వినమ్రతా కుసుమాలతో అర్చన
- Ayyala Somayajula Subramanyam
- Mar 21, 2022
- 5 min read
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Vinamratha Kusumalatho Archana' New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
తాను జీవిత చరమాంకంలో ఉన్నట్లు అతనికి అర్థం అయింది.
తన వారందరికీ వినయంగా వీడ్కోలు చెబుతున్నాడు.
అతని మానసిక స్థితిని కథగా మలిచి మన కళ్ళ ముందు ఉంచారు ప్రముఖ కవి, రచయిత అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము గారు.
ఈ కథ మనతెలుగుకథలు. కామ్ లో ప్రచురింప బడింది.
ఇక కథ ప్రారంభిద్దాం
"డాక్టర్ తో మాట్లాడాను నాన్నా! భయపడక్కర్లేదన్నారు. " అన్నాడు రవి, స్టార్ హాస్ప
టల్ బెడ్ మీద పడుకున్న నా ప్రక్కనే కూర్చుంటూ . నా అరచేతిని తన అరచేతితో
వత్తుతున్న వాడి చేతుల్లో చిరుచెమట... ఆ చెప్పడంలోనే చాలా ప్రమాదకరం అన్న
సంకేతాన్ని అరవైఐదేళ్ళ వయసున్న నేను గ్రహించాను.
డాక్టర్ పర్యవేక్షణలో ఉంటున్నా ప్రమాదం ముంచుకొచ్చింది. యధాలాపంగా చేయిం
చిన మాస్టర్‌చెకప్ లో బయటపడిన విషయం - గుండె పరిస్థితి బాగాలేదని, నాకు
అర్జంట్‌గా ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయాలని.
నాకు మల్ట్‌పుల్‌ప్రాబ్లమ్స్ ఉండటం వలన, బీపీ, షుగర్, కిడ్నీ సమస్యల వల్ల, నేను చెయిన్ స్మోకర్‌ని - అందుకని, ఆపరేషన్ మరీ అంత సులువు కాదని చెప్పారు. డేంజర్ పొజిషన్, ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్ అనీ సారాంశంగా తెలియజేశారు కార్డియాలాజిస్టులు. మొట్టమొదటగా వినగానే కలిగిన బాధ మెల్లిమెల్లిగా తగ్గుతోంది. నా మనసును సమాధానపరుచుకుంటున్నాను.
" ఈ రోజుల్లో గుండెఆపరేషన్, కుటుంబనియంత్రణ ఆపరేషన్ కన్నా సులువయ్యిందర్రా " అంటూ ఫెళ్ళున నవ్వుతూ కారిడార్ లో బంధువుల మధ్య నిలబడ్డ రామం బాబాయి చెబుతున్నాడు. ఆయనకు ఎనభై ఏళ్ళు. నన్నెత్తుకుని తిప్పిన బాబాయ్, తనకు తానే ధైర్యం చెప్పుకుంటున్నాడు, వాళ్ళకు చెబుతున్నట్లుగా .
నాలోని సగభాగం.. అదే నా అర్ధాంగి ఇక్కడ లేకపోవడంతో, ఈ శరీరానికి ఎక్కువగా
ప్రమాదమని భయపెట్టే వాళ్ళు లేరు. మా అబ్బాయి అత్తగారు, మావగారు సాయానికి
వచ్చారు.
" నాన్నా! అమ్మని రమ్మందామా" అన్నాడు రవి ఉద్వేగంగా.
" నా కేం కాదులేరా" అన్నాను. వాడి భుజం తడుముతూ సముదాయించాను.
" చెల్లాయికి కాన్పు రోజులు. ఇలా అని తెలిస్తే అమ్మ వచ్చేస్తుంది. చెల్లాయికి కష్టం అవు
తుంది. చెప్పకపోవడం మంచిదేమో నాన్నా! " మాటలని కూడబలుక్కుని చెప్పలేక
చెప్పలేక, మధనపడుతూ మెల్లగా గొణిగాడు రవి.
ఇంతలో నర్స్ వచ్చి రవిని పిలుచుకు వెళ్ళింది. రవి మళ్ళీ తిరిగి వచ్చి " నాన్నా! నేను
బాంక్ కు వెళ్ళొస్తాను" అని చెప్పి వెళ్ళిపోయాడు.
సాయంత్రం ఏడు తరవాత కోడలు శర్వాణి వచ్చింది, కారియర్ తీసుకుని. మొహం పీక్కుపోయి బాగా చిన్నబుచ్చుకుని కూర్చుంది.
" ఏం కూరమ్మా!"అన్నాను కాస్త నవ్విస్తూ. ఇంక తను కూడా గలగల కబుర్లు చెబుతూ వడ్డించింది, మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ.
తిన్నాక , " నువ్వువెళ్ళమ్మా! మళ్ళీ ఆటోలు కూడా దొరకవు. నీవు ఇబ్బంది పడతావు" అని ఆ అమ్మాయికి చెప్పి పంపేశాను.
రవి వచ్చి మందులు ఇచ్చాక , ఇద్దరం పడుకున్నాం. నిద్ర రావడం లేదు. రెండేళ్ళ క్రితం చిన్నపాటి స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ తప్పదట. మెషిన్ అన్నాక ఏదో రోజు ఆగిపోక తప్పదు కదా! దానినలా ఆగిపోనివ్వకుండా ఇంకా పనిచేయించడం అవసరమా?
నేనే అమ్మాయి కడుపున పుడతానేమో! మెరుపులా ఆనందం.
‘మళ్ళీ జన్మ కోరుకోకూడదురా . జన్మరాహిత్యం కోరుకోవాలి’ అనేది బోసి నోటితో నాన్నమ్మ.
నాన్నమ్మ, నాన్న, పెదనాన్న, పెద్దమ్మ, బాబాయ్.. అందరూ భగవద్గీత చదవుతూ వుండేవాళ్ళు, ప్రతిరోజు.
"కృష్ణపరమాత్ముడు గీతలో ఏమన్నాడంటే . . . . . " అంటూ
తాతయ్య తన్మయత్వంతో ఎవరో ఒకరికి చెబుతూ ఉండేవాడు.
"మనం ఎప్పుడు చనిపోతామో తెలియడం మహాదృష్టం. " అనే వాడు.
అవన్నీ గుర్తుకువస్తుంటే మరణమెంత సహజమో , అనివార్యమో అనిపిస్తుంది.
కానీ ఈ స్పెషలిస్టులు అందరూ కలిసి కష్టపడి, బతికించేస్తారేమో! మొదటి స్ట్రోక్ తట్టుకున్న గుండె, ఈ ఆపరేషన్ తట్టుకోలేకపోవచ్చు. ఈ జన్మకి ప్యాకప్ చెప్పుకోవచ్చిక.
'నా కథ ముగిసిపోతోంది' అనుకోగానే ముందు ఆవేదన కలిగింది. కానీ ఇప్పుడు మనసు నిదానించింది. 'ఈ లోకాన్ని వదిలే ముందు నా కర్తవ్యం ఏమిటి' అన్న ఆలోచన సాగింది. మెదడు వెంటనే, 'కృతజ్ఞతలు! కృతజ్ఞతలు!' అంది.
నిజమే! ఎంతమందికి ధన్యవాదాలు చెప్పాలో, సభయ్యాక వందన సమర్పణం చేసినట్టు.. నవ్వొ
చ్చింది.
తను కడుపున పడగానే అమ్మమ్మా, నాన్నమ్మా సంబరంగా మొక్కులు తీర్చుకున్నారట. ప్రాణం పోసుకుంటున్న వారసుడిపై వాళ్ళ కెంత మమకారమో! అమ్మ నొప్పులు పడుతుంటే, పిన్నమ్మలూ, అమ్మమ్మ అంతా పక్కనే ఉన్నారట. పుట్టగానే నా బుజ్జి దేహాన్ని ముందుగా చేతితో తాకిన ఆయమ్మ నాకు ప్రేమ స్పర్శని కానుకిచ్చింది. రోజూ నా ముక్కు నొక్కి , నలుగు పెట్టి , నీళ్ళు పోసిన అవ్వ కెంత ఆప్యాయతో!
ఏకైక సంతానం కనుక అమ్మానాన్నలకి తను బహిఃప్రాణమే. ఆడిందాట, పాడింది పాట అన్నట్టే పెంచారు. ఇద్దరు తాతమ్మలూ తన నొక్కమాట అన్నట్టే గుర్తులేదు. బడిలో చేరాక నా ఖాళీ బుర్రలో విద్యవిత్తనాలు జల్లి చదువుల మొలకలు రప్పించిన ఉపాధ్యాయులెంత మంచివాళ్ళో , స్నేహితులెంత అభిమానించారో! సైకిల్ పై బడికి తీసుకెళ్ళిన బాబాయి ఎంత ముద్దు చేసేవారో !
జీవితంపై అవగాహన కలిగించి , ధైర్యం కలిగించే సాహిత్యాన్ని అందించిన సాహితీ స్రష్టలందరికీ నమోవాకాలు! చిన్నప్పటినుండి చూసిన సినిమాలు, చదివిన పుస్తకాలు ఎంత ఉత్సాహాన్నిచ్చేవో! నిత్యం విని పాడుకునే పాటలు ఎంత ఆనందాన్నిచ్చేవో ! వాటి రచయితలూ, సంగీతం సమకూర్చినవారూ, గాయనీగాయకులు, సినీ నిర్మాతలూ, దర్శకులకూ , నటీనటులకూ తను బాకీ పడ్డట్టే కదా!
ఉద్యోగప్రస్థానంలో ముప్పైఐదేళ్ళకు పైగా ఎంతమంది అధికారులు, తోటి సహోద్యోగులు సహకరించారో! ఉద్యోగం వచ్చినప్పుడొచ్చిన జీవనసహచరి జీవిత తన జీవితంలో, తన ప్రాణంలో ప్రాణమైపోయింది. పెళ్ళితో మడిపడిన అత్తమామలు కుటుంబం అంతా నన్నెంత అభిమానించారో . . . .సహృదయుడనని, మంచి ఉద్యోగం లో ఉన్నానని కుటుంపరంగా, హోదాపరంగా. అమ్మాయి, అబ్బాయి, అల్లుడూ, కోడలూ నన్ను గౌరవించారు. బంధువులు,స్నేహితులు , వారి కుటుంబసభ్యులు కూడా. ఇరుగు పొరుగు వారు కూడా. ఇంటిలోపనిచేసే వారు కూడా ఎన్నడూ ఒక్క మాటతో కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు.
ఈ సుదీర్ఘ జీవితంలో జబ్బుపడ్డప్పుడు ఎంతమంది డాక్టర్లు , నర్సులు తమ సేవాభావంతో నన్ను ఆరోగ్యవంతుణ్ణి చేశారో!అలా ఎంత మందికి రుణపడ్డానో! ఈ ప్రాణం పోయాక కూడా ఇంకా ఎంతమంది తమ దయను నా పై కురిపిస్తారో!
ఈ దేహాన్ని దహనం చేసే కార్యక్రమంలో కాటికాపరి వరకూ దయ చూపుతారు కదా! నా నిర్యాణ కార్యక్రమం గురించి తెలిసి కొంతమంది శ్రమకోర్చి ఇంటికొచ్చి పరామర్శిస్తారే! నా ఫోటోకి వెయ్యబోయే పూలమాల కూడా ఒక ప్రేమమూర్తి కట్టాలి కదా!
ఆలోచిస్తూండగానే మాగన్నుగా నిద్ర పట్టింది. తెలతెలవారుతుండగా వచ్చే చిరుగాలి మొహానికి తగులుకోంది. ప్రతి ఋతువులోనూ తనకెంత అనుకూలత కలిగించిందో రకరకాలుగా. అందుకే ప్రకృతి కి ప్రణతి. తన సహజీవులంతా తనపై ఇంత అధికమైన ప్రేమను కురిపించారు. తిరిగి తను ఎందరికీ , ఎంత ప్రేమను పంచాడో గుర్తే లేదు. నా ఈ బలహీనమైన గుండెకిప్పుడు ఈ ప్రపంచం అత్యంత ప్రేమాస్పదంగా గోచరిస్తోంది. నన్ను ఆప్యాయంగాకన్నతల్లిలా తడుముతోంది. ' మానవజన్మ ఎత్తబట్టి కదా ఈ అదృష్టఫలాన్ని పొందాను. నా కళ్ళు ఆనందంగా చెమర్చాయి.
కృతజ్ఞతా కుసుమాలను మనసుతో అందరికీ అర్చన చేశాక నామనసుకు నిశ్చింతగా, నిమ్మళంగా ఉంది. గాయానికి చల్లని మందు వేసి కట్టుకున్నంత కుదురుగా ,నిశ్చింతగా ఉంది. నాతో సుదీర్ఘకాలం కాపురం చేసిన జీవితకి నేనిప్పుడు కొత్తగా చెప్పేదేముంది. వీడ్కోలు తప్ప. అదెలాగూ ఇద్దరికీ భారం కలిగించే సంగతే. ఈవిషయం ఎదురుగాచెప్పీ ఆమె బాధపడి… అది చూసి తను దుఃఖించే అవసరం లేకపోయింది. ఇదికూడా ఒకందుకు మంచిదే.
ఆపరేషన్ కు సమయమవుతోంది. కోడలి తల్లిదండ్రులు, రవి, శర్వాణీ ప్రక్కనేఉన్నారు. ఇంతలో పరుగుపరుగున వచ్చాడు నా స్నేహితుడు, చిన్ననాటి నుంచి కలిసి మెలిసి పెరిగిన వాళ్ళం , రాఘవరావు నన్ను కళ్ళ నిండుగా చూసుకుంటూబిగియార, ప్రియమార కౌగలించుకున్నాడు. వాడి పరిష్వంగంలో అప్పుడొచ్చింది దుఃఖం. . . గుండె పగిలినట్టు! వాడి కర్థం అయినట్టుంది. అలాగే ఒకనిమిషం వదలకుండా ఉండిపోయాడు.
" నువ్వొచ్చేసావు కదరా! ఇంక ఈ అవతార పరిసమాప్తికి శుభం కార్డు వేసేస్తా. ప్రశాంతంగా . . . . . . " అన్నాను నవ్వుతూ.
" నోరు ముయ్యరా! పిచ్చి ప్రేలాపన మాటలు " అంటూ వాడూ గట్టిగా నవ్వేశాడు.
---------------------
నా ఒళ్ళంతా పచ్చిపుండులా ఉంది. తల దిమ్ముగా ఉంది. మెలకువ రెపరెపమంటోంది. ఎవరెవరో నెమ్మదిగా ఒక్కొక్కళ్ళే వచ్చి ఐసీయూ లో నన్ను చూసిపోతుండటము నాకు మగతలో తెలుస్తోంది.
మరికొన్ని గంటలు గడిచాయి. చాలా చాలా గంటలు గడిచినట్టున్నాయి. ఎవరో డాక్టరు కాబోలు ఆపరేషన్ కు చాలా చాలా కష్టపడ్డామని , ఎట్టకేలకు గండం గట్టెక్కామని చెబుతుండటం , " థాంక్స్ డాక్టరు గారూ" అని చాలా గొంతుకలు అనడం లీలగా వినబడ్డాయి.
ఇంకా కొన్ని గంటల తరువాత నాకు బాగా తెలివొచ్చింది. రవి ఆప్యాయంగా నాచేతిని తడిమి తన గుండెలకానించుకుని , ఆ పై ముద్దుపెట్టుకున్నాడు. ఒకరొకరూ మెల్ల మెల్లగా మా వాళ్ళంతా నా బెడ్ చుట్టూ నిలబడ్డారు. ' ఎలా ఉంది? అని కళ్ళతోనే సంజ్ఞలు చేస్తూ మృదువుగా అడుగుతున్నారు.
నాకు మాత్రం అందరికీ వీడ్కోలు పలికి , అన్నీ సర్దుకుని రైల్వేస్టేషన్ కు వెళ్ళి, ట్రైన్ మిస్సయిందని వెనక్కి తిరిగి వచ్చినట్టుగా ఉంది. అయితేనేం! అనూహ్యంగా నేను సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాను. ఈ ప్రపంచానికీ, నా వారందరికీ హృదయపూర్వకంగా వినమ్రంగా సమర్పించాలని నేను తయారుచేసి పెట్టిన కృతజ్ఞతాపత్రం చివరన పెట్టిన చుక్కగుర్తు , కామాగా మారిపోయింది.
నా చుట్టూ ఉన్న అందరి కళ్ళ నుండీ ఒకలాటి వాత్సల్యపు జల్లు కురుస్తోంది.
అందాల ఈ లోకం, ప్రియమైన నా వారూ, నిత్యం నా పై చూపే అనురాగపు పరం
పర మళ్ళీ మొదలయ్యింది.
--------------------శుభంభూయాత్-------------------------------------
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
Sundari Ganti • 6 hours ago
Very nice story 👌
Kameswari Sista
Good story Subbu
Aysola Subramanyam
Prasad Ayyala ధన్యవాదాలు, మీ అమూల్యమైన అభిప్రాయం నకు.
Prasad Ayyala
చాలా బాగుంది. నేటి సమాజంలో జరిగే పరిస్థితి
Good story
chala bagundi