కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Veeri Madhyana Episode 6' New Telugu Web Series
Written By BVD Prasada Rao
రచన: బివిడి ప్రసాదరావు
బివిడి ప్రసాదరావు గారి ధారావాహిక 'వీరి మధ్యన..' ఆరవ భాగం
గత ఎపిసోడ్ లో…
వెయ్యి స్తంభాల గుడి దగ్గరకు రమ్మని సామ్రాట్ కి, సాహసికి విడివిడిగా కాల్ చేసి చెబుతుంది.
తనకు అపరిచిత యువతి నుండి కాల్ వచ్చిన విషయం సాహసితో చెబుతాడు సామ్రాట్.
ఇక వీరి మధ్యన.. ఆరవ భాగం చదవండి...
ఇంట్లోకి వెళ్లగానే, తన ఇంటి హాలులో, తన తల్లితో ఉన్న సాహసి కనబడగానే, జ్వాల మరింత బేజారైపోతుంది.
"వచ్చావా. ఆలస్యమైందేం. నీ కోసమే సాహసి వచ్చి చాలా సేపు ఐంది." చెప్పింది జ్వాల తల్లి.
జ్వాల ఏమీ మాట్లాడలేకపోతుంది.
"రిప్రెషై రా జ్వాలా. నీతో పర్సనల్ గా మాట్లాడాలి." చెప్పింది సాహసి.
"పర్వాలేదు. చెప్పు." అనేసింది జ్వాల.
"డాబా మీదికి పద." అంటూనే అటు కదిలింది సాహసి.
వెనుకే కదిలింది జ్వాల.
అప్పుడే, "మీరు పైన మాట్లాడుకుంటూ ఉండండి. నేను మీకు కాఫీలు కలిపి ఇస్తాను." చెప్పింది జ్వాల తల్లి.
జ్వాల ఇంటి డాబా మీద - ఎదురెదురుగా నిల్చుని ఉన్నారు సాహసి, జ్వాలలు.
జ్వాల 'ఏం మాట్లాడాలి' అనక ముందే, "ఈ ఆదివారం వెయ్యి స్తంభాల గుడికి వెళ్లేది ఫిక్సా." అడిగేసింది సాహసి.
జ్వాల తడబడింది.
"సామ్రాట్ వస్తాడుగా." అంది సాహసి సడన్ గా.
జ్వాల తల గిర్రు మంది. సాహసినే చూస్తూనే అయోమయంలో పడ్డది జ్వాల.
"ఏంటా చూపు. మాట్లాడు." గట్టిగానే అంది సాహసి.
జ్వాల మాట్లాడలేక పోతుంది.
"సామ్రాట్ నాతో మాట్లాడేడు. అన్నీ చెప్పాడు. ఏంటి కత." అంది సాహసి.
ఇంకా జ్వాల మాట్లాడలేక పోతుంది.
"పిచ్చా. ఏంటి నీ ఆలోచన. ఏం చేయాలనుకుంటున్నావు. మాట్లాడు." అంది సాహసి విసురుగా.
"అది అది. మరి మరి." నీళ్లు నములుతున్నట్టు మాట్లాడగలుగుతుంది జ్వాల.
"ఏంటి అది, మరి. సరిగ్గా చెప్పు. ఏంటి నీ ప్లాన్." అడిగింది సాహసి.
సాహసి వెంట వెంటనే వరస ప్రశ్నలు వేసేస్తుంటే తాళలేక పోతుంది జ్వాల. జ్వాలకి చెమటలు పడుతున్నాయి.
అంతలోనే జ్వాల తల్లి, రెండు కాఫీ కప్పులతో అక్కడికి వచ్చింది. ఆ ఇద్దరికీ వాటిని ఇచ్చింది.
"ఏంటమ్మా. ఏమైంది." అడిగింది సాహసిని జ్వాల తీరును చూస్తూ.
"అబ్బే. ఏమీ లేదు అంటీ. ఫ్రెండ్స్ ముచ్చట్లు. అంతే." చెప్పింది సాహసి చిన్నగా నవ్వేస్తూ.
"అవునా. సర్లేండి." అంటూ కిందికి వెళ్లిపోయింది జ్వాల తల్లి.
ఆ గేప్ లోనే జ్వాల ఒక ఎలిబీని క్రియేట్ చేసేసుకుంది.
"పెద్దల వరకు వెళ్లక ముందే అసలుది చెప్పేసి. నీకు మంచిది." అంది సాహసి.
"అబ్బే ఏమీ లేదు సాహసి. జస్ట్ నీ కోసమే." అంది జ్వాల.
"నా కోసమా." అంది సాహసి ఆశ్చర్యంగా.
"అవును. నువ్వు నా ఫ్రెండ్ వి కదా. నీకు మంచి జరగాలనే అలా ప్లాన్ చేశాను." చెప్పింది జ్వాల.
"నాకు మంచి జరగాలనా. ఏంటటా." అడిగింది సాహసి.
"అవును. మనకి బోయ్స్ అంటే గిట్టదుగా. దాంతో వాళ్ల స్వభావాలు మనకు తెలియవుగా. అందుకే, సామ్రాట్ ఎలాంటి వాడో అన్నది తేల్చడానికే రిస్క్ ఐనా, సాహసించాను. అంతా నీ కోసమే. నీకు మంచి భర్త రావాలనే." చెప్పింది జ్వాల.
"అబ్బో. అలా ఐతే, నాకు నీ ప్లాన్ అంతా ముందే చెప్పొచ్చుగా. ఇంతటి డ్రామా ఎందుకు. నువ్వు 'తప్పక రావాలి' అంటూ దాపరికంతో నన్ను అక్కడికి తోడ్చుకు పోవడం ఎందుకు. నీ ఉద్దేశ్యం అదే ఐతే, నేను నీకు సహకరించేదాన్నేమో. మరే. ఇందంతా నా బాగుకే అంటున్న నిన్ను నమ్మకపోతానా. ఆ." చకచకా అంది సాహసి.
గమ్మున ఏమీ చెప్పలేక పోయింది జ్వాల.
"ప్రతి మారు నెంబర్లు మార్చి సామ్రాట్ కు ఫోన్ చేయడంలో లాజిక్ ఏంటో." టక్కున అడిగింది సాహసి.
"నేను ట్రేస్ కాకూడదని." చెప్పింది జ్వాల మెల్లిగా.
"అవునా. నీలో క్రైమ్ మెంటాలిటీ కూడా ఉందా. సర్లే కాఫీ చల్లారిపోతుంది. తాగు." అంది సాహసి తన చేతి లోని ఖాళీ కాఫీ కప్పుని పిట్ట గోడ మీద పెట్టేస్తూ.
జ్వాల కాఫీని గడగడా తాగేసింది. అప్పటికే ఆ కాఫీ బాగా చల్లారిపోయింది.
"సరే కానీ. నువ్వు చెప్పిన చోటుకు సామ్రాట్ కానీ, నేను కానీ రాం. నువ్వేమీ నిరుత్సాహ పడిపోకు. మేము ఒకరికొకరం ఎలాంటి వాళ్లమో తెలుసుకున్నాం. ఇద్దరం హాఫీ. డోన్ట్ వర్రీ. సరేనా." చెప్పింది సాహసి.
అటు ఇటుగా తలాడించేసింది జ్వాల.
"బట్. ఇక పై మా మధ్యకు నీ వ్యవహారాలేమీ జొప్పించకు. ఇక్కడితో ఆగిపో, ఆపేసి. ఇది విన్నపం కాదు. హెచ్చిరిక అనుకో. నీకే మంచిది." అనేసి, అక్కడ నుండి తన ఖాళీ కాఫీ కప్పుతో కిందకి వచ్చేసి, దానిని షింక్ లో పెట్టేసి, జ్వాల తల్లితో చెప్పేసి, తన ఇంటికి వెళ్లి పోయింది సాహసి.
జ్వాల ఉసూరుమంది. చాలా సేపు డాబా మీదే ఉండి పోయింది.
***
రాత్రి తొమ్మిది దాటింది. సాహసి, సామ్రాట్ ప్రతి మారులానే ఫోన్ కాల్ లో ఉన్నారు.
"అవునా. జ్వాలతో ముఖాముఖీ అయ్యిపోయావా. ఆమె రియాక్షన్ ఏంటి." అడిగాడు సామ్రాట్ ఆత్రంగా.
"దాని ముఖం. రియాక్షనా, బోడా. అడగ్గానే డంగయ్యిపోయింది." చెప్పుతుంది సాహసి.
సామ్రాట్ ఫోన్ ని తన ఎడమ చెవి వైపు నుండి కుడి చెవి వైపుకు మార్చుకున్నాడు.
"నేను నిలదీసే సరికి, తను మరో కహానిని వినిపించింది. ఎస్కేప్ కి యత్నించింది. దానికి నేను, 'మేము మాట్లాడుకున్నాం. మేము నువ్వు చెప్పిన చోటుకు రాం.' అని చెప్పేశాను. అలాగే, 'మా మధ్యకు రాకు' అని కూడా సామాన్యంగానే ఐనా, సూటిగానే హెచ్చిరిక చేశాను. దాంతో జ్వాల తేలు కుట్టిన దొంగ మాదిరీ ఐంది." చెప్పడం ఆపింది సాహసి.
"హమ్మయ్య." అన్నాడు సామ్రాట్.
తర్వాత ఇద్దరూ తమ ముచ్చట్లును మరో వైపుకు మార్చుకొని కొనసాగించుకుంటున్నారు ఉల్లాసంగా.
***
"వస్తున్న శని, ఆదివారాల్లో నేను, నాన్న కేంప్ వెళ్తున్నాం. తొలుత మీ అత్తవారిని కలుస్తాం. నీ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ ఇస్తాం. ఆ తర్వాత వాళ్లు సూచించిన తమ వాళ్లకి కార్డులు అందిస్తాం. అలాగే ఆ తర్వాత అక్కడ నుండి విజయవాడ వెళ్తాం. అక్కడ బాబాయ్ వాళ్లకి కార్డు ఇస్తాం. అలాగే ఆ చుట్టు పక్కల ఉన్న మన వాళ్లకి కార్డులు ఇచ్చి వస్తాం." చెప్పింది మాలతి - సామ్రాట్ తో.
ఆ తల్లి కొడుకులతో పాటు గోపాలస్వామి కూడా బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాడు.
"ట్రైన్ లేదా బస్ టిక్కెట్లు టు అండ్ ప్రొ కు బుక్ చేస్తాను." చెప్పాడు సామ్రాట్.
"ఎందుకు. కారులో వెళ్తాం." చెప్పాడు గోపాలస్వామి.
"అన్నన్ని చోట్లకి మీరు డ్రైవ్ చేసుకొని ఏం వెళ్తారు. బడలికైపోతారు." అన్నాడు సామ్రాట్.
"లేదు. ఒక డ్రయివర్ ని మాట్లాడుకున్నాను. అతడు, నేను మార్చి మార్చి డ్రవ్ చేస్తూ, ఆరాంగా తిరిగి, పనులు కానిచ్చి, వచ్చేస్తాం." చెప్పాడు గోపాలస్వామి.
"గుడ్. గో హెడ్." అనేశాడు సామ్రాట్.
"నువ్వు ఆ రెండు రోజులు జాబ్ కి పోయే పని ఉండదుగా. ఇంటి పట్టునే ఉండి, ఆన్లైన్ ఆర్డర్స్ తో ఫుట్ తెప్పించుకోక, వండుకో." చెప్పింది మాలతి.
"అలానే అమ్మా." అన్నాడు సామ్రాట్ నవ్వుతూ.
"మేము ముందుగానే మీ అత్తవారికి ఇంటిమేషన్ ఇచ్చి వెళ్తాం." చెప్పింది మాలతి.
"మీ ఇష్టం." అనేశాడు సామ్రాట్. తర్వాత లేచి వాష్ బేసిన్ వైపు కదిలాడు.
అప్పుడే మాలతితో, 'ఈ రాత్రికే వాళ్లకి ఈ సమాచారం చేరిపోతుందిలే.' అన్న గోపాలస్వామి మాటలు, సామ్రాట్ చెవిని చేరాయి.
"ఎలా." అడుగుతుంది మాలతి.
"పిల్లలు రాత్రులు మాట్లాడుకుంటున్నారుగా. మన వాడు ఆ అమ్మాయికి చెప్పక ఆగుతాడా." అన్నాడు గోపాలస్వామి.
చిన్నగా నవ్వేసుకుంటూ తన రూం వైపుకు నడిచాడు సామ్రాట్ జాబ్ కు వెళ్లేందుకు తయారవ్వడం కోసం.
***
గురువారం - సాయంకాలం మూడవుతుంది.
"హాయ్ అన్నా." పలకరించాడు రమేష్,
కేంటిన్ కి వెళ్తున్న సామ్రాట్ వెను తిరిగి చూశాడు. రమేష్ ని చూసి ఆగాడు. తనూ రమేష్ ను పలకరించాడు. ఇద్దరూ కేంటిన్ చేరి, టీలకి ఆర్డర్ చేసి, పక్కకు జరిగి మాట్లాడుకుంటున్నారు.
"నా మేరేజ్ డేట్ ఫిక్స్ ఐంది." చెప్పాడు రమేష్,
"అవునా. ఎప్పటికి." అడిగాడు సామ్రాట్.
"వస్తున్న పదహారున. తిరుపతి గుడిలో." చెప్పాడు రమేష్.
"అలానా. గుడ్." అన్నాడు సామ్రాట్.
టీల సర్వ్ కి పిలుపు రావడంతో అటు కదిలారు ఇద్దరూ.
టీ కప్పులతో ఒక పక్కకు చేరి తిరిగి మాట్లాడుకుంటున్నారు.
"నీది వస్తున్న ఇరవై తొమ్మిదిన వరంగల్ లో కదూ." అన్నాడు రమేష్.
"ఆ. అదే. తెల్లారితే ముప్పైన." అన్నాడు సామ్రాట్.
"నీ పెళ్ళికి వరంగల్ రాగలను. పైగా నా కవిత నీ ఉడ్బి ఫ్రెండేగా. తన మూలంగానైనా నేను రావాలి. మరి మీరు మా పెళ్లికి తిరుపతి రావాలి." చెప్పాడు రమేష్ నవ్వేస్తూ.
"నేనైతే షూర్." చెప్పాడు సామ్రాట్.
"నిన్ను ఏమీ అనలేను, అడగలేను. చూద్దాం, నా కవిత మూలంగా నీ ఉడ్బి కూడా వస్తుందేమో." అన్నాడు రమేష్ నవ్వుతూనే.
సామ్రాట్ ఏమీ అనలేదు.
ఇద్దరూ టీలు తాగి, తిరిగి తమ తమ వర్క్స్ కై కదిలారు.
***
రాత్రి తొమ్మిదవుతుంది. సామ్రాట్ కి ఫోన్ చేసింది సాహసి.
కాల్ కలిపి, "బోలో హసి." అన్నాడు సామ్రాట్ హుషార్ గా.
"నీకో సర్ప్రయిజ్." టక్కున అంది సాహసి.
"వాట్వాట్వాట్." అన్నాడు సామ్రాట్ టకటకా.
"నీ కొలీగ్ రమేష్ తన పెళ్లి విషయమై ఏమైనా మాట్లాడేడా, చెప్పాడా." అడిగింది సాహసి.
"ఏమంటా." అంటూనే, "తన పెళ్లి డేట్, వెన్యూ చెప్పాడు. అలాగే తను మన పెళ్లికి వరంగల్ వస్తానంటూ, నన్ను తన పెళ్లికి తిరుపతి తప్పక రమ్మనిమని చెప్పాడు." చెప్పాడు సామ్రాట్.
"నాతోనూ సుమారుగా అలానే కవిత చెప్పింది. తను నన్ను కూడా తిరుపతి రమ్మనమని కోరింది." చెప్పింది సాహసి.
"అలానా. వస్తావా." అడిగాడు సామ్రాట్ కుతూహలంగా.
"ఇంట్లో అడిగా. పెళ్లి వారు బస్సులు రెండు వేస్తున్నారట. కవిత తో కూడా వెళ్లి రావచ్చు అన్నారు మా వాళ్లు." చెప్పింది సాహసి సరదాగా.
"అవునా. రా. ఐతే నేను ఇటు నుండి వస్తాను." చెప్పాడు సామ్రాట్ తృప్తిగా.
"నువ్వు వస్తానంటే, నేను బయలుదేరాలనుకున్నాను." చెప్పింది సాహసి ముచ్చటగా.
"రా. నేను వస్తాను." చెప్పాడు సామ్రాట్ గమ్మున.
"ఐతే, నేనూ వస్తాను." చెప్పేసింది సాహసి వెంటనే.
ఇద్దరూ తమలో తాము సరదా పడ్డారు.
"నా అత్తమామలు క్యాంపులో ఉన్నారుగా. వాళ్ల ట్రిప్ సాఫీగా సాగుతుందిగా." అడిగింది సాహసి.
"ఆ. సండే నైట్ బయలుదేరి, మండే ఎర్లీ మోర్నింగ్ కి హైదరాబాద్ వచ్చేస్తారు." చెప్పాడు సామ్రాట్.
పిమ్మట తమ సంభాషణని ముచ్చటగా కొనసాగించుకుంటున్నారు వాళ్లిద్దరు.
***
ఆదివారం -
డోర్ బెల్ మోగింది. టివి చూస్తున్న సామ్రాట్ లేచి వెళ్లాడు. మైన్ డోర్ తెరిచాడు. గుమ్మంలో అమ్మాయి.
"ఎవరు." అడిగాడు సామ్రాట్.
"నమస్కారం." అంది ఆమె.
"నమస్తే." చెప్పేశాడు సామ్రాట్.
మెత్తగా నవ్వుతూ, "నేను సేల్స్ గర్ల్ ని. మా ప్రొడక్ట్స్ ప్రమోట్ కై వచ్చాను." చెప్పింది ఆమె.
"ఇంట్లో లేడీస్ లేరు." చెప్పాడు సామ్రాట్.
"జెంట్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మీలాంటి హేండ్సమ్ కు నప్పేవి నా దగ్గర చాలా ఉన్నాయి." చెప్పింది ఆమె హస్కీగా.
"లేదు. ఇంట్రస్ట్ లేదు." చెప్పాడు సామ్రాట్.
"ప్లీజ్. నేను టార్గెట్ కి రీచ్ అవ్వాలి. సాయపడండి." చెప్పింది ఆమె ముచ్చటగా. సామ్రాట్ ఏమీ అనలేదు.
అంతలోనే, "నేను డిగ్రీ చదువుకున్నాను. సరైన అవకాశాలు లేక, ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. హెల్ప్ మి ప్లీజ్." అంది అమ్మాయి వయ్యారంగా.
సామ్రాట్ మెత్త పడ్డాడు. "సరే చెప్పండి. ఐ మీన్, చూపండి." అన్నాడు.
ఎడమ చేతి లోని బేగ్ ని కింద పెట్టి, కుడి భుజాన ఉన్న బేగ్ ని ఎడమ భుజానికి మార్చుకుంటూ, "నేను తెచ్చిన ప్రొడక్ట్స్ ని ఎగ్జిబిట్ చేయాలి. లోనికి రానిస్తారా." అడిగింది ఆమె చిత్రంగా.
"ఒహో. సరే, రండి." అన్నాడు సామ్రాట్ లోనికి కదులుతూ. ఆమె తన బేగ్ లతో సామ్రాట్ వెనుక నడిచింది.
హాలులో - సింగిల్ సోఫా కుర్చీలో కూర్చొని, వచ్చిన ఆమెకు లాంగ్ సోఫా చూపుతూ, "కూర్చొని చూపండి." చెప్పాడు సామ్రాట్.
ఆమె అలానే చేస్తుంది.
"మీ టార్గెట్ ఎంత." అడిగాడు సామ్రాట్.
చెప్పింది ఆమె. "అదీ ఒక రోజులోనే పూర్తి చేయాలి." చెప్పింది.
"ఇప్పటికి ఎంత సమకూర్చుకున్నారు." తిరిగి అడిగాడు సామ్రాట్.
"మరో పద్దెనిమిది వందల రూపాయలు కూడ తీస్తే ఈ రోజుకి సరిపోతుంది." చెప్పింది ఆమె.
సామ్రాట్ చేతి వాచీలోకి చూసుకున్నాడు. ట్వల్వ్ దాటుతుంది. "సాయంకాలంకి పూర్తి చేసుకోగలరా." అడిగాడు.
బేగ్ నుండి తను తెచ్చిన వాటిని తీస్తున్న ఆమె తలెత్తి సామ్రాట్ ని చూస్తుంది. "ప్రయత్నిస్తున్నాను. చిక్కాలిగా" అంది కొంటెగా సామ్రాట్ ని చూస్తూ.
"సరే. చూపినవి చాలు." అంటూ ఆమె చూపిన వాటిల్లోంచి మూడు ఐటమ్స్ ని ఎంపిక చేసుకొని, "వీటి మొత్తం ఖరీదు ఎంత." అడిగాడు సామ్రాట్.
లెక్క కట్టి, "నెట్, పదహారు వందల ఇరవై." అంది.
కొద్ది సేపు ఆగి, "నూటా ఎనభైకి సరిపడ్డది చూపండి." అన్నాడు సామ్రాట్.
"ఇది మీకు అవసరం అవుతుందా." అడిగింది ఆమె ఒక మౌస్ స్టాండ్ చూపుతూ.
"ఆ. ఆఫీస్ లో వాడుకోవచ్చు." చెప్పాడు సామ్రాట్.
"ఇది ఆఫర్ పోగా, టు హండ్రడ్ పడుతుంది." చెప్పింది ఆమె.
"సరే. ఇవ్వండి." అంటూ లేచి గదిలోకి వెళ్లి, రెండు వేలుతో వచ్చాడు. ఆ నోట్లను ఆమెకి ఇచ్చాడు.
ఆమె ఆ నోటును అందుకుంటూనే సామ్రాట్ కుడి చేతిని మెల్లిగా పట్టుకుంది. సామ్రాట్ విసురుగా తన చేతిని లాక్కున్నాడు.
***
(కొనసాగుతుంది..)
***
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
Comments