#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #Vidhileela, #విధిలీల, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
'Vidhileela' - New Telugu Story Written By Dr. C. S. G. Krishnamacharyulu
Published in manatelugukathalu.com on 05/11/2024
'విధిలీల' తెలుగు కథ
రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సత్యనారాయణకి దేవుడంటే నమ్మకం. దిక్కు లేని వాడికి దిక్కయ్యేది, నిస్సహాయులకు అండగా నిలిచేది, ఆ దేవుడే. మనం మనసా, వాచా, కర్మణా, ఆ దేవుని స్మరించి జీవనం సాగిస్తే, సమంజసమైన మన కోరికలు నెరవేర్చుతాడని అతను స్నేహితులకు చెప్తూంటాడు. ఇప్పుడతనికి జీవన మరణ సమస్యలాంటిదొకటి యెదురైంది. ఈ విషయంలో, దేవుడిని శరణు జొచ్చిన అతనికి విజయం లభిస్తుందా?
@@@@
"ఏమోయ్ సత్యనారాయణా, ఇలా స్తబ్ధుగా వుండడమేనా, మార్పు కోసం ప్రయత్నించవా?"
"ఇప్పుడు అంతా బాగున్నది కదా!”
"ఏం బాగుంది? పెళ్ళి గిళ్ళీ లేదా?"
"లేకేం? అదుగో నా ప్రియభామిని యస్ అనడం కోసం చూస్తున్నా". "
"ఎవరో ఆ ప్రియభామిని?"
"ఇంకెవరు? నాకు కుడి వైపున కొద్ది దూరంలో కూర్చున్న కిరణ్మయి. "
"ఆమె నీకన్నా యేడాది పెద్దది గదా, పరవా లేదా?"
“ప్రేమకు మనసే గాని, , . వయసు, సొగసు, మనీ పరుసు.. ముఖ్యం కాదు"
"అబ్బో! చాలా విషయముందే నీ దగ్గర. కానీ నీ ప్రేమ సంగతి నువ్వు చెప్పందే ఆమెకు యెలా తెలుస్తుంది?"
“ఎందుకు తెలియదు. నా ప్రేమ మలయ మారుతం ఆమె చెవులలో నా ప్రేమ విషయం గుసగుసలాడుతుంది. "
“గాలి మాటలు చెప్పకు. ఈ మూగప్రేమను యెన్నాళ్ళు కొనసాగిస్తావు? మార్పు కోసం ప్రయత్నించు"
అశరీరవాణి అభిప్రాయం విన్న సత్యనారాయణ, తన ప్రియభామిని వంక చూసాడు. ఆమె సీరియస్ గా పనిచేసుకుంటోంది. గత ఆరునెలలుగా, సత్యనారాయణ, తన ప్రేమ విషయాన్ని కిరణ్మయికి చెప్పే సాహసం చేయలేకపోయాడు. గలగలా నవ్వుతూ అందర్నీ పలకరించే సత్యనారాయణ, ఆమె దగ్గర మూగ వాడై పొతాడు. అందుకు కారణం కిరణ్మయి వ్యక్తిత్వం. గంభీరంగా, భావరహితంగా వుండే ఆమెతో మాట్లాడాలంటే అతనిలో యేదో జంకు కలిగేది.
ఆమె మితభాషి. ఆఫీసు పనిగురించి మినహా యే యితర విషయాలు ఆమె దగ్గర ప్రస్తావించే అవకాశం ఆమె యెవ్వరికీ యివ్వదు. పని మానేసి ముచ్చటలాడడం, సహోద్యోగుల వ్యక్తిగత విషయాలను రచ్చకీడవడం, వంటివి ఆమె యేనాడూ చేయలేదు.
సత్యనారాయణ చూపులలో వెల్లి విరిసే ప్రేమ ఆమెకు అర్ధమైనా ఆమె మౌనంగానే వుండిపోయింది, ఆమె తనంత తానుగా మాట్లాడుతుందేమోనని. యెదురు చూసిన సత్యనారాయణకు నిరాశే మిగిలింది. అందువల్ల అతడు కిరణ్మయి ని పెళ్ళాడేఅవకాశాన్ని కల్పించే బాధ్యత దేవునిపై వేసాడు.
@@@
విధి లీల ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు.. కొద్దిరోజుల తర్వాత, ఒక సంఘటన జరిగింది. అది సత్యనారాయణ ప్రేమసౌధాన్ని కూల్చివేసింది, .
ఒక రోజు లంచ్ సమయంలో కిరణ్మయి అతడిని కలిసి, "సాయంత్రం ఆరు గంటలకు చంద్రికా రెస్టారంటులో కలవండి" అని చెప్పింది.
ఇంకేం! ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. మనసులు విప్పి మాట్లాడుకోవడం తరవాయి, మంగళ వాయిద్యాల మధ్య కల్యాణమే అని అతను మురిసిపోయాడు.
చంద్రికా రెస్టారంటులో, యిద్దరూ కలిసి, ఒక ప్రక్కగా కూర్చున్నారు. ముందుగా కిరణ్మయే మాట్లాడింది.
"సత్యా! నా పెళ్ళి కుదిరింది. శుభ లేఖలు రేపు అందరికీ యిస్తాను. ఈ వార్త మీకు నచ్చదని నాకు తెలుసు. కానీ ఇదే మనిద్దరికి మంచిది".
సత్యనారాయణ, గుండె గుభిల్లు మంది. బాంబు పేల్చి, ఇదే మంచిదని చెప్పడం, అతడికి కోపం తెప్పించింది. "
"మంచిదని మీరు అనుకున్నారు. కానీ నాకు యెన్నటికీ మంచిది కాదు. నా ప్రేమ గుండెల్లో దాచుకున్నాను. అయినా మీకు తెలిసింది. అంటే నాది సత్యమైన ప్రేమ. దాన్ని మీరు నిర్లక్ష్యం చేసి, అదే మంచిదని అంటున్నారు"
"నేను వయసులో మీకన్న పెద్దదాన్ని. నాకు కుటుంబ బాధ్యతలున్నాయి నా తల్లిదండ్రులను, ఒక ఆటిస్టిక్ తమ్ముడిని నేను జీవితాంతం చూసుకోవాలి. ఈ మధ్యనే అక్క పెళ్ళి చేసాను. దాని బాగోగులు కూడా నేనే చూసుకోవాలి. ఇవన్నీ మీ నెత్తిమీద పెట్టడం న్యాయం కాదు. నాకిష్టంలేదు"
"సరే! ఇప్పుడు యెవరి నెత్తిన పెట్టడం, న్యాయమని పెడుతున్నారు?"
"అతను నాకన్నాపదేళ్ళు పెద్ద. భార్య అతడిని విడిచి వెళ్ళిపోయింది. మూడేళ్ళ వయసున్నకూతురుంది. గంతకు తగ్గ బొంత అంటారే అలా. ఒకరికొకరం తోడు. "
"మీరు నా కన్నా ఒక యేడాది పెద్ద. కాబట్టి న్యాయం కాదు అన్నారు. మరి అతను పదేళ్ళుపెద్ద, అది న్యాయమా?"
"భార్యకన్న భర్త దాదాపు యేడేళ్ళు పెద్ద అయితే మంచిదని పెద్దలు చెప్పారు. అందువల్ల ఇందులో అన్యాయం లేదు. "
"పెద్దలు భర్త అంటే భరించు వాడు అని చెప్పారు కదా! ఆ లెక్కన నేను మిమ్మల్ని మీ కుటుంబ బాధ్యతలను మోసే వాడిని. కానీ మీరు నాకా అవకాశం యివ్వలేదు. నాకు అన్యాయం చేసారు"
"లేదు. మీరు నవ్వుతూ హాయిగా వుంటారు. నేను సీరియస్ గా, దిగులుగా వుంటాను. నా వల్ల మీ జీవితం, ఆటా పాటా, ముద్దూ ముచ్చటా లేకుండా నిర్జీవమైపోతుంది. ఏదో ఒకరోజు విసిగిపొయి, మీరు నాకు విడాకులు యిస్తారు. ”
"ఆపండి. మీరు నన్ను కాదనుకున్నారు సరే. కానీ ద్రోహి నని చెప్పకండి" అని అతను కఠినంగా బదులిచ్చాడు. అతని ముఖం కోపంతో యెరుపెక్కింది.
కిరణ్మయి అతని కోపం చూసి, చలించి పోయింది. ఆమె గుండెల్లో పేరుకు పోయిన కొండంత బాధ, మంచులా కరిగి, కన్నీటి ధారగా ఆమె చెంపలపైకి జారింది.
ఆమె కన్నీరు అతని మనసుని కలచివేసింది.
"మిమ్మల్ని బాధించాను క్షమించండి. మీకు మంచి జరగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను" అన్నాడు అతను నిర్వేదంగా.
"నా పెళ్ళికి మీరు తప్పక రావాలి. మీ కళ్ళ యెదుట, నేను వేరొకనికి భార్యనైతే, మీకు నా మీద అసహ్యం పెరుగుతుంది. నన్ను మరిచి వేరొకరితో హాయిగా వుంటారు. వస్తారు కదూ. నా మీద ఒట్టు. "
"మీరు నా మీద ప్రేమతో నాకు దూరమవుతున్నారని తెలిసి మిమ్మల్ని నేనెలా అసహ్యించుకోగలను. నా కంఠంలో ప్రాణమున్నంతవరకు మిమల్ని ప్రేమిస్తూనే వుంటాను. ఆ ప్రేమతోనే, మీ పెళ్ళికి వస్తాను. మీకు మంచి జరగాలని కోరుకుంటాను".
నిర్మలమైన అతని మాటలు ఆమెను మరింత బాధించాయి. అయితే పైకి నవ్వుతూ, "థాంక్స్" చెప్పి ఆమె వెళ్ళడానికి లేచింది.
చిన్న బోయిన వదనంతో, వేదనాభరిత స్వరంతో సత్యనారాయణ యిలా అన్నాడు,
"కిరణ్మయీ! నాతో చెప్పకుండా మీరు వివాహ నిర్ణయం తీసుకోవడం తప్పు. ఒక్క మాట, తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తాడు. ఆల్ ది బెస్ట్. "
కిరణ్మయికి అతని మాటల వెనుక వున్న గాఢ ప్రేమ అర్ధమైంది. ఈ పెళ్ళి ఆగిపోతే.. ఎలా ఆగుతుంది? ఎందుకు ఆగుతుంది? తప్పు చేసాను. ఒక ప్రేమ పెన్నిధిని పోగొట్టుకున్నానని వ్యధ చెందింది. ఆమె వుబికి వచ్చే కన్నీటిని అదిమి పెట్టుకుంటూ, అతనికి దూరంగా వెళ్ళిపోవడానికి అడుగులు ముందుకు వేసింది. ఆమె వెళ్ళిపోవడాన్ని తట్టుకోలేని సత్యనారాయణ, గట్టిగా యిలా అన్నాడు.
"దీపంలా వెలుగు చూపండి, కానీ కొవ్వొత్తిలా కరిగిపోకండి"
@@@
మనిషి ఒకటనుకుంటే, దేవుడింకొకటి అనుకుంటాడన్న మాట తనకు గాక కిరణ్మయికి వర్తించాలని సత్యనారాయణ కోరుకున్నాడు. విచిత్రంగా అతని స్నేహితుడు విశ్వం అదే మాట చెప్పి సత్యనారాయణను వూరడించే ప్రయత్నం చేసాడు.
“చూడు మిత్రమా! పెళ్ళి కాన్సిలైన సందర్భాలెన్నో. ఇటు నిజ జీవితంలో, అటు సినిమాల్లో. ఒక పరిశోధన గ్రంధం వ్రాసేంత సమాచారం వుంది.
నువ్వు దీనంగా చూస్తూంటే, భరించలేక, కిరణ్మయి నాకీ పెళ్ళి వద్దు అని భయంకరంగా అరుస్తూ నీ దగ్గరికి రావచ్చు.
పెళ్ళి కొడుకు తనను మోసం చేసాడని ఒక స్త్రీ చేసే ఆర్తనాదాలతో కాన్సెల్ కావచ్చు
కట్నం చాలలేదని పెళ్ళి కొడుకు తండ్రి కాన్సెల్ చెయ్యచ్చు.
దొంగ పెళ్ళిళ్ళు చేసుకున్నాడని పొలీసులు వరుడిని అరెస్ట్ చేయవచ్చు
సరైన మర్యాదలు జరగలేదని గొడవలు పడి, ఇరుపక్షాలవారు కాన్సెల్ అని అరవా వచ్చు.
చివరి బంతి దాకా ఆట ఆడాలి. హనీమూన్ నించి తిరిగి వచ్చేదాకా ఎదురుచూడాలి. ముందే ఆశ వదులుకోకు. మనం పెళ్ళికి వెడదాం. జరిగేది చూద్దాం. "
“థాంక్స్ రా! ఒకరి పెళ్ళి చెడిపోవాలని కోరుకోవడం మంచిది కాదు. నాకిలా రాసిపెట్టి వుందని సమాధాన పడదాం" అని సత్యనారాయణ నిద్రకుపక్రమించాడు.
విశ్వం ఒక సారి గట్టిగా నిట్టూర్చి, “అసలు నీకు చెప్పకుండా వదిలేసినదొకటుంది. ఎప్పుడూ పెళ్ళి వారి బస్సులు, కార్లు ప్రమాదానికి గురి కావడం, వధువో, వరుడో స్వర్గంలో పెళ్ళి చేసుకుందామని వెళ్ళిపోవడం వింటూంటాం. అది చెప్పలేదు. వినాశనం కూడా ఒక పరిష్కారం” అని అనుకుంటూ నిద్రపోయాడు.
@@@
కిరణ్మయి గ్రామంలోనే పెళ్ళి. కల్యాణ మంటపం చిన్నదిగా, సాదా సీదాగా వుంది. సిటీలోనే డిన్నరు యిస్తానని కిరణ్మయి చెప్పడం వల్ల, ఆమె స్నేహితురాండ్రిద్దరు తప్ప, ఆఫీసు వారెవ్వరూ రాలేదు. సత్యనారాయణను చూసి, కిరణ్మయి చాలా సంతోషించింది. పెళ్ళి చీరలో వున్న కిరణ్మయిని చూసి, సత్యనారాయణ బాధపడకుండా వుండలేకపోయాడు. అందరూ వచ్చి ఆమెను అభినందించి వెడుతున్నారు. ఇంకొక అరగంటలో పెళ్ళి తంతు ప్రారంభమవుతుందనగా, ఎదురుచూడని గొడవ ఒకటి ప్రారంభమైంది.
పెళ్ళి కొడుకు రమణ మూర్తి భార్య విమల, తిరిగి వచ్చింది. రమణ మూర్తి తల్లి, ఆమెను వెళ్ళి పొమ్మని అరుస్తోంది.
"రెండేళ్ళయ్యింది నువ్వెళ్ళి. వాడెవడో రంకు మొగుడికోసం, నా బిడ్డని, యేడాది పసిదాన్ని వదిలి వెళ్ళావు. నువ్వు ఆడదానివేనా? చెడిపోయిన భార్యగా కుటుంబానికి కళంకం తెచ్చావు. పో! తక్షణం వెళ్ళు. నా బిడ్డకు భార్యని, అ పసిగుడ్డుకొక తల్లిని యేర్పాటు చేస్తున్నా."
విమల అత్తగారి కాళ్ళు పట్టుకుని రోదిస్తూ "తప్పు చేసాను అత్తయ్యా! వాడిని యెప్పుడో వదిలేసాను. ఇంటికి రావడానికి ముఖం చెల్ల లేదు. మొన్న రఘు (రమణ మూర్తి మేనల్లుడు) కనబడి, ‘అత్తయ్యా, మామ నిన్ను తలచుకోని దినం లేదు. నీ కోసం చూసి చూసి, విధిలేక పెళ్ళి చేసుకుంటు’న్నారని చెబితే పరుగున వచ్చాను"
“అదేం కుదరదు. నా కొడుకు జీవితం నాశనం చేస్తానంటే నేనూరుకోను”.
"ఒక్క సారి ఆయనను కలిసి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాను. అనుమతివ్వండత్తయ్యా".
భార్య మాటలు చెవిన పడ్డ రమణ మూర్తి ఒక్క వుదుటన ఆమె దగ్గరకు వచ్చాడు.
"విమలా" ప్రేమ నిండిన అతని పిలుపు విన్న విమల అతని పాదాలపై పడి "క్షమించండి. అప్పుడు ఇల్లు విడిచి, ఇప్పుడు పెళ్ళి చెడగొట్టి, మీకు ద్రోహం చేస్తున్నా! అత్తయ్య అన్నట్లు నేను కళంకితను. నేను వెళ్ళిపోతాను” అని యేడుస్తూ అక్కడనుంచి కదలబోయింది.
"ఎక్కడి వెడతావు? రా! నా భార్యగా వుండాలని వచ్చావు. నిన్ను నేను వదులుకోను. నా బిడ్దకు తల్లివి నువ్వు. బిడ్డని చదివించి, పెళ్ళి చేసి పంపేదాక, నాతో వుంటానని మాట యివ్వు"
రమణమూర్తి మాటలకు అతని భార్య తో పాటు అక్క డ వున్న బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
విమల అతని రెండు పాదాలపై చేతులుంచి, "మీ పాదాల మీద ఆన. ఈ బొందిలో ప్రాణం పోయే వరకు మిమ్మల్ని విడిచి వెళ్ళను" అంది.
రమణ మూర్తి, ఆమెను లేవదీసి, పొదివి పట్టుకుని, కిరణ్మయి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు.
"కిరణ్మయీ! మమ్మల్ని క్షమించు" అని యిద్దరూ చేతులు జోడించి అర్ధించారు.
కిరణ్మయి అంతరంగం ఆనంద సంద్రమైంది.. ఆమె నవ్వుతూ, "నాకు చాలా సంతోషంగా వుంది. ఈ ముహుర్తబలం విడిపోయిన భార్యాభర్తలని ఒకటి చేసింది. పాప అదృష్టవంతురాలు" అని అంది.
పెళ్ళి కొడుకు తరపు వారు వెళ్ళిపోవడంతో, పెళ్ళి మండపం ఖాళీ అయింది..
కిరణ్మయి అక్క కిరణ్మయితో, "ముహుర్తానికి ఇంకా సమయముంది. నీ బాయ్ ఫ్రెండ్ వున్నాడు. ఆలస్యమెందుకు?" అంది.
కిరణ్మయి కలహంస నడకలతో సత్యనారాయణని చేరింది. అందరూ చూస్తూండగా, "నేనొకటి తలిస్తే నీ దేవుడు ఇంకొకటి తలిచాడు. నన్ను నీ దగ్గరకు చేర్చాడు. నీ దాన్ని చేసుకుంటావా? అలిగి నా కొద్దు పొమ్మంటావా” అని అడిగింది.
"అలాంటి ప్రశ్నలడిగి నా ప్రేమను అవమానించకు. నేను సదా నీ ప్రేమదాసుడనే. ఆజ్ణాపించు దేవి" అన్నాడు సత్యనారాయణ.
బాగుంది సంబడం. ఇంత కాడికి ఆ సంబంధం యెందుకు కుదుర్చుకున్నట్టు అని అక్కడ వున్న అమ్మలక్కలే కాదు, కిరణ్మయి స్నేహితులు కూడా అనుకున్నారు. ఎవరేమనుకున్నావారి పెళ్ళి జరిగిపోయింది.
@@@
సత్యనారాయణ ప్రేమ కిరణ్మయిని మార్చివేసింది. ఆమె ఇప్పుడు కలుపుగోలుగా, అందర్ని పలకరిస్తూ, నవ్వులు చిందిస్తోంది. మొగుడుని ముద్దు చేసి, మురిపాలలో ముంచెత్తుతోంది. బాధ్యతల వల్ల సత్యనారాయణలో పెద్దరికం వచ్చింది. ఇప్పుడతని ముఖం గంభీరంగా వుంటోంది. “కరుణాలవాలా! ఇది నీదు లీల, అంతయును వింత పొగడగ నేనెంత” అని గగన వీధిలో నారదుడు దేవుడిని కీర్తిస్తున్నాడు.
@@@@@
C..S.G . కృష్ణమాచార్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో. నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు ప్రచురించాయి.
ఈ మధ్యనే నాకిష్టమైన తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను. ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది, చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ- వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).
Kommentare