విద్యా విధానం నాడు నేడు
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- 1 day ago
- 7 min read
#VidyaVidhanamNaduNedu, #విద్యావిధానంనాడునేడు, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #TeluguArticleOnEducationSystem

Vidya Vidhanam Nadu Nedu - New Telugu Article Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 05/04/2025
విద్యా విధానం నాడు నేడు - తెలుగు వ్యాసం
రచన: కందర్ప మూర్తి
ఈ మధ్య మన తెలుగు రాష్టాల్లో ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు శిక్షకు బదులు తనకు తనే శిక్షగా విద్యార్థుల ఎదుట గుంజీలు తీసి తన ఆవేదన
వ్యక్త పరిచారు. ఇది ఎంత బాధ, సోచనీయ విషయం.
తరాలు మారుతున్నాయి. నూతన విద్యా విధానంలో మార్పులు వస్తున్నాయి. తల్లిదండ్రులు, విద్యార్థుల మనస్తత్వాల్లో భేదాలు కనబడుతున్నాయి.
నేటి ఆధునిక తరంలో విద్యా విధానంలో మార్పులతో పాటు విద్యార్థుల సంఖ్య పెరిగి సాంకేతికంగా ప్రమాణాలు పెరిగినప్పటికీ నైతిక విలువలు క్షీణిస్తున్నాయి. కాన్వెంటు, కార్పొరేట్ స్కూల్స్ కారణంగా విదేశీ భాషల ప్రభావంతో చదువుల్లో దేశీయ భాషల వాడుక వెనుకబడింది.
ప్రతి సంవత్సరం 5 సెప్టెంబరు ఉపాధ్యాయ దినంగా ఉత్తమ ఉపాధ్యాయులని సన్మానించి గౌరవిస్తున్నాము. మరో పక్క అదే ఉపాధ్యాయులను కించపరచడం భావ్యం కాదు. ఎందరో ఉపాధ్యాయులకు అవమానాలు జరుగుతున్నా బయటి ప్రపంచానికి తెలిసేవి కొన్నే. తల్లిదండ్రులు తమ బిడ్డలకు గురువుల పట్ల గౌరవభావాన్ని కలిగించాలి. అప్పుడే ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మం సక్రమంగా పాటించే అవకాశం ఉంటుంది.
నేడు విద్య ఒక వ్యాపారంగా మారి రాజకీయ నాయకుల, పెద్ద వ్యాపార వేత్తల ఆధ్వర్యంలో కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలు రాజకీయ జోక్యంతో విద్యాలయాలు నడుస్తున్నాయి.
ఉపాధ్యాయులకు తార్గేట్లు ఇచ్చి ఎడ్మిషన్లు జరుపుతున్నారు. సాంకేతిక విద్యాసంస్థలు, వైద్య కళాశాలలు ఇలా అన్నిటా విద్యార్థి ప్రతిభ కన్న సిఫార్సులు, డబ్బులు ప్రభావం
చూపుతున్నాయి. మార్కులు రేంకులు అన్నిటా పెద్దల ప్రభావమే.. ఎటువంటి సిఫార్స్ లేని సామాన్యుడి గతి అధోగతే.
పాత తరం రోజుల్లో ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలే ఉండేవి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మద్య తరగతి బలహీన వర్గ ప్రజల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకునే వారు. ఇప్పటిలా అప్పట్లో పాఠశాలలు సరైన వసతులు లేక పాకలు, గొడ్లశాలలు, చెట్ల కింద తరగతులు జరిగేవి. నేల మీద కూర్చుని పిల్లలు విద్య నేర్చుకునేవారు. యూనిఫారాలు ఉండేవి కావు. ఎవరి స్థాయిని బట్టి వారు దుస్తులు ధరించి వచ్చేవారు.
అలాగే చదువుకునే పుస్తకాలు, రాత పరికరాలు నియమిత తీరులో ఉండేవి. కాళ్లకు చెప్పులు లేకుండా జట్లుగా దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చేవారు. చిన్న తరగతుల నుంచి పెద్ద తరగతుల వరకు ఎటువంటి వత్తిడి లేకుండా ఆటపాటలతో చదువు సాగేది.
విద్యార్థులు తరగతుల సమయంలో అల్లరి చేసినా తప్పు పని చేసినా క్రమశిక్షణగా అందరి ముందు గుంజీలు తీయించడం, గోడ కుర్చీ, నడుం కిందకు వంచి తల ముడుకులు తగిలేలా వంగోబెట్టేవారు. నెత్తి మీద మొట్టికాయలు వేసేవారు. బెత్తంతో అరిచేతుల మీద కొట్టేవారు. ఇలా విద్యార్థులకు అనేక రకాల శిక్షలు అమలు పరిచేవారు. వారి తల్లిదండ్రులకు తెల్సినా ఏమనేవారు కాదు. పిల్లలకు చదువు రావాలంటె అటువంటి శిక్షలు సబబే అని అధ్యాపకుల్సి ప్రోత్సహించేవారు.
అలాగే ఉపాద్యాయులు కూడా భాద్యతగా తరగతులలో పాఠాలు బోధించేవారు. తరతమ్య భేదం లేకుండా విద్యాబోధన జరిగేది. వారికి విద్యతో పాటు నైతిక విలువల బోధన జరిగేది. పెద్దలంటె గౌరవం, దయాగుణం, పరస్పర సహాయం వంటి లక్షణాలు కలిగించేవారు. ఆడ మగ పిల్లలు కుటుంబ సబ్యుల్లా కలిసి మెలిసి చదువుకునేవారు. పాఠశాల అయిపోగానే ఇంటి వద్ద కలిసి మెలిసి వివిధ ఆటలు ఆడేవారు.
ఇంట్లో వయసు మళ్లిన వయోవృద్ధులు ఉంటే సమయం ఉన్నప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టి పురాణ జానపద కథలు, నీతి సూక్తులు, సాహస చరిత్ర విషయాలు తెలియ చెప్పేవారు. ఎక్కువ భాగం మాతృ భాషలోనే చదువు సాగేది. అందువల్ల మన సంస్కృతి, సాంప్రదాయం, అలవాట్లు పిల్లలకు తెలిసి భావి జీవితంలో వారికి ఎంతో దోహద పడేవి.
నా దృష్టిలో ఉపాధ్యాయుడంటె మార్గనిర్దేశకుడని తలుస్తాను. జన్మనిచ్చిన అమ్మానాన్నల తర్వాత లోకజ్ఞానాన్ని నేర్పి నైతిక విలువలతో విద్యను బోధించి పిల్లలను దేశ భావి పౌరులుగా తీర్చిదిద్దేది గురువే. అటువంటి పవిత్రమైన గురువులను వినోదం పేరుతో కమెడియన్లుగా చలన చిత్రాల్లో చూపించడం బాధాకరమైన విషయం. ఇలాంటి హాస్య సన్నివేశాలను చూసిన విద్యార్థులు గురువులకు ఏం విలువ ఇస్తారు. ఈ సన్నివేశాలు ఇప్పటి సినేమాలలోనే కాదు దేవదాసు వంటి పాత సినేమాలలో కూడా గురువులను హాస్యం పేరుతో అపహాస్యం చేస్తు వస్తున్నారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య కళాశాలలో కూడా ఇదే తీరు.
ప్రభుత్వాలు, సెన్సారు బోర్డువారు ఇటువంటి అపహాస్య సన్నివేశాలకు ఎలా అనుమతి ఇస్తున్నారో తెలియడం లేదు. వ్యాపార దృక్పథంతో తీసే సినేమాలు విద్యా బోధన చేసే గురువులనే ఎందుకు ఎంచు కుంటున్నారు. అలాగే మన సినేమాలలో హాస్యం పేరుతో పోలీసు, వైద్య, న్యాయ శాఖ ఇలా సమాజానికి ఒక దిశ దశ చూపే ప్రభుత్వ రంగాలను మన దర్శకులు కించపరచడం సబబు కాదు.
సినేమా మాద్యమం ప్రేక్షకులకు వినోదంతో పాటు సమాజానికి ఉపయోగ పడే నైతిక విలువలతో కూడిన సందేశం సినేమాలలో కనబర్చడం దర్శకుల బాధ్యత. ఉపాధ్యాయులకు ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలైనా పాఠశాలల్లో విద్యకు సంబంధమైన విధులు తప్ప అదనపు బాధ్యతలు అప్పగించకుండా చూడవల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
నేటి ఉపాధ్యాయుల పరిస్థితి అరిటాకు మాదిరిగా ఉంది. విద్యార్థులు ఆధునిక ప్రసార మాద్యమాల ఆకర్షణలో పడి చదవక మార్కులు పొందక పోయినా రేంకులు సంపాదించక పోయినా తరగతులకు విద్యార్థులు హాజరుకాకపోయినా అటు తల్లిదండ్రులు, ఇటు పాఠశాలకు సరైన ఫలితాలు రావడం లేదని ఉన్నత అధికారుల తాకీజులతో ఉపాధ్యాయులనే భాద్యులుగా చేస్తున్నారు.
బడిపంతుళ్ల ఇబ్బందులు పాతరోజుల్లో బతకలేక బడిపంతులు అనేవారు. అప్పట్లో పాఠశాలలకు సరైన వసతులు లేక, జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులతో బడిపంతులు సతమతమైతె నేడు అన్ని సౌకర్యాలున్నా వత్తిడి, వేదనలతో బతుకుతున్నాడు బడిపంతులు అనే ఉపాధ్యాయుడు.
ప్రాంతీయ భేదం, కులం, జాతి, మతం పక్కన పెడితే ఇతరత్రా సమస్యలతో సతమతమవుతున్నాడు గురువనే బడిపంతులు. మంచి, చెడు అన్ని రంగాలలో ఉన్నాయి. మంచి తొందరగా బయట పడదు. చెడు మాత్రం గాలిలో పొగలా తొందరగా అంతటా వ్యాపిస్తుంది. పాఠశాల సిబ్బంది బాలికలతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ప్రసార మాధ్యమాల ద్వారా విన్నాము.
అలాగే దీర్ఘ కాలం ఒకే పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లేటప్పుడు ఆ ఉపాధ్యాయుడితో ఉన్న అనుబంధంతో విద్యార్థులు కన్నీటితో వీడ్కోలు చెప్పినట్టు ప్రసార మాద్యమాల ద్వారా విన్నాము.
మరికొందరు ఉపాధ్యాయ సిబ్బంది నూతన పద్దతులతో పాఠశాలను తీర్చిదిద్ది విద్యార్థుల చదువులకు దోహద పడుతున్నారు. ఇంకొందరు విద్యార్థులలోని సృజనాత్మకతను పైకి తీసి చిత్రకారులు, కవిత కథా రచయితలుగా ప్రోత్సహిస్తు పత్రికలలో వారి ప్రతిభను
కనబరుస్తున్నారు.
ఇప్పటికీ గ్రామీణప్రాంత పాఠశాలలో మౌలిక సదుపాయాలు సరైన తరగతి గదులు, తాగునీరు, మూత్రశాలలు, ఆటల స్థలంలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఉంటె అధ్యాపకులు కావల్సినమంది ఉండరు.
మరికొన్ని పాఠశాలల్లో అధ్యాపకులు ఉంటె విద్యార్థులు లేక మూతపడుతున్నాయి. గిరిజన గ్రామీణ ప్రాంత పాఠశాలల అధ్యాపకులకు సరైన రోడ్లు రహదారి వసతులు లేక విధులకు రావాలంటె ఇబ్బందులు పడుతున్నారు.
నేటి పరిస్థితుల్లో పిల్లలకు ఆధునిక విద్య అవుసరమే. వారికి ఆధునాతన సాంకేతిక పరికరాలు సమకూరుస్తున్నప్పటికీ వాటి నిర్వహణ, నేర్పే శిక్షకులు అవుసరమవుతారు. గ్రామీణ
ప్రాంత పాఠశాల విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారైనందున పట్టణ ప్రాంత పాఠశాలల విద్యార్థుల కంటె వెనుకబడి ఉంటారు. పెద్దల వెంట వ్యవసాయ, వృత్తి పనులకు పనులకు వెళ్లడం వల్ల తరగతులకు పోలేక దైనందిన చదువులో వెనకబడిపోతున్నారు. వారిని అధ్యాపకులు పై తరగతులకు పాసుచేసి పంపుతున్నారు.
అలా వారు ఉన్నత తరగతులకు చేరిన తర్వాత కావల్సిన పరిజ్ఞానం లోపించి వార్షిక పరిక్షలలో ఉత్తీర్ణత సాధించలేక పోతున్నారు. ఉపాధ్యాయులు సరిగ్గా చదువులు చెప్పనందునే తమ పిల్లలు ఉత్తీర్ణత సాధించడం లేదని నెపం వేస్తున్నారు. పాఠశాలకు సరైన ఫలితాలు రావడం లేదని ఉన్నత అధికారుల తాకీజులతో సతమతమవుతున్నారు ప్రభుత్వ
పాఠశాలల ఆధ్యాపకులు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మరిన్ని బాధ్యతలు ఎక్కువ. ఏ ఉపాధ్యాయుడు శలవు తీసుకున్నా లేక ఏ కారణం వల్లనైన రాకపోతే ఆ తరగతి క్లాసులు చూడటం, ఏదైనా అనుకోని సంఘటన జరిగినా బాధ్యుణ్ణి చేస్తారు. పాఠశాల నిర్వహణ, సిబ్బంది హాజరు వంటి భాద్యతలతో మానసికంగా నలిగిపోతున్నారు.
తల్లిదండ్రులు, ఆలోచించండి! మీరు పిల్లల్ని కని ముద్దుముచ్చటలు చూపుతారు కాని వారికి విద్యాబుద్ధులు చెప్పి సమాజానికి భావిపౌరులుగా తీర్చి దిద్దేది పాఠశాలల్లో గురువులే. వారిని గౌరవించండి. ప్రోత్సహించండి. మీ చిన్ననాటి పాఠశాలల చదువులు జ్ఞప్తికి తెచ్చుకోండి. మీరు ఏ ఉన్నత పదవిలో ఉన్నా దానికి కారణం మిమ్మల్ని విద్యా బుద్ధులతో తీర్చి దిద్దింది గురువులే.
ప్రభుత్వ ఉద్యోగ శాఖలలోను లోటుపాట్లు లేకపోలేదు. వాటిని కూడా నిరోధించాలి. సినేమా మాద్యమం ప్రేక్షకులకు వినోదంతో పాటు సమాజానికి ఉపయోగ పడే నైతిక విలువలతో కూడిన సందేశం సినేమాలలో కనబర్చడం దర్సకుల భాద్యత
*
నేటి పిల్లలు ఎందుకు క్రమశిక్షణ తప్పుతున్నారు ?
*********************************************
తరాలు మారుతున్నాయి. పిల్లలు పెద్దల మనస్తత్వాల్లో మార్పులు కనబడుతున్నాయి. కొత్త నీరొచ్చి పాత నీటిని తోసుకుపోయినట్టు అనుభవాలు పరిస్థితులు, పరిసరాలు,
కట్టుబొట్టు ఆహారపు అలవాట్లు అన్నిట్లో కొత్తదనమే.
భూమ్మీద జనాభా పెరగడం వల్ల మానవుడు తన ఉనికి కోసం అడవులు, సముద్రాలు, పర్వతాలు చివరకు అంతరిక్షంలో కూడా నివాశానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందువల్ల వాతావరణ మార్పులతో సమయానుకూలంగా వర్షాలు పడక మరికొన్ని చోట్ల వరదలు, భూకంపాలు, అధిక ఉష్ణోగ్రతలు ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్నాడు మనిషి.
గ్లోబలైజేషన్ కారణంగా దేశాల మద్య విద్య వైద్యం వ్యాపారం పర్యాటక రంగాలలో అభివృద్ధి జరిగి బ్రతుకుతెరువు కోసం యువత విదేశాలకు పయనమవుతున్నారు. విదేశీ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆహార వ్యవహారాల్లో అనుకరణ జరుగుతోంది. నూతన పోకడలు, సాంకేతికంగా అన్ని రంగాలలో ముందుకు పోతున్నప్పటికీ సాంప్రదాయ సంస్కృతులు మాయమవుతున్నాయి.
నేటి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఆర్థిక వనరులు మెరుగయాయి. చిన్న నుంచి పెద్దవారి వరకు శరీరశ్రమ లేకుండా కాళ్ల దగ్గరే అన్ని వసతులు సమకూరుతున్నాయి. చిన్న సూది నుంచి స్ప్ముత్నిక్ అంతరిక్ష నౌక, గాలిపటం నుంచి గేస్ బెలూన్ వరకు వేల మైళ్ల దేశాలను అణు క్షిపణులతో నాశనం చేయగలిగే శక్తిని సంపాదించారు. కృత్రిమ పంటలు, మనిషిని పోలిన రోబో మరమనిషి ఇలా అంతా సాంకేతిక మయమే. మనిషి తనంత తానుగా ఆలోచించే శక్తి లేక యంత్రాల మీద ఆధారపడుతున్నాడు.
ప్రస్తుత తరుణంలో పిల్లలకు కష్టమంటె ఏమిటో తెలియదు. పుట్టుక నుంచి అన్నీ సౌకర్యాలే. ఆడుకునే వయసు నుంచే నర్సరీ, లోవర్ కెజి, అప్పర్ కేజీ తర్వాత పెద్ద తరగతులు.
అటుపైన ట్యూషన్లు, మార్కులు, రేంకులు ఆ తర్వాత హాస్టల్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలా పిల్లల జీవితాలు చదువులు, ఒత్తిడులతో జరిగిపోతున్నాయి. అటుపైన ఉద్యోగం డబ్బు సంపాదనతో జీవితాలు గడిచిపోతున్నాయి.
పిల్లల్లో క్రమశిక్షణ అనేది ఇంటి నుంచే ప్రారంభం కావాలి. పిల్లలు ఇంట్లో పెద్ద వాళ్ళు చేసే పనులను అనుకరిస్తారు. ఆడ పిల్లలైన మగ పిల్లలైన చిన్న తనం నుంచే సమయపాలన, ఎప్పటి పని అప్పుడే చేసుకోవడం, వారి పనులు వారే అంటే స్కూల్ బుక్స్, స్కూల్ బేగ్, యూనిఫామ్ సర్దుకోవడం, షూస్ శుభ్రంగా ఉంచుకోవడం, శరీర శుభ్రత, ఇంట్లో వయో వృద్ధులు ఉంటే వారికి సహాయపడటం, ఎక్కడ తీసిన వస్తువు మళ్ళీ అక్కడే ఉంచేలా చూడటం పిల్లలకు నేర్పాలి.
వినోదం కోసం మొబైల్ ఫోన్, టీవీ వంటివి కొంత సమయం వరకే పరిమితి చేసి తర్వాత చదువులు మీద దృష్టి పెట్టేలా పెద్దలు చూడాలి. సమయం ఉన్నప్పుడు పిల్లలతో ఆప్యాయంగా గడపడం, తోటి పిల్లలతో సఖ్యతగా మెలగడం, పాఠశాలలో గురువులంటే గౌరవం చూపడం వంటి అలవాట్లు వారికి నేర్పాలి. పిల్లల పట్ల ముద్దు చూపినా క్రమశిక్షణ కూడా పాటించాలి. వారికి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక ధ్యాస కలిగించాలి.
పిల్లల్ని చేరదీసే పెద్దవాళ్లు లేక రోజంతా దైనందిన కార్యక్రమాలతో వత్తిడి జీవితం, వారికి కాలక్షేపానికి టివీ, మొబైల్లో ఏనిమేషన్, ఫన్నీ కార్యక్రమాల చూపించడం వల్ల చిన్న వయసు నుంచే వాటిని ఆపరేట్ చేసే తెలివి వచ్చి అలవాటు పడిపోయి పొద్దస్తమానం వాటితో సమయం గడుపుతున్నారు. భార్యభర్తల మద్య తగవులు కారణంగా ఇంట్లోని పిల్లల మనసులపై చెడు ప్రభావం చూపుతున్నాయి.
టీవీలు, మొబైల్లో వచ్చే కార్యక్రమాలు పిల్లల మనసులను ప్రభావితం చేసే ఏహ్యమైన దుస్తులతో డేన్సులు, చావులు, భయానక హత్యలు దోపిడీలు, సంవత్సరం పొడవునా ఏదో ఒకచోట క్రికెట్ మేచ్ లు ఇలాంటి వాటికి అలవాటు పడి చదువుల్లో అశ్రద్ధ, పెద్దవారి మీద తిరుగుబాటు, అందుబాటులో ఉండే మత్తు పానీయాలు, డ్రగ్స్ మూలంగా వారి భావి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
తరగతులలో చదువు చెప్పే అధ్యాపకులను అవమాన పరుస్తున్నారు. ఇంట్లో వయసు పైబడిన వృద్ధులు ఏదైన మంచి మాట చెబితే వారిని కించపరచడం అగౌర పరచడం అలవాటైంది. అమ్మానాన్నలు కూడా పిల్లల్నే వెనకేసుకు వస్తారు. ముగ్గురు వద్దు, ఇద్దరని, అదీపోయి ఒకే ఒక్కరైతె ముద్దని కని వారిని గారం చేసి పాడు చేస్తున్నారు. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దండించకుండ అభినందిస్తున్నారు.
వారికి నైతిక విలువలు తెలియడం లేదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో స్కూల్సులో తుపాకీ కల్చర్ నడుస్తోంది. చదువుకునే వయసులో దురలవాట్లతో సమాజానికి చీడపురుగుల్లా తయారవుతున్నారు యువత.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments