కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Veeri Madhyana Episode 5' New Telugu Web Series
Written By BVD Prasada Rao
రచన: బివిడి ప్రసాదరావు
బివిడి ప్రసాదరావు గారి ధారావాహిక 'వీరి మధ్యన..' ఐదవ భాగం
గత ఎపిసోడ్ లో…
సాహసికి ట్రాన్స్ఫర్ అయ్యే బ్రాంచ్ కి దగ్గర్లో ఇల్లు తీసుకొని ఉంటామని తల్లిదండ్రులతో చెబుతాడు సామ్రాట్.
మనం మాత్రం ఇక్కడే ఉందామని భర్తతో చెబుతుంది మాలతి.
తనకు బదులుగా సామ్రాట్ కి ఎదురుపడమని జలజని కోరుతుంది జ్వాల.
ఇక వీరి మధ్యన.. ఐదవ భాగం చదవండి...
"చూశావా, అదీ మంచితనం అంటే." అనేశాడు మోహనరావు.
శైలజ ఏమీ అనలేదు.
కొద్ది సేపు పిమ్మట, "మనం ఆ కొత్తింటికి సరంజామా అమర్చవలసి ఉంటుంది." శైలజే అంది.
"కాదా మరి. సొంతిల్లు ఐనా, అమ్మాయి వెంట అట్టివి పెట్టాలిగా." అన్నాడు మోహనరావు.
"లేదు లేదు. వాళ్ల మధ్య ఆ మాటలూ జరిగాయట. సామ్రాట్ చెప్పాడు. అట్టి వేమీ మన నుండి వాళ్లు వద్దు అన్నారట." చెప్పింది సాహసి.
"అది వాళ్ల పెద్ద మనసు. అలా కుదరదుగా. మన తృప్తి మేరకు మనం అట్టి వాటిని కానిచ్చేయాలి." చెప్పాడు మోహనరావు.
శైలజ ఏమీ అనలేదు.
"లేదు లేదు. సామ్రాట్, నేను మాట్లాడుకున్నాం. ఆ కొత్త ఇంటికి కావలసినవి, మా ఇద్దరం సమకూర్చి పెట్టుకుంటాం. ఇంత వరకు కూడిన మా శాలరీల నిల్వల నుండి కొంత కొంత చొప్పున వినియోగించుకోవాలనుకున్నాం. సో, నో ప్రోబ్లమ్స్, నో పార్మాలిటీస్." చెప్పింది సాహసి.
"అది కాదురా.." అంటున్న మోహనరావుకు అడ్డై -
"ప్లీజ్. మీ పెద్దలు మాకు అడ్డవ్వకండి. మాకు స్వేచ్ఛ ఇవ్వండి. సామ్రాట్ అన్నట్టు మేము చేపట్టబోయేవి మీకు తెలియచేస్తుంటాం, సరి కానివి చెప్పి సరి దిద్దండి. చాలు." అనేసింది సాహసి.
ఆ భార్యాభర్తలు మొహాలు చూసుకున్నారు.
"నేను తయారవుతాను." అంటూ లేచింది సాహసి. టీపాయ్ మీద ఖాళీ కాఫీ కప్పులతో ఉన్న ట్రేని తీసుకొని కదిలింది.
ఆ తల్లిదండ్రులు కూతురునే చూస్తున్నారు.
***
శనివారం రాత్రి - సామ్రాట్ ఫోన్ మోగింది. అతడు తన గదిలో ఉన్నాడు. లాప్టాప్ టేబుల్ మీది ఫోన్ ని తీసుకొని, స్క్రీన్ మీదికి చూశాడు. కొత్త నెంబర్. టైం చూసుకున్నాడు. పది రెండు నిముషాలు. వెంటనే జ్వాల అతడికి గుర్తుకు వచ్చింది.
కాల్ కలిపి, "ఏం. ఇన్నాళ్లు ఆగావ్. ఒప్పందంలో ఓడిపోతానన్న భయమా." అడిగాడు.
"చాల్లే. నాకు వేరే పనులు ఉండవా ఏం. ఇప్పటికైనా కాల్ చేశాను. సంతోషించు. నా దారికి రాకపోతే ఇక తగ్గేదేలే. రోజూ నీకు వాయింపే." అంది జ్వాల.
"అదేం లేదు. నీ నుండి ఫోన్ రాకపోవడమే నాకు హేఫీ ఐంది." చెప్పాడు సామ్రాట్.
"అబ్బ. అచ్ఛా. ఆ. తెలుస్తుందిగా. రింగ్ కాగానే టక్కున నా కాల్ కి వచ్చేశావు. చాల్లే మరి." అంది జ్వాల.
"సర్లే. ఏదో తగలడు." అనేశాడు సామ్రాట్.
"రేపు ఆదివారం. సాయంకాలం మూడు లోపు మా ఊరు వరంగల్ వెయ్యి స్తంభాల గుడి వద్దకు రా. నీ ఎదుట పడతాను నేను." చెప్పింది జ్వాల.
"ఏమిటేమిటి. మీ ఊరు, వరంగల్లా." అన్నాడు సామ్రాట్ ఆశ్చర్యం పడి. "అవును. వరంగల్ నీకు తెలియందా. నీకు వెయ్యి స్తంభాల గుడి తెలియదా. ఐతే వరంగల్ రోడ్డున అడిగితే ఇట్టే తెలిసి పోతుందిలే." అంది జ్వాల.
సామ్రాట్, "అంత గొప్ప ప్లేస్ లో ఈ లొల్లి ఏంటి." అన్నాడు.
"అంతటి ప్లేస్ లోనే నేను నీకు దర్శనం ఇవ్వాలని కోరుకుంటున్నాను." చెప్పింది జ్వాల.
సామ్రాట్ ఏమీ అనలేదు.
"నా మాట విను. లేదా. చెప్పాగా. ఇక బ్రేక్ లుండవు. ఎప్పుడు పడితే అప్పుడు. నిన్ను తగులుకుంటా. వాయిస్తా. జాగ్రత్త. బుద్ధిగా రావోయ్." అంది జ్వాల.
సామ్రాట్ హైరానా పడిపోతున్నాడు.
"అబ్బాయ్. రేపు నువ్వు ఒక్కడివే రా." చెప్పింది జ్వాల.
"నువ్వు నాకు తెలియదు. ఎలా గుర్తించేది." అడిగేశాడు సామ్రాట్.
"ఇక్కడికి నువ్వు వచ్చేక, సరిగ్గా మూడు పావుకు, నాకు కాల్ చేయ్. అప్పుడు నువ్వు నన్ను కలుద్దావ్ లే. నేను నీకు ఎదురు పడ్డాక, నేనేమీ మాట్లాడను. తొలుత నువ్వు 'నా కాళ్లని పట్టుకొని, నన్ను ప్రేమిస్తున్నాను' అని చెప్పాలి. ఆ తర్వాతే మిగతా మాటలు." చెప్పింది జ్వాల ఈజీగా.
"హే. ఏమిటీ చెత్త." అన్నాడు సామ్రాట్ విసురుగా.
"అయ్యో కోపమా. తగ్గు తగ్గు." అంది జ్వాల.
మాట్లాడ లేదు సామ్రాట్.
"థట్స్ గుడ్. రావాలి. చెప్పింది చెప్పినట్టు చేసి తీరాలి." అంది జ్వాల.
"నన్ను నువ్వు పోల్చుకోగలవా." అడిగాడు సామ్రాట్.
"అమాయకుడా. చెప్పాగా. నీ గురించి నాకు అంతా తెలుసు అని. అలాగే ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా. నువ్వు పెళ్లికై రాసిన, నీ బయోడేటా నేను ఎప్పుడో చూశా." చెప్పింది జ్వాల. ఆ వెంబడే ఆ కాల్ కట్ చేసేసింది.
సామ్రాట్ ఇంకా తేరుకోలేదు.
***
"మా సైడ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ ఐ రాగానే, మొదటి కార్డు 'షిర్డీ సాయిబాబా గుడి వారికి' పంపుతాం. పిమ్మట రెండో కార్డు మీకు అందించాలని, మీ వద్దకి, మీ చెల్లితో కలిసి నేను రావాలనుకుంటున్నాను బావగారు. మీ అనుమతి కావాలి." అన్నాడు ఫోన్ లో గోపాలస్వామి.
"అయ్యో అనుమతి ఏమిటి బావగారు. తప్పక రండి. మీకు సదా మా స్వాగతం." చెప్పాడు మోహనరావు.
ఆ వెంబడే, "మా వైపు కార్డ్స్ నాలుగైదు రోజుల్లో వచ్చేస్తాయి. మేమూ మీ వద్దకి రావాలి. మీకు, మీ దగ్గరి వారికి మేము స్వయంగా కార్డ్స్ ఇవ్వాలిగా." చెప్పాడు.
"ముందు మా వైపుది కానీయండి. మేమూ ఎగస్ట్రా కార్డ్స్ తో వస్తున్నాం. మీ దగ్గరి వారికి కూడా మేము స్వయంగా ఇవ్వాలిగా." చెప్పాడు గోపాలస్వామి.
"బావగారూ. ఇవన్నీ జస్ట్ ఫార్మాలిటీస్. ఈ రోజుల్లో ఇట్టివి తగ్గు ముఖం పడుతూన్న, మీరే 'వద్దు వద్దు, సాంప్రదాయాల్ని ఆచరిద్దాం' అన్నారు. శ్రమ ఐనా, మీరు అన్నది మాత్రం మంచిదే. సో అలానే కానిద్దాం." చెప్పాడు మోహనరావు.
"సరే వచ్చే వారంలో కలుద్దాం. మిగతావి ముఖాముఖీగా ముచ్చటించుకుందాం." చెప్పాడు గోపాలస్వామి.
"అలాగే బావగారు. ఒన్స్ ఎగేన్, ప్లీజ్ వెల్కం." అన్నాడు మోహనరావు. పిమ్మట ఆ ఫోన్ల సంభాషణ ముగిసింది.
***
"రేపు ఆదివారం, మనం వెయ్యి స్తంభాల గుడికి తప్పక వెళ్లాలి." సాహసికి చెప్పింది జ్వాల.
సాహసి ఇంటిలో, సాహసి గదిలో ఆ ఇద్దరూ ఉన్నారు.
"ఏంటో 'తప్పక' అంటున్నావు. ఏంటి కత." నవ్వుతూ అడిగింది సాహసి.
"ప్లీజ్. ప్రామిస్. నువ్వు రావాలి. మనిద్దరమే వెళ్తున్నాం. అక్కడికి వెళ్లేక నీకే అంతా తెలుస్తుంది." గబగబా చెప్పేసింది జ్వాల.
"సరి సరి సరి సరే. అంతగా బతిమలాడక్కర లేదు." అంటూనే జ్వాల రిక్వెస్ట్ ని ఎక్సఫట్ చేసేసింది సాహసి.
"రేపు సాయంకాలం మూడయ్యే సరికి మనం అక్కడ ఉండేలా బయలుదేర్దాం." అంది. ఆ వెంటనే, "ఇది అప్పటి వరకు గోప్యం సుమీ." చెప్పింది. పిమ్మట తన ఇంటికి వెళ్లి పోయింది.
***
రాత్రి తొమ్మది కాబోతుంది. రేపటి తన వరంగల్ ప్రయాణంకై సామ్రాట్ అప్పటికే ఒక నిర్ణయంకి వచ్చేసి ఉన్నాడు. దానికై నానా తంటాలు పడ్డాడు. చాలా విధాలుగా యోచనలు చేశాడు. తనకి ఫోన్ చేసి అల్లరి చేస్తున్న జ్వాల విషయం వీలు వెంబడి సాహసి దృష్టికి తేవాలనే గట్టిగా నిర్ణయించుకొనే ఉన్నాడు. కానీ ఇంతలోనే రేపటికే మీటింగ్ అని జ్వాల చెప్పేయడం, పైగా తనది 'వరంగల్' అని చెప్పడంతో, ఇక ఉపేక్షించకూడదనుకున్నాడు.
అప్పుడే సాహసి నుండి సామ్రాట్ కి ఫోన్ కాల్ వచ్చింది.
కాల్ కలిపి, "హలో హసి." అన్నాడు సరదాగా.
"హాయ్." చెప్పింది సాహసి మెత్తగా.
"ఈ రోజు నీ ముందు సరైన టాపిక్ ఉంచబోతున్నాను." చెప్పాడు సామ్రాట్.
"అవునా. ఏంటో." అంది సాహసి చిత్రంగా.
"తొలుత నేను చెప్పేది పూర్తిగా విను. ప్లీజ్." అన్నాడు సామ్రాట్.
"ప్రొసీడ్." అంది సాహసి.
సామ్రాట్ మొదటి నుండి తుది వరకు, తనకు జ్వాలకు మధ్య జరిగినదంతా పొల్లు పోకుండా చెప్పగలిగాడు. కానీ కొన్నింటిని దాపరికంలో పెట్టాడు.
సామ్రాట్ చెప్పడం అయ్యేక, "ఎవరు ఆమె." అడిగేసింది సాహసి గమ్మున.
"చెప్తాను. దానికి ముందు అసలు సిసలైనది ఒకటి ఉంది. అది రివీల్ చేస్తా. చెప్పాడు సామ్రాట్.
"చెప్పు మహానుభావా." అంది సాహసి చిరాగ్గా, ఉత్కంఠ భరించలేక.
"ఆమెది మీ ఊరే. వరంగల్." చెప్పడం ఆపాడు సామ్రాట్. గతుక్కుమంది సాహసి.
"తనని నన్ను కలవమంది వెయ్యి స్తంభాల గుడి వద్దన. సాయంకాలం మూడు గంటల సమయాన." చెప్పాడు సామ్రాట్. తన దాపరికాల్లోంచి చాలా వాటిని రివీల్ చేసేశాడు.
"ఆమె పేరు." టక్కున అడిగేసింది సాహసి.
"పేరు.. పేరు.." నానుస్తున్నాడు సామ్రాట్.
"చెప్పవోయ్." పుసుక్కున అనేసింది సాహసి మరి తాళలేక.
సాహసి రియాక్షన్ గ్రహిస్తూ, "పేరు తెలియదు. అడిగినా చెప్పలేదు" గుప్పున చెప్పేశాడు సామ్రాట్.
తికమక పడుతుంది సాహసి. ఆ తోవలోనే, "బహుశా జ్వాల కావచ్చు." అనేసింది.
"జ్వాలా.. ఎవరు. ఎలా." అన్నాడు సామ్రాట్ గందికగా.
"మరే. 'మనిద్దరమే వెయ్యి స్తంభాల గుడికి తప్పక వెళ్లాలి'. పైగా 'గుట్టు'గా అంది ఆమె నాతో. పైగా రేపే. మూడు గంటలకే. ఆ. అప్పుడు ఏమో అనుకున్నాను. ఇదా సంగతి." చెప్పింది సాహసి విస్మయంగా.
"ఆమె తెలుసా నీకు." అడిగాడు సామ్రాట్.
"ఆ. నాతో చదివింది. మా వీథిలోనే ఉంటుంది. ముద్దపప్పు అనుకున్నాను. కానీ తను ఇంతటిదా." అంది సాహసి.
"తను ఎందుకు నన్ను టార్గెట్ చేస్తుంది." అడిగాడు సామ్రాట్.
"నాకు అదే కొడుతుంది. ఎందుకు ఇలా బరికెక్కుతుందో అర్థం తోయడం లేదు." చెప్పింది సాహసి.
"నీకు నాకు పెళ్లి కాబోతుందని తనకి తెలియదా." అడిగాడు సామ్రాట్.
"తెలియకపోవడం ఏమిటి. మన పెళ్లి చూపుల రోజున తను వచ్చేదిగా. చాలా చనువు మా ఇంట. తనకి అన్నీ తెలుసు. మరి ఏంటో ఇదంతా." అంది సాహసి నీర్సంగా.
"హసి, డీలా పడకు. తేలుద్దాం." చెప్పాడు సామ్రాట్.
"నా గెస్సే కరక్ట్. తను నువ్వు మాకు పంపిన నీ బయోడేటాని చూసింది. నీ ఫోటోనీ చూసింది. దాంట్లో నీ ఫోన్ నెంబర్ ని అది తస్కరించింది. అంతే. అదీ సంగతి." అంది సాహసి ట్రాన్స్ లో ఉన్నట్టు.
"సరే, మరి, తను నన్ను వేధిస్తుంది ఎందుకు." అన్నాడు సామ్రాట్ తడబడతూ, కంగారుగా.
"ఓర్వలేనితనం. నాకు తెలుసుగా. తనని అంతా 'కుళ్ళుబోతు'ది అంటారు. అదే కారణం కావచ్చు." అంది సాహసి.
"అదేమిటి." అన్నాడు సామ్రాట్.
"అవును. అంతే. తనకి ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి. తప్పిపోయాయి. 'పిల్ల నచ్చడం లేదు' అన్నది ఆ నోట ఈ నోట ప్రచారమవుతుంది. అదే కారణం. నాకు మొదటి సంబంధమే కుదిరి పోవడంతో, తన ఓర్వలేనితనమే తనచే ఇలా చేయిస్తుందేమో. ఛ." అంది సాహసి.
"అవునా. కావచ్చు. అమ్మో." అనేశాడు సామ్రాట్.
ఆ వెంటనే, "అది చెప్పినట్టే వస్తాను. తన పని పడతాను." అన్నాడు గట్టిగా. సాహసి వెంటనే మాట్లాడ లేదు.
"నీకు ఏమీ తెలియనట్టు, తను కోరినట్టే తనతో నువ్వు రా. ఇద్దరం ఆమె పని పడదాం." చెప్పుతున్నాడు సామ్రాట్.
అడ్డై - "వద్దొద్దు. అలా వద్దు." టక్కున అంది సాహసి.
"ఏం. ఐనా తన ప్లాన్ ఏంటో తెలుసు కోవాలిగా" అన్నాడు సామ్రాట్ గతుక్కుమంటూ.
"తన ప్లాన్ ఏమైతే మనకు ఎందుకు. తన కర్మన తనే పోతుంది. తను బరి తెగించిదని, తనని మనం బజారు పాలు చేయడం మంచిది కాదు. వదిలేద్దాం." అనేసింది సాహసి.
"తను నన్ను వదిలేలా లేదుగా." అన్నాడు సామ్రాట్ నీర్సంగా.
"తనని నేను అడ్డుకుంటాగా. నువ్వు రేపు రాకు. ఇకపై నీకు తన నుండి ఏ సొద ఉండకుండా తనని కట్టడి చేసేస్తాగా." అంది సాహసి ధీమాగా.
"ఎలా." వెంటనే అడిగాడు సామ్రాట్.
"విషయం నాకు తెలిసిందని తనతో చెప్పేసి, ఆగకపోతే, పెద్దల వరకు సంగతి వెళ్తుందని సూటిగా చెప్పేస్తాను. తనే తోక ముడుచుకొనేలా నేను చూసుకుంటాను. నువ్వు కూల్ అవ్వు. నువ్వు కానీ, నేను కానీ, జ్వాల చెప్పినట్టు ఆర్ కోరినట్టు మనం ఏమీ చేయనక్కర లేదు. నువ్వు రాకు. నేను పోను." చెప్పింది సాహసి.
"సరే." అనేశాడు సామ్రాట్.
తర్వాత, టాపిక్ మార్చుకున్నారు. సరదగా మాట్లాడుకున్నారు.
చివరన, వాళ్లు 'గుడ్నైట్'లు చెప్పుకున్నాక, వాళ్ల ఫోన్ల ముచ్చట్లు ముగిశాయి సరళంగా.
***
ఆదివారం ఉదయం - నైట్ డ్యూటీ కాగానే, హాస్పిటల్ నుండి బయలు దేరింది జ్వాల, తన స్కూటీ మీద. తిన్నగా జలజ రూంని చేరింది. జలజ జాబ్ కు నిన్న ఉదయమే రిజైన్ చేసేసింది.
స్కూటీని రోడ్డు పక్కన నిలిపి, జలజ రూం వైపు కదిలింది జ్వాల. ఆ రూం తలుపుకు తాళం పెట్టి ఉంది. ఆశ్చర్యపోయింది జ్వాల.
ఇరుగింటి ముందుకు వెళ్లి, ఆ ఇంట్లోకి చూస్తూ, "ఏమండీ." అంది.
లోపలి నుండి ఒకావిడ వచ్చింది. జ్వాలను చూస్తూనే, "ఏమ్మా." అంది.
"పక్కింటి రూంకి తాళం ఉంది. ఆమె ఎటు వెళ్లింది." అడిగింది జ్వాల.
ఆ వచ్చినావిడ, "అదేంటమ్మా. నీకు తెలియదా. అప్పుడప్పుడు ఆమె వద్దకు నువ్వు వస్తుండడం నేను చూశాను. ఆమె నీకు చెప్పకుండానే ఊరు వెళ్లి పోయిందా." అంది విడ్డూరంగా.
"ఊరు వెళ్లి పోయిందా. ఎప్పుడు." అడిగింది జ్వాల విస్మయంగా.
"ఆ. నిన్న సాయంకాలం. సామాన్లను వ్యాన్ లో వేయించుకొని, గదిని ఖాళీ చేసేసి, ఏదో ఊరు వెళ్లి పోతున్నానని చెప్పింది. వెళ్లి పోయింది." చెప్పింది పక్కింటావిడ.
"సోమవారం వెళ్తానంది. ఇంతలో వెళ్లిపోయిందేంటి." అనేసింది జ్వాల.
"ఏమోనమ్మా. మాకేం తెలుస్తుంది." అంది పక్కింటావిడ.
జ్వాల హైరానా పడుతుంది. అస్తవ్యస్తంగా చుట్టూ చూస్తుంది.
"ఏమ్మా. ఏమైంది." అడుగుతుంది పక్కింటావిడ.
అడ్డై - "ఆ. ఏమీ లేదు." అంటూనే, అక్కడ నుండి భారంగా తన ఇంటికి బయలు దేరింది జ్వాల తన స్కూటీతో. ఎలాగో తన ఇంటిని చేరిపోయింది. ఆమె మైండ్ మొద్దుబారిపోయి ఉంది.
***
(కొనసాగుతుంది..)
***
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
Comments