#TeluguMoralStories, #నైతికకథలు, #PittaGopi, #పిట్టగోపి, #వింతలోకంలోసంతకథ, #VinthalokamloSanthaKatha
'Vinthalokamlo Santha Katha' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 27/09/2024
'వింతలోకంలో సంత కథ' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
నిజంగా మనం బతుకుతున్న ఈ లోకమంతా ఒక మాయ ప్రపంచం. ఇక్కడ అందరూ తమకు అన్నీ తెలుసనుకుంటారు. ఏదైనా బాధ కానీ సమస్య కానీ వస్తే ఇతరులను సలహా అడుగుతారు. ఇది ఒక వింతలోకం. ఈ వింతలోకంలో చాలా సంత కథలు ఉన్నాయి.
పక్కోడికి ఒక్క ముద్ద అన్నం పెట్టడానికి కూడా ఇష్టపడని జనం అవసరం వచ్చినప్పుడు తమకు సహాయం చేయండని పొర్లు దండాలు కూడా పెట్టగల సమర్ధులు.
డబ్బు లేని ఆ కాలంలో కూరగాయలు వండుకుని తినేవాళ్ళు., డబ్బు గలవాళ్ళు అయ్యాక పచ్చి కూరగాయలు తింటున్నారు.
డబ్బు లేనప్పుడు గుడికి భక్తిగా దైవ దర్శనానికి వెళ్ళేవాళ్ళు, డబ్బు గలవాళ్ళు అయ్యాక సరదాగా తిరగటానికి వెళ్తున్నారు.
డబ్బు లేనప్పుడు నిద్ర లేపే వరకు మెలుకువ వచ్చేది కాదు., డబ్బు వచ్చాక నిద్రే పట్టక మాత్రలు మింగాల్సి వస్తుంది.
సొంత డబ్బుతో తినటానికి ఏది కొన్నా మూతను కూడా వదలకుండా నాకి కిందపడేసే జనం, ఫ్రీగా వస్తే మాత్రం ఆహారాన్ని సులభంగా పారవేస్తారు.
దేవుడి ఫొటోను పట్టుకుని తిరిగితే ప్రతివాడు చంపలు వాయించుకుని మరీ దండం పెడతాడు. అదే దేవుడి కోసం దక్షిణ అడిగి చూడు.. ఒక్కడు కూడా రూపాయి ఇవ్వడు.
కులమంటు, మతమంటు కొట్టుకు చస్తారు. ఏ కులపోడు పండించిన ధాన్యం అయినా లొట్టలేసుకుని తింటారు.
అణగారిన వర్గమని కొందరిని తాకటానికి కూడా ఇష్టపడని జనాలు వారిచ్చే డబ్బులు మాత్రం ముద్దు పెట్టి మరీ జేబులో వేసుకుంటారు.
ఆకులు తింటే బ్రహ్మ జ్ణానం కల్గుతుందనుకుంటారు. కానీ..! రోజు ఆకులు తినే మేకలకు ఎందుకు జ్ణానం లేదో ఆలోచించరు.
నీటిలో మునిగితే పాపాలు పోతాయని తెగ సంబరపడతారు. నిరంతరం నీటిలోనే ఉంటే చేపలు మొదలైన జీవులు పాప విముక్తులు ఎందుకు కావటం లేదో తెలుసుకోరు.
తలకిందులుగా తపస్సు చేస్తే పరమాత్మ దర్శనమిస్తే ముందుగా గబ్బిలాలకు అది దక్కాలి కదా..?
పాలు తాగితే ఎత్తు పెరుగుతారని అంటారు. మరీ..! పిల్లి పాలు తాగుతుంది ఎత్తు పెరుగుతుందా..?
సుర్యోదయానికి ముందు లేస్తే మంచిదంటారు. పేపరోడు, పాలు పోసేవాడు బెంజ్ కార్లలో తిరుగుతున్నారా..?
ఏడు తరాల కోసం తరగని ఆస్తులు పోగేస్తారు. కానీ రెండో తరానికి వారి ఫొటో పెట్టుకునే ఆసక్తి ఉండదు. మూడో తరానికి వారి పేరు గుర్తుపెట్టుకునే జ్ణాపకం కూడా ఉండదు.
వారసులకు సంపద కన్నా మంచితనం, సభ్యత, సంస్కారం నేర్పించే వాడు కానరాడు.
ఇల్లు కట్టే మేస్త్రీకి సరైన ఇల్లు ఉండదు.
పంటలు వేసి బాగా పండించి అందరికీ కడుపునింపే అన్నదాతలకు తినటానికి సరిగ్గా తిండి ఉండదు.
డబ్బు కట్టేవాడికే తప్ప కష్టపడి చదివేవాడికి ఉద్యోగం ఉండదు.
లేనప్పుడు పొదుపు చేయాలనే ఆలోచన రానివ్వని జనాలు, ఉన్నప్పుడు వృధాగా పాడు చేస్తారు.
ఈ లోకం ఇంతే.. కొనాలంటే ఎవరూ రారు. అవి అనవసరం అన్నట్లు వాటి వైపు కన్నెత్తి చూడరు., అదే ఫ్రీ అయితే నాకంటే నాకు ఆని ఎగబడతారు.
రోడ్లపై చిరు వ్యాపారం చేసుకునే వారి దగ్గర రకరకాల బేరాలు ఆడి కొంటారు, అదే షాపింగ్ మాల్ లాంటి వాటిలో వాళ్ళు ఎంత రేటు అంటే అంత ఇచ్చి బయటకొస్తారు.
ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి నవ్వినట్లు మనుషులు తమలో లోపాలు ఉంచుకుని ఎదుటోళ్ళ గూర్చి మాట్లాడుతారు.
సాధించటానికి ప్రయత్నించే వాళ్ళని కాళ్ళు పట్టుకుని లాగుతారు. సాధించాక కాళ్ళ బేరాలకు వస్తారు.
పక్కోడి వాకిట్లో చెత్త వేసి మన మంది మార్బలంతో వచ్చి వాడిదే తప్పు అని నిరూపించగల సమర్ధులు కూడా.
నీతి,నిజాయితీతో బతికే వారికి ఈ వింతలోకంలో విలువుండదు.
ఒక పేషెంట్ కి అత్యవసరంగా రక్తం అవసరమైతే ఒక డోనర్ ముందుకు వచ్చాడు. అయితే అనుకోకుండా అతడి బైక్ పాడవటంతో లిఫ్ట్ కోసం చూస్తున్నాడు. చాలామంది వస్తు పోతున్నవాళ్ళే తప్ప ఒక్కరు కూడా ఆపటం లేదు. ఓ ప్రబుద్ధుడు అయితే దారికి అడ్డంగా వస్తున్నావని చీవాట్లు పెట్టి వెళ్ళాడు. ఇక్కడ సంత కథ ఎలా ఉందంటే ఆ చీవాట్లు పెట్టిన వాడి తరుపు పేషంట్ కే రక్తం ఎక్కించాల్సి ఉంది. ఎలాగోలా సమయానికి డోనర్ వచ్చేశాడు సరిపోయింది. లేదంటే పేషంట్ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు.
కాళ్ళు లేకపోయినా ఒకడు కలెక్టర్ అవుతాడు. అన్ని ఉన్నోడు ఆ కలెక్టర్ ని వీల్చైర్ పై నడిపిస్తాడు.తాను కలెక్టర్ అయితే ఎంత బాగుణ్ణో.. అని ఆలోచిస్తాడు కానీ.. కాళ్ళు లేనోడికి ఉన్న జ్ణానం తనకెందుకు లేదని మాత్రం ఆలోచించడు.
ఉద్యోగం ఇచ్చిన మేనేజర్ కొడుకు ఆక్సిడెంట్ లో ఇబ్బంది పడుతుంటే ఒక యువకుడు ఆసుపత్రిలో చేర్చాడు. ఆఫీసుకి లేటైనందుకు అతడి ఉద్యోగమే పీకేసేంత పని చేశాడు మేనేజర్. తర్వాత కాపాడింది తన కొడుకునే ఆని తెలిసి ఆఫీసులో అందలం ఎక్కించాడు ఆ యువకుడిని.
ఈ వింతలోకంలో బతకటం అంటే.. మూడు పూటలు తిని, నలుగురు గూర్చి చెడుగా మాట్లాడి తాము పతివ్రతలమని చెప్పుకోవటం కాదు. మన కోసం నలుగురు వచ్చేలా.. నలుగురు మెచ్చేలా బతకాలి.
మనిషి అంతరాంగం అంతుపట్టదు. చనిపోయిన మనిషిని ముట్టుకుంటే స్నానం చేస్తాడు. నోరు లేని జీవులను చంపి కాల్చుకుని మరీ తింటాడు.
ఇందండి వింతలోకంలో సంత కథ.
*** *** *** *** *** *** ***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )
Profile:
Youtube Playlist:
నా పేరు పిట్ట.గోపి నేను శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఎం ఏ సోషల్ వర్క్ పూర్తి చేశాను. నాకు సమాజాన్ని,సమాజంలో మనుషులను గమనించటం అలవాటు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఏ చిన్న మంచి-చెడులనైనా.. మంచి కథలుగా మలచటంలో నాకు నేనే సాటి.వ్రృత్తిరిత్య నేను వ్యవసాయ కుటుంభంలో మద్యతరగతికి చెందిన వ్యక్తిని.ఇప్పటికే నేను రాసిన కథలు 90కి పైగా మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ లో ప్రచూరితం అయ్యాయి.అలాగే ప్రతిలిపిలో కూడా నా కథలు అచ్చయ్యాయి. నా కథలు బహుమతులుకు ఎంపికకాకున్నా..(లాప్టాప్ లేదు) ఫోన్ లోనే టైపింగు చేయాలన్నా కథలు పంపాలనే ఆశక్తి తగ్గిపోతుంది. కానీ..! సమాజంలో జరిగే సంఘటనలకు అక్షరరూపం ఇచ్చి పదిమందికి తెలపాలనేదే నా అభిలాష. నా కథల్లో మంచి చెడులను పాఠకులు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Commentaires