top of page
Writer's pictureA . Annapurna

విధి చేసే వింతలు ఎన్నో!



'Vidhi Chese Vinthalu Enno' - New Telugu Story Written By A. Annapurna

Published in manatelugukathalu.com on 08/08/2024 

'విధి చేసే వింతలు ఎన్నో!' తెలుగు కథ

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


సంజయ్ కి ఏభై ఏళ్ళ బర్త్ డే పార్టీ ఘనంగా ఏర్పాటుచేసి కంపెనీ ఉద్యోగులను ఫ్రెండ్స్ని పిలిచింది యామిని.


సంజయ్ కంపెనీ వర్క్ మీద నెల క్రితమే సింగపూర్ వెళ్లి నిన్నరాత్రి ఇంటికి వచ్చాడు.

కొద్దిగా అలసటగా వున్నా భార్య యామిని - కూతురు మహతి సరదా కాదనలేక పార్టీలో కూర్చున్నాడు.


అందరూ వచ్చి సంజయ్ కి బర్త్డే విషెస్ చెప్పేరు. ఎవరికివారు కబుర్లు చెప్పుకుంటూ మ్యూజిక్ ఆస్వాదిస్తూ కొత్తవారితో పరిచయాలు చేసుకుంటూ డ్రింక్ చేస్తూ వున్నారు. సందడిగా వుంది వాతావరణం.


డిన్నర్ మొదలైంది. ప్లేటులో బిర్యానీ తింటున్న సంజయ్ హఠాత్తుగా తూలి పక్కనే వున్న వ్యక్తిమీద

పడబోతుంటే అతను ఆసరా ఇచ్చాడు.

''ఆర్ యు ఓకే సంజయ్ ? అన్నాడు అతను.


''ఐ యాం ఆల్ రైట్...నో ప్రాబ్లెమ్...అంటూ, చేతిలోని ప్లేటు టేబుల్ మీద పెట్టడానికి నాలుగు అడుగుల వేసాడు. కానీ అడుగులు తడబడి కుప్పకూలిపోయాడు.


దూరంగా ఫ్రెండ్స్ మధ్య వున్న యామిని యధాలాపంగా భర్త వైపు చూసింది.అతను కింద పడటంతో

పరుగునవచ్చి సంజయ్ను చేరుకుంది.


''ఏమైంది సంజూ.....అంటూ కుదిపింది. వొళ్ళంతా చెమటలు పట్టి శరీరం చల్లగా అనిపించింది.

ఒకరు అంబులెన్స్కి కాల్ చేస్తే, మరొకరు గుండెలమీద నొక్కుతూ CPR చేయసాగారు.

అంబులెన్స్  లో హాస్పిటల్లో చేర్చితే డాక్టర్లు అబ్జర్వేషన్ లో పెట్టేరు.

యామిని మహతి దిగాలు పడ్డారు. ఇదేమిటి...ఇలాజరిగింది? సంజయ్ కి హెల్త్ ప్రాబ్లమ్ ఉందని ఎప్పుడూ చెప్పలేదు!


పార్టీలో డ్రింక్ చేయడం హెవీ ఫుడ్ తినడం కారణమా.... లేక మరేదో కారణమా అని అనుకున్నారు.

రాత్రి నిద్ర లేకుండా టెన్షన్ తో గడిపారు. అక్కడే సోఫాలో వొదిగి కూర్చున్నారు.

తెల్లవారుతుంటే డాక్టర్ వచ్చి, ''మీరు వెళ్లి చూడండి. మీతో ఆయన మాటాడాలి అనుకుంటున్నారు...''

అని చెప్పగానే రూములోకి వెళ్ళేరు యామిని మహతి.


''యామిని....నాకు ఎదో అవుతోంది....చివరి టైము వచ్చింది....ఇదిగో చూడు ' అంటూ ఒకమూలగా

నిలబడి వున్నా పన్నెండేళ్ల అబ్బాయిని చూపించాడు. అతడిపక్కనే మరోవ్యక్తి వున్నాడు.


''ఎవరు ఆ అబ్బాయి?” అయోమయంగా అడిగింది యామిని.


''వాడు....రోషన్. అమెరికా నుంచి తీసుకుని రావలసి వచ్చింది. నేను వాడి బాధ్యత తీసుకున్నాను. ఇకనుంచి నువ్వే అమ్మవి. బాగా చూసుకుంటానని మాట ఇవ్వు !” అంటూ విని వినిపించని స్వరంలో బలహీనంగా వణుకుతున్న చేయి ముందుకు చాచాడు.


యామినికి అర్ధంకాలేదు. ఆలోచించే టైములేదు. ఆమె సందేహాలకు జవాబు చెప్పే పరిస్థితిలో లేడు

సంజయ్.


ఇక తప్పనిసరిగా భర్త చేతిలోనే చేయి వేసింది. 'థాంక్స్ యామిని....నా బీరువాలో డైరీ వుంది. అదిచదువు.' అని అంటూ అలసటగా కళ్ళు మూసుకున్నాడు.

అక్కడవున్న సిస్టర్ వాళ్ళను బయటకు పంపేసింది.

రోషన్ ని కూడా వున్న వ్యక్తి బయటకు తీసుకెళ్లిపోయాడు.

ఆరాత్రి సంజయ్ మరిక మేలుకోలేదు.


మహతికి పదహారు ఏళ్ళు. తండ్రి చెప్పిన విషయం ఆమె కూడా నమ్మలేకపోతోంది.

డాడీ ఇంతకాలం ఎందుకు మా దగ్గిర దాచిపెట్టేరు? ఎవరో అనామకుడిని ఇలా తీసుకురావడం ఏమిటి?

ఆ అవసరం ఏమిటి? అసలు హఠాత్తుగా ఆయన మామధ్య లేకుండా

వెళ్లిపోవడం ఏమిటి? అని యామిని, మహతి తల్లడిల్లి పోయారు. ఒకలాంటి షాక్లో ఉండిపోయారు.


కొన్నిరోజులు గడిచాక తేరుకుని యామిని భర్త బీరువాలో వున్న డైరీ తీసి చదవడం మొదలు పెట్టింది.


''యామినీ! నీ దగ్గిర రోషన్ గురించి దాచాలని నేను అనుకోడంలేదు. అలా అని చెప్పే అవకాశం కూడా రాలేదు. మన ఇద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవు. కానీ విచిత్రంగా కొన్ని మన ప్రమేయం లేకుండా జరిగిపోతాయి. అలాంటి సంఘటనే రోషన్ నా ఆశ్రయంలోకి రావడం.


నేను తరచుగా కంపెనీ వర్క్ మీద విదేశాలకు వెడుతూ వుంటాను కదూ. 2020 డిశంబర్ లో నేను

అమెరికా వెళ్ళాను గుర్తువుందా? అక్కడ మరో అమెరికన్ తో కలిసి మన కంపెనీ ఓపెన్

చేయడంవలన కొద్దికాలం ఉండిపోయాను.


మార్చ్ లో కోవిడ్ రావడం వలన నేను అమెరికాలో నువ్వు ఇండియాలో స్ట్రక్ ఐపోయాం.


అదే సమయంలో నేను వుండే అపార్ట్మెంట్ పక్కనే నేహా -రోషన్ అనే తల్లి కొడుకు వున్నారు. నేహా మన

కంపెనీలో మెయిడ్ గా పనిచేసేది. ఆమె ఎవరితోనూ మాటాడేదికాదు.

తాను, కొడుకు.. అంతే. సింగిల్ మదర్ అని అర్ధం అయింది.


కోవిడ్ మహమ్మారి ప్రపంచమంతా గడ గడ లాడించిన సమయం. ఎవరికీ ఎవరు సహాయం చేసుకోలేని

దుస్థితి. నేహాకి కోవిడ్ వచ్చింది. అప్పుడు ఆమెను హాస్పిటల్ లో చేర్చి రోషన్ ను నేను దగ్గిరకు తీశాను.

దుర దృష్టం, నేహా హాస్పిటల్ నుంచి తిరిగిరాలేదు. రోషన్కి అప్పుడు పదేళ్ల వయసు. కానీ ఒకరికి ఒకరు

ప్రాణంగా వుండే తల్లి మరణం తట్టుకోలేకపోయాడు. అప్పుడే నిర్ణయించుకున్నాను. అతడిని నేను కనిపెట్టి వుండాలని.


నేహా అపార్ట్మెంట్ ని నేను కంపెనీ కోసం రెంటికి తీసుకుని సర్దుతూంటే రూములో ఒక లెటర్ కనబడింది.

'నేను చనిపోతే రోషన్ ను ఇండియా లో ఉంటున్న తన మదర్ కి అప్పగించమని అడ్రస్, ఆమె బ్యాంకు అకౌంట్, రోషన్ ఇమిగ్రేషన్ డాక్కుమెంట్స్ వున్న కవరు.. అన్ని ఒక బాక్స్లో పెట్టి ఉంచి ముందు జాగ్రత్త తీసుకుంది.


అప్పుడు అమెరికా ప్రభుత్వం విసిట్ కి వచ్చిన వారిని అక్కడే కొంతకాలం ఉండేలా అనుమతి ఇచ్చింది.

అలా నేను ఒకటిన్నర సంవత్సరం అక్కడే ఉండిపోయాను.


ఇండియా వచ్చాక రోషన్ ని ఎలాగా వాళ్ళ గ్రాండ్ మదర్ కి అప్పగిస్తాను కదాని నీకు ఈ విషయాలు చెప్పలేదు. తీరా నేను ఇండియా వచ్చేసరికి ఆవిడ రిహాబ్లో వుంది. ఎవరిని గుర్తుపట్టే స్థితిలో లేదు.

ఏమి చేయాలో అర్ధం కాకా డూన్ స్కూల్ లో చేర్పించాను. అక్కడ గార్డియన్గా నాపేరు ఇవ్వాల్సివచ్చింది.

అమెరికాలో మన కంపెనీ లాయరు సహాయంవలన కేర్ టేకర్ గా రెండేళ్లు మానేజ్ చేసి వాడిని కాలేజీకి అమెరికా పంపుదామని అనుకున్నా..! నా మీద రోషన్ ఆధార పడి వున్నాడు. ఇదే మన కుటుంబంతో రోషన్కి వుండే అనుబంధం!


'అది నిజమా లేక నేహాతో సంజయ్ కి సంబంధమా....?’.. యామిని కలవర పడింది.


సంజయ్ మంచివాడే. కానీ రెండేళ్లపాటు మాకు దూరంగా వున్నాడు. అతడికి చేరువలో ఒక ఒంటరి స్త్రీ

వుంది. జాలి ప్రేమ అవకాశం కలిసివస్తే మగవాడు ఊరుకుంటాడా? ఎదో కథ అల్లుతున్నాడేమో !

అని సందేహించింది.


తల్లి - తండ్రిని అపార్ధం చేసుకుంటోంది...అని మహతి గ్రహించింది.


డైరీ రాసినవారు అబద్ధం రాయరు. అది మానసిక విశ్లేషణ. డైరీ అంటే మచ్చలేని అద్దం.

''అమ్మా ! ఒక నిస్సహాయ స్థితిలో మనిషిని ఆదుకోడం తప్పుకాదు. డాడ్ అలాంటిమనిషి కాదు” అని తండ్రిని సపోర్టు చేసింది. తల్లి అనుమానాన్ని పోగొట్టింది.


ఆ డైరీని మరో సారి చదివాక విషయం అంతా అర్ధమై తేలిక పడిన మనసుతో మహతికి రోషన్ గురించి చెప్పి ఏమిచేద్దాం.?..అని అడిగింది.


''నాకో చిన్న బ్రదర్ దొరికేడమ్మా ! మన ఇంటికి తీసుకుని వద్దాము…” అంది సంతోషంగా మహతి.


''అవును. మనం ఇప్పుడే వెళ్లి రోషన్ తో మాటాడుదాము. డాడీ ఫోను నుంబర్లు రాశారు డైరీలో....”

అంది యామిని.


ఫోను చేయగానే రోషన్ పలికాడు.


''రోషన్, నువ్వు మాఇంటికి వచ్చేయి. అందరమూ హ్యాప్పీగా ఉందాము. నీకు ఎప్పుడు అమెరికా వెళ్లాలని

ఉంటే అప్పుడే వెడుదువుగాని. '' అంది.


''ఆంటీ....” అంటూ వాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఏమి మాటాడాలో తెలియక.


డోన్ స్కూల్ నుంచి రోషన్ చదువు పూర్తికానిదే వాళ్ళు పంపము అన్నారు.


పైగా యామిని కొన్ని పేపర్స్ మీద సంతకాలు చేయాలి. సంజయ్ డెత్ సర్టిఫికెట్ పెట్టాలి.

ఇలా ఏవో ఫార్మాలిటీస్ వున్నాయి.....అన్నారు.


అమెరికాలో లాయర్తో మాటాడితే ''అంతా రోషన్ ఇష్టప్రకారం చేద్దాం. వాడు ఇక్కడికి రావలసిన అవసరం వుంది. ఇండియా లో ఉండాలి అంటే మీరు అడాప్ట్ చేసుకోవాలి. అది చాలా టైము పడుతుంది. !.

సంజయ్ అక్కడ కంపెనీ స్టార్ట్ చేసాడు కనుక చూసుకోడానికి  యామిని ని కూడా వచ్చేయమని, అప్పుడు

రోషన్ బాధ్యత పూర్తిగా తీసుకోవచ్చు అని సలహా ఇచ్చాడు.


అప్పటికే యామినికి మహతి కి వీసాలు వున్నాయి.


''మనం వెళ్లి రోషన్ ని చూసొద్దాం…” అంది మహతి.


అప్పుడు హాలీడేస్ ఇచ్చారు. ఇంటికి తీసుకువచ్చి ప్రేమగా చూసుకున్నారు.


''ముందుగానే రోషన్ ని ఇంటికి తీసుకువచ్చి ఉంటే బాగుండేది. మనం బాగా దగ్గిర అయ్యేవాళ్ళం.'' అంది మహతి.

వాడికి కావలసినవి ఏమిటో కొనిపెట్టేరు. హైదరాబాదు అంతా తిప్పి చూపించారు.వాడు సంతోషంగానే వున్నాడు. కొంచెం దిగులు తగ్గింది.


ఎంత ఐనా ఆడవారి అభిమానంలో ప్రేమ ఉంటుంది. మగవాడి అభిమానంలో బాధ్యత ఉంటుంది.

రెండేళ్లపాటు రోషన్ కి హాపీగా గడిచిపొఇన్ది.


నేహా మదర్ మరణిస్తే రిహాబ్ సెంటర్ వాళ్ళు కబురుచేశారు.  ఆవిడ దగ్గిరున్న పేపర్స్ రోహన్కి అంద చేయడానికి. వాటిని సంజయ్ చూడలేదు. చూసివుంటే బాగుండేది. అతడికి ఆనందం కలిగించే వార్తలు తెలిసేవి.


యామిని రోహన్ ని తీసుకుని వెళ్ళింది.రోషన్ కి సంబంధించిన అమెరికా డాక్యు మెంట్స్ వాళ్ళ అమ్మమ్మగారు ఇచ్చిన డాక్యుమెంట్స్ తీసుకుని వచ్చి తన దగ్గిర లాకర్లో పెట్టబోతు వాటిని ఒకసారి చదివింది. ఆమెకు పట్టరాని సంతోషం కలిగినది. రోహన్ వాళ్ళమ్మ నేహా ఎవరోకాదు. సంజయ్ తమ్ముడు సూరజ్ ప్రేమించి పెళ్లిచేసుకున్న అమ్మాయి. అమెరికాలో ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. ఆపెళ్ళి చేసుకుంటే ఇంటికి రావద్దు అన్నారు. నేహా తండ్రి క్రిస్టియన్.


అలా అన్నదమ్ములు దూరం అయ్యారు. సూరజ్ ఎలా మరణించాడో ఎవరికీ తెలియదు. నేహా ఎవరితోనూ కలిసేదికాదు. ఎవరిని నమ్మేదికాదు. ఆకారణంగా సంజయ్ ఎవరో తెలుసుకోలేక పోయినది.

అయితే విధి అందరిని మరో రకంగా కలిపింది. రోహన్ ఇప్పుడు అనాధ కాదు. తండ్రి కుటుంబంలోకి చేరెడు.


స్కూల్ గ్రాడ్యు ఏషన్ అవ్వగానే అమెరికా వెళ్ళడానికి సిద్ధం అయ్యారు.

నేహా వాడిని ఒంటరిగా ఉండాల్సివస్తే ఎలా ధైర్యంగా ఉండాలి తన పనులు ఎలా స్వయంగా చేసుకోవాలి? అని నేర్పింది. కానీ అమెరికానుంచి వచ్చి ఉండటం కొత్త. ఒక ఏడాదివరకు అలవాటు పడలేక పోయాడు.


సంజయ్ చనిపోయాక ఎక్కడవుండాలి....ఏమి చేయాలి అని కలవర పడ్డాడు.

లాయరు విల్సన్ వాడికి పరిచయమే.అప్పుడప్పుడు మాటాడుతూ ''నువ్వు వచ్చేద్దుగాని...నేను హెల్ప్ చేస్తాను ''అని చెప్పేవాడు.


యామిని ఇండియాలో కంపెనీ చూసుకోడం కష్టం. కనుక అమ్మకానికి పెట్టింది.

కంపెనీ కొన్నవాడు సంజయ్ స్నేహితుడు.


''మీరు ఎప్పుడు రావాలి అనుకున్న రావచ్చు. ఇక్కడ పనిచేయచ్చు...ఎప్పటికి ఈ కంపెనీ మీదే...మన స్నేహం ఎప్పటికి ఇలాగ ఉంటుంది.నేను మీ శ్రేయోభిలాషిని !” అన్నాడు.


అమెరికా వెళ్ళడానికి అంతా సిద్ధం చేసుకుని ''రోషన్ ఇప్పుడు నువ్వు హ్యాపీ ఏనా.....మనం ముగ్గురం ఎప్పటికి కలిసే ఉందాము.'' అంది యామిని వాడిని హృదయానికి హత్తుకుని.


''ఎస్ ఆంటీ ! అయామ్ వెరీ హ్యాపీ…” అన్నాడు రోషన్...సంతోషంగా.


మరో వైపుగా రోషన్ ని దగ్గిరగా తీసుకుని మహతి అంది...''యు ఆర్ మై స్వీట్ బ్రదర్ !

'విధి ఎవరిని ఎవరితో కలుపుతుందో తెలియదు. కానీ అంతా  మంచే జరిగింది....' అనుకున్నారు.


ముగ్గురూ వారి భవిష్యత్తు జీవితానికి ముందుకు సాగిపోయారు ఆనందంగా!

********

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)




36 views0 comments

Comments


bottom of page