'Vinipinchani Ragalu 9' New Telugu Web Series
Written By Gorthi VaniSrinivas
రచన : గొర్తి వాణిశ్రీనివాస్
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ..
మధు భార్యాపిల్లలు ఊర్లో లేని సమయంలో అతని క్లాస్మేట్ రజిత అతని ఇంటికి వస్తుంది.
రజిత, గోడకు తగిలించిన తన తండ్రి ఫోటో వంక తదేకంగా చూడడం గమనించాడు మధు. అతని దగ్గర సెలవు తీసుకొని హాస్పిటల్ కు వెళుతుంది రజిత.
ఊరికి వెళ్లిన మధు కుటుంబ సభ్యులు తిరిగి వస్తారు.
భార్య చేతికి దొరికిన కాగితాన్ని చూసి ఆందోళన పడతాడు మధు. అది మధు చిన్ననాటి స్నేహితుడు సంపత్ కుమార్ జాతకం. అందులో అతనికి భార్య చేతిలో మరణం ఉన్నట్లు ఉంటుంది.
ఆ కాగితం రజిత అక్కడ ఉంచినట్లు అనుమానిస్తాడు మధు. రజితకు కాల్ చేసి, ఆమె వెళ్లిన హాస్పిటల్ కి వెళ్లి, ఆమెను కలుస్తాడు.
అక్కడ బెడ్ మీద అచేతనంగా పడిఉన్న తన స్నేహితుడు కుమార్ ని చూస్తాడు. తన జీవితం నాశనం కావడానికి కారణం నువ్వేనని మధుని నిందిస్తుంది రజిత.
జరిగిన కథను అతనికి ఇలా వివరిస్తుంది.
జాతకాన్ని నమ్మిన కుమార్ రజితను వేరొక వివాహం చేసుకొని భర్తకు విడాకులు ఇస్తే దోషం పోతుందని చెబుతాడు. అందుకు అంగీకరించదు రజిత.
దాంతో ముహూర్తం సమయంలో పవర్ కట్ చేసి రజితకు వేరే వాళ్ళ చేత తాళి కట్టిస్తాడు. శోభనం గదిలోకి కూడా వేరే వాళ్ళను పంపిస్తాడు. హోటల్ నుండి తప్పించుకొని ఒక పార్క్ లో దాక్కుంటుంది.
కుమార్ అతని స్నేహితుడు అక్కడికి వచ్చి రజితను చంపెయ్యాలనుకుంటారు. పార్క్ లో మార్కింగ్ వాక్ కి వచ్చిన వ్యక్తి రజితను కాపాడటానికి ప్రయత్నిస్తాడు. ఆ పెనుగులాటలో కుమార్ తలపై బలమైన గాయం అవుతుంది.
ఇక వినిపించని రాగాలు ధారావాహిక తొమ్మిదవ భాగం చదవండి.
కుమార్ స్పృహతప్పి పడిపోయాడు. అందరం అవాక్కై చూస్తున్నాము. అతని స్నేహితుడు అక్కడ్నించి పారిపోయాడు. తెల్లవారిపోయింది. వాకింగ్ వ్యక్తి, నేనూ కలిసి కుమార్ ని ఆటోలో ఇంటికి తీసుకెళ్లాం.
ఇంటిముందు ఆటో ఆగేసరికి అమ్మా నాన్నా బయట కొచ్చారు. నేను దిగాను.
"ఏమ్మా, పొద్దున్నే ఆటోలో వచ్చాశారా? " అంటూ నాన్న ఆటో దగ్గరకి వచ్చారు.
"ఇంకా అందులోనే కూర్చున్నారే. దిగండి అల్లుడుగారూ. " అని నాన్న ఆటోలోకి చూసారు. షాక్ అయ్యారు. రక్తం ఓడుతూ చలనరహితంగా కుమార్..
కుమార్ అమ్మా నాన్నా కూడా బయటకు వచ్చి చూసి "మా కుమార్ కి ఏవైంది?" అంటూ పెద్దగా ఏడుపు మొదలు పెట్టారు.
"ఉష్, గట్టిగా అరవకండి. ఇరుగుపొరుగు పోగవుతారు. అప్పుడు మీ పరువే పోతుంది" అన్నాడు నాతోపాటు వచ్చిన వ్యక్తి. అందరం కలిసి తోడుపట్టి కుమార్ ని వాళ్ళింట్లోకి తీసికెళ్లి పడుకోబెట్టాం.
కుమార్ ని ఆ స్థితిలో చూసి కన్నీరు మున్నీరయ్యారు వాళ్ళ పేరెంట్స్. రెక్క తెగిన సీతాకోకలా ఉన్న నన్ను చూసి అమ్మా నాన్నా బావురుమన్నారు. జుట్టు రేగిపోయి, పూలదండ వాడి దారం వెళ్లాడుతూ, మురికి పట్టిన బట్టలు చూసి ఏదో పెద్ద ఘోరం జరిగివుంటుందని ఊహించారు. అమ్మ కాఫీ కలుపుకొచ్చి ఇచ్చింది.
"కాసిని మంచినీళ్లు ఇవ్వమ్మా" అన్నాను. అమ్మ తెచ్చి ఇచ్చింది. నాతో వచ్చిన వ్యక్తి పార్క్ లో జరిగినదంతా వాళ్ళతో చెప్పాడు. విని నిర్ఘాంతపోయారు వాళ్ళు.
"భగవంతుడా, కుమార్ కి ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టించావు. ఆడపిల్ల విషయంలో చేయకూడని పని ఎందుకు చేశాడు" అని వాళ్ళమ్మ ఏడ్చింది. నాన్న డాక్టర్ కి ఫోన్ చేస్తే వచ్చాడు. ప్రధమ చికిత్స చేసి కుమార్ ని
"ఇంకా కొన ఊపిరి ఉంది. వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేయండి. "అన్నాడు.
నేను వెంటనే స్నానం చేసి బట్టలు మార్చుకుని బయలుదేరాను. నాన్న నన్ను రావద్దన్నారు. అమ్మ కూడా వెళ్ళద్దంది. అమ్మా నేనూ ఇంట్లోనే ఉన్నాం. వాళ్లంతా కుమార్ ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లారు.
పార్క్ లో నన్ను రక్షించిన వ్యక్తితో అమ్మ "మీరు గనక లేకపోతే ఈరోజు నా కూతురు ఏమైపోయేదో. దేవుడల్లే వచ్చి రక్షించారు. మీరుణం తీర్చుకోలేం" అంది చేతులు జోడిస్తూ”.
" నాదేముందమ్మా, అమ్మాయి జీవితం పెద్ద ప్రమాదంలో ఉంది. రక్షించాల్సిన భర్తే దారుణం చెయ్యబోయాడంటే అది మామూలు విషయం కాదు. దీని వెనక ఎవరో వున్నారు. అమ్మాయిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. " అని చెప్పి వెళ్లిపోయారు. అమ్మ భయపడిపోయింది.
నన్ను తన దగ్గరకు తీసుకుంది. వెన్ను నిమురుతూ "అసలు ఇదంతా ఏంటమ్మా, నీకే ఇలా ఎందుకు జరిగిందే. అసలేం జరిగింది. హోటల్ గదిలో ఉన్నవాళ్లు పార్క్ కి ఎలా వచ్చారు?" అంది.
హోటల్ రూమ్ లో జరిగిందంతా అమ్మతో చెప్పాను. అమ్మ నా మెడలో తాళి ఏదే అంది. పెళ్లిలో కుమార్ చేసిన దారుణాన్ని చెప్పి గుండె పగిలేలా ఏడ్చా.
"ఇంతలో ఎంత పని జరిగిపోయింది నా తల్లీ. పెళ్లిలో ఆ గందరగోళం జరగడం, కరెంటు పోవడం అంతా కుమార్ చేశాడా? చివరికి నీ మెడలో తాళి వేరేవాళ్ళతో కట్టించడం ఏంటే? మేం అక్కడే వున్నాంగా. మాకెవరికీ తెలీకుండా ఎట్లా చేసాడు? అక్కడితో ఆగకుండా ఇంత అన్యాయానికి ఒడిగట్టాడా? వాడు మామూలు చావు చావడు. దౌర్భాగ్యుడు" అని నోటికొచ్చినట్టు తిట్టిపోసింది.
"అమ్మా కుమార్ చేసింది తప్పే. కానీ దీనివెనక ఒక జ్యోతిష్యుడు వున్నాడు. అతను ఆడించినట్టల్లా కుమార్ ఆడుతున్నాడు. ముందు అతన్ని పట్టుకుని
బుద్ధి చెప్పాలి. అతనితోనే కుమార్ కి చెప్పించాలి." అన్నాను.
అందుకే నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. నీ మనసుకు శాంతి లేకుండా చేద్దామనే కుమార్ ని అక్కడనుంచి ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ లోఉంచి వైద్యం చేయిస్తున్నాను. క్షణక్షణం నీకు నరకం చూపించాలనే వచ్చాను. మా జీవితాలతో ఆడుకున్న నిన్ను సుఖంగా వుండనువ్వకూడదనుకున్నాను. మెమెంత నరకయాతన అనుభవించామో, నిన్నూ అలాగే భయంతో ఈ ఊరువదలి పారిపోయేలా చేద్దామనుకున్నాను. "
రజిత చెప్పడం పూర్తయింది.
మధు స్థాణువులా ఆమెనే చూస్తున్నాడు. ఇదంతా తనవల్ల ఎలా జరిగిందో అర్ధం కాలేదు. అక్కడున్న వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తాగాడు. రజిత మొహంలోకి చూసాడు. ఇంత క్రోధాన్ని దాచుకుని ఇంటికి వచ్చిందా? మై గాడ్. కానీ ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయింది. ఎందుకు? కిటికీ దగ్గరకు వెళ్లి నిలవడ్డాడు. రజిత చెప్పిన ఒక్కొక్క సీన్ కళ్ళముందు కనపడినట్టైంది.
లోకంలో ఇలా కూడా జరుగుతుందా? భార్యకి వేరొకరితో తాళికట్టిస్తారా? తొలిరేయి కూడా.. ఛా.. పరమ దారుణానికి ఒడిగట్టాడు. కానీ ఇదంతా తను చేశాననుకుంటోంది రజిత. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదని చెప్పాలి. రజిత దగ్గరకి వచ్చి కూర్చున్నాడు. మొహంలోకి చూసాడు మధు.
మునుపటి క్రోధం ఆమెలో లేదిప్పుడు.
ప్రశాంతంగా ఉంది. అలిసిపోయినట్టు కనురెప్పలు మూసుకుంది. కాసేపు నిశ్శబ్దం తరువాత
"రజితా, నీ విషయంలో జరిగింది మాత్రం దారుణం. కుమార్ ని నేను ఏమాత్రం సమర్ధించను. నువ్వొక్కటి తెలుసుకోవాలి. నీ విషయంలో అతను చేసేపనికి ఎలాంటి మద్దతూ ప్రకటించలేదు. అసలు అలా చేస్తాడని కూడా నాకు తెలీదు. మేం కలిసి ఏడాది కావస్తోంది. అతను నాకేవిషయం చెప్పలేదు. నేనతన్ని ప్రోత్సహించనూ లేదు. నన్ను నమ్ము" అన్నాడు మధు.
రజిత కళ్ళు తెరిచి నిప్పులు కురిపించేట్టు చూసింది.
"ప్రత్యక్షంగా కాకపోయినా కుమార్ అలా మారిపోవడానికి పరోక్ష కారకుడివైతే నువ్వే. అతని మనసు చెడగొట్టింది నువ్వే. జాతకం పేరుతో అతని మెదడు తొలిచేశావు. తప్పు దోవ పట్టించావు. నువ్వు చెప్పింది గుడ్డిగా నమ్మి చివరకి తన జీవితంతోపాటు నా జీవితాన్ని కూడా సర్వనాశనం చేసాడు.
దానికి కారకుడివి ముమ్మాటికీ నువ్వే" వెక్కి వెక్కి ఏడ్చింది రజిత.
మధు బలంగా ఊపిరి పీల్చుకుని ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా లేచి నిలబడ్డాడు.
"సరే రజితా, నువ్వు అనుకుంటున్నదే నిజమని నీ మనసు నమ్ముతోంది. ఇక నేనెంత చెప్పినా నీ కర్ధం కాదు. ఇప్పుడు నీకు కావాల్సింది మా పతనాన్ని కళ్లారా చూడడం. అంతేగా? కానివ్వు. నీకసి తీరేలా నన్ను శిక్షించు. నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఒక్కటిమాత్రం గుర్తుపెట్టుకో. నేను చెప్పేది నిజం. కుమార్ ని పక్కతోవే పట్టించాలనుకున్నాను.
అదెలా అంటే ఒక కన్నెపిల్ల జీవితాన్ని కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకే అతని జాతకంలో గండం ఉన్న విషయాన్ని కాస్త మార్చి వేరేలా చెప్పాను. కన్నె పిల్లని పెళ్లిచేసుకున్న మరుక్షణంలో నీకు ప్రమాదం తప్పదు అని చెప్పాను. విషయం ఏంటంటే అతన్ను కన్నె పిల్లను పెళ్లి చేసుకోకుండా చేద్దామని. నువ్వూ వాడూ పెళ్లి చేసుకుంటున్నారని వాడు నాకసలు చెప్పలేదు.
నా దగ్గర జాతకం చెప్పించుకుని వెళ్ళిపోయాడు అంతే. వాడు చేసిన ఈ పనులన్నింటికీ నేను బాధ్యుడిని కాను. నువ్వు నా మీద దయవుంచి వచ్చిన దారినే వెళ్లిపోయావు. అందుకు నీకు చాలా కృతజ్ఞతలు. " అన్నాడు మధు చేతులు జోడిస్తూ.
"నేను నీమీదేం జాలిపడి వెళ్లిపోలేదు. మీ నాన్నగారి ఫోటో చూసి, ఆయన గురించి తెలుసుకుని, నీ అవసరం ఆయనకి ఎంతో ఉందని నిన్ను విడిచిపెట్టాను"
" ఆయన మీద మాత్రం నీకెందుకు జాలి. ఆయనా మగవాడేగా. నీ పురుష ద్వేషానికి ఆయనికి మాత్రం ఎందుకు మినహాయింపు?"
"ఎందుకంటే ఆరోజు పార్క్ లో నన్ను రక్షించి ఇంటికి తీసుకెళ్లి దిగబెట్టింది ఆయనే గనక. "
"నీకు రక్షణగా నిలిచిన వ్యక్తి మా నాన్నగారా?"
"అవును మీ ఇంటికి వచ్చి చూశాక తెలిసింది. నువ్వు నాకు ద్రోహం చేసినా, ఆయన మాత్రం నా పాలిట దేవుడే. అందుకే తిరిగి వచ్చేశాను. "
" రజితా, నాన్న గురించిన పూర్తి విషయాలు నేను చెప్తేనేగా నీకు తెలిసింది. అమ్మని ఆయన అమితంగా ప్రేమించడం, మిలట్రీలో ఆయన సేవలు ఇలాంటివన్నీ నా ద్వారా తెలుసుకుని ఇంప్రెస్స్ అయ్యావు. నీ మనసు మార్చుకున్నావు. అలాగే నా గురించికూడా పూర్తిగా విను. అప్పుడు నిర్ణయం నీదే".
"పొరపాటు, ఆయన మంచితనం నువ్వు చెప్పకముందే పరిచయం అయ్యింది. పార్క్ లో ఆ కొద్దిసేపట్లోనే ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసింది. నీ దుర్మార్గం కుమార్ ప్రవర్తనలో ప్రతిఫలించింది. ఇక నీ గురించి తెలుసుకోడానికి ఏం లేదు?" అంది రజిత మొహం పక్కకు తిప్పుకుంటూ.
"హు, కళ్ళముందు కనికట్టు చేస్తున్న కుమార్ మోసాన్ని కనిపెట్టలేకపోయావు. కళ్ళకు ప్రేమ గంతలు కట్టుకుని అతన్ని గుడ్డిగా నమ్మేశావు. ఇంకా నమ్ముతున్నావు. తిరిగి నాదే తప్పంటున్నావు. మంచివాడిని ఎవరూ చెరపలేరు. చెడ్డవాడ్ని ఎవరూ మార్చలేరు.
నీకెంత చెప్పినా అర్ధం కాదు. వినే స్థితిలో కూడా లేవు. సరే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావ్?" అన్నాడు.
"కుమార్ ని బాగు చేయించుకుని తీసుకు వెళ్లాలనుకుంటున్నాను. " అంది రజిత.
"మరి మీ ఇంట్లోవాళ్ళు ఇందుకు ఒప్పుకున్నారా? ఇంత నమ్మకద్రోహం చేసిన కుమార్ ని క్షమించారా?"
"చెప్పానుగా, అతను స్వతహాగా మంచివాడు. అతని మనసులో భయాన్ని రేపింది నువ్వు, విషబీజాల్ని నాటింది నువ్వు. ఎవర్ని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించింది నువ్వు. అతన్ని గందరగోళంలో పడేశావు. అందుకే అతను అలా పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తించాడు. వాళ్ళతో అదే చెప్పాను"
"ఓహో, వాళ్ళు అది నమ్మేశారా? నమ్మి నిన్ను అతనితో జీవితాన్ని కొనసాగనిస్తారా?"
"లేదు, అసలు జరిగింది పెళ్లే కాదన్నారు. అతని నీడ కూడా నా మీద పడకూడదన్నారు. కానీ మూడుముళ్ల కంటే బలమైనది మానసిక బంధం. చిన్నప్పటినుంచీ అతని మీద పెంచుకున్న ప్రేమ, నమ్మకాలతో ఇంకొక చాన్స్ ఇమ్మని అడిగాను. ముందు కుమార్ కోమానుంచి కోలుకోవాలి.
అప్పుడు ఏం చెయ్యాలో ఆలోచిస్తా. "
"గొర్రె కసాయివాడిని నమ్మినట్టు, ఇంకా వీడికి విలువిచ్చి, నీ జీవితాన్ని వీడితోనే ముడిపెట్టుకుంటున్నావు చూడూ, నిన్నేమనాలో తెలియట్లేదు. "
"అదే ప్రేమలోని గొప్పతనం. అదే నన్ను వదలలేకుండా చేస్తోంది”.
"రజితా.. మళ్లీ అదే పాట మొదలెట్టావు. నీనొక ముఖ్యమైన విషయం చెప్పాలి. కొద్దిసేపు ఆగు. అమాయకత్వాన్నించి నిన్ను బయటపడేస్తా" అంటూ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడాడు మధు.
ఇంతలో నర్స్ వచ్చి కుమార్ కి ఇంజెక్షన్
ఇచ్చింది.
"మీరింకా వెళ్లలేదా? విజిటింగ్ అవర్స్ అయిపోయాయి" అంది.
"నేను విజిటర్ ని కాను. "
"ఎవరో ఒకరే ఇక్కడ ఉండాలి సార్. డాక్టర్ చూస్తే మమ్మల్ని తిడతారు" అంది నర్స్.
"మరేం ఫర్వాలేదు. కాసేపట్లో ఈవిడ వెళ్ళిపోతుంది. నేనుంటాను" అన్నాడు మధు.
"మీలో ఎవరున్నాసరే. ఒక్కళ్ళే వుండండి. సీసీ కెమెరాల్లో చూశారంటే అదో గొడవ" అని చెప్పి వెళ్ళిపోయింది నర్స్.
మధు ఫోన్ రింగయింది. రూమ్ లోంచి హాస్పిటల్ కిందకు వెళ్ళాడు. ఒకమ్మాయిని తీసుకుని పైకొచ్చాడు.
ఆమె చాలా సాదా సీదాగా ఉంది. అసలు ఏ ఆభరణాలూ లేవు. నుదుటన బొట్టుకూడాలేదు. వయసు పాతిక పైన ఉండొచ్చు. చామనచాయ. ఒడ్డూ పొడుగూ ఉంది.
ఎవరన్నట్టు చూసింది రజిత.
"ఈమె పేరు స్వప్న. ఈమె చెప్పేది విన్నాక ఏం చేయాలనేది నీ నిర్ణయానికే వదిలేస్తాను " అన్నాడు మధు.
మధు స్వప్నని కుమార్ బెడ్ దగ్గరకు తీసికెళ్లాడు. కర్టెన్ తీసి చూపించాడు. కుమార్ ని చూడగానే ఆమె చీర కొంగు అడ్డుపెట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది.
ఈమె అతన్ని చూసి ఎందుకు ఏడుస్తోందో రజితకి అర్ధం కాలేదు.
స్వప్నని కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చాడు.
కొద్దిసేపటికి తేరుకుంది.
"ఇప్పుడు చెప్పు స్వప్నా. కుమార్ నీకు తెలుసా?"
" తెలుసు"
" ఎన్నాళ్లనుంచి తెలుసు?"
"సంవత్సరం నుంచి"
"ఎలా తెలుసు?"
"మేమిద్దరం ప్రేమించుకున్నాం"
"అబద్ధం. అంతా కట్టుకథ. నేను నమ్మను" అంది రజిత.
"నువ్వు మధ్యలో అడ్డురాకు రజితా. స్వప్న చెప్పేది విను" అన్నాడు మధు.
"చెప్పు స్వప్నా. మీ ప్రేమకు ఇంట్లోవాళ్ళు ఒప్పుకోలేదా?"
"ఒప్పుకోలేదు."
"ఎందుకు. ?"
"నాకు ఇంతకుముందే పెళ్లయింది. నా భర్త యాక్సిడెంట్ లో చనిపోయాడు. కుమార్ తో పరిచయం అయ్యాక నాకు మళ్లీ పెళ్లిచేసుకోవాలనిపించింది. నా గురించి అంతా తెలిసికూడా పెళ్లి చేసుకుంటానన్నాడు.
మా ఆయన ఉద్యోగం నాకిచ్చారు. ఆ ఉద్యోగం చేసుకుంటూ మాదగ్గరే వుండమన్నారు మా అమ్మావాళ్ళు.
కానీ నేను కుమార్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. పెళ్లి చేసుకుంటే ఆ ఉద్యోగం పోతుంది. పోయినా సరే కుమార్ నాకు ముఖ్యం అనుకున్నాను. కుమార్ మాయింటికి వచ్చి మా పెళ్లికి అమ్మా నాన్నల్ని ఒప్పించాడు. కుమార్ కి ఉద్యోగం వచ్చాక పెళ్లి చేస్తాం అని చెప్పారు మా వాళ్ళు. కొన్నాళ్ళు పోయాక కుమార్ నా దగ్గరకొచ్చి నిన్ను పెళ్లిచేసుకోలేనని చెప్పాడు. తనని మర్చిపొమ్మన్నాడు.
ఎందుకు అని అడిగితే తనకి ప్రాణగండం ఉందని ఎవరో చెప్పారట. తనవల్ల నేను రెండోసారి విధవనవడం ఇష్టం లేదని అన్నాడు. ఇక తను ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానన్నాడు. కానీ అప్పటికే నేను గర్భవతినయ్యాను. ఆ విషయమే చెప్పాను.
తీయించేసుకోమన్నాడు. నేను అలా కుదరదన్నాను. కుదరదంటే ఎలా? ఒక భర్త పోయి బిడ్డ పుట్టి మళ్లీ రెండో భర్త కూడా పోతే నీ జీవితం పాడవుతుందని చెప్పాడు
అతను చెప్పింది కూడా నిజమే అనిపించింది.
అతను చెప్పినట్టే ఆ బిడ్డని భూమి మీదకి రానివ్వలేదు.
తర్వాత కుమార్ నాకు కనిపించడం మానేశాడు. అతనికోసం వెతికాను. అతని స్నేహితుల ద్వారా తెలిసిందేంటంటే అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని. మా పెళ్ళైతే నా ఉద్యోగం పోతుంది కాబట్టి ఈ పెళ్లి రద్దు చేసుకున్నాడని తెలిసింది.
అయితే కుమార్ నన్ను ప్రేమించలేదని, నా అందం, డబ్బు కోసమే నా దగ్గర నటించాడని అర్ధమైంది. అతన్ని నమ్మి మోసపోవడం నా తప్పే. మోసం చేయడం అతని బలహీనత. ఇక నేను కుమార్ కోసం ఎదురుచూడలేదు. ఇప్పుడు ఇక్కడ ఇలా కనిపించాడు" అంది స్వప్న.
రజిత అంతా విని మ్రాన్పడి చూసింది.
"ఇదంతా నిజమా. కుమార్ ఇద్దరు ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోవాలనుకున్నాడా? నమ్మలేకపోతున్నాను" అంది రజిత.
"అవును రజితా, స్వప్నతో కుమార్ వ్యవహారం మొత్తం నాకు తెలుసు. జాతకం చెప్పమంటూ నా దగ్గరకి వచ్చినపుడు స్వప్న విషయం అడిగాను. ‘అసలు మా మధ్య అలాంటిదేం లేదు. భర్త లేకపోవడంతో స్వప్న నా మీద మనసుపడి నా చుట్టూ తిరుగుతోంది. ఎలాగొలా తనని వదిలించుకుంటాలే’ అన్నాడు.
స్వప్న మా కొలీగ్ చెల్లెలు. నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు కుమార్ స్వప్నని పెళ్లి చేసుకుంటానని స్వయంగా ఆడిగినట్టు చెప్పారు వాళ్ళ నాన్నగారు. వాళ్ళు చెప్పినదానికీ కుమార్ చెప్పినదానికీ పొంతనలేదు. అందుకే ‘కన్నె పిల్లని చేసుకుంటే నీకు ప్రాణగండం ఉంది. పెళ్లైపోయిన అమ్మాయిని చేసుకుంటే ఆ ముప్పు తప్పుతుంద’ని చెప్పాను.
సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. దాన్ని ఇలా వక్రబుద్ధితో ఆలోచించి వేరొకరితో నీ పెళ్లి జరిపించి నీతో జీవితం పంచుకోవాలనే పధకం వేస్తాడని నేనూహించలేదు" అన్నాడు మధు.
"నాకిప్పుడు అంతా అర్ధమైంది మధూ. ముందు నన్ను వేరే పెళ్లి చేసుకుని తెగదెంపులు చేసుకుని వచ్చెయ్యమన్నాడు. నేను ఒప్పుకోకపోవడంతో నాకు తెలీకుండానే నా పెళ్లి వేరొకరితో జరిపించాలనే నీచపు ఆలోచన చేసాడు.
కానీ అతనిపై నాకున్న ప్రేమని తన అవసరానికి అనుగుణంగా వాడుకున్నాడు? నాతో నమ్మకంగా ఉంటూనే నా గొంతు కోశాడు"
కన్నీళ్లు ఎండిన కళ్ళతో శూన్యంలోకి చూస్తూ అంది రజిత.
"నీ పరిస్థితి ఇంకా మేలు. పాపం స్వప్నని చూడు. ఆమె మనసు ఎంతగా గాయపడిందో.
నీకు నీ కన్నవాళ్ళ సానుభూతన్నా మిగిలింది. ఆమెకు జరిగినదానికి అదీ కరువయ్యింది. " అన్నాడు మధు స్వప్నవంక జాలిగా చూస్తూ.
=======================================================
...సశేషం...
=======================================================
గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)
నా పేరు గొర్తివాణి
మావారు గొర్తి శ్రీనివాస్
మాది విశాఖపట్నం
నాకు ఇద్దరు పిల్లలు
కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది
అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
రచనల మీద ఎంతో మక్కువతో
కవితలు, కథలు రాస్తున్నాను.
విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,
ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి వంటి ప్రముఖ సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు
ఉత్తమ రచయిత్రిగా ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.
మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ
గొర్తివాణిశ్రీనివాస్
విశాఖపట్నం
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Comments