top of page
Writer's pictureBVD Prasada Rao

వీరి మధ్యన... ఎపిసోడ్ 9

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.








Youtube Video link

'Veeri Madhyana Episode 9' New Telugu Web Series


Written By BVD Prasada Rao




(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


బివిడి ప్రసాదరావు గారి ధారావాహిక 'వీరి మధ్యన..' తొమ్మిదవ భాగం


గత ఎపిసోడ్ లో…

విజయవాడలో ఉన్న సామ్రాట్ మేనత్త మరణిస్తుంది.

సామ్రాట్, సాహసిల పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తుంది.

పెళ్లి వాయిదా వేయవద్దని సాహసి తల్లిదండ్రులతో పాటు, సామ్రాట్ కూడా అభ్యర్థిస్తాడు.

అందుకు అంగీకరిస్తాడు సామ్రాట్ తండ్రి గోపాలస్వామి.

సాహసి, సామ్రాట్ ల వివాహం జరుగుతుంది.

ఇక వీరి మధ్యన.. తొమ్మిదవ భాగం చదవండి...



ఆ ఇద్దరి మధ్య మంచి పరిచయం ఉంది. బాగా చనువు ఉంది. బ్యాంక్ లో లంచ్ ఇద్దరూ కలిసే చేస్తుంటారు. వీక్ ఎండ్స్ లో ఇద్దరూ కలిసే షాపింగ్ చేస్తుంటారు. వ్యక్తిగత ముచ్చట్లు బిడియం లేకుండా ముచ్చటించుకుంటారు. ఫ్రెండ్స్ లా మెసులుకుంటారు.


చంద్రికకు పెళ్లైంది. ఆమె భర్త లోకల్ ప్రయివేట్ కాలేజీలో లెక్చరర్. వాళ్లకు రెండేళ్ల బాబు ఉన్నాడు.


చంద్రిక, ఆమె భర్త జాబ్ లకు వెళ్తుంటే, వాళ్ల బిడ్డ సంరక్షణ, ఇంటి పరివేక్షణ చంద్రిక అత్తమామలు చక్కదిద్దుతున్నారు ఎంచక్కా.


సాహసి చెప్పిందంతా విన్న చంద్రిక, "అవునా. ఈ ఆషాఢ మాసం రోజులు ఇక్కడే జాబ్ చేయాలనుకుంటున్నావా. నిజానికి నా రిక్వెస్ట్ తో హెడాఫీస్ లో నాకున్న పరిచయాలతో, నీ ట్రాన్స్ఫర్ కు సహకరించగలుగుతున్నాను. సికింద్రాబాద్ బ్రాంచ్ కు రానున్న ఫస్ట్ తారీఖుకు నువ్వు వెళ్లాలి. మళ్లీ రిక్వెస్ట్ పెడితే, ఆ సికింద్రాబాద్ బ్రాంచ్ లో ఉన్న ఆ వెకెంట్ ను ఇంకా కొన్నాళ్ల పాటు కొనసాగించ లేరు. ఆ బ్రాంచ్ మేనేజర్ ఆ వెకెంట్ ను భర్తీ చేయమని బాగా ఒత్తిడి చేస్తున్నాడట." చెప్పింది.

సాహసి మాట్లాడలేక పోతుంది.


"అన్నట్టు. సికింద్రాబాద్ బ్రాంచ్ దగ్గరన మీ వారు పోర్షన్ తీసి పెట్టారని చెప్పావుగా. మరేంటి ప్రొబ్లమ్. అక్కడికి నువ్వు వెళ్ల వచ్చుగా. మీ ఆయన నువ్వు అక్కడ ఉండొచ్చుగా. పైగా మీ అత్తవారు వేరేగా ఉంటున్నారుగా." అంది చంద్రిక చకచకా.


సాహసి గమ్మున మాట్లాడలేక పోతుంది. చంద్రికనే చూస్తూ ఉండిపోయింది.

"ఏంటాలా చూస్తున్నావ్." అడిగింది చంద్రిక.

"మరే. అదే అదే. మా వాళ్లతో అదే చెప్పాను. కానీ వాళ్లు కుదరదన్నారు." చెప్పింది సాహసి.

"ఏం." అంది చంద్రిక విస్మయంగా.

"మరే. మాకు ఇంకా శోభనం కాలేదు." చెప్పగలిగింది సాహసి.

"వాట్. అదేంటి. పెళ్లి తర్వాత పదహారు రోజుల పండగలో అదొక వేడుకగా. అలా కాకపోవడమేంటి." అంది చంద్రిక చిత్రంగా.


"నా మామగారి అక్క చనిపోయారుగా. దాంతో నా అత్తింటి వారు, అట్టి పదహారు రోజుల ముచ్చట్లును రద్దు చేసేశారు. ఏదో చేశామన్నట్టు నన్ను అత్తవారింటికి తీసుకు వెళ్లి, ఆ మర్నాడే నన్ను పుట్టింటికి చేర్చేశారు." చెప్పింది సాహసి మెల్లి మెల్లిగా.


"ఓహో." అంది చంద్రిక. తన నుదుటని తన కుడి చేతి వేళ్లతో రుద్దుకుంది. సాహసి ఆమెనే చూస్తుంది.

"మరెలా. నీకు ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడగలను. కానీ, సికింద్రాబాద్ బ్రాంచీ కైతే ఇక కుదరకపోవచ్చు." చెప్పేసింది చంద్రిక.


"అయ్యో. మరెలా. ఆయన అక్కడ ప్లాట్ తీసేసుకున్నారు. కొన్ని సామాన్లు కూడా సర్ది పెట్టేశారు." చెప్పింది సాహసి గబగబా.

చంద్రిక ఏమీ అనలేదు. సాహసి ఆమెనే చూస్తూ ఉంది.


నిమిషం తర్వాత, "సర్లే. మరోసారి హెడాఫీస్ వాళ్లతో మాట్లాడి చూస్తాను. ఇప్పటికిప్పుడు ఇక్కడ జాయినింగ్ వద్దు. సెలవులోనే ఉండు. నువ్వు రేపు కలు. లేదు లేదు. అటు నుండి విషయం తెలియగానే, నీకు నేనే ఫోన్ చేస్తాను. సరేనా." అంది చంద్రిక కాస్తా ఇబ్బందిగానే.


"సరే." అంటూ సాహసి అక్కడ నుండి ఇంటికి బయలుదేరింది.

ఇంటికి వచ్చిన కూతురును చూస్తూనే, "ఏంటి. ఇంత తొందరగా వచ్చేశావు. జాయిన్ కాలేదా." అడిగాడు హాలులో ఉన్న మోహనరావు.

తండ్రి ఎదురుగా సింగిల్ సోఫాలో కూర్చుంటూ, "లేదు." అంది సాహసి ముభావంగా.

"ఏం." అడిగాడు మోహనరావు.


బ్యాంక్ లో తనకు, చంద్రికకు మధ్య జరిగింది టూకీగా చెప్పుతుంది సాహసి.

వీళ్ల మాటలు విన్న శైలజ కిచిన్ నుండి అక్కడికి వచ్చింది. భర్త పక్కన సోఫాలో కూర్చుంది.

సాహసి చెప్పడం ఆపగానే, "అయ్యో. మరెలా. ఆ బ్రాంచ్ కైతేనే బాగుంటుందిగా." అంది శైలజ.


"ఆలస్యమైతే అది కుదిరేలా లేదంటుందిగా." అన్నాడు మోహనరావు.

"మరెలాండీ." అంది శైలజ నిరాశగా.


"ఆగు. వీళ్ల మేనేజర్, పై వాళ్లతో మాట్లాడతానన్నారుగా. అదీ విందాం." చెప్పాడు మోహనరావు.

"బాగొచ్చింది." అంటూ తిరిగి వంటకై కిచిన్ వైపుకు కదిలింది శైలజ.


"మీ మేనేజర్ ఫోన్ వచ్చేక ఆలోచిద్దాంలేమ్మా." అన్నాడు మోహనరావు.

సాహసి లేచి, డైనింగ్ టేబుల్ వైపుకు కదిలింది. దాని మీద తన బ్యాగ్ లోంచి లంచ్ బాక్స్ ను తీసి పెట్టింది. తర్వాత తన రూం వైపుకు నడిచింది.

***

లంచ్ టైం అప్పుడు, సామ్రాట్ కు ఫోన్ చేసింది సాహసి.

"హలో హసి." అటు నుండి ఫోన్ లో పలకరించాడు సామ్రాట్.

"బిజీయా." అడిగింది సాహసి.


"నో. మాట్లాడు. లంచ్ టైంగా. ఫ్రీయే. అన్నట్టు నీకూ లంచ్ టైమేగా. లంచ్ చేస్తున్నావా." అడిగాడు సామ్రాట్ సామాన్యంగా.

"లేదు. బ్యాంక్ కు వెళ్లి వచ్చేశాను. ఇంట్లోనే ఉన్నాను." చెప్పింది సాహసి.

"అదేంటి. ఈ రోజు నుండి జాబ్ కు వెళ్తున్నట్టు రాత్రి చెప్పావుగా." అన్నాడు సామ్రాట్ విస్మయంగా.


"అనుకున్నాను. కానీ కుదరలేదు." అంటూ ఆ సంగతిని క్లుప్తంగా చెప్పింది సాహసి.

"అరె. అవునా. అలా ఐందా." అన్నాడు సామ్రాట్.

సాహసి ఏమీ అనలేదు.


"మనం కలిసి ఉండడానికి ఈ మాసం దాటే వరకు కుదరదని మన పెద్దలు చెప్పేశారుగా. మరెలా." అన్నాడు సామ్రాట్.

"అందుకేగా. నేను అక్కడికి వచ్చేంత వరకు నా లీవ్స్ ను కేన్సిల్ చేసుకొని ఇక్కడే జాబ్ చేయాలనుకున్నాను." చెప్పుతుంది సాహసి.


"అవునవును. నేనూ సరే అన్నాగా." చెప్పాడు సామ్రాట్ అడ్డై.

సాహసి చెప్పడం కొనసాగిస్తూ, "బ్యాంక్ కు వెళ్లేక ఇలా తేలింది." చెప్పింది.

"ఇప్పుడేం చేద్దాం." అడిగాడు సామ్రాట్.

సాహసి ఏమీ అనలేదు.

"నీ మేనేజర్ నుండి ఫోన్ రాని. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం." చెప్పాడు సామ్రాట్.


"అలా అంటావా." అనేసింది సాహసి.

"మరంతేగా." అన్నాడు సామ్రాట్.

"సరే. నీ లంచ్ కానీ." అంది సాహసి.

"చేస్తాను. నువ్వు కూడా చేసేయ్." అన్నాడు సామ్రాట్.

ఆ పిమ్మట వాళ్ల ఫోన్ సంభాషణ కట్ ఐంది.

***

సాయంకాలం నాలుగవుతుంది. చంద్రిక నుండి ఫోన్ కాల్ వచ్చింది సాహసికి.

కాల్ కలిపి, "చంద్రికా." అంది సాహసి ఆత్రంగా.

"సాహసి. మాట్లాడేను. వాళ్ల వెర్షన్ వాళ్లు చెప్పారు. సికింద్రాబాద్ బ్రాంచ్ వేకెంట్ ను మరి హోల్డ్ లో ఉంచలేరట. సో, ఇక ఆలోచన నీ వంతు." చెప్పేసింది చంద్రిక.

"చంద్రికా." అంది సాహసి భీతిగా.


"డోంట్ వర్రీ సాహసి. నీ ట్రాన్స్ఫర్ కు నేను సహకరించగలను. కానీ అక్కడికైతే నాకు వీలు కాదు." చెప్పింది చంద్రిక.

"సరే. ఆలోచించి చెప్తాను." చెప్పింది సాహసి.

"నేను కూడా వాళ్ల పర్మిషన్ తీసుకున్నాను. మాత్రం రేపటికి తేలిపోవాలాలి స్మీ." చెప్పింది చంద్రిక.


"అలానా. సరే. రేపు కలుస్తాను." చెప్పింది సాహసి.

కాల్ కట్ చేసేసి, తన రూం నుండి బయటికి వచ్చి, తన తల్లిదండ్రులను పిలిచింది హాలులోకి.

వాళ్లు తమ రూం లోంచి హాలులోకి వచ్చారు.

ఆ ముగ్గురూ హాలులో కూర్చున్నారు.


చంద్రిక ఫోన్ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది సాహసి.

ఆ ఇద్దరూ మొహాలు చూసుకున్నారు.

"ఏం తేలుస్తాం." అంది శైలజ తొలుతగా.

"అదే. ఎలా తేలుస్తాం." అన్నాడు మోహనరావు.


"పోనీ సికింద్రాబాద్ బ్రాంచ్ తప్పిపోతే, మరే బ్రాంచ్ కు ట్రాన్స్ఫర్ రావచ్చు." అడిగింది శైలజ.

"అదేం చెప్పగలం. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి చేయగలరు." చెప్పింది సాహసి.

ఆ వెంబడే, "అక్కడికే అనుకొని, అక్కడ ప్లాట్ కూడా త్రీ మంత్స్ అడ్వాన్స్ పే చేసి తీసుకోవడం ఐంది." చెప్పింది సాహసి.


"అదీ ఆలోచించాలి." అన్నాడు మోహనరావు.

"వీళ్లకి శోభనం కార్యక్రమం జరిపించేసి ఉంటే ఈ ఇబ్బంది లేకపోను." అనేసింది శైలజ భర్తనే చూస్తూ.

ఆ ఇద్దర్నీ చూసింది సాహసి.

మోహనరావు చూపు మార్చుకున్నాడు.


"మరోసారి ఈ విషయమై మనం వియ్యపు వారుతో మాట్లాడితే బాగుంటుంది." చెప్పింది శైలజ.

"అలా అంటావా." అన్నాడు మోహనరావు.

"అవునండీ. వాళ్ల చొరవ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇదీ వాళ్లకు ముఖ్యమేగా." అంది శైలజ.


"సరే. మాట్లాడతాను." అంటూ తన ఫోన్ కై తమ రూంలోకి వెళ్లాడు మోహనరావు.

సాహసి సింగిల్ సోఫా మీంచి లేచింది.

"కూర్చో తల్లీ. మీ అత్తింటి కబురు విందాం. ఉండు." చెప్పింది శైలజ.

తిరిగి కూర్చుంది సాహసి.


ఫోన్ తో వచ్చాడు మోహనరావు. సోఫాలో భార్య పక్కన తిరిగి కూర్చున్నాడు. గోపాలస్వామికి ఫోన్ చేశాడు. పలకరింపుల తర్వాత, విషయంకి వచ్చాడు. అతడి ఫోన్ స్పీకర్ వాయిస్ లో ఉంది.

"ఇది బావగారూ." అంటూ విషయాన్ని చెప్పడం ముగించాడు.

"అలానా బావగారు. అయ్యో. ఇది కేన్సిల్ ఐతే, మరెక్కడో పోస్టింగ్ ఇస్తే ఎలా." అన్నాడు గోపాలస్వామి.


"మా తర్జనభర్జన అదే బావగారూ. మీ ఆలోచన కోసమే మీకు ఫోన్ చేశాను." అన్నాడు మోహనరావు.

"బాగుంది. కానీ, మేమేం ఆలోచన చేయగలం. అబ్బాయ్ వస్తే, మాట్లాడి చెప్తాను." చెప్పాడు గోపాలస్వామి.

మోహనరావు ఏమీ అనలేదు.


"నా మూలంగానే ముందుగానే పెట్టించిన పిల్లల శోభనం రద్దయ్యింది. దాంతోనే ఈ సమస్య జటిలమైపోతుంది. సారీ బావగారు. బాధగా ఉంది." చెప్పాడు గోపాలస్వామి.

"అప్పటి మీ పరిస్థితి అలా ఉంది. ఇలా అవ్వొచ్చు అనుకున్నామా ఏం. అలా మీరు దిగులవ్వొద్దు." అన్నాడు మోహనరావు.


"ఆల్టర్నేట్ కై అబ్బాయితో ఆలోచించి మీకు ఫోన్ చేస్తాను." అన్నాడు గోపాలస్వామి.

"థాంక్స్ బావగారు." అన్నాడు మోహనరావు.

"భలేవారే. అబ్బాయి రాగానే మాట్లాడతాను." అన్నాడు గోపాలస్వామి.

వాళ్ల సంభాషణ కట్ చేయబడింది మోహనరావుతో.

సాహసి తిరిగి లేచింది.


"కూర్చో అమ్మా. మనమూ ఆలోచిద్దాం." అన్నాడు మోహనరావు.

తిరిగి కూర్చుంది సాహసి.

"ఆషాఢ మాసం పట్టింపులు ఎప్పటి నుండో వస్తున్నవి. వాటిని కాదనుకోలేం." అన్నాడు మోహనరావు.


"నాదో ఆలోచన." అప్పుడే అంది సాహసి.

"చెప్పమ్మా." అన్నాడు మోహనరావు.

"అదే. ఈ ఆషాఢంలో అత్త, కొత్త కోడలు ఒక ఇంటిలో ఉండకూడదు, ఒకే గుమ్మం లోంచి తిరగకూడదు అంటారుగా." అంది సాహసి.


"అంతేనమ్మా." అన్నాడు మోహనరావు.

వాళ్ల మాటలను ఆలకిస్తుంది శైలజ.

"ఐతే, మరి ఇబ్బందేముంది. నేను మా ఆయనతో కలిసి ఆ ప్లాట్ ఇంటిలో ఉంటాను. ఆంటీ తమ ఇంటిలో ఉంటుంది. ఈ ఆషాఢంలో మేము కలవం. సరిపోతుందిగా." అంది సాహసి.


మోహనరావు భార్య మొహం చూశాడు.

శైలజ, "సరిపోతుంది. కానీ.." అంటూ ఆగిపోయింది.

"మరేంటమ్మా. ఇక కానీ అంటావేమిటి." అడిగింది సాహసి.

భర్త మొహం చూసింది శైలజ.


"మీకు ఇంకా శోభనం జరగలేదు కదమ్మా." అన్నాడు మోహనరావు మెల్లిగా.

"ఐతే." అనేసింది సాహసి టక్కున.

"అప్పుడు అల్లుడు, నువ్వు కలిసి ఉండకూడదు కదమ్మా." చెప్పింది శైలజ.

"అంటే. మేము ఆచారాలను విస్మరించే మనుషుల్లా అనిపిస్తున్నామా." అడిగేసింది సాహసి.


"అలా కాదమ్మా." అంటుంది శైలజ.

అడ్డై, "అమ్మా, నాన్నా. సూటిగా చెప్పుతున్నాను. మేము ఇలానూ మాట్లాడుకున్నాం. చెప్తే ఏమనుకుంటారో అని ఆగాం. నిజానికి మేమిద్దరం కలిసి వేరేగా ఉండొచ్చు అని, అలాగే పెద్దలు ముహూర్తం పెట్టే వరకు నిగ్రహంగా మెసులుకోవాలని అనుకున్నాం." చెప్పుతుంది సాహసి.


ఆ తల్లిదండ్రులు మొహాలు చూసుకుంటున్నారు.

"కానీ, మీరు ఖరాఖండీగా మాట్లాడేరు. మీ పెద్దలు, మాకు శోభనం జరగలేదు కనుక, మేము విడి విడిగా ఉండాలే తప్పా, కలిసి ఉండరాదనేశారు. అందుకే మేము మా ఆలోచనని చెప్పలేదు. మీ మాట విని మేమే సర్దుకు పోవాలనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి జటిలం అవ్వడంతో నేను తప్పక బయట పడ్డాను. మేము చేసిన ఆలోచనని వెల్లడించేస్తున్నాను." చెప్పడం ఆపింది సాహసి.


"అబ్బాయి నువ్వు ముందుగానే ఇలా ఆలోచించారా." అడిగాడు మోహనరావు.

"ఆ. అదేగా చెప్పుతుంది." అనేసింది సాహసి.

"సరిసరే. ఆగుదాం. అబ్బాయితో కూడా అతడి తల్లిదండ్రులు మాట్లాడతారుగా. వాళ్లతో అబ్బాయి ఏం చెప్పుతాడో ఆలకిద్దాం. మనమే ముందు పడడం ఎందుకు." అంది శైలజ.


సాహసి లేచి తన రూంలోకి వెళ్లి పోయింది.

ఆ తల్లిదండ్రులు చాలా సేపు ఏమీ మాట్లాడుకోలేకపోయారు.

***

రాత్రి ఎనిమిది దాటుతుంది.

మోహనరావుకు గోపాలస్వామి ఫోన్ చేశాడు.

రింగవుతున్న ఫోన్ కై డైనింగ్ టేబుల్ ముందు నుండి కదిలి తన రూం లోకి వెళ్లాడు మోహనరావు.


అప్పటికి మోహనరావు, శైలజలతో పాటు సాహసి డిన్నర్ చేస్తుంది.

ఫోన్ లో మాట్లాడుతూ డైనింగ్ టేబుల్ ముందుకు తిరిగి వచ్చాడు మోహనరావు. కూర్చున్నాడు. ఫోన్ స్పీకర్ ఆన్ లో ఉంది.

"అబ్బాయ్ పరిష్కారమంటూ ఒక సంగతి చెప్పాడు బావగారూ." చెప్పుతున్నాడు గోపాలస్వామి.

***

(కొనసాగుతుంది..)

***


***

బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం




మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


35 views0 comments

Comments


bottom of page