విశాఖ సాగర తీరంలో..
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- 3 hours ago
- 5 min read
#VisakhaSagaraTheeramlo, #విశాఖసాగరతీరంలో, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Visakha Sagara Theeramlo - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 22/04/2025
విశాఖ సాగర తీరంలో - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
బంగాళాఖాతం ఒడ్డున ఉన్న విశాఖపట్నం టౌను తుఫాను సమయాల్లో అల్లకల్లోలంగా ఉంటే మిగతా సమయాల్లో ప్రశాంతంగా ఉదయించే సూర్యుడి బంగారు కిరణాలతో రామకృష్ణ బీచ్ లో మోర్నింగ్ వాక్ చేసేవారికి చల్లని గాలితో కనువిందు చేస్తుంది. సాయంకాలం చేపలతో తీరానికి వచ్చే బోట్లు, పోర్టు వారి షిప్పులతో నీలి నీటి కెరటాల మీద ఆహ్లాదకరంగా కనబడతాయి.
విశాఖపట్నం టౌన్ ఉత్తరాంధ్రకు ముఖ ద్వారం. ఒక పక్క కైలాసగిరి, ఋషికొండ అందాలు అలరిస్తూంటే మరో వైపు నీలాకాశాన్ని ముద్దులాడుతున్న విశాలమైన బంగాళాఖాత సముద్రం. ఇంకొక వైపు డాల్ఫిన్ నోస్ కొండ రక్షణలో హిందుస్థాన్ షిప్ యార్డు, భారత నావికా దళం, స్టీల్ ప్లాంట్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ హెవీప్లేట్స్ వెస్సెల్స్ వంటి ప్రభుత్వ సంస్థలు, ఎప్పుడూ సందర్సకులతో సందడిగా కనబడే రామకృష్ణ బీచ్, ఉత్తరాదిని దక్షిణాదిని అనుసంధానం చేసే రైల్వే కూడలి, ఆంధ్రా యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ వంటి విద్యా సంస్థలు, బ్రిటిష్ వారి పాలనకు గుర్తుగా రాతి కట్టడాలు, కింగ్ జార్జి హాస్పిటల్, సెవెన్ హిల్స్ వంటి ప్రభుత్వ ప్రైవేటు వైద్యశాలలు, దైవ ఆధ్యాత్మిక మందిరాలు, అనేక వినోద దర్సనీయ స్థలాలతో ఉత్తర దక్షిణ భారత సమ్మేళనమే వైజాగ్ అనబడే విశాఖపట్నం.
అటువంటి విశాఖపట్నంలో ప్రోవిడెంట్ ఫండ్ ఆఫీసు సూపర్వైజరుగా పనిచేస్తున్నారు జగన్నాథరావు గారు. వారి భార్య మాణిక్యాంబ కలెక్టరాఫీసులో సెక్షన్ ఆఫీసర్ గా ఉధ్యోగం చేస్తున్నారు. నివాసం డాబాగార్డెన్స్. భార్యాభర్తలిద్దరూ వారి ఉధ్యోగాలతో బిజీయే కాకుండా సాంప్రదాయ బద్ద జీవితం వారిది.
ఆ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్దది కూతురు పేరు శివాని. పేరు ఆధ్యాత్మికమే కాని ఆకాశంలో ఊహల పల్లకిలో విహరిస్తుంటుంది. ఎప్పుడూ మొబైల్ ఫోన్ చాటింగులు, టీ వీ చానెళ్ల ప్రోగ్రాములతో కాలక్షేపం చేస్తుంటుంది. ఆధునిక భావాలు విలాస జీవితం వైపు మొగ్గు. ఏంకర్, న్యూస్ రీడరయి, స్టేజి మీద తన పెరఫార్మెంట్స్ కనపరిచి ఫ్రెండ్స్ ముందు టాలెంట్ చూపాలనుకుంటుంది. ఇంట్లో సంప్రదాయ పద్దతులు నచ్చవు. ఇంకా అమ్మమ్మల కాలంలోనే ఉంటారంటుంది అమ్మానాన్నల్ని. ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ ఫైనలియర్ వెలగబెడుతోంది.
కొడుకు శ్రీనివాస్ ఇంటర్ చదువుతున్నాడు. వాడికి క్రికెట్ పిచ్చి ఎక్కువ. చదువు కన్న ఎక్కడ క్రికెట్ మేచ్ లు జరిగేది, ఐపీఎల్, ఇంటర్నేషనల్ టోర్నీల మీదే ధ్యాస.
నేషనల్, ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ల బయోడేట, వారిస్కోరు ఎప్పుడు అడిగినా చెప్పగలడు. నాటి గవాస్కర్, రవిశాస్త్రి, కపిల్ దేవ్, పటౌడీ, అజారుద్దీన్ నుంచి నేటి సచిన్, ధోని, రాహుల్ ద్రవిడ్, కొహ్లీ, పాండ్య, రాహుల్ శర్మ వంటి నేషనల్ ఇంటర్నేషనల్ ఆటగాళ్ల పెరఫార్మెంట్స్, రికార్డులు వారి ఫోటో ఆల్బమ్సు సేకరించి దాచిపెట్టాడు.
తను క్రికెట్ కోచింగుకి వెళతానంటే తండ్రి చివాట్లు పెట్టి ముందు చదువు మీద ధ్యాస పెట్టమని క్లాసు తీసుకుంటారు. అమ్మ, నాన్న డ్యూటీల కెళ్ళగానే క్రికెట్ ప్రపంచంలో మునిగిపోతాడు శ్రీనివాస్.
ఇంక అసలు విషయానికొస్తే శివానీకి ఫేస్బుక్ లో ప్రశాంత్ పరిచయమయాడు. ప్రశాంత్ హైదరాబాదులో ఒక టి. వి. ఛానెల్లో కెమేరామేన్ గా పనిచేస్తున్నాడు. ప్రశాంత్ ది కర్నాటక రాష్ట్రం. కన్నడంతో పాటు తెలుగు మాట్లాడగలడు. హీరోలా హేండ్సమ్ గా ఉంటాడు. ఇంకా పెళ్లి కాలేదు.
ప్రశాంత్ ఒకసారి అరకులో షూటింగ్ నిమిత్తం రావడం జరిగింది. అప్పుడు వైజాగ్ వచ్చి శివానీని కలిసాడు. ఆర్కే బీచ్ లో కబుర్లు, హోటల్ భోజనం, అలా వారి పరిచయం మొగ్గలు తొడిగింది. ఇంట్లో వాళ్లకి తెలియకుండా ప్రేమాయణం సాగిస్తున్నారు. ఇంజనీరింగ్ ఫైనలియర్ ఎగ్జామ్స్ అవగానే హైదరాబాదు చెక్కెయ్యాలని ప్లాన్లో ఉంది శివానీ.
కూతురు శివానీ పద్దతులు నచ్చని జగన్నాథరావు దంపతులు, ఇంజనీరింగ్ ఫైనలియర్ ఎగ్జామ్స్
అవగానె హిందుస్ధాన్ పెట్రోలియం కార్పొరేషన్ లో ప్లాంట్ ఆఫీసర్ గా జాబ్ చేస్తున్న అక్క కొడుకు మహేష్ తో పెళ్లి జరిపించాలన్న ఆలోచనలో ఉన్నారు జగన్నాథరావు.
చూచాయగ ఆ విషయం తెల్సిన శివానీకి ఇంట్లో సంబంధం చేసుకోవడం అసలు ఇష్టం లేదు. తన కళ్ల ముందు ప్రశాంతే కనబడుతున్నాడు. తన ఇంజినీరింగ్ కోర్స్ ఇంక మూడు నెలలు ఉంది. అంతవరకు మెల్లగా టైము పాస్ చెయ్యాలి. అనుకున్నట్టు మూడు నెలల కాలం గడిచి ఇంజినీరింగ్ ఫైనలియర్ ఎగ్జామ్స్ పూర్తయాయి.
ఊపిరి పీల్చుకుంది శివాని. ప్రశాంత్ తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉంది. కాబోయే బార్యభర్తలే కదా, వారి మద్య అన్యోన్యత పెరుగుతుందని జగన్నాథరావు మేనల్లుడు మహేష్ ని శలవులప్పుడు ఇంటికి ఆహ్వానిస్తు వారిద్దర్నీ కైలాష్ గిరి, ఆర్కే బీచ్ వంటి వినోద స్థలాలకు పంపుతున్నారు.
శివానీకి ఇష్టం లేకపోయినా మహేష్ తో షికార్లకు వెళ్తూ సమయం కోసం ఎదురు చూస్తోంది. ముందు ప్లాన్ ప్రకారం ఒకరోజు శివానీ మహేష్ తో ఆర్కే బీచ్ కి వచ్చింది. సాయంత్రం ఆరు దాటింది. బీచ్ అంతా జనసందోహంగా ఉంది. ఇద్దరూ సముద్రం ఒడ్డున అలలతో ఆడుతున్నారు. చీకట్లు ముసురు తున్నాయి.
కొద్ది సేపు తర్వాత మహేష్ శివానీని ఒడ్డుకు వచ్చేయమంటే ఇంకొంచంసేపని చెప్పగా, మహేష్ పల్లీలు కొని తెస్తానని ఒడ్డుకు వచ్చాడు.
మహేష్ తిరిగి వచ్చేసరికి శివానీ కనబడలేదు. కంగారుగా బీచ్ అంతా వెతికాడు. అక్కడి జనాల్కి శివానీ గుర్తులు చెప్పి కనబడిందా అని వెతకసాగేడు. ఎవరూ కూడా మేము చూడలేదని చెప్పడంతో ఆందోళన ఎక్కువైంది. విషయం జగన్నాథరావు, మాణిక్యాంబలకు మొబైల్ ఫోన్ ద్వారా తెలియచేసాడు.
వారు ఇద్దరూ కార్లో ఆర్కే బీచ్ కి చేరి మహేష్ ఉన్న ప్రాంతానికి వచ్చారు. మహేష్ జరిగిన విషయం వివరంగా చెప్పాడు. ఎంత వెతికినా శివానీ జాడ లేకపోవడంతో ఒకవేళ సముద్ర అలల ఉదృతిలో నీటిలోకి కొట్టుకు పోయిందేమోనని భయపడుతున్నారు. ఆమె మొబైల్ ఫోన్ కూడా ఎంత ప్రత్నించినా కలయలేదు. చివరకు బీచ్ పోలిస్టేషన్లో కంప్లైంటు ఇచ్చారు.
ఘటనా స్థలికి వచ్చిన బీచ్ పోలీసులు బాగా చీకటి పడినందున వారూ ఎమీ చెయ్యలేకపోయారు. రాత్రంతా శివానీ గురించే ఆలోచనలతో గడిపారు జగన్నాథరావు దంపతులు. విషయం తెల్సిన బంధువులు, స్నేహితుల పరామర్శలతో రాత్రి ఇల్లంతా విషాదంగా మారింది.
మర్నాడు తెల్లారగానే బీచ్ పోలీసుల్ని సంప్రదించగా గజ ఈతగాళ్లను పిలిపించి సముద్రంలో వెతికించారు. లాంచీలతో తిరిగారు. చివరకు హెలికాప్టర్ సాయంతో సముద్రంలో వెతికినా శివానీ జాడ లేదు.
పెళ్లి చేసి అత్తారింటికి పంపుదామనుకున్న తమ కూతురు ఇలా అర్థాంతరంగా కనబడకపోయేసరికి విషాదంలో ములిగారు ఆ దంపతులు.
శివానీ జ్ఞాపకాలతో బాధ పడుతు శలవులో ఉన్న జగన్నాథరావు ఫోనుకు శివానీ గొంతుకతో ఫోన్ కాల్ వచ్చింది. తను హైదరాబాదులో ఉన్నానని, మహేష్ బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ప్రశాంత్ తో తన పరిచయం తర్వాత జరిగిన విషయాలు చెబుతూ, చెప్పకుండా తను
హైదరాబాదు వచ్చినందుకు క్షమించమని వేడుకుంది.
విషయం మాణిక్యాంబ, బంధువులందరకు తెల్సింది. శివానీ ఎవరితోనో లేచిపోయిందన్న వార్త గుప్పుమంది. జగన్నాథరావు దంపతులకు దైర్యం చెబుతున్న మహేష్ కు ఈ విషయం విని నిర్ఘాంతపోయాడు.
బీచ్ లో కనబడకపోతే సముద్రంలో చనిపోయిందనుకున్న కూతురు బ్రతికే ఉందన్న సంగతి తెల్సి జగన్నాథరావు దంపతులు ఒకవైపు ఆనందపడుతున్నా, ఇన్నాళ్లు తమకు తెలియకుండా ఇంత తతంగం నడిపిన కూతురి మీద కోపం కట్టలు తెంచుకుంది.
ఇష్టం లేని పెళ్లి చేసుకుని నేను మాత్రం ఏం సుఖపడగలను, పెళ్లికి ముందే తన అయిష్టతను బయటపెట్టి శివానీ మేలే చేసిందని సరిపెట్టుకున్నాడు మహేష్.
పోలీసు కంప్లైంటు ఇచ్చినా శివానీ ఇప్పుడు మేజర్, అదీగాక తన ఇష్ట ప్రకారమే ఇంటి నుంచి హైదరాబాదు వచ్చేసానని రాత మూలంగా ఇస్తే చేయ గలిగింది ఏమీ లేదని, ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలని సరిపెట్టుకున్నారు జగన్నాథరావు దంపతులు.
డబ్బు సంపాదనే కాదు ఎదుగుతున్న పిల్లల అభిరుచులు, అభిప్రాయాలు తెలుసుకుంటు పెంచడం కూడా ముఖ్యమన్న పాఠం నేర్చుకున్నారు వారు..
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments