top of page
Writer's pictureDinavahi Sathyavathi

విలువలు

#DinavahiSathyavathi, #దినవహిసత్యవతి, #విలువలు, #Viluvalu, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ, #అమ్మకొడుకునాన్నకథ

'Viluvalu' - New Telugu Story Written By Dinavahi Sathyavathi

Published In manatelugukathalu.com On 11/10/2024

'విలువలు' తెలుగు కథ

రచన: దినవహి సత్యవతి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఆనందరావు, కాంతం దంపతులకు, పెళ్ళైన చాలాకాలంవరకూ సంతానం కలగలేదు. దాంతో కాంతం పదేళ్ళపాటు కనిపించిన దేవుడికల్లా మ్రొక్కడం మొదలు పెట్టింది. 


ఆ మ్రొక్కులు ఫలించి పుట్టిన పుత్రరత్నమే అరుణ్. 

లేక లేక కలిగిన కొడుకని, అరుణ్ ని, కాంతం అతి గారాబం చేస్తుంటే, అది తగదని చెప్పీ చెప్పీ విఫలమయ్యాడు ఆనందరావు. 


తోటి పిల్లలతో పోల్చుకుని అరుణ్ చిన్నబుచ్చుకోకూడదని, శక్తికి మించినదైనా, అడిగినవన్నీ చేతికి అందిస్తూ వచ్చింది కాంతం. 


అదుపాజ్ఞలలో ఉంచుదామని ప్రయత్నించిన తండ్రిని శత్రువులాగానూ, తల్లిని మిత్రురాలిలాగానూ భావించసాగాడు అరుణ్. 


అత్తెసరు మార్కులతో పాసవుతో ఎలాగైతేనేం పదవ తరగతిలోకి వచ్చి పడ్డాడు అరుణ్. కొడుకు పధ్నాలుగవ పుట్టిన రోజుకి, విలువైన బహుమతి ఇచ్చి తీరాల్సిందేనని కాంతం పట్టుబట్టడంతో, భార్య ముచ్చట కాదనలేక అయిష్టంగానే తలఒగ్గాడు ఆనందరావు. 


పదవ తరగతి పరీక్షలు ముగిసాయి. ఆ రోజే ఫలితాల వెల్లడి. 

స్కూలునుంచి ముఖం వ్రేళ్ళాడేసుకుని వచ్చిన కొడుకుని చూడగానే విషయం అర్థమైంది ఆనందరావుకు. 


“ఏరా రిజల్ట్ ఏమయ్యింది, ఈ సారైనా పాసయ్యావా?” ఆశగా అడిగింది కాంతం. 


తన సమాధానం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న తల్లినీ, తండ్రినీ ఒకసారి చూసి, మారు మాట్లాడకుండా తల వంచుకుని, గదిలోకి, వెళ్ళిపోయాడు అరుణ్. 


“ప్రత్యేకించి అడగాలా! వాడి ముఖం చూస్తే తెలియటల్లా? ఎలాగైనా నీకు ఆశ ఎక్కువేనే?” భార్య అమాయకత్వానికి జాలిపడ్డాడు ఆనందరావు. 


గత కొంతకాలంగా, కొడుకుకి చదువుమీద ధ్యాస తగ్గి, అనవసర విషయాలపైన ఆసక్తి ఎక్కువవడం, గమనిస్తూనే ఉన్నాడు ఆనందరావు. 


ఆ విషయమే భార్యతో అన్నప్పుడు, “వాడింకా చిన్న పిల్లాడండి, నెమ్మదిగా వాడే తెలుసుకుంటాడు” భర్త తాపత్రయాన్ని తేలికగా కొట్టి పారేసింది కాంతం. 


“కాంతం, మనం మధ్య తరగతి వాళ్ళం. వెనక తాతతండ్రులు వదిలి వెళ్ళిన ఆస్తిపాస్తులేం లేవని నువ్వెరగనిదేం కాదు. మనకి చదువులే ఆస్తి. వాడు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకుంటేనే భవిష్యత్తు. అప్పుడే మనకీ నిశ్చింత” 


“వాడు తప్పక వృద్ధిలోకి వస్తాడండీ” 


“మొక్కైవంగనిది మ్రానై వంగుతుందిటే కాంతం నీ పిచ్చిగానీ” 


“నేను వాడి తల్లినండీ. నా కొడుకు గురించి ఎప్పుడూ మంచిగానే ఆలోచిస్తాను” 


“ఆ...ఆ.. చూస్తున్నాను కదా. ఎంత మంచిగా ఆలోచిస్తావో?” 


“ఏం చేసానండీ ఇప్పుడూ?” బాధ సుడులు తిరిగింది కాంతం గొంతులో. 


“వద్దే అంటున్నా వినకుండా చిన్న వయసులోనే వాడి చేతికి అదిగో ఆ దిక్కుమాలిన ట్యాబ్ ఒకటి ఇచ్చావు. ఇక రాత్రి పగలూ అదే రంది వాడికి. దాంతో ఆ కాస్త చదువూ అటకెక్కించాడు” 


“ఇలా అవుతుందని నేను అనుకోలేదండి” దిగులుగా అంది కాంతం. 


“అనుకోవాలే. వాడిది తెలిసీ తెలియని వయసు. మంచీ చెడూ సరిగ్గా తూచలేని వయస్సు. ఇవాళ కోప్పడితే వాడు బాధపడతాడని నువ్వు ఆలోచిస్తే రేపు వాడూ, వాడితో మనమూ జీవితంతం భాధ పడాలి. అందుకు ఆరంభం చూస్తున్నావు కదా” 


“ఇప్పుడేం చెయ్యమంటారండీ?” 


“నేను వాడిని మందలిస్తున్నప్పుడు, నువ్వు నోరుమూసుకుని ఉండాలని ఇప్పటికైనా తెలిసిందా? ఏది చెప్పబోయినా ఇంకా చిన్న పిల్లాడండి అంటూ వెనకేసుకొచ్చి నా మాటంటే లెక్క లేకుండా చేసావు. ఇప్పుడు చూడు ఏమైందో?” 


“అవునండీ. నావల్ల తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నానుగా. వాడు మన ఒక్కగానొక్క కొడుకు. వాడు సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్పంటారా?” 


“సంతోషంగా ఉండాలని అనుకోవడం తప్పుకాదే. అలాగని అడిగినవన్నీ ఇచ్చేస్తే వాళ్ళకి విలువ తెలియదు. కోరినది దొరకని రోజున వాళ్ళు బాధ పడుతుంటే, అది చూడలేక బాధపడేదీ మనమే కదే కాంతం. ఏదైనా కష్టపడితేగానీ దొరకదని వాళ్ళు తెలుసుకునేలా చెయ్యాలి. అందుకు ముందు మన ఇద్దరం ఒక మాట మీద ఉండాలి. 


డబ్బు విలువ, సమయం విలువ ఈ వయసులోనే వాళ్ళకి తెలియజెప్పాలి. అర్థమైందా? వెళ్ళు, అలసిపోయి వచ్చాడు, ముందు వాడికి బోర్నవిటా కలిపివ్వు. తర్వాత ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆలోచిద్దాము” భర్త మాటలకి అంగీకారంగా తలూపి వంటింట్లోకి వెళ్ళబోయిన కాంతం కొడుకుని చూసి ఆగిపోయింది. 


“నాన్నా! అమ్మనేమీ అనకండి. తప్పు నాదే. ఇకపై బాగా శ్రద్ధగా చదువుకుంటాను. అమ్మా! ఇదిగో ఇది నీ దగ్గరే ఉంచుకో” అంటూ ట్యాబ్ తల్లి చేతికి అందించాడు. 


“అదీ మా అరుణ్ అంటే” కొడుకుని దగ్గరకు తీసుకుని కౌగలించుకున్నాడు ఆనందరావు. 


చెమ్మగిల్లిన కళ్ళను పైటకొంగుతో అద్దుకుంది కాంతం. 


సమాప్తం

దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya

పేరు: దినవహి సత్యవతి

విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;

వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.

ప్రవృత్తి : రచనా వ్యాసంగం.

సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.


పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.

గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.

పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.

ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.

6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &

గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);

పంచామృతం!(సత్య! పంచపదులు)


స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in


71 views0 comments

Kommentare


bottom of page