top of page

విజయ

#పురాణం #ఆధ్యాత్మికం #devotional #TeluguMythologicalStories, #VagumudiLakshmiRaghavaRao, #వాగుమూడిలక్ష్మీరాఘవరావు, #SunandaBharathulu, #సునందభరతులు



Vijaya - New Telugu Story Written By - Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 19/03/2025

విజయ - తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


తన ధర్మపత్ని సునంద మహోన్నత సలహాలతో భరతుడు ప్రతిష్టాన పురాన్ని రాజధాని గా చేసుకుని తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించసాగాడు.

 

ధరణీ మండల భారమును తన బాహుదండమున అలవోకగా నిలిపి, సమర రంగాన తనకు మరొకరు సాటిరారు అన్నట్లుగా పరిపాలించే భరతుని చూసే సురులు భరతుని రెండవ విష్ణువు గా భావించేవారు. 


అతని పరిపాలనలో ప్రజలందరూ చేతి నిండా పని తో, భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించేవారు ‌. నాటి ప్రజలకు విధాత రాత వలన వచ్చే సమస్యలు తప్ప రాజువలన, ప్రకృతి వలన ఎలాంటి సమస్యలు వచ్చేవి కావు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు అందరికీ ఉండేవి ‌. మితిమీరిన కోరికలతో ఎవరూ మిడిసిపడేవారు కాదు. ఏవి మితిమీరిన కోరికలు, ఏవి మితిమీరని కోరికలు అనేవి ప్రజలకు చెప్పడానికి రాజ్యం లో యుగ ధర్మం, ధర్మ సూక్ష్మం తెలిసి పండితులు అనేకమంది ఉండేవారు. 


భరతుడు తన ధర్మ పత్ని సునందతో కలిసి అనేక పర్యాయాలు కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడి ప్రకృతి లో ఉన్న పార్వతీ మాతను కనులారా చూసాడు. ఆ తల్లిని తన ధర్మపత్ని సునందకు చూపించాడు. ఇద్దరూ కలిసి అమ్మ పార్వతీ మాతను పలు విధాలుగా స్తుతించారు. ఆపై అక్కడి మహర్షులందరి ఆశీర్వాదాలను తీసుకున్నారు. భరతుడు మహర్షులతో చర్చించి ఆశ్రమాల అభివృద్ధి కి తగిన ప్రణాళికలు రూపొందించాడు. 


తను ఆశ్రమంలో ఉన్నప్పుడు తన పేరు సర్వ దమనుడు అనీ అప్పుడు అనేక వీరోచిత పనులు చేసానని భరతుడు తన ఆశ్రమ జ్ఞాపకాలన్నిటినీ ధర్మపత్ని సునందతో పంచుకున్నాడు. అక్కడి మహర్షులు సునంద భరతులను పలు రీతులలో ప్రశంసిస్తూ, భరతుని రాజ్యం చుట్టూ ఉన్న పులిందక, మేకల, ఉత్కళ, పాంచాల, కౌసిజ, దశార్ణ, నవ రాష్ట్ర రాజ్యాల రాజులగురించి, వారి వారి మనస్తత్వాల గురించి సునంద భరతులకు వివరించి చెప్పారు. 


భరతుని మహోన్నత పరిపాలన ప్రభావం తో ఈ దేశానికి భారత దేశం అని పేరు వచ్చింది. భరతుని పరిపాలనలో ఉన్న భారత దేశం లో తమ రాజ్యాలను కలపడానికి అనేక సామంత రాజులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. నాటి భారత దేశంలో నివసించ డానికి సురనర యక్షకిన్నెరులు సహితం ముందుకు వచ్చారు. అది గమనించిన కేకయ రాజు భరతుని ప్రత్యక్షంగా కలిసి, " భరత మహారాజ! నీ కీర్తి ప్రతిష్టల ముందు మాలాంటి రాజుల కీర్తి ప్రతిష్టలు సూర్యుని ముందు మిణుగురు పురుగుల్లా మారిపోయాయి. అయినా నాలాంటివారికి సంతోషంగానే ఉంది. మీ వలన మహోన్నత సమైక్య భారత దేశ స్వరూపం సుందరంగా కనపడుతుంది. అలాంటి భారత దేశంలో నివసించే ప్రజలు భారత దేశాన్ని స్వర్గ సదృశం గా భావిస్తున్నారు. 


ఇంత మహోన్నతమైన మీ కీర్తి ప్రతిష్టలకు మూలమైన సునందను చూస్తుంటే నాకు పితృ వాత్సల్యం పెల్లుబుకుతుంది. సునంద ను అందరి అనుమతితో దత్త పుత్రికగా స్వీకరించాలని ఉంది. ఇది నా ఆలోచన కాదు. దైవ నిర్ణయం." అని అన్నాడు. 


కేకయ రాజు మాటలను విన్న భరతుడు, "మీలాంటి పెద్దల ఆశీర్వాదాలే మాకు సదా శ్రేయస్కరం. మీ ఆలోచన దివ్యం." అని కేకయ రాజు సదాలోచనలను భరతుడు తన ధర్మపత్ని సునందకు చెప్పాడు. సునంద సమ్మతితో అందరి సమక్షంలో కేకయ రాజు సునందను దత్త పుత్రిక గా స్వీకరించాడు. 


కేకయ రాజు సునందకు తన హితులను, సన్నిహితులను, బంధువులను, బంధువుల రూపంలో ఉన్న రాబంధువులను పరిచయం చేసాడు. అలాగే తన ప్రాణ స్నేహితుడు అయిన దశార్ణ రాజును సునంద భరతులకు పరిచయం చేసాడు.

 

 దశార్ణ మహారాజు అందరికి హృదయ పూర్వకంగా నమస్కరిస్తూ, తన కుమార్తె విజయను అందరికి పరిచయం చేసాడు. 


విజయ అందరికీ నమస్కరిస్తూ, సునందభరతులను చూసి సాష్టాంగ నమస్కారం చేసింది. " ఇదే ఇదే నా దేశం భారతదేశం.. మహామహులు.. మహితాత్ములు.. మాననీయులు.. సురనరయక్ష కిన్నెరాదులు.. మరల మరల ఇక్కడే.. ఇక్కడే.. ఇక్కడే.. పదే పదే జన్మించాలని వాంఛించే సుమసుందర నవ నందన భారత దేశం.. పుణ్య ప్రదేశం.. " అంటూ విజయ భరతుడు పరిపాలించే భారత దేశాన్ని శ్లాఘించింది. 


 విజయ సుమధుర కంఠానికి, ఆమె పాండిత్యానికి అక్కడి వారందరూ మహదానంద పడ్డారు. విజయను అన్ని రకాలుగా గమనించిన సునంద భరతులు, ‘ఈ యవ్వని మన కుమారుడు భుమన్యువు కు తగిన వధువు’ అని మనసులో అనుకున్నారు. 


తమ కుమారుడు భుమన్యువు తలపుకు వచ్చిన అనుక్షణం సునంద భరతులు మహా మురిసిపోతారు. ఆ పుణ్య దంపతులకు చాలా కాలం తర్వాత పుట్టిన సుసంతానం భుమన్యువు. తమ ముద్దుల కుమారుడు భుమన్యువు తలపుకు వచ్చిన క్షణం వారికి గతం పదేపదే గుర్తుకు రాసాగింది.. 


సునంద భరతులు దేశాభివృద్ధి నిమిత్తం బ్రహ్మర్షుల, మహర్షుల, హితుల, సన్నిహితుల మాటలను విని 133 అశ్వ మేధ యాగాలను చేయించారు. అందులో 78 అశ్వమేథ యాగాలు యమునానది ఒడ్డున 55 అశ్వమేథ యాగాలు గంగానది ఒడ్డున జరిపించారు. దీర్గతముడు ప్రధాన పురోహితుడుగా ఉండగా యమునా నది ఒడ్డున అశ్వమేథ యాగాలు చేయించారు. 


అనేకమంది అనాథలను దగ్గరకు తీసి పెంచి పెద్ద చేయసాగారు. అలాంటి వారిలో భరద్వాజుడు ఒకరు ‌ అదే సమయంలో అపుత్రకుడైన భరతుని తో, "సంతానం నిమిత్తం మరుత్ స్తోమ యాగం చేయమని వశిష్టాది మహర్షులు" అన్నారు.. 


భరతుడు మహర్షుల సలహాలను అనుసరించి మరుత్ స్తోమ యాగం ప్రారంభించాడు. మొదటి రోజు యాగం పూర్తి అయ్యింది. ఆ రాత్రి సునందభరతుల స్వప్నంలో సంతాన లక్ష్మి ప్రత్యక్షమయ్యింది. స్వప్నం లోనే సంతాన సుమాల నడుమ సునందభరతులు చందమామ తో ఆడుకున్నారు. రెండవ రోజు యాగం పూర్తి అయ్యాక సునంద భరతులు తమకు వచ్చిన స్వప్నం గురించి అందరికీ చెప్పారు. 


అందరూ ఆ స్వప్న వృత్తాంతాన్ని విని ఆనందించారు. 


 మరలా ఆ రాత్రి భరతుని స్వప్నం లో విదర్భ రాజ కుమార్తెలు ముగ్గురు కనపడ్డారు. వారు అప్సరసల్లా అందంగా కనపడి భరతుని వివాహం చేసుకుని ఆరుగురు కుమారులను కన్నారు. ఆ ఆరుగురు కుమారులలో ఒకడు పుట్టగానే కన్నతల్లి కళ్ళు పొడవటానికి అన్నట్లు తల్లి కళ్ళ మీదకు పాక సాగాడు. మరొకడు గాడిదలా అరవసాగాడు. ఇంకొకడు నల్లపిల్లిలా ఉన్నాడు. మిగతా ముగ్గురూ పుట్టగానే మద్యం మగువ అనసాగారు. తమకు పుట్టిన బిడ్డలు దుర్మార్గులు అనిగ్రహించిన విదర్భ రాజ కుమార్తెలు తమ సంతానాన్ని తామే చంపేసారు. 


భరతుని కల చెదిరిపోయింది. ఇదెక్కడి కల రా భగవంతుడా! అనుకుంటూ భరతుడు వశిష్ట మహర్షి ని పిలిపించి తనకు వచ్చిన విచిత్ర కల గురించి చెప్పాడు. అప్పుడు వశిష్ట మహర్షి యాగ సందర్శనార్థం వచ్చిన విదర్భ రాజును భరతుని మందిరానికి పిలిపించాడు. భరతుని కల గురించి విదర్భ రాజుకు చెప్పాడు. 


వశిష్ట మహర్షి మాటలను విన్న విదర్భ రాజు, "మహర్షోత్తమ! నా భార్య ఒక పర్యాయం ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలను ప్రసవించింది అన్న మాట వాస్తవం. అయితే ముగ్గురు ఆడపిల్లలు మహా వికారంగా పుట్టారు. ఒక ఆడపిల్ల కళ్ళు, నెత్తిన ఉంటే, మరో ఆడపిల్ల కళ్ళు మోకాళ్ళకు ఉన్నాయి. ఇంకొక ఆడపిల్ల చెవులు భుజాలకు ఉన్నాయి. అంతేగాక వారి శరీర భాగాలు ఉండవలసిన చోట లేవు. చిందర వందరగా ఉన్నాయి. అందుకే ఆ ఆడపిల్లలను పురిటిలోనే చంపేయమని నా ధర్మపత్ని అరణపు దాసికి చెప్పాను. 


అరణపు దాసి పిల్లలను చంపేలోపే చిత్రాచి చిత్రంగా ముగ్గురు ఆడపిల్లలు మంచం మీద నుండి కిందకి పడి మరణించారు. అప్పుడు నేను ఈ విషయాలన్నిటిని బయటకు రానివ్వలేదు.. అలా ఎందుకు జరిగిందో నా జ్యోతిష్య పాండిత్యానికి కూడా అందలేదు." అని జరిగిన విచిత్ర సంఘటనలన్నిటిని పూస గుచ్చినట్లు చెప్పాడు. 


 విదర్భ రాజు మాటలను విన్న వశిష్ట మహర్షి తన యోగ దృష్టితో అంతా తెలుసుకున్నాడు. అంత, "విదర్భ మహారాజ! నీ పుత్రికలుగా జన్మించిన ముగ్గురు ఆడపిల్లలు శారీరకంగా మరణించారు కానీ ఆత్మల పరంగా మరణించలేదు. వారు ఆత్మ తేజం తోనే పెరిగి పెద్దయ్యారు. వారు ముగ్గురూ ఆత్మ తేజం తోనే సునందలో ధర్మార్థ మోక్ష జ్ఞానం ను పెంచారు. 


సునంద భరతుని ధర్మపత్ని అయిన పిమ్మట భరతుని తేజంతో వారు సంతానవతులయ్యారు. పుట్టిన సంతానం దురిత దుర్మార్గ దుర్గంధ పూరితం అవ్వడంతో తమ సంతానాన్ని తామే సంహరించారు. నిజానికి వారు సామాన్య వనితలు కారు. సరస్వతీ దేవి చెలికత్తెలు. వారు ఒకసారి బ్రహ్మ సృష్టిని పరిహసించడంతో సరస్వతీ వారినలా శపించింది. 


ఆత్మలైన అమ్మలు తమ కౄర సంతానాన్ని తామే సంహరించడంతో శాప విమోచనం కలుగుతుంది అని కూడా సరస్వతీ మాత చెప్పింది. వారు అందంగానే భరతుని కలలో కనిపించి దుర్మార్గ సంతాన సంహారం చేసారు. ఏది ఏమైనా వారి ద్వారా సునందకు నువ్వు మరో తండ్రివయ్యావు." అని వశిష్ఠ మహర్షి విదర్భ రాజు తో అన్నాడు. 


సునందభరతులు గతం నుండి వర్తమానానికి వచ్చారు. భరతుడు తన ధర్మపత్ని సునందతో, "దేవీ ! ముగ్గురు తండ్రుల మహా యిల్లాలా! భూమాతయే మన భుమన్యువు ను పూజ్యనీయునిగా భావిస్తుంది. అంత గొప్ప కొడుకుని కన్న మహా తల్లివి నీవు. ఇక అలాంటి కుమారునికి తగిన వధువు ఎవరంటే దశార్ణ రాజ పుత్రిక విజయ అని నాకు అనిపిస్తుంది. గతంలో నీ తండ్రి కాని తండ్రి విదర్భ రాజు కూడా తన జ్యోతిష్య శాస్త్ర పాండిత్యం తో దశార్ణ రాజ్యానికి మనకు బంధుత్వం ఏర్పడుతుంది అని చెప్పారు కదా?" అని అన్నాడు. 


 "అవునవును. అన్నారు. దశార్ణ రాజు కుమార్తె విజయ ముఖాన సుర వర్చస్సు విజయ తాండవం చేస్తుంది. విజయ మహా పండితురాలు. మహా పరాక్రమ వంతురాలు. ఇంకా అనేకానేక విషయాలలో మంచి నైపుణ్యం కలిగినది అని ఆ నోట ఈ నోట విన్నాను." అని తన భర్త భరతునితో సునంద అంది. 


సునంద భరతులు దశార్ణ మహారాజు ను కలిసి తమ మనసులోని మాటను చెప్పారు. దశార్ణ మహారాజు మిక్కిలి సంతోషించాడు. తన కుమార్తె విజయ కు విషయం చెప్పాకనే తన సమ్మతిని తెలుపుతానని దశార్ణ మహారాజు భరతునితో అన్నాడు. 


సునంద భరతులు విజయ గురించి భుమన్యువు కు చెప్పారు. అందరూ విజయ అభిప్రాయం కోసం నిరీక్షించసాగారు.. విజయ తన ఇష్టాన్ని తెలియచేస్తూ 14 లక్షల ఇంద్రుని ఐరావతం లాంటి ఏనుగులను కాబోయే తన భర్త భుమన్యువుకు కానుకగా పంపింది. ఆపై శకశబరబర్బర కష కిరాతక హూణ మ్లేచ్ఛ రాజుల గర్వాన్ని ఎలా అణచాలో తన కాబోయే భర్త భుమన్యువుకు చెప్పింది. 


విజయ మాటలను అనుసరించి భుమన్యువు ఆమె తెలిపిన గర్వాంధులైన రాజుల గర్వాన్ని సమస్తం అణచివేసాడు. ఆపై భుమన్యువు విజయ మాటలను అనుసరించి పాతాళంలో బంధీలుగా ఉన్న అనేకమంది దేవతా స్త్రీలను విడిపించాడు. 


విజయ తనంటే ఇష్టపడుతుందని తెలుసుకున్న భుమన్యువు వెయ్యి మంది నిరుపేద గోపాలురకు ఒక్కొక్కరికి 13084 గోవులను దూడలతో సహా దానం చేసాడు. విజయ ను వివాహం చేసుకోక ముందే భుమన్యువు విజయ సలహాలతో కుబేరుడు అయ్యాడని అందరూ అనుకోసాగారు. అందరిలో కొందరి మాటలను విన్న విజయ విస్తృతంగా దశ దానాలను చేసింది. 


విజయ భుమన్యువు ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వారి సుసంతానం సుహోత్రుడు. 


 శుభం భూయాత్ 


***

వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



-వాగుమూడి లక్ష్మీ రాఘవరావు








 
 
 

Comments


bottom of page