#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ViluvaluBratukunaValuvalu, #విలువలుబ్రతుకునవలువలు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 21
Viluvalu Bratukuna Valuvalu - Somanna Gari Kavithalu Part 21 - New Telugu Poem Written By Gadvala Somanna Published In manatelugukathalu.com On 13/02/2025
విలువలు బ్రతుకున వలువలు - సోమన్న గారి కవితలు పార్ట్ 21 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
విలువలు బ్రతుకున వలువలు
కల్గియుంటే విలువలు
జీవితాల్లో వెలుగులు
ధాత్రిలో అందరిచే
దక్కుతుంది గౌరవము
క్రమమైన జీవితము
అందరికి ఆదర్శము
కల్గియుంటే మాత్రము
నిజముగా శ్రేయస్కరము
పసి పిల్లల మాటలే!
మేలి పసిడి మూటలే!
ఇంటిల్లిపాదికవే
సేదదీర్చు తోటలే!
ఇంటి ప్రమిదలు మహిళలు
వారున్నచో కళకళ
ముందుకెళ్లు కుటుంబము
తొంగి చూచు సంబరము

ఆత్మవిశ్వాసం కీలకం
----------------------------------------
బండనైనా చీల్చుకుని
బయటికి వచ్చే విత్తును
తీక్షణంగా గమనించు!
దాని స్ఫూర్తి స్వీకరించు!
విషమ పరిస్థితులెన్ని
తారసిల్లిన కూడా
లెక్క చేయక ఎదిగే
మొక్క ధైర్యం గాంచు!
ప్రయత్నం చేస్తేనే
ఏదైనా సాధ్యమే!
అడ్డంకులు ఎదురైనా
విజయాలిక తధ్యమే!
తొణకని ఆత్మవిశ్వాసం
గుండె నిండా సాహసం
విజయాలకు తొలి అడుగు
బ్రతుకులో రక్షణ గొడుగు

ఉండాలోయ్!!
----------------------------------------
ఆశలన్ని శిథిలమై
మనసేమో వికలమై
కృంగిపోయె మనుషులకు
ఉండాలోయ్! దుర్గమై
సంఘర్షణలకు గురియై
దురాలవాట్లకు బలియై
నష్టపోయిన వారికి
ఉండాలోయ్! గుండెయై
దిక్కులేని పిల్లలకు
నిరాశ్రయు వృద్ధులకు
ఉండాలోయ్! అండగా
విధి వంచిత వనితలకు
గురుదేవుల ఆజ్ఞలకు
పెద్ద వారి బోధలకు
ఉండాలోయ్! కట్టుబడి
కన్నవారి మాటలకు

నిజమే కదూ!!
----------------------------------------
సూర్యుడే నవ్వితే
లోకమంత కాంతులు
మహాత్ములు జన్మిస్తే
మహిలో సుఖశాంతులు
పున్నమి వచ్చేస్తే
పుడమంతా వెన్నెల
మధుమాసం వస్తే
గళమెత్తు కోకిల
సూర్యరశ్మి సోకితే
తనువుకెంతొ మంచిది
క్షమాగుణము చూపితే
సిరి కన్నా గొప్పది
వ్యసనాలు వీడితే
బాగుపడు జీవితము
చెట్లగా మారితే
పెకిలించుట కష్టము
అక్షరాలు నేర్పితే
అజ్ఞానం దూరము
పొత్తాలే చదివితే
వెలుగునోయ్! మస్తకము

సమస్తం సాధ్యమే!!
----------------------------------------
ఆత్మవిశ్వాసముంటే
కొండలాంటిదేదైనా
పిండి చేసి చూపవచ్చు
సాధ్యమనే చెప్పొచ్చు
చరిత్రను సృష్టించొచ్చు
సువర్ణాక్షరాలతోడ
మన పేరును లిఖించొచ్చు
స్థిర స్థాయిగా నిలువొచ్చు
గడ్డిపోచలను పేని
ఏనుగును బంధించొచ్చు
చలి చీమలు ఏకమైతే
సర్పాన్ని చంపవొచ్చు
ఆత్మ విశ్వాసమవసరము
విజయానికి సోపానము
కల్గియుంటే జీవితము
అవుతుంది స్వర్గధామము
-గద్వాల సోమన్న
Comments