కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
కథను యు ట్యూబ్ లో చూడటానికి క్రింది లింక్ క్లిక్ చేయండి
'Veeri Madhyana Episode 10' New Telugu Web Series
Written By BVD Prasada Rao
రచన: బివిడి ప్రసాదరావు
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
బివిడి ప్రసాదరావు గారి ధారావాహిక 'వీరి మధ్యన..' పదవ భాగం
గత ఎపిసోడ్ లో…
సాహసి, తన ట్రాన్స్ఫర్ గురించి మేనేజర్ చంద్రికతో మాట్లాడుతుంది.
ఆమె హెడ్డాఫీస్ వాళ్ళతో మాట్లాడి, సాహసిని సికింద్రాబాద్ బ్రాంచ్ లో వెంటనే చేరమంటుంది.
ఇక వీరి మధ్యన.. పదవ భాగం చదవండి...
అప్పుడే, "అదేంటో చెప్పండి బావగారు." అన్నాడు మోహనరావు, భార్య వంక, కూతురు వంక చూస్తూ.
"అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ తీసుకున్న ప్లాట్ లో ఉంటారట. మనం పెట్టే ముహూర్తం వరకు ఎట్టి ఇబ్బంది పరిచే పనులు చేపట్టరట. ఆషాఢం తర్వాత, మన పెద్దలు కలిసి వచ్చి, జరపవలసినవి జరపండి అంటున్నాడు." చెప్పడం ఆపాడు గోపాలస్వామి.
"అలానా." అనగలిగాడు మోహనరావు.
"పైగా మీ అమ్మాయి, మా అబ్బాయ్ ఎప్పుడో ఇలానే ఆలోచించుకున్నారట. మనం సహకరించమని చెప్పలేదట." అన్నాడు గోపాలస్వామి.
"అలానా." మళ్లీ అన్నాడు మోహనరావు.
"మనం సమ్మతించగలిగితే, ఈ సమస్య తీరుతుందని మా అబ్బాయ్ అంటున్నాడు. మీరు ఏమంటారు." అడిగాడు గోపాలస్వామి.
మోహనరావు భార్యను చూస్తున్నాడు.
తల్లిదండ్రులను సాహసి చూస్తుంది.
"అప్పటికీ చెప్పాను. నలుగురూ ఏమనుకుంటారో అని కూడా అన్నాను. అందుకు మా అబ్బాయ్, మన నలుగురం పెద్దలం, అంటే మేమిద్దరం, మీరిద్దరు ఏమనుకుంటామో చెప్పమని నన్ను సూటిగా ప్రశ్నించేశాడు. మా ఇద్దరం కాదనలేక పోతున్నాం. మరి మీరు ఏమంటారో చెప్పగలరు." చెప్పాడు గోపాలస్వామి.
ఆ మాటలు విన్న శైలజ, భర్తని చూస్తూ, 'సరే' అన్నట్టు తలూపింది.
"సరే బావగారు. మేమూ కాదనలేం." అనేశాడు మోహనరావు.
"పిల్లల మాట విందాం బావగారు. వాళ్లని నమ్ముదాం." అన్నాడు గోపాలస్వామి.
"తప్పక." అనేశాడు మోహనరావు కూతురునే చూస్తూ.
తర్వాత, ఆ ఫోన్ ల సంభాషణ కట్ ఐంది.
"హమ్మయ్య." అన్నాడు మోహనరావు.
శైలజ ఏమీ అనలేదు.
సాహసి డిన్నర్ ని కొనసాగిస్తుంది చక్కగా.
***
"కారులో నీ సూట్ కేస్ పెట్టించేశాను." చెప్పాడు మోహనరావు.
"వెళ్లి వస్తాను." చెప్పింది సాహసి.
"జాగ్రత్త తల్లీ." అంది శైలజ.
ఆ వెంబడే, "కవితా నువ్వు ఉంటుంది ఆ ఊర్లోనే కదా. అప్పుడప్పుడు వెళ్లి సాహసిని కలుస్తుండు." చెప్పింది.
కవిత 'సరే' అనేసింది చిన్నగా నవ్వేస్తూ.
"బాబూ రమేష్, ప్లీజ్. సహకరిస్తుండు." అన్నాడు మోహనరావు.
"అంకుల్. మీరు నిశ్చింతగా ఉండండి. మేము ఉన్నాంగా." చెప్పాడు రమేష్.
సాహసి తల్లిదండ్రుల కాళ్లకి నమస్కరించింది.
కారు ఎక్కింది.
కవిత కూడా కారు ఎక్కేక, రమేష్ కారును స్టార్ట్ చేశాడు.
'బైబై' ల తర్వాత, ఆ కారు ముందుకు సాఫీగా కదిలింది.
సాహసిని తోడ్చుకు రమ్మనమని రమేష్ దంపతులను కోరాడు సామ్రాట్.
అతని మాటను కాదనక, సామ్రాట్ కు అప్పగించుటకు సాహసిని తీసుకు వెళ్తున్నారు కవిత, రమేష్ లు.
ఆ ఇద్దరూ రాత్రి వరంగల్ వచ్చారు. కవిత ఇంట్లో ఉండి, ఉదయం సాహసి ఇంటికి వచ్చారు.
అంతకు ముందు మోహనరావు, గోపాలస్వామిలు మాట్లాడుకున్నారు. సాహసి ప్రయాణ విషయం తేల్చుకున్నారు.
అందరి సమ్మతితో సాహసి, సామ్రాట్ లు ఒకే ఇంటిలో ఉండుటకు సిద్ధమయ్యారు. ఈ ఆషాఢం అడ్డును అధిగమించబోతున్నారు.
నిన్న ఉదయమే చంద్రిక నుండి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ను పుచ్చుకుంది సాహసి.
ఊరు పొలిమేర దాటగానే ఒక చోట రమేష్ కారు ఆపాడు.
అప్పటికే అక్కడకు కారుతో వచ్చి వేచి ఉన్నాడు సామ్రాట్.
రమేష్ కారు దిగి సామ్రాట్ కారును చేరింది సాహసి.
"ముందు మీరు కదలండి. సాహసి సూట్ కేస్ ను నేను మీ కొత్తింటికి చేరుస్తాను." చెప్పాడు రమేష్ హుషార్ గా.
సాహసితో సామ్రాట్ బయలుదేరాడు.
కవితతో రమేష్ బయలుదేరాడు.
వాళ్ల రెండు కార్లు ఒక దాని వెంట ఒకటిగా ముందుగు సాగుతున్నాయి.
రమేష్ కారులో -
"వాళ్ల ఫెయిర్ బాగుంటుంది కదూ." అన్నాడు రమేష్ - సాహసి, సామ్రాట్ ల గురించి.
"వాళ్ల ఫెయిర్ 'కూడా' బాగుంటుంది అను." అంది కవిత విసురుగా.
"యయ. అంతెంతే." అన్నాడు రమేష్ తడబడుతూ.
"అంతెంతే కాదు. అంతే. ఏం. మన ఫెయిర్ బాగోలే." అంది కవిత.
"యయ. మనదీ సూపర్ ఫెయిరే. నో డౌట్." అనేశాడు రమేష్.
సామ్రాట్ కారులో -
"థాంక్స్." అన్నాడు సామ్రాట్.
"ఎందుకో." అంది సాహసి చిన్నగా నవ్వుతూ.
"ఇలా వస్తున్నందుకు." చెప్పాడు సామ్రాట్.
"పదహారు." అంది సాహసి.
"పదహారా. ఏంటి." అన్నాడు సామ్రాట్ కుతూహలంగా.
"మరే. ఇప్పటికి పదహారు మార్లు చెప్పావు 'అందుకై' థాంక్స్ లు." అంది సాహసి నవ్వుతూ.
"లెక్కెందుకు. ఎన్ని మార్లైనా చెప్పొచ్చు. ఆ." అన్నాడు సామ్రాట్.
నవ్వుతుంది సాహసి.
"అబ్బా. ఇక కూల్ అవ్వొచ్చు. ముప్ఫై రోజుల ఎడబాటు.. ఎలారా అనుకున్నాను. నౌ. నో ప్రొబ్లమ్స్. బిందాష్ గా మనం ఉండొచ్చు." చెప్పాడు సామ్రాట్ హుషార్ గా.
"అబ్బాయి గారు. తగ్గాలి. అదుపులో ఉండాలి." అనేసింది సాహసి.
"ఉంటా. నిన్ను చూస్తూ ఎన్నాళ్లైనా ఉండిపోతాను." చెప్పాడు సామ్రాట్.
"అబ్బచ్చా. అవునా." అంది సాహసి.
"అవునవును. నా కళ్లతో నిన్ను ఆరాధిస్తాను. నా చూపుతో నిన్ను అనుభవిస్తాను." చెప్పాడు సామ్రాట్.
సాహసి నిజంగా సిగ్గు పడింది.
రమేష్ కారులో -
"కొబ్బరి బొండా కొట్టించు." చెప్పింది కవిత.
"తప్పక. వాళ్లని ఫోన్ చేసి ఆపనా." అడిగాడు రమేష్ కారును స్లో చేస్తూ.
"వాళ్లని డిస్టర్బ్ చేయకు. మనం కొబ్బరి నీళ్లు తాగి ఫాలో అవుదాం." చెప్పింది కవిత.
"చిత్తం." అన్నాడు. ఆ వెంబడే, "అంతేకానీ, మన ప్రైవసీ మనది అని అనవేం." అన్నాడు రమేష్.
"చాల్లెండి. కాదా మరి." అంది కవిత మురిపెంగా.
కారును కొబ్బరి బొండాల అంగడి ముందు ఆపాడు రమేష్.
సామ్రాట్ కారులో -
"నిన్న నీతో ఫోన్ లో మాట్లాడేక, అమ్మ నాన్నలను ఫ్లాట్ కు తీసుకు వెళ్లాను. ఎకాఎకీగా కావలసినవి అమ్మను అడిగి వాటిని కొన్నాను. ఫ్లాట్ లో సర్ది పెట్టాను. అమ్మ చేత పాలు పొంగించేశాను." చెప్పాడు సామ్రాట్.
"గుడ్. మనం కలిసి అనుకొని, ఇంకా మనకు కావలసినవి కొనుక్కుందాంలే." చెప్పింది సాహసి.
"తప్పక. అన్నట్టు నువ్వు జాయినింగ్ ఎప్పుడవుతావు." అడిగాడు సామ్రాట్.
"రేపు కూడా మంచి రోజట. రేపటి నుండి బ్యాంక్ కు వెళ్తాను." చెప్పింది సాహసి.
"షూర్. అలానే. నేనూ వస్తానులే." అన్నాడు సామ్రాట్ చక్కగా.
"రేపు సాయంకాలం లోపు నా ఇంటి నుండి లగేజ్, నా స్కూటీ మనకు చేరగలవని నాన్న చెప్పారు." చెప్పింది సాహసి.
"రానీ. నేను రేపు సెలవుతో ఉంటాను. ట్రాన్స్ పోర్ట్ వ్యాన్ ఎప్పుడు వచ్చినా పర్వాలేదు." చెప్పాడు సామ్రాట్.
"నేను కూడా రిపోర్ట్ ఇచ్చేక, వీలైతే పర్మిషన్ తో కానీ, లేదా ఒక పూట లీవ్ తీసుకొని కానీ నీతో ఉంటాలే." చెప్పింది సాహసి.
ఆ నలుగురు ప్రయాణం సాఫీగా గంటల్ని దాటుకుంటూ సాగిపోతుంది.
రమేష్ కారులో -
"లంచ్ టైం దాటింది. ఆకలి అవుతుంది. లంచ్ చేద్దామా." అంది కవిత.
ఆ వెంబడే, "ఈ సారి మాత్రం వాళ్లని ఫోన్ చేసి ఆపుదాం." అంది.
"సరే. కానీ వాళ్లింకా చేయరంటావా." అన్నాడు రమేష్.
"లేదు. అలా కాదు. వాళ్లు మనల్ని వదిలి చేయక పోవచ్చు. పైగా వాళ్ల కారు దార్లో ఎక్కడా కనిపించలేదుగా." చెప్పింది కవిత.
"సర్లే. డ్రయివ్ లో ఉన్నాను. నువ్వు సాహసికి ఫోన్ చేయవా." చెప్పాడు రమేష్.
అదే సమయంలో, కవిత ఫోన్ మోగుతుంది.
"అరె. తనే చేస్తుంది." అంది ఫోన్ లోకి చూస్తూ కవిత.
"మాట్లాడు." అన్నాడు రమేష్.
కాల్ కలిపింది కవిత.
"కవితా. లంచ్ చేద్దాం. సామ్రాట్ కారు ఆపాడు. చూస్తూ రండి. మేము రైట్ సైడ్ ఒక హోటల్ ముందు ఉన్నాం." చెప్పింది సాహసి.
"అలాగే." అంది కవిత. రమేష్ కు విషయం చెప్పింది.
పది నిముషాల తర్వాత అక్కడికి రమేష్ కారు చేరి ఆగింది.
***
ఫ్లాట్ కు చేరేక, సాహసి తన తల్లిదండ్రులకు, సామ్రాట్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి, 'మా ప్రయాణం బాగా అయ్యింది. మేము ఇంటికి చక్కగా చేరిపోయాం.' అని చెప్పారు.
ఫ్లాటంతా తిరిగొచ్చేక, "డిన్నర్ కు మా ఇంటికి వచ్చేయండి. రేపటి నుండి నువ్వు వంట మొదలు పెట్టుకోవచ్చు." చెప్పింది కవిత, సాహసితో.
సాహసి తల తిప్పి, సామ్రాట్ మొహాం లోకి చూసింది.
"లేదు. ఈ రోజు వంట మొదలు పెట్టమని మా ఆంటీ చెప్పారు. సో, డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటాం." చెప్పాడు సామ్రాట్, రమేష్ తో.
"అవునా." అంది కవిత, సాహసిని చూస్తూ.
సాహసి తలూపింది.
"సరే. టేక్ కేర్." అంది కవిత చిన్నగా నవ్వేస్తూ.
"మేము బయలుదేరుతాం." చెప్పాడు రమేష్.
"ఉండండి. ఇక్కడే డిన్నర్ చేసి వెళ్దురు." అంది సాహసి.
"అబ్బే. వద్దొద్దు. మరో మారు వస్తాంగా." చెప్పింది కవిత.
కవిత, రమేష్ లు తమ ఇంటికి బయలుదేరారు. వాళ్లును సాగ నంపేక, మైన్ డోర్ మూసుకొని, సాహసి, సామ్రాట్ లు తమ బెడ్ రూంలో కొత్త బెడ్ మీద తమ నడుములు వాల్చారు.
"బాగా సర్ది పెట్టేరే." అంది సాహసి. అప్పటికే ఫ్లాటంతా తిప్పి, తనకి అన్నీ చూపాడు సామ్రాట్ - కవిత, రమేష్ లను వెంటేసుకొని.
"ఏదో నాకు తోచినట్టు సర్దా. ఇంకా కావలసినవి చూసుకో. తెచ్చి పెట్టుకుందాం." చెప్పాడు సామ్రాట్ - సాహసి వైపు తిరిగి.
సాహసి కూడా సామ్రాట్ వైపుకు తిరుగుతూ, తమ మధ్య దిండును పెట్టింది.
"ఏం. మన మధ్య ఈ అడ్డు ఎందుకు." అడిగాడు సామ్రాట్.
"పేరెంట్స్ ఆంక్ష విస్మరించ రాదు." అంది సాహసి నవ్వుతూ.
"నిజమే. అది యాదలో ఉండగా మన ఎదల మధ్య ఈ అడ్డులేలా." అన్నాడు సామ్రాట్ గమ్మత్తుగా.
"నువ్వు గడుసైనవాడివే. కానీ మది చమత్కారి కదా. అందుకే జస్ట్ జాగ్రత్త." అంది సాహసి మరింత నాటకీయంగా.
ఇద్దరూ నవ్వేసుకున్నారు.
"టీ కలపనా." అడుగుతుంది సాహసి.
"వద్దులే." అన్నాడు సామ్రాట్. ఆ వెంబడే, "నీకు వంట వచ్చు కదా." అడిగాడు సామ్రాట్.
"డౌటా. బాగా కాకపోయినా, వచ్చు." చెప్పింది సాహసి.
"నాకూ కాస్తా వచ్చు." చెప్పాడు సామ్రాట్.
"ఈజిట్. వావ్." అంది సాహసి.
"ఇన్స్టెంట్ కాఫీ తయారు చేయగలను." చెప్పుతున్నాడు సామ్రాట్.
"అబ్బో." అంది సాహసి అప్పుడే.
"కుక్కర్ పెడతాను. ఆలు కర్రీ చేస్తాను. నాన్ వెజెస్ లో ఆమ్లెట్ మాత్రమే." చెప్పాడు సామ్రాట్.
"గుడ్. అన్నట్టు పాత్రలు శుభ్ర పర్చడం చేస్తావా." అడిగింది సాహసి.
"ఆ. అమ్మకు నేను చాలా మార్లు చేసి పెట్టాను." చెప్పాడు సామ్రాట్ చాలా ఈజీగా.
"థట్స్ గుడ్." అంది సాహసి.
"మరి నీకు." అడిగాడు సామ్రాట్.
"నాకూ వచ్చు. నేనూ అమ్మకు సాయ పడేదాన్ని." చెప్పింది సాహసి.
"ఎందులో. పాత్రలు శుభ్ర పర్చడంలోనా." అంటూ నవ్వేడు సామ్రాట్.
"ఫో. వంటలో కూడా." చెప్పింది సాహసి.
"అన్నీ వండగలవా." అడిగాడు సామ్రాట్.
"సుమారుగా." చెప్పింది సాహసి.
ఇద్దరూ కొద్ది సేపు కామ్ అయ్యారు.
"లేద్దామా. బాత్ చేసి రిప్రెష్ అవుదామా." అంది సాహసి.
"తప్పక. లే. పద." అంటూ లేచాడు సామ్రాట్ ఒక్కమారుగా సాహసి చేయి పట్టుకొని.
"షడప్." అంది సాహసి చిన్నగా, సామ్రాట్ చేతి నుండి తన చేతిని సరళంగా లాక్కుంటూ.
"నువ్వే చెప్పావుగా. రిప్రెష్ అవుదామని." అన్నాడు సామ్రాట్ చిత్రంగా.
"తగ్గాలి. ఒబ్బిడిగా ఉండాలోయ్." చెప్పింది సాహసి.
"చిత్తం. మాప్ కరో." అన్నాడు సామ్రాట్ తన కుడి అర చేతి వేళ్లను పువ్వులా మార్చి, దానిని సాహసి చుబుకము దరిన పెట్టి.
"ఉ. చాల్లే. సరసాలకు టైం ఉంది." అంది సాహసి సొగసుగా.
ఇద్దరూ నవ్వుకున్నారు.
ముందుగా సామ్రాట్ బాత్రూంకు వెళ్లాడు సాహసి చెప్పగా.
***
మర్నాడు -
మైన్ డోర్ కు తాళం పెట్టి, ఫ్లాట్ నుండి బయటికి వచ్చారు సాహసి, సామ్రాట్ లు.
సాహసి కారు ఎక్కాక, సామ్రాట్ కారు స్టార్ట్ చేశాడు.
కారు సాఫీగా సాహసి జాయిన్ కావలసిన బ్యాంక్ వైపు సాగుతుంది.
"మరి నేను తిరిగి రావడం ఎలా." అడిగింది సాహసి.
***
(కొనసాగుతుంది..)
***
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
Comments