top of page
Writer's pictureAyyala Somayajula Subramanyam

విశాల ’హృదయం’



'Visala Hrudayam' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 12/08/2024

'విశాల ’హృదయం' తెలుగు కథ

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


ఆదివారం ఉదయం పదిగంటలు; ఎన్నాళ్ళనుంచో నన్ను రమ్మని, మాట్లాడాలని విశాలమ్మ మా ఆవిడ పార్వతమ్మతో కబురు చేస్తుంటే వీలుచేసుకుని ఇవాళ వెళ్ళాను. ;


“అన్నయ్యగారు; ఎలాగైనా సరే మీరు నాకు ఈ ఉపకారం చేసిపెట్టండి”


ఆవిడ అభ్యర్థన నా మనసును కదిలిస్తోంది. ; కానీ నామనసు మాత్రం ఒప్పుకోవడం లేదు. అలాగని ఆవిడ మాట కాదనటం కూడా నావల్ల కావటం లేదు. 


కాస్సేపు మాట్లాడటం ఆపి ఆలోచనలో పడ్డాను; అలా ఆలోచిస్తేనే ఒక్కసారి గోడకున్న ఫోటో దగ్గర నా చూపులు నిలబడిపోయాయి. ఆ ఫోటోలో వున్నది నా ఆప్తమిత్రుడు శివరామ్‌; విశాలమ్మ భర్త. 


“ఒరేయ్‌ పరందామ్‌, నేను వున్ననాళ్ళు ఈ కుటుంబం కళకళలాడుతూ వుందని నీకూ తెలుసు. నేను పోయాక ఇంట్లోనూ, ఇక్కడే పెరిగి పెద్దవాళ్ళయిన నా కొడుకులూ, కూతురు వల్ల ఎటువంటి మార్పు వచ్చిందో కాస్త ఆలోచించు. ఆస్తి పంపకాలు పూర్తికాగానే ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మిగిలింది నా భార్య విశాల. నన్ను నా జ్ఞాపకాలను తోడుగా చేసుకుని ఇక్కడే ఉండిపోయిన అమాయకురాలు. ఆ పిచ్చితల్లి మనసు అర్థం చేసుకో”. 


చనిపోయిన నా స్నేహితుడు నా కెదురుగా నిలబడి మాట్లాడినట్లుగా అనిపించింది. మనసు విచలిత మైపోతోంది. 


మరుక్షణం విశాల వైపు చూశాను. ఆవిడ నన్నే చూస్తుంది. ఎక్కడెక్కడో వున్న తన పిల్లల్ని తన దగ్గరకొచ్చే టట్లుగా చెయ్యమని పదే పదే నున్ను అడుగుతోంది.


“వచ్చే నెలలో నా పిల్లలందరూ నన్నుచూడటానికి రావాలి. వాళ్ళందరూ వచ్చాక ఆ సందడితో నా ఇల్లు కళకళలాడాలి”


అలా అడగటంలో ఆత్మీయత, అనురాగం ఇంకా ఎన్నో నిండి వున్నాయి. పిల్లల్ని చూడాలన్న గాఢమైన కోరిక ఆమె కళ్ళల్లో ప్రతిబింబిస్తోంది. ఆ తల్లి మనసుని వాళ్ళు అర్థం చేసుకుంటారా? తల్లి వుందన్న విషయం ఫోన్ల మాట దేవుడెరుగు? కనీసం ఉత్తరం ద్వారానైనా

తెలుసుకోవాలనిపించని వాళ్ళు, ఇప్పుడు ఉత్రరం రాస్తే వస్తారా? అదీ నేను రాస్తే?


అన్నయ్యగారు.. నా మాటగా మీరు ఉత్తరంలో రాయండి. మీరు రాస్తే తప్పకుండా వస్తారు.” మళ్ళీ ఇదేమాట మాటలాడింది విశాలమ్మ.


“ఇలా నేను కంటికి చూపు దూరం కాకుండా నా పిల్లల్ని నేను గుర్తు పట్టే స్థితిలో వున్నప్పుడు వాళ్ళు నాకు కనపడితే.. అంతే చాలు”. 

ఒక తల్లిప్రేమ చుక్కచుక్కగా కళ్ళలోంచి రాలుతోంది; అటువంటి స్థితిలో చూస్తుంటే నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. 


ఈ క్షణంలో నాభార్య కూడా ఉండి వుంటే విశాల తీరు మాటలకు బావురుమనేది. ఒక్క క్షణం ఇంటికి వెళ్ళి మా ఆవిడ పార్వతమ్మతో కూడా మాట్లాడితే ? నాలో ఆలోచన; ఆ ఆలోచనల్లో ఏదో విధంగా విశాల కోరిక తీరే మార్గం పార్వతి వల్ల దొరుకుతుందనే ఆశ. 


ఇదే మాట విశాలతో చెప్పాను. ఆవిడలో ఎంతో ఉత్సాహం. మాటల్లో చెప్పలేని సంబరం. ఇంటికి బయలుదేరాను. కష్టంలో వున్నవాళ్ళకి ఓదార్పునివ్వడంలో తృప్తి వుంది. మనసు ప్రేరేపిస్తోంది. 


ఒక్కొక్కసారి ఆలోచనలు చినుకుల్లా పడుతుంటాయి. ఆ చినుకులతో తడిసిన మనసు మమకారంతో చిగురిస్తుంది. ఇప్పుడు విశాల మనసులో మమకారం క్షణక్షణానికీ తనపిల్లలని చూడాలని తహతహ లాడిపోతోంది. పార్వతి మాటలు వింటూ ఆశ్చర్యంగా చూశాను. అయినా నాలోని ఉద్దేశాన్ని చెప్పకుండా వుండలేకపోయాను. 


“ఆవిడ పిల్లలు మాజీవితం మాదంటూ వెళ్ళిపోయి చాలా కాలమైపోయింది. చూడటానికి రావటం లేదు. అలాగని తరచుగా ఫోన్లు లేవు. ఉత్తరప్రత్యుత్తారాలు అస్సలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఈవిడకి ఇలాంటి ఆరాటం ఎందుకు కలిగింది. ?”


సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను. పార్వతి మాట్లాడలేదు. కానీ మనసు ఆలోచిస్తోంది. 


“వయసొచ్చిన పిల్లలు తల్లిదండ్రులకు దూరమై పోయి వారికున్న వ్యాపకాలతో ఏదో విధంగా బ్రతుకుతుంటారు. అది వాళ్ళ వయసు ప్రభావం. వయసు మళ్ళిన తల్లిదండ్రులు తమ పిల్లల జ్ఞాపకాలతో కాలం వెళ్ళబుచ్చుకుంటారు. అది వార్ధక్యంలో ఎదురయ్యే అనుభవం. 


‘నాకు తెలిసి ప్రస్తుతం మానసికంగా అనుక్షణం ఇటువంటి స్థితిలోనే బతుకుతోంది. ఈ జ్ఞాపకాలే మాటల్లో మీతో వివరంగా మాట్లాడింది’ 


విశాలకి ఎలాగైనా సహాయం చెయ్యమని స్పందిస్తూ చెప్పింది పార్వతి. 


‘అటువంటప్పుడు స్వయంగా తనే ఫోన్‌ చేసో, ఉత్తరం రాసే పిల్లలని రమ్మని పిలిపించవచ్చు కదా..’


 నా మాటల్ని మధ్యలోనే అడ్డుకుంది పార్వతి. 

“చూడండి, ఈ తరం వాళ్ళని అర్థం చేసుకోవటం చేతకాదు. ‘ఎవరెవరు ఎలా వున్నారోనని క్షేమసమాచారాలు కూడా కనుక్కోలేదు. అటువంటి ఆవిడకు ఏదో అవసరం వచ్చి మమ్మల్ని రమ్మంటోంది’ అనుకుని ఎవరికి తోచినట్లు వాళ్ళు అపార్థం చేసుకుంటారు”


‘ఇటువంటి ఆలోచన నాకెందుకు రాలేదు.?’ నన్ను నేను ప్రశ్నించుకునే క్షణం అంతే కాదు. నాకు చిన్నతనంగా కూడా అనిపించింది. 


“నువ్వెంతో ఆలోచించి అర్థవంతంగా మాట్లాడుతున్నావు. అందువల్ల ఇప్పుడు ఎలా, ఏం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు” మనస్ఫూర్తిగా అన్నాను. 


మా ఇద్దరి మధ్యా నిశ్శబ్ధమైన మార్గాన్ని అన్వేషిస్తోంది. 


“తప్పదు. విశాల కోరికకు ఏదో బలమైన కారణం వుంటుంది. అది ఏమిటో అనుకుంటూ కూర్చోవటం అవివేకం. ఆమె ఇష్టాల్ని మనం కాదనకూడదు. 


ఎంతో నిశితంగా ఆలోచిస్తోంది. ఆ ఆలోచనలో పట్టుదల. 

ఉదయం పదకొండు గంటలు. భోజనం టైము. మా ఆవిడ వంటింటిలో ఏదో పనిలో వుంది. పిలుపుకోసం చూస్తున్నాను. కాలక్షేపం కోసం పేపరు చదువుతున్నాను. 


వీదిగేటు చప్పుడవడంతో ఎవరోనని చూశాను. మా పనిమనిషి రమణమ్మ. చూడగానే జ్ఞాపకమొచ్చింది. గత నాలుగు రోజులుగా పనిలోకి రాలేదు. పైగా తీరుబడిగా ఇఫుడొస్తోంది. 

ఈ పనిమనుషుల తీరే అంత. ఏదో ఒక వంకతో నెలలో నాలుగైదురోజులు పనిలోకి రారు. రానిరోజుల్లో జీతం మినహాయింపుకి ఎంమాత్రం ఒప్పుకోరు. పైగా ‘ మేమూ మనుషులమే’? మాకూ సెలవు కావాలి. ’ అంటూ ఎదురు తిరిగి మరీ తగవు పెట్టుకుంటారు. ఆలస్యంగా వస్తున్నావేమని అంటే మిగతా ఇళ్ళలో కూడా పని చేసి వస్తున్నామని తెగేసి మరీ చెప్పటం. 


వెనకవైపు కెళ్ళి కూర్చుంది నల్లా దగ్గర మా పనిమనిషి. 

“ఇదిగో రమణమ్మ; అంట్ల తోమటం, ఇల్లు ఊడవటం నేను చేసుకున్నాను. బట్టలు మాత్రం ఉతికి పెట్టు” మా ఆవిడ మాటలు. రోజు వారీ బట్టలు ఉతికించుకోవడం అలవాటు కొందరికి. వాషింగ్‌ మిషన్‌ లలో వేయరు. 


ఎంతో ఓపికగా మాటలాడుతోంది.. నాకు ఆశ్చర్యమేసింది. 


“అదేంటమ్మగారూ, మీరు కూడా ఇట్టాగే సేసుకున్నారు. విశాలమ్మగారు కూడా నాకోసం ఏపనీ మిగల్చకుండా అన్నీ అమ్మగారు సేసెసుకున్నారు. ఇలా అయితే నాకు సానా బాధగా వుందండి”


రమణమ్మ మా ఇంట్లోనూ, విశాలమ్మ గారింటిలోనూ కూడా పనిచేస్తుంది. 


“ఒసేయ్‌ పిచ్చిమొహమా, ఎందుకే బాధపడటం? నువ్వు మాత్రం ఇంట్లో ఊరికే కూర్చున్నావా? ఏవో పనులున్నాయని ఊరెళ్ళావుగా” మా ఆవిడ మాటల్లో అనుకోని సానుభూతి. 


ఈ సారి మరింత ఆశ్చర్యం నాలో చోటు చేసుకుంది. 


“ఒసేయ్‌ రమణమ్మా, విశాలమ్మగారు ఎలా వున్నారు? ఏమిటీ విషయం?” పార్వతి ఆ మాట అడగటంతో “ఏం సెప్పమంటారమ్మగారూ: ఆతల్లి మనసులో పిల్లల గురించి ఒకటే బెంగపెట్టేసుకున్నారండీ” మాటల్లో ఆవిడ మీదున్న అభిమానం వ్యక్తం చేస్తూ కళ్ళు ఒత్తుకుంటోంది పనిమనిషి. 


పక్కింటి విషయాలు మరొకరింట్లో చెప్పకుండా వుండలేరు. ఈ పనిమనుషులు. ఎక్కడెక్కడి విషయాలు వీళ్ళకే కావాలి. తెలిసిన సంగతులు మరెవరితో చెప్పకుండా వుండలేరు. ఒక్కొక్కసారి ఇంటిగుట్టు వీదిన పడటం వీళ్ళ‌వల్లే. 


రమణమ్మ మాటలు వింటూ ‘ పనిమనుషుల స్వభావం’ ఎప్పటికీ మారదు, అనుకోకుండా వుండలేక పోతున్నాను.

 

‘ఇది సరే లేవే; ఇంతకీ నువ్వెళ్ళిన పనినపూర్తయ్యిందా??” 


మా ఆవిడ వైఖరి నాలో చికాకు కలిగిస్తోంది. అయినా ఎంతో ఓపికతో సహిస్తున్నాను. మా ఆవిడని చూశాను. మరో ధ్యాస లేకుండా మాటలాడుతోంది. పల్లెటూళ్ళలో జీవితం మనిషికి మరో మనిషికీ మధ్య అనుబంధంతో వుంటుంది. ఎవరింటిలో ఎలా జరిగినా, జరగబోతున్నా ఊళ్ళో వాళ్ళకి

తెలిసిపోతుంది. 


విశాలమ్మ గారింటిలో గత రెండు మూడు రోజులనుండీ ఒకటే హడావుడి. ఇంటికి కొత్తగా రంగులు వేయించారు. ఇంటి ఆవరణలో ముందూ వెనకా కూడా చెత్తాచెదారం తీసేసీ శుభ్రంచేసి కొత్తకొత్త మొక్కలను పెట్టారు. 


గేటుకి ఇవతలా, లోపలా రంగురంగుల ముగ్గులు, గుమ్మాలకు ఇంటి తలుపులకు మంచి చక్కటి రంగులు. పొలంలో పండించిన కూరగాయలు తీసుకొచ్చే వాళ్ళు, మా వుూళ్ళో దొరకని వస్తువులు అలంకరణ సామగ్రి పట్నం నుంచి తెచ్చేవాళ్ళు. 


విశాలమ్మగారింటిలో ఏ పండగో, ఉత్సవమో తెలీదుకానీ, వాళ్ళఇల్లు ఏదో హడావుడి సంతరించుకుని కళకళలాడుతోంది. 


ఊళ్ళోవాళ్ళు ఎవరికి తోచిన విధంగా వారు ఒక విశేషంగా చెప్పుకుంటున్నారు. నిజం చెప్పొద్దూ, చూస్తున్న నాకు కూడా ఆశ్చర్యం గానే వుంది. 


ఇన్ని సంవత్సరాలుగా ఎంతో నిశ్శబ్ధంగా వున్న  విశాలమ్మ గారిల్లు, హఠాత్తుగా ఎక్కడలేని సందడిని పుంజుకుంది. కారణం ఏమిటో ఊహించడానికి ప్రయత్నించాను. వీలు కావటం లేదు. మా ఆవిడని అడిగితే సంగతేమిటో తెలిసిపోతుంది. 


రాతిరి వేళ అవుతున్నది. ఆకాశంలో చంద్రుడు వెన్నెలతో ముస్తాబవుతున్నాడు. భోజనం చేసి మా ఇంటి వాకిట్లో మడతమంచం మీద కూర్చున్నాను. ఈ లోగా మా అర్దాంగి లోపలినుంచి వచ్చింది. 


“ఏవండోయ్‌, మంచినీళ్ళ సీసా పెట్టాను. మీ మంచం పక్కనే పెడుతున్నాను. ” అనగానే ‘ఏవిటి ఈ వేళప్పుడు బయలుదేరావు. ఎక్కడికేవిటీ?’ యథాలాపంగా అడిగాను. 


“ మరేంలేదు. విశాల రమ్మని పిలిచింది. ఏవో పనులున్నాయని నన్ను ఒక చెయ్యి వెయ్యమంటేను.. పనులన్నీ తెమల్చుకుని వెడుతున్నాను”. 


మా ఆవిడ వెళ్ళే హడావుడిలో వుంది. 


“ఒక్క క్షణం పారూ, వాళ్ళింట్లో ఈ మధ్య ఒకటే హడావుడిగా వుంటోంది. ఏదైనా శుభకార్యమేమైనా జరగబోతోందా?” అని అడిగాను. 


నాకు జవాబు చెప్పటానికి ఆగింది మా ఆవిడ. 

“శుభకార్యమే. కానీ మామూలు శుభకార్యం కాదు. మన ఊళ్ళో ఇప్పటివరకూ ఎవరిఇంట్లోనూ జరగని శుభకార్యం చేద్దామనుకుంటోంది విశాల. చెప్పటానికి ప్రస్తుతం టైమ్‌ లేదు. తీరుబడిగా మీకు తరువాత చెబుతాను. నేను రావటం ఆలస్యం కావొచ్చు. తలుపులు దగ్గర వేసి వెడుతున్నాను. మీరు పడుకోండి. ” అని వెళ్ళిపోయింది మా శ్రీమతిగారు. 


ఏమిటో అంతటి శుభకార్యం? ఆశ్చర్యపోతోంది మనసు. 

ఒకటి మాత్రం నిజం. విశాలమ్మగారింటిలో హడావుడి ఏ రోజుకారోజు పెరుగుతోంది. ఇలా అనుకోవటానికి కారణం పార్వతి మధ్యాహ్నం కూడా ఆవిడింటికి సహాయపడటానికి వెడుతోంది. 

అందరిలోనూ ఏదో తొందర జరగబోయే శుభకార్యానికి అనుకున్న ముహూర్తం తరుముకొస్తున్నట్లు. 


ఆ రోజు ప్రొద్దుటే పనిమీద బయల్దేరబోతున్నాను. మా ఆవిడ పార్వతి “పనులన్నీ పూర్తి చేసుకుని మధ్యాహ్నం కాస్త త్వరగా రండి” అని చెప్పటంతో ‘ఎందుకు మరీ అంత ప్రత్యేకంగా చెపుతున్నావు?’ అడిగాను. 


మరీ అవసరముంటే తప్ప మా ఆవిడ అలా చెప్పదు. 


“మన విశాల మనింటికి వస్తోందండీ. ” 


మా ఆవిడ మాటలకు నాలో అనుకోకుండా కుతూహలం. 

మధ్యాహ్నం ఒంటిగంట కాస్తముందే వచ్చి భోజనం చేసి వరండాలో పేపర్‌ చూస్తున్నాను.

ఇంటిముందు మోటర్‌ సైకిల్‌ ఆగింది. తెలిసిన కుర్రాడి బండిమీద వచ్చింది విశాల. విశాల రావడం చూసి మా ఆవిడ పార్వతి ఎదురువెళ్ళి ఆవిడ చెయ్యి పట్టుకుని మరీ లోపలికి తీసుకొస్తోంది. సభ్యత కోసం కూర్చున్న వాడిని నేనుకూడా లేచి నిలబడ్డాను. 


“ బావున్నారా అన్నయ్యా” అంటూ నన్ను పలకరించి పార్వతితో కలిసి లోపలికి వెళ్ళింది. కాస్సేపు స్నేహితురాళ్ళిద్దరూ అవి ఇవి మాట్లాడుకున్నారు. 


పార్వతి లోపలనుంచి “ ఒక్కసారి లోపలికి రండి” అంటూ పిలిచింది. నేను కూడా లోపలికి వెళ్ళాను. 


“అన్నయ్యగారూ, వచ్చే ఆదివారం మీరూ పార్వతీ మా ఇంటికి రావాలి. పొద్దుట, సాయంత్రం భోజనాలు మా ఇంటిలోనే.” విశాల ఎంతో ఆదరంగా ఆహ్వానించింది. 


“ఏంటమ్మా విశేషం?” మనసులో ఆసక్తిని వ్యక్తం చేశాను. 


అలా అడగగానే ఆవిడ నిండుగా నవ్వింది. 


“అవును. అన్నయ్యగారూ, విశేషమే. మాటల్లో చెప్పటం నావల్ల కాదు. అందులోనూ ఇన్నాళ్ళకు నేను అనుకున్నది జరగబోతోంది. ఆ రోజు మీరిద్దరూ మా ఇంటికి తప్పకుండా రండి. చూస్తే మీకూ సంతోషంగా వుంటుంది. నాకు కూడా ఎంతో తృప్తిగా వుంటుంది. ”: విశాలమ్మ మాటల్లో ఎందుకో ఉద్విగ్నత. 


“ఈ మాట చెప్పటానికి ఇంత శ్రమ తీసుకుని మీరు రావాలా? పార్వతితో కబురు పెడితే చాలు. ” మొహమాటంగా మాట్లాడాను. 


“ఎంతమాట; అన్నయ్యగారు, ఇందులో శ్రమ ఏముంది? ఇది మా బాధ్యత. అయిన వాళ్ళందరినీ నేనే స్వయంగా పిలవాలనుకున్నాను. మీ దంపతులిద్దరూ తప్పకుండా రావాలి. ” అంటూ పార్వతిని చూసింది. తప్పకుండా వస్తామని స్నేహితురాలికి మాట ఇచ్చింది. 



విశాల మాటల్లో మనసులో చెప్పలేని ఉత్సాహం. ఏదో ప్రత్యేక మైన విషయం తప్పకుండా వుండే వుంటుంది. ఊహించటానికి ప్రయత్నిస్తున్నాను. 


ఆదివారం ఉదయం విశాలమ్మగారి గేటుకి మామిడితోరణాలు. వసారాలో అరుగు మీద కుర్చీల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంటి ఆవరణలో అటూ ఇటూ పరుగెడుతూ ఆటలాడుకుంటున్న పిల్లలు. 


ఈ ఆదివారం ఒక అనుభూతి తప్పకుండా మిగిలిపోతుంది. అక్కడి వాతావరణంలో వెల్లివిరుస్తున్న ఉత్సాహానికి మనసులో కలుగుతున్న స్పందన. 


మమ్మల్ని చూడగానే విశాల మాకెదురొచ్చి పార్వతి చేయి పట్టుకుంది. ఆవిడలో చెప్పలేనంత ఆనందం. 


“ఒరేయ్‌ అబ్బాయిలూ”, అన్న విశాలమ్మ పిలుపు విని అరుగుమీద కూర్చున్న వాళ్ళలో ఇద్దరు మా దగ్గర కొచ్చారు. 


“వీరెవరో గుర్తు పట్టారా? మన పరంధామయ్యగారు. నాన్నగారికి ఆప్తమిత్రులు. మనకెంతో కావలసిన వారు. ” అని పరిచయం చెయ్యగానే వాళ్ళు నాకు నమస్కరించారు. 


వాళ్ళని చిన్నప్పుడు చూశాను. పెద్దవాళ్ళయ్యాక ఇప్పుడే కలవటం..


“అన్నయ్యగారు, అతను మా అల్లుడు శ్రీరామ్‌” అంటూ మరొకతన్ని ప్రత్యేకంగా పరిచయం చేసింది. 


ఒకరినొకరం పరిచయం చేసురున్నాక కబుర్లు చెప్పుకుంటున్నాం. విశాలమ్మ కొడుకులు, అల్లుడు మంచి హోదాలో వున్నారని అర్థమైంది. ఇంతలో టిఫిన్లు తీసుకొచ్చిన వాళ్ళని చూసి “ఇది మా అమ్మాయి, ఆ పక్కనున్న వాళ్ళమ్మాయి సాత్విక. అమ్మాయి శ్రీలక్ష్మీ, టిఫిన్లు కాఫీలు అందరికీ ఇవ్వు” అన్న తల్లిమాటకు ‘ నువ్వేమీ కంగారుపడకు. అన్ని విషయాలూ నేను చూసుకుంటావా’ అని జవాబిచ్చింది. 


“అరేయ్‌ అబ్బాయిలూ, ఇడ్లీలో కారప్పొడి, నెయ్యి వేసుకుని తినటం మీకిష్టమని స్వయంగా నేనే చేశాను” 


విశాల మాటల్లో వాళ్ళ చిన్నతనపు జ్ఞాపకాలు. 


“రొటీన్‌లైఫ్‌ లో హడావుడిగా బతుకుతున్న మాకు ఇలా పల్లెటూరికి రావటం ఎంతో హాయిగా వుంది”


టిఫిన్‌ తింటూ విశాల అల్లుడు మాట్లాడాడు. 


అతని మాటలు వినగానే విశాలమొహం వెలిగిపోయింది. 

“ఒకటి రెండు రోజులు బాగానే వుంటుంది బావగారూ, అటు తరువాత ఈ పల్లెటూరిలో వుండటం కష్టం. ” 


పెద్దకొడుకు మాటలకు విశాలమ్మలో పైకి కనిపించని బాధ. 

ఎవరికి తోచినట్టు వాళ్ళు మాటలాడుకుంటున్నారు. అదే క్షణంలో నాలో ఆలోచన; ఈ సందడి, సంతోషం కోసం విశాల ఎంతో తాపత్రయపడింది. అందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి తన పట్టుదలతో సాధించింది. 


ఒక తల్లిగా ఆవిడ అనుకున్నది ఖచ్చితంగా సాధించింది. విశాలమ్మని మనసారా అభినందించాను. మరుక్షణంలో నాలో మరో ఆలోచన. ఈ విషయంలో తనకు సహాయపడమని నన్నడిగితే అది అంత తేలికగా జరిగేది కాదని అన్న విషయం గుర్తుకొచ్చి మనసు చివుక్కుమంది. 


ఒక కన్నతల్లి వృధ్దాప్యంలో ఎంతో ఓపికగా తన కోరికను నెరవేర్చుకుంది. ఎలా?ఎవరి ఆసరాతో తన ఆశను తీర్చుకుంది?నా ఊహకు అందని ప్రశ్న. 


ఈ రోజు ఈ ఇల్లు ఒక క్రొత్తదనంతో ముస్తాబు అయ్యింది. విశాలమ్మ తన వయసును మరచిపోయి హుషారుగా ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రదర్శనకు కారణం ఆవిడలో ఏదో ఆలోచన. అదేమిటో?


మధ్యాహ్నం ఒంటిగంట భోజనాలు పూర్తయ్యాయి. విశాలమ్మగారి పిల్లల పెళ్ళిభోజనాలు కూడా రుచిగా ఉన్నాయో లేదో తెలియదు. కాని ఇవాళ ఆత్మీయులందరికి ఆవిడ పెట్టిన భోజనం ఎంత రుచిగా వుందో మాటల్లో చెప్పడం కష్టం. ముఖ్యంగా ఆవిడ తన పిల్లలకు ఏమేమి ఇష్టమో అవన్నీ వండించి అడిగి మరీ తినిపించింది. భోజనం కడుపు నింపింది. ఆప్యాయత మనసు నింపింది. 

కాషేపయ్యాక అందరూ కబుర్లు చెప్పుకుంటూ హాలులో కూర్చున్నారు. మరి కాస్సేపటికి విశాలమ్మ కూడా అక్కడికి వచ్చింది. 


“మీరందరూ శ్రమ అనుకోకుండా నాతో రావాలి. ” అంటూ విశాల కొడుకులూ, కూతురూ, కోడళ్ళు అల్లుడిని కూడా పిలిచారు.  


కారణం ఏమిటని అడగకుండానే వాళ్ళందరూ ఆవిడతో బయలుదేరారు. అప్రయత్నంగా మనసు ప్రోత్సహిస్తుంటే నేను కూడా వెళ్ళాను. పార్వతి చెయ్యి పట్టుకుని ఆ ఇంట్లో గదుల్లోకి వెళుతోంది. 


ఇది మా పెద్దబ్బాయి చిన్నప్పటినుండి ప్రత్యేకంగా తనకోసం వుంచుకొన్నాడు. ఇంట్లో వున్నంతసేపూ వాడు ఈ గదిలోనే వుండేవాడు. ఒకవిధంగా చెప్పాలంటే ఒక్క భోజనానికి మాత్రమే బయటికొచ్చేవాడు. 


చదువుకోవటం, పడుకోవటం అన్నీ వాడికి ఇక్కడే. మరో విషయమేమిటంటే వాడికి పక్కమీద దుప్పటి నలగకూడదు. వాడి వస్తువులన్నీ ఎక్కడివక్కడే వుండాలి. నాకు తెలిసినంతవరకూ ఇప్పటికీ వాడి స్వభావమదే. అందుకనే ఇవ్వాళకూడా వాడికోసం ఈ గదిని శుభ్రం చేయించాను. ఏరా అబ్బాయ్‌, నీకు నచ్చిందా?” అని అడిగింది.. 


గది చక్కగా తీర్చిదిద్దినట్టుగా వుంది. కొత్త దుప్పటితో పక్క ఎంతో నీట్‌గా వుంది. 

“ఇటురండి. ఇది మా చిన్నవాడి గది. వీడు చిన్నప్పటినుంచి తన పనులు ఇంకొకరి చేత చేయించుకునే వాడు. పొద్దున లేచిన తరువాత కప్పుకున్న దుప్పటిని నేను మడత పెట్టాల్సివచ్చేది. రాత్రిపూట చదువు కుంటూ అలాగే నిద్రపోయేవాడు. అవన్నీ సర్దిపెట్టడం కూడా నా వంతే. అందుకోసమే వాడి చదువు పూర్తయ్యేవరకూ నేను కూడా ఈ గదిలోనే పడుకునేదాన్ని. మా చిన్నాడు అమ్మ కూచి. ” 


విశాల మాటలకు కోడళ్ళిద్దరూ తమ భర్తలను చూసి నవ్వుకున్నారు. 


“ఇకపోతే ఇది మా అమ్మాయి గది. చిన్నప్పటి నుండి బొమ్మలు వేయడం నేర్చుకుంది. దీనికి అలంకారాలంటే ఎంతో మోజు. ఈ గదిలో గోడల కున్న పెయింటింగ్స్‌ లన్నీ ఇది వేసినవే. ;” 


గదిలో గోడలకు అటూఇటూ రకరకాల పెయింటింగులు ;ఇక సెలవురోజుల్లో తను నేర్చుకున్న కుట్లు, అల్లికలతో నేను మా అమ్మాయి ఈ గదిలోనే కూర్చునే వాళ్ళం. కొన్ని కుట్టు పనులు, అల్లికలు నేను కూడా మా అమ్మాయి దగ్గరే నేర్చుకున్నాను. ” అంటూ అల్లుడి కేసి చూపిస్తూ నవ్వారు. అతను చిలిపిగా వాళ్ళావిడని చూస్తున్నాడు. 


“మీరొస్తున్నారని మీ గదులన్నీ మీకోసం మీకు నచ్చినట్లుగా నేను, మన పార్వతీ కలిసి రెడీ చేశాం. ”

గత వారం రోజులుగా పార్వతి వీళ్ళింటిలోనే గడిపిన విషయం అప్పుడర్థమయ్యింది. మళ్ళీ అందరం కలిసి హాలులోకొచ్చాం. 


ఒక్కొక్క జ్ఞాపకం ఎన్నెన్నో చందమామలు. ఆ వెన్నెల్లో విశాలమ్మగారి మొహం తళతళా మెరిసిపోతోంది. 

మా చుట్టూ నిశ్శబ్దం;ఎన్నో విషయాలు .. మరెన్నో మాటలు చెప్పాలని ఆవిడ మనసులోని ఆరాటం.. కళ్ళల్లో కదులుతూ ఉంది. 


“ఈ ఇంట్లో మీ బాల్యం ఎంత సందడిగా గడిచిందో చెప్పాను. మీరంతా పెరిగి పెద్దవాళ్ళయిన, ఎవరి జీవితములో వారు స్థిరపడ్డారు. ఒకవైపు నీకెంతో సంతోషం కలుగుతోంది. మరేవైపు దిగులు పెరుగుతోంది’. 


విశాలమ్మగారు ఒక ముఖ్యమయిన విషయం ఎవరికీ తెలియనిదేదో చెప్పాలని మాటలు వెతుక్కుంటున్నారు. ఎంతో ఆత్రుతతో నామనసు ఎదురు చూస్తోంది. 


‘మీరున్నప్పుడు ఎంతో కళకళలాడుతూ వున్న మనిల్లు ప్రస్తుతం స్తబ్దుగా వుంది. నాచుట్టూ వున్న నిశ్శబ్దం. నాజీవితంలేని శూన్యం నేను భరించలేకపోతున్నాను. ఇదీ ప్రస్తుతం నా జీవితం. కానీ మీకు ఎన్నో వ్యాపకాలు..మరెన్నో తాపత్రయాలు. కాలంతో పోటీపడి మరీ కాలం వెనక్కు పరుగెత్తుతున్నారు. 


పరుగు బతుకులో బంధాలు, అనుబంధాలు తాలూకు ఆలోచనలు మీకు రావు;ఇది నా ఉద్దేశం మాత్రమే; మన అందరిలోనూ ఏదో అయోమయం. 


‘నాలోని బాధను నా స్నేహితురాలు పార్వతితో చెప్పాను. మళ్ళీ మళ్ళీ కలుసుకోవటానికి చక్కటి సందర్భము గురించి చెప్పింది. చదువుకోకపోవటంతో పార్వతి చెప్పేంతవరకూ నాకు తెలియదు. 


ఈ మాటలంటూ ఆవిడ చూపులు పార్వతి మనసును ఆప్యాయంగా స్పర్శిస్తున్నాయి. పవిట కొంగుతో పార్వతి కళ్ళొత్తుకుంది. 


“పార్వతి వల్ల నాలోకలిగిన ఆలోచన మీతో చెప్పాలనే తపన; కానీ నా ఆలోచనకు అక్షరాలు లేవు. నా అంతరాత్మ ను తోడిచ్చి రమణమ్మను మీ దగ్గరకు పంపించాను. 


నేను అనుకున్న రోజుకే మీరందరూ నాకోసం మనింటికి వచ్చారు. మనందరం సంతోషంగా కలుసుకున్న ఈ రోజు మనకందరికీ ఎంతో అపురూపమైన రోజు. 


ఈ రోజు నా పుట్టినరోజు. ఈ రోజు మిమ్మలనందరినీ ఇలా కలుసుకోవాలన్నదే నా కోరిక. ఈ సందర్భంలో మీతో చెప్పవలసిన మాటని ఇన్నాళ్లు నా ప్రపంచంలో పదిలంగా దాచుకున్నాను” 

ఎంతో తృప్తిని వ్యక్తం చేస్తూ మాట్లాడుతోందావిడ. 


విశాలమ్మగారి మాటలు ప్రతి ఒక్కరి మనసులోనూ ఆలోచనలు తట్టిలేపుతున్నాయి. ’నేను పోగొట్టుకున్నది కనీసం మీరైనా పదిలపరచుకోవాలన్నదే నా ఆశ. వృద్దాప్యం ఎవరికీ తప్పదు. అంతే కాదు. వృద్ధాప్యం ఒక కన్నీటి చుక్కగా మిగిలిపోకూడదు. సంవత్సరానికి ఒకసారే వచ్చే ఈ రోజున మీరు మీ పిల్లలతో ఆనందంగా గడపండి. ఒకరంటే ఒకరికి మమకారం పెంచుకోండి. మమతలను పంచి మీ మనసుకి చక్కటి అనుభూతినివ్వండి. అప్పుడే మీ వృద్ధాప్యం వెన్నెల తునకగా నిలిచిపోతుంది. 


మా చుట్టూ వున్న వాతావరణం అనిర్వచనీయమైన ఆత్మీయతను సంతరించుకున్న క్షణం.. 


నిజానికి విశాలమ్మగారు చదువుకోలేదు కానీ, జీవితాన్ని అర్థం చేసుకున్న కన్నతల్లి. కన్నతల్లిగా ఆ అర్థాన్ని తన వాళ్ళందరికీ పంచివ్వగలిగింది. ఈ క్షణాలు మరిచిపోలేనివి. 

ఒక మాతృమూర్తి తన మనసును వెలిగించుకున్న క్షణం. 


—————————————-శుభంభూయాత్‌——————

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.


అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.


ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,


ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి


మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్‌ వాణి,మన తెలుగు కథలు.కామ్‌.


బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక


ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్‌.


కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.


ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్‌ మరియు


త‌పస్విమనోహరము.


ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్‌


చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.


సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్‌ బహుమతులు.


ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.


కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.









133 views0 comments

コメント


bottom of page