విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ
'Virisina Mogga' New Telugu Story
Written By Ch. Pratap
'విరిసిన మొగ్గ' తెలుగు కథ
రచన : Ch. ప్రతాప్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
మధ్యాహ్నం నాలుగు గంటలవుతోంది. వర్కింగ్ లంచ్ పూర్తి చేసి ఐ టి టవర్స్ లో తొమ్మిదో అంతస్తు లోని క్యాబిన్ లో క్లయింట్ మీటింగుకు మాధవ్ లాగిన్ అవబోతుండగా మొబైల్ రింగయ్యింది. చూస్తే గ్లోబల్ కార్పొరేట్ స్కూలు నుండి కాల్. ఈ టైములో స్కూలు నుండి ఫోన్ ఏమిటా అనుకుంటూ చికాకుగా ఫోన్ ఎత్తి హల్లో అన్నాడు.
"మాధవ్ గారు.. మీ అబ్బాయి చేతి నరం కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడే ఆస్పత్రికి తరలించాము. మీరు అర్జంటుగా యశోదా హాస్పిటల్ కు రండి” అవతలి వైపు కరస్పాండెంట్ మాటలు విన్న వెంటనే మాధవ్ తలపై పిడుగు పడ్డట్టు అనిపించింది.
తల కింద భూమి కంపిస్తున్నట్లనిపించి శరీరం వణకగా కుర్చీ ఆసరాగా చేసుకొని నిల్చున్నాడు. రెండు నిమిషాల తర్వాత బాహ్య ప్రపంచంలోకి వచ్చి, రెండు గ్లాసుల మంచి నీళ్ళు త్రాగగా కొంచెం కుదుట పడ్డాడు.
వెంటనే శ్రీమతికి ఫోన్ చేసాడు మాధవ్. ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. క్లయింట్ తో మీటింగులో వున్నప్పుడు ఫోన్‌లను ఎయిరోప్లేన్ మోడ్ లో పెట్టాలన్నది సాఫ్ట్ వేర్ రంగంలో ఒక రివాజు.
వెంటనే వాట్సప్ లో మెసేజ్ పెట్టి ఆఘమేఘాల మీద ఆసుపత్రికి బయలుదేరాడు. ఆఫీసుకు ఆసుపత్రికి దాదాపుగా నలభై కిలోమీటర్లు ఉంటుంది. ట్రాఫిక్ రద్దీని దాటుకుంటూ అక్కడికి చేసేసరికి రెండు గంటలు పట్టింది.
రిసెప్షన్ లో కనుక్కుంటే బాబు ఐ సి యు లో వున్నాడని తెలిసింది. అయిదో అంతస్తులో వున్న ఐ సి యు కు చేరుకున్నాడు. బయట గ్లోబల్ స్కూల్ స్టాఫ్ ఒకతను వున్నాడు. బయట నుండే అద్దాల తలుపు నుండి ఒక మూల పడుకొని వున్న బాబును చూపించాడు. ఇద్దరు డాక్టర్లు, ఒక నర్స్ హడావిడిగా మాట్లాడుకుంటూ బాబుకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు. అక్కడ ఏమవుతోందో మాధవ్ కు అర్ధం కావడం లేదు. లోపలికి ఎవ్వరినీ అనుమతించడం లేదు.
తలపట్టుకొని బెంచిపైన కూర్చున్న మాధవ్ కు, స్టాఫ్ కుర్రాడు జరిగినదంతా క్లుప్తంగా చెప్పాడు.
గత కొన్ని రోజులుగా ఆశీష్ చాలా డల్ గా ఉంటూ క్లాసులో పరధ్యానంగా వుంటున్నాడు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఇంకా ఒక నెలలో ప్రారంభం అవుతుండడం వలన రోజుకు పదిహేను గంటల పాటు క్లాస్ రూములు, రివిజన్ క్లాసులు, సాయంత్రాలు స్టడీ అవర్స్ జరుగుతున్నాయి. ఆదివారాలు కూడా హాస్టల్ పిల్లలను ఇంటికి పంపడం, పేరెంట్స్ ను పిల్లలను కలవడం చెయ్యడం లేదు.
ఆశీష్ చాలా తెలివైన వాడు కావడం వలన సిటీ రాంక్ తో పాటు స్టేట్ రాంక్ కోసం కూడా కాలేజీ యాజమాన్యం ఆశీష్ పై పూర్తిగా ఫోకస్ పెట్టింది. బహుశా చదువు ఒత్తిడి వలన ఆశీష్ ముభావంగా వుంటున్నాడని వార్డెన్, కోర్స్ కరస్పాండెంట్ అనుకున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం నుండి సరిగ్గా భోజనం కూడా చెయ్యకపోతే ఒంట్లో బాగోలేదని అనుకొని ఈ రోజు పొద్దున అతనిని హాస్టల్ రూము లోనే వుండి చదువుకోమని చెప్పారు.
మధ్యాహ్నం లంచ్ కూడా ఆశిష్ వెళ్ళకపోతే అతనితో మాట్లాడి రమ్మని ఒక విద్యార్ధిని హాస్టల్ కు పంపించారు. హాస్టల్ గది తలుపు లోపల నుండి వేసి వుంది. మంచంపై మణికట్టు వద్ద గాయంతో ఆశీష్ అచేతనంగా పడి వున్నాడు. పక్కనే రక్తం మడుగు కట్టి వుంది. కిటికీ లోనుండి ఇదంతా చూసిన ఆ విద్యార్ధి హాహాకారాలు చేస్తూ వార్డెన్ కు కబురు అందించారు. వెంటనే యాజమాన్యం 108 కు ఫోన్ చేసింది. ట్రాఫిక్ కారణంగా అంబులెన్స్ ఒక గంట తర్వాత వస్తే అప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఇంతలో ఐ సి యు అటెండెంట్ వచ్చి ఒక కాగితాల గుత్తిపై సంతకాలు తీసుకున్నాడు. పరిస్థితి చాలా విషమంగా వుందని, వచ్చే డబ్భై రెండు గంటల వరకు పరిస్థితి ఎలా వుంటుందో చెప్పలేమని, అంతవరకు భగవంతుడిని ప్రార్ధిస్తూ వుండమని ఒక రొటీన్ సినిమా డైలాగ్ కొట్టి వెళ్ళిపోయాడు. ఆ మాటలతో నవనాడులు కృంగిపోయి నట్లనిపించి బెంచీపై కూలబడి ముఖం చేతుల్లో దాచుకొని మాధవ్ రోదించసాగాడు.
మాధవ్ కు, గౌతమికి పెళ్ళయిన ఆరేళ్ళకు పుట్టిన అపురూప రత్నం ఆశీష్. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే. కలిపి నెలకు నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు. కొడుక్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఎనిమిదో తరగతి నుండే ఆ మహానగరంలో నెంబర్ వన్ స్కూలులో చేర్పించారు. అక్కడ అంతా రెసిడెన్షియల్ విద్యా విధానం. ఎనిమిదో తరగతిలో లోపలికి వెళ్తే ఐఐటి సీటుతో బయటకు వస్తారన్న పేరు వుంది. స్వతాహాగా ఆశీష్ కు క్రికెట్, గిటార్ వాయించడం, పాటలు పాడడం అంతే ఎంతో ఇష్టం. సంగీత ప్రపంచంలో వృత్తిని మలచుకోవాలని ఎంతో ఆశపడ్డాడు. కాని రెసిడెన్షియల్ స్కూలు లో చేర్చాక అతని ఆశలపై నీళ్ళు చిలకరించినట్లయ్యింది.
అక్కడ ఇరవై నాలుగు గంటలు చదువు తప్ప ఇంకొక వ్యాపకం వుండదు. కాస్త తెలివితేటలు వున్న వారిపై స్కూలు యాజమాన్యం పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తుంది. మామూలుగా పన్నెండు గంటలు, పరీక్షా సమయంలో పదహారు గంటల పాటు చదువే చదువు. అక్కడ చదువే సర్వస్వం. చదువు తప్ప ఇంకొక మాట మాట్లాడడం మహాపాపం. సాయంత్రం ఏడయ్యాక గౌతమి ఏడుస్తూ ఆసుపత్రికి వచ్చింది.
కొడుకును దూరం నుండే చూసి దు:ఖం అలలుగా ఎగిసి పడుతుండగా ఆపకుండా ఏడుస్తునే వుంది. పరిస్థితి శృతి మించుతోందని గ్రహించిన మాధవ్ తల్లిదండ్రులకు, అత్తమామలకు కబురు అందించి వెంటనే బయలుదేరి రమ్మన్నాడు.
ఒకపక్క ఆశీష్ ఐ సి యు లో మృత్యువుతో పోరాడుతుండగా మరొక పక్క స్కూలు యాజమాన్యం అశిష్ ను స్కూలు నుండి తొలగిస్తున్నట్లు నోటీసులు పంపించింది. ఆశీష్ కు మానసిక సమతుల్యం తక్కువ అని, విపరీతమైన స్వభావం కలవాడని తమ డాక్టరు నిర్ధారించినట్లు ఒక సర్టిఫికేట్ కూడా జత చేసి, అటువంటి విద్యార్ధి వలన సాటి విద్యార్ధులపై దుష్ప్రభావం పడుతుంది కాబట్టి స్కూలు నుండి తొలగిస్తునట్లు నోటీసు సారాంశం.
అశీష్ తరచుగా అశ్లీల దృశ్యాలు మొబైల్ లో చూసేవాడని, అదే స్కూలు లో చదువుతున్న ఒక అమ్మాయి ని ప్రేమించి, ఆమె బ్రేకప్ చెప్పిందన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడతానని తమతో చెప్పేవాడన్న వాంగ్మూలాన్ని ఇద్దరు ముగ్గురు విద్యార్ధులతో రాయించి నోటీసుతో జత చేసారు. లక్షలు చదివించుకొని కేసు తమ పైకి రాకుండా ఆ సంస్థ జాగ్రత్తపడింది.
ఈ కార్పొరేట్ వ్యవస్థ తీరే అంత. ప్రతీ దానికి ఒక రేటు. అవసరార్ధం మనుష్యులను కూడా వస్తువులుగా చూస్తాయి. అవసరం తీరాక కూరలో కరివేపాకులా తీసిపడేస్తారు. నిన్నటి వరకు తన కొడుకు ఒక సూపర్ స్టార్. కాలేజీ, సిటీ మరియు స్టేట్ ర్యాంకర్. వాడి తప్పిదం వలన తమ కాలేజీకి చెడ్డ పేరు వస్తుందని గ్రహించిన వెంటనే వాడిని కలుపు మొక్కను తీసి వేసినట్లు తిసేసారు. ఇప్పుడు ఏకంగా వాడి ప్రవర్తన, వ్యక్తిత్వం పైనే బురద జల్లారు.
ఇటువంటి భ్రష్టు పట్టిన వ్యవస్థలో తాను ప్రవేశించడమే తాను చేసిన పెద్ద తప్పిదం అని మాధవ్ అప్పుడు గ్రహించాడు.
మొదటి నుండి తనకు కార్పొరేట్ వ్యవస్థ అంటే ఎంతో ఇష్టం. లేక లేక కలిగిన అశీష్ ను ఆ పద్ధతిలోనే పెంచాడు. ప్రతీది బెస్ట్ మాత్రమే ఇవ్వాలి. వాడు పుట్టిన వెంటనే వాడు జీవితంలో ఏం చెయ్యాలో, ఏం సాధించాలో ఆ లక్ష్యాలను తానే నిర్దేశించేసాడు. భార్య లేక కొడుకు అభిప్రాయం తనకు అనవసరం. వాడు కధల పుస్తకాలు చదువుకోవడం, కార్టూన్ నెట్ వర్క్ చూడదం, క్రికెట్ ఆడుకోవడం, గిటార్ ప్రాక్టీస్ చెయ్యడం, సంగీతం సాధన చెయ్యడం అంతా సమయ వృధా, జీవితంలో ఎందుకూ పనికిరాని పనులు. చిన్నప్పుడు తండ్రి అన్నట్లు అవి కూటికొస్తాయా ? గుడ్డ కొస్తాయా అన్నది తన అభిప్రాయం కూడా.
అయితే మధ్యతరగతి నుండి వచ్చిన గౌతమిది అంతా మాధవ్ మనస్తత్వానికి పూర్తిగా విరుద్ధం. కుర్రాడిని స్వేచ్ఛగా ఒదిలెయ్యాలని, వాడి ఆలోచనలకు అనుగుణంగా కెరీర్ ను ఎంచుకునే స్వేచ్ఛ నివ్వాలన్నది ఆమె అభిప్రాయం. తాను కూడా ఒక కార్పొరేట్ సంస్థలో పని చేస్తూ లక్షలు సంపాదిస్తున్నా, ఆ కల్చర్ ను తన కొడుకుపై రుద్దడం ఆమెకు ససేమిరా ఇష్టం లేదు. ఈ విషయంలో ఆమెకు, మాధవ్ కు తీవ్రమైన అభిప్రాయ బేధాలు వచ్చాయి.
కలతలు చిలికి, చిలికి గాలివానగా మారాయి. చివరకు ఒకరి నొకరు చూసుకోవడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మానేసారు. అయినా మాధవ్ తన మంకుపట్టు వదల్లేదు. చివరకు అతనిదే పైచేయి అయ్యింది.
వాడి ఐ ఐ టి సీటు సాధించాలని, అమెరికాలో ఎం ఎస్ చెయ్యాలని, లక్షల్లో ప్యాకేజి సాధించాలని, ఎన్ ఆర్ ఐ సంబంధం చేసుకోవాలని, అమెరికాలో అత్యంత సంపన్నుడుగా ఎదగాలని, ఎలా ఎన్నెన్నో కలలు, ఆశయాలు, లక్ష్యాలు వాడిపై రుద్దాడు. ఎనిమిదవ తరగతి నుండే వాడిని ఆ మహానగరంలో అత్యంత ఖరీదైన కాలేజీల్లో చేర్పించాడు. అక్కడంతా ఒత్తిడే. క్షణాలను కూడా రూపాయిల్లో కొలుస్తారు. దానికి తట్టుకోలేక, తన బాధలు వినేవారు లేక, తీవ్రమైన ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు ప్రయత్నించాడన్నది ఇప్పుడు మాధవ్ కార్పొరేట్ బుర్రకు అర్ధమయ్యింది.
పది రోజులపాటు ఆశిష్ మృత్యువుతో పోరాడుతునే వున్నాడు. డాక్టర్లు సైతం ఈ కేసును ఒక చాలెంజ్ గా తీసుకొని తమ శాయశక్తులా కృ షి చేస్తున్నారు. ఆ పది రోజులు దంపతులిద్దరికీ పది యుగాలుగా గడిచాయి. గౌతమి అయితే తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు, తిరుపతి, శిరిడీ, కాశీ, అయోధ్య, భద్రాచలం, యాదాద్రి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, అన్నవరం ఇలా తనకు తెలిసిన పుణ్య క్షేత్రాలన్నింటినీ ముడుపులు కట్టింది.
ముఖ్యంగా ఆశీష్ పరిస్థితి దంపతులిద్దరి ఆలోచనా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. ఏనాడు పేపరు ముఖం చూడని మాధవ్ వార్తాపత్రికలలో విద్యార్ధులపై కొన్ని విద్యాసంస్థలు తీసుకువస్తున్న ఒత్తిడి, అవి జైళ్ళను మరపించేలా వుండడం, సున్నిత మనస్కులు వాటికి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడం వంటి వార్తా కధనాలను చదివాక తన ఆలోచనా ధోరణిలో పూర్తిగా మార్పు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా హైదరాబాద్ లో ముక్కు పచ్చలారని పదహారేళ్ళ సాత్విక్ ఆత్మహత్య గురించి చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. అభం శుభం తెలీని ఆశీష్ రూపమే కదలాడుతుంటే దుఃఖం ఆపుకోలేకపోతున్నాడు.
ఒక ప్రముఖ విద్యావేత్త విద్యార్ధులలో పెరుగుతున్న చదువుల ఒత్తిడి వారిని ఏ విధంగా ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందో ఒక వ్యాసంలో అద్భుతంగా విశ్లేషించారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్కులు, ర్యాంకులే పరమావధిగా సాగుతున్న చదువుల ఒత్తిడిలో ఇంటర్ విద్యార్థులు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇంటర్మీడియేట్ విద్యార్థుల ఆత్మహత్యలు ఏటా నమోదవుతున్నా…వాటిని నివారించడంలో కళాశాలల యాజమాన్యాలు, ఇంటర్ బోర్డు, విద్యాశాఖ విఫలమవుతూనే ఉన్నాయి. సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసి తర్వాత ఆ విషయాన్ని వదిలేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగి కొన్ని రోజులు గడిచిన తర్వాత కళాశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులకు నష్టపరిహారం ఇచ్చి కేసులు లేకుండా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
కొన్ని సందర్భాలలో కళాశాల సిబ్బందిపై కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. చదువుల ఒత్తిడి భరించలేక ఏళ్ల తరబడి ఇంత మంది తనువు చాలిస్తున్నా, వాళ్లు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కూడా ఆరా తీయడం లేదు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలను గుర్తించి, విశ్లేషించి, ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోకుండా సంఘటన జరిగినప్పుడు కంటి తుడుపు చర్యలు తీసుకుని వదిలేస్తున్నారు.
పదవ తరగతి పూర్తయిన విద్యార్థులను తల్లిదండ్రులు ఇంటర్ విద్య కోసం కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించి రూ. లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నారు. ఇంత మొత్తంలో ఫీజులు చెల్లించాం కాబట్టి కచ్చితంగా ర్యాంకు రావాల్సిందే అని తల్లిదండ్రులు ఆలోచించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరిగి ర్యాంకు రాదనుకున్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లల సామర్థం, వారి ఇష్టాఇష్టాలను పరిగణలోకి తీసుకోకుండా బలవంతంగా ఐఐటి, జెఇఇ, నీట్ వంటి కోచింగ్‌లలో చేర్పిస్తున్నారు. కళాశాలలు ఎలాగైనా ర్యాంకు తెప్పించాలని విద్యార్థుల మానసిక స్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా రోజుకు 12 నుంచి 14 గంటలపాటు చదివించడంతో తీవ్ర ఒత్తిడికి గురై విద్యార్థులు తమ విలువైన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంటున్నారు.
ఈ వ్యవస్థ తక్షణం మారాలంటే ముందుగా తల్లిదండ్రులలో మార్పు రావాలి. తమకు ఇష్టమైన, తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకొనే స్వేచ్చ విద్యార్ధులకు ఇవ్వాలి. తమకు సహజంగా వున్న ప్రతిభ, శక్తి సామర్ధ్యాలకు అనుగుణంగా తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుంటే అందులో సులభంగా రాణించగలుగుతారు.
ఆ దంపతుల ప్రార్ధనలు ఫలించి ఆశీష్ విజయవంతంగా ఆ ప్రమాదం నుండి బయటపడ్డాడు. ఆస్పత్రి నుండి డిస్చార్జి అయ్యి వచ్చాక గౌతమి తన ఉద్యోగానికి దీర్ఘకాలిక శెలవు పెట్టెసింది. గత మూడేళ్ల నుండి కొడుకుతో మిస్ అయిన క్షణాలను, మధురానుభూతులను తలుచుకుంటూ కొడుకును కంటికి రెప్పలా చూసుకోసాగింది.
ఆ నగరంలో ఒక కాలేజీలో ఆశిష్ ను చేర్పించారు. తొమ్మిది నుండి అయిదు వరకే కాలేజి. ఆదివారాలు, పండుగ రోజులు శెలవులు. సాయంత్రాలు హాయిగా క్రికెట్ అడుకోవడంతో పాటు తన కెంతో ఇష్టమైన గిటార్ వాయించడం, సంగీత సాధన చేసుకోసాగాడు. అతనిలో క్రమక్రమంగా పూర్వపు సృజనాత్మకత, తెలివితేటలు బయటకు రాసాగాయి.
ఉపసంహారం:
అనారోగ్యం కారణంగా ఒక సంవత్సరం వెనుకబడినా ఆశిష్ తల్లిదండ్రుల కల సాకారం చేయగలిగాడు. జె ఈ ఈ లో యాభై లోపు ర్యాంక్ సాధించి ఐ ఐ టి ముంబయి లో కంప్యూటర్ ఇంజనీరింగ్ లో సీటు సంపాదించాడు.
*************************************
|
Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.
Hindu Dharma Margam • 10 hours ago
ఇలాంటి కథలు ప్రస్థుత సమాజానికి అవసరం.కథ..కథనం..శైలి...సామాజిక సమస్యను తెలియ చేస్తూ వ్రాసిన ఈ కథ అలాంటి తల్లిదండ్రుల కు కనువిప్పు. రచయితకు అభినందనలు.