కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'Vihangamai Tharangamai Akasa Gopurala Vepu' written by Pandranki Subramani
రచన : పాండ్రంకి సుబ్రమణి
ముంబై లో కాలేజీలో చదువుతున్న పరమేశ్వర రావు హైదరాబాద్ కు షిఫ్ట్ కావలసి వస్తుంది. క్లాస్ మేట్ అఖిలాండేశ్వరితో ఎప్పుడూ తగాదాలే. ఆ తగాదాలు ఏ పరిణామాలకు దారి తీశాయో ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారి కథలో తెలుస్తుంది.
పరమేశ్వరరావు స్వతహాగా క్రీడా కారుడు. ఒకటేమిటి-- మూడు నాలుగు స్పోర్ట్సులో పాలు పంచుకోగల స్పోర్ట్ పర్స న్. ఎగుడు దిగుళ్లు లేని శరీరాకృతితో వంపులు తిరిగే పుత్తడి కడ్డీలా ఉంటాడు. ఎప్పుడూ నలుగురి మధ్య కలివిడిగా కనిపిస్తా డు. చురుగ్గా చాకులా ఉండాలని ఉబలాట పడుతుంటాడు. అటువంటి వాడికి అకస్మాత్తుగా కాలేజీ మార్చుకోవలసి వచ్చింది. ముంబాయి తూర్పు బంద్రానుండి యెకాయెకిన చిక్కడపల్లి భీమేశ్వరం కాలేజీలో చేరవలసి వచ్చింది.
కారణం- తండ్రి వేదమూర్తి కేంద్ర ప్రభుత్వోద్యోగి. అతడి అధికార పూర్వక జీవితంలో అటువండి స్థానచలనాలు తరచుగా వడగండ్ల వానలా యెదురవడం రివాజే! కాని ఇంత దూరం చప్పుడూ అలికిడీ లేని భీమేశ్వరం కాలేజీ ప్రాంగణానికి రావలసి వస్తుందని అతడు ఊహించలేదు. అమ్మాయిల మాట అటుంచి అబ్బాయిలు దాదాపు పండే! అమ్మాయిలు గుంపుగా కళకళలాడుతూ వస్తుంటే వీళ్లు అవేవో గ్రహాంతర వాసుల్ని చూసి జడుసుకున్నట్టు వెనక్కితగ్గి దారిస్తూ మలుపు తిరిగి వెళ్లిపోతారు. అంతటి బెరుకెందుకో అతడికి యెంత ఆలోచించినా బోధపడటం లేదు.
ముంబాయిలో తనూ తన కాలేజీమేట్సూ ఓపెన్ గ్రౌండులో అమ్మాయిలతో మిక్సెడ్ టెన్నిస్ డబల్సు ఆడతారు. ఇండోర్ గేమ్ టేబల్ టెన్నిస్ ఆటలో కూడా మిక్సెడ్ డబల్స్ ఆడుతుంటారు. అదే విధంగా వాలీబాల్ గేములో కూడాను. మరిక్కడేమో కలసి ఆడుకోవడం మాట అటుంచి ఒకరికొకరు
యెదురైనప్పుడు- “హాయ్!” అని కూడా పలకరించుకోరు. కొంపదీసి ఇక్కడి కాలేజీ మేనేజిమెంట్ ఆటోక్రాటిక్ కాదు కదా!పైకి మాత్రం ఇక్కడి టీచింగ్ స్ఠాప్- నాన్ టీచింగ్ స్టాఫ్ యెంత చల్లగా భవ్యంగా కనిపిస్తారని-- అందుకే ఉదయం పూట ప్రశాంతంగా కనిపించే సముద్రాన్ని నమ్మకూడదంటారు.
ఎందుకని? ఉన్నపాటున రాక్షస అలలతో ఇరగదీసేస్తుందని. సునామీ సృష్టిస్తుందని.
మొదటి రోజు. . . . క్లాసులోకి వెళుతూ పరమేశ్వరరావు తానుగా ఎదురు వెళ్ళి క్లాసు మేట్సుతో తనను తను పరిచయం చేసుకున్నాడు. రామ్-రఘు-శ్యాం ప్రసాద్-అతడితో ఒకే వరసలో కూర్చునే క్లాస్ మేట్స్, ఇంటర్ నుండి అదే కాలేజీలో చదువు కుంటూన్న విద్యార్థులు. వాళ్ళలో రామ్ కి జిల్లా కలెక్టరుగారితో బంధుత్వం ఉంది. రఘు యేమో స్కూల్ మాష్టారుగారి పెద్ద కొడుకు. శ్యాం ప్రసాద్ యేమో టాలీవుడి కి చెందిన విలన్ యాక్టర్ వీరప్ప చిన్నకొడుకు. మిగతా వారితో కూడా కరచాలనం చేసాడు గాని,వాళ్ళ నామధేయాలు గుర్తుంచుకునేంత ప్రధానమైనవిగా తోచలేదు.
అతడలా అందరితో ఉత్సాహపూరితంగా పరిచయాలు చేసుకుంటూ ఇటు తిరిగేటప్పటికి కళ్ళు జిగేలుమనిపించాయి. సరాసరి క్లాసులోకి ఆకాశపు అంచుల్ని తాకుతూ మెరపు తీగ వాలి, కట్టెదుట కూర్చున్నట్లనిపించింది. ఒకమ్మాయి వారసత్వపు అందాన్ని పూర్వజన్మ నుండి ఈ జన్మ వరకూ రవాణా చేసుకు వచ్చినట్టు పసిడి బొమ్మలా మిలమిలా మెరుస్తూంది. ”దివి నుండి భువికి దిగి వచ్చిన గంధర్వ కన్యకాదు కదా!” అనుకుంటూ దిగ్భ్రాంతికి లోనవుతూ అటువెళ్లి తనను పరిచయం చేసుకున్నాడు- “హాయ్! ఐ యామ్ పరమేశ్- పరమేశ్వరరావు. ఫ్రం- ముంబాయ్. మీ పేరు ఊరూ తెలుసుకోవచ్చా!”అంటూ చేయి చాచాడు.
ఆమె అతడి చేతిని అందుకోలేదు. కళ్లింతలు చేసుకుని చూస్తూ ముక్తసరిగా బదులిచ్చింది- “ఐ యామ్ అఖిలాండేశ్వరి. ఫ్రం శ్రీనగర్ కాలనీ”
“మిస్ అఖిలాండేశ్వరే కదండీ!”
ఈసారామె యెర్రబడ్డ ముఖంతో సీటునుండి లేచింది. ఆమె మరింత
రెచ్చిపోక ముందే పరిస్థితి ని సంభాళిస్తూ నవ్వుముఖంతో అన్నాడు- “ప్లీజ్! డోంట్ బి సీరియస్. మన పరిచయం జోక్స్ తో ఆరంభమైతే కాస్తంత గోలగా కళ గా ఉంటుందని— ఇక్కణ్ణించి తరలిపోయేంత వరకూ కలకాలమూ గుర్తుండిపోతుందని-- ప్లీజ్! ఇంతటి చార్మింగ్ ఫేస్ కి అంతటి కోపం పనికి రాదేమో!” అంటూ తన సీటుకి వెళ్లి కూర్చున్నాడు.
అతడి చొరవకి ప్రక్కనున్న అమ్మాయిలు కిసుక్కున నవ్వబోయి ఊరకుండిపోయారు. “నవ్వడానికి కూడా కాలేజీ మేనేజ్మెంటు నుండి రేషనింగ్ కావాలేంటి?” అని మనసున అబ్బుర పడకుండా ఉండలేక పోయాడు పరమేశ్వరరావు.
టూ సైలెంట్- అండ్ టూ డిమ్ నెస్--
మూడవరోజు మధ్యాహ్నం భోజనాల వేళ పరమేశ్వరరావు కుక్షి నింపుకోవడానికి హ్యాంగవుట్ కి వెళ్తున్నప్పుడు క్లాసు మేట్లు ముగ్గురూ అతణ్ణి వెంబడించారు. “హల్లో! మీరూ వస్తున్నారా! ఈరోజు టిఫిన్ బాక్సులు తెచ్చుకోలేదా?” ముందుకు కదులుతూనే ఫ్రెండ్లీగా పలకరించాడు. అప్పుడు రామ్
అన్నాడు- “మేం నీతో రావడం లేదు. నీతో మాట్లాడాలని పిలిచాం. మేం తెచ్చుకున్న టిఫిన్ బాక్సు అక్కడ భద్రంగానే ఉన్నాయి”
ఆ మాటకు స్పందిస్తూ వాళ్ళకు సమీపంగా జరిగి అడిగాడు- విషయం యేమిటని.
వెంటనే బదులివ్వకుండా అతణ్ణి చెట్ల పొదవద్దకు తీసుకు వెళ్లి అడిగాడు రఘు- “అఖీలాండేశ్వరి గురించి నువ్వేమనుకుంటున్నావు?”
“అనుకోవడానికేముంది? వెన్నెలను వెక్కిరించే సౌందర్యవతనుకుంటున్నాను. వయ్యారంలో నెమలిని వెక్కిరించే వరూధిని అనుకుంటున్నాను. అంచేత పదే పదే అట్లా చూస్తూండి
పోవాలనుకుంటున్నాను. నధింగ్ మోర్- నధింగ్ లెస్“
“నీ మొహం. అఖిలాండేశ్వరి గంగాధరం కూతురు”
దానికతడు నవ్వి కనుబొమలెగరేసి- ఐతే- అన్నట్టు చూసాడు.
“అంటే నీకింకా విషయం తెలియదన్నమాట! గంగాధర్ ఈఊళ్ళో పెరుపొందిన గ్యాంగ్ స్టర్. ముషీరాబాదు మత్స్య వ్యాపారంలో సగం అతనిదే. అతడికి అఖిలాండేశ్వరి ఒక్కగానొక్క కూతురు కాబట్టి తెగ మాలిమి. ఇంతకు ముందు నీలాగే ఆమె గురించి తెలియక ఇద్దరు ఆమెతో పెట్టుకున్నారు. యాగీ చేసారు.
అప్పుడు యేం జరిగిందో తెలుసా?గంగాధరం అనుచర గణం వచ్చి ఒకడికి కాలు విర గ్గొట్టారు. మరొకడికి చేయి విరగ్గొట్టారు. ఇద్దరూ కాలేజీ విడిచి పెట్టి పరుగో పరుగో యని ఊరు విడిచి వెళ్లిపోయారు. నీకీ మేటర్ నువ్వు క్లాసులోకి వచ్చిన మొదటిరోజే చెప్పాలనుకున్నాం. మొదటి రోజే ఉల్లాసకరమైన మూడ్ ని పాడు చేయడమెందుకని ఊరకున్నాం. నీ సంగతి గంగాధరం గూండాలకు తెలిస్తే నీతో సరిపెట్టుకోరు. నీతో కలసి తిరుగుతుంటాం కదా--
మేం కూడా వాళ్ల పిడి గుద్దులకు లోనవుతాం. నోటి పళ్ళు ఊడగొట్టుకుంటాం. ఇప్పుడు చెప్పేది అర్థం అయిందికదూ! నువ్వు కోర్సు పూర్తి చేసుకుని వెళ్ళాలంటే, మీ అమ్మా నాన్నా మనశ్శాంతితో ఉండాలంటే, ఇకపైన అఖిలాండేశ్వరి వేపు కన్నెత్తి కూడా చూడకు. ఈ కండీషన్ ఒప్పుకుంటేనే మనం మునుపులా కలసి మెలసి మెసలుతాం. లేకపోతే మనం దూరమవుదాం. సీటు మార్చుకుందాం”
దానితో పూర్తిగా మౌనపు పరదాలోకి వెళ్లి పోయాడు పరమేశ్వర రావు.
“అదేంవిటి అలా అకస్మాత్తుగా ఊరకుండిపోయావు? గంగాధర్ గురించి విని భయపడిపోయావా!”
“అబ్బే!మేటర్ అది కాదు. నాదొక చిన్నడౌట్. తీరుస్తారా!“
అదేమిటన్నట్టు ముగ్గురూ తేరి చూసారు.
“ఎంత అల్లారు ముద్దుగా పెంచినా యేదో ఒకరోజు ఆ గంగాధరం పహిల్వాన్ కూతురికి పెళ్లి చేసే తీరాలి కదా! అప్పుడు పెళ్లికొడుకు కోసం వెతికే తీరాలి కదా!”
“కావచ్చు. కాక పోవచ్చు. నువ్వు మాత్రం ఆ పిల్లకు పెళ్లికొడుకువి కాలేవు. ఇది మాత్రం బాగా గుర్తుంచుకో! ఇకపోతే మరొకటి- రేపు చెప్పలేదనేవు. అఖిలాండేశ్వరి వాళ్ళ నాన్నకు చెందిన గూండాలు ఇక్కడే చుట్టుప్రక్కల తిరుగుతుంటారు. ఆమెగాని నీకెదురుగా చిన్నపాటి సైగ చేసిందే అనుకో- ఇక అంతే సంగతలు మరి--” .
అదే ఆఖరు మాటగా శంఖానాదంతో వినిపించి ముగ్గురూ దారికి అడ్డంగా కదలి వెళ్లిపోయారు.
పరమేశ్వరరావు వాళ్ళను అనుసరించలేదు. నిల్చున్న చోట నిల్చున్నట్టుగా ఆలోచన లో పడ్డాడు. మరునాడు క్లాసులో పరమేశ్వరరావు సీటు మార్చుకుని కాస్తంత యెడంగా వెళ్లిపోయాడు. అఖిలాండేశ్వరి యెప్పుడూ యెవరి వేపూ చూడని విధంగా పరమేశ్వరరావు వేపు నవ్వుతూ చూడసాగింది;
“ఇప్పుడు తిక్క కుదిరింది కదూ” అన్నట్టు.
పరమేశ్వరరావు అప్పటికీ తిరిగి చూడలేదు. ముగ్గురు బెంచ్ మేట్సులూ లోలోన అనుకున్నారు, తాము పోసిన పిరికి మందు బాగానే పని చేసిందని. కాని ఆ ప్రశాంతతా నిదానమూ పరమేశ్వరరావు యెక్కువ సేపు నిలబెట్టు కోలేక పోయాడు. అమ్మాయిలకు సాధారణంగా యేవేవో రోజులుంటాయి; నవ్వుల రోజని. అందాల రోజని- ఇంకేవేవో రోజులని. ఆరోజు కాలేజీ అమ్మాయిలకు చీర కట్టుడు రోజట.
పరమేశ్వరరావు ముంబాయి తెలుగు ఆసామీ కదూ! అది తెలియక ఎదురుగా వయ్యారం గా డేషింగ్ స్టయిల్ లో రామచిలక రంగులో ప్రింటెడ్ చీర కట్టుకుని నడుస్తూ వస్తూన్న అఖిలాండేశ్వరిని అనకూడదను కుంటూనే అనేసాడు- ”ఒంపు సొంపుల వయ్యారీ! అమాయక గుండెల్ని కొల్లగొట్టే పచ్చటి మయూరీ!”
ఆ మాటతో నిప్పురవ్వయి రేగిపోయింది అఖిలాండేశ్వరి. తిన్నగా మిత్రబృందంతో వెళ్లి వైస్ ప్రిన్స్ పాల్ తో పిర్యాదు చేసింది. నడివయస్కుడైన ఆయన తెల్లబోతూ అన్నాడు-“ఇందులో పిర్యాదు చేయడానికేముందమ్మా! పరమేశ్ అందర్నీ చూసి అనలేదుగా! నిన్ను చూసి మాత్రం అన్నాడంటే దానర్థం నువ్వు చక్కగా ఉన్నావనేగా! అందరికీ గులాబీ
యివ్వలేదుగా!”
కాని ఆమె విషయాన్ని విడిచి పెట్టలేదు. విడిచి పెట్టే రకం కాదని ఆయనకూ తెలుసు. ఒకే ఒక మాటంటూ వెళ్లిపోయింది- “ఇది మా డాడీ వరకూ వెళ్ళవచ్చు”
దానితో వైస్ ప్రిన్స్ పాల్ దిగిరాక తప్పలేదు. “ఇంతదానికే అంత పెద్దమాట లెందుకమ్మా!” అంటూ పరమేశ్వరరావుని పిలిచి ఓరల్ యెక్స్ ప్లనేషన్ అడిగాడు.
దానికి ఆ ముంబాయి యువకుడు యిచ్చిన జవాబిది- “నిజం చెప్తున్నానండీ! మిస్ అఖిలాండేశ్వరి యెదురొస్తున్నప్పుడు నేను కళ్ళు గట్టిగా మూసుకున్నానండీ! కాని—ఈ పాడు మనసు ఊరుకోలేదండీ! గోల పెట్టేసిందండి. అందులో ఆమె గంగాధరం కూతురని తెలిసి కూడా నేనలా
అనగలనండీ! నేనిప్పుడు ప్రామిస్ చేస్తున్నానండి- ఇకపైన జాగ్రత్తగా ఉంటానండి. ఇటు వస్తే అటు- అటునుండి వస్తే నేనిటూ- సరేనా అండీ?”
దానితో గంభీరంగా తలూపుతూ ఉండి పోయాడు వైస్ ప్రిన్స్ పాల్. కాని అఖిలాండేశ్వరి అంతటితో ఊరుకోలేదు. పగ్గ పట్టినపాము- అందులో ఆడపాము ఊరుకుంటుందా! అంతటితో వ్యవహారం ముగిసిందా-- లేదు. రిక్రియేషన్ క్లబ్బు ఆధ్వర్యాన జరిగిన సోలో డ్యాన్స్ పోటీలో పరమేశ్వర్ అఖిలాండేశ్వరిని వెనక్కి నెట్టి మొదటి బహుమతి అంది పుచ్చుకున్నాడు. అసూయతో రగిలిపోయింది. ఆవేశంతో నిప్పురవ్వల్ని కురిపించింది. కాలేజీ అంతటా ఢమారా వేసింది; ఇవ్వరానివి ఇచ్చి న్యాయనిర్ణేతల్ని బుట్టలో వేసుకుని మొదటి బహుమతి గెల్చుకున్నాడని. దాదాపు అతడి క్యారెక్టర్ ని చూపుకాననంతగా డేమేజ్ చేసేసింది. ముంబాయి ఆసామీ కదా! అతడు మాత్రం ఊరకున్నాడా! “ఆడనేర్వని ఆటకత్తె డోలు డొల్లందట!” అని అతడూ ప్రచారానికి దిగాడు.
మళ్లీ మరొకసారి ముగ్గురు బెంచ్ మేట్సూ రంగంలోకి దిగి శాంతిని నిలనాటారు. ఈలోపల గంగాధరం స్వయంగా కాలేజీకి వచ్చి పరమేశ్వర్ రెచ్చగొట్టుడు తగ్గించాలని ప్రిన్స్ పాల్ కి హెచ్చరించి వెళ్ళాడు అప్పుడెప్పుడో పెద్దలు అనలేదూ నిప్పుశేషమూ శత్రు శేషమూ ఉండకూడదని, మక్కికి మక్కీగా మరొకసారి అదే జారిగింది. క్లాసుమేట్ కామాక్షి పుట్టిన రోజు పార్టీకి అందరూ వచ్చారు. అందరూ తిన్నారు. మరి అదేమి విచిత్రమో- ఊసులాడుతూ ఒక వేపు తింటూ అటు వచ్చిన పరమేశ్వరరావు ప్లేటునుండి పులావ్ అక్కడ కూర్చున్న అఖిలాండేశ్వరి చుడిదార్ పైన పడింది.
ఎదురు చూసినట్టే ఆమె అగ్గిగుగ్గలమై పోయింది. అది మామూలు చుడిదార్ కాదని—రాజస్థాన్ నుండి తెప్పించిన డిజైనర్ చుడిదారని-- అతడు రెండు చెవులూ పట్టుకుని క్షమాపణ కోరితే గాని తను ఊరుకోనంది. అతడు తిరస్కరించాడు. తను కావాలని చేయలేదని, కావాలంటే డ్రై క్లీనింగుకి అయే ఖర్చు తనే భరిస్తానని ప్రకటించాడు. తగాదా మంటగా మారి మిన్ను ముట్టింది. ఈసారి తన గ్యాంగ్ గుండాలకు పని చెప్పకుండా గంగాధరమే రంగంలోకి దిగాడు. అదే మొదటి వార్నింగ్ చివరి వార్నింగనీ తన కూతురుకి పెళ్లి సంబంధం కుదరబోతుందని- ముంబాయి మొనగాడు తన కూతురితో ఇక ఆటలు ఆడటం మానుకోవాలని ఖరాఖండీగా చెప్పి వెళ్లాడు. క్లాసు మేట్సు ముగ్గురూ పరమేశ్వర్ ని గాఢంగా హెచ్చరించి వెళ్లారు: గంగాధరం అన్నంత పనీ చేస్తాడని- ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రవర్తించమని—
--------------------------------------------------------------------
వార్షిక పరీక్షలు దాదాపు ఐపోయినట్టే—రేపటికి మరొక పరీక్షా పత్రం మాత్రం మిగిలుంది.
ఇక పెద్ద బరువు తగ్గిపోతుంన్న తేలికపాటి మూడ్ తో క్లాసుమేట్స్ అందరూ ఫుడ్ పాయింట్ వేపు వెళ్తున్నారు. పరమేశ్వరరావు కూడా అదే మూడ్ తో కప్పు వేడి కాఫీ తీసుకోవడానికి అటు నడుస్తున్నాడు. అప్పుడక్కడ ప్రత్యక్షమయారు రామ్-రఘు-శ్యాం ప్రసాద్.
“మేం కూడా నీతో పాటు వస్తాం గాని-ఒకసారి ఇటు వస్తావా!” రామ్ అడిగాడు.
‘ఎందుకు.. యేమిటి సంగతి..’ అన్నది యేమీ లేవనెత్తకుండా పరమేశ్వరరావు వాళ్ళను అనుసరించి చెట్టు క్రిందకు వెళ్ళాడు. ఈసారి శ్యాంప్రసాద్ అతి నిదానంగా అడిగాడు- “ఇఫ్ ఐ వేర్ నాట్ రాంగ్- మీ అమ్మానాన్నలకు నువ్వొక్కడివే కొడువనుకుంటున్నాను— ఎస్ ఆర్ నో!”
“ఇదెక్కడి చోద్యంరా శ్యామ్ కోర్టులో లోడెడ్ క్వశ్చన్ వేసినట్టు-- ఔను—నేనొక్కణ్ణే కొడుకుని. ఇంతకీ యేమంటావు?”
అతడి యెదురు ప్రశ్న విని ముగ్గురూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
ఈసారి రఘు రంగంలోకి దిగాడు. “గుబులూ దిగులూ లేకుండా యెంతటి బింకంరా నీకు! నిజం చెప్పూ— నువ్వు అఖిలాండేశ్వరిని ఫాలో చేయడం లేదూ?”
“ఛే! ఏ గాడిదరా మీకు చెప్పింది? అన్నం తింటున్నానా లేక గడ్డి తింటున్నానా! ఇంత జరిగిన తరవాత మళ్లీ దాని ఊసెత్తుతానా!”
“మరి పోయినాదివారం అఖిలాండేశ్వరి గుడిమెట్లెక్కుతున్నప్పుడు నువ్వు ఆమె వెనుక ఫాలో చేయలేదూ! మోహన్ దాస్ ఆదివారంపూట చర్చికి వెళుతూ నిన్ను గుడి మెట్లెక్కడం చూసాడు. ఔనా కాదా!“
అది విని మొదట ఆశ్చర్యపోయినట్టు చూసి ఆ తరవాత పక్కున నవ్వేసాడు
పరమేశ్వరరావు.
“అదా సంగతి!అది వారం రోజుల ముందు జరిగింది. విషయం చెప్తాను వినండి. ఇప్పుడీ పరీక్షలు ఐపోయింతర్వాత మనమిక ఇదే కాలేజీలో ఉండం కదా! అందువల్ల నేను ఆమె కాళికాదేవి భక్తురాలని విని పనిగట్టుకుని వెళ్లి ఆమెను అభిమానపూర్వకంగా కలుసుకున్నాను”.
ఎందుకంట- అన్నట్టు ముగ్గురూ ప్రశ్నార్ధ కంగా చూసారు.
“చెప్తే మీరు నమ్మరు. అగ్ని శేషం ఉండకూడదని మీరేగా అన్నారు! మీరు చెప్పినట్టే చేసాను. గతం గత: అన్నరీతిన జరిగిందంతా మరచిపోయి ఫ్రెండ్లీగా విడిపోదామని క్షమాపణ చెప్పాను”
ముగ్గురూ ఖంగుతిన్నట్టు గుడ్లుమిటకరించి చూసారు. ఆ తరవాత తేరుకుని- ”రియల్లీ!” అని యేక కంఠంతో అడిగారు.
అతడు తలూపుతూ ముందుకు కదలి వెళ్లిపోయాడు.
-----------------------------------------------------------------------
పరీక్షా ఫలితాలు అందుకున్న వారం రోజుల తరవాత ముగ్గురు మిత్రులూ చెరువు గట్టుపైన పల్లీలు తింటూ ఉషారుగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్లకు షాక్ తిన్నంత పనయింది.
గంగాధరమూ వాళ్ల సహచర గణమూ క్వాలీస్ నుండి దిగి వాళ్లను చుట్టు ముట్టారు. “ఏడీ వాడు?”
“వాడంటే యెవడండి?” ముగ్గురూ అడవిరాజు ముందు నిల్చున్న చెవుల పిల్లుళ్ళా వణకుతూ బదులిచ్చారు.
“వెధవ్వేషాలు వేయకండి. చీల్చేస్తాను. వాడే—ఆ పరమేశ్వరరావు—“
“వాడు ఇక్కడెందుకు ఉంటాడండీ! ఇంట్లో కదూ ఉంటాడు—“
“నోర్ముయ్! బదలీపైన వాళ్ళ నాన్న సంవత్సరం క్రితమే అదెక్కడో సిక్కిం వేపు వెళ్లిపాయాడు. వాడు యిన్నాళ్లూ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నాడు. వాడుంటూన్నహాస్టల్ కి కూడా వెళ్ళాం. అక్కడా వాడు లేడు. పోయిన వారమే గధి ఖాలీ చేసి వెళ్లిపోయాడట. ఎక్కడకి వెళ్ళాడు! ఇప్పుడు ఎక్కడుంటున్నాడు?”
“నిజంగా మాకు తెలవదండీ!నిజానికి వాళ్ళనాన్న సంవత్సరం క్రితమే బదిలీపైన వెళ్ళిపోయాడన్నది మాకు తెలియనే తెలియ దండి. ఐనా ఇప్పుడు వాణ్ణెందుకు వెతుకుతున్నారండీ? వాడు పరీక్షలు జరుగుతున్నప్పుడే అఖిలాండేశ్వరితో సమాధానం కుదుర్చుకుని క్షమాపణలు చెప్పుకున్నాడు కదండీ! మరిప్పుడు వాణ్ణి యెందుకు వెతుకుతున్నారూ!”
“వాడు క్షమాపణలు చెప్పలేదురా ఫూల్స్! వాడు నక్కజిత్తుల మారి. నా ఒక్కగా నొక్క కూతురు అఖిలాండేశ్వరిని యెత్తుకు పోయాడు!“
అది విన్న ముగ్గురూ-“హాఁ!”అంటూనోరు తెరిచారు.
అంటే ఇంతవరకూ ఇద్దరూ అందరి ముందూ ఒకరికి మరొకరు పడదన్నట్టు భావన చేస్తూ గడిపారన్నమాట!
కారణం ఉన్నా లేకపోయినా కొట్లాటకు దిగుతూ బురిడీ వేసారన్నమాట!
కపట నాటక సూత్రధారులు!
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
Comments