణ తండ్రి ప్రసాద్. 


“అయ్యో… అభ్యంతరం ఏముంటుంది కాకపోతే అబ్బాయికి మా అమ్మాయి నచ్చిందో లేదో కనుక్కున్నారా, ” సైగ చేస్తూ అన్నాడు దామోదరం. 


“రామ రామ ఎంతమాట … మీ అమ్మాయి నచ్చకపోవడమేంటి, మహాలక్ష్మి గడపలోపల కాలు పెడుతుంటే ఎవరైనా అడ్డు చెబుతారా? అమ్మాయికేంటి కుందనపు బొమ్మ, మా వాడు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాడో ఇంతటి అందాలరాసి దొరికింది, ఏరా అమ్మాయికి వంకపెడతావా, ” చమత్కారాన్ని జోడిస్తూ అడిగాడు. లేదన్నట్టుగా తలవూపాడు రామకృష్ణ. 


“అగండాగండి నాన్నగారు… అమ్మాయిగారు చెప్పాలి కదా మా అన్నయ్య నచ్చాడో లేదో, నీ కలువపువ్వుల వంటి కళ్ళతో మా అన్నయ్యను చూసావు కదా! మరి నీ నోటి ముత్యాలు రాలిపోవుగానీ చెప్పు మా అన్నయ్య నచ్చాడా, ” ప్రియాంక ముఖంలో ముఖం పెడుతూ అడిగింది రాధ. రాధను చూసి పక్కున నవ్వింది ప్రియాంక. 


“అమ్మయ్యా ఒరేయ్ అన్నయ్యా నువ్వు నచ్చేవట్రా, ముత్యాలు ఏమన్నా కిందపడినాయేమో ఏరుకుంటాను తళుక్కుమన్న పలువరసనుండి, ” హాస్యమాడింది రాధ. అందరు నవ్వుకున్నారు రాధ మాటలకు ప్రియాంక కూడా నవ్వకుండా ఉండలేకపోయింది. 


“చూడండి ప్రసాద్ గారు… పురోహితుడిని రమ్మన్నాను, ఆయన వస్తే ముహూర్తాలు చూసుకుందాము అదిగో మాటల్లోనే వచ్చాడు, రావయ్యా శాస్త్రిగారు నీ కోసమే చూస్తున్నాము, మంచి మూహుర్తం చూసి చెప్పవయ్యా, ” అన్నాడు కూర్చోమని కుర్చిచూపిస్తూ. 


“అయ్యా … నేనంటున్నానని కాదు, వీళ్ళిద్దరి పేరుమీద మంచి ముహూర్తం అంటే వచ్చేవారం చాలా బాగుంది, అదికాదు అంటే గనుక, ” చెప్పడం ఆపి దామోదరంవైపు ప్రసాద్ వైపు చూసాడు. 


“ఏంటయ్యా చెప్పడం ఆపేసావు చెప్పు, ” అన్నాడు దామోదరం. 


“ఏం లేదయ్యా… వీళ్ళకు ఈ ముహూర్తం కుదరకపోతే తరువాత పెళ్ళి అవడం కష్టం, అందుకని తొందరగా ముహూర్తం పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం, అయినా మా బోటిగాళ్ళకు పెళ్ళి చెయ్యాలంటే కష్టం, మీకేంటి మహరాజులు చిటికెలో పనులన్నీ అయిపోగలవు, ” తమలపాకుతో ఎర్రగా పండిన నోరు తెరిచి నవ్వుతూ అన్నాడు శాస్త్రిగారు. 


“వారం రోజుల్లో పెళ్ళంటే ఎలా కుదురుతుంది, కనీసం పదిహేను రోజులన్నా ఉండాలి. నగలు చేయించాలి పట్టుబట్టలు తీసుకోవాలి, అసలే పెళ్ళిళ్ళ సీజన్ దర్జి వాళ్ళు జాకెట్లు కుట్టొద్దు, ” ఆశ్చర్యంగా అడిగింది శారద. 


“శారద.. నువ్వు కాస్త ఆగుతావా? ఇందాక శాస్త్రిగారు చెప్పింది వినలేదా? మనకు ముహూర్తం ముఖ్యంగానీ అవన్ని ఎంతలో అయిపోతాయి, మీరేమంటారు బావగారు.. మీకు సమ్మతమేనా, ” అడిగాడు. భార్య వైపు గుర్రుగా చూస్తూ. 


“మీరు అవునన్నాక నేను కాదని ఎలా అనగలను బావగారు, ముహూర్తాలు పెట్టించండి. మాకేం అభ్యంతరంలేదు పిల్లలు క్షేమంగా ఉండడమే మనకు కావాలసింది, ” చెప్పాడు. 


“అది రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవలేదు అన్నట్టు, మా దామోదరంగారు తలచుకున్నారంటే క్షణాల్లో పనులు జరిగిపోతాయి, ” నవ్వుతూనే చేతి వేళ్ళను లేక్కపెడుతూ. “ సరిగ్గా వచ్చే ఆదివారం ఉదయం పది గంటలకు చక్కటి ముహూర్తం ఉందండి, ఇప్పుడే పత్రిక రాసుకోవడం మంచిది, ” అన్నాడు దామోదరం వైపు చూస్తూ. 


“ఆ ఇంకెందుకు ఆలస్యం శాస్త్రిగారు పత్రిక రాయండి, శారద పసుపు కుంకుమలు తీసుకురా, ” పురమాయించాడు భార్యను. 


ప్రియాంకకు మనసు వేదనతో నిండిపోయింది. 


మధుకు శాశ్వతంగా దూరం అయిపోతున్నాను. ఇంకా వస్తాడని ఇన్నాళ్ళుగా ఎదురుచూసింది. ఊహు నన్ను మరిచిపోయింటాడు హాయిగా ఇంకో పెళ్ళిచేసుకుని ఎక్కడో ఉన్నాడు. మధు నీకేం అన్యాయం చేసానని నన్ను ఇంత మోసం చేసావు లోలోన కుమిలిపోతుంది. 


అనుకున్న ప్రకారం అనుకున్నరోజు ప్రియాంకకు రామకృష్ణ కు అంగరంగ వైభవంగా పెళ్ళిచేసాడు. తనకు సమానమైన అల్లుడిని చూసి గర్వంతో మీసం మేలేసుకున్నాడు. ప్రియాంక వదనంలో ఎటూ తేల్చుకోలేని సమస్య. మధును మరిచిపోయి రేపటినుండి ఇతనితో కాపురం చెయ్యాలి. మనసులేని తను ఇతనితో కాపురం చెయ్యగలదా? నాన్నకు ఇచ్చిన మాటకోసం పెళ్లికి ఒప్పుకున్నాను గానీ మధు స్థానంలో ఇతను నా వల్లకాదు. 


తను చేసిన మోసం కూతురికి తెలియనివ్వకుండా పెళ్లికి ఒప్పించాను. బేబి ఇతనితో కాపురం చేస్తుందా? ఆ ఏం చేస్తుంది చెయ్యక అతని సహచర్యంలో అన్ని మరిచిపోతుంది. దులిపేసుకున్నాడు దామోదరం కూతురు వంక చూస్తూ. 

***


“ప్రియా అక్కడే నిలబడిపోయావేం సిగ్గా… చూడు నీ బుగ్గల్లో ఎరుపు ఎలా వచ్చిందో పాలుగారే నీ బుగ్గలు సిగ్గుతో ఎలా కందిపోయాయో చూడు, ” అంటూ మంచం దిగి వచ్చి ప్రియాంక భుజాలచుట్టూ చేతులువేసి నడిపించుకుంటూ వెళ్ళాడు. ప్రియాంకకు దుఃఖంతో గొంతు పెగలడంలేదు. తలేత్తి భర్త కళ్ళల్లోకి చూసింది. అతను మంచికి మారుపేరులా చిరునవ్వుతో ప్రియాంకనే చూస్తున్నాడు. అతని కళ్ళతో తన కళ్ళు బంది అయిపోయాయి ఒక్క క్షణం. చివాలున అతని చేతిని తప్పించింది తన భుజంనుండి. 


“ప్రియా … ఏమైంది భయంగా ఉందా? మొదటి రాత్రిని తలుచుకుని అందరు గొప్పగా ఉహించుకుంటారు, మరి నువ్వేంటి అలా భయంతో బిగుసుకుంటున్నావు, నువ్వెప్పుడు సినిమాలు చూడలేదా ఏంటా కన్నీళ్లు, నీకు మొదటిరాత్రి ఇష్టంలేదా లేకా నేను ఇష్టం లేదా, ” అతను అలా అడుగుతుంటే చప్పున అతని నోటికి తన చేతిని అడ్డంపెట్టింది. 


“ప్రియా నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకు తెలియదు, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? జీవితంలో గుర్తుంచుకోవలసినది ఈ రోజు, సంతోషంగా గడపవలసిన సమయం ఇది, కానీ నిన్ను చూస్తుంటే మనసులో దేని గురించో బాధపడుతున్నావనిపిస్తుంది, నువ్వెవరినైనా ప్రేమించావా చెప్పు ప్రియా, ” అడిగాడు ప్రియ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. 


నోటికి చేతి అడ్డం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. తనను అలాగే మంచం మీద కూర్చోబెట్టాడు. తనివితీరా ఏడిస్తేగానీ తన మనసులో బాధపోదని అలాగే చూస్తూ కూర్చున్నాడు రామకృష్ణ. తన కడుపులో ఉన్న వ్యధనంతా పోయాక అప్పుడు చూసింది రామకృష్ణ వైపు. 


అతను నవ్వుతూ “అయిపోయిందా. మనసు తేలికయిందా ఇప్పుడు, చూడు ప్రియా… నీ గురించి అంతా మీ నాన్న చెప్పాడు, అందం ఐశ్వర్యం అన్ని ఉండి కూడా నువ్వు ఇలా బాధపడుతుంటే మీ నాన్న తట్టుకోలేకపోతున్నారు, మోసం చేసినవాడికోసం నీ అందమైన జీవితాన్ని పాడు చేసుకుంటావా? ఉన్న ఒక్కగానొక్క కూతురు సంతోషం కోసం మీ నాన్న ఎంత బాధపడుతున్నాడో నీకు తెలుసా? పాపం నిన్ను ఎలాగైనా మళ్ళి మాములు మనిషిని చెయ్యడానికి ఆయన ఎంత కష్టపడ్డారో తెలుసా, అనుకోకుండా మీ నాన్నకు నాకు పరిచమైంది మాటల్లో నీ గురించి చెప్పాడు, నేను నిన్ను మార్చగలనని మాటిచ్చాను, ” చెప్పడం ఆపి ప్రియ వైపు చూసాడు. కలువరేకలవంటి కళ్ళను రెపరెపలాడిస్తూ ఆశ్చర్యంతో రామకృష్ణనే చూస్తూంది. 


“ఇప్పుడు చెప్పు ప్రియా… నువ్వు ఎలా చెబితే అలాగే చేస్తాను, నేను వెళ్ళి అలా బయటపడుకోనా నీకు ఇబ్బంది ఉండదు, ” దిండు దుప్పటి చేతిలోకి తీసుకుంటూ అడిగాడు. 


“ఆ ఆ అయ్యో వద్దండి… మా నాన్న చూసారంటే తట్టుకోలేరు, మీరు ఇక్కడే పడుకోండి. నేనే కిందపడుకుంటాను, ” తడబడతూ చెప్పింది. 


“అంటే మనిద్దరం ఒకే గదిలో పడుకుంటాం కానీ ఎవరి దారి వాళ్ళదే నన్నమాట, అతోస్మి, ఇదెక్కడి న్యాయం కొత్తగా పెళ్ళి చేసుకున్నవాణ్ణి ఇలా ఉపవాసాలతో మొదటిరాత్రి తెల్లవారిపోవలసిందేనా, అమ్మో ఇంతందం పక్కన పెట్టుకుని చేతకానివాడిలా చూస్తూ ఊరుకోవలసిందేనా, ” బుగ్గన చేతులుపెట్టుకుని బాధను అభినయిస్తూ అన్నాడు. 


రామకృష్ణ వాలకం చూసి కిలకిలానవ్వింది ప్రియా. రామకృష్ణ అమాంతంగా కింద కూర్చొని వెతుకుతున్నాడు. 


“ఏం వెతుకుతున్నారు ఏదైనా పోయిందా, ” తను కూడా కిందకు వంగి చూడసాగింది. 


“ముత్యాలండి మీరు నవ్వినప్పుడు జలజలమని కిందకు రాలాయేమోనని వెతుకుతున్నాను, ” అన్నాడు చిలిపిగా. సిగ్గులమొగ్గైంది ప్రియవదనం. 


“ప్రియా… ఏ జన్మలో బంధమో కానీ మనిద్దరికి పెళ్ళి జరిగిపోయింది, పెద్దల సమక్షంలో అగ్నిసాక్షిగా నేను నీ మెడలో మూడు ముళ్ళు వేసాను, నీకు ఇష్టమున్నా లేకపోయినా ఈ జన్మకు మనం భార్యభర్తలం, నీకు నాతో కాపురం చెయ్యడం ఇష్టంలేకపోయినా మీ నాన్నకు ఇచ్చిన మాటకోసం నిన్ను వదలను, దయచేసి నాదొక విన్నపం … నేను మీ డబ్బుకు ఆశపడి రాలేదు మీ నాన్న బాధ చూడలేక వచ్చాను, కనీసం ఆయనముందైనా మనం భార్యాభర్తలుగా ఉందాము అలా ఉంటానని నాకు మాటిస్తావా, ” చెయ్యి జాపుతూ

అడిగాడు రామకృష్ణ. 


ప్రియాంక మనసు అలజడికి గురైంది. ఇంతమంచి మనసున్న మనిషినా తను ఇబ్బంది పెడుతుంది. నా ప్రేమను అర్థంచేసుకుని నాకోసం మా నాన్నకోసం ఆరాటపడుతున్నాడు. 


నేను తప్పు చేస్తున్నానేమో ఆడదానికి పెళ్లితోనే బంధం ముడిపడుతుందంటారు. అది ఇదేనేమో కట్టుకున్నవాడికి మనిసిచ్చి సంతోషంగా కాపురం చేసుకోవాలి. నేను నా ప్రేమలో ఓడిపోయాను. కనీసం ఇతని ప్రేమనైనా గెలుచుకుంటే? మెల్లెగా కళ్ళెత్తి అతనివైపు చూస్తూ చేతిలో చెయ్యి వేసింది. 


రోజులుగడుస్తున్నాయి దామోదరం అల్లుడు కూతురు సంతోషంగా ఉండడం చూసి మురిసిపోతున్నాడు. శారదకైతే ఒక్క క్షణం తీరికలేనట్టు వంటవాళ్ళున్నా ఏదో ఒక కొత్తరకం వంటచేసి అల్లుడికి పెట్టాలనే తాపత్రయం. తొందరలోనే మనవడిని ఎత్తుకోవాలన్న ఆరాటం కూడా రోజురోజుకు పెరిగిపోసాగింది. 


ప్రియాంక వేషభాషలు మారిపోయాయి చక్కగా ఇల్లాలు ఎలా ఉంటుందో అలా తయారైంది. భర్తకు ప్రతీది తనే దగ్గరుండి చూసుకుంటుంది. అతనితో పాటు షాపింగ్ లకు సినిమాలకు వెళ్ళివస్తుంది. అన్ని భార్యగా తను చేసే పనులన్నీ చేస్తుంది కానీ! రాత్రి అయ్యేసరికి పడకగదిలోకి రాగానే తన మనసు మారిపోతుంది. భర్తకు గుడ్ నైట్ చెప్పి పడుకుంటుంది. అప్పటివరకు ఎన్నో కబుర్లు చెబుతుంది రాత్రి కాగానే దూరంగా పారిపోతుంది. 


భర్తకు ఎంత దగ్గరవ్వాలని చూసినా అందుకు ససేమిరా ఒప్పుకోవడంలేదు మనసు ఎదురు తిరుగుతుంది. పాపం అతను మంచివాడు కాబట్టి ఓపికగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే మూడునెలలు అవుతుంది మా పెళ్ళి అయ్యి. నాన్నకు అమ్మకు ఈ విషయం తెలిసిందంటే పెద్ద గొడవేసజరుగుతుంది. దేవుడా ఎందుకయ్యా నాకిన్ని సమస్యలు సృష్టిస్తున్నావు. అటు ఆయనను సుఖపెట్టలేకపోతున్నాను ఇటు మధును మరిచిపోలేకుండా ఉన్నాను. ఎవరికి చెప్పుకోను నా బాధ నా సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది తనలో తాను కుమిలిపోతూ ప్రతిరాత్రి దిండులో తలపెట్టుకుని ఏడుస్తూనే ఉంది ప్రియాంక. 


“ప్రియా… మా అమ్మ దగ్గరకు వెళ్ళి రెండురోజుల్లో తిరిగివస్తాను, నీకు నేను లేకుంటే సంతోషమే కదా! కాకపోతే చెప్పవలసిన బాధ్యత అందుకని చెబుతున్నాను, నువ్వు కావాలంటే మీ స్నేహితులతో ఎటైనా సరదాగా వెళతానంటే వెళ్ళిరా నాకేం అభ్యంతరంలేదు, ” సూట్ కేసులో బట్టలు సర్ధుకుంటూ అన్నాడు. 


గుండెలో ముల్లుకుచ్చినట్టయింది భర్త మాటలకు. “అదేంటి ఇంత సడెన్ గా వెళుతున్నారు, అత్తయ్య మామయ్య బాగున్నారు కదా! ముందే చెబితే నేను వచ్చేదాన్నీ, ఏం నాకు మాత్రం నా అత్తగారింటికి రావాలని ఉండదా? మీరొక్కరే వెళ్ళడం ఏం బాగాలేదు, ” బుంగమూతి పెడుతూ అన్నది. 

=================================================================================

                                                       ఇంకా వుంది..


=================================================================================


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 




49 views0 comments

Comments


bottom of page