top of page

విహంగాలకు గగన వీధులు వేరయిపోతున్నప్పుడు..

Writer's picture: Pandranki SubramaniPandranki Subramani

#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #విహంగాలకుగగనవీధులువేరయిపోతున్నప్పుడు, #VihangalakuGaganaVeedhuluVerayipothunnappudu, #TeluguBreakUpStories, #భగ్నప్రేమకథలు


Vihangalaku Gagana Veedhulu Verayipothunnappudu - New Telugu Story Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 25/02/2025

విహంగాలకు గగన వీధులు వేరయిపోతున్నప్పుడు - తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)



అంతవరకూ నడవమ్మట నిక్కి నిక్కి చూస్తూ ఆమడ దూరాన నిల్చున్న మోహనరావు, పూజాగదిలో మంత్రోఛ్చరణ ముగించి అర్ఘ్యపాత్రలోని తీర్థాన్ని తులసి కోటలో పోసి తండ్రి లోగలి వేపు రావడం గమనించి, భవ్యంగా ఎదురు వెళ్ళాడు. ఏదైనా ముఖ్యమైన విషయాలుంటే మోహనరావు అటువంటి సమయమప్పుడే వాటిని లేవదీస్తాడు. ఎందుకంటే తండ్రి వదనం పూజా సమయంలో ప్రసన్నంగా ఉంటుందని అతడికి తెలుసు. ఎంతటి ఉద్రిక్త పరిస్థితిలోనూ వరదరాజులు పట్టు తప్పడు. గొంతు పెంచ డు. ఉదయకాలానికి ముఖ్యంగా పూజాసమయానికి ఉన్నమంగళకర ప్రభావం అటువంటిది! 


“బాబూ! మీతో కొంచెం మాట్లాడా లి” మోహనరావు ప్రతి పదాన్నీ ఒత్తి పలుకుతూ పిలిచాడు. 

కొడుకు వేపు తిరిగి చూడకుండానే ముందుకు సాగుతూనే బదులిచ్చాడాయన- “కంప్యూటర్ కోర్సు స్పెషల్ ఫీజు కట్టడం గురించేనా? నాకు గుర్తుంది. మూడురోజులాగు. పి. ఎఫ్. లోను వేసాను. వచ్చేస్తుందిలే!” 


మోహనరావు ఉఁ అనకుండా మాటలు పెంచాడు- “అది కాదు బాబూ! నేను మీతో మరొక మేటర్ మాట్లాడాలి“ 


ఈసారి నడుస్తున్నవాడల్లా ఆగి కొడుకు ముఖంలోకి తేరి చూసి, మరింకేమీ మాట్లాడకుండా ఉత్తరీయాన్ని ఒంటి నిండా కప్పుకుని లోపలకు నడిచాడు. అప్పటికక్కడికి పావనమ్మ కూడా చేరుకుంది. ఫ్యాబ్రిక్ కుర్చీలో కూర్చుంటూ అడిగాడు వరదరాజులు- “ఉఁ చెప్పు. ఏంవిటి విషయం?”


అప్పుడు పావనమ్మ కలుగజేసుకుంది- “నేను చెప్పేదాండీ! వాడికి మీ ముందు నిల్చుని చెప్పడానికి నిబ్బరం చాలనట్టుంది. సున్నిత స్వభావం కదా! ” 


భర్త అనంగీకారంగా తలాడిస్తూ కొడుకే స్వయంగా చెప్పాలని చూపులతో సంకేతం ఇచ్చాడు. తల్లి ప్రమేయం ఇక చెల్లదని గ్రహించిన మోహనరావు ఆమెను వెనక్కి జరగమని సజ్ఞ చేస్తూ తండ్రి ముందుకు వచ్చి ఓపారి గుటక మ్రింగి గొంతు సరిచేసు కుంటూ అన్నాడు- “నేను మా కాలేజీ మేట్ భారతిని ప్రేమిస్తున్నాను. నేనామెనే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను నాన్నా!”


కొడుకు మాటలు విన్న వరదరాజులు ముఖంలో రంగులు రింగులుగా మారాయి. కాస్తంత విరామం ఇచ్చి అన్నాడు- 


“బాగా ఆలోచించే మాట్లాడుతున్నావా! లేక మనసుతో బాటు తలకాయను కూడా కాలేజీ ప్రాంగణంలోనో ఫుడ్ పాయింటు వద్దనో పెట్టేసి మాట్లాడుతున్నావా? ” 


ఈసారి ధైర్యం పుంజుకుంటూ కంఠ స్వరాన్ని దృఢ పరచుకుంటూ బదులిచ్చాడు మోహనరావు- “లేదు బాబూ! నేను సీరియస్ గానే మాట్లాడుతున్నాను. మనసార ప్రేమిస్తున్నాను. భారతి కూడా”


అప్పుడు వరదరాజులు కొడుకు మాటను తుంచేసాడు- “నేను ప్రస్తావించేది మీ ప్రేమ లో లోతు లేదని వాదించడానికి కాదు. ఇంటికి ఒకేఒక మగబిడ్డవి. ఒకఅక్కయ్యకు తమ్ముడివి. చెల్లెలుకేమో అన్నయ్యవి. అందుకే అంటున్నాను- ఇంటి పరిస్థితి తెలిసే మాట్లాడుతున్నావా- అని”


“క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇప్పటికే ప్రొవిజనల్లీ సెలెక్టయానుగా! కోర్సు పూర్తి చేసే లోపల ఉద్యోగం దొరుకుతుందిగా బాబూ! ”


“దొరకదని ఎవరన్నారు? కాని— విషయం అది కాదు. అమ్మచాటు బిడ్డవి కదా! హాయిగా రోజుకొక డ్రెస్సు మార్చుకుంటూ కాలేజీ వెళ్తూ- క్యాంటీనులో ఫ్రెండ్సుతో కబుర్లు చెప్పుకుంటూ- క్యాంపస్ ఆర్కెస్ట్రాలో డ్రమ్ కొడ్తూ నల్లేరుపై స్కేటింగులా కాలం గడిపేస్తు న్నావు. మీ అమ్మేమో ఇవన్మీ నీకు చెప్పదు, కొడుకెక్కడ దిగాలు పడిపోతాడేమోనని- చదువులు పాడుచేసుకుంటాడేమోనని. 

సరే— అదలా ఉంచు. అక్కయ్య పెళ్లి మాఘమాసంలో ఎలా జరిపించాననుకుంటున్నావు? ఇల్లు తాకట్టు పెట్టిన తరవాత కూడా సరిపోకపోతే బ్యాంకులోను తీసుకుని పెళ్ళి తంతు జరిపించాను. లాంఛనాలతో అత్తారింటికి పంపించాను. అసలు అప్పు పై వేసే నెలసరి వడ్డీ కట్టడానికే నా జీతంలో సగ భాగం పోతుందిప్పుడు. 


ఇక రెండవది- ఇప్పుడు నిన్నూ మీ చెల్లినీ ఎలా చదివిస్తు న్నాననుకుంటున్నావు? ఆఫీసులో దొరికే నానా విధాల లోనులూ నానావిధాల కారణాలతో అప్లెయ్ చేస్తూ నా వృధ్దాప్యం కోసం కూడబెట్టవలసిన పి. ఎఫ్ ని హరించేస్తూ ఫీజులు కట్తున్నాను. ఇవి చాలవని స్ఫెషల్ ఫీజులూ- డొనేషన్ల వడ్డన కూడాను. 


ఇక నువ్వన్నట్టు- రేపో మాపో నీకు ఉద్యోగం దొరికిందే అనుకో. ఒక నెల జీతంతోనో రెండు- నెలల జీతంతో అవన్నీ తీరేవి కావుగా! అంతవరకూ నేను కట్తూనే ఉండాలికదా. రేపు మీ చెల్లి కాలేజీ కోర్సు పూర్తయి దానికి ఉద్యోగం దొరికినా దొరక్క పోయినా దాని పెళ్లి సంబంధం మనం ఇప్పట్నించే వెతకనారంభించాలిగా! ఈ రోజుల్లో అబ్బాయిలు ఉద్యోగం లేని అమ్మాయిని ససేమిరా వద్దంటున్నారాయె. అంతవరకూ మనమే కదా మీ చెల్లి ఆలనా పాలనా చూడాలి. 

నేనిక చెప్పొచ్చేదేమంటే- దేనికైనా సమయం సందర్భం కలసి రావాలంటాను. ఇవన్నీ ప్రక్కన పెట్తే- నువ్వు మొన్న మొన్ననే మరొక డిమాండ్ పెట్టావు. కాలేజీకి వెళ్లి రావడా నికి, స్పోర్ట్స్ స్టేడియం వేపు బస్సులో వెళ్లడానికీ కష్టంగా ఉందని- ఒక మంచి హార్స్ పవర్ ఉన్న స్కూటర్ కావాలని. దాని విషయం కూడా ఆలోచిస్తున్నాను. ఇక చివరి విషయం-- “అంటూ కుర్చీలోనుంచి లేచాడు వరదరాజులు. 


చెవులు రిక్కించి ఊపిరి బిగబట్టి వింటున్నాడు మోహనరావు. అతడి చెవుల్లో తండ్రి అన్న మాటే మళ్లీ మళ్ళీ మ్రోగుతూంది- “దేనికైనా సమయం సందర్భం ఉండాలి!” 


అలా ఆలోచిస్తూ నిల్చున్న కొడుకు వద్దకు వచ్చాడు పరదరాజులు- “ఈ ఏడాది చివరన నేను రిటైర్ కాబోతున్నాను. నాకు రాబోయే గ్రాడ్వటీ- పెన్షన్ కమ్యుటేషన్ మొత్తమూ- లీవ్ ఎన్ క్యాష్ మెంటు మొత్తమూ ఆపీసులో తీసుకున్న లోన్లకే సర్దుబాటయిపోతాయి. ఆ పైన నాకు నెల నెలా రాబోయేది పెన్షన్ ఇప్పటి నెల జీతానికి వన్ థార్డేగా-- ఇకపైన ఆలోచించడం నీ వంతు. కార్యాచరణకు దిగడం నీ వంతు. ఏది సబబని తోస్తే అదే చెయ్యి” అంటూ వరదరాజులు అక్కణ్ణించి కదలి వెళ్లిపోయాడు. 


కాని మోహనరావు అక్కణ్ణించి కదల్లేక పోయాడు. ఇప్పుడతని కళ్లముందు వింత వింత గీతలు, ఆకృతి లేని వలయాలు గా లేస్తున్నాయి. ఇప్పుడు తనేమి చేయాలి? నాలుగు రోడ్ల కూడలి మధ్య నిల్చున్న తనిప్పుడు ఎటు సాగాలి? అప్పటికే భారతి మూడు ఎస్ ఎమ్మెస్సులు- మూడు వాట్సప్ మెసేజులూ పంపింది మరునాడు తనను కలుసుకోవడానికి తప్పని సరిగా ఇందిరా పార్కుకి రమ్మనమని. 


అంత అర్జంటుగా ఒక పెళ్లి కాని అమ్మాయి ఒక పెళ్లికాని అబ్బాయిని ఎందుకు రమ్మంటుందో అతడు ఊహించలేనిది కాదు. సుఖమైన వెచ్చదనానికి కరిగి మత్తెక్కిన భ్రమరంలా మోహావేశంలో పడి తను ఒకసారా రెండు సార్లా- నోరు జారాడు! ఇచ్చిన మాటనూ నేలరాలిన గాజు రవ్వనూ మళ్లీ వెనక్కి తీసుకోవడం అంత తేలిక కాదుకదా! ఇక తను అడుగు వెనక్కి వేసుకోగలడా? అలా వేయడానికి ప్రయత్నిస్తే తన ప్రియ బాంధవి ఊరుకుంటుందా? 


వద్దూ కూడదూ అంటే తనపైన రాలిపడ్డ కొండచరియల్లా నిర్భయ కేసులు నెత్తిపైన పడవూ! తన పరుపు మాత్రమే కాక కుటుంబ గౌరవం సహితం మట్టిపాలు కాదూ! అదీకాక-- ఇటువంటి విషయాలు గాని బైట పడ్తే తన చెల్లికి వచ్చే సంబంధం కూడా రాకుండా పోతుందేమో! 


అనుకున్న సమయానికి భారతి పార్కులోని నిర్ణీత స్పాట్ కి చేరుకుంది. మోహనరావు తల తిప్పకుండానే తను కూర్చున్న చోటనుండే చూపులు సారించాడు. కారుని గేటుకి అవతల పార్క్ చేసి నిదానంగా నడచి వస్తూంది. ఎప్పుడూ వనకన్యలా అందంగా కనిపించే భారతి ఇప్పుడతనికి ఒక సమస్యలా గోచరిస్తూంది. గ్లైడింగ్ బర్డ్ లా నిదానంగా నడచి వచ్చి అతడి ప్రక్కన చోటు చేసుకుని కూర్చుంది. 


ఇప్పుడతను కాలయాపనకు సిధ్ధంగా లేడు- వెంటనే అందుకున్నాడు- “భారతీ! మైలవింగ్ బ్యూటిఫుల్ మైనా! మాఇంటి పరిస్థితి గురించి మొదట చెప్పాలి. నాకోసం కొంచెం టైమ్ కేటాయిస్తావా! ” అని సర్దుకుంటూ చెప్పడానికి పూనుకున్నాడు. 


కాని ఆమె అతణ్ణి ఆపుచేసింది. ఉప్పొంగే ఉద్వేగంతో అతడి పెదవుల్ని కుడిచేతితో మూసేసింది. ”ప్లీజ్! ముందు నేను చెప్పేది విను మోహన్. అంతా విన్నతరవాత నన్ను అర్థం చేసుకుంటావో- లేక నన్ను చీదరిం చుకుంటావో నువ్వే తేల్చుకో! ” 


ఆ మాటకు మోహనరావు భ్రుకుటి ముడిపడింది. ఒక్క పెట్టున సముద్రపు అలపైన పడి యెటో కొట్టుకుపోయినట్టు ఫీలయాడు. తలాడించాడు చెప్పమన్నట్టు- సంయమనం పాటిస్తూ-- ఆమె కూడా కాస్తంత విరామం ఇచ్చి, ఉఛ్వాస నిశ్వాసాలను కుదుట పర్చుకుంటూ చెప్పసాగింది. చెప్తూ తడబడింది- ”మానాన్న—” అని మధ్యలో ఆగింది. 


“మీనాన్న?“ అని ఆమెకు యెదురు పలుకు పలికాడు. 


“మన పెళ్లికి ఒప్పు కోలేదు మోహన్!” 


ఏ మాత్రమూ ఎదురు చూడని ఆ పరిణామానికి అతడు చెప్పలేనంత దిగ్భ్రాంతికి లోనయాడు. తను వింటున్నదేమిటో తేల్చుకోవడానికి అతడికి కొన్ని క్షణాలు పట్టాయి. కాని పైకి మాత్రం అంత త్వరగా తేలిపోకూడదని నిశ్చయించుకుని- లేని కోపంతో ఊగిపోతున్న వాడిలా ముఖం పెట్టి సూటిగా చూస్తూ ఘాటుగా అడిగాడు- “కారణం తెలుసుకోవచ్చా?”


మనసున మాత్రం తీర్చ వలసిన కార్యాన్ని గంధర్వులే వచ్చి తీర్చబోతున్నారేమోనని హ్యాపీనెస్ తో ఊగిసలాడుతూ! 


“ప్లీజ్! బి కూల్! కారణమంటావా- ఉంది. ఆయన వరకూ బలమైన కారణమే ఉంది. జరిగింది చెప్తే నువ్వు జీవితాన్ని వ్యాపారంగా మారుస్తున్నాడంటూ---”


అతడు వెంటనే తల విదిలించాడు. “లేదు. పర్వాలేదు. కాస్తో కూస్తో చదవుకున్నవాళ్ళం. పూర్తిగా అవగాహనకు రాకముందే మనకు మనం ఊహాగానాలు చేసుకుంటూ పోతే ఎలా? విషయం పూర్తిగా చెప్పు” 


ఈ మాటలతో అతడీసారి మోడరేటర్ రోల్ కి వచ్చేసాడు. 


భారతి చెప్పసాగింది- “మానాన్న నడిపే వ్యాపారంలో గజేంద్ర నాథ్ మేజర్ షేర్ హోల్డర్. అతనికున్న ఒక్కగానొక్క కొడుకు రాజేంద్రనాథ్. వాళ్ళింటి గారాల పట్టి. ఇతను నన్నెక్కడో ఎప్పుడో చూసాడట. అప్పట్నించి నాగురించి కలవరిస్తున్నాడట”


అప్పుడతడు వెంటనే కళ్లు పెద్దవి చేసుకుని అడిగాడు ”అందుకని? ”


ఆమె సంయమనం కోల్పోకుండా అంది- “ముందే చెప్పాగా! కూల్ డౌన్! మానాన్న గాని గజేంద్రనాథ్ వాళ్ళ అబ్బాయి సంబంధాన్ని ఒప్పుకొనకపోతే పెట్టిన పెట్టుబడి నంతటినీ వెనక్కి తీసుకుంటానని హెచ్చరించాడు. ఆ మహాను భావుడు గాని అలా చేస్తే నాన్న వ్యాపారమే కాక, కుటుంబమే నడి రోడ్డున పడుతుంది. ప్లీజ్.. ట్రైటు అండర్ స్టాండ్ మోహన్! మా నాన్న మన పెళ్ళి కాదనడానికి కారణం ఇదే! ఇప్పడు నన్నేమి చేయమంటావు?”


మోహనరావు మాటలు కరువైన వాడిలా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ప్రపంచం ఒక జగన్నాటకం. త్వరగా తట్టు తట్టున తేలిపోయి చిక్కులు తెచ్చుకోకూడదు. నటనను వెంటనే ఆపకూడదు. బిగువు సడలించకూడదు. కాని అదే సమయంలో సంఘటనను మరీ మెలోడ్రామాగా మార్చకూడదు. అసలుకే మోసం రావచ్చు-- 


అప్పుడతను కాస్తంత బొంగురు గొంతుతో అన్నాడు. ”మన మనసులు రెండూ మాలతీ లతల్లా పెనవేసుకుపోయినా సమాజం మనల్ని ఒక్కటిగా చేరడానికి ఆటంకపరుస్తుంది. దేనికైనా ప్రాప్తం ఉండాలంటారు- పెట్టి పుట్టాలంటారు-- ఇందుకే మరి-- మనల్ని మనం సూటి పోటు మాటలతో హింసించుకుంటే ఎవరికేమి ప్రయోజనం? ఎక్కడున్నా ఎవరితో ఉన్నా హాయిగా ఉండు”

ఆ మాటంటూ మోహనరావు భారంగా లేచి రెండు ప్యాంటు జేబుల్లోకి చేతులు జొనిపించి అక్కణ్ణించి కదిలాడు. 


“ఒక్కనిమిషం ప్లీజ్!”


అతడాగి వెనక్కి తిరిగి చూసాడు. ఆమె త్వరగా నడచుకుంటూ దగ్గరికి వచ్చింది. “మా నాన్న నీ కోసం చిన్నపాటి గిఫ్టొకటి పంపించారు. కాదనకుండా తీసుకోమని మరీమరీ చెప్పి పంపించారు మోహన్”


“పెద్దవారు. అంతగా చెప్పి పంపిస్తే ఎలా కాదనగలను? ” అని చేయి చాచాడు మోహన్ రావు.


”ఇక్కడ లేదు. కారులో ఉంది. ఒక్క నిమిషం!” అంటూ వేగంగా గేటు వేపు నడిచింది భారతి- కారున్న పార్కింగు స్పాట్ వేపు. 


మరి కొద్ది సేపటికి ఆమె ఒక బ్రీఫ్ కేసుతో వచ్చింది. నివ్వెరపాటుతో చూసాడతను. చిన్నపాటి కానుకంటూ ఇంత పెద్ద బ్రీఫ్ కేసు తెస్తుందేమిటి! ఆలోచించడానికి అది సమయం కాదనుకుంటూ ముందుకు వెళ్ళి పెట్టెను అందుకొని తెరిచాడతను. అతడి రెండు కళ్లూ ఫెళ్ళుమన్నాయి! అన్నీ క్రిస్ప్ ఐదు వందల రూపాయల నోట్లే. తక్కువలో తక్కువ పదిహేను లక్షల పై మాటే! 


ఇందు లోనుంచి కొంత పారేస్తే చాలు- తాకట్టు పెట్టిన ఇంటి పత్రాలన్నీ ఇంటి ముంగిట రెక్కలు కట్టుకుని వాలుతాయి. ఇక స్కూటర్ కొనే ఖర్మేమిటి- డేవిడ్ సన్ జర్మన్ మోడ్రన్ బైకే చేతికొస్తుంది. ఆ నిశ్శబ్దాన్ని భరించలేక భారతి మళ్లీ అందుకుంది- 

“ ప్లీజ్ వద్దనకండి! మీ ప్రేమని నాన్న ఖరీదు కట్తున్నాడని అపార్థం చేసుకోకండి”


“నో! నాట్ ఎటాల్!” అతడక్కణ్ణించి చురుక్కున కదలబోయాడు. 


ఆమె మళ్లీ ఆపింది. “మరి మన అఫైర్ గురించి ఎక్కడైనా-- ”


“ముక్కు మూసి నాలిక కోసినా చెప్పను“


“ మరి ఆ సంగతి?”


అదేమిటన్నట్టు ప్రశ్నార్థంగా చూసాడు మోహన్. 

“మనిద్దరమూ అరకు లోయలో గడిపిన రెండు రాత్రులు-”


“ఛే! అవేం మాటలు? అసలు మనం అరకులోయ వేపు ఎప్పుడు వెళ్ళామని? ” అంటూ బ్రీఫ్ కేసుని పదిలంగా చేత బట్టుకుని వేగంగా గేటు వేపు నడిచాడతను.


భారతి తృప్తిగా నవ్వింది. నవ్వుతూన్న ఆమె పెదవులిప్పుడు వంకరగా ఉన్నాయి. సమయానికి తగు మోతాదున మాట్లాడి సమయానికి తగు రీతిన స్పందించి సమస్యను పరిష్కరించడం తిరుగులేని ఒక ప్రామాణికమైన ఉపాయమే కదా! 


ఇప్పటి క్లిష్ట కఠోరమైన పరిస్థితిలో పుట్ట మునిగిపోకుండా తేలడానికి ప్రయత్నించడం ఒక విన్- విన్- సిచుయేషన్ కదా! 


శుభం

  

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.






 
 
 

Comments


bottom of page