top of page
Writer's pictureMohana Krishna Tata

విధిరాత

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #Vidhiratha, #విధిరాత, #TeluguKathalu, #తెలుగుకథలు


Vidhiratha - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 20/11/2024

విధిరాత - తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


ఒంట్లో చాలా నీరసంగా ఉంది. కళ్ళు పూర్తిగా తెరుచుకోవట్లేదు.. గట్టిగా కళ్ళు తెరిచి ఒక్కసారి చూసాను. నాలాగే చుట్టూ చాలా మంది అక్కడ మంచం మీద పడుకుని ఉన్నారు. అందరికీ గొంతులోకి గొట్టాలు పెట్టి ఉన్నాయి.. అప్పుడు అర్ధమైంది నేను ఐసీయూలో ఉన్నానని. 


"పాపం.. ఇతని పరిస్థితి చూస్తే జాలి వేస్తోందే.." అంది ఒక నర్సు అప్పుడే డ్యూటీకి వచ్చిన ఇంకో నర్సుతో.


"ఏమైందే పాపం.. ! చూస్తే, ఇతనికి ఏదో పెద్ద ప్రాబ్లెమ్ ఉన్నట్టు ఉంది.. ఇంతకీ ఏమైంది.. ?" అడిగింది ఆ నర్సు.


"ఇతను మా ఇంటి దగ్గరే ఉంటాడు. మొన్నటి దాకా యాక్టివ్ గా ఉన్న ఇతను.. నాలుగు రోజుల ముందు మన హాస్పిటల్ కి వచ్చాడు. నీరసంగా ఉందంటే, డాక్టర్ టెస్ట్స్ చేసి, క్యాన్సర్ అని కంఫర్మ్ చేసారు.."


"అయ్యో పాపం.. ! ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యింది కదా.. ! ఇక నయం అయిపోతుందిలే..!"


"ఇతనికి క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజి లో ఉంది.. కొన్ని నెలలు ముందు వచ్చి ఉంటే, నయమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండేవి.." అని ఇందాకల డాక్టర్ అంటుండగా విన్నాను 


"మరి ఇప్ప్పుడు ఏమిటి ఇతని పరిస్థితి..?" అనుకుంటూ ఇద్దరు నర్సులు బయటకు వెళ్లిపోయారు 


అయ్యో.. ! విధిరాత.. ఎంత విచిత్రమైనది.. ! ఎంతో జాగ్రత్తగా ఉండే నాకు, ఈ జబ్బు రావడమేమిటో.. ? అయినా టెస్ట్స్ చేయించుకోకపోవడం నాదే తప్పు. ఎంతసేపూ నా ఫ్యామిలీ అంటూ ఆలోచించాను గాని.. ఎప్పుడూ నా గురించి శ్రద్ధ తీసుకోలేదు. ఇప్పుడు నన్ను నమ్ముకున్న నా భార్యకి, పిల్లలకి అన్యాయం చేస్తానేమో " అంటూ కళ్ళలోంచి కన్నీరు జారింది.. 


ఈలోపు నా భార్య లోపలికి వచ్చింది. ఒక చేత్తో నా ముఖం మీద ఉన్న తడిని తుడుస్తూ.. మరో చేత్తో తన కంట్లో కన్నీరుని తుడుచుకుంటోంది.. 


"ఏమండీ.. ! మన అబ్బాయి అమెరికా నుంచి బయల్దేరాడు.. రేపటికల్లా వచ్చేస్తాడు. మీకు ఏమీ కాదు.. " అంటూ అబ్బాయి విమానం ఎక్కిన వీడియో నాకు చూపించింది. మన అమ్మాయి కూడా బయల్దేరింది.. రేపు ఉదయానికి వచ్చేస్తుంది.."


'ఇదేమిటి.. ? అబ్బాయి, అమ్మాయి నా కోసం బయలుదేరుతున్నారా..? డాక్టర్ ఏమంటున్నారు' అని నా భార్య కి సైగ చేసాను.


"మీకు ట్రీట్మెంట్ చేస్తున్నారు.. మీరు ధైర్యంగా ఉండండి.." అంటూ అక్కడ నుంచి ఏడుస్తూ.. వెళ్లిపోయింది నా భార్య. 


"జీవితంలో ఆఖరి పేజిలో ఉన్నానని నాకు అర్ధమైంది.. ఇంకా కొన్ని సంవత్సరాలు బతికితే బాగుండేది.." అంటూ రోదించింది నా మనసు. నా గతం కళ్ళ ముందు కనిపించింది.. 


*******


మా తల్లిదండ్రులకి నేనూ మా తమ్ముడు ఇద్దరము. నేను స్కూల్ లో టీచర్ గా స్థిరపడ్డాను. తమ్మడికి ఇంకా ఉద్యోగం రాలేదు. నా పెళ్లి అవడం, పిల్లలు పుట్టడం అన్నీ కాలంతో పాటు జరిగిపోయాయి. ముందు బాబు, తర్వాత పాప. 


దేవుని దయవలన తమ్ముడికి ఎక్కడో దూరంగా టీచర్ పోస్టింగ్ వచ్చింది. అక్కడ ఒక్కడే ఉండలేడని, పెళ్లి చేసి పంపించాము. దూరాన ఉన్నా.. వాడు బాగుంటే చాలని అనుకున్నాము. 


కాలం వేగంగా ముందుకు కదులుతోంది. సంవత్సరానికి ఒకసారి తమ్ముడు మా ఊరు వచ్చి నన్ను కలుసుకునే వాడు. అలా సరదాగా ఒక ఇరవై ఏళ్ళు గడిచిపోయాయి. వాడికి ఇద్దరు అమ్మాయిలు. పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్న సమయంలో, ఒక రోజు నా మరదలు నుంచి నాకు ఫోన్ వచ్చింది.. 


"బావగారూ..!" అంటూ ఏడుస్తూ ఉంది నా మరదలు.

 

"ఏమైంది..?"


"మీ తమ్ముడికి హార్ట్ ఎటాక్ వచ్చింది.. హాస్పిటల్ లో చేర్పించాము. డాక్టర్స్ కష్టం అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది.. మేమేమో ఇక్కడ ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. వెంటనే రండి.." అని ఏడుస్తూ అంది. 


నాకన్నా చిన్న వాడికి హార్ట్ ఎటాక్ రావడమేమిటి.. ? ఏమిటో ఈ విధిలీల.. ? అనుకుంటూ నేనూ, నా భార్య వెంటనే ఊరు బయలుదేరాము. ట్రైన్ లో వెళ్తే ఒక రోజు పడుతుందని, విమానం లో అక్కడికి చేరుకున్న మాకు.. తమ్ముడు ఇక లేడన్న వార్త తెలిసి జీర్ణించుకోలేకపోయాము. 


మరదలితో జరిగినది తెలుసుకున్నాను. హార్ట్ లో బ్లాక్స్ ఎక్కువ ఉన్నందున, ఇలా జరిగిందని.. బాగా ముందుగా టెస్ట్స్ చేయించుకుని ఉంటే, ఇలా జరిగేది కాదని డాక్టర్స్ అన్నారని చెప్పింది. నా మరదలికి ధైర్యం చెప్పి ఇంటికి వచ్చేసాము. 


కొన్ని రోజులకి అంతా మాములుగా అయింది. నేను మళ్ళీ నా స్కూల్ కి వెళ్లడం మొదలు పెట్టాను. సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలు పెద్దవారు అయ్యారు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసాము. 


నా తమ్ముడు పెద్ద అమ్మాయికి, నా మరదలు మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. నేను చాలా సంతోషించాను. తమ్ముడు లేని లోటు తెలియకుండా పెళ్లి దగ్గరుండి బాగా చేయించాను. 


అబ్బాయికి పిల్లలు లేరన్న బాధ కూడా ఈ మధ్య తీరింది. వాడికి ఒక పాప పుట్టింది. మా అమ్మాయి ఎప్పుడు పిల్లల గురించి ఆ శుభవార్త చెబుతుందా అని ఎదురు చూస్తున్నాము నేనూ నా భార్య.. పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా అమ్మాయికి పిల్లలు కలుగలేదు. 


ఆ తర్వాత అరవై సంవత్సరాలు వచ్చాయని.. స్కూల్ వారు పెద్ద ఫంక్షన్ చేసి, నన్ను రిటైర్ చేసారు. 


*******


తెలివి వచ్చి కళ్ళు తెరచి చూసిన నాకు.. జిగేలు మనే కాంతి తో చుట్టూ భవనాలు.. అదేదో పెద్ద హాస్పిటల్ లోకి నన్ను మార్చారేమోనని మొదట అనుకున్నాను. తర్వాత తెలిసింది.. ఆ నవ్వులు, ఆ సంగీతం వింటే, నేను వేరే లోకంలో ఉన్నానని.. 


"అన్నయ్యా.. ! అంటూ ఎవరో పిలుస్తున్నారు. వెనుకకు తిరిగి చూసిన నాకు, నా తమ్ముడు దర్శనమిచ్చాడు. అప్పుడు అర్ధమైంది నేను ఎక్కడ ఉన్నానో.. "


"ఏమిటి అన్నయ్యా.. ! నువ్వు కూడా స్వర్గానికి రావడానికి తొందరపడ్డావా.. ?"


"లేదు తమ్ముడు.. ! నాలుగు రోజుల వరకు బాగానే ఉన్న నాకు, నిన్న హాస్పిటల్ లో జాయిన్ అవడం, ఈ రోజు ఇలాగ ఇక్కడ.. " అంటూ బాధపడ్డాను.


"పెద్ద జబ్బుతో ఎంత పెద్ద హాస్పటల్ లో అడ్మిట్ అయినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా, బతికి బయటకు వస్తామని నమ్మకం లేదు అన్నయ్య.. ముందు నుంచే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది. అయినా ఎంతో జాగ్రత్తగా ఉండే నువ్వు.. జబ్బు ముదిరే వరకు ఎందుకు చూసుకోలేదు.. ఈ కాలుష్యం, కల్తీ ప్రపంచంలో బతుకుతున్నప్పుడు అందరికీ జాగ్రత్త తప్పదు. నేను చేసిన తప్పే నువ్వు కూడా చేసావు.. నా భార్య ఎన్ని సార్లు చెప్పినా, వినలేదు.. టెస్ట్స్ చేయించుకోలేదు. హార్ట్ లో బ్లాక్స్ ఎక్కువై.. ఇలా నీ కన్నా ముందే ఇక్కడకు వచ్చాను.. మా అమ్మాయిల పెళ్లిళ్లు చేతులారా చెయ్యలేకపోయాను" అంటూ బాధపడ్డాడు తమ్ముడు. 


"బాధపడకు తమ్ముడు.. ! నిజమే.. ఇద్దరమూ పెద్ద తప్పే చేసాము. చెప్పాలంటే, మన మగవారంతా.. భార్య, పిల్లలు అంటూ వాళ్ళకోసం అన్నీ చేస్తాము.. వాళ్ళకి ఏదైనా చిన్న బాధ కలిగినా మనకే చెబుతారు.. కానీ మనం మన బాధను ఎవరికీ చేపుకోలేక, మనలోనే టెన్షన్ పెంచుకుంటాము.. మన ఆరోగ్యం కుడా సరిగ్గా చూసుకోము.. "


"నువ్వు చెప్పింది నిజమే అన్నయ్యా.. "


"అదిగో చూడు.. నా కోసం, నా భార్య, పిల్లలు ఎంతగా ఏడుస్తున్నారో.. చుట్టూ ఎంతమంది రోదిస్తున్నారో.. ! నేను ఇంకా కొన్ని సంవత్సరాలు బతికి ఉండి ఉంటే ఎంతో బాగుండేది.. " అంటూ బాధపడ్డాను. 


"బాధపడకు అన్నయ్యా.. ! భూలోకంతో మనకు ఇక ఋణం తీరిపోయింది. ప్రతి మనిషికి ఈ పరిస్థితి ఎప్పుడో రాక తప్పదు.. విధిరాతను ఎవరూ తప్పించుకోలేరు.. " 


**********

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


136 views2 comments

2 Kommentare


Ra Sud
Ra Sud
26. Nov.

Good one

Gefällt mir

mk kumar
mk kumar
21. Nov.

"విధిరాత" తాత మోహనకృష్ణ గారు రచించిన ఓ భావోద్వేగభరితమైన తెలుగు కథ. ఈ కథలో మనిషి జీవితాన్ని మార్చేసే అనారోగ్య పరిస్థితులు, కుటుంబ సభ్యుల బాధ, మనం జీవనంలో నిర్లక్ష్యంగా చేసే తప్పులను హృదయానికి హత్తుకునే విధంగా చిత్రీకరించారు.


ఈ కథ మనందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తుంది. మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం జీవితానికి ఎంత ప్రమాదకరమో, మనం కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ఆలోచిస్తూ, తమ గురించి పట్టించుకోకపోతే చివరకు మన స్వంత ఆరోగ్యం, కుటుంబం మీదే అది తీవ్ర ప్రభావం చూపుతుందనే సందేశాన్ని ఈ కథ అందిస్తుంది.


"విధిరాత" మనిషి జీవితంలోని అమూల్యమైన గుణాలు, వ్యక్తిగత జాగ్రత్తలు, కుటుంబ ప్రేమను అర్థం చేసుకునేలా చేసే గొప్ప కథ.


Gefällt mir
bottom of page